నాగర సర్వస్వం/మంగళాచరణము

మంగళాచరణము


ఎవ్వని అనుగ్రహమువలన మదవతియై మనోహరమైన రూపము కలదైన యువతి తనంతతానై పతిని కౌగలించుకొనడం - తానానందించి అతనిని ఆనందింప జేయడం జరుగుతూ వున్నదో - ఆ పూవిలుకానికి, సొగసులుచిందే శరీరంతో సుందరులకెల్ల సుందరుడై వెలయువానికి మన్మధునకు నమస్కారము.

ఈ శాస్త్రము యొక్క అవసరము - ప్రయోజనము :

లోకంలో ఎన్నో కామశాస్త్ర గ్రంథాలున్నాయి. కాని వానిలోకొన్ని అన్యభాషలలోఉంటే, కొన్ని సులభంగా తెలియడానికి వీలులేని కఠిన శైలిలో వ్రాయబడ్డాయి. కొన్ని గంభీరమైన శాస్త్ర విషయాన్ని సమగ్రంగా చెప్పక కొంతవరకూ మాత్రమే చెప్పి ఊరకొన్నాయి. అందుకే పద్మశ్రీ అనే బౌద్ధుడు అందరకు తెలిసికొనడానికి వీలైన శైలిలో ప్రాచీన కామశాస్త్రాలలోని లోపాన్ని పూరిస్తూ ఈ నాగర సర్వస్వం రచించాడు. ఈగ్రంథం కేవలం కామాన్ని మాత్రమే సాధించి పెడుతుందని ఎవరైనా అనుకొంటే అదివారి అజ్ఞతను వెల్లడించుకొనడమే అవుతుంది. ఇది ధర్మాన్ని - అర్థాన్ని - కామాన్ని మొత్తం త్రివర్గాలను సాధించిపెట్టే సద్గ్రంథం. ఈకారణంచే పండితులు దీనిని ఆదరంతో చూచెదరుగాక ! అని విన్నవించు కొంటున్నాను.

కామం అన్నది సర్వప్రాణి సహజమైనది. అది నేర్చుకోకుండానే అందరకు అలవడుతుంది. అట్టి కామానికికూడ ఒక గ్రంథం, ఒక శాస్త్రం అవసరమా ? అన్నప్రశ్న కలగడం సహజం.

కాని తగినంత విజ్ఞత లేనివారికిమాత్రమే పై విధమైన ప్రశ్న ఉదయిస్తుంది. విజ్ఞత కలవాడెవ్వడూ అలాంటి ప్రశ్నకు తావీయడు. ఏమంటే-లోకంలో ఆవులమంద మధ్యలో ఆఁబోతు ప్రబల కామంతో విహరించడం చూస్తున్నాముకదా ! " నేను నాగరకుఁడను, ఏ విష యాన్నైనాసరే! నేను లలితంగా సుందరంగా ఉపాసిస్తాను."- అని చెప్పుకొనే మానవుడు కామవిషయంలో మంచి శాస్త్రగ్రంధాలు చదువక—చిత్రచిత్ర రతిక్రీడావిధానాలు— ఉపచారవిధానాలు తెలిసికొనక కాంతలతో కాముకుడై విహరిస్తే— వాని విహారానికి, ఆ ఆబోతు విహారానికి తేడా ఏముంటుంది!

అందుచే మానవుడు తన నాగరకతా లక్షణానికి అనుకూలమై సుందరమైన సంవిధానంలో కామాన్ని ఉపాసించాలి—అనుభవించి ఆనందించి, ఆనందింపజేయాలి—అంటే శాస్త్ర గ్రంథాలు చదవడం అవసరం. అందుకొఱకే ఈ గ్రంధం రచింపబడుతూన్నది.

వయస్సులోని సొగసుకత్తె మదవతియై అధిక కామంకలదై మిక్కిలిగా బాధపడుతూ ఉన్నప్పుడు ఆమెయందు దయగలవాడై, స్వార్థరహితుడై పురుషుడామెకు పూర్ణమైన తృప్తిని కలిగించగలిగితే–వానికి ఈ పుడమియే స్వర్గం అవుతుంది. తనవల్ల అలా తృప్తిపొందిన పడతిచే ఆ పురుషుడు నిరంతరం ఆరాధింపబడుతూ స్వర్గసౌఖ్యాలను ఈ పుడమియందే అనుభవింపగలవాడవుతాడు. అయితే అలా కామార్తయైన వనితయొక్క భావాన్ని గుర్తించి ఆమెను కలిసి తాను తృప్తిపొంది ఆమెకు తృప్తి కలిగించడానికి మంచి శాస్త్రగ్రంధాలు చదివి వాని ఎఱుక సంపాదించడం అవసరం.

అలా కామంతో బాధపడే పడతి పరవనిత అయినప్పటికి ఆమెను కలిస్తే పురుషునకు పుణ్యమే లభిస్తుంది, కాని పాపం కలుగదు. అట్టి వనితను కలియడానికి పాపభీతితో నిరాకరిస్తే పాపంకలుగుతుంది. మహాభారతంలో కామాంతురయై స్వయంగా (తన ప్రయత్నం ఏమీ లేకుండా) కోరివచ్చిన వనితను తిరస్కరించి ఆమెను కలియనిరాకరించిన పురుషుడు దేహాసానమున నరకానికి చేరుకొంటాడని, 'వాని నిటూర్పులు సోకినవానికల్లా పాపం అంటుతుందని చెప్పబడ్డది.[1] అందుచే కామపీడితయై వలచి వచ్చిన వనితను ఇహలోక సుఖంకొఱకు కాకపోయినా పరలోక సుఖంకొఱకైనా తీరస్కరించకూడదు.

మరియొక విషయం- కామ పీడితయై తన భార్యయే తన సన్నిధికివస్తే ఆమెనుచూచి తాను కామానికి వశంకాకుండా ఆమెకు నిత్య తృప్తిని కలిగించే పురుషుడుకూడ దేహావసానమున ఉత్తమ లోకాలకు చేరుకొంటాడనికూడ చెప్పబడ్డది.

స్వయంగా వలసి వచ్చిన వనితను చూచినప్పుడు పురుషుని మనస్సులో ఉత్కటమైన కోరిక ఉదయిస్తుంది. అలా పురుషుడు ఉత్కటమైన కోరిక కలవాడైనప్పుడు ఆ వనితకంటెముందు తానే తృప్తిచెంది తరువాత ఏమియు చేయలేనివాడవుతాడు. అందుచే అతడు తన కోరికను నిగ్రహించుకొని– అంటే తాను ఒక రకంగా మానసికంగా కామరహితుడై ఆమెను కలిసినప్పుడు మాత్రమే ఆమెకు తృప్తికలిగించగల వాడవుతాడు. కాంతా పరితృప్తికై ఇట్టి నిగ్రహాన్ని అవలంబించే వానికి ఉత్తమ గతులు కలగడంలో ఆశ్చర్యంలేదు. అందుచే కామ శాస్త్రాలన్నవి ఎంతమాత్రమూ నిందింపదగినవి కావు.

నాగరసర్వస్వం అనబడే ఈ కామశాస్త్రాన్ని చక్కగా చదివి అచరణలోపెట్టి ఎవరైనా ధనధాన్యాదికాన్ని సంపాదించదలిస్తే అవి వారికి సులభంగానే లభిస్తాయి. అంతేకాదు. ఈ శాస్త్రంలో చెప్పబడ్డ విషయాలయందు శ్రద్ధకలిగి యత్నించేవారికి పుత్రుడు జనించాలని కోరిక ఉంటే పుత్రుడు, పుత్రిక జన్మించాలన్న కోరికఉంటే పుత్రిక జన్మిస్తారు.

మిక్కిలి కోరికతో తనవద్దకు వచ్చిన మదవతియైన వనితను పురుషుడు శాస్త్రము వివరించిన విధానములో కలిసి ఆమెయొక్క యోని యందు బీజవ్యాసం (వీర్య విసర్జన) చేస్తే ఆమె అరమోడ్పుకనుగవతో పరవశయై మిక్కిలిగా ఆనందించినదై ఆ ఫురుషునకు తన శరీరాన్నే కాదు తనయొద్దనున్న ధనాన్నికూడ కొల్ల బెట్టేది అవుతుంది. అందుచే ఇహముపరము చెడకుండ కాపాడుకోవాలనుకునేవారు కామశాస్త్ర గ్రంథాలను అభ్యసించితీరాలి. అసలు ఈలోకం మెక్షాన్నిమాత్రమే ఆరాధించే ముముక్షువుల వల్ల వృద్ధిచెందలేదు, వృద్ధిచెందదుకూడ. ధర్మము, అర్ధము, కామము–అనబడేత్రివర్గాన్ని ఉపాసించే వారివల్ల లోకం వృద్ధిచెందుతుంది. ఈగ్రంధము ప్రధానంగా కామాన్ని అప్రధానంగా ధర్మార్థాలను వివరించేదై వున్నది. అందుచే పండితు లెవ్వరూ దీనిని అదర రహితములైన దృక్కులతో అవలోకింపకుందుగుగాత! అని వేడుచున్నాను.

♦ ♦ ♦ ♦ ♦

ఏమయ్యా! నీవుచూస్తే బౌద్ధుడవు, సన్యాసివికదా! నీకు కామాన్నిగూర్చి వివరించే గంధరచనదేనికి? అన్న శంకగూడ కలగడం అసహజం కాదు. ఇదేదో బౌద్ధధర్మానికి వ్యతిరేకమైనపని నాచే ఆచరింప బడుతూ ఉన్నదనికూడ అనిపిస్తుంది.

ధర్మము-అర్ధము-కామము-అనేవి లోకోపకారక విషయాలేకాని లోకానికి అపకారం కలిగించేవికావు. విద్వాంసులు లోక కల్యాణానికై శ్రమించి ఆనందించేవారై ఉంటారు. అందుచే ధర్మముతో అర్ధముతో కూడినదై కామాన్ని వివరించే యీ శాస్త్రరచన వల్ల నాకు కలిగే అపకీర్తి ఏమీలేదు. యీ విషయాన్ని బాగా మధించి ఆలోచించినమీదటనే నేను గంటంపట్టేను.

లోకంలో ప్రాణుల కెవరైనా ఏవిధంగానైనా ఉపకారంచేస్తే- అది నన్ను పూజించి గౌరవించడంగాను, ఏ ప్రాణికైనా అపకారం ఎవరైనాచేస్తే అది నా పరాభంగాను భావించే స్వభావం కలవాడను నేను. నా మతంకూడ అట్టిదే. నాయొక్క సుఖదుఃఖాలు లోకంలోని ప్రాణివర్గమందు నిహితులై ఉన్నాయి,

అందుచే ప్రాణివర్గానికి సుఖించే విధానాన్ని విశదీకరించే నాయీ నాగర సర్వస్వరచనం నాకూ, నామతానికీ ఉపకారకమైనదేకాని, విరుద్ధమైనదీ, అపకారం చేసేది కాదు.


★ ★ ★

  1. కామార్తాం స్వయ మాయాతాం యోనభుంక్తే నితంబినీం
    సోవశ్యం నరకం యాతి తన్నిశ్శ్వాస హతోనరః :