నవనాథచరిత్ర/పీఠిక
నవనాథచరిత్ర
పీఠిక.
ఆంధ్రవాఙ్మయమున ద్విపద కవిత్వమును జెప్పి ప్రసిద్ధినందిన వారిలో గౌరన మంత్రి యొకఁడు. ఈతని 'హరిశ్చంద్ర' ద్విపద కొంతకాలము క్రిందటనే ముద్రితమై ప్రకటింపఁబడి యుండుటచే నాంధ్రలోకమునఁ బ్రచారముఁ గాంచినది. కాని యీ నవనాథచరిత్రము కేవలశైవగాథాప్రతిపాదిక మగుటచేతనో, దేశమున ద్విపదకవిత్వమం దాదరము తగ్గుటచేతనో, గ్రంథముయొక్క నిర్దుష్టములగు వ్రాఁతప్రతులు లభింపక పోవుటచేతనో, దీని కట్టి భాగ్య మబ్బలేదు. ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమున తాళపత్ర గ్రంథ మొక్కటియే కలదు. ఇది పెక్కులేఖక ప్రమాదములతోఁ గూడియేయున్నది. మఱికొన్ని కాగితపు వ్రాఁతప్రతులు నా తాళపత్ర గ్రంథమునకుఁ బుత్రికలే యనఁదగియున్నవి. పూర్వాంధ్రకవులలోనివాఁడగు గౌరనామాత్యుని యీ గ్రంథమింకను ఖిలము గాకుండ నిలువఁబెట్టవలయు నను తలంపుతో నిప్పటికి లభించిన సామగ్రినిబట్టి యీ గ్రంథము ముద్రింపఁ బడినది.
కవివంశాదికము.
కృతికర్త యగు గౌరనమంత్రి గౌతమగోత్రజుఁడు. అయ్యల మంత్రికిని పోచాంబకును బుత్రుఁడు. భ్రమరాంబికా వరప్రాప్త విచిత్ర విమల సాహిత్య ప్రవీణాధికుండు. ఈతని తండ్రిపేరు ఎల్లమంత్రి యగునని హరిశ్చంద్రద్విపదను బట్టి కవుల చరిత్రకారులు నిర్ణయించిరి. అందు-
"సింగన మాధవక్షితిపాల మణికి
మంగళమూర్తికి మంత్రియై జగతిఁ
బొగ డొందు పెద్దన పోతరాజుకును
దగిన తమ్ముఁడు యశోధనుఁ డెల్లమంత్రి
చెట్టపట్టంగ నోచిన భాగ్యవతికి"
అని కృత్యాదిని కలదు. కాని గ్రంథాంతమున-
"మతిమంతుఁ డయ్యల మంత్రిపుంగవుని
సుతుఁడు గౌరనమంత్రి సుకవిశేఖరుఁడు" అని యున్నది.
ఇట్లు మొదటనున్న 'యశోధనుఁ డెల్లమంత్రి' యనుదానిని దిద్దుట కవకాశము లేదనియు, తుదినున్న 'మతిమంతు డయ్యల మంత్రిపుంగవుని' అనుచోట 'మతిమంతుఁ డెల్లనమంత్రిపుంగవుని' యని దిద్దుట కవకాశము కలదనియుఁ గావున నెల్లన యనియే యాతని తండ్రిపేరగుననియు వీరేశలింగం పంతులుగారు నిర్ధారణచేసిరి. నవనాథచరిత్రము తాళపత్రగ్రంథమున 'అనుజాతుం డగు నయ్యల మాంబ కూర్మి, తనయుఁడు' అనుపాఠ మొకటి కలదు. ఇదియు సందర్భశూన్యమగుటచే సంస్కరణీయమే. ఇందెల్లయ యని గాక అయ్యల (మాంబ) అనురూపమే కనఁబడుచుండుటనుబట్టి గౌరన తండ్రి పేరు 'ఎల్లయ' అనుటకంటె 'అయ్యలార్యుఁ' డనుటయే సత్యమునకుఁ జేరువయై యుండునని యాతాళపత్రగ్రంథపాఠము "అనుజాతుఁ డగు నయ్యలామాత్యు కూర్మి. తనయుఁడు" అని సంస్కరింపఁ బడినది. హరిశ్చంద్రద్విపదలోని “తగిన తమ్ముఁడు యశోధనుఁ డెల్లమంత్రి” అనునది సంస్కరింప వీలులేనిపాఠముగాఁ దలంప నక్కఱలేదు. “తగిన తమ్ముఁడు యశోధనుఁ డయ్యలార్యుఁ” అని గాని, “తగిన తమ్ముని యశోధను నయ్యలార్యుఁ జెట్టపట్టంగ నోచిన భాగ్యవతికి” అని గాని సంస్కరించుట దుస్సాధ్యము కాదు. ఈతఁడు రచించిన 'లక్షణదీపిక' యను గ్రంథములో-
"మంత్రిచూడామణేస్తస్య సోదర స్యాయమ ప్రభోః
గౌరనాఖ్య ఇతిఖ్యాతః తనయో నయకోవిదః"
అని యున్నపాఠమును బట్టి చూచినను 'అయమప్రభోః' అనునది 'అయలప్రభోః' అనుదానికి వ్రాయసగాని పొరపాటయి యుండు ననియు, 'ఎల్లయ' అనుదానిని సూచించునది గాలేదనియుఁ దలంపనగును. ఈ గ్రంథముననే ప్రథమపరిచ్ఛేదాంతమునఁ గల యీ క్రింది గద్య యీ విషయమును మఱింత స్పష్టపఱుచుచున్నది:-
"ఇతి కవినుత వితరణ విజితపారిజాత పోతనామాత్య సహజాత చాతుర్యగుణాభిరామ శ్రీమదయ్యలుమంత్రిశేఖర గర్భరత్నాకర శ్రీ గౌరనార్య విరచితాయాం లక్షణదీపికాయాం ప్రథమః పరిచ్ఛేదః॥" ఇట్లిచ్చట అయ్యలుమంత్రి యనియే వ్రాఁతలోఁగూడ స్పష్టముగఁ గనఁబడుచున్నది. కావున గౌరనమంత్రి తండ్రిపేరు అయ్యలామాత్యుఁ డనియే నిశ్చయింపవచ్చును.
కవికాలము:
ఈ అయ్యలామాత్యుఁడు సింగయమాధవ క్షితిపాలునకు మంత్రియైన పోతరాజునకుఁ దమ్ముఁడు. సింగయమాధవ క్షితిపాలుఁడు 15-వ శతాబ్దిని రాచకొండ నేలిన రేచర్లవంశాంబుధి పూర్ణచంద్రుఁడగు సర్వజ్ఞ సింగమనాయని కొడుకనియు, నాతనియొద్ద మంత్రిగా నున్న పోతరా జీగౌరనపెదతండ్రియె యనియు, నీతనిచే రచింపఁబడిన లక్షణదీపిక యందలి యీ క్రింది శ్లోకములనుబట్టి తెలియుచున్నది:"అస్తి ప్రశస్తా వనిపాలమౌళీ రత్నావళీ రంజిత పాదపీఠః
రేచర్ల వంశార్ణవ పూర్ణచంద్రో మహాబలస్సింగయమాధవేంద్రః
ఆసీత్తస్య మహామాత్యః స్వామి కార్య ధురంధరః |
మన్త్రి మి? (పో) తరాజ ఇతిఖ్యాతః రాజనీతియుగన్ధరః |
ఈతనికి పోతరాజు మంత్రిగా నుండెనని వెలుగోటివారి వంశచరిత్రములో నుదాహరింపఁబడిన "శ్రీమతో మాధవేంద్రస్య రాజ్యాంగై కధురంధరః | మంత్రీ(శ్రీ)పోతనామాసీత్ సర్వశాస్త్ర విశారదః!” అను శ్లోకమువలనఁ గూడఁ దెలియవచ్చుచున్నది. సర్వజ్ఞసింగ భూపాలుఁడని పేరువడసిన రావుసింగ మహీపాలు నాస్థానమునకు శ్రీనాథుఁడు పోయినట్లును, నాతఁడు మహావిద్వాంసుఁ డగుటచే నాతని మెప్పించువిషయమున నీతఁడు కొంత జంకుగలవాఁడై 'దీనారటంకాల' పద్యమును జెప్పి, రాజసభాదేవతయగు శారదాంబను స్తుతించె ననియుఁ బ్రసిద్ధి కలదు గదా! అట్టి సర్వజ్ఞుని కొడు కగు నీ సింగయ మాధవనృపాలుఁడు గూడ గొప్ప పండితుఁడేయై శాలి. శక, 1349 సంవత్సరము క్రీ. శ. 1427) న రామాయణమునకు “రాఘవీయ' మను నొక టీకను వ్రాసెనని యాతని భార్య రచింపించిన యొక శాసనమునందలి యీ క్రింది పద్యము వలన స్పష్ట మగుచున్నది:-
"శాకాఖ్యే నిధివార్ధిరామ శశిగేప్యబ్దే ప్లవంగే శుభే
మాసేప్యాశ్వయుజే రఘూద్వహపదే యో రాఘవీయాహ్వయామ్
టీకామర్థవటు ప్రబోధఘటనామాణిక్య పుష్పాంజలిం
కృత్యా రాజతి రావుమాధవనృపో రామాయణస్య శ్రియే. ”
ఇట్లు శ్రీ. శ. 15-వ శతాబ్ది తొలిభాగమున నున్న సింగయమాధవ నృపాలునియొద్ద మంత్రిగా నున్న పోతరాజు ననుజుఁ డగు నయ్యలామాత్యుని కొడుకగు గౌరస 15-వ శతాబ్ది పూర్వార్ధమున నుండె ననుటకు సందేహము లేదు. మఱియు శ్రీనాథునిచే శివరాత్రిమాహాత్మ్యమును దన భృత్యుడగు ముమ్మిడి శాంతయ్యకుఁ గృతి యిప్పించిన శ్రీశైల జంగమ మఠాధీశ్వరుఁ డగు శాంతభిక్షావృత్తరాయఁడే గౌరనచే నవనాథచరిత్రమును మల్లికార్జునుపేరఁ గృతిగాఁ జెప్పించుటచేత నీ గౌరనయు శ్రీనాథుని కాలమువాఁడే యని విస్పష్టంబగుచున్నది. శివరాత్రిమాహాత్మ్యమునందు నైషధ కాశీఖండాది పూర్వ గ్రంథముల పోలికలు విశేషముగాఁ గనఁబడుచుండినను, అవతారిక దోష భూయిష్ఠమౌటను, ప్రౌఢబంధముకలదిగాఁ గనఁబడకుండుటను, శ్రీ నాథుఁడు గతించిన పిదప నవతారిక యెవ్వరిచేతనో వ్రాయించి, ముమ్మిడి శాంతయ్య యాగ్రంథమును గృతినందె నను వాదము యథార్థమగుట తటస్థించినను దీనికి బ్రేరకుఁ
ఆంధ్రకవుల చరిత్ర-పుట 595. డగు శాంతభిక్షావృత్తి యతీశ్వరుఁడే నవనాథచరిత్ర రచనమును ప్రోత్సహించినవాఁ డగుటచే గౌరన శ్రీనాథుని చరమకాలమునను నాతని తరువాతను జీవించి యుండె ననుటకు సందియము లేదు.
కృతిరచనకుఁ బ్రోత్సాహము:
నవనాథచరిత్రమున గౌరన ముక్తిశాంత భిక్షావృత్తిరాయని, నాతనివై భవమును విశేషముగా వర్ణించినాఁడు. ఆతఁడు మల్లికార్జున శ్రీమహాలింగ సర్వలోకోత్తమ సామ్రాజ్యభారనిర్వాహక ప్రౌఢినీతికోవిదుఁడు. విపులవిశ్వంభరావిశ్రుతాశేష నృపవర స్వీకృతనిజశాసనుండు. అనుపమ నిజతపోబల విశేషానుసంధానరక్షిత సకలకర్ణాట మండలాధీశ రమావిలాసుఁడు. ఆతని మహావైభవం బాతని లోకోత్తమ సామ్రాజ్యనిర్వాహకత్వమునకుఁ దగియే యున్నది. కర్పూరహిమజల కాశ్మీరమిళిత దర్పసారాంబుసిక్తప్రదేశమును దపనీయ జాలకాంతరగత ధూప విపులసౌరభసమన్విత గంధవాహవాసిత దశదిశా వలయంబు నగు నిజసభావనంబునందు రత్న సింహాసనమునఁగూర్చుండి, బిరుదందెబాగొందు వాని చరణాబ్దమునకు మండలేశ్వరులు మ్రొక్క, పచ్చలపదకంబు చీనాంబరంబు కరభూషణంబుల వజ్రరుచులు నవతంసమాణిక్య లలిత కాంతులు ప్రకాశింప రజితాద్రిమీఁదఁ బ్రమదమారఁగనున్న పరమేశుఁడనఁగఁ గొలువుదీరియుండఁ, దపోమహిమరూఢి కెక్కినమునీంద్రులు పదవాక్య ప్రమాణజ్ఞు లగు విద్వాంసులు బహువిధ నాటకాలంకార నైపుణిఁ జాటువకెక్కిన సత్కవీశ్వరులు, జంత్రగాత్రముల నేర్పుగలిగి వాసికెక్కిన గాయకోత్తములు, నటీనటజనులుఁ బాఠకులు, దొరలు, భృత్యులు, నమాత్యులుఁ బురోహితులు, రాయబారులు, వైద్యవరులు, దైవజ్ఞులు వరుసతో నాతనిఁ గొలిచియుండిరి. ఈతఁడు యతీశ్వరుఁడే యైనను మహారాజభోగమున నుభవించుచుండువాఁడు. అట్లుకొలువుండి యవిరళయోగ విద్యాధికులైన నవనాథుల పుణ్యచరితము శ్రీగిరికవి పదప్రబంధములఁ జెప్పినదానిని ద్విపదకావ్యముగఁ జెప్పింపవలయు నని తలంచి సరససాహిత్యలక్షణ వివేక మహితుఁడును భ్రమరాంబికావరప్రాప్త విచిత్ర విమల సాహిత్య ప్రవీణాధికుండునగు గౌరనాహ్వయునిఁ బిలిపించి 'మధురమై వెలయు నవనాథచరితంబు ద్విపదకావ్యంబుగాఁ జేసి కమలజ విష్ణుసేవ్యమానుఁడగు శ్రీశైలపతికి నంకితం బొనరింపుమని చెప్పి కర్పూర తాంబూలంబు లొసఁగి గారవించెను. దీనినిబట్టి నవనాథుల పుణ్యచరిత్రము శ్రీగిరికవిపద్యప్రబంధముల నింతకుఁ బూర్వమే ప్రసిద్ధమై యున్న ట్లగపడుచున్నది. దానినిబట్టియే గౌరన దీనిని ద్విపదలలో రచించెను. కాని యా శ్రీగిరికవినిగూర్చిన విశేషములుగాని, యాతని పద్య ప్రబంధముగాని, యిప్పుడు గానవచ్చుట లేదు. ఈకవి శ్రీగిరీశ శతకమును, శ్రీరంగమాహాత్మ్యమును గూడ రచించినట్లు కొందఱు చెప్పుదురు. మడికిసింగన తన 'సకలనీతి సమ్మతము'న శ్రీగిరీశశతకమునందలి వని రెండు సీసపద్యముల నుదాహరించి యున్నాఁడు. కాని, యవి యీ శ్రీగిరికవి రచించినవే యని నిశ్చయముగాఁ జెప్పుట కాధారము లేదు. "చిరతర ప్రకాళ శ్రీగిరీశ" యని శ్రీగిరీశ సంబోధనతోఁ గూడిన మకుటమును బట్టియే దాని కా పేరు వచ్చినను వచ్చియుండవచ్చును. వేమనశతకకర్త వేమన యైనట్లే, శ్రీగిరీశ శతకకర్త శ్రీగిరియే యని యూహింపఁ బడియుండును.
శ్రీగిరన్న (చెన్నమల్లు) రచించిన శ్రీరంగ మాహాత్మ్యము లోనివని రెండు పద్యములు శ్రీ ప్రభాకరశాస్త్రులుగారి ప్రబంధరత్నావళియం దుదా హృతములు. ఆతఁడు నవనాథచరిత్ర మను శైవగ్రంథమును బద్యకావ్యముగా రచించిన శ్రీగిరికవియే యని నిశ్చయించుట కాధార మేమియుఁ గనఁ బడదు. ఇంతేగాక శైవకవియగు నీతఁడు 'శ్రీరంగ మాహాత్మ్యము' వంటి వైష్ణవ గ్రంథమును రచించునా యను సందేహము కూడఁ గలుగక మానదు. శ్రీగిరికవిశ్రీరంగమాహాత్మ్యములోని దని గ్రహింపఁబడినట్టియు, శంకరుఁ డాదిమూర్తి యుచితరీతిని బేరోలగం బుండుటను గూర్చి వర్ణించునట్టియు నీ క్రింది పద్యమునకు శ్రీరంగమాహాత్మ్యకథనుబట్టి చూడఁగా నా గ్రంథమున నేమియుఁ బ్రసక్తికలుగునట్లు గానవచ్చుట లేదు.
“సీ. దీపించు నే వేల్పు దివ్యాంగకంబులఁ
గాళీకుచాంగరాగంబు భూతి
కొమరొందు నే వేల్పు గురుజటాభరసీమ
నమృతాంశుఖండంబు నభ్రగంగ
కడుమించు నే వేల్పు గాత్రవల్లికచుట్టు
వ్యాఘ్రచర్మము వారణాజినంబు
కరమొప్పు నే వేల్పు కంఠపీఠంబున
భుజగేంద్రహారంబు పునుక పేరు
తే. అట్టి వేలుపు శంకరుం డాదిమూర్తి
వేద వేదాంత వేద్యుండు విశ్వభర్త
వికసితోజ్జ్వల వదనారవిందుఁ డగుచు
నుచిత రీతిఁ బేరోలగం బున్నయంత. ”
"శా. సంతోషంబునఁ బొందియేలె విమలస్వాంతున్ మహాదానవ
ధ్వాంతవ్యూహ విదారణోజ్జ్వల వివస్వంతున్ యశఃపూరితా
శాంతున్ సాహసవంతు నిర్భరజయాయత్త్రైకవిశ్రాంతు ధీ
మంతున్ భర్మనగేంద్రకాంతుని హనూమంతున్ జవాత్యంతునిన్
శైవకథలు జనసామాన్యమున వ్యాప్తినొందవలయు ననియే యై యుండుననుటకు సందేహము లేదు. సామాన్యముగా నార్యమత మగ్రవర్ణములవారి యాదరమును బడసినదగుటచే, సామాన్యజనము నాకర్షించుటకు మతబోధ ప్రచారము ప్రధానముగా నెంచిన శైవగురువులు సర్వజన సుబోధకంబగు సులభశైలిలో రచింపఁబడిన ద్విపదకావ్య రచనమును ప్రోత్సహింపఁ జొచ్చిరి. పాల్కురికి సోమనాథుఁ డారూఢగద్యపద్యాదిప్రబంధపూరిత సంస్కృతభూయిష్ఠ రచన సర్వసామాన్యంబు గాదు గావునఁదాను ద్విపదలను రచింప దొరకొనినట్లుచెప్పియే యున్నాఁడుగదా. ఈ శైవు లవలంబించిన మార్గము ననుసరించియే కావలయు, వైష్ణవ మతాభిమానులచే రామాయణాదులు గూడ నాయ కాలముల ద్విపదరూపమును బొందింపఁ బడియున్నవి.
శైవసిద్ధులగు నీ నవనాథులవలెనే, వైష్ణవసిద్ధులగు నవనాథులు గూడఁ ప్రసిద్ధులై యున్నట్లు తోఁచుచున్నది. ఈ వైష్ణవసిద్ధు లగు నవనాథులచరితము మహారాష్ట్రభాషలో మాలూపండితునిచే రచింపఁబడియుండెను. దాని యాంధ్రానువాద మొకటి 'నవనాథచరిత్ర'మను పేరఁ బ్రకటితంబై యున్నది. కాని యిది మిగుల నర్వాచీనంబుగాఁ గనఁబడుచుండుటచేతను, మత్స్యేంద్రనాథుఁడు, గోరక్షుఁడు, చౌరంగి మొదలగు సిద్ధులనామములయందు జర్యల యందును గూడ నీవైష్ణవ నవనాధులకును శైవ నవనాథులకును బోలిక లగ పడుటచేతను, శైవనాథుల చరిత్రము దేశమున వ్యాప్తిఁ చెందిన పిదప, దానికిఁ బ్రత్యర్థిగా వైష్ణవమత ప్రతిపాదకంబగువేఱొక నవనాథచరిత్రము రచింపఁబడినదని తోఁచుచున్నది. గౌరనకావ్యమైనను, "కేవల మంత వీరశైవ ప్రతిపాదకంబైనదిగాఁ దోఁపదు. ఏలయనఁగా, నిందొకచో విష్ణువుప్రశంస గూడఁ గొంత కల్పిఁబడినది. లోకరక్షణార్థమై విష్ణువు శైవనాథుల చర్యలను గూడఁ బ్రతిఘటించి శైవనాథుఁడగు నాగార్జునశిష్యుఁడు శ్రీశైలము నంతను హాటకాచలముగా నొనరింపఁజేసిన యత్నమునకు భంగ మొనర్చి, యా నాగార్జున శిష్యునిఁ దనచక్రముచేఁ జంపినట్లు చెప్పఁబడినది.
"గాసిగా శిక్షింపఁ గలవా రుపేక్ష
చేసిన దోషంబు సిద్ధించుఁగాన
నేనే జగంబు లన్నియును రక్షింపఁ
బూనిన లక్ష్మీవిభుఁడ ననిచెప్పి
యంతర్హితుండయ్యెఁ" ననియుఁ గలదు.
ఇట్లు శైవనాథులులోకప్రసిద్ధంబుగాఁ జేయఁదలఁచిన రసవాదాది కృత్యములకు భంగము గలిగించుటేగాక, తానె జగంబు లన్నియు రక్షింపఁ బూనిన లక్ష్మీవిభుఁడ నని ప్రకటించుకొనువిష్ణువు మాహాత్మ్యమును గూడ వర్ణించిన దగుటచే నిది కేవలము వీరశైవపరము కాదనియు, నేత ద్గ్రంథరచనా కాలమునకే వీరశైవ మతముయొక్క పట్టు కొంచెము తగ్గినదనియు, గౌరన యట్టి కేవల వీరశైవ సంప్రదాయములోనివాఁడు కాఁడనియుఁ దలంపవలసియున్నది. కథారంగము, ఆంధ్రదేశ సంబంధము:
ఈ నవనాథుల చర్యలకుఁ బ్రధానరంగము మహారాష్ట్రదేశభాగముగాఁ గనఁబడుచున్నది. శివపుత్రుఁడగు మీననాధుఁడు తండ్రివలన నధ్యాత్మవిద్యోప దేశమును బొంది, ధరణిపైఁ జరియింపఁబొమ్మన నాతని యజ్ఞవడసి, భూలోకమునఁ గలికాలంబున సులలిత యోగాబ్ధిచంద్రుండై -
కాళింగ బంగాళ కరహాట లాట
గౌళ కేరళ చోళ కర్ణాట ఘోట
కుకురు గొంకణ పౌండ్ర కురుకోసలాది
సకలదేశంబులును దిరిగి, మాళవదేశంబున రాజమహేంద్రనరేంద్ర పరిపాలితం బగు మాంధాతపురమునఁ దొలుతవిడిసినవాఁడయ్యెను. ఈ సందర్భమున నీతఁడు తిరిగిన దేశములలో నాంధ్రదేశ మున్నట్లు చెప్పఁబడి యుండలేదు. ఈతఁడు తొలుత వాసమేర్పఱచు కొన్నట్లుగాఁ జెప్పఁబడినది మాళవదేశమునందలి మాంధాతపురముగాని యది యాంధ్రదేశమునం దేపట్టణమునుగాదు. ఈ మాంధాతపురాధీశుఁడగు రాజమహేంద్రుని కుమారుఁడు సారంగధరుఁడు. ఈతని కథ యంతయు నీ మాలవదేశగతమగు మాంధాతపురముననే జరిగెననియు, తత్ పురసమీపమునందలి కొండలలో వాస మేర్పఱచుకొనియున్న మీననాథుని యనుగ్రహమువలననే యీతనికిఁ గాలుసేతులు మరలఁ గలుగఁగాఁ, ఔరంగి యనునామమున సిద్ధుఁడై యాతని శిష్యులలో నొకఁడయ్యె ననియు, నీ రాజమహేంద్రుని యాలమందలను గాచు గోరక్షుఁడు గూడ నాతని ముఖ్యశిష్యులలో నొకఁడై , యోగ సామ్రాజ్య పట్టభద్రుఁడయ్యె ననియుఁ జెప్పఁబడినది. ఆ రాజమహేంద్రుఁడును “సుతు నాజ్ఞ పెట్టించి, సురసుర వెచ్చి, మతిఁదప్పి "తేజంబుమాలి యావెన్క నంతకగోచరుండై "న పిదపఁ దజ్జనపదంబెల్ల జనశూన్యమై, మాంధాతపురంబును మటుమాయ మయ్యెనఁట. పిమ్మట శిష్యులఁగూడి మీననాథుఁడు మాల్యవంతంబున కేగి, యచ్చట సంజీవకరణి, సంధానకరణి, పరుసవేది, చింతామణి మొదలగుదివ్యౌషధములను మఱికొందఱ శిష్యులను బడసి, వారిని సిద్ధులుగాఁ జేసి, పశ్చిమాంబుధితీరమున మంగళాపురమను (Mangalore?). పుటభేదనము డాసి, యా పురిని రాజు మృతుడౌటఁ దెలిసి, యాతని కాయమునఁ బ్రవేశించి, కొంతకాల మాపురము నేలుచు రాజ్య వైభవములను నైహికసుఖముల ననుభవించి యొక సుతునిఁబడసి గోరక్షకుని ప్రబోధమున మరలఁ దన కళేబరమునఁ బ్రవేశించి, శిష్యులతోఁ గూడి, ఉజ్జయని, ద్వారక, అయోధ్య, కురుక్షేత్రము, కాశి, ప్రయాగ మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించుచు, హిమవత్పర్వతమును జేరి, శిష్యులతో,
"మీరు మీ నేర్పున మీ కథలెల్ల
ధారుణిపైఁ బ్రసిద్ధముగాఁగఁ జేసి
సన్నుతి యోగశాస్త్రములు మీ పేరు
విన్నఁ గౌతుకమార విరచించి మఱియు
గురుభక్తి నిరతుల గుణరత్న నిధులఁ
దెలిపి యోగం బుపదేశించి దెసల
గలయఁ ద్రిమ్మరుచుండఁగా నియమించి
మగుడ చలికొండ కేతెండు చనుఁడింక”
నని చెప్పిపంపెను.
అట్లు పంపిసశిష్యులలో -
“మళయాళ బర్బర మగధాంధ్ర పాండ్య
చోళభూములు చనఁజొచ్చె విజ్ఞాన
శీలనాగార్జున సిద్ధుఁడింపార"
ఈతని శిష్యుఁడగు సిద్ధనాగార్జునుఁడు శ్రీశైలప్రాంతమునఁ దిరిగి, రసవాద మహిమనుజూపి, శ్రీశైలము నంతను హాటకమయముగాఁ జేయ యత్నించి, తుదకువిష్ణుని చక్రమున " కాహుతియై విఫలుఁడయ్యెను. కాని మీసనాథుఁడుగాని యాతని వెంట నంటియున్న సారంగధరుఁడుగాని యాంధ్రదేశమునకు వచ్చినట్లైననుగనఁబడదు. ఇట్లీనవనాథుల కథలన్నియు హిందూదేశమునఁ బశ్చిమతీరభాగమునకు సంబంధించిన ట్లగపడుచుండఁగా, నిందుఁ బ్రధాన పురుషులలో నొక్కఁడును, మీననాథుని తొలి శిష్యుఁడును నగు సారంగధరుని గూర్చిన కథ యాంధ్ర దేశమునకును, నందు నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రవరమునకును సంబంధించినదిగాఁ జిరకాలమునుండి యీ దేశమునఁ దలంపఁబడుచుండుట యాశ్చర్యకరము కాకమానదు. ఈ భావ మెట్లెప్పుడు బయలుదేరినదో చెప్పుటకు సాధ్యముకాదు గాని, అప్పకవి నాఁటినుండియు నది యీ దేశమునఁ బ్రబలియుండు ననిమాత్రము చెప్పవచ్చును. అప్పకవియే సారంగధరుని కథకును నన్నయాంధ్రఫక్కి కిని సంబంధమును గలిగించినవాఁడై యుండిన నుండవచ్చును. ఈ కథ రాజమహేంద్రవర పట్టణమునకును, దాని నొక కాలమునఁ బరిపాలించి రాజమహేంద్రుఁ డని ప్రసిద్ధివడసిన చాళుక్య రాజగు రాజరాజునకును సంబంధించినదను విశ్వాసము జనులలో వ్యాపించిన పిదప, నచ్చటివారా కథా విశేషములకు స్థలనిర్దేశమును గూడఁ జేసియుందురు. కావుననే యిప్పటికి నాయూర నిది సారంగధరుని మెట్టయనియు, నిదీ యాతని కాలుసేతులు నఱకించిన చోటనియు, నిది చిత్రాంగి మేడ యనియు స్థలనిర్దేశములతో నా కథావిశేషములను జెప్పుకొనుచుండుట తటస్థించి యుండును. చారిత్రక విషయములకును, జన వాదమునకు నొకప్పు డెట్టి సంబంధము లేకపోవచ్చు ననుట కిదియొక మంచి నిదర్శనముగాఁ గనఁబడుచున్నది. ఇంక నప్పకవీయ రచనా సందర్భము నందలి సారంగధర కథా ప్రశంసను గూర్చి యించుక పరిశీలింతము.
అప్పకవీయ మనునది నన్నయఫక్కీ, ప్రక్రియాకౌముది, యనఁబరగు నాంధ్రశబ్దచింతామణి కాంధ్రీకరణము. ఈతఁడు తెనుఁగున ఘనకావ్యం బొక్కటి చేయఁ దలఁచి యున్నతఱి నీతని కులదైవమగు కామెపలి గోపాలకృష్ణుఁ డొకనాఁడు కలలోఁ బ్రత్యక్షంబై
"స్వ, శ్రేయస మబ్బు నీకు నిఁక సిద్ధము నన్నయఫక్కి యాంధ్రముం
జేయుము మా యనుగ్రహముచేఁ గవు లచ్చెరువంది. మెచ్చగఁన్."
అని యానతిచ్చినాఁడు. కాని యప్పకవి కప్పటి కా నన్నయఫక్కి.. యన నేమో తెలియదు. ఆతఁ డెప్పుడును దానిని వినికని యెఱుఁగఁడు, ఆ విషయము కూడ సర్వసాక్షి యగు నా విష్ణువే చెప్పుచు నా గ్రంథప్రభావమును, దాని పూర్వచరిత్ర మంతను గూడ నా కలలో నాతని కిట్లెఱిగింపఁ దొడఁగెను.
"కం. వినియును గనియును నెఱుఁగని,
ఘనఫక్కిం దెనుఁగుఁ జేయఁగా నెట్లగు నా
కనవలదు దాని లక్షణ
మును నీకది గలుగుచందమును వినుమింకన్"
ఆంధ్రశబ్దచింతామణి వ్యాకరణము ముందు రచించి, తత్సూత్రములఁ దెనుఁగుబాసచే నన్నయభట్టు శ్రీ మహాభారతమున మూఁడు పర్వములు చెప్పెను. ఆ సమయంబున భారతముఁ దెనిఁగించుచుఁ - లేదా తెనుఁగించుట మూలముగా-దాను రచించిన రాఘవపాండవీయమును నన్నయ యణఁచి వేసినాఁడు. ఇప్పుడు తాను రచించు ఛందమునఁ (ఈతనిది ఛందోగ్రంథమా? వ్యాకరణమా?) దనఛందోగ్రంథము నణఁచివేయుటకై యీ ఫక్కి రచింప మొదలు పెట్టినాఁడు అని భీమన్నతలఁచి, యా యాంధ్రశబ్దచింతామణి నణఁచివేసినాఁడఁట. ఇక్కడ సర్వసాక్షి యగు నీవిష్ణువు పలుకులలో సందర్భశుద్ధి గాన రాకుండుట గమనింపఁ దగియున్నది. మొదట ఆంధ్రశబ్దచింతానుణి రచించి యసూత్రముల కుదాహరణముగా భారతము మూఁడు పర్వములు చెప్పే నన్నట్లున్నది. కాని రెండవ వాక్యములో నన్నయ్య భారతము ముందు రచించి, భీమన్న రాఘవపాండవీయము నణఁచివేసినట్లును, అటు తరువాత , భీమన ఛందస్సు నడంచుటకుగా నీ(వ్యాకరణ) ఫక్కి సంగ్రహించినట్లును, అపుడు భీమనదాని నడంచినట్లును జెప్పఁబడినది. కావున నన్నయ రచనలు రెండింటిలో నేది పూర్వమో యనునదినిశ్చిత మగుటయే లేదు. ఇంతవఱ కీ రెండువాక్యములు పరస్పరము విరుద్ధములుగా నున్నవి. అంతేగాక రెండవ వాక్యమును బట్టి ఆంధ్రశబ్ద చింతామణికంటె ముందే భారతము రచియింపఁబడిన ట్లూహింపవలసి వచ్చుచున్నది. ఇకనిట్లు నన్నయఫక్కి భీమనచే గోదావరిలోఁ గలుపఁబడుటచే నాంధ్రమున సూత్రసంపాదన లేకపోయినదఁట. ఆకారణముచే నాదిని శబ్ద శాసనమహాకవి చెప్పిన భారతములో నేదివచింపఁగాఁ బడియెనో దానినె కాని దెనుఁగుపల్కు మఱొక్కటిఁగూర్చి చెప్పఁగారాదని దాక్షవాటి కవిరాక్షునుఁ డొక నియమము చేసెనఁట, ఈ కవిరాక్షనుఁడు భీమనకవి యనియే ప్రసిద్ధి గదా. 'సూత్రసంపాదన' లేమిచే ననుటవలనఁ బ్రధ్వంసాభావమేనా మనము గ్రహింపవలసియున్నది ? భీమన దాని నణఁచివేసె నని చెప్పఁబడినది గదా. నన్నయ వ్యాకరణము నడంచిన భీమకవియే మరల నీ నియమమును జేసి యుండెనఁట! ఈతఁ డీ నియమము చేసియుండుటను బట్టియే యాతని మాటను జవదాఁటనొల్లక మహాకవులగు తిక్క సుధీమణి మొదలైన తొంటి తెలుఁగు కవీంద్రు లెల్లరు నా మూఁడు పర్వములలో నా మాన్యుఁడు నుడివిన తెలుఁగు లరసికొనియే తమ కృతులు రచించినారఁట. తిక్కన కేతనాదులు రచించిన తెలుఁగు పలుకుబళ్లకు నన్నయ మూఁడు పర్వములలోని తెలుఁగులే యాధారము కాఁబోలును నూత్నదండియగు కేతనయుఁ దెనుఁగునకు లక్షణము వాని ననుసరించియే చెప్పియున్నవాఁడా ? ఇఁక భీమన యడంచిన యా నన్నయ యాంధ్రఫక్కి నెఱింగిన వాఁ డొక్కరుఁడు మాత్ర మున్నాఁడఁట. ఆతఁడు రాజురాజ నరేంద్రతనూజుఁ డగు సారంగధరుఁడు. ఈతఁడు తన శైశవమునందే నన్నయ యాంధ్రఫక్కిని రచించుచుండఁగానే యాతనియొద్ద పఠించి నాఁడఁట. ఈతనికిఁ దక్క మఱియన్యుల కెవ్వరికి నిది తెలియ దన్నాఁడు విష్ణువు. భీమన దీనిని రచింపఁబడిన వెంటనే యడంచినట్లు తెలియవచ్చుచున్నది గదా! వీ రిద్దఱకు దక్క నన్యు లెవ్వరికిఁ దెలియదని దానికర్థమగునా? ఆ సారంగధరుఁడు, జనకుండు మతిచెడి తన కాళ్లుచేతులు నఱికింపఁగాఁ మత్స్యేంద్రుని సాంగత్య ముచే వానిం గ్రమ్మఱఁ బడసి సిద్ధులలోఁ గలసి యొక సిద్ధుఁడై యుండి "మొన్నటి కీలక సంవత్సరమున" మతంగగిరికడ నావ్యాకరణమును బాల సరస్వతుల కొసఁగఁగానాతఁ డద్దాని కొక టీకఁ గూడ వ్రాసెనఁట. అట్లు భీమకవి గోదావరిలోఁ గలిపిన గ్రంథమును మరల రాజనరేంద్రక్ష్మాదయితునిపట్టి మహిని వెలయించినవాఁడయ్యెను. ఎనుబది రెండార్యలు గలిగి, పరిచ్ఛేద పంచకమునఁ దగు నా ఫక్కి మతంగాచల విప్రునివలన నప్పకవి సదనము చేరుననియు, సంస్కృతమున వాగనుశాసనుఁడు రచించి నప్పుడు మును నారాయణధీరుఁ డాతనికి సహాయుఁ డయినట్లే, దానిని దెనిఁగించుటలోఁ దా నాతనికిఁ దో డగుదుననియుఁగూడ విష్ణువు చెప్పెను. నన్నయకవి ప్రక్రియా కౌముదిని నారికేళపాకముగాఁ జెప్పినాఁడు. కావునఁ గేవ లాంధ్రులా త్రోవఁ గానలేరు. మఱియు సంస్కృతగ్రంథములోఁ దెనుఁగు కలియఁగూడదు గనుక లక్షణంబు మాత్రమె చెప్పెనుగాని లక్ష్యమొక్కటియు నాతఁడు చెప్పలేదు. తాతన నూత్నదండియు నింతకుఁ బూర్వము తెలుఁగుల లక్షణం బొకించుక యైనను జేయక పోలేదు. కాని యవి యాంధ్రభాషామహాకాననాంతర మున శబ్దాపశబ్ద సరణు లెఱింగించుటలో దీనివంటివి గావు గావున నిది కవులకు విశేషోపకారక మగు నని చెప్పి విష్ణువు చనెను.
అప్పకవికిఁగలలోఁ బ్రత్యక్షంబై నన్నయఫక్కి నిగూర్చిన యీ యసంబద్ధపుగాథ నంతను జెప్పిన యీ విష్ణు వీతని యిష్టదైవ మగుటచే నీ దెనుఁగు సేతలో నీతనికి సాయముచేసినఁ జేసియుండవచ్చును గాని, వాగనుశాసనుఁ డా సంస్కృతగ్రంథమును “మును నారాయణధీరుఁడు దనకు సహాయుఁడుగ" రచించెనో లేదో నిర్ణయించుట కీ విష్ణుమూర్తి పలుకులు తప్ప వేఱాధార మేమియుఁ గనఁబడదు. ఆ నన్నయఫక్కిలో నీ నారాయణునిఁగూర్చిన ప్రశంస యేమియు లేదు గదా! ఇఁక భారతరచనమును వలెనే దీనిఁగూడ “సహాధ్యాయుఁడు నైనవాఁ డభిమతంబుగఁ దోడయి నిర్వహించి యుండు" నని యెంచి యప్పకవి యట్లు కల్పించి యుండవచ్చును. కాని, భారతములోని "పాయక పాకశాసని"కను పద్యమే ప్రక్షిప్తంబుగాఁ గనఁబడుచున్నది. అప్పకవి 'జానపదు లోడక దిద్ది' రని తెలిపిన రీతిగా నాతనికిఁ బూర్వమే యెవ్వరో యా పద్యమును రచించి యాగ్రంథమునఁ జేర్చియుందు రేమో యని తలంపవలసి వచ్చుచున్నది. ఏల యనఁగా, నాంధ్రభారతము ప్రాఁతవ్రాఁతప్రతులను బరిశీలింపఁగాఁ బెక్కింటిలో నీ "పాయక పాకశాసని” కన్న పద్యమే కనఁబడుట లేదు. కొన్ని ప్రతులలో నుండుటం బట్టి, యా గ్రంథము నిటీవలివా రందఱు నద్దానిని సంగ్రహించి యుందురు. ప్రాచీనమాతృకనుబట్టి వ్రాసినవా రీ పద్యమును మాత్రము వదలివేసి రనుట సంభావ్యము కాదు గదా. నుమా రిరువది ప్రాచీన "తాళపత్ర గ్రంథములఁ బరిశీలింపఁగాఁ దొమ్మిదింట నాపద్యమే లేదు. నన్నయ యాంధ్రఫక్కి నాతనికై దాఱువందల యేండ్ల తరువాత నాంధ్రలోకమున వ్యాపింపఁ జేయుటకుఁ జాళుక్యకులావతంసుఁ డగు రాజనరేంద్రుని కుమారుఁడని చెప్పఁబడిన సారంగధరుఁడు తోడ్పడుట యెట్టిదో భారతరచనా విషయమున నన్నయకు నారాయణభట్టు తోడ్పడుటగూడ నట్టిదిగానె యుండునని తలంపవలసి వచ్చుచున్నది.
ఇట్లిందలి విషయము లన్నియు సందేహగ్రస్తములుగానే యున్నవి. మొట్ట మొదట నన్నయ యాంధ్రఫక్కిని రచించుట, నన్నయ సమకాలికుఁ డని చెప్పుటకు వీలులేని భీమన దానిని గోదావరిలోఁ గలుపుట; కవిరాక్షనుఁడీభీమనయే యైనచో, నాతఁడే మరల నన్నయ భారతములో నేది చెప్పెనో దానినేగాని, సూత్రసంపాదన లేమిచే మఱియొక తెనుఁగుపల్కు, గూర్చి చెప్పరాదని నియమముచేయుట, తరువాత నాంధ్రలక్షణ కర్తయగు కేతన మొదలగువా రాతని కృతు లరసికొని, ఆ ఫక్కి ననుసరించియే తాము రచించియుండి రనుట; చింతామణి రచనమున నన్నయభట్టుకు నారాయణభట్టు సాయపడినట్లే విష్ణువు అప్పకవికి సాయపడుదు నని చెప్పుట; అన్నిటికంటె గొప్పది, సారంగధరుఁడు శైశవమునందు నన్నయ రచించునెడ నేర్చిన యాంధ్రపక్కిని- ఇంత కాలమునుండియు నిచ్చుట కెవ్వరు తగినవారు లేక గాఁబోలుబయలు వెట్టక “మొన్నటి కీలక సమ నా మతంగగిరికడ బాలసరస్వతుల కిచ్చి" దానిని మహిని వెలయించుట !
ఆంధ్రశబ్దచింతామణి యేకారణముచేనైన నేమి నన్నయరచించిన యైదువందల సంవత్సరములవఱకు నామరూపములె లేక బయలుపడక యుండి, 17 వ శతాబ్దమున బాలసరస్వతిచేతఁ బడుటకు అప్పకవి చెప్పిన కలలోని కథయే మూలాధార మైనచో నది యంతయు కల్లయే యని నవనాథచరిత్రమునఁ దెలుపఁ బడిన సారంగధరుని కథ వెల్లడించుచున్న దనవచ్చును. ఏల యనఁగా నీ నవనాథచరిత్రమునుబట్టి సారంగధరుని కాంధ్రదేశముతోఁ గాని, యందు 11-వశతాబ్ది నేలిన రాజరాజవిష్ణువర్ధనుఁడను రాజనరేంద్రునితోఁగాని, యెట్టి సంబంధము నున్నట్లగపడదు. సారంగధరుఁడు మాళవదేశమున మాంధాతపురం బేలు రాజమహేంద్రుఁడను రాజు కుమారుఁడు. ఆంధ్రదేశమున రాజమహేంద్రవరము రాజధానిగా నేలిన చాళుక్య రా జగు రాజరాజవిష్ణువర్ధనునకు సారంగధరుఁడను కుమారుఁ డున్నట్లు నిదర్శనములేదు. ఈతని పుత్రుని పేరు రాజేంద్రచోడుఁడు, ఈతఁడు రాజ్యమునకు వచ్చినపిదపఁ జోడదేశముపై దండెత్తి దానిని జయించుటచేనీతనికి కులోత్తుంగ చోడదేవుఁడను పేరు వచ్చినది. ఈతనితల్లి పేరుఅమ్మంగ దేవి. రాజరాజునకు రేవల్దేవియను మఱియొక భార్య యున్నట్లు శాసననిదర్శనము లున్నను, రత్నాంగి, చిత్రాంగి యను పేళ్లుగల భార్యలుగాని, సారంగధరుఁడను కొడుకుగాని యున్నట్లు నిదర్శన మేమియు లేదు. వేఁగిదేశము నేలిన చాళుక్యరాజగు రాజరాజనరేంద్రుఁడు, రాజమహేంద్రుఁడనియుఁ జెప్పఁ బడుటంజేసి కాఁబోలు నా మాళవదేశాధీశుఁడగు రాజమహేంద్రుని కథ యీతనియం దారోపిత మగుట తటస్థించినది. భారతమున నన్నయయే "జగజేగీ యమానానూన గుణరత్నరత్నాకరుండునై పరగుచున్న రాజరాజనరేంద్రుఁడు,
ఉ. రాజకులైకభూషణుఁడు రాజమనోహరుఁ డన్యరాజ తే
జోజయశాలి శౌర్యుఁడు విశుద్ధ యశశ్శరదిందుచంద్రికా
రాజిత సర్వలోకుఁ డపరాజిత భూరిభుజాకృపాణ ధా
రాజలశాంత శాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్"
అని యాతనిని రాజమహేంద్రుఁడని పేర్కొనియున్నాడు. ఈ నామ సాదృశ్యమునుబట్టి మాళవాధీశుఁడగు రాజమహేంద్రుని కొడుకగు సారంగధరుఁడు సిద్ధుఁ డయ్యెనను కథా విషయమును బురస్కరించికొని యింతకాలమునుండి లోక మేమాత్రము నెఱుఁగని నన్నయ గ్రంథ మిప్పు డెట్లు హఠాత్తుగా బయలువడె నను ప్రశ్నకు సమాధానము కుదుర్చుకొనుటకై , సారంగధరుఁడు బాల్యమున నన్నయభట్టు రచించిన లక్షణమును జదువుట, దానిని లోకమున నిలుపుటకు బాలసరస్వతి కిచ్చుట మొదలగు కథనంతను నప్పకవియే కల్పించి యాంధ్రదేశము నేలిన చాళుక్య రాజగు రాజమహేంద్రునిపైఁ బెట్టి యుండవచ్చును. అప్పకవి కథ, లేదా విష్ణువప్పకవికిఁ జెప్పినకథ, వా స్తవమేయైనచో బాలసరస్వతి తనకా గ్రంథములభించిన రీతిని దెలుపు సందర్భమున సారంగధరుని పేరైన నెత్తకుండునా ! అయితే అప్పకవి దీని నా సారంగధరుని కథతో ముడివెట్టుట కనువగునట్లుగా నాతని కొక సిద్ధుఁడు తెచ్చియిచ్చె నని యొక చిన్న సూచన యొకప్రతిలో మాత్రము పీఠికలోఁ గానవచ్చుచున్నది. ఆ పీఠికలోని పద్యములివి-
ఏమి మహాద్భుతం బిది హరీ ! హరి! యెక్కడి యాంధ్రశబ్దచిం
తామణిఫక్కి ! యెక్కడి మతంగనగంబు! యుగాదిసంభవుం
డై మని చన్న నన్నయ మహాకవి యెవ్వఁడు సిద్ధుఁ డెవ్వఁడా
హా మదగణ్య పుణ్య సముదగ్రతఁ జేకుఱుఁగాదె యారయన్ "
మ. ఇలఁబజ్ఞానిధులౌకవు ల్మునుపులేరే ! వారు వ్యాఖ్యానక
ర్తలుగానోపరె ? పెక్కువత్సరము లంతర్భూతమైయున్న యీ
తెలుఁగు వ్యాకరణంబు నాకొసఁగెఁ బ్రీతిం డీక గావింపుమం
చల సిద్ధుండు మదిష్ట దేవత విరూపాక్షుండు నిక్కంబుగన్.
ఏమి మహాద్భుతం ఇట్లు చెప్పుటచే నది తనకు లభ్యమైన రీతికిఁదానే యత్యాశ్చర్యమును బొంది నట్లగపడుచున్నది. మఱియు నా తెచ్చియిచ్చిన సిద్ధుఁడు తనయిష్టదైవంబగు విరూపాక్షుఁడేయనికూడఁ జెప్పినాఁడు. కావున, నప్పకవికిఁగొంతపూర్వుఁడై మొట్టమొదట నన్నయ్యఫక్కికి వ్యాఖ్యానము రచించినాఁడన్న బాలసరస్వతి యైనను ఆ నన్నయఫక్కికి సారంగధరుని కథకు సంబంధమున్నట్లు చెప్పలేదు. “నన్నయ యెక్కడ, సిద్ధుఁడెక్కడ" అనివీరికి సంబంధమేలేనట్లు చెప్పుచున్నాఁడు. ఈ కథయు నాంధ్రదేశమునకు సంబంధించిన దని యాఁతడెంచె ననుటకును నిదర్శనము లేదు. మఱియు నంతకు సుమారు రెండు శతాబ్దుల పూర్వమున నాంధ్రదేశీయుఁడగు గౌరన యీ నవనాథచరిత్రమున నా రాజమహేంద్ర సారంగధరుల కథను వర్ణించునప్పటికీకథ యాంధ్రదేశమునకు సంబంధించిన దను భావమే ప్రబలియున్న చో, రాజనరేంద్రుని రాజమహేంద్రవరము రాజధానిగా నాంధ్రదేశము నేలిన రాజుగను, ఆకథ యీ దేశమున జరిగినదిగను వర్ణింపకుండునా? ఇది యంతయు మాళవదేశమునందలి మాంధాతపురమునకు సంబంధించినదిగాను, సారంగధరునికి గాలుచేతులు వచ్చినపిదప, నచ్చటినుండి మీననాథుఁడు మాల్యవంతమునకును, బిదప నా పశ్చిమదేశభాగముమీదుగనే హిమవత్పర్వమునకు బోయినట్లును, నాగార్జున సిద్ధుఁడుమాత్రమె యాంధ్రదేశమున సంచారము చేసినట్లును, నిందు వర్ణింపబడియున్నది. కావున, గౌరనకాలమునాటికి సారంగధరుని గూర్చినకథ యాంధ్రదేశమున జరిగిన దనిగాని సారంగధరుఁ డాంధ్రదేశీయుడై యాంధ్రభాష నెఱింగి తల్లక్షణము నేర్చినవాఁ డనిగాని, వాడుక యేమాత్రము నున్నట్లగపడలేదు. ఇఁక పదునేడవ శతాబ్ది మొదట, ననఁగా క్రీ. శ. 1630 సంవత్సరప్రాంతమున తంజావూరిలో రఘునాథరాయల యాస్థానము నలంకరించి, నవనాథకథలలో నొకటి యగు సారంగధరచరిత్రమును బ్రబంధముగా రచించిన చేమకూర వెంకటకవిగూడ సారంగధరున కాంధ్రదేశముతోడను నన్నయ వ్యాకరణముతోడను సంబంధ మున్నట్లు తెలిపియుండలేదు. ఈతఁడును గౌరనవలె రాజనరేంద్రుని మాళవపతిగానే వర్ణించియున్నాఁడు.
“మహిని రాజనరేంద్రుఁడు మాళవపతి
రాజరాజనరేంద్రుండు రాజరాజు
ననఁగఁ బేరెన్నికకు నెక్కి యతిశయిల్లు
నింద్రవిభవుండు రాజమహేంద్ర విభుఁడు.”
(సారంగధర చరిత్ర. 1 ఆ. 5)
కథావిషయమునను గొంతవఱకు భాషలోను గూడ నీతఁడు గౌరన ననుసరించినవాఁడే యైనను, దనకాలమున సారంగధరుని కథ కాంధ్రదేశ సంబంధము కలదనువాడుక ప్రబలియున్నచో నాతఁ డద్దానిని సూచించియైన నుండకపోఁడుగదా. ఈతనికి సమకాలికుఁడో సుమారు పాతిక సంవత్సరముల తరువాతివాఁడో యగు నప్పకవి యీతని సారంగధరచరిత్రమునుండి లక్ష్యముల గ్రహించి యుండుటచే సారంగధరుని గూర్చిన కథయంతయు మాళవ దేశమునకు సంబంధిచినదే యని యాతనికిఁ దెలియక యుండదుగదా. కావున నన్నయఫక్కి నాంద్రీకరించు సందర్భమునఁ దన కిష్టదైవ మగు విష్ణుమూర్తి మూలముగా వెల్లడించిన సారంగధరుని గాథయంతయు సప్పకవి సందర్భాను కూలముగాఁ గల్పించినదే యని తోఁచుచున్నది.[1] సారంగధరుని గూర్చిన కథలు.
మత్స్యేంద్రనాథుని యనుగ్రహమున సిద్ధుఁడై చౌరంగి యను పేరు వహించిన యీ సారంగధరునికథ భిన్నరీతులఁ గానవచ్చుచున్నది. మహారాష్ట్ర భాషలోని నవనాథచరిత్రనుబట్టి రచింపఁబడిన తెలుఁగుగ్రంథములోనీ 'చౌరంగి' పేరు కృష్ణాగరుఁడని కలదు. ఈతఁడు కౌండిన్యనగరాధిపుఁ డగు శశాంగ నృపాలుని పుత్త్రుఁడు. ఈతని పట్టమహిషి మందాకిని. వీరికిఁ జిరకాలము సంతానము లేకుండుటచే వీ రుమాధవుని ధ్యానించి సంగమేశ్వరమున నాతనిఁ బూజింప నా ప్రదేశమున నొకనాఁడు రా జర్ఘ్యం బిడుసమయమున శివవీర్య బలముచే నాతని యంజలీభాగంబున నర్భకుం డుద్భవించెను. ఆతనిం దెచ్చిరాజు భార్య కొసఁగి కృష్ణాగరుఁడని నామకరణం బొనర్చెను. పిదప నీతనికి వివాహముఁ జేయరాజుప్రయత్నము చేయుసమయమున మందాకినీదేవి మరణించుటయు, రాజు కొమరునికై యుద్దేశించిన చిత్రకూట నగరాధిపుని కుమార్తెయగు భుజావంతిని దానెవివాహమయ్యెను. ఈమెయొకప్పుడు నవయౌవనుఁడగు కృష్ణాగరునిఁ జూచి మోహించి, రాజు మృగయావినోదంబున నరణ్యంబునకేగినతఱి యొక చెలికత్తియను బంపి యాతనిం బిలిపించి తన చిత్తంబునఁ గల చిత్తజుని తాపముసు వెలిఁబెట్ట నాతఁ డతిక్రుద్ధుండై యామె ప్రార్థనమును దిరస్కరించి తన యింటికి: బోయెను. పిదప నీ విషయము కృష్ణాగరుఁడు తండ్రి కెఱింగించు నేమో యనుభయముచేఁ బరితపించుండు సమయమునఁ దన చెలికత్తె చేసిన దుర్భోధనలచేనేరంబు కుమారునిపై వైచి, రాజునకుఁ గోపముపుట్టించి,క రపాద ఖండనముఁ జేయించెను. అప్పుడాయూరఁ ద్రిమ్మరుచున్న గోరక్షునాథుఁ డీ విషయము మత్స్యనాథునికిఁ దెలిపి కృష్ణాగరుఁడు శివవీర్యోద్భవుండగుట యెఱింగి, చతురంగ పీఠంబుపై కరచరణంబులు ఖండింపఁబడిన కతంబున నాతనికిఁ జౌరంగనాథనామంబిడి తండ్రి కెఱింగించి వానిందోడ్కొని బదరికాశ్రమంబునకుంజని, యచ్చట ఘోరతపోనియమంబునఁ గరచరణములతోఁ గూడ మహాసిద్ధుల నాతఁడు బడయునట్లుచేసి యనుగ్రహించెను.
చేమకూర వెంకటకవి సారంగధరచరిత్రకుఁ బీఠిక వ్రాయుచు నందా కథకు మూల మనందగిన చౌరంగికథ నవనాథ చరిత్రములం దిట్లు గలదని యీ క్రిందికథను వేదము వెంకటరాయశాస్త్రులుగా రిచ్చియున్నారు. రుద్రపురమున భులేశ్వరుఁడను రాజుగలఁడు. అతనికి చంద్రావతి, శోభావతియును నిద్దఱు భార్యలు, శోభావతి సవతిని వేలార్చుటకై యామెపై ఱంకులుమోపి గర్భిణియగు నామె నరణ్యమునకు వెడలఁగొట్టించెను. ఒక శివాలయముకడ నొకగంధర్వకన్య యీమెకుమత్స్యేంద్రవ్రతమునుపదేశించెను. చంద్రావతియు మునుల యాశ్రమమున నొకసుతునిఁగని, చంద్రశేఖరుఁడని మునులచే నామకరణము చేయఁబడిన యాతనికి మత్స్యేంద్రోపాస్తి నుపదేశించెను. ఒకప్పుడు భువనేశ్వరుఁడు యజ్ఞముచేయుచుండఁగా మునీశ్వరులతోఁగూడి యీ కుమారుఁడచ్చటకుఁ బోవుటయు యజ్ఞ భూమికడ మునిశిష్యులతో బంతులాడుచున్న యీ కుమారుని శోభావతి చూచి మోహించి, యాతనిబంతి తన చేటికచేఁ దెప్పించికొనెను. బంతి యడుగఁబోయిన చంద్రశేఖరునికిని శోభావతికిని పావుర మడుగంబోయిన సారంగధరునికి చిత్రాంగికి జరిగిన వృత్తమె జరిగినది. శోభావతీ ప్రేరణంబున రాజు చంద్రశేఖరుని కాలుసేతులు తలారులచేఁ దఱిఁగించెను. మత్స్యేంద్రనాథస్మరణముచే నాతఁడు కాలుసేతుల మరలఁ బడసి తల్లియొద్దకుఁబోయెను. రాజు తథ్యమును దెలిసికొని శోకింప మత్స్యేంద్రనాథుఁ డాతనిచేఁ బ్రాయశ్చిత్తముగా నొక శివాలయము నిర్మింపఁ జేసెను. అదియే బదరికాశ్రమమున భులేశ్వర మను పేర నున్న శివాలయ మఁట.
వీనినిఁ బోలినకథ యొకటి కొంత భేదముతోఁ గన్నడభాషలోఁ గూడ 'కుమార రాముని కథ' యను పేరుతోఁ బొడసూపుచున్నది. పదునాల్గవశతాబ్దిని కంపిలిరాయఁ డను రాజొకఁడు హంపీ సమీపమునఁ గల కంపిలినగరము పాలించుచుండెను. ఈతనికిఁ గుమారరాముఁడను కుమారుఁడొకఁడు కలడు. ఈతఁడు మహాశూరుఁడు. బాహుబలపరాక్రమశాలి. దిగ్విజయార్థము బయలుదేరి యనేకులగు రాజుల నోడించి, తండ్రికిఁ గప్పముగట్టునట్లు చేసెను. మిక్కిలి బలవంతుఁడగు బళ్లాలరాజు నెదుర సమకట్టి ఓరుగల్లు ప్రతాపరుద్రుని సహాయమును వేఁడ, నాతఁడందుల కొల్లనందున నాతనితోఁబోరి ప్రతాపరుద్రకుమారుని బంధించి పిదపవానిని విడిచిపుచ్చి, ఢిల్లీసుల్తాను సాయమును గోరెను. ఒకనాఁడు కంపిలిరాయఁడు వేఁటకై యరణ్యమునకుఁ బోయిన సమయమున కుమారరాముఁడు స్నేహితులతోఁ జెండ్లాట నాడుచుండ నా బంతి విధివశమున రాజు రెండవభార్యయగు రత్నాజిమేడపైఁ బడెనఁట. దానిని తెచ్చుకొనుట కీతఁ డచటికిఁబోయి యామె నడుగఁగా నామె నీతనినిమోహించి, క్రీడాగృహమునకు రమ్మనుటయు, నాతఁడా పాపకార్యమున కంగీకరింపక విదిలించుకొని పాఱిపోయెను. రా జరణ్యమునుండి యింటికి రాగానేరత్నాజి కుమారరాముఁడు తండ్రియింట లేని సమయముఁజూచి తన మేడకు వచ్చి తన్ను బలాత్కరించెనని కొండెములు చెప్పఁగా, రా జామె మాటలను నమ్మి కుమారునికి మరణదండనము విధించెను. మంత్రియగు బయిచప్పు రత్నాజి చేసిన మోసమును దెలిసికొని కుమారు నొక పాతాళగృహమున దాఁచి, యాతని వధింపించితి నని రాజుతోఁజెప్పి యాతనిని సమ్మతింపఁజేసెను. రా జన్యాయముగఁ గుమారుని జంపించె నన్న వార్త లోకమునవ్యాపించెను. ఈ సందర్భమును ఢిల్లీ సుల్తాను దెలిసికొని, కంపలి రాజ్యమును స్వాధీనము చేసికొనుటకై కొంత సైన్యముతో బహదూర్ ఖానునుబంపి, యాతఁడద్దానిని సాధింపలేక పోఁగాఁదానె స్వయముగా వచ్చి కోటను ముట్టడించెను. అప్పుడు కుమారరాముఁడు జీవించియున్నచో శత్రువును సులభముగా పాఱఁద్రోలి కోటను రక్షించియుండెడివాఁ డని జనులందఱు రాజును నిందింప సాగిరి. ఆ సమయమున బై చప్పమంత్రి భూగృహమునుండి కుమారరామునిఁ దీసికొనివచ్చి, యాతని ముందిడికొని కోటవాకిలి దెఱచుటయు, నా కుమారరాముఁడు శత్రుసేనలనుఁ జెండాడి, యావలికిఁ బాఱఁద్రోలెను. కాని ఢిల్లీ సుల్తానుసేన లపారముగా నుండుటచే, వారితోఁ బోరాడుచు కుమారరాముఁడు రణరంగమునఁ బ్రాణముల విడువవలసిన వాఁడయ్యెనఁట.
ఇట్లీ కుమారరామ చరితమును కన్నడమున రచించినవాఁడు గంగాధరుఁ డను శైవ కవి. ఈతని కాలము నిశ్చయముగాఁ దెలియకున్నను, పదునాల్గవ శతాబ్ది పూర్వభాగమున ఢిల్లీ సుల్తాన్‌గానున్న మహమ్మద్ బిన్ తుగ్లకు అనునాతఁడు కంపిలిరాయనిపై దండెత్తి యా నగరమును స్వాధీన పఱచుకొనినట్లు, చారిత్రక నిదర్శనములుఁ గలవు. రాజమహేంద్రవరమందు వలెనే అచ్చటను గొన్ని స్థలములను 'చిత్రాంగి మేడ రత్నాంగి మేడ యున్న స్థలము' లని చెప్పిచూపుచుండు వాడకయుఁ గలదఁట. కాలుసేతులు నఱుక బడిన పిదప, సిద్ధుఁడగుటను గూర్చిన గాథ లేకపోయినను, మొత్తముకథలోఁ గొంత సామ్యము లేకపోలేదు. మన సారంగధరుని కథ మహారాష్ట్ర దేశమునకు సంబంధించినదిగా గౌరన చెప్పుచున్నాఁడు. ఈతఁడు శ్రీగిరికవి వ్రాసిన పద్య ప్రబంధమును బట్టిగదా వ్రాసినాఁడు. ఆతఁ డీతనికి పూర్వుఁడై యుండును. మఱియు బౌద్ధ జాతకములలో గూడ, వీనిని బోలిన కథయే గలదఁట. దీనినిబట్టి విచారింపగా, కొన్ని యితిహాస . పురాణములలోని గాథల నాయా దేశములవా రొక్కొక కాలమున తమ తమ దేశములందుఁ బ్రబలిన ప్రసిద్ధపురుషుల కథలతో ముడివెట్టికొని, యా యా స్థలమహత్మ్యములను బ్రకటించు రీతిగా నీ సారంగధరుని కథ మిగులు ప్రాచీనమే యై, దేశ కాలములను బట్టి, పెక్కు మార్పులనుఁ బొంది, యనేకరూపములఁ బొడగట్టుచున్నదని చెప్పఁ దగియున్నది. మొత్తముమీఁద, గౌరనకాలమునాఁటికి సారంగధరునికథతో నాంధ్రదేశము నేలిన చాళుక్య వంశీయుఁడగు రాజురాజునకుఁ గాని, నన్నయభట్టీయమునకుఁగాని సంబంధములే దని నిశ్చయింపవలసి యున్నది.
రచనలు, కవితావిశేషములు.
గౌరనకవి యాంధ్రరచనములలో హరిశ్చంద్రద్విపద ఇదివఱకే ప్రకటింపఁబడి ప్రసిద్ధమై యున్నది. సంస్కృతమున లక్షణదీపిక యను నొక గ్రంథమును గూడ నీతఁడు రచించెను. అందుఁగూడ రేచర్లవంశాంబుధిపూర్ణ చంద్రుఁడగు సింగయ మాధవేన్ద్రునికి మహామాత్యుఁడగు పోతరాజునకు సోదరుఁడైన అయ్యల ప్రభుని తనయుఁ డగు గౌరనార్యు డని చెప్పుకొనియున్న ట్లింతకుఁబూర్వ ముదాహరింపఁ బడిన శ్లోకములను బట్టి తెలి యుచునే యున్నది. అనేక లక్షణ గ్రంథములనుండి యేర్చికూర్చిన యుదాహరణములతోఁ గూడిన గ్రంథమీ 'లక్షణ దీపిక '.
“ఉదాహరణ రత్నాని లక్షణ గ్రన్థసన్ధిషు,
సమాకృష్య సతాం భూత్యై వక్ష్యే లక్షణదీపికాం”.
అని చెప్పియున్నాఁడు. ఈ గ్రంథమునందలి విషయ సూచిక యిది:-
"వర్ణానాముద్భవఃపశ్చా ద్య్వక్తిసంఖ్యా తతఃపరం
భూత బీజవిచారశ్చ తతోవర్ణగ్రహానపి
ప్రయోగనిర్ణయన్తేషాం శుభాశుభ ఫలానిచ
గణానాంచాభిధానాని స్వరూపాణ్యధిదేవతాః
వర్ణ భేదగ్రహా స్తత్ర శుభాశుభ ఫలానిచ
మిత్రామిత్ర విచారశ్చ నక్షత్రాణిచ రాశయః
మృతవేళాగ్రహావస్థా మాతృకా పూజనక్రమః
కర్తుః కారయితుశ్చైవ ప్రబన్ధానాం చ లక్షణం,
వక్ష్యతే తత్ర సకలం మయా లక్షణవేదినా. "
ఇందు చమత్కారచంద్రిక, సాహిత్యచూడామణి, శారదాతిలకము, రూపావతారము, బృహజ్జాతకము, సాహిత్య చంద్రోదయము మొదలగు ననేకలక్షణగ్రంథములనుండి యా యా విషయములను గూర్చిన ప్రమాణ శ్లోకములు సంగ్రహింపఁ బడియున్నవి. గ్రంథాంతమున నీ శ్లోకము గలదు.
"ఏషా లక్షణ దీపికా విజయతే విద్వజ్జనానన్దినీ
ఛందో వ్యాకరణాద్యనేక వివిధ గ్రంథప్రయోగాన్వితా
గర్వాత్సర్వ కుతర్కకర్కశ కవిశ్రీవాసదాసాశ్రిత
వ్యాళీ సత్కవిరాజకల్పలతికా కల్పాంతరస్థాయినీ”
“చెలఁగి ఋగ్వేద ప్రసిద్ధుఁడై జగతి
వెలయు హరిశ్చంద్రవిభు పుణ్యచరితఁ
గవితాచమత్కృతిఁ గాంచి హర్షించి
కవులందఱును శిరఃకంపంబు సేయఁ
బచరించి వీనుల పండువుగాఁగ, రచియింతు"
నని తన కులక్రమమును జెప్పికొని, “శ్రీ కరంబుగ విరచింప నేగోరు నా కథావృత్తాంత మదియెట్టులనిన,” అని వెంటనే కథాప్రారంభమును జేసినాఁడు. పూర్వభాగాంతమున భాగాంత విశేషములను నియమములను నేమియుఁ బాటించలేదు. ఉత్తర భాగాంతమున మాత్రము-
“భ్రమరాప్రసాద సంప్రాప్త కవిత్వ
సుమహితసామ్రాజ్య సుఖపరాయణుఁడు
చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి
ప్రతివాది మదగజ పంచాననుండు
మతిమంతుఁ డయ్యల మంత్రిపుంగవుని
సుతుఁడు గౌరనమంత్రి సుకవిశేఖరుఁడు
కవు లెన్న నుత్తర కథ రచియించె"
అని మాత్రము చెప్పి ఫలశ్రుతితో గ్రంథమును ముగించెను. అనఁగా నీ గ్రంథరచనా సందర్భమున దేవమానవులయొక్క ప్రేరణము గాని, వారి కంకిత మిచ్చుటగాని సంభవింపలేదు. కావుననే యిది యాతని తొలి రచన యేమో యని సందేహించుట కవకాశముకలదు. కాని యిదియే యీతని బుద్ధి పరిపక్వముఁ జెందిన పిదప నొనరించిన ప్రౌడరచన యనిపించుటకుఁ దగిన నిదర్శనములును లేకపోలేదు. నవనాథ చరిత్ర రచనాసందర్భమున, మల్లికార్జున భ్రమరాంబికలను హేరంబునేగాక యిచ్చటి కథాసందర్భమున కనుకూలముగా వీరభద్రుని నందికేశ్వరుని ప్రమథగణములను సిద్ధముఖ్యులనుఁ గొల్చి, బాణాది సత్కవులకు మొక్కినాఁడు. సప్తసంతతులందును గవిత్వ మాకల్పమైన కీర్తిని గలిగించునదిగావున నేదైన నొక కథావృత్తాంతమును కావ్యముగ రచింపఁదలఁచి నట్లు చెప్పియున్నాఁడు, అంత, శ్రీశైలమఠాధిపతియగు ముక్తిశాంత భిక్షావృత్తిరాయఁడు రాజఠీవిని గొలువుండి, అవిరళ యోగ విద్యాధికులైన నవనాథవరుల పుణ్యప్రవర్తనల పరగ శ్రీగిరికవి పద్య బంధముల విరచించినాఁడది ద్విపదకావ్యముగఁ జెప్పింపవలయుఁ బ్రసిద్ధివెంపలర,
"ఇప్పుడు గల సుకవీంద్రులలోన
సరససాహిత్య లక్షణ వివేకముల
నురుచిర మధుర వచోవిలాసముల
గుణశీలములను సద్గుణకలాపముల”
నలవడ్డవాఁడెవ్వఁడని విచారించి నాఁడఁట. పిదప, గౌరనాహ్వయుఁ బిలిపించి నవనాథచరితంబు ద్విపదకావ్యముగాఁజెప్పి శంకరున కంకితం బొనరింపు మన్నాఁడు. దీనినిబట్టి సప్తసంతానములలో నొకటి గావున నొక కృతి రచింపఁ దలఁచితినని చెప్పుకొనుట, సరససాహిత్యలక్షణ వివేకము లలవడ్డ వాఁడెవ్వరని విచారించి శాంతరాయఁడు తెలిసికొనవలసి వచ్చుట, మొదలగునవి యిది యీతని తొలిరచనయే గావచ్చుననిపించు చున్నవి. హరిశ్చంద్ర రచనాకాలమునాఁటికీతఁ డీ బాహ్యాడంబరముల నన్నిటినివదిలిపెట్టినను, సరస సాహిత్యలక్షణ విచక్షణుఁడను బిరుదవిఖ్యాతిచేఁ బెంపొందిన వాఁడ'నని చెప్పి కొన్నాఁడు. ఇప్పటి కితనికి స్వీయరచనాపటిమయందు నమ్మకము గూడఁ జిక్కి,నట్లున్నది. కావుననే యీ కావ్యమును దన కవితా చమత్కృతిఁగాంచిహర్షించి కవులందఱును శిరఃకంపంబుసేయఁ బచరించి వీనులపండువుగాఁగ నీకావ్యమును విరచింతు' నన్నాఁడు. దీనిని వెనుకటిదానివలె చరిత్ర కథనము మాత్రముగాఁ గాక, కవితాచమత్కృతినిజూపుచు రసవంతమైన ప్రౌఢప్రబంధముగాఁ జేయ వలయుననియే యీతఁడుతలపెట్టిన ట్లగపడుచున్నది. దానికిఁ దగినట్లుగనె తొలి కావ్యమందు బాణాదికవులను దలఁచిన వాఁడీ హరిశ్చంద్ర ద్విపదలో కాళిదాసాదులగు మహాకవుల" నభిమతసిద్ధికిఁ దలంచినాఁడు. నవనాథ కథాకథనసందర్భమున బాణుని, కవులకు శిరఃకంపంబు గలిగింపఁగల రసవత్కావ్యరచనా సందర్భమునఁ గాళిదాసును స్మరించుట యుక్తంబే గదా! శివకవులు వాస్తవముగా భవికవులను స్మరింపనే స్మరింపరు. గౌరన యితరశైవకవులవలె నాంధ్రకవులను స్మరింపలేదుగాని, బాణ కాళిదాసులను మాత్రమెట్లో స్మరించినాఁడు. ఈతఁనికి శైవమునందంత పట్టుదల లేనట్లున్నది. ఋగ్వేదకాలము నుండియుఁ బ్రసిద్ధంబై యుండిన హరిశ్చంద్రకథను జెప్పుదుననుచు, దానిని విశేషముగా స్మరించినాఁడు. హరిశ్చంద్రలోఁ గృతిపతియే లేక పోవుటచేఁ గాఁబోలు, షష్ఠ్యంత రచన మొదలగువానిని బాటింపకున్నను నవనాథచరిత్రమున షష్ఠ్యంతములతో "సర్వజ్ఞునకు ముక్తిశాంతరాయనికి ” అనవరతాభ్యుదయాభివృద్ధిని గోరి, “శ్రీ మల్లికార్జున శ్రీ మహాదేవుపేరఁ" దన గ్రంథమును రచించెను. సోమనాథాదుల కృతులలో షష్ఠ్యంతములు లేవు. కృత్యాదిని ఆశ్వాసాంతమునను గూడఁ గృతిపతినిగూర్చిన సంబోధనలు మాత్రముకలవు. పూర్వకవుల ప్రబంధ ఫక్కి నెఱింగినవాఁ డగుటచేఁ గాఁబోలు, గౌరన షష్ఠ్యంతములను గ్రంథరచనను బ్రోత్సహించిన శాంతరాయనియెడలఁ బ్రయోగించి, యాతని కభ్యుదయాభివృద్ధులనొసఁగు శ్రీగిరిభర్త పేరగ్రంథమురచింతునని వాక్యాన్వయమును గుదుర్చుకొనినాఁడు. ఇట్లు కృతిపతి ' పేర' రచించుఫక్కి ద్విపదలలో రంగనాథ రామాయణమునఁ గనఁబడుచున్నది. అక్కడ కృతిపతి కోన విఠలరాజు రామాయణమును “దన పేర' రచింపు మని బుద్ధారెడ్డితోఁ జెప్పినట్లు కలదు. కావున నాతఁ డట్లుచేసెను. ఆ ఫక్కి యే గౌరన మల్లికార్జునుని విషయమునఁ గూడ నవలంబించియుండును. హరిశ్చందద్విపదలోఁ బూర్వప్రబంధ రచనాసంప్రదాయములు పాటింపఁబడకున్నను, అందలి రచనాఫక్కి సంభాషణ శైలి, స్వభావోన్మీలనశ క్తి జాతీయపయోగనై పుణి, రసావిష్కరణ దృష్టి భావౌచిత్యపోషణము మొదలగునవి దీనినొక ప్రౌడప్రబంధముగఁ జేయుటయే గాక గౌరనామాత్యునికిఁగల “సరససాహిత్య లక్షణవిచక్షణుఁడను" బిరుదును సార్థకము చేయుచున్నవి. నవనాథచరిత్ర యాతని తొలిరచన యగుటచేతనో, అది మఱియొక కావ్యమున కనుసరణమగుటచేతనో యొక విధమగు మత గ్రంథముగాఁ బరిగణింపఁ బడుటచేతనో, గౌరన పరిణత కవితారచనాశక్తి దీనియందంతగాఁ గనఁబడుటలేదు; కాని భావములయందు పోకడలయందు నీ రెంటికిని విశేషసామ్యము కల దనుట క నేకనిదర్శనములు కలవు. కొన్నిచోటుల నొక దానిలోని వాక్యములును ద్విపదభాగములును మఱియొకదానిలోఁ గనఁబడుచుండును. శాంతరాయల కొలువును వర్ణించు సందర్భమున నాతఁడు,
“కర్పూర హిమజల కాశ్మీరమిళిత
దర్పసారాంబుసిక్త ప్రదేశమును
దపనీయ జాలకాంతరగత ధూప
విపుల సౌరభసమన్విత గంధవాహ ...
భాసిల్లునిజ సభాభవనంబునందు
శ్రీసముజ్జ్వల రత్నసింహాసనమున
నాసీనుఁడై యుండె.”
హరిశ్చంద్ర ద్విపదలో దేవేంద్రుఁడును.......
"గలిగి నానాధూప గంధ బంధురముఁ
గర్పూరచందన కాళ్మీరమిళిత
దర్పసారాంబు సిక్తప్రదేశంబు
నిరుపమ నిజసభానిలయంబునందుఁ
బరఁగు చింతామణి భద్రపీఠమునఁ
దనరనాసీనుఁడై " యుండె నని వర్ణింపఁబడెను.
గంగావర్ణనము.
నవనాథ చరిత్ర - "అలినీల కుంతలి నావర్తనాభిఁ
గమనీయచక్రవాక స్తనిం జారు
కుముదగంధిని బినకోమలహస్త
నతులశైవాల రోమావళీ కలిత
నతిసమున్నత సైకతాంచితజఘన
లలితశీకరహార లతికాసమేత”
హరిశ్చంద్ర - "సరససైకతసీమ జఘనంబు గాఁగ
సురుచిరంబగు మేటినుడి నాభి గాఁగ
నునుఁదీఁగనాచులే నూఁగారు గాఁగ
నెనయు జక్కవలు పాలిండులు గాఁగ
సరవిఁ బెల్లెసఁగెడు జలకణపంక్తు
లరుదారు మౌక్తికహారముల్ గాఁగ"
మీననాథుఁడు హిమవంతమునకుఁ బోవునపుడు మార్గమధ్యమునఁ గాశినిదర్శించుట, హరిశ్చంద్రుఁడు కాశికిఁ బోవుట యను సందర్భముల జేయఁబడిన కాశీవర్ణనమందలి సామ్యము: ---
నవనాథ- " వినుఁడు విప్రునిఁ దెగవేసినవాఁడు
అనిశంబు ననృతంబులాడెడివాఁడు
కామించి గురుపత్నిఁ గవసినవాఁడు
సొలవక వచ్చియిచ్చట మృతినొంది
కన్నువినుకలి కంకణమునుదమ్మి
గన్నపాపని పుఱ్ఱె కంచంబు నలఁతి..."
హరిశ్చంద్ర - "కామాక్షి, విప్రుని వధియించునతఁడు,
కామాంధుఁడై తల్లిఁ గవిసినయతఁడు ...
జంతు సముదాయమైన నిచ్చటమృతిఁబొంది,
మిన్నేటి జడలును మిక్కిలి కన్ను
పులితోలు గాసెయు పునుక కంచంబు,
గల యితఁడాతఁడై ... .... ..... ....."
హరిశ్చంద్రలో- “ధవళగోపుర చతుర్ద్వారబంధురము,
ప్రవిమల ముక్తాతపత్రసుందరము
నగణిత కనక కుంభాభిరామంబు,
నగు విశ్వనాథ మహాదేవు నగరు"
నవనాథ- "మహనీయ మగు ముక్తి మంటపంబులను
బహుపుణ్య కథలు చెప్పఁగ విన్నవారి
వరుసఁ జాంద్రాయణ వ్రతములు నెలలు
జరుపుచు మృతికి వాచఱచెడి వారు
శరభచర్మములవై శంఖమయూర
గోముఖా ఘోర కుక్కుట మత్స్య సింహ ...
నామ విచిత్రాసనస్థులై బడలు ... .... .....
పెదవు, లొక్కింత గదలంగ నుజ్వలస్ఫటిక
జపమాలికలు వ్రేళ్ల జరుపుచు మంత్ర
జపములు నిష్ఠమై జరిపెడువారు,
ధర్మరతులను యతులను, వ్రతులనుం బాశు
పతులను జూచుచు" నేగి-
ఇట్టి వర్ణనారీతియందలి భేద మాయా గ్రంథసందర్భములను బట్టి కవికిఁ గలిగిన దృష్టి భేదమును సూచించుచున్న దనవచ్చును. పై కాశీ విశ్వేశ్వరునినగరు వర్ణించినరీతియే నవనాథచరిత్రమున మల్లి కార్జునుని ప్రాసాదవర్ణనమునఁ గనబడుచున్నది.
ధవళగోపుర చతుర్ద్వార బంధురము,
ప్రవిమల ముత్తాతపత్రరాజితము,
నరుణవితాన రమ్యమును సమర -
పటు ఘంటికాముఖ్య బహువాద్య రవము
నైన శ్రీమహ మల్లికార్జున నగరు-
నవనాథచరిత్రములోని వంచక పురోహితుని యాకారచర్యా విశేషములు చాలవఱకు హరిశ్చంద్రలోని కాలకౌశికునియందు మూర్తీభవించినవి. ఈ పురోహిత పంచాంగబ్రాహ్మణుల చర్యల నాధారముగాఁ జేసికొని గౌరనామాత్యుఁ డీ రచనలలో హాస్యరసమును జక్కగాఁ బోషించినాఁడు. ఆంధ్రకావ్యములలో హాస్యరసపోషణము చాలఁ దక్కువయనియే చెప్పవలసియున్నది. గౌరన యీ గ్రంథములఁ దనకుఁ గలిగిన యవకాశమును జక్కఁగా వినియోగించికొని యున్నాడు.
వీరి యాకారమునఁ గల సామ్యము---
నవనాథ - బలువుగప్పిన గొగ్గి పండ్లును బిట్టు
పడికి కంపెసఁగెడి బడబాకి నోరు
బెడనుచెవులు గుఱు పీఁచుగడ్డమును
పిల్లికన్నులు బల్ల పెరిగిన కడుపు,
గలుకును మెడమీది కంతియు నీచ
బోయిన పిఱుదును బుస్తుదోవతియు--
చిల్లులొరసిన కరతిత్తియును నలవడగ-"
హరిశ్చంద్ర - "పేలు రాలెడు సిగ పెడతల గణితి
పిల్లి కన్నులు గుఱు పీఁచు మీసములు
నఱువుదోవతియుఁ బంచాంగంబు ముష్టి
బరగిన కరతిత్తి పత్రాల సంచి ...
నవనాథ- " బడుగులు వెళ్లింతు బ్రహ్మరాక్షసికిఁ
గుడుతుఁ బీనుగుమోచి కొంపోదు కాల... ...
ధరియింపరాని దుర్దానముల్ గొందు
ఖరకర హిమకర గ్రహణ కాలమున
గడికి నొక్కొక్క నిష్కము చేత నిడఁగఁ
గుడుతును బులగము కుత్తుక 'మోవ...
ఇది మందసములో నప్పుడున్న యెలుగును రాజపుత్రియే యని తలంచి యమెకుఁ దనపైఁ బ్రేమగలుగుటకై యతఁడు చెప్పికొనిన విశేషగుణముల వర్ణనము, హరిశ్చంద్రలోఁ గాలకౌశికునియందు నిట్టి గుణములే వర్ణింపఁబడినవి.
“ప్రేతవాహకునిగాఁ బిలువ రెవ్వరును
బ్రాతిగా వెడలింప బడుగులు లేవు
బొమ్మరాకాసుల భోజనమ్ములకు
రమ్మని ప్రార్థింపరాఁ డొక్కరుండు ..
పిండివంటలు నెయ్యి బెల్లంబుఁ బ్రప్పు
గండశాంతులఁ దృప్తిగాఁ దినలేదు
కడికడి కొకమాడ గ్రహణకాలమున
వడివీడ దోవతి వదలించుకొనుచు
బెరుగు వంటకము పేర్పెఁడు దినలేదు ...”
సంతోషము కలిగినపుడు వీరిచేష్టలు —
నవనాథ- "సాముచేయుచు మల్ల నరచుచుఁ గోల
వేమాఱు విసరుచు విస్తూప మెసఁగఁ
బనసలు చెప్పుచు బ్రమసి పాఱుచును
గునియుచుఁ జప్పట్లుగొట్టి యాడుచును,
కనుగొని హాస్యంబుగా వికారంబు,
లొనరించి వగ్గు కోఁతికి సివము వచ్చినరీతి "
హరిశ్చంద్ర- "వెక్కిరించుచుఁ గోలవిసరుచు ...
గంతులువైచుచుఁ గరతాళగతుల
నంతంత నాడుచు నంతటఁబోక
పలువిస్వరంబులఁ బనసలు కొన్ని
చెలఁగి త్రస్సలు మీఁదఁ జిలుక చెప్పుచును
జెనటికోఁతికి వీరసివమెత్తినట్లు -"
నవనాథచరిత్రలో సందర్భానుకూలముగ నీ విషయమును కవి చాలఁ బెంచి యీతనికిఁ గలిగిన సంతోషమునకునూచకముగ గోవింద గంతులు గూడఁ గొన్ని వేయించినాఁడు.
“మా వేఁడు కింతట మానదు మీకు
గోవింద గంతులు కొన్ని వేసెదము
పప్పుకూచికి నాల్గు భాస్కరు కై దు
అప్పలకాఱు జంధ్యాలకేశవుకుఁ
బదుమూఁడు గోవిందభట్టు పిన్ననికి
ఢేరవిఠలుకుఁ బండ్రెండు డోరాల,
వీరయ కెనిమిది వీధిమాధవుకు”
సామాన్యవిప్రజనసంఘమున నిట్టిపేళ్లాకాలమున వాడుకలో నుండి యుండు ననుటకు నిదర్శనముగ నిట్టిపేళ్లపట్టిక యే యొకటి పాల్కురికి సోమనాథుని “పండి తారాధ్య చరిత్ర”లోఁ గనఁబడుచున్నది.
“దామోద రప్పన్న వామనకూచి
చప్పట్లపెద్ది యంశమునూరబోతి
పప్పుకేశవుఁడు సంభవుల మాధవుఁడు
దోనయభట్టును ధూర్తవిఠ్ఠలుఁడు”
సరోవరవర్ణనమునందలి యుత్ప్రేక్ష. యీ రెండు గ్రంథములలో నొక్క రీతినె కలదు.--
నవనాథ- "వీచికాందోళన వికచారవింద, కుముద నీలోత్పల కుసుమపరాగ సముదయవాసిత సలిలమై విపిన, దేవతాకరతల స్థితదర్పణంబు కైవడిఁ గడునొప్పు కమలాకరంబు"
హరిశ్చంద్ర- “కమలనీయవిలసిత కమలకల్హార, కుముదనీలోత్పల కుసుమసుగంధ మధుకర మిథున సమ్మదకరమృదుల ... సౌరభ వాసిత సలిలమై చైత్ర దర్పిత వనదేవతాకరస్ఫటిక, దర్పణంబునుబోలెఁ దనరారుచున్న కొలను గనుంగొని కువలయేశ్వరుఁడు. "
ఆశ్రమవర్ణనము
నవనాథచరితమున శ్రీనగమందలి కోఁతులు వృద్ధమునులకు ఫలపుష్పమూలముల నిచ్చుట, పరభృతములు పంచాక్షరీమంత్ర పఠనముచేయుట, పాములు రంధ్రద్వారములఁ దలలెత్తి మునికుమారుల సామగానములను విని సొక్కియాడుచుండుట, శివపరాయణముచేయు సద్భక్తనివహంబునకుఁ బెబ్బులులు తమకాయంబు నొరగుగద్దియలుగాఁ జేయుట, మొదలగువాని వర్ణనము హరిశ్చంద్రలోని విశ్వామిత్రాశ్రమమందుఁ బులులు, లేళ్లు, ముంగిసలు, పాములు, పిల్లులు, మూషికములు, నెమళ్లు, పన్నగములునుదమసహజవైరమును విడిచియుండుటయుఁ గోయిలలు సామగానంబులు సల్పుట, చిల్కలు మినుకుల గఱపుట, హోమధూమము లాజ్యగంధములను వెదజల్లుటయు మొదలుగాఁ గల వర్ణనముతోఁ గొంతసామ్యము గలిగినదై యున్నది. ఇట్లు సందర్భాను కూలముగా నొకటి శైవమహాక్షేత్రమును, రెండవది వైదికాచారసంపత్తిగల ఋష్యాశ్రమమును వర్ణించుచు సందర్భరమణీయములై యున్నవి.
అట్లె నవనాధచరితమునందలి చిత్రాంగి సౌందర్యవర్ణనము, మాలెతల సౌందర్యవర్ణనముతోఁ గొంతవఱకుఁ బోలియున్నను, హరిశ్చంద్రోపాఖ్యానమందలి దింతకంటె ప్రౌఢరచనలతోడను సంభాషణలతోడను గూడియున్న దనవలసియున్నది.
నవనాథ — “గమకించియందెలు ఘల్లుఘల్ల నఁగ
మొలనూలు రంతుగా మ్రోయ మాణిక్య
కలితకంకణ ఝణత్కారంబు లెసఁగ
నొసపరి బాగుగా నొదవిన నడల
.... ...... ..... ..... ...... ..... ...... ..... .....
తరళహారంబుల తళుకులు చెదర
నెరయు వెన్నెలగాయు నెఱనవ్వుదోప
.... .... .... .... .... .... .... .... .... ..... ....
హరిశ్చంద్ర — “రతినాయకుని యాజ్ఞ రంతుగాఁ జాటు
గతినందియలు ఘల్లుఘల్లున మ్రోయ
మొలనూళ్లగజ్జల మ్రోఁతకు రత్న
కలితకంకణములు గమకంబుసూప
మదహంస గతులను మఱపించునడల
గదలు మట్టెలు తాళగతులకుఁ దాక
దంతకుండలముల తళుకులు మెఱసి
వింతగాఁజెక్కుల వెన్నెలల్ గాయ
..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
హరిశ్చంద్రలో “విద్యలవార "మని చెప్పికొనిన మాతంగకన్యల వర్ణనము వారుచూపిన సంగీత విద్యాకౌశలమునకుఁ దగిన రచనాప్రౌఢిమ గలదై యున్నది. వీరి నవ్యగీతామృత లహరికి వీణాదండము చిగురొత్తినది, హార మాణిక్యములు గరఁగినవి, వన్నె చిత్రములుచైతన్యమును బొంది తలలు గదల్చినవి. ఇఁక వీరికిని హరిశ్చంద్రునకును జరిగినసంభాషణరీతి గూడఁ బ్రౌఢప్రబంధ రచనలను దలఁపించుచున్నది.
“ఈ రత్న భూషాదు లేటికిమాకు,
నీరువ ట్టాఱునే నెయిద్రావికొనిన.
..... ..... ..... ..... ..... ..... ..... ....."
ఇంకను నిట్టి జాతీయపద ప్రయోగము లిందు నవనాథచరితమునకంటె విశేషముగాఁ గనఁబడుచుండుటచే నిది కవియొక్క భావరచనాపరిణతిని నూచించుచున్నదని తలంపవచ్చును.
“ఱంతుగా నాఁబోతు ఱంకెవేసినను
గంతులుతక్కునే కంఠీరవంబు,
వారికి మనతోడ వైరంబుఁ బూని,
పోరాడ నేధనంబులు పొత్తువోవు?'
“భూపకీటమ వేరు పురుగవై తీవు
కొఱవి నౌ దల గోకికొంటివి క్రొవ్వి”
తమకించి లోహశోధనము లాఁకటికి
నమలవచ్చు నెటు మైనపుదంతములకు”
“నిప్పును జెదలంట నేర్చునే మాకు.”
"వల్లెత్తిఎలుకలఁ బట్టనోపినను
పిల్లి శాస్త్రమె మంటిపిల్లియే చాలు”
“నేఁ గినిసితినేని, చక్కబెట్టఁగలేరు సాదురేఁగినను
బొక్కి నిల్వదు తల పొలమునఁగాని”
ఈ తుదివాక్యము తిక్కనార్యుని భారతమునందలి యీ క్రింది పద్యమును దలఁపించుచున్నది. ఉద్యో -2-13)
“అనుజులకు నడ్డపడి యే
మినిజేయఁగ నేమిఁ జూచి మెచ్చితిగా కీ
వును సాదు రేఁగెనేని
న్విను తలపొలమునన కాని నిలువదు సుమ్మీ”
మొత్తముమీఁద శైవసిద్ధులగు నవనాథుల చరిత్ర నుద్ఘాటించుటె ప్రధానముగాఁ గల యీ గ్రంథమున సందర్భానుకూలములు రసానుగుణములు నగు వర్ణనములు భావములును గనఁబడుచున్నను, హరిశ్చంద్ర ద్విపద యీకవి రచనాప్రౌఢీని వెల్లడించుచు సరససాహిత్య లక్షణ విచక్షణత్వమును సార్థకము చేయుచున్నదనక తప్పదు.
భాషావిశేషములు-
ఆంధ్రమునఁ బద్యప్రబంధ రచన కాదరము పెరుగుచున్న కాలమున దేశీయచ్ఛందమగు ద్విపదలోఁ బ్రౌఢకవిత్వమును వెలయించినవాఁడు గౌరన. అందు నంతకుఁ బూర్వము పద్యకావ్యముగ నున్న దానినె యందలి కథలను సర్వజనసామాన్యములుగఁ జేయుటకై ద్విపదగా రచించెను.
"ఒప్పదు ద్విపద కావ్యోక్తి నావలదు,
అట్టునుగాక కావ్యముప్రౌఢిపేర్మి
నెట్టన రచియింప నేర్చినఁ జాలు
నుపమింప గద్యపద్యోదాత్తకృతులు
ద్విపదలు సమమ భావింప.”
అని సోమనాథుఁడు. చెప్పినట్లీతఁడును వీనిని బ్రౌఢిపేర్మిని రచియించి గద్య పద్యోదాత్త కృతులతో సమముగానే చేసినాఁ డనవచ్చును. ఈ ద్విపద రచనలో సోమనాథునివలె గౌరన ప్రాసయతిని బ్రయోగించుటకుగాని, ద్విపదతోద్విపదసంధిల నేకశబ్దమును బ్రయోగించుటకుగాని యంగీకరింప లేదు, కాని సామాన్యముగా శివకవుల రచనలయం దగపడు ప్రయోగవిశేషములు కొన్ని యీతని రచనలలోఁ గానవచ్చుచునే యున్నవి. వ్రాఁతప్రతులనుబట్టి చూడఁగా శైవకవులు ప్రయోగించుచుండు వర్గప్రాసము నతఁడు ప్రయోగించెనేమో యను సందేహమునకుఁ దావిచ్చు ప్రదేశము లొండు రెండు కలవు.
సబిందు నిర్బిందు ప్రాసము నీ కవి తఱచుగాఁ బ్రయోగించియే యున్నాఁడు. బాగు, తీఁగెలకుఁ బ్రాసగూర్చినాడు. రేఫద్వయప్రాసము విషయమునఁ గూడ నీతనికిఁ బట్టింపు లేదు.
- ↑ అప్పకవికి సుమారొకశతాబ్ది పూర్వము, అనఁగా క్రీ. శ. 1560 ప్రాంతమున బాల
భాగవతమును ద్విపదకావ్యముగ రచించిన దోనేరు కోనేరునాథకవిని, కృతిపతియు, చాళుక్య
కంఠీరవుఁడును, బుక్కభూప ప్రపౌత్రుఁడు నగు చినతిమ్మభూపాలుఁడు, పరీక్షిత్తునుండి తన
తండ్రివఱకు 45 తరము లని వినఁబడుఁ గావున, నా వంశక్రమముఁ దెలుపవలయు నని ప్రార్థించుటయు, నాతఁ డట్లే చేయుచుఁ జంద్రవంశమునఁ జాళుక్యభూపాలునకు జగదేకమల్లుఁడు
నాతనికి విష్ణువర్థనుఁడు గలిగి రనియు, నాతనికిరత్నాజియందు విమలాదిత్యుఁడు, నాతనికి
భానుమతియందు రాజరాజ నరేంద్రుఁడు గలిగెననియు, నీతఁడు రాజమహేంద్రవరం బను
పేరి రాజధానింగట్టించి వేఁగిదేశం బేలె ననియు,
“ఆ రాజమణికార్యుఁ డగు పెద్దకొడుకు, సారంగధరుఁ డతిశాంతుఁడై యుండి,
ఆసక్తిఁ బినతల్లియైన చిత్రాంగి, చేసిన యూపదఁ జెచ్చెరఁ గడచి
అనఘుఁడై చౌరంగి యను సిద్ధుఁ డయ్యె, జననాథ నేఁడును జగతిపై నిలిచె
అతఁడె యా భారతాఖ్యానంబునందు, ప్రతిలేని మొదలి పర్వంబుల మూఁటి
నంచెఁ దెనుంగున నా నన్నపార్యుఁ, డందఱు వెఱగందు నట్లుగా నుడువ ,
అతఁడు శ్రీకాంతయం దాత్మజుఁ గనియె, చతురతోపేంద్ర భుజాళుక్యభీము”ఇందు వర్ణింపఁబడిన వంశక్రమము రాజమహేంద్రవరము నేలిన చాళుక్యవంశీయుఁడగు రాజరాజున కేమాత్రము సంబంధించినదిగాఁగనఁబడదు. నడుమ నాతనిపేరు మాత్రముజొనుపఁ బడిన ట్లున్నది. అందలి జగదేకమల్ల, విశ్వేశ్వర, కృష్ణకందాళరాయ, కళ్యాణ బిజ్జల మొదలగుపేళ్లు పశ్చిమదేశభాగము నేలిన రాజవంశములకు సంబంధించినవిగా నుండుటచేత, నా వంశములోనివాఁడే యైన మాంధాతపురాధీశుఁడగు రాజరాజును, నామసామ్యముచే రాజమహేంద్రవర పట్టణమున కధిపతిగా వర్ణించి యాతని కొమారుఁ డగు సారంగధరునిగూఁడ బేర్కొని, వీరిని విజయనగరాధిపుడైన చినతిమ్మ నృపాలుని పూర్వపురుషులనుగాఁ గని వర్ణించి యున్నాడు. ఇట్టి సందర్భము గలిగినపుడైనను, సారంగధరునకు నన్నయఫక్కితోఁ గల ,సంబంధమును గూర్చి యితఁ డేమియుఁ జెప్పలేదు. ఈ విషయము దేశమం దంతగా వ్యాప్తిగాంచి నట్లునులేదు. కావుననే యీతనికిఁ దరువాతివాఁ డగు చేమకూర వెంకటకవియు నీ కథ కాంధ్రదేశ సంబంధమును గల్పింపక, మాళవదేశమున జరిగినదానిగనె వర్ణించియున్నాఁడు.