నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)/5-వ అంకము

5-వ అంకము

[ప్రతాపుడు ప్రవేశము ]

ప్ర: మానవుడు నాకూ, నాసోదరికీ ఆశాభంగమే కలిగించాడు. వాడి కింకా శృంగారమంటే అర్థంగాలేదని నా సోదరంటుంది. ప్రతాపమంటే అర్థంగాలేదని నాకుతెలుసు. క్రౌర్యంలేని ప్రతావమే వాడికి లేదు. కొమ్ములు, కోరలు, కొండీలు, గోళ్లు, గిట్టలు మొదలయిన మారణసాధనాలు లేకుండా వాడిని సృష్టించి సత్యవీరుణ్ణిగా చేతామని మా ఆశయం. "తలలు బోడులైతే తలపులు బోడులా ? అన్నట్లు బాహ్యంగా మారణసాధనాలు లేవన్నమాటేగాని వాడి తలంపులన్నీ మారణసాధనాలే. జంతువులకు స్వాభావికముగావున్న మారణసాధనాలకంటె వేయిరెట్లు, క్రూర మయిన సాధనాలు స్వబుద్ధిచేత కల్పించుకొన్నాడు. పశుత్వంలోనుంచి మానవత్వమనే మెట్టుకూడా యెక్కలేదు. క్రమంగా యెక్కు తా డనుకొంటాను. మానవత్వం వదలి దేవత్వం వచ్చేవరకు చాలాకాలము పట్టుతుంది. అంతవరకూ మామూలుమార్గాన్నే పోతూవుంటాడు.

[ నిష్క్రమణం ]

1-వ రంగము

పల్నాటి సరిహద్దులు

[మ. దే. రా., బ్రహ్మ.. కొమ్మ, బా. చం., క. దా,, అ. రా. మొదలైనవారు. ప్రవేశము ]

బ్రహ్మ : ఇదే, పల్నాటి సరిహద్దు దాటుతున్నాం. ఏడేండ్లకు సెలవుగా జన్మభూమి మళ్లీ తొక్కుతున్నాం. అంతా పల్నాటిమాతకు సాష్టాంగనమస్కారం చెయ్యండి. ( నమస్కారము చేసి లేచి) ఆహా ! మన లంకన్న లేకపోయెగదా! వుంటే యెంత ఆనందపడేవాడు ! మనతో కష్టములలో పాల్గొన్నాడుగాని, సంతోషములో భాగస్వామి కావడానికి ప్రాప్తం లేకపోయింది.

మ. దే. రా : అమ్మా, పల్నాటిసీమా, నీ ప్రియపుత్రుడయిన లంకన్నను మింగి వచ్చాం.

బా. చం : రాబోయే రణయజ్ఞములో లంకన్నకు బదులుగా మమ్మును ఇంధనములుగా ఉపయోగించండి.

క. దా : సంతోషచిహ్నముగా మనమందరమూ యిక్కడ విడిసి పల్నాటిమాతకు చద్దీ, వేడీ వేడిపెట్టుకొందాము. ఆవులకు అలంకారాలు చేయింతాము.

బ్రహ్మ : ఇవ్వాళ పొంగలిపండుగ, రేపు ఆవులపండుగ, కానియ్యండి. ఇంకాముందుకు సాగకపూర్వం గడువు పూర్తిఅయిందనీ, మాచర్ల మా కియ్యవలసినదనీ సమాచారం పంపి జవాబు తెప్పించు కొందాము. బదులువుత్తరం వచ్చేవరకూ యిక్కడనే ఉత్సవాలు చేసుకొంటూ వుందాము. కొమ్మ : ఈ సూచన చాలా బాగావుంది. ఇంతవరకూ దేశం వారి స్వాధీనములో వున్నదిగనుక చెప్పి ప్రవేశించడమే మర్యాద.

బా. చం : గోదావరిస్నానానికి కొండభొట్ల ఆజ్ఞెందుకు ? పల్నాడు మన మాతృభూమి, బిడ్డలు తల్లివొళ్లో కూర్చొనడానికి ఒకరి ఆజ్ఞా?

అ. రా : చెప్పి పంపకపోతే కలహానికి కాలుదువ్వినట్టుగా వుంటుంది.

అనపోతు : కలహంలేకుండా రాజ్యమిస్తారనేనా మీ నమ్మకం ? అట్లయితే భారతకథ అబద్ధ మనవలసివస్తుంది.

అల. రా : నలగామరాజు దుర్యోధనుడికంటె మంచివాడు. కేతురెడ్డి శకునంత దుర్మార్గుడు గాడు.

అనపోతు : నరసింగరాజు దుశ్శాసనుడికంటె దుష్టుడు.

బా. చం: ఆలోచనలో నాగమ్మ కర్ణుడికంటె సమర్థురాలు.

క. దా : మనకు బ్రహ్మనాయుడనే కృష్ణు డున్నాడు.

కొమ్మ : దుర్యోధనుడికి కృష్ణుడితో సమదీటయిన మంత్రి లేడు. నాగమ్మవల్ల నలగామరాజు కాలోపం నివర్తి అయింది.

బా. చం : కనుక నే మనభారం మఱింత యెక్కువయింది.

కొమ్మ : అందుకనే పోరుకంటె పొందు మేలని చెపుతున్నా.

బా. చం : కాబట్టే నలగామరాజు బొత్తిగా సంధి కంగీకరించడు

కొమ్మ : ఆ తప్పు వాండ్లమీదనే పెడదాం.

బా. చం : తిరిచి భోగించడం దీనులపని. క్షత్రియధర్మంగాదు. కొమ్మ : ఇందులో ఆశ్రయింపేమున్నది? అయినా ధర్మరాజు మార్గాన్నే మన మవలంబిస్తున్నాము.

అనపోతు : మొదటినుంచీ వాండ్లసంగతి తెలిసికూడా పొరబడుతున్నారు. రాయబారానికి సాధారణంగా నాయకుణ్ణి పంపుతాముకదా!

కొమ్మ : వోడంటే కంచమంతా వో డనగూడదు. ఉభయులమూ పరాయివాండ్లంగాదు. బంధువర్గముతో యుద్ధమంటే వచ్చే సాధక బాధకాలు మీకు దెలియవు. ఇది ఉద్రేకంతో తీరుమానించవలసిన విషయం గాదు.

బ్రహ్మ : సామోపాయంవల్ల చక్కబడేపనికి దండోపాయం ప్రయోగించగూడదు.

బా. చం : మాచర్లమండలంలో యిప్పటివరకు విశేషంగా సేనలు లేవు. మనము ముందు పోయి ఆక్రమించుకొంటే తరువాత మనను వెళ్లగొట్టడం కష్టం.

బ్రహ్మ : ముం దాక్రమించుకొనడంవల్ల తాత్కాలికలాభ మున్నట్టు కనబడ్డా, మాచర్లకు కోటగోడలు లేకపోవడం చేత వారి సేనలు వచ్చినతరువాత ఆమోద ముండదు. అదిగాక మనం మాచర్ల బలవంతంగా ఆక్రమించుకోబోతే జనులు యెదిరిస్తారేమో చెప్పలేము. తొందరపడితే లాభం లేదని తోస్తుంది.

కొమ్మ : ఒడంబడికప్రకారం మనకు రావలన భాగం సౌమ్యంగా అడిగినప్పుడు వారు కాదంటే లోకానికి విడ్డూరంగా తోస్తుంది. జనము మనకు తోడ్పడకపోయినా ఎటూ చేరకుండా తటస్థులుగానయినా వుంటారు. బ్రహ్మ : రాయబారం విషయమయి మనలో అభిప్రాయ భేదాలు తీవ్రంగా వున్నవి. ఎటు జూచినా రాయబారమే ఉత్తమంగా నాకు కనబడుతున్నది.

మ. దే. రా : రాయబారిని ఏర్పాటుచేయండి.

క. దా : అలరాజుగారిని రాయబారిగా పంపితే బాలుడు చూపించిన చిక్కు లుండకపోవచ్చు ! ఆయన ఉభయులకూ అక్కరగల మనిషి

బా. చం : లోకానుభవంగలవారు, వారి తండ్రిగారిని పంపగూడదా?

బ్రహ్మ : అల్లుడు మొగమోటపెడితే నలగామరాజు తీసివెయ్య లేడు. తండ్రిగారికంటె కొడుకును బంపడమే మెరుగు.

కొమ్మ : నే వెళ్లుతాలెండి.

బ్రహ్మ : ఆయనకు అల్లుడిమీద మక్కు వెక్కువ. అలరాజు వెళ్లి తే అంతఃపురం మనపక్షమవుతుంది.

మ. దే. రా : ఇంతతర్క మెందుకు ? వెళ్లడానికి అలరాజు అంగీకరిస్తాడా?

కొమ్మ : అతని అంగీకారమేమిటి? అంతా వెళ్లమంటే వెళ్లుతాడు.

అ. రా : నా అభ్యంతరంలేదుగాని నరసింగరాజు కేటించి గట్టిపట్టు పట్టితే నామాట సాగదు.

బ్రహ్మ : చేతనయిన ప్రయత్నం చెయ్యండి. రేపు ఉదయం ప్రయాణం. మీకు ప్రత్యేకంగా ఎత్తిచెప్పవలసిన దేమున్నది ? మనది కుంటుంబ కలహం. ఉభయులకూ నష్టకరమయిన యుద్ధం పొసగకుండా మాచర్లమండలం మన కిచ్చే సదుపాయం చేయవలసినదని మా ప్రార్థన.

మ. దే. రా : తాంబూల మీయ్యండి.

[ అంతా సష్క్రమిస్తారు తెరపడుతుంది ]

2-వ రంగము

[ నౌకరు ప్రవేశము చెర్లగుడిపాడు ]

నౌ : ఎవరా వచ్చేది ! వారేలాగున్నారు.

[ అలరాజు ప్రవేశము ]

అ. రా : ఇ దేవూరు ?

నౌ : చేర్లగుడిపాడు. మంత్రిగారికోసం వచ్చారా ?

అ. రా : ఏమంత్రిగారు ?

నౌ : నరసింగరాజుగారు, అదే వారి బస. ఇప్పుడు ఖాళీగానే వుంటారు, చూడవచ్చు.

అ. రా : నీవు వారి నౌకరువా?

నౌ : అవును తను నౌకరునుమాత్రం కాదా? తమరు పెద్ద దొరవారి అల్లుడుగారుగదా? దేశంలోకి మళ్లీ వచ్చారని అనుకుంటున్నారు.

అ. రా : ఎవ రనుకుంటున్నారు ?

నౌ : దేశమంతా అనుకుంటున్నారు. చిన్నదొరగారుగూడా ఎప్పుడూ అనుకుంటూనే వుంటారు.

అ. రా : ఏమనుకుంటారు? నౌ : తమరు మంచివారనీ, ఇతర్లమూలంగా కష్టాలుపడుతున్నారనీ, అనుకుంటారు. ఇప్పుడు నే బోయిచెప్పితే వారే పరుగెత్తుకుంటూ వస్తారు.

అ. రా : ( స్వగతం) (ఇతని మాటలనుబట్టి వారు చాలా సుముఖంగా వున్నట్లు కనబడుతారు. వారు అనుకూలిస్తే మనకార్యమే నెరవేరుతుంది. ) ( ప్రకాశముగా) వారు రావడమెందుకుగాని నేనే నస్తా, దారి జూపు.

నౌ : చిత్తం, దయచెయ్యండి దేవర !

[ ఇద్దరూ తెరలోపలికి బోతారు ]

[నరసింగరాజు, నౌకరు ప్రవేశము ]

నౌ : అలరాజుగారు యిక్కడికే వచ్చారు.

నర : ఇక్కడి కెట్లా వచ్చారు ?

నౌ : పొద్దటినుంచి నే పడమటి డొంక కాచేవున్నా. దూరంగా చూచి వూళ్లోకి పరుగెత్తి అడ్డబజారున వారి కెదురుబోయి మిమ్ములను చూడడానికి యిక్కడికి తీసుకొనివచ్చా. వంట యింట్లోకి కుందేలు వచ్చి దూరింది.

నర: నే గురిజాలకు ప్రయాణమవుతుంటినిగా, ఆ మాట చెప్పి లోపలికి తీసుకురా.

నౌ : ఆయ్యా, లోపలికి దయచెయ్యండి. అయ్యగారు గురిజాలకు ప్రయాణమై చెప్పుల్లో కాళ్ళుబెట్టుకొనివున్నారు.

[ అల రాజు ప్రవేశము ]

అ. రా : తమరూ ప్రయాణమౌతున్నట్లున్నారు ! నర : ఓహో అలరాజుగారా ! ఎంతకాలానికి చూడడమయింది ! ఇది గొప్పసుదినం. రాజధర్మాన్నిబట్టి, రక్తబంధములు గూడా ఇట్లా దూరంగా వుండవలసివచ్చింది. ఇక్కడికి అదృష్టవంతులమే. అంతా తిన్నగా వచ్చారా? ఇదెట్లా, ఇంతకాలానికి కుశలంగా వచ్చినందుకు నెమ్మదిగా మాట్లాడడానికికూడా అవకాశంలేదు. నౌకరీ వొప్పుకున్నతర్వాత శరీరం అమ్ముకున్నట్టే, స్వాతంత్ర్యంలేదు. రాజుగారి దగ్గరనుంచి నన్ను తక్షణం రమ్మని ఉత్తరువు వచ్చింది. భోజనంగూడ అక్కడనే చేతామని బయలుదేరుతున్నా. ఏదో అగత్యంగా సలహాపదమున పుట్టింది. తమరు కాళ్లు కడుక్కోండి, వంటవుతున్నది. భోజనంచేసి కొంచెం విశ్రమించి బయలుదేరితే ప్రొద్దుగూకేవరకు గురిజాల చేరుతారు.

అ. రా : నేనూ బయలుదేరుతా మీతోటే ; మాట్లాడుతూ పోదాం.

నర : మీరు దూరంనుంచి వస్తున్నారు ; అలిసివుంటారు. తొంద రేమి? నిదానంగ చేరండి.

అ. రా : నేనూ రాజ సేవమీదనే వచ్చా. మిమ్మును తొందరగా పిలిపించడానికి కారణం నా రాకనుగురించి మాట్లాడడానికే అయివుంటుంది. తమరు రాజుగారిని సందర్శించక ముందే మీతో నే వచ్చిన పనిని – సంధికార్యమునుగూర్చి మాట్లాడుదామని వున్నది.

నర : అయితే బయలుదేరండి. ఒక రివర్దీలో వున్నవాండ్లకు వేళకు భోజన మెట్లాసంభవిస్తుంది ?

[ ఉభయులూ బయలు దేరారు ]

అ. రా : నేను వచ్చిన విషయం తమతో మనవిచేస్తాను, దయచేసి సావకాశంగా వినండి.

నర : అవశ్యం. అ. రా : మావాండ్లు యేడేండ్లు అష్టకష్టాలు పడి సమయం నెరవేర్చి వచ్చారు.

నర : మనవాండ్లని అనండి. నేనుమట్టుకు వాండ్లనుగురించి మనసులో విచారించడం లేదనుకున్నారా? మన వాండ్లు వస్తున్నారని తెలిసే అహోరాత్రులు కర్తవ్యమే విచారిస్తున్నా,

అ. రా : చిత్తం. కుటుంబకలహం జరుగకుండా వ్యవహారం సర్దే ఉపాయ మేదో తమరే యోచించండి.

నర : నేను అరవిడిచి మీతో చెపుతాను. అటు అన్నా, ఇటు తమ్ములూను. ఎవరికి ఆపద వచ్చినా నాకు వచ్చినట్టే. అన్నగారు ఒక మాటమీద నిలువరు. సలహాదారులు ఒకరుగారు. ఆయనకు ఏది నచ్చితే ఆ ప్రకారం బోతారు. ఒక్కొక్కప్పుడు ఇతరు లెన్నిచెప్పినా తన కెంతతోస్తే అంత. ఇతరు లెంతజెప్పినా ససేమిరా అంటారు.

అ. రా : అవును. ఆ మాట నిజమేకాని తమమాట తీసి వెయ్యలేరు. తమరు గట్టిగా పట్టుపడితే కుటుంబకలహం ఆపివేయగలరని నా నమ్మకం.

నర : సంధికావడం నాకు మిక్కిలి సంతోషం. నాకంటె మీయందు వారికి మక్కువెక్కువ. మీరు గట్టిపట్టు పట్టండి ; కాకెక్కడికి బోతుందో చూతాము. "సంధిమిచ్ఛంతి సాధనః " అన్నారు. అట్లాగే పని జేతాము. ఎట్లయితే కుదర్చమని చెప్పారు ?

అ. రా : మాచర్లమండలం తమ్ముల కియ్యడానికి అన్నగారు మొదట ఒప్పుకొన్నదేకదా ! యీ యేడుసంవత్సరాల నుంచి వీరే అనుభవిస్తుండిరి.

నర : తాను బుద్ధిపూర్వకంగా ఒప్పుకోలేదంటారు.

అ. రా : కాకపోతేమట్టుకు తనకుమాత్ర మేనూరుమంది వున్నారు. ఒక్క ఆడపిల్లేగదా !

నర : అట్లని రాజ్యం వదలుకుంటారా ? మనం సంపాదించేదంతా మనకోసమేనా?

అ. రా : తనతరువాత రాజ్యం దౌహిత్రాన్నిబట్టి మాకుటుంబములో కే వస్తుంది. దాయాదులతో తగాదా లెందుకని బ్రహ్మనాయుడు చెప్పిన రాజీకికూడా మొదట ఒప్పించా. కన్నుదగిలేపుల్లను ప్రతిదాన్నీ కనిపెట్టేవుండాలె.

నర : నా సంగతేమీ చెప్పించరా ? మీకు కొమాళ్లు కలుగకపోతే నేనే తరువాతవాణ్ణిగదా ?

అ. రా : ఇప్పటికి మీ అన్నేరాజుగదా, అధికారమంతా మీరే చలాయిస్తుంటిరి. వారసత్వం వచ్చినప్పుడు మీ సంగతి చెప్పకుండానా? ఏ మట్లావున్నారు? బొత్తిగా వేలబడి పోతున్నా రే!

నర : భోజనానికి వేళదప్పింది. పైత్యపుభ్రమ వచ్చింది. ఇంకా వూరు ఎంతదూరముండేను ?

అ. రా: ఎంతలేకేమి? రెండుకోసు లుంటుంది. నర : రెండుకోసులు కాదుగదా, రెండుబారలుకూడా నడవలేను. దగ్గరలో చెట్టేమయినా వుందేమో చూడండి, నీడ వుంటే కాస్త తెప్పరిల్లిందాకా వొడ్డిగిలబడతా.

అ. రా : ఈ పక్కచేలోనే చింతచెట్టువుంది. దానికింద యిద్దరు సన్యాసులుగూడా వున్నట్టున్నారు. నా బుజాన చెయివేసి రెండడుగులు వేస్తారా ?

నర : ఆ కనపడేదేనా ! కండ్లు భ్రమగప్పి లీలగా కనపడుతున్నవి. పదండి. సన్యాసులో, మాచకమ్మలో యెవరయితేనేమి?

అ. రా : దారిన రండి.

నర : ఇళ్ళో.

అ. రా : ఒక్క నిమిషమాగి అలుపు దీర్చుకోండి.

నర: పదండి.

అ. రా : వుండండి, నీడన గుడ్డ పరుస్తా. కాస్త తలవాల్తురు గాని.

నర : ఎవరయ్యా మీరు ?

గో : మేము గోసాయిలం.

నర : బ్రాహ్మలా ? మేము రాజులం.

గో : బ్రాహ్మలమే.

నర : అయితే కాస్త దాహమియ్యండి నాయనా.

[ దాహమిస్తారు ]

నర : (తాగి) తమరు పొద్దుటినుంచి నడిచివచ్చారు. ఇంకా దృఢకాయులుగనుక ఓపికగా నడుస్తున్నారు. మీరు సాగి పదండి. వెనకడితే నేనూ బయలుదేరుతా. అ. రా : మిమ్ములను ఈ యెడారిలో వదిలిపెట్టి పోతానా? ఇద్దరం కలిసేపోదాము. గోసాయిలదగ్గర యేమయినా ఎంగిలిపడుతారా?

నర : నా కెన్నడూ స్నానంలేని భోజనం మామూలు లేదు. హరీ అనేదాకా అట్లా జరుగవలసిందే. నాస్తాచెయ్యండి, నన్ను నడిపించుకపోదురుగాని.

గో : అయ్యా, మీరు యెండనబడి వచ్చారు. కలో అంబలో మా కున్నది స్వీకరించండి.

నర : నీళ్లు దగ్గరలో వున్న వా ?

గో : అరమైలు పోవాలె. స్నానంజేసి బిందెలో తెచ్చుకుంటే వంటకురాగా దాహానికి మిగిలినవి. అవీ కటికివుప్పులు, విషప్రాయంగా వున్నవి.

నర : నా సంగతిక వట్టిదే. చిన్నవారు మీకేమి, కాస్త నాస్తా చెయ్యండి. నన్ను నడిపించుకపోదురుగాని.

1. గో : నాకు సంధ్య ఇంకా ఆలస్యమున్నది, వారికి, వడ్డించు.

2. గో : అయ్యా, కూర్చోండి వడ్డిస్తా - (వడ్డించి) - సుకుమారులకు మీకు సయిస్తుందా - కాలేకడుపుకు మండేగంజి. కండ్లు మూసుకొని రెండుముద్దలు మ్రింగండి.

[ తెరలో భోజనమయింది ]

నర : ఇక మెల్లగా నడుస్తామా, కాస్త తేరుకున్నా ?

అ. రా : లెండి. అన్నం తిన్నప్పటినుంచి గుండ్రింపుగా వున్నది. నాలుక విరుస్తున్నది. నర : ఉప్పునీళ్లచేత. త్వరగా పదండి. ఈ నీళ్లే మళ్లీ తాగితే నాలుక మరీ విరుస్తుంది. ముం దెక్కడనయినా మంచినీళ్లు తగలక పోతవా ! ( కొంతదూరం పోతారు. ]

[గోసాయిలు పలాయనం ]

అ. రా : అయ్యా ! నాకు కాళ్లు తీస్తున్నవి. నాలుక పీకుతున్నది. మంచినీళ్లు దొరికితే బాగుండు.

నర : మరే. ఊషరక్షే.త్రం. దగ్గరలో నీళ్లు లేవు. త్వరగా అడుగువెయ్యండి.

అ. రా : ఇంకేమడుగులు. ఇక నడవలేను.

[ అని కూలబడతాడు ]

నర : నే బోయి నీళ్లు తేనా ?

అ. రా : నీ......... [ అని ప్రాణము విడుస్తాడు. ]

నర : నడిదార్లో యెందుకు ఈ పీనుగ ; రాయబారం ముగిసింది.

[ శవాన్ని పక్కచేలోకి లాగి నరసింరాజు వెళ్లుతాడు. ]