నానకు చరిత్ర/పంచమాధ్యాయము
శ్రీ
నానకు చరిత్ర.
పంచమాధ్యాయము.
అనంతరము నానకు కొంతకాల మచ్చటనుండి సోదరివద్ద బావవద్ద సెలవుగైకొని లాహోరు మండలము నందలి యమ్నాబాదు పట్టణమునకు బయనమైపోయెను. సుల్తానుపురమునువిడిచిన యాగడియ మొదలుకొని యీకథానాయకుడు గురు నానకు నామముతో వ్యవహరింప బడుచువచ్చె. ఏలయన నాదినము ప్రారంభముగా నతడు తనకాలమున సంఘమునందు ప్రబలియుండిన దురాచారమును వెలిపుచ్చి ఖండించుటకును బ్రజల మనస్సులనుండి మూడవిశ్వాసములను దొలగించుటకును సత్యమని తానునమ్మినమతము స్వేచ్ఛగా లోకులకు బోధించుటకును సంకల్పించెను. ఏమనుష్యుడు తన బోధనలవలన మానవకోటికి నీతి యాత్మజ్ఞానము మనోవికాసము గలిగించునో యతడే గురుశబ్దమున కర్హుడు. నానకు తనకు గలిగిన యాత్మజ్ఞానమును దోడిమానవులకు నెఱింగించుటకే గాక దైవధర్మములకు విరుద్ధములైన దురాచారము లను సంఘమునుండి దూరముగ దోలుటకు నిర్మూలించుటకు సమకట్టె గావున నీతడు గురుబిరుదము నందుటకుదగినవాడు. అందుచేత నాశబ్ద మతనియందు సార్థకమయ్యెను.
సుల్తానుపురమునుండి యమ్నాబాదుకు బోవుట కేడు దినములు పట్టెను. ఈపట్టణమునకు నానకు వచ్చుటకు గారణమేమన నచ్చట దైవభక్తుడు సత్ప్రవతన్‌కుడు నగు వడ్ల వాడొక డుండెను. ఆతని జూచుటయే యీగురుని యభిలాష. ఆవండ్రంగి పేరు లల్లో. నానకు తత్పురము బ్రవేశించి సరిగ ఆవడ్రంగియింటికి బోయెను. లల్లో నానకు మహాత్ముడని వినియుండెనేకాని యాతని దరిశన మదివఱకెన్నడు జేసియుండలేదు. తనగృహమున కనాహూతుడై యరుదెంచిన పురుషుడు నానకేయని తెలిసికొని యావడ్రంగి మహానందభరితుడై వానినెంతయు గౌరవించెను. అతడక్కడ కొన్నినాళ్లుండి తనమతము బోధింప నారంభింప నాపురజనులకు వానిమీద ననిష్టముపొడమెను. అనిష్టమేకాదు కేవల ద్వేషమే కలిగెను. అట్లుకలుగుట యాశ్చర్యముగాదు. ఏలయన నేమనుష్యుడైన మతవిషయమునగాని, సంఘవిషయమునగాని, జ్యోతిషాది శాస్త్రవిషయములగాని క్రొత్తసిద్ధాంతము బోధించినప్పుడును సిద్ధాంతము ప్రాతదైనను నూతనముగా నాచరణమునకు దెచ్చినప్పుడును లోకులు కాకులట్లు వానిం బొడిచి తల యెత్తుకొననీయక నిందించి బహిష్కరించి దండించి చేతనైనచో నిష్కారణముగ జంపివేయుదురు. ప్రపంచము యొక్క పూర్వచరిత్రం జదివినవారి కందఱకు నిది విదితమే. లోకులు క్రొత్తసిద్ధాంతములలో నున్న యోగు బాగుల నరయరు. దానివలన మానవకోటికి గల్గు లాభనష్టములను విచారింపరు. మునుపటి యాచారములకు విరుద్దముగ బోధించినవాడు నీతిమంతుడైనను సరే విద్యాసముద్రుడైనను సరే జ్ఞానరాసియైననుసరే యదియెల్ల లెక్కసేయక వానినెల్ల సిలుగులం బెట్టుదురు. ఈమాటల యధార్థ్యముస్థిరపరచుట కుదాహరణములు వేనవేలున్నవి. ఎందరో పరమపవిత్రులు మలిన చరిత్రలచేత సంహరింపబడిరి. ఎందరోవిజ్ఞానవంతులు పరమమూర్ఖులచేత బాధింపబడిరి. ఎందరో శాస్త్రకారులు నిరక్షరకుక్షలచేత నిందింపబడిరి. అద్వైతమతోద్ధారకుండగు శ్రీ శంకరాచార్యుడు మళయాళ బ్రాహ్మణులచేత నెన్నియిడుమల బడెనో మనము వినియుందలేదా! ఆయనతల్లి మృతినొందినప్పుడు కులబ్రాహ్మణులు శవదహనమునకు సహాయముచేయక మిన్నకుండ శంకరుడుగొడ్డలితో మాతృదేహమును ఖండఖండలుగాజేసి మోసికొనిపోవుటకువీలులేక తనదొడ్డిలోనేయగ్నిసంస్కారము చేసెనట. విశిష్ఠాద్వైత మతోద్ధారకుడగు రామానుజాచార్యుని చోళరాజు దేశమునుండి తరిమెనట. రామానుజు డారాజు చనిపోవువఱకు ననగా పండ్రెండు సంవత్సరములు తనమతము స్వదేశమున బోధింప వీలులేక విదే శముల గాలక్షేపము చేసెను. ఏసుక్రీస్తువంటి నీతివంతుని బరమభక్తుని సుగుణవంతుని వానిదేశీయులగు యూదులు నిర్హేతుకముగా గొరత వేయింపలేదే. మతముమాట యటుండనిండు ప్రకృతి శాస్త్రములలో గ్రొత్తసంగతులు కనిపెట్టిన వారికిగూడ నిట్టి యవస్థలే సంభవించినవికదా! "సూర్యుడు భూమిచుట్టు దిరుగుట లేదు. భూమియే సూర్యునిచుట్టు దిరుగుచున్న"దని కష్టపడి కనిపెట్టి యాసత్యము లోకమునకు వెల్లడించి నందుకేగదా బ్రూనోయను పశ్చిమఖండవాసుని వానిమతస్థులగు క్రైస్తవులు బ్రతికియుండగా వానిని నిప్పులలో బడవేసి చంపిరి. క్రొత్తదానిని లోకులు మొట్టమొదట నేవగించుట సహజము.
నానకు క్రొత్త సిద్ధాంతమేమియు జెప్పక పోయినను వానమతము పవిత్రమైన యార్యమతమైనను యానాటి దేశస్థుల యాచారమునకు విరుద్ధముగ నుండుటచే వానిని ప్రజలు ద్వేషించిరి. నానకు పరమశాంతుడైనను దత్పురజనులు వాని నెగతాళిచేసి చప్పటల జరచి యవమానించిరి. నానకునకు మర్దనునకు గూడ నక్కడనుండుట కిష్టము లేకపోయెను. గురుశిష్యులు తమతలంపు వడ్రంగి కెఱిగించిరి. అంత త్వరితముగ నేలబోవలసివచ్చెనని వడ్రంగి వారినడుగ నానకు, తనయునికి పురజనులకు బాధకరముగా నున్నందున వారికి మనోవ్యధ కలిగించుట కిష్టములేక తాను పోవలసివచ్చెనని ప్రత్యుత్తర మిచ్చి యీక్రిందివిధమున బలికెనట. "నే నూరకుంటినా నన్ను జ్ఞానములేని మొద్దందురు. మాటలాడితినా ప్రేలు చున్నాడందురు. కూర్చుంటినా యెవనికొఱకో యేడ్చినట్లే యున్నాడందురు. లేచిపోతినా నెత్తినిగుడ్డవేసికొని పోయినాడందురు. వినయము జూపితినా భయపడి లోబడినాడందురు. నీజనుల నెట్లుమెప్పింపవలయునో నే నెఱుగను. భగవంతుడే నన్నిహపరముల రక్షించుగాక." "లోకోభిన్నరుచి:" యను సామెతనుబట్టి మనుష్యుల మనస్సులు పరిపరి విధములుగ నుండును. ఒకనికి మిక్కిలి బాగున్నది మఱియొకని కెంతో యోగుగా గానబడును. అందఱ మెప్పించుట మనుష్య మాత్రున కెవ్వనికిం దరముగాదు. కావున లోకోపకారపారీణుడగు మనుష్యుడు తనకు సత్యమనిదోచిన దానిని లోకుల నిందల కుడుగక స్తోత్రముల కుబ్బక దైవముఖము జూచి నిర్భయముగ జాటును. గురునానకు తనయూరు విడచిపోవుట కిష్టపడక లల్లో మాసముదినములు తనయింట నుండుమని వానిని బ్రార్థించెను. అతడు మిక్కిలి వినయముతో వేడుకొనుట చేతను మిక్కిలి భక్తిగలవాడగుటచేతను నానకు వాని కోరిక నెరవేర్ప నియ్యకొనెను. మర్దనుడు పురజనులుపెట్టు బాధలు పడలేకను క్రొత్తయూరులో మునుపటియట్లు ప్రొద్దుపోవక పోవుటచేతను స్వగ్రామము పోవదలచి యజమానుని సెలవడిగెను. తనకాతిథ్యమిచ్చిన గృహస్థుడు సామాన్యస్థితికల వాడైనందున నిరువుర కన్నమిడుట వానికి భారముగా నుండు నేమోయనియు, బోవదలచిన వాని నాప గూడదనియు నానకు మర్దనుని పోక కనుమతించి నెల దినములలో ననగా దానాపురము విడువకముందే రమ్మని చెప్పిపంపెను.
గురు నానకు తత్పురమున నున్నప్పుడు సంపన్నుడు పలుకుబడి కలవాడు కులమున క్షత్రియుడునగు మాలికు భాగోయనునతడు బ్రాహ్మణులకు సంతర్పణము జేసినాడు. నానకునుగూడ విందునకు బిలిచెను. ఏమి కారణముచేతనో నానకు విందునకు బోవలేదు. ఆసంపన్నుడది యనుమానముగా గ్రహించి నానకు దర్శనమునకుబోయి విందునకు రాకపోవుటచే దనకుగలిగిన యవమానమును మనస్తాపమును బిట్టుగజెప్పుకొనెను. అదివిని నానకు భాగోనుచూచి యంతటి స్వల్పవిషయమున కంతగా విచారింపవలసిన యావస్యకత లేదని చెప్పి వెనుక విందారగింపనందుకు దోషపరిహారార్థముగా నప్పుడతడిచ్చు వస్తువుల దినుటకు వాగ్దానముచేసి భక్ష్యముల దెమ్మని యడిగెను. భాగో సంతుష్టహృదయుడై తక్షణము కొన్నిభక్ష్యముల దెమ్మని సేవకున కాజ్ఞాపించెను. తోడనే మిగుల రుచ్యములగు పదార్థములు పళ్లెరములతో వచ్చెను. అవి ముట్టకమునుపే నానకు ప్రక్కనునిలిచియున్న పేదవడ్రంగినిజూచి మీయింటిపదార్థముల గూడ తీసుకుని రమ్మనియాజ్ఞాపించెను. అనవుడు లల్లో మహాప్రసాదమని తనయింటనున్న నిస్సారపదార్థములం గొన్నిటిని దెచ్చి గురు సమ్ముఖమునం బెట్టె. పెట్టుటయు గురువు రెండుపళ్లెరముల నుండి రెందువస్తువులు చెరియొక చేతం గ్రహించి వ్రేళ్ళతో నొక్కెనట. నొక్కినతోడనే భాగో తెచ్చిన పదార్థముల నుండి నెత్తురుబొట్లు పడెనట. లల్లో సమర్పించిన పదార్థములనుండి తెల్లని పాలు గారెనట. అట్లు కారుట యసంభవమగుటచే నీకథ విశ్వాసపాత్రముగాదు. కాకున్నను లోకులకీ కట్టుకథ కొంత నీతిని బోధింపకపోదు. ఇందు మనము నేర్చుకొనవలసిన నీతి యిది. సంపన్నులు వెండిగిన్నెలతోడను బసిడిపళ్లెరములతోడను దెచ్చియిచ్చు పంచభక్ష్యపరమాన్నంబులు వారి కష్టార్జితంబులు కావనియు, పొట్టగడువక దినమెల్ల జమటయూడ్చి పాటుపడు నిరుపేద లనేకుల బాధించి బలాత్కారముగాను మోసపుచ్చియు సంపన్నుల ధనము గ్రహించి విందుల తామారగించి యొరులకు మెప్పునకై పెట్టుదురనియు, పాలుమాలక యొరుల వంచింపక మేను దాచుకొనక పాటుపడిదారపుత్రుల నెట్టెటోబోషించుచు గౌరవముగ గాలక్షేపము చేయువాని గంజియన్నమే భాగ్యవంతుల పాయసాన్నములకంటె భక్ష్యములకంటె మహాత్ము లెక్కువ యాదరముతో నెక్కువరుచితో భూజింతురనియు మన మెఱుంగవలయు.
భాగోతెచ్చిన పదార్థములనుండి నానకు నెత్తురు పిండినమాట నిస్సంశయముగా నతిశయోక్తియైయుండును. గాని వాని తెచ్చిన యాహారమును దిన్నగ మెసవక వడ్రంగి యిడినకూడు నెక్కువయాదరించి సమగ్రమముగ భక్షించి యుండుననుట సత్యమని మనమూహింపవచ్చును. ఇంతియగాక గడుసుదనమెఱుంగని వెంగిలిజనులను దోచికొను భాగ్యవంతులగువారి యన్నముకంటె నీతి మంతులగు నిరుపేదల కూడు శ్లాఘ్యము గ్రాహ్యమునని నానకు మొగమోటమిలేక వానితోజెప్పియుండిన నుండవచ్చునని గూడ మనమూహింపవచ్చును. అయాదరణము నాధారము జేసికొని బుద్ధిమంతులీ కథను గల్పించి యుందురు. భాగ్యవంతుడై యెల్లవారలకు గౌరవనీయుడైనున్న భాగోకు నిరుపేదయు దక్కువ వర్ణము వాడునందు వడ్రంగియునగు లల్లో యెదుట జరిగిన యవమానము నతడు సాధారణముగ మరచిపోదగినదిగా గానబడదయ్యె. ఆక్రోధమతడు మనసులో నుంచుకొని నానకున కేదైన నపకారము జేయుటకు సమయము నిరీక్షించు చుండెను. రం ధ్రాన్వేషణము చేయువారికి సమయములు చిక్కకపోవునా శీఘ్రకాలములోనే యతని కొక యదునుదొరకెను. ఎమ్నాబాదు ఖిల్లాదారు (గవర్నరు) గానుండిన శేజిఖానున కొక్కడే పుత్రుడుండెను. అతడా దినములలో గొప్ప జాడ్యముచే బీడితుడైయుండె. శేజిఖాను గొప్పవా డగుటచే నతడు తన యధికారమునకు లోబడిన దేశములోనున్న గొప్పవైద్యుల నందఱ బిలిపించి కుమారునకు జికిత్సముల జేయించెను కాని యవి యన్నియు నిష్ఫలము లయ్యెను. భాగో శేజిఖానున కాప్తుడగుటచే ఖాను తనకుమారుని దేహస్థితి నాతనితో జెప్పుకొని శీఘ్రముగ నేదో చికిత్సజేయనిపక్షమున బుత్రుడు తనకు దక్కడని బిట్టువిచారించెను. భాగో వానివిలాపము విని మేటివైద్యుల చికిత్సలు నిష్ఫలములైనందున నటమీద జికిత్సల జేయింపక భగవద్భక్తుడై పరమపవిత్రుడై మహిమలు చేయగల యోగినెవ్వనినైన బిలిపించి మంత్రబలముచే రోగమును శరీరమునుండి నిర్మూలము చేయుట కర్తవ్యమని వాని కుపదేశించెను. ఆయాలోచనము మిక్కిలి బాగున్నదని ఖాను మెచ్చుకొని నిజముగా వాక్శుద్ధిగలవాడు మహిమగలవాడు నగుయోగిదొరకుట సులభసాధ్యము కాదని పలికెను. అనవుడు నగరనుందున్న బైరాగుల సన్యాసుల యోగులనందఱ బట్టి తెప్పించిన పక్షమున నందులో నెవ్వడైన నొక్క మహాత్ముడుండకపోడని భాగో ప్రత్యుత్తరమిచ్చెను. ఆయుపదేశము లెస్సగానున్నదని మెచ్చి ఖాను కానబడిన విరాగులనెల్ల బట్టుకోమని సేవకుల కానతిచ్చెను. అట్లుపట్టుపడిన వారిలో గురునానకుకూడ నొకడైయుండెను. రాజభటులు గురునానకును నిష్కారణముగ బట్టుకొని తీసుకొని పోవుచున్నందుకు లల్లో చాలవిచారించెను. గురునానకు తనకు శిష్యుండగు పేద వడ్రంగినూరడించి తనయాత్మబంధములో లేనంతకాలము శరీరము బంధింప బడినను బాధల నొందినను తనకుజిజ్ఞాసలేదని పలికి వానికి ధైర్యము చెప్పెను. మానవుడు తలంచున దొకటియు దైవము నిర్ణయించున దొకటియు నగుచుండునుగదా. శేజిఖాను తనయధికారబలమున భాగో చెప్పిన యాలోచనము ననుసరించి పట్టణమునంగల విరాగులనెల్ల బలవంతముగ బట్టి తెప్పించెనేకాని తనయభిప్రాయము వారికి సరిగ నెఱింగింపక మున్నె కుమారుని శరీరస్థితి వారికి దెలుపకమున్నె యంతలో మొగలాయీలు మహాసేనాసమేతులై జయభిలాషమై వచ్చుచుండురనియు వెంటనే తమకు లోబడని పట్టణంబుల భస్మపటలము చేయుచు మనుష్యుల మ్రందించుచుండిరనియు గుండెలవియు వార్తలు తెలిసెను. లోబడని పట్టణములు భస్మపటలము లగుచున్న వనుటచేత లోబడినయూళ్ళు నిరపాయములై యున్నవని తలంపవలసినపని లేదు. నీతిమాలిన యాదండులోని సైనికులు లోబడిన యూళ్ళసైతము దోచుకొని స్త్ర్రిల జెరబట్టియధేచ్ఛముగా మెలంగుచువచ్చిరి. ఎట్లయినను వారియధికార మొప్పుకొన్నగ్రామము లొప్పుకొనని గ్రామములకంటె నించుక సుఖతరములుగ నుండినవని చెప్పవచ్చును. ఆవార్తలు విని శేజిఖాను వానిచుట్టములు మిత్రులు తక్కిన పట్టణములకు బ్రాపించిన దురవస్థయే తమ పట్టణమునకుగూడ తప్పక పట్టునని మహాపదకు సంసిద్ధులైయుండిరి. అనుకున్నంతపని జరిగె. బేబరుయొక్క మొగలాయిసైనికులు కొలదికాలములోనే యమ్నాబాదునకుబోయి యనాగరికులు క్రూరులు నగుసైనికులు చేయదగిన దుండగములన్నియు జేసిరి. ఒక్క ద్రోపుడుకాదు. ఒకహింసకాదు. ఒక్కస్త్రీ మానహానిగాదు. అపుడుజరిగిన దౌర్జన్యములను గురునానకు స్వయముగ జూచియుండుటచేత నతడు స్వభాషలో నాపురజనుల దురవస్థ గొన్ని పద్యములలో వణిన్ంచెను. ఆపద్యముల తాత్పర్య మీక్రింద బొందుపరచెద. ఈ వాక్యములలో నత డంత:పుర స్త్రీల దురవస్థనే మిక్కిలి వర్ణించియున్నాడు.
"ఆహా యీస్త్రీలు మున్ను పువ్వులతో సుగంధతైలముతో నగలతో వారిశిరసుల నలంకరించుకొని యుండిరికదా. ఆయువతు లిప్పుడు శిరస్సులు ముండనముచేయించుకొని నోట మట్టిగొట్టుకొని పోవుచున్నారుగదా! తొల్లి యీ యంగనలు సుందరమందిరముల వసియించుచుండిరిగదా! నేడు వారిజయించిన వారియెదుట నిలువనైనదగరట. వందనముసర్వేశ్వరా వందనము. నీసంకల్ప మెవ్వడెఱుంగడుగదా! నీవేమి చేయదలంచెదవో నీవ యెరుంగుదువు. ఈపడంతులు వివాహకాలమున భర్తృపార్శ్వమున నెంతెంతశోభిల్లుచునుండిరోగదా! వివాహానంతరమున నీవెలదులు పల్లకులెక్కి భర్తృగృహములకు బోయినప్పు డెంతెంతవైభవముతో నుత్సవములు జరిగెనొకదా! చేతుల కంకణాలు ధగధగ మెరయ నీక్రొత్తపెండ్లికూతు లత్తవారి గుమ్మములముందు నిలిచినప్పుడు ముసలిముత్తయిదువులు పీడాపరిహారార్థ మెన్నిపారు లు దృష్టితీసిరోగదా! వారినోట మాట వచ్చెనా లెక్కలేని ధనము వారియధీనమయ్యెనుగదా! హంసతూలికాతల్పముల మీద హాయిగా బన్నుండుటయెగాని పనిచేసి యెఱుంగరుగదా. కావలసిన సమస్తమధురఫలములు వారికవలీలగ జేకురుచుండెడివి. ఆ యువిదలు శరీరములమీద ధరియించిన చీనీచీనాంబరములు మణిభూషణములు వెలలేనివిగదా! కటకటా ఇప్పుడు వారి చక్కదనమె వారికి శత్రువయ్యెను. వారివిభవమె విరోధియయ్యెను. దురాత్ములగు యధికారుల యాజ్ఞాప్రకారము సైనికులా స్త్రీలంజెరబెట్టిరి. దైవము తనకిచ్చవచ్చిననవారి నున్నతపదవికిం దెచ్చి కాపాడును. మనుష్యుండు తగుసమయమున భగవంతుని దలచుకొన్నయడల వారికపాయములేల వాటిల్లును. శత్రువులు దండువిడియకముందు ప్రభువులు భోగపరాయణులై దైవమును మఱచి నిశ్చింతతో నుందురు. ఇప్పు డేమి విచారించిన నేమిఫలము? బేబరు శాసనము చెల్లుచున్నది. సుకుమారవతులగు సుందరాంగులు సయితము పట్టెడన్నమునకు మొగము వాచియుండిరి. మసీదులలో నమాజుచేయవలసిన యవసరము దేవాలయములలో బూజలుచేయవలసిన యవసరము లేకపోయినది. హిందూసుందరులు మనసార మొగమున గుంకుము బొట్టుబెట్టుకొనుటకైన వీలులేని కాలము వచ్చినది. మునుపు వీరెవ్వరు రామునిపేరైన స్మరియించి యెఱుగరు. ఇప్పుడు స్మరియింపదలచినను శ త్రువులు స్మరియింప నియ్యరు. కొందఱు చెల్లాచెదరైన తమ కుటుంబముల సేమము నరయుచున్నారు. కొందఱుచుట్టపక్కముల కుశలవాతన్‌ల నడుగుచున్నారు. కొందఱు తమ దుష్కర్మములఫల మనుభవింప గూర్చుండినట్లు నేలగూర్చుండి యేడ్చుచున్నారు. భగవంతు డేమిచేయ నిచ్చగించునో యదియే సంభవించును. మనుష్యుడు చిన్న "పురుగు."
అట్లు ప్రజల యవస్థనుగూర్చి కొన్నిపద్యములు చెప్పి నానకు పట్టణపరిపాలకుడగు శేజిఖానుని దుర్గతిని వణిన్ంచుచు మరికొన్నిపద్యములు రచించె. ప్రతిపద్యాంతమందు భగవంతుని మార్గము మనుష్యబుద్ధికి దుర్గమములనియు నతని శాసనము లవిలంఘనీయము లనియు నానకు నొక్కిచెప్పుచు వచ్చెను. ఆపద్యముల తాత్పర్య మీక్రింద వ్రాయుచున్నాడ. "ఒక కాలమందు శేజిఖాను వాని యంత:పురాంగనలు ననుభవించిన భోగ మింతింతయని చెప్పరాదు కదా! సేవకులు వారికనుసన్నలమెలంగి వారి నోటమాట జారినమాత్రమున నూడిగములు చేయుచువచ్చిరిగదా! కోరికలు కోరుటయె తడవుగా నవి నిఫలము లయ్యెనుగదా! అహోరాత్రము లెడతెగని పండుగలై మహోత్సవములతో నిండియుండెనుగదా! ఆనందసముద్రమున దేలుట సౌఖ్యములనవ్వారిగా ననుభవించుట సేవకుల కాజ్ఞాపించుట యాటలాడుట యలంకారముల జేసికొనుట మున్నగుపనులకంటె నన్యమెఱుంగరుకదా! అవు ను శేజిఖాను వానివంటి యితరమనుష్యులు నిశ్చయముగా నట్లు గడపిన దినములు కొన్నియుండెను. అదృష్టము కలిసివచ్చినంతకాలము వారికట్లు జరిగెను. కటకటా వారిప్పు డెట్లున్నారు. శత్రుసైనికు లున్నసొమ్మెల్ల నొలుచుకొనిరి. ఈయా యవమాన మనక యెల్ల యవమానములు వారివంతయ్యె. వెనుక ననుభవించిన మహాభోగములకన్నిటికి బ్రాయశ్చిత్తమో యన్నట్లు కొందఱు మహాభారముగ నున్న సంకెళ్ళతో గాళ్ళు కదపలేక నేడో రేపో గతించిన తమ చెలికాండ్ర గలిసికొనుటకు సంసిద్ధులై చెరసాలలలో గుందుచున్నారు. భగవంతుడు న్యాయశీలుడు సర్వోన్నతుడు. అతనిశాసన ముల్లంఘించినవారు తప్పక నశింతురు. ఈనాటిప్రభువులగు పటానులు వానియాజ్ఞ దాటలేదా దానిఫల మనుభవించుట లేదా? ఘాతుకులగు మొగలాయి సైనికులకు బౌరువహీనులయిన పటానుప్రభువులకు జరిగిన యాయుద్ధములో నిరహేతుకముగా జచ్చిన వేనవేలు పురుషులు స్త్రీలు బిడ్డలు మొదలగువారిపక్షము బూనుట కెవ్వరు లేకపోయిరి.