నాగర సర్వస్వం/పుష్పమాలా సంకేతము
నేను నిన్ను సర్వదా విడిచిపెడుతున్నాను—అనడానికి సంకేతమై ఉన్నది.
అలా మధ్యకు చీల్చిన తమలపాకులనే మిక్కిలి సన్నని ఎర్రదారముతో కుట్టి చుట్టచుట్టి పంపుట-'నా ప్రాణములు పోవుచున్నవి. ఒకసారివచ్చి నీవు నన్ను కలిసిన నిలచునేమో'–అనుటకు సంకేతముగా చెప్పబడ్డది.
'తమలపాకును ముక్కలు ముక్కలుగా చించి, ఆ ముక్కలను మరల సరిచేసి, పూర్వపు ఆకారము వచ్చునట్లు వేరొక ఆకుమీదపరచి వానియందు పోకలనువుంచి, వానిమధ్య నిండుగా కుంకుమపూవుపెట్టి, చుట్టచుట్టి, ఆ చుట్టపై సువాసనలుచిందే మంచి గంధము లేక గంధమువాసనగల అత్తరుపూసి పంపుట'-నాకు నీమీద వర్ణింపనలవికాని ప్రేమ ఉన్నదని చెప్పుటకు సంకేతముగా చెప్పబడినది.
ఈ సంకేతాలను వినియోగించడానికి ధనికులే కావాలన్న నియమంలేదు. సాధారణ గృహస్థులైన ఆలుమగలుకూడ యీ సంకేతార్థాలను గుర్తించినవారై వీనిని వినియోగిస్తే విచిత్రమైన ఆనందం మానసికంగా అనుభవింపగలుగుతారు.
పుష్పమాలా సంకేతము
తాము ధరించే పూలమాలద్వారాకూడ నాగరజనం తమ మనోభావాలను వ్యక్త పరుస్తారు. మంచివైన పూవులను తెచ్చి ఎఱ్ఱదారముతో దండగా గ్రుచ్చి (ఆ దారముకూడ సన్నగా కనబడునట్లు) ధరించుట—అధిక ప్రేమకు సంకేతమై యున్నది.
ఎఱ్ఱదారమునకు బదులు పసుపుపచ్చని దారము వినియోగించినచో—'నాకు నీ మీద ప్రేమ ఉన్నది' అని సాధారణమైన ప్రేమను సూచించుటకు సంకేతమై యున్నది. కాషాయరంగు దారముతో గ్రుచ్చబడిన పుష్పమాల 'విరక్తికి' సంకేతమైయున్నది. అట్టిమాల తనకు పంపబడినపుడు లేక దానిని ధరించి తన నెచ్చెలి తనయెదుట సంచరించినపుడు-దానిని పంపిన లేక ధరించిన నెచ్చెలి తనయందు విరక్తి చెందినటులు గ్రహించాలి.
ఈ సర్వవిధములైన సంకేతములు యువతీయువకుల ఆనంద స్రోతస్సులకు ఏతా మెత్తజాలినవి. ఈ సంకేతాలన్నీ ఆలుమగలలో లేక కామినీకాముకులలో ఒక్కరికిమాత్రమే తెలిసివున్నప్పుడు వీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదుకదా! అని వీనియందు నిరాదరం చూపడంకంటె వీనినితెలిసికొని పరస్పరం ప్రాణాధికంగా ప్రేమించుకొనే ఆలుమగలు వినియోగించడంజరిగితే వారనుభవించే ఆనందం యినుమడిస్తుంది.
వనితలు యీ సంకేతాలు తమకు తెలియనపుడు పతిద్వారా తెలిసికొని వినియోగిస్తే మంచిదే. కాని భర్త యీ సంకేతాలను విడదీసి చెప్పగల నిలుకడ లేనివాడైనపుడు, వారు స్వయంగా కామశాస్త్రాలను చదువనివారైనపుడు ఇవి వారికి తెలిసే అవకాశంవుండదు. అప్పుడు వారు తాము అనుభవించగల అధికానందము అనుభవించలేని వారవుతారేకాని వేరే యేదో విపత్తుకు లోనుకావడం జరుగదు.
కాని పురుషుల విషయం అట్టిదికాదు. వారు యీ సర్వసంకేతాలను ప్రయత్నించి తెలిసికొని యుండాలి. ఏమంటే, అన్నిచోటులందు కాకపోయినా, ఎక్కడనో ఎవ్వరికో అదృష్టవంతునకు సకల కళా నిపుణయై, కామశాస్త్ర సంకేతాలను సద్యస్స్ఫూర్తితో వినియోగించే నేర్పుకల పడతి భార్యగా లభించవచ్చును. అపుడామె యీ సంకేతాలను వినియోగించడం జరిగితే-వీని అర్ధాలను గ్రహింపజాలని భర్త సముచితముగా వ్యవహరింపజాలని మూఢుడు అవుతాడు. అపుడావనిత వానియందు విరక్తి చెందుతుంది. అందుచే పురుషుడు యీ సంకేతార్ధాలను గ్రహించడం చాలాఅవసరం. తన భార్యకుకూడ అతడి సంకేతాలను వివరంగా విశదీకరిస్తే పరస్పరం ఆనందించే అవకాశం ఉంటుంది. "కామీ స్వతాం పశ్యతి" అన్నారు. కాముకుడు తన మనస్సులోని భావానికి అనుకూలముగా ఊహిస్తారు. తాను ప్రేమించిన ఒక యువతి (ఆమె తన్ను ఎందుకో నవ్వితే, తన్ను చూచియే నవ్వుచున్నదనుకొనుట, పైట సరిచేసుకొంటే తన్నుచూచి సాభిప్రాయముగా ఆలా చేసినదనుకొనుట కాముకులకు సహజం. కేవలం ఇలామనస్సులో ఊహించుకొని గాలి మేడలు కట్టుకొంటూ కూర్చుంటే కలిగే బాధ ఏమీ వుండదుకాని, యదార్ధం తెలియకుండ ముందుమాటవేస్తే ప్రమాదం తప్పదు.
అలాగే ఈ సంకేత విషయాలలోకూడ—ఒక యువతి ఎందుకో తలమీద చేయి వేసుకొంటే, ఆమె తన్ను ఆరాధిస్తున్నానని అంగీక సంకేతంద్వారా తెలియజేస్తున్నదని, గుండెపై చేయి వేసుకొంటే 'నేను నిన్ను ప్రేమిస్తున్నానని సూచిస్తూ ఉన్నదని'-యీ మొదలుగా భావించడం, భావించి ముందడగు వేయడం ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. బాగా నిదానించి, ఆమె యీ సంకేతం ఎఱిగి వుండి చేస్తున్నదా లేక తలవని తలంపుగా అలా జరిగినదా, అన్న విషయం గమనించి రూఢిచేసుకొనికాని ముందడుగు వేయకూడదు. పూర్వ పరిచితులైన యువతీయువకులైతే అలా సంకోచింప నక్కరలేదు.
యువతి చేసిన సంకేతాన్ని సరిగా తెలిసికొనక తప్పుగా తెలిసికొని వ్యవహరించడం మరీ ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. కామశాస్త్ర సంకేతములన్నియు తెలిసికొన్నిటైన ఒక యువతి తనవలెనే విజ్ఞుడైన తన ప్రేమికునకు—"తూరుపు దెసగా రమ్మని చూపుడు వ్రేలిని ప్రదర్శిస్తే" ఆ యువకుడు ఆ సంకేతాన్ని తప్పుగా అర్ధంచేసికొని 'పడమరగా' ఆ యింట ప్రవేశిస్తే ప్రమాదం కలుగదా?
రత్న కుమారుడనే వాడు వెనుక ఈ విధంగానే ఒకనాగర యువతి చేసిన సంకేతాన్ని తప్పుగా అర్ధంచేసుకొని వ్యవహరించినవాడై పరాభవింపబడ్డాడని ప్రాచీన కామశాస్త్రలలో ప్రాసంగికంగా చెప్పబడ్డది. అందుచే స్త్రీ పురుషులు, విశేషించి పురుషులు శాస్త్రం విశదీకరించిన ఈ సర్వసంకేతాలను తెలిసికొని అవి తెలిసిన వారియొద్ద ఉపయోగిస్తూ-ఎవరైనా ఉపయోగించిన సంకేతార్ధాన్ని నిదానంగా గ్రహించి వ్యవహరిస్తూ వచ్చినపుడు జీవితాన్ని ఆనందకందం చేసికొన గలుగుతారు.
★ ★ ★