నాగర సర్వస్వం/భాషా సంకేతములు
కూడ సువాసనాభరితమై వుండునట్లు చూచుకొనాలి. నోటియెక్క దుర్వాసనను హరించి సువాసన కలిగించే ద్రవ్యాలను, చంకలయందేర్పడే చెమట వాసనను హరించే సామర్థ్యం కల ద్రవ్యాలనుకూడ వారు వుపయోగించాలి. మంచి సువాసనగల అగరువత్తులను అత్తరులను వారువుపయోగిస్తూ వుండాలి. ఇపన్నీ నాగరకతా లక్షణానికి మెరుగులు దిద్దుతాయి.
భాషా సంకేతములు
నగరాలలో నివసించే చతురులై స వనితలు పురుషుని యందెన్ని గుణాలు, ఎన్నిరకాల కళానైపుణ్యాలు వున్నాసరే - తామొక వక్రోక్తిని, ఒక గూఢార్ధాల్ని, ఒక సంకేతార్ధాన్ని చెప్పినపుడు గ్రహించలేనివాడైతే తిరస్కరిస్తారు. అలాంటి పురుషుణ్ని వారు వాడిపోయిన పూలదండలా విడిచి పెడతారు. వారి గూఢార్ధ వాక్యాలు ఎలా ఉంటాయో తెలిసికొనడానికి ఒక ఉదహరణం.
శ్లో॥ వాణిజ్యేన గతన్సమే గృహపతి ర్వార్తాపి సశ్రూయతే
ప్రాతస్తజ్జననీ ప్రసూతతనయా జామాత్వగేహంగతా
బాలాహం నవయౌవనా నిశకథం స్ధాతవ్యమస్మిన్‌గృహే
సాయం సంప్రతి వర్తతే పధికహేస్థానాంతరం గమ్యతాం
ప్రయాణ సాధనాలు లేని ప్రాచీన కాలంలో ప్రయాణం కాలినడకనే సాగించవలసి వచ్చేది. ఎక్కడ చీకటిపడితే అక్కడ ఎవరియింటనో తలదాచుకొని రాత్రివేగించి తిరుగప్రయాణం చేయవలసిఉండేది.
అలాంటి వెనుకటి రోజులలో ఒక యువకుడైన బాటసారి సాయంకాలనికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఈ రాత్రి ఎక్కడ గడిపెదా అన్న ఆలోచనలో ఉన్నాడు. అలా ఆలోచిస్తూ అతడొక యింటినడవలో అడుగుపెట్టాడు. ఎవరో వచ్చిన అలికిడివిని ఆ యింటిలోనుండి ఒక మదవతియైన నవయువతి బయటకువచ్చి నడవలో నిలచియున్న నవయువకుడైన బాటసారిని పరికించిచూచింది. చూచీ చూడ గానే ఆమె-అతడెవరో బాటసారి అనీ, రాత్రిగడపే ఉద్దేశంతో వచ్చాడని గ్రహించింది. అయితే అతని రూపం చూచినమీదట ఆమెలో ఏవో వింత ఆలోచనలు రేకెత్తాయి. ఆమె పల్లెపట్టున నివసిస్తూవున్నా నాగరకతనెరిగిన యువతి. అందుచే తనకోరికను స్పష్టంగా చెపితే ఎవరైనా గ్రహిస్తారనుకొని ఇలాఅన్నది.
“ఏమయ్యా ! నీవుచూస్తే బాటసారివిలా వున్నావు. సాయంకాలం అయింది. చీకటి పడుతూన్నది. కనుక ఇక్కడ తలదాచుకొందామని వచ్చివుంటావు. కాని ఇక్కడ నాపరిస్థితి నీకు తావియ్యడానికి అనుకూలంగాలేదు. ఏమంటావా ! నా భర్త వర్తకం చెయ్యడానికి దూరదేశాలకు వెళ్లేడు. ఎక్కడ వున్నాడో ఎప్పుడు వస్తాడో అన్న వార్తైనా తెలియదు. ఇక యింటిలో పెద్దదిక్కుగా వున్న అత్తగారు కూడ ఈ రోజు వుదయమే కూతురుకు పురుడువచ్చినదన్న వార్తరావడంతో అల్లుని యింటికి వెళ్ళింది. నన్ను చూస్తున్నావుకదా! నేను నవయువతిని. ఒంటరిదానను. అందుచే ఈ రాత్రి నీవు మాయింటిలో ఎలా గడుపుతావు? నీవు వేరొకచోటుకు వెళ్ళడం మంచిది" - అన్నది.
"నా భర్త ఊరిలోలేడు, అత్తగారుకూడలేదు. నేను యువతిని భర్త చిరకాలమై దేశాంతరం వెళ్ళినందున కామార్తనై వున్నాను. ఈరాత్రి యిచ్చట వసించి నన్ను స్వేచ్ఛగా అనుభవించు”- అన్నదే ఆమె మాటలలోని గూడార్ధం.
కాని ఆపథికుడు తెలివిలేనివాడై - ఆమె మాటలలోని సంకేతం తెలియనివాడై- వీలు లేదంటున్నదికదా అని వెనుదిరిగి వేరొకచోటికి వెడితే ఆ పడతియొక్క తిరస్కారానికి పాత్రుడుకాక తప్పదు.
నాగరకులైన స్త్రీలయొక్క, మాటలను అర్ధం చేసుకొనడానికి ప్రత్యేకమైన తెలివివుండాలి. ఆ తెలివిలేనివాడు పురుషుడెంత యువకుడైనా ఎంత సొగసుకాడైనా యువతులచే పరిత్యజింపబడతాడు. అందుచే నాగరక వనితల అనురాగాన్ని సంపాదించగోరే పురుషుడు వివిధ సంకేతార్ధాలను వెల్లడించే ప్రాచీన కామశాస్త్రాలను చక్కగా అభ్యసించాలి. నాగరక సంకేతాలను వాని అర్ధాలను వివరించే శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. వానియందు పరిశ్రమచేస్తే ఎట్టి సంకేతార్ధమైనాసరే వివరంగా తెలిసికొనగల జ్ఞానం అనవడుతుంది.
"మా కెందుకీబెడద" అని ఎవరూకూడ సంకేతశాస్త్రాల విషయంలో నిరాదరణ చూపకూడదు. ఎందువల్లనంటే-అన్ని గౌరవాలు లభించినా అందగత్తెయైన నాగరక యువతి తిరస్కరించినపుడు పురుషుడు పొందే దుఃఖానికి మేర ఉండదు. అట్టి యువతీ తిరస్కార రూపమైన దుఃఖం కలుగకుండ వుండాలంటే ప్రాచీన సంకేత శాస్త్రాలయందు పరిశ్రమచేయడం అవసరం. అందుచే ఇక్కడ స్త్రీలయొక్క భాషా సంకేతములను-అంగ సంకేతములను-పోటలీ సంకేతములను-వస్త్ర సంకేతములను-తాంబూల సంకేతములను సంక్షేపంగా వివరించడం జరుగుతూన్నది. ఈ వివరణ వలన పురుషునకు నీ యొక్క సంకేతార్ధాన్ని విడదీసి తెలిసికొనగలశక్తి అలవడుతుంది. ఆసక్తితో అతడు ఇందులో చెప్పబడని క్రొత్త సంకేతములనుగూడ విడదీసి అవగాహన చేసికొనగల వాడవుతాడు.
పురుషులకు ఫలము. స్త్రీకి పుష్పము సంకేతముమై ఉన్నాయి, ఎవరి కులమునైనా ప్రశ్నించి తెలిసికొన దలచినపుడు "అంకురము" (మొలక) సంకేతముగా వుపయోగింపబడుతుంది. ఇక బ్రాహ్మణుని విషయంలో దానిమ్మపండు-క్షత్రియుని విషయంలో పనసపండు సంకేతములై వున్నాయి. అరటిపండు వైశ్యునకు, మామిడిపండు శూద్రునకు సంకేతాలు.
ఇలా కేవలం సంకేతాలను చెప్పుకొంటూ వెడితే వానిని వుపయోగించే విధానం తెలియక కొంతమంది పెదవి విరుస్తారు. అందుచే వాని వుపయోగ విధానంగూడ అల్పంగా చెప్పబడుతూన్నది.
అత్తగారు-బావలు-మరదలు-ఆడబడుచులు-తోటికోడల్లు-ఇరుగు పొరుగువారు మొదలైన జనంయొక్క కట్ణడులలో వుంటూకూడ సంకేతశాస్త్రమునందు నిపుణ అయిన యువతి తాను కోరినవానిని కలిసి ఆనందించగలదవుతుంది. ఆమె వీరందరి యెదుటనే తన రహస్యం ఎరిగిన చెలికత్తెతో లేక దూతికతో-"ఏమే! నాకు ఏమీ తోచడంలేదు. నేనలాతోటలోనికి పోతున్నాను. ఈవేళ" దానిమ్మపండు" తినాలని వున్నది. బజారుకుపోయి మంచి దానిమ్మపండు అలా తోటలోనికి తెచ్చిపెట్టు"-అని చెప్పడం జరిగితే-అక్కడ వున్నవారు ఆమె ఏదో దానిమ్మపండు తినాలనుకొంటోంది-అని తలుస్తారేకాని-తనకు ప్రియుడైన బ్రాహ్మణ యువకుని తీసికొని రమ్మంటూ వున్నదని, వానితో కలిసి ఏకాంతంగా తోటలో విహరించే తలపుకలదై ఉన్నదనీ, భావించలేరు.
ఇలా వివిధవిధానాలలో ఈ సంకేతాలను కాముకులు వుపయోగిస్తూంటారు. సంకేతాలు ఇవే అయి ఉండాలన్న నియమంకూడలేదు. శాస్త్రంలో ఈ సంకేతాలు చెప్పబడ్డాయి. కాముకులు క్రొత్త సంకేతాలను సృష్ఠించుకొంటూ వుండడంకూడ లేకపోలేదు. ఏసంకేతమైనా పరస్పరం అవగాహనచేసికొనడానికి వీలుకలదై వుంటే బాధలేదు.
ఒకచోట ఒక వేదపండితుడు భోజనంచేసిన తరువాత శిష్యుని పిలచి-ఏమిరా! బంధువును తీసికొని వచ్చేవా? అన్నాడు.
ఆ శిష్యుడు "లేదండి"-అని సమాధానం చెప్పి పరుగెత్తిపోయి ఒక పావుగంటకు తిరిగివచ్చి ఒక పొగచుట్ట గురువుగారి యెదుట వుంచాడు.
ఆ పండితుడు-"అమ్మయ్య"-అని చుట్టనోటబెట్టి నిప్పు ముట్టించాడు. ఎదుట వున్నవారు-ఏమండీ! మీరు బంధువును తెమ్మంటే శిష్యుడు చుట్టతెచ్చాడేమిటి? అని ప్రశ్నిస్తే ఆ పండితుడిలా అన్నాడు.
"బాబూ! "బంధువు" అంటే "చుట్టము" అనికదా అర్థము! "చుట్టాలు, చుట్టములు, చుట్టలు"-ఇవన్నీ సమానార్ధకాలు (రూపాంతరాలు) అందుచే కొంత గూఢంగావుంటుందని "బంధువును తెమ్మ"ని నేనన్నాను. ఈసంకేతానికి శిష్యుడు అలవాటుపడ్డవాడే అయినందున "నేనుకోరే పొగచుట్టను తెచ్చిపెట్టేడు. చదువుకొన్న పండితుడను. అందరియెదుట, చుట్టతెమ్మని ఎలాచెప్పను. అందుచే అలాచెప్పేను. అని నవ్వేడు.
కాగా లోకంలో సంకేతాలు ఈ తీరునలో ఉంటాయని తెలిసి కొనాలేకాని నియతంగా అవేసంకేతాలు వుంటాయని తలంపకూడదు.
రాజపుత్రుని విషయం 'విదియ చంద్రుడు' సంకేతంగా వాడబడతాడు. పుడమినేలే ప్రభువును నీడనిచ్చే పెద్ద మేఘము సంకేతమై యున్నది.
"ఏమే! చెలీ! నిన్న చెఱువుకు వెళ్లేను. అక్కడ పొదరింట కూరుచున్నాను. ఇంతలో ఒక పరమ సుందరమైన మేఘం ఆకాశం మీద కనుపించింది. ఆ మేఘంయొక్క నీడ చెఱువుమీద, పొదరింట మీద, నామీదకూడ పడ్డది. ఆ మేఘచ్చాయలో ఉన్న సమయం తక్కువే అయినా నా కేమిటో విలక్షణమైన ఆనందం కలిగింది. ఆ మేఘాన్ని తలచుకొంటే ఇప్పుడుకూడ మనస్సు పరవశం అయిపోతూన్నది మళ్ళా ఆ మేఘచ్చాయలో ఆనందించాలని వున్నది."- ఇత్యాదిగా ప్రభువుతో తాను అనుభవించిన అనందము, తిరుగ అనుభవించాలన్న కోరిక 'మేఘచ్ఛాయను' అడ్డంగా పెట్టుకొని నెరజాణ అయిన నాగరిక కామిని జంకుబౌంకులు లేకుండా వల్లడిస్తుంది.
దుష్టమైన వంశంలో పుట్టిననాని విషయంలో నల్లని పుష్పము సంకేతముగా వుపయోగింపబడుతుంది.
దుష్కులంలో పుట్టినవానిని నాగరకవనిత కామించదుకచా! వాని విషయంలో ఒక సంకేతం ఎందుకు? అనిపిస్తుంది. కానీ దాని అవసరంకూడ వున్నది.
సాధారణంగా పురుషుడు తన భార్యను ఎవడో కామిస్తున్నాడని తెలిసినప్పుడు వానినెత్తురు కళ్ళజూచే వరకు శాంతించలేని తత్త్వంకల వాడైవుంటాడు. ఒక నాగరక యువతి ఒక దుష్టుని ప్రేమించకపోవ చ్చును. కాని ఒకదుష్టుడామె పొందుగోరి ఉచ్చులు పన్నవచ్చునుకదా ఆ విషయం ఆమెకు ఇష్టంకాదు. ఆలాఅని భర్తతో చెబితే పెద్దరగడ అవుతుంది. అందుచే ఆమె తనకు ఇష్టంకానిదైనప్పటికి ఇట్టి విషయాలను గూఢంగా దాచే స్వభావంకలదై వుంటుంది. అందుచే దుష్టునకు కూడ సంకేతం అవసరం ఆయింది.
"చెలీ! చెరువుగట్టుమీద ఎప్పుడు చూచినా ఏవో నల్లని పువ్వులే వుంటాయి. ఆ పువ్వులంటే నాకు మిక్కిలి అసహ్యము. కాని ఎప్పుడు చెరువుకువెళ్ళినా అవి కంటబడుతూనేవున్నాయి. ఇత్యాదిగా ఈ సంకేతం. వినియోగింపబడుతుంది.
సామంత రాజుపుత్రుని విషయంలో 'సరస్సు' సంకేతంగా చెప్పబడ్డది.
“నీవు మేఘచ్చాయనుచూస్తే ఆనందిస్తావు. నాకు సరోవరాన్ని తిలకించాలని ఉంటుంది"-ఇత్యాదిగా పుడమినేలే రాజును ప్రేమించిన వనితతో సామంత రాజకుమారుని పొందుకై తహతహపడే తరుణి సాంకేతికంగా మాటాడుకొనడానికి ఈ సంకేతం వినియోగపడుతుంది.
ఇక స్త్రీల విషయంలో పుష్పము సంకేతముగా వినియోగింప బడుతుందని వెనుక చెప్పబడ్డది. ఏజాతి స్త్రీ విషయంలో ఏపుష్పాన్ని సంకేతంగా ఉపయోగించాలి. అన్న విషయము వివరింపబడుతోంది.
బ్రాహ్మణ స్త్రీ విషయంలో కుంద పుష్పము. (మొల్లఫూవు) రాజపుత్రిక విషయంలో మాలతీపుష్పము, వైశ్వవనితా విషయంలో మల్లెపూవు, శూద్రవనితకు తెల్లకలువపూవు సంకేతములై వున్నాయి.
కాముకులైన నాగరక జనం ఈ సంకేతాలతో గూఢంగా తమ మనోభావాన్ని వ్యక్తంచేస్తూ వుంటారు. తాను వలచిన ప్రియురాలు ఏ దేవాలయముసకో, చెఱువుకో, ఉద్యానవనమునకో పదిమందితో కలసివచ్చినపుడు, వారందరి యెదుట తాను వెల్లడిగా మాటాడకూడదు గనుక-తన ప్రక్కనున్న స్నేహితునితో-"పూవు లన్నిటిలోను మాలతీ సౌందర్యమే సౌందర్యం. వికసించిన యీ మాలతీ పుష్పాన్ని చూస్తూంటే నాకు నిద్ర, ఆహారము అక్కరలేదు. మాలతీ పుష్పాన్ని గుండెపై ధరించి యేకాంతముగా దాని సౌందర్యాన్ని ఆలోకించే భాగ్యమే లభిస్తే నాకు లోకములో పనిలేదు. నేను సర్వాన్ని మరచి మాలతీ సౌందర్యాన్ని ఆరాధిస్తాను” - ఇత్యాదిగా ఈ సంకేతాలు వినియోగింప బడుతూంటాయి.
పెద్ద వర్తకుని కూతురు విషయంలో తామరపూవు, మంత్రి కూతురు విషయములో నల్లకలువపూవు సంకేతములై వున్నాయి. కాముకుడైన పురుషునకు తుమ్మెదయున్ను, కామినియైన యువతి 'మామిడి పూలగుత్తి' సంకేతములై ఉన్నాయి.
"ఉద్యాన వనంలోని దిగుడుబావిలో నల్లకలువపూవు ప్రక్క ఒక తామరపూవు వికసించి వుండడం నిన్నచూచేను. అవి జంటగా ఒక దానినొకటి ఒరసుకొని కదలి ఆడుతూంటే గండుతుమ్మెద ఎక్కడ నుండి వచ్చినదోకాని ఒకసారి కలువమీద, ఒకసారి తామరపూవు మీదవ్రాలి తేనె త్రాగసాగింది, యీదృశ్యం నిన్నచూచేను. ఆ గండు తుమ్మెద వ్రాలినంతనే ఆ తామరపూవు కలువపూవు ఎంతో అందంగా కదులుతూ దానికి తమ హృదయంమీద చోటిచ్చాయి". ఇత్యాదిగా మంత్రి కుమారికయొక్క విహారాన్ని పుద్దేశించి యీసంకేతాలు వుపయోగింపబడతాయి.
"వికసించిన యీ చూతమంజరి (మామిడిపూవులగుత్తి) మీద గండుతుమ్మెద వ్రాలినపుడే యీగుత్తి తుమ్మెదకై ఎదురుచూస్తోంది ఇత్యాదిగా కామినులైన స్త్రీలనుద్దేశించి చూతమంజరీ సంకేతము. కాముకులైన పురుషులనుద్దేశించి తుమ్మెదయొక్క సంకేతము వుపయోగింపబడతాయి.
ఒక కాముకు డొక వనితను కలియగోరినపుడు ఆతనితోడి కలయిక ఆమెకిష్టమైనప్పటికి -“తగిన సమయంకాదని, నీవు నన్ను కలియు టకు రావద్దని" సూచించడానికి 'ప్రాకారము' (గోడ) సంకేతముగా వినియోగింపబడుతుంది.
ఇది ముద్రారూపంలోకూడ చూపబడుతుంది. అనగా ఏదేవాలయ ప్రాంగణములోనో ప్రియుడు తన వంకకుచూచి, తనతో కలియవలెనన్న కోరికను గూఢంగా చేష్టల ద్వారా వ్యక్తపరిస్తే-తగినవెసులుబాటులేదని తలంచిన కామిని ప్రాకారముద్రను (రెండు చేతులవ్రేళ్ళను చాచి ఒకదానితో ఒకటి కలిపి గోడయొక్క ఆకారమును కల్పించుట) ప్రదర్శిస్తే ఆ కాముకుడు-ఇది తగిన సమయంకాదని, అడ్డంకులున్నాయని గుర్తించాలి.
ఇక-'నీవు రావచ్చును, నన్ను కలియవచ్చును, నీకు అడ్డములేదు అని సూచించడానికి 'అంకుశమును' (ముద్రారూపంలో కూడ) సంకేతముగా ఉపయోగిస్తారు.
చేతివ్రేళ్ళలో నడిమి వ్రేలినిమాత్రం చాచి-దానికి ఒకప్రక్కగా ఉన్న చూపుడు వ్రేలిని సగానికి మడచి ఉంచితే అది అంకుశముద్ర అనబడుతుంది.[1]
ఇట్టిదైన అంకుశముద్రాసంకేతాన్ని నాగర జనం పదుగురిలో ఉన్నప్పుడుకూడ ప్రియుని ఆహ్వానించడానికి వినియోగిస్తారు.
తన్ను కలియదగిన సమయం రాత్రివేళ అయితే దానిని తెలుపుటకు 'ఛన్నచంద్రుడు' (మబ్బుచాటు చంద్రుడు) అలాకాక పగటి భాగమే అయితే 'బాగా ప్రకాశించే సూర్యుడు'-సంకేతాలుగా వినియోగింపబడతారు.
ఈ సంకేతాలు చేతివ్రేళ్ళతో అభినయించే ముద్రలద్వారాకాని చిత్రాలద్వారాకాని ఉపయోగింపబడతాయి.
ఇక తన్ను కలియవలసిన సమయం జాములలో వచ్చినపుడు వానికి వేరే సంకేతాలు ఉన్నాయి. సూర్యోదయం మొదలు తిరుగ సూర్యోదయం అయ్యేవరకు ఉన్నకాలం 24 గంటలు కదా! ఈ కాలాన్నే ఎనిమిది జాములుగా విడదీస్తారు. అందుచే జాముఅంటే మూడు గంటలకాలం అవుతుంది.
ఈ జాములలో మొదటి జామునకు- 'శంఖము', రెండవ జామునకు-'మహాశంఖము', మూడవ జామునకు-'పద్మము', నాల్గవ జామునకు-'మహాపద్మము', ఐదవ జామునకు-'రాముడు' సంకేతాలుగా వినియోగింపబడతాయి.
ఆరవ జామునకు—'విరామశబ్దము', ఏడవ జామునకు—'ప్రవరశబ్దము', ఎనిమిదవ జామునకు—'ప్రత్యూష శబ్దము' సంకేతాలుగా నాగరజనం ఉపయోగిస్తారు.
"ఓతుమ్మెదా! విరామ సమయంలో (రాత్రి 9-00గం. దాటిన మీదట 12 గం.ల వరకు) నల్ల కలువపూవులోని మాధుర్యాలను (మంత్రికుమారికయొక్క సొగసులను) అనుభవిస్తూ-ప్రవర సమయాన్ని (రాత్రి 12 గం. మొదలు 3 గం. వరకు) కూడ అక్కడే గడపి ప్రత్యూష సమయానికి (తెల్లవారు జాము 3 గంటలు దాటిన మీదట సూర్యుడుదయించేవరకు ఉన్నకాలం) మాలతీ కుసుమం మీదకు (రాజకుమారి) వచ్చి వ్రాలిన నీ రసికత కొనియాడదగినది"-ఇత్యాదిగా ఈ సంకేతాలు వినియోగింపబడతాయి.
అంగసంకేతములు
వెనుక ప్రకరణంలో భాషాసంకేతములు వివరింపబడ్డాయి. అవి యెంత సాంకేతికంగాఉన్నా వానిని ఉపయోగించడానికి కొంతవీలుచిక్కితేకాని కుదురదు. ఏమంటే-సందర్భం ఏమీ లేకుండా-ఓతుమ్మెదా! నీ రాకకై ఈ మాలతీ పుష్పం ఎదురుచూస్తోంది.'- అనడం కుదరదు కదా! అదీకాక కేవలం ఆ భాషా సంకేతాలవల్ల కొంత పరిమితమైన
- ↑
ఋజ్వాం చ మధ్యమాల కృత్వా తన్మధ్యే సర్వమూలతః
తర్జనీం కించి దాకుంచే త్సాముద్రాంకుశ సంజ్ఞితా!