నాగర సర్వస్వం/వస్త్ర సంకేతములు
'నాకు నిన్ను కలియాలని ఉన్నది. నాకు భయములేదు. నీవుకూడ భయపడనక్కరలేదు'—అని సూచించడానికి 'కరక్కాయను' పొట్లముగాకట్టి పంపుట సంకేతము.
కరక్కాయతో కూడిన పొట్లము ప్రియురాలివద్దనుండి వచ్చినపుడు పురుషుడు జంకుగొంకులు లేకుండ ఆమెను కలియుటకు యత్నింపవచ్చును.
'నేనిదివరకు మన్మధ వ్యాపారము నెఱుంగనిదానను, నేనునిన్ను మిక్కిలి ప్రేమిస్తున్నాను, మన్మధుడు నన్ను మిక్కిలి వేధిస్తున్నాడు, నన్ను దయజూడు'-అని సూచించడానికి ప్రత్యేకసంకేతము చెప్పబడినది.
మైనము తెచ్చి దానిని నున్నని ముద్దగాచేసి, దానిపై ఎఱుపు దారముచుట్టి, ఆముద్దమీద తనచేతి ఐదుగోళ్లు నాటునట్లు ఒక్కసారి నొక్కి, దానిని పొట్లముగాకట్టి పంపుట పైన చెప్పిన మూడు విషయాలకు సంకేతమై యున్నది.
ఇందు 'నున్నని మైనపుముద్ద'-ఇంతవరకు పరసంపర్కము ఎరుగనిదనుటకు, దానికి చుట్టిన ఎఱ్రదారము-'ఆమె తన్ను ప్రేమిస్తూన్న దనుటకు', దానిమీద గ్రుచ్చబడిన గోరులైదూ-'ఆమెను మన్మధుడు తనబాణము లైదింటితోడను వేధిస్తున్నాడనుటకు'-సూచనలు.
ఇట్టి పోటలీ సంకేతములద్వారా కామినీకాముకులు నిగూఢముగా కలిసికొని విహరించగలవారు అవుతారు.
వస్త్ర సంకేతములు
నాగరకులు తాము ధరించే దుస్తుల ద్వారాకూడ తమ మనోభావాలను సాంకేతికంగా వెల్లడించే స్వభావం కలవారై ఉంటారు. భాషాసంకేతములకంటె వస్త్రసంకేతములు నిగూఢములైనవి. ఏమంటే ఇచ్చట తనపని తానుచేసి కొంటూ తాను ధరించిన వస్త్రంద్వారా తనమనోభావాన్ని వ్యక్తంచేయడం జరుగుతుంది. కొన్నిచోట్ల కామినీ కాముకులు యీవస్త్రాలను ఒకరియొద్దకొకరు పంపడంకూడజరుగుతుంది.
తన యింటికి వచ్చిన ప్రియునకు నిగూఢంగా నేను మదనునిచే మిక్కిలి వేధింపబడుతున్నాను. అతడు నా మనస్సును చాలారకాలుగా గాయపరచాడు. ఇకనేను తాళలేను-అని సూచించడానికి చిల్లులు పడిన (చిరుగులు కాదు) వస్త్రము సంకేతముగా చెప్పబడినది.
తన చిన్ననాటి ప్రియురాలు, ఇప్పుడు పరవనిత అయిన యువతి తాను వారియింటికి ఏదో పనిమీద వెళ్ళి కూర్చున్నపుడు 'చిల్లులు పడిన వస్త్రాన్ని ధరించి తనయెదుట సంచరించడం జరిగితే' ఆమె తన్ను ప్రేమిస్తూ తన పొందుకై తహతహ పడుతూన్నదని గ్రహించాలి.
ఉదాహరణకోసం పరవనిత అనిచెప్పడం జరిగిందేకాని, ధర్మబద్ధంగా వివాహం చేసికొన్న భార్యకూడ అత్తమామలయొక్క, ఆడుబిడ్డలయొక్క, ఇతర జనంయొక్క సమక్షంలో కూర్చున్న భర్తతో తన మనస్సులోని సంగమాశయాన్ని చెప్పడానికి సిగ్గుపడ్డదై ఈ వస్త్ర సంకేతాన్ని అవలంభింపవచ్చును.
ఆలుమగలు ఇద్దరు మాత్రమే యింటిలో నివసిస్తున్నవారైనప్పుడుకూడ ఆ యువతి సిగ్గుచేత తన మనస్సులోని కోరికనునోటితో చెప్పలేనిదై పతియెదుట యీ వస్త్రాధారణా సంకేతాన్ని అవలంభించ వచ్చును.
'చిల్లులుపడిన వస్త్రం' మన్మథునిచే పీడింపబడుతూన్నాను, అతడు నా మనస్సును తూట్లు తూట్లుగా గాయపరచాడు-అనడానికి సంకేతమై యున్నదనుటయే ప్రధాన విషయంకాని, పరవనితయే కావలెనన్న నియమంలేదు.
మిక్కుటమైన ప్రేమను సూచించడానికి-ఎఱ్ఱని వస్త్రము సాధారణ ప్రేమకు పసుపుపచ్చని వస్త్రము, విరక్తి సూచనకు కాషాయ వస్త్రము సంకేతములై యున్నాయి. అట్టి వస్త్రాలను ధరిం చుట, లేక పంపుట జరిగినప్పుడు-కాముకులు ఆ వస్త్రాలను ధరించినవారు లేక పంపినవారు తమయందు మిక్కిలి ప్రేమకలవారై యున్నారని, కాషాయ వస్త్రములనుబట్టి విరక్తి చెందినారని గ్రహించాలి.
'చినిగిన వస్త్రము' వియోగమునకు సంకేతము, ఆ చినిగిన వస్త్రమే చిరుగులు దారముతో కుట్టబడినదై యున్నప్పుడు వియోగానంతర సంయోగమునకు సంకేతమైయున్నది.
అలా చినిగిన వస్త్రము ఒక్కటే ధరించబడినప్పుడు అది ధరించిన వారియొక్క స్థితిని మాత్రమే వెల్లడిస్తుంది, అలాకాక, చినిగిన వస్త్రాలను రెంటిని తెచ్చి, వాని చిరుగులనుకుట్టి రెంటిని ధరించుట—
'మనం చిరకాల వియోగ భాధను అనుభవించాము. కాని నేడు కలిసికొనే అవకాశం లభించింది. ఈ వియోగములో నేను ఎలా బాధపడ్డానో నీవుకూడ అలాగే బాధపడ్డావు. నాలాగే నీవుకూడ సంయోగానికై తహతహపడుతూన్నావు. ఇది నేను గుర్తించేను—అని ఉభయుల స్నేహాన్ని సూచించడానికి సంకేతమైయున్నది.
మిగిలిన సంకేతాలకంటె యీ వస్త్రధారణా సంకేతాలు అల్ప భావాన్ని వెల్లడిస్తూ పరిమితమైన కార్యాన్ని సానుకూలపరచేవై యున్నప్పటికి, చిరకాలానికి కలిసికొన్న ఆలుమగల మనస్సులమీద యీ సంకేతాలు తేనెజల్లులు కురిపిస్తాయి.
తాంబూల సంకేతములు
పరమ నాగరకులైనవారు వెనుకటి సంకేతాలనేకాక తాంబూల సంకేతాలనుకూడ వుపయోగిస్తారు. యీ సర్వ సంకేతాలకు ప్రియుడు లేక ప్రియురాలు పరకీయంగా ఉన్నప్పుడే ఉపయోగం అనుకొనడం పొరపాటు. ఆలుమగలుకూడ తమ మనోభావాన్ని నోటితో చెప్పడంకంటె, యీ సంకేతాలద్వారా తమ మనస్సులోనిభావాన్ని వెల్లడించి