నరుడు/మొదటి భాగం
నరుడు
.సాంఘిక నవల.
(మొదటి భాగం)
ఆ యువకుడు అలా ఎన్నిసార్లు కుళ్ళిపోయాడో చిన్నతనాన్నుంచీ అనంతమయిన ఆవేదనలతోనే అతని జీవితము ప్రవహించి వచ్చింది. వాళ్ళ ఊరి పురోహితుడు గారు “చదవడం మంచిదేరా ఎల్లమందా! కానీ నీ కులం సంగతి మరిచిపోకు,” అన్నారు.
ఆ పురోహితుడు సుబ్రహ్మణ్యం అవధానులుగారి దగ్గర వాళ్ళ తండ్రి పాలేరు. ఆ కుటుంబానికీ, ఈ కుటుంబానికీ ఎన్ని తరాలనుంచి సంబంధం ఉందో!
చంద్రయ్య మాదిగ కొడుకును చదువుకు పంపించాడు. చదువుకుందామని ఎల్లమందకు బుద్ధి కలగనేలేదు. చంద్రయ్యకూ కొడుకుకు చదువు చెప్పించాలని ఉద్దేశం మొదటలేదు.
చంద్రయ్య సాధారణ మాదిగకులం మనుష్యుడే అయినా అవధానులుగారి వేదాంత వాక్యాలు ఎప్పుడూ వింటూ ఉండేవాడు. ఉత్తమ వాక్యాలు వినగా వినగా రాయికన్నా సంస్కారం కలుగుతుంది. అవధానులుగారు అసలు వేదాంతం చంద్రిగాడికి చెప్పాడా? ఆయనకు వేదాంతం మాట్లాడడం అలవాటు. అవి ఆచరణలో పెడదామన్న భావానికీ, వేదాంత వాక్యాలు అంటూ ఉండడానికీ సంబంధం ఏమిటి? అవసరం వచ్చినప్పుడు ఏవో ముక్కలు అంటాం. అంతే వాని ఉపయోగం.
అయినా చంద్రయ్య మనస్సు నీటిని కోరే భూమిలా ఉన్నది. ఒక్క చుక్క నీరు పడినా, ఆ నేల ఆ చుక్కను పీల్చి దాచుకుంటూ ఉంది. అవధాన్లుగారు తెల్లవారగట్ల లేచి స్నానాదికాలు నిర్వర్తించి, సంధ్యావందనం పూర్తిచేసుకొని, పెద్ద గొంతుకలో ప్రాతస్మరామి శ్లోకాలు చదువుకుంటూ పనులు చేసుకుంటూ ఉండేవాడు. చంద్రయ్యకు ఆ శ్లోకాలన్నీ కంఠతా వచ్చాయి.
ఇంటికి వచ్చిన వారితో, అవసరమున్న వారితో, అవసరం లేనివారితో, పొలానికి వచ్చినప్పుడు పాలేళ్ళతో, పక్క పొలం కమ్మవారి వెంకటరెడ్డితో వేదాంతం మాట్లాడుతూనే ఉంటారు అవధాన్లుగారు.
“సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త!”
“విద్య యొసగును వినయంబు! వినయమునను బడయుఁ బాత్రత!”
“జీవితం ఒక స్వప్నం వంటిదయ్యా!”
“జ్ఞానం లేని మనుష్యుడు పశువుతో సమానం!”
ఈలాంటి రత్నాలు అవధాన్లుగారి నోట ఎన్ని వస్తూ ఉండేవో! ఇవన్నీ మాదిగ చంద్రయ్య జీవితంలో అంకితమయిపోయాయి. అందుకునే చంద్రయ్య కొడుకును ఊళ్ళో ఉన్న కిరస్తానీ బడికి పంపాడు. కిరస్తానీ బడుల ముఖ్యోద్దేశము కిరస్తానీ మతాన్ని కన్నీరుగా లోకంపై చల్లడమే. ఏది ఉద్దేశమయితేనేమి విద్య ఏదో రకంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం నీరు స్పష్టమయిన జలం కానేకాదు. ఏ పాఠశాలలో నయినా నిర్మల విద్యానీరాలు ప్రవహిస్తున్నాయి గనుకనా! స్థానిక ప్రభుత్వ సంస్థలు నెలకొల్పిన ప్రాథమిక పాఠశాలలోనూ అంతే, వీధులలోనూ అంతే!
పిపాసార్తునకు ఏజలమయినా అమృతమే! చదువుకుందామని బాలబాలికలకు ఉండనిమాట నిజమే! కాని వారి జీవితాలు వారికి తెలియకుండానే చదువుకోసం చేతులు చాచి ఉంటాయి. బడులకు పోయే బాలబాలికలు పాఠశాలలంటే కారాగృహాలన్నట్లు బెదిరిపోతారు. అయినా వారి మెదడులు ప్రతి జ్ఞాన లేశాన్నీ దాచుకుంటూనే ఉంటాయి.
మన ఎల్లమంద కిరస్తానీ పాఠశాలకు చిన్న మేకపిల్లలా వెళ్ళేవాడు. రోజురోజూ వాణ్ణి వాళ్ళమ్మ బడికి పంపించడం గండంగా ఉండేది. సోమమ్మకు ఎందుకు ఈ చదువో అర్థంకాలేదు. “సతుకులు సతికి ఎదవనాయాళ్ళూ కిరస్తానం అయిపోతారు.” అని ఆమె గోల. అందులో కుర్రవాణ్ణి పంపే బడి కిరస్తానీ బడి.
“కిరస్తానం అయితే ఏంటే!” అని క్రిష్టియన్ టీచరు గ్రేసమ్మ దెబ్బలాడేది. గ్రేసమ్మకు సోమమ్మకు హోరా హోరీ వాదన!
“మీరు పశువుల్లోంటి వోళ్లు! సచ్చిన గొడ్డుమాంసం తినే రాబందులు!”
“ఓసి! ఏడిశావులే! బ్రతికినదాని పేనం కసుక్కున నరికేసి తినే నక్కలు కారేంటి మీరు?”
ఎలాగయితే నేమి, ఎల్లమంద పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు నలుగురు. ప్రధానోపాధ్యాయుడు జీవానందం కరుణార్ద్ర హృదయుడు. నిజమయిన క్రిష్టియన్ మూర్తి. దయాంతఃకరణ ప్రవృత్తితో తన తోటి ఉపాధ్యాయులను, విద్యార్థులను తన బిడ్డలుగా చూచుకుంటాడు. అతడు క్రైస్తవగాథలు, బోధలు మహాభక్తుడై పులకలూరిపోతూ చెబుతాడు. అతడొక్కడే వేల కొలది మాలమాదిగలు అనబడే కులాల వారికి క్రైస్తవ మతదీక్ష ఇచ్చాడు. ఆయన ధర్మంలో ఎవరికీ బలవంతంగా మతదీక్ష ఇవ్వకూడదనీ, తిరిగి హిందూ మతంలోకి వెళ్ళదలచుకొన్న వారికి అడ్డం పెట్టకూడదనీ! .
చదువుకు కులం తేడాలు లేవు దారిలోపడితే ఆ చదువుల తల్లి అందరినీ సమాన ప్రేమతోనే చూస్తుంది. అసలు చదువువచ్చే ఘటం వేరు. కొందరు చదువుకుంటే వచ్చితీరే వారున్నారు. కొందరికి చదువుకుంటే, కష్టపడితే చదువు వస్తుంది. కొందరు కష్టపడి చదవకపోయినా ఆ మాయ చదువు ఎలా వస్తుందో వస్తుంది. కొందరు కష్టపడినా చదువు వస్తే వస్తుంది, రాకపోతే రాకపోవనూ వచ్చును. కాని కొందరు చదివేది, కుంభకోణ యోగం చేసేది, పుస్తకాల కంఠతా పట్టేది, చదువు చిరుదూరం దగ్గిరకన్నా రాదు.
ఎల్లమంద కష్టపడితే చదువు వచ్చే జాతివాడు. అలా కష్టపడుతున్నాడు, చదువు వస్తోంది. వాళ్ళ ఊరయిన భీమవరం తాలూకా జక్కరం గ్రామం వదిలి భీమవరం మిషన్ హైస్కూలుకు వచ్చి చేరాడు. అక్కడ కొందరుపాధ్యాయులయిన క్రైస్తవమత ప్రచారకులున్నారు. వారు క్రైస్తవులు. కాని మాల మాదిగ కులాలవారు ఎలా చదువుతారు? వారికి చదువెందుకు? అని వాదించుకుంటూ ఉంటారు. కాని ప్రధానాచార్యులవారు మాత్రం “ఎవరయితేనేమి, ఇదివరకు చదువెరుగని కులాల వారందరూ చదువుకొనడం దేశాభ్యుదయ సూచన.” అని ఆనందం పడతారు.
ఎల్లమందను ప్రధానోపాధ్యాయులు అతి ప్రేమతో చూచి, అతనికి జిల్లా మునసబుగారు మొదలయిన వారిచేత సహాయం చేయించేవారు.
ఆ ఊళ్ళో ఉన్న బ్రహ్మసమాజంవారు, సత్సంగులు, కాంగ్రెసువారు ఎల్లమందకు ఎన్నో విధాల సహాయం చేశారు. ఆరేళ్ళు కష్టపడి చక్కని మార్కులు సంపాదించుకొని ఎల్లమంద 1930 సంవత్సరంలో స్కూలు ఫైనులు పరీక్ష నెగ్గినాడు.
అంతవరకు ఎల్లమందకు ఏమీ విచారంలేదు. రోజూ జక్కరం నుంచి నడిచి వచ్చేవాడు. సాయంకాలం నడిచే జక్కరం మాదిగగూడెం వెళ్ళిపోయేవాడు. తన గూడెంలో తానే చదువుకొనేవాడు.
అలా చదివి, చదివి, చివరకు తన పదునెనిమిదవ ఏటనే ఎల్లమంద స్కూలు ఫైనలు నెగ్గినాడు. తనవాడలో తానే చదువుకొనేవాడు. క్రైస్తవులలో ముగ్గురో నలుగురో చదువుకొనే బాలురూ, అయిదుగురో ఆరుగురో బాలికలూ ఉండేవారు.
ఆ బాలురూ, బాలికలూ మాల క్రైస్తవులు, మాదిగ క్రైస్తవులూ, కులాలు లేని మతమయినా - క్రైస్తవమతంలో కులాలు, జాతులు, రంగుల తేడాలు ఉన్నాయి. ఆ తేడాలేవీ ఎల్లమంద కంతగా తెలవవు. అతడు కష్టపడేవాడు, చదువుకునేవాడు.
ఒకరు బట్టలు కొని యిచ్చేవారు. ఒకరు హరికేన్ లాంతరు కొని ఇచ్చారు. చందాలవల్ల పుస్తకాలు వచ్చేయి. సగం జీతం. చందాల డబ్బు తండ్రి సంపాదనకు చన్నీళ్ళు వేన్నీళ్ళు కాగా, ఇంటిల్లపాదీ కొంచెం మంచిగుడ్డలు కట్టుకొని. కొంచెం శుభ్రమయిన తిండి తినగలుగుతున్నారు.
ఎల్లమందకు మంచి మార్కులు రావడంవల్ల రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో ఇంటరు తరగతిలో సీటు దొరికింది. విద్యార్థి వేతనమూ దొరికింది.
కళాశాల విద్య ప్రారంభించిన నాటనుండీ ఎల్లమందకు వేదన ప్రారంభించింది.
ఎల్లమంద అన్న పేరును అనేకులు విద్యార్థులు హేళన చేశేవారు.
“ఎక్కడిదిరా ఈ మంద?” “ఎల్లాం మందాం?” “ఏలరా ఈ మందా! చాలురా ఈ కందా!” ఈలా ఈలా అంటూ కొందరు విద్యార్థులు అతణ్ణి వేళాకోళాలు చేసేవారు.
అవి అంత అనిపించలేదు!
కాని ఒక బాలుడు ఒక రోజున, మీరే వర్ణస్థులండీ అని అడిగాడు.
“మేము మాదిగలం!” అని ఎల్లమంద జవాబు.
“మాదిగలా? అంటే, మాలవాళ్ళు కారూ? మాదిగలే!” అని ఆ బాలకుడు, కొంచెం దూరంగా జరిగాడు.
ఎల్లమంద హృదయం కుంగిపోయింది.
2
ఎల్లమంద రాజమండ్రి కాలేజీలో చేరిన అయిదు నెలల వరకు, ఒకరితో మాట్లాడలేదు. తన చదువేదో, తన కాలేజీ ఏదో! అతనికి అసలు ఉండడానికి స్థలం ఏది అన్న సమస్య ఆ బాలునికీ వచ్చింది. ఆ బాలుని చేర్పించడానికి వచ్చిన ఒక కాంగ్రెసు పెద్దకూ వచ్చింది.
ఉండేందుకు గది, భోజనానికి వసతి, ఈ రెండూ పెద్ద సమస్యలయినవి. డబ్బుకు చూడకుండా ఆ బాలకుణ్ణి హాస్టలులో ప్రవేశపెట్టినాడా పెద్ద మనుష్యుడు.
హాస్టలులో ఈ బాలునికి ఒక విడి గది ఏర్పాటు చేశారు. హాస్టలులో విడిగదులూ ఉన్నాయి, ఇద్దరు ముగ్గురు ఉండే గదులూ ఉన్నాయి.
ఎల్లమందకు తానొక్కడే ప్రపంచంలో ఒంటిగా ఉన్నట్లనిపించింది. బ్రాహ్మణ బాలురు, బ్రాహ్మణేతర బాలురు, క్రైస్తవ బాలురు అందరూ ఈతణ్ణి ఒంటిగా వదిలినారు. అతడు అందుకు తగినట్లు ఒంటరితనమే అలవాటు చేసుకున్నాడు.
కాని అతని ఒంటరితనానికి భంగం ఇంటరులో చేరిన ఆరు నెలలకు వచ్చింది. భీమవరం హైస్కూలులో ఎల్లమంద ఫుట్‌బాల్ ఆటలో గండరగండడు. అతడు ఎడమవైపు ఫార్వర్డు. ఎడమ కాలితో అతడు తన్నితే బంతి ఒక టన్ను బాంబులా వచ్చి గోలులోనో, గోలు దగ్గరో పడుతుంది. కండ పుష్టీ, బలంగల బాలుడవడం చేత ఏమీ అలసట లేకుండా ఎన్ని గంటలయినా సునాయాసంగా పరుగెత్తుతాడు. 'పరుగు పందెంలోనూ, ఎల్లమంద పిట్టపిడుగు. ఎల్లమందకు కాలిబంతి తన్నడంలోనూ, పరుగు పందేలలోను, కాలిబంతి ఆటలలోనూ రెండు డజన్లపైగా బహుమతులు వచ్చాయి. కప్పులు, షీల్డులు, మెడల్సు, అతని దేవదారు చెక్క పెట్టెనిండా ఉన్నాయి.
ఎల్లమంద వాటిని పూజిస్తాడు. ఎందుకంటే వాటివల్లనే ఇతర బాలురు తన దగ్గిర మూగుతారు. తన్ను గౌరవం చేస్తారు. కాలేజీ ఆటల ఉపాధ్యాయుడు, ఎల్లమందను ఏమి ఆటలలోనూ పాల్గొనటం లేదేమని అడిగినాడు. ఆ ఉపాధ్యాయుడు ఆరు నెలల వరకూ ఎల్లమందను ఆ ప్రశ్నే వేయకపోవడానికి కారణం అతడు మాదిగ కులస్థుడని తెలవడమే!
అయినా తన విద్యుక్తధర్మం కాబట్టి ఆరు నెలలకన్నా అడక్క తప్పింది కాదు. అదయినా ఏదో అడిగేసి నాకేమీ రావని అతనిచేత అనిపించుకొని, ఏ కసరత్తు తరగతిలోనో పేరు చేర్చి వదిలివేద్దామని ఆ ఉపాధ్యాయుని ఉద్దేశం.
ఆ ఉద్దేశం ఎల్లమంద గ్రహించాడు. ఎప్పుడూ ఎవ్వరి జోలికీ, సొంఠికీ వెళ్ళని ఎల్లమందకు ఆ ఉపాధ్యాయుణ్ణి ఏడిపించాలని కయ్యాళి బుద్ది పుట్టింది.
ఎల్ల: నేను ఫుట్‌బాల్ ఆడతానండి. భీమవరం హైస్కూలు “బెల్సు” కప్పు పట్టుకువచ్చిన జట్టులో నేనున్నానండి
ఉపా: ఏమిటీ! నువ్వు ఫుట్‌బాల్ ఆడతావా! నాకు తెలియదే?
ఎల్ల: ఇవి చూస్తారా అండీ? (అతడు తన దేవదారు చెక్క పెట్టెలోనుంచి తన కప్పులు, మెడల్సు, షీల్డులు తీసి చూపించాడు.) ఉపా: ఇ-ఇ-ఇ-ఇవన్నీ ఏ-ఏమిటి?
ఆ ఉపాధ్యాయుడు అన్నీ చూచాడు. ఇవి పరుగుపందేలవి; ఇవి ఒక మైలు పందెంవి; ఇవి అరమైలు పందెంవి; ఇది నాలుగు వందల గజాలు; ఇది వంద గజాలువి; ఇవి కాలిబంతి తన్నినందుకు. ఇవి కాలిబంతి ఆటకు; అంటూ. అవన్నీ తెల్లబోతూ చూచాడు; అతని కళ్ళు చెదరిపోయాయి. ఆ ఉపాధ్యాయుని హృదయంలో ఉడుకుబోతుతనం కూడా వచ్చింది.
అయినా ఏదో మహానిధిని తాను కనిపెట్టినట్లు ఉప్పొంగిపోయాడు. ఈ మాదిగ కుర్రవానికి ఇవన్నీ రావడం ఏమిటి? ఇవన్నీ తనకే వచ్చి ఉండాలి అని భావించుకొన్నాడు. ఈ రహస్యం ఎవరికీ చెప్పకుండా తాను గమ్మత్తు చేయాలనుకున్నాడు.
ఇంకో వారం రోజులలో పుట్‌బాల్ పందెం ఒకటి ఉంది. కాలేజిలో "ఏ" జట్టువారికీ “బి” జట్టు వారికీ ఆ పందెం. చూచి చూచి ఆటల ఉపాధ్యాయుడు ఎల్లమందను “ఏ” జట్టులో వేయలేకపోయాడు. అతణ్ణి “బి” జట్టు పేరులలో చేర్చినట్లున్ను ఎవరికీ తెలియ చేయలేదు. అమలాపురం హైస్కూలు నుంచి వచ్చిన ఒక బాలకుణ్ణి “ఏ" జట్టులో ఎడమ ఫార్వర్డుగా వేసినాడు.
రెండు జట్టులలో ఉన్నవారు చాలమంది - నిరుటి వారే అయినా కొంతమంది కొత్త వారున్నారు. ఇతర కాలేజీలలోంచి వచ్చి. బి.ఏ.లో, బి.ఎస్.సి.లో చేరిన బాలురను కొంతమందిని రెండు జట్టులలో చేర్చినాడు. వారున్నూ ఇదివరకున్న వారున్నూ రోజూ కాలిబంతి ఆట ఆడుతూ ఉండటం చేత ఒకరి కొకరికి బాగా ఎరుక అయింది. స్నేహాలు కుదిరినాయి.
కాని ఎల్లమంద ఆడతాడని ఎవరికీ తెలియదు. అతనికి అన్ని బహుమానాలు వచ్చాయనిగాని, మంచి పరుగు పందెం వాడనిగాని ఎవ్వరికీ తెలియదు.
వారం రోజులు గడచినవి. ఆటరోజు వచ్చింది. ఆఖరి క్షణంలో ఎల్లమందకు జూనియర్ జట్టువేషం వేసి, ఆ ఆటల ఉపాధ్యాయుడు తీసుకువచ్చి శ్రేణిలో నిలుచుండబెట్టాడు.
“ఇదేమిటి ఈ జంతువును తీసుకువచ్చాడు? ఈ పక్షీంద్రుడు వచ్చాడేమిటి? ఈ మగ గేదిగారు రంగస్థలంలోకి దిగాడేమిటిరా?”
“మన మాష్టారుగారికి మతిపోయింది. రోయి!” ఈలా ఈలా గుసగుసలు ఇకిలింపులు.
ఆట ప్రారంభం అయింది. ఎల్లమందకు బంతిని అందివ్వ లేదు తక్కిన ఆటగాళ్ళు. తక్కిన నలుగురు ఫార్వర్డులే ఒకరికొకరు అందించుకోవడమూ, వారే బంతి తీసుకువెళ్ళడం, సీనియర్ జట్టు వాళ్ళలో హాఫ్‌కాక్‌లు నిముషంలో వారి దగ్గిరనుండి బంతి తప్పించడం, తమ ఫార్వర్థులకు అందివ్వడం అది వారు గద్దలులా ఎగతన్నుకుపోవడం, అక్కడ జూనియర్ జట్టువారి బాక్‌లు హాఫ్‌కాక్‌లు ఆ బంతిని వెనక్కు నెట్టివెయ్యాలని విశ్వప్రయత్నం చేయడం, వారికి జూనియర్ జట్టు ఫార్వర్డులు కూడా వెనక్కుపోయి సహాయం చేయడం, చావు తప్పి కన్ను లొట్టపోయి ఎల్లాగయితేనేం బంతిని వెనక్కు నెట్టడం ఈలా జరుగుతోంది నాటకం. బంతి మొదటి అరగంటా జూనియర్ జట్టు గోలు దగ్గరే ఉంది. సీనియర్ వాళ్ళు నాలుగు గోలులు చేశారు జూనియర్ గోలు కీపరు దిట్టమయిన వాడవడంవల్ల గాని లేకపోతే ఏ డజను గోలులో అయి తీరవలసిందే.
అరగంట ఆఖరు కావలసిందే ఇదంతా చెక్కు చెదరకుండా, తన స్థానం కదలకుండా, విస్తుపోయి చూస్తున్నాడు ఎల్లమంద. ఇంతసేపటివరకూ తన్ను ఒంటరిగా వదిలారని ఎల్లమంద హృదయం కుంగిపోయింది. ఎన్నిసారులు ప్రయత్నం చేసినా, బంతి ఎల్లమంద దగ్గిరకు మైలుదూరానికన్నా తక్కినవాళ్ళు పంపిస్తేనా!
అరగంట ఈల అయిదు నిమిషాలకు మధ్యవర్తి (రిఫరీ) వేస్తాడనగా సీనియర్ జట్టు హాఫ్‌బాక్ ఒకడు బంతిని తన ఫార్వర్డుకు అందివ్వడంలో మోడులా తన స్థానంలో నిలుచుండి ఉన్న ఎల్లమంద దగ్గరకు పొరబాటున పంపాడు.
నిద్రపోతూ ఉన్న మనుష్యునిలా ఉన్న ఎల్లమంద కాలి దగ్గరకు ఆ బంతి వచ్చింది. ఆ బంతితో పోటీగా ఆ హాఫ్‌బాక్ పరుగున వచ్చాడు. కాని ఎల్లమంద ఒక్క నిమిషంలో మారిపోయాడు. అతడు ఆటంబాంబో, టార్పెడో, రెక్కల బాంబో, తుపాకీ గుండో! ఆ బంతీ అతడు అమిత వేగంతో తుపాకీ గుండులా ఆ హాఫ్‌బాక్‌ను తప్పించి ఝలఝల, ధళధళ, ఫెళఫెళ వేగంగా ముందుకు పోయాడు. బాక్‌ను తప్పించాడు. గోలుముందర గోలుకీపరు పది అడుగుల ఇవతలగా తుపాకీ గుండులా నెట్టులోకి వెళ్ళిపోయింది బంతి. ‘గోల్” అని ఆ ఆటస్థలంలో ఉన్న సర్వజనులు సముద్రపు హోరులా అరిచారు. కాని ఎల్లమందను హస్త స్పర్శ చేయడంగాని, అతనికి కృతజ్ఞత తెల్పడంగాని అందరూ మరిచారు.
ఫార్వర్డులు సెంటరుకు వచ్చారు. అరగంటకి రెండు నిమిషాలు ఉంది. సీనియర్ జట్టువారు అందిచ్చుకుంటూ ముందుకు పోయారు. ఎల్లమంద ఆ బంతిని తన కాలికి తీసుకుని స్వయంగా ప్రేక్షకులు కూడా గమనించని వేగంతో బయలుదేరాడు. ఎదుటి ఫార్వర్డులను తప్పుకున్నాడు. హాఫ్‌బాక్‌లను తప్పుకున్నాడు అక్కడనుంచి గోలు ఏభై గజాలుందనగా ఎడం కాలితో బంతిని తన్నాడు. ఆ బంతి పక్షిలా వెళ్ళింది. ఒక మూలనుంచి, గోలుకీపరు ఎగిరి చాపిన చేతులను తప్పుకుని, గోలులో వాలింది.
అయ్యా! ఇక ఆ ఆటస్థలంలో బయలుదేరిన గగ్గోలు, అల్లరి హంగామా నవీన కవులందరూ కలిసి ఏక కంఠంతో వర్ణించినా చాలని పరవళ్ళెత్తి ఉప్పొంగిపోయింది. ఈ పట్టు జూనియర్‌లు ఎల్లమందను భుజాలమీద ఎత్తుకొని జయజయ ధ్వానాలు చేస్తూ మధ్యకు తీసుకువచ్చారు. ఆటస్థలం అంతా హుర్రాలు, బ్రేవోలు! ఇంతలో రిఫరీ ఈల వేశాడు.
ఆ అల్లరి ఇంకా పదివేలరెట్లు ఎక్కువయిపోయింది. ఎల్లమందని ప్రజలంతా సర్కసు జంతువును చూచినట్లే!
“ఏ వూరండి మీది?”
“ఇదవరకు ఎక్కడ ఆడారండి?”
“మీరు ఏమిటండి?” ఎల్లమంద ఒకప్రశ్నకూ జవాబుచెప్పలేదు. ఊరికే చిరునవ్వు! నవ్వులోనే అన్నివేల కోట్ల ప్రశ్నలకు జవాబు! అతడు అన్నిటికీ జవాబు చెప్పినట్లే అందరికీ తోచింది.
ఒక బాలుడు సోడా తీసుకు వచ్చాడు.
ఇంకో బాలుడు నిమ్మకాయ పట్టుకు వచ్చాడు.
మరొక బాలుడు తన జేబులో ఉపయోగించకుండా దాచుకొని ఉన్న జేబురుమాలు పెట్టి స్వయంగా ఎల్లమంద మొగం తుడిచాడు.
ఇంతలో రిఫరీ ఈల వేశాడు.
గబగబ జనం ఆటస్థలం వదిలారు. ఈ పక్క జట్టు ఆ పక్కకు ఆ పక్క జట్టు ఈ పక్కకు మారినారు.
సీనియర్ జట్టువారు బాగా ఆలోచించుకుని వారి ఆట పథకం నిశ్చయం చేసుకున్నారు. జూనియర్‌వారు కలుసుకున్నది ఆనందం కోసమే! ఇంక వారి పథకం ఒక్కటే ఉన్నది, ఎల్లమందకు సీనియర్ జట్టువారు ఇవ్వబోయే ఒత్తిడి తగ్గించడము. బ్రహ్మప్రళయ మయినా చేసి ఎల్లమందకు బంతి అందిస్తూ ఉండడము. ఈ విధానము కలిసి అనుకోకుండానే గోల్‌కీపర్ దగ్గర్నుంచి సెంటరు ఫార్వర్డు వరకు బంతి అందివ్వడమే వ్రతంగా పెట్టుకున్నట్టయింది.
ఇకనేమి? ఎల్లమంద చుట్టూ సీనియర్ జట్టు హాఫ్‌బాక్‌లు ముగ్గురూ ఉన్నారు. ఎల్లమందకు బంతి రానివ్వరు. ఈ గొడవలో ఆటంతకూ కీలకం అయ్యాడు ఎల్లమంద. ఎల్లమంద ఈలాంటి కాలిబంతి యుద్దాలలో ఆరితేరిన సరుకాయెను. అతను గబగబ బంతి దగ్గర లేనిదే పరుగు పందెంలా ఈ చివరనుంచి ఆ చివరకు ఆ మూడుసారులు వరసగా పరుగెత్తినట్లు పరుగెత్తినాడు. ఆ మహావేగం అతనికే చెల్లు. అతనితో సీనియర్ జట్టులోని హాఫ్‌బాక్‌లు ఏం పరుగెత్తగలరు? అలసటపడి ఊరుకున్నారు.
ఎల్లమంద నాలుగో పరుగులో బంతి అందుకున్నాడు. ఇంక అతను యెవ్వరికీ అందలేదు. బంతితోనే గోలులోనికి వెళ్ళిపోయాడు. ప్రభూ! ఆ సమయంలో ఆ ఆటస్థలం ఒక తుఫాను, ఒక గోదావరి వరద అయి చక్కాపోయింది.
సీనియర్లు పదకొండుగురూ ఎల్లమంద చుట్టూ మకాం వేస్తారా ఏమిటి చెప్మా? అతని చుట్టూ ఇనుపగోడ కడతారా? అతని చేతులు కాళ్ళూ కట్టి పారవేస్తారా? అలాగే ప్రయత్నం చేశారు వాళ్ళు. అయినా ఎల్లా తప్పుకున్నాడో రెండుసార్లు, ఆ రెండుసార్లూ రెండు గోలులు చేసినాడు.
అక్కడనుంచి, ఫుట్‌బాల్ ఆట స్వరూపమే పోయింది. ఎల్లమందని అధర్మంగా సీనియర్ ఆటగాళ్ళు ఫౌల్ చేశారు. ఒకసారి మోకాలు కొట్టుకుపోయి రక్తం కొల్లయింది. ఐనా ఏదో గుడ్డ చుట్ట బెట్టుకు ఆడాడు. అతడు ఉగ్రుడై పోయాడు. బంతిని ఒక్క నిమిషం వదలడు. తానే వెళ్ళి బంతి అందుకుంటాడు. వేగంగా వెళ్ళిపోతాడు. అడ్డం వచ్చిన వాళ్ళను జెలగలా తప్పుకుంటాడు. ఆ సమయంలో నలుగురో అయిదుగురో సీనియర్ జట్టువాళ్ళు అడ్డంపడతారు. అతన్ని కుమ్ములు, గుద్దులు తన్నులు అయినా పళ్ళు బిగించి ఎలా వెళ్ళినాడో ముందుకు ఆరవగోలు చేయడానికి. అప్పుడు సీనియర్ బాక్ ఒకడు అతన్ని కాలు అడ్డంబెట్టి పడదోసి డొక్కలో పొడిచాడు. ఎల్లమంద పడిపోయాడు. అందరూ గొల్లుమన్నారు. రిఫరీ మండిపోయి, ఈలవేసి ఆట ఆపుచేసి పెనాల్టీ (శిక్షగా గోలుకు అడ్డం లేకుండా ఎదురుగుండా బంతి తన్నుట) ఇచ్చినాడు. సీనియర్ ఆటగాళ్ళు ఆ ఫుట్‌బాల్‌ను నాచుతిట్లు తిట్టుకున్నారు.
ఆ అధర్మపు దెబ్బలకు ఎల్లమంద కొంత బాధపడిన మాట నిజమే, కాని లేచి ఒక్కసారి ఒళ్ళు దులుపుకొని నుంచున్నాడు. తన జట్టు నాయకుడయిన సెంటర్ హాఫ్‌బాక్‌వద్ద తానే ఆ బంతి తన్నుటకు అనుమతి పొంది ఈల వేయగానే ఆ బంతి పిడుగు వేగంతో సరిగ్గా మూలనుంచి వెళ్ళేటట్లు తన్నినాడు. అది గోలయి ఊరుకుంది.
3
ఆ మరునాడు నుంచి ఎల్లమంద కళాశాలకంతకూ నాయకుడు, కాలిబంతి ఆట మాంత్రికుడు అయ్యాడు. ఆటల ఉపాధ్యాయుడు ఎల్లమందను తాను సృష్టించినట్లు ఛాతీ విప్పుకు తిరిగాడు. ప్రతీ విద్యార్థి సయద్ అహమ్మద్, భద్రుడు, ముష్టి లక్ష్మీనారాయణ, సూరయ్య, తటవర్తి బుచ్చిరాజు అందరూ కలిసి ఇతనిలో ప్రత్యక్షమయ్యారు కాబోలు ననుకొన్నారు.
సీనియరు జట్టువాళ్ళు, ఎల్లమంద మాకు కావాలన్నారు. ఎల్లమంద తాను ఆ జట్టులోనికి వెళ్ళనని ఆటల ఉపాధ్యాయునితో అన్నాడు.
కాలేజీ ప్రధానాచార్యులవారు ఎల్లమందకు కబురు పంపి, “ఏమయ్యా నువ్వు సీనియర్ జట్టుకు వెళ్ళనన్నావుట ఏమిటి?” అని అడిగాడు.
ఎల్లమంద: వాళ్ళు ఆ రోజున నన్ను చేసిన ఫౌల్సు నా జన్మలో ఎప్పుడూ ఏ ఆటలోనూ పొందలేదు. నా మనస్సు ఆ జట్టుతో కలియలేదండి.
ప్రధానాచార్యులు: (ఎల్లమంద ముఖము తేరిపార చూచి, ఆ బాలకుని స్వచ్చహృదయము, అవమాన తప్తమైన అతని మనస్సు గ్రహించాడు.) ఏమయ్యా మన కాలేజీ జట్టు ఇతర కాలేజీలతో ఆడవలసి వస్తే నువ్వు కాలేజీ జట్టుతో ఆడకపోతే యెల్లాగు?
ఎల్ల: చిత్తమండి, మన కాలేజీ ఎవరితో ఆడవలసి వచ్చినా నేను తప్పక కాలేజీ జట్టులో ఆడి తీరుతానండి.
ప్రిన్సి: కృతజ్ఞుణ్ణి!
ఎల్లమంద హాస్టలుకి వెళ్ళిపోయాడు. అతనికి చాలా గౌరవం సంభవించింది. కాని అతన్ని హృదయంలోనికి తీసుకునేదెవరు? లోతులేని హృదయం కలవారికి అతని స్థితి అర్థంకాదు. హాస్టలు విద్యార్థులు మాత్రం అతన్ని దగ్గిరగా తీసుకుంటారా? అతనితో కడుపునిండా మాట్లాడుతారా?
ఆలోచనా శక్తి గలవారికే బాధలన్నీ? ఎల్లమందవల్లనే కాలేజీకి కాలిబంతి ఆట బహుమానాలు వచ్చాయి. ఎల్లమందకు ఆయా సమయాలలో చూపించే గౌరవం ఇంతింతని కాదు. ఆ తర్వాత అతని మొఖం చూచేవారు ఒక్కరూ లేరు. పుట్టుకచేత ఒక జట్టు మనుష్యులు లోకంలో ఎప్పుడూ అధోగతిపాలేనా? వారి జీవితాలకు మెట్లులేవా? ఎవరు ఈ శిక్ష విధించింది? బలవంతులు.
అమలాపురంనుంచి వచ్చిన ఒక బి.ఏ. సీనియర్ వెలనాటి విద్యార్థికీ, కాకినాడకు చెందిన ఇంకో తెలగాణ్య బ్రాహ్మణ బ్రహ్మసమాజం విద్యార్థికీ ఎల్లమందను గురించి హోరా హోరీ వాదన వచ్చింది. ఆ వాదనలో హాస్టలులోని విద్యార్థులందరూ పాల్గొన్నారు.
రామం (వెలనాటి) ఒరే! వెంకటేశ్వరరావూ, శిక్షలనేవి లోకంలో ఉన్నాయా?
వెంకటే: ఉన్నాయి. అవి నిర్మాణం చేసింది సంఘం.
రామ: ఆయా తప్పులనుబట్టి ఆయా శిక్షలు వచ్చాయి. జన్మశిక్ష, చావుశిక్ష, పదేళ్ళశిక్ష! అలాగే ఈ దేశంలో చచ్చిన గొడ్డుమాంసం తింటూ ప్రజలను చంపి కాల్చుకుతింటూ ఉన్న నరమాంసాశనులయిన వారికి ఆర్యులు సంఘ బాహ్యులుగా శిక్ష విధించారు.
వేంకటే: శిక్ష విధించినవారు ఏదైనా మహత్తర కారణం ఉంటే ఆ శిక్ష తీసివేస్తారా? వెయ్యరా? ఉరిశిక్ష కూడా తగ్గిస్తారు; ప్రభుత్వంవారు జన్మశిక్షలు తగ్గించి వదలి వేసిన సాక్ష్యాలున్నాయి. వెనక ఆర్యులు శిక్ష విధించారే అనుకో! ఇప్పుడు ఆలోచించి ఆ శిక్ష తగ్గించవచ్చునుకాదా?
ఒక విద్యార్థి: ఒరే! ఇప్పుడు మనదేశం అంతకూ ఆంగ్లేయులు శిక్ష విధించారు కాదట్రా!
రామ: అప్పటి ఆర్యులు ఈ శిక్ష ఎప్పటికీ తగ్గించకుండా ఉండే నిబంధన కూడా ఆ శిక్షలోనే విధించారు. అందుకని ఈ మాల మాదిగలు ఎల్లకాలం అల్లా ఉండవలసిందే!
ఇంకో విద్యార్థి: మనకు మెలిమొగుళ్ళయిన ఇంగ్లీషువాళ్ళు ఈ హరిజనులకు శిక్ష తగ్గించి, వాళ్ళను మనకు ప్రభువులను చేసి ఆ ప్రభుత్వం సాగేందుకు తమ సైన్యం అంతా మద్దతు చేస్తే ఏమి చేస్తారురా మీరు?
మరో విద్యార్థి: మన దేశంలో మార్పులు మనమే తీసుకురావాలి! ఈ తెల్లనాయాళ్ళు ఎవరురా?
రామ: అలాంటి మార్పులు ఎవరు తీసుకు రాబోయినా లోకం అంతా కొల్లేరయి చక్కాబోతుంది.
వెంక: ఓయి వెర్రికాయా! వట్టి మాష్టారూ! ఇంగ్లీషువాళ్ళు మూడువందల సంవత్సరాల నుంచి ఈ బాపనోళ్ళను గొడ్డుతోళ్ళ బూట్లతో నెత్తిన తంతున్నారు. ఈ ఎదవాయలు వంగి వంగి దణ్నాలెడుతూ, దీర్ఘాయుష్మాన్ భవ అని ఎదురు ఆశీర్వదిస్తున్నారోయి.
రామ: అందుకనే ఒకనాడు ఇంగ్లండు యావత్తూ నాశనం అయి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోతుంది.
ఒక విద్యార్థి: అప్పుడు ఈ బాపనోళ్ళంతా, ఈ పెద్ద కులాల బ్రాహ్మణేతరులు వాళ్ళంతా ఏ పురుగులో, ఏ నల్లులో అయి చక్కాబోతారు.
ఈలాంటి చర్చలు ఎన్నో ఎల్లమంద వింటూనే ఉన్నాడు. ఎల్లమందకు చర్చ లెప్పుడూ తృప్తి కలిగించలేదు. అతడు ఎక్కువగా చర్చలలో పాల్గొననూలేదు.
ఒక్క స్నేహితుడూ ఎల్లమందను తనింటికి భోజనానికిగాని, ఆఖరికి సరదాగా గాని పిలవలేదు. మాలవారూ, మాదిగవారూ, క్రైస్తవులయినవారు హిందూ పెద్ద కులాల వారింటికి కాఫీ వగయిరాదులకు వెడుతూ ఉండేవారు. ఎల్లమందకు ఎప్పుడూ తన యిల్లు, తన గూడెం, తన వాళ్ళు జ్ఞాపకం వస్తూ ఉండేవారు. అవి ఇళ్ళు కావు. ఒక్కటే పాక, చిన్న పాక. అంత అసహ్యకరమయిన ఇళ్ళు ప్రపంచములో ఇంకోచోట ఉంటాయా?
గూడేనికి వీధులు లేవు. గూడెంలో శుభ్రతలేదు. గూడెం ఆ మోస్తరుగా ఉంటే, చచ్చిన గొడ్డు మాంసం అందరూ తింటారు. బుధవారం సంతనాడు అమ్మిన నల్లపంది మాంసం తింటారు.
ఎప్పుడుపడితే అప్పుడు మొగం కడుక్కుంటారు. పొద్దున్నే కడుక్కోవడం అవసరం లేదు. కడుక్కోనివారూ ఉన్నారు. స్నానం చెయ్యడం విధికృత్యం కాదు. ఉడుకు నీళ్లు పెట్టుకొని పగలల్లా చేసిన పనివల్ల వచ్చిన శ్రమ పోవడానికి నాలుగు కొబ్బరి డొక్కెలు పోసుకుంటారు.
గుడ్డలు ఉతకడం ఉండవచ్చును; లేకపోవచ్చును. అసలు గుడ్డలేవీ ఉతకడానికి? చిరిగిన గుడ్డలు ఏ రెండు మూడో ఉండవచ్చును. చిరిగితే తమ మొగాల యజమానులు పారవేసిన గుడ్డలు. ఏడాదికోసారి సంక్రాంతి పండుగలకు కామందు తమ కుటుంబం వారికి తలో బండపాత ఇస్తే, అవి అతి సంతోషంతో, అతి ప్రేమతో ధరించుకోవడం. ఇంక బట్టలు ఉతకడం ఆరవేయడం ఏనాడు ప్రభూ?
ధనం ఎప్పుడూ ఉండదు. యజమాని గింజలు కొలుస్తాడు. అవీ ఏడాదికోసారి ఆ గింజలు తన అమ్మో, తన నాయనమ్మో దంచడం, కొన్ని గింజలు అమ్ముకోడం, గంజితప్ప అన్నమే మెరుగు తన కుటుంబం? కూరలులేవు, పచ్చళ్ళు లేవు, పిండివంటలు తెలియవు, నెయ్యి మజ్జిగ రూపు రేఖా విలాసాలే లేవు, మేక మాంసం, కోడిమాంసం మొదలయిన వాటితో పలావులు, కురమాలు తమ జగత్తులో తమ వారు ఎరుగరు.
కాఫీ హోటళ్ళేమిటో మాదిగవారి కేమి తెలుసును? బుధవారం సంతనాడు ఒక కానీపెట్టి సోడాకొని తాగడం తానెరుగును. ఆ సోడా అయినా ఒక మహమ్మదీయునిది. పెద్ద కులాలవారు పెట్టిన దుకాణాలలో ఎవరయ్యా తమకు సోడా ఇచ్చేది? ఏ బ్రతికి చెడ్డవాని దుకాణంలోనో, ఇవి దొరికితే, ఆ కొట్టులో ఇతరులు ఎవ్వరూ కొనరు. |
హాస్టలులో ఇడ్డెనులు, పెసరట్లు, అట్లు, పకోడీలు, గారెలు, ఆవడలు, పూరీలు, బజ్జీలు, బొబ్బట్లు, ఫేణీలు, కాఫీలు చేస్తూనే ఉన్నారు. ఎన్నిరకాల కూరలు, పులుసులు, చారులు, పచ్చళ్ళు, కమ్మటి నేయి, పెరుగు.
ఇవన్నీ తింటూ ఎల్లమంద తన వారినీ, తన జాతినీ, భారతదేశంలో ఉన్న బీదవారినీ, ముష్టివారినీ తలచుకోని రోజు లేదు.
ఇవన్నీ భగవంతుని చిద్విలాసాలా? భగవంతునికి సంబంధం లేదా? భగవంతు డున్నాడా? ఉంటే ఈ తేడా లేమిటి? మనుష్యుని కర్మ అన్నారు. కర్మ ఏమిటి? ఈ భావాలు ఈ వేదాంతాలు ఈ విచారణ ఎల్లమందకు ఏమి తెలుస్తాయి.
4
ఒక్కడూ గోదావరి గట్టున కూర్చునేవాడు. దూరంగా గోదావరి. ఒకనాడు వరదలై ప్రవహించింది. ఒకనాడు నిర్మల నీలజాలై ప్రవహించింది. ఒకనాడు ఇసుకలు, ఇంకొకనాడు అంతా జలమయం. ఈ రెండు భావాలకూ మధ్య ఎన్నో తేడాలు. అన్ని నీళ్ళూ సముద్రంలో కలవవు; అన్ని నీళ్ళూ బట్టలు ఉతకవు. అన్ని నీళ్ళూ మనుష్యుల దాహం తీర్చవు. అన్ని నీళ్ళూ మనుష్యుల ఈత ఆనందం తీర్చవు.
ఈత అంటే మొదట ఎల్లమంద భయపడ్డాడు. గోదావరి ఏడాదికో విద్యార్థిని బలిపుచ్చుకుంటూ ఉంటుంది.
ఒక స్నేహితుడు: ఎల్లమందా రావోయీ ఈత నేర్చుకోపోతే జన్మలో ఒక ఆనందం మనకి తప్పిపోయిందన్న మాట.
ఎల్లమంద: గోదావరిలో దిగటమే?
స్నేహి: గోదావరి మనకు విరోధంట్రా?
ఎల్ల: అదికాదురా, నాబోటి దద్దమ్మలే గోదావరికి బలి అవడం!
స్నేహి: ఒరే ఫుట్‌బాల్ ఆటలో అందరినీ మించి పోయినవాడవు నీకు ఈత రాకపోతే, పెద్ద అవమానం కాదుట్రా? రా నేను నేర్పుతాను. బలయ్యేవాళ్ళు, ఎప్పుడూ ఎందులో పడితే అందులోనే బలి అవుతారు.
ఆ నాటినుండి ఎల్లమంద పట్టుదలగా ఈత నేర్చుకోవడం సాగించాడు. ఒంటిగా తనకడకు వచ్చినప్పుడల్లా గోదావరి తల్లి ఎల్లమందతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేది. అలాంటి దేవి ఇప్పుడు చేతులుచాచే అతన్ని పిలిచింది. హృదయానికి అదుముకుంది. అతనితో తనివితీరా మాట్లాడేది. మాటలాడేటప్పుడు ఆమె వాక్యాలు హృదయానికి వినబడేవి. అతని హృదయం ఆమెతో మాటలాడేది.
నెల రోజులలో భయం పోయింది. మూడు నెలలలో ఈత రకాలన్నీ వచ్చాయి. నాలుగు నెలలలో దమ్ముపట్టడం వచ్చింది. అయిదు నెలలలో దూరం వెళ్ళడం వచ్చింది. ఆరు నెలలలో ఈతలో అందె వేసిన చేయి అయ్యాడు.
ఇంత చక్కగా అతనికి ఈత రావడానికి ఎక్కువ కారణం గోదావరిదేవే!
గోదావరి కొందరిని ప్రేమిస్తుంది. వారిని ఆభరణంలా తన హృదయంలో ధరిస్తుంది. తల్లి, చిట్టి తనయునకు తప్పటడుగులు నేర్పినట్లు, గోదావరి ఆ బాలుని తేల్చివేత, కుక్క ఈత, చిట్టిచేప ఈత, బాద ఈత, పక్క ఈత, నిలువు ఈత నేర్పుతుంది. చివరకు తన హృదయంపై వెల్లకిలా పరుండి కాళ్ళూ చేతులూ కదపకుండా తేలిపోవడం నేర్పుతుంది..
ఎల్లమంద గోదావరితోనే మాటలాడుతూ ఉండేవాడు. అతని అనుమానాలన్నీ ఆ మహానదీమ తల్లే తీర్చేది.
ఎల్లమంద: నీఈడు ఎంత తల్లీ?
గోదావరి: నేను అనాది దేవిని. నా జననం గంగకు పూర్వమే. ఈ దక్కను పీఠభూమి ఆదికచ్ఛపము వీపు. అప్పుడే నేనూ ఉద్భవించాను తండ్రి.
ఎల్లమంద: తల్లి, ఈ మాలమాదిగలకు మోక్షం లేదా? వాళ్ళు ఏమి తప్పుచేస్తే ఈలాంటి శిక్షపడింది అమ్మా.
గోదావరి: నాయనా! ఒక జాతియొక్క పొగరు కారణం. ఒక జాతి ఎక్కువ బలమయినది. ఎక్కువ నాగరకత కలది. ఆ జాతి ఈ జాతిని ఓడిస్తుంది. ఓడిపోయిన జాతితో విజయమందిన జాతి ఏ సంబంధమూ కలుగజేసుకోడానికి ఇష్టపడదు. వాళ్ళచేత అడ్డమైన చాకిరీలు చేయించుకొంటుంది.
ఎల్లమంద: మేము మొదటనుంచీ ఈ రాజ్యాలు ఆక్రమించుకొని ఉన్నవాళ్ళమా?
గోదావరి: అవునయ్యా అవును, ఈ ప్రపంచంలో మొదట ఉద్భవించింది మీరు. మిమ్ము రాక్షసులనీ, నిశాచరులనీ, నరమాంసాశనులనీ పేరుపెట్టారు. మీలో నరమాంసాశనులూ ఉండేవారు, నిశాచరులూ ఉండేవారు. మీరూ, మాలలూ ఆ అనాది జాతికి రాజకులాలవారు.
ఈలా గోదావరితో తన ఆవేదనను వెళ్ళబోసుకునేవాడు. తాను రాజునన్న మహాభావం అతనికి కలిగింది.
ఎవరి జన్మకు మెట్లు కట్టుకుంటారో వారు పైకి వెళ్తారు. లేనివారు వేసినచోట ఉంటారు. అన్న ఒక జాతీయ నాయకుని మాటలు ఎల్లమందకు ఆశయ వాక్యాలయ్యాయి.
అన్ని పరీక్షలూ నెగ్గాడు. అతని చదువే అతనికి స్నేహితుడు. అతనికి గోదావరి స్నేహితురాలు. అతని బంతి ఆట అతనికి ప్రియురాలు.
5
మాదిగ ఎల్లమంద బి.ఏ ప్యాసయి వచ్చాడని జక్కరం మారు మ్రోగింది. జక్కరం మాదిగపల్లిలోని వాళ్ళంతా ఎల్లమందను చూడటానికి వచ్చారు. అందరితోనూ నవ్వుతూ మాటలాడాడు, గుడిసెముందు నులక మంచంమీద కూర్చుని.
వెంకన్న: ఏంటిరా ఎల్లమందయ్యా, మరిగంటే అదేటి బి.ఏ. పాసు అయినావు గంద. మరి ఏంటి ఉద్యోగం సేత్తావు?
సుబ్బి: ఆడు కలటేరు సేత్తాడు?
పాపాయి: కలకటేరే! అది తెళ్ళోళ్ళకే గాందంటే.
లచ్చన్న: ఓస్ ఈ మద్దెనే నళ్ళోళ్ళకీ ఇత్తుండారు. ఆళ్ళూ తెల్లదొరల ఏసాలే ఏసి పెద్ద కలకటేరుపనే సేత్తుండారు కాదేంటి?
ఏమి చెయ్యాలి. ఎల్లమంద? ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలని ఉంది. ఒక వైపున ప్రభుత్వోద్యోగం జీవితం కాక ఏదో మహత్తర కార్యం చేయాలని ఉంది. కలక్టరు పని చేస్తాడు. అంటే కష్టపడితే ఏకంగా ఏ డిప్యూటీ తాసీల్‌దారు పనో ప్రభుత్వంవారు ఇస్తారు. అక్కడనుంచి నెమ్మదిగా తాసీల్‌దారు పని, ఆ తరవాత డిప్యూటీ కలెక్టరు పని ఉపకార వేతనకాలం వచ్చేసరికి ఏ సెలక్షనుగ్రేడో వచ్చి జిల్లా కలెక్టరు, రెవిన్యూ బోర్డు సభ్యుడూచేసి, ఉపకార వేతనం పుచ్చుకోడం!
తనకూ, తన కుటుంబానికీ ధనం, మంచి యిల్లు, బంట్రోతులు, మంచి బట్టలు, కారు, నగలు వస్తాయి; తనకూ సంఘంలో గౌరవం. ఇప్పుడు తనకు ఇరవై ఏళ్ళున్నాయి. ముప్పది నలుబది ఏళ్ళు ఈ మెట్లు ఎక్కుతూ ఉంటాడు. అంతకన్న ఏం కావాలి.
ఈలోగా అమెరికన్ ఫాదిరీ ఒకడు, ఇంగ్లీషు ఫాదిరీ ఒకడూ కొందరు తెలుగు ఫాదరీలు తన్ను క్రైస్తవమతం పుచ్చుకోమని పోరు పెడుతున్నారు. తమ శక్తివల్ల అతనికి మంచి ఉద్యోగం వేయిస్తారుట. తమ మతం మంచిదట! అమెరికన్ మిషనరీదొర: ఏమయ్యా! నీ పేరు ఏమి బాగుంది? పేరు మంచిది ఈయలేని మతం ఓ మతమేనా?
ఎల్లమంద: మీరేమి పేరు యిస్తారు? నెతానియేలు, దానిఏలు, జార్జి, ఎడ్వర్దూ, ఇసాఏలు, ఈశయ్య, మోసేయి, సామ్యుయేలు, కృపాదానం, దేవదానం, సత్యానందం ఈలా ఈలా ఉంటాయి. ఎల్లమంద కోటప్పకొండకు మా తలితండ్రులు బిడ్డలు పుట్టక మొక్కుకుని వెళ్ళారు. అక్కడ నుంచి వచ్చాక నేను కడుపున పడ్డాను. నా పేరు ఎల్లమంద అని పెట్టాడు మా తండ్రి. మీకు మైకేలు ఎంతో మాకు ఎల్లమందా అంతే.
ఆమె: పేరు సంగతి అల్లా ఉంచు. మీ వాళ్ళు రాళ్ళూ రప్పలకు మొక్కుతారు. జంతువుల్ని పూజిస్తారు. మా వాళ్ళు యేకేశ్వరుడయిన భగవంతునే పూజిస్తారు.
ఎల్ల: అయ్యా నా స్నేహితులు నాకు ఎల్లమందమూర్తి అని పేరు పెట్టినారు. అప్పట్నించీ మూర్తి అనే పేరు నిశ్చయమయిపోయింది. రూఢి అయింది. ఇక అనేక మంది దేవుళ్ళనీ, రాళ్ళకూ రప్పలకూ మొక్కుతామనీ మీ మిషనరీలు మావాళ్ళనంటారే. మీరు చర్చీలకు వెడతారు. మావాళ్ళు దేవాలయాలకు వెళతారు. మీకు జెహోవా, క్రైస్తు, మేరీ, హోలీఘోస్టూ మీకు ఏంజెల్సు, మాకు దేవతలు, మీకు అపోసిల్సు. మాకు మతకర్తలు, మీకు సెయింట్సు, మాకు ఋషులు, శాంతులు. మా మతం అఖండమయినది. రాధాకృష్ణనుగారు చెప్పినట్టు జీవిత విచారణ చేసే వారు మాలో ఎక్కువమంది, కాబట్టి మాకు లక్షల కొలది వేదాంతులు.
మిష: నువ్వు రాధాకృష్ణుని గ్రంథాలు చదివావా!
ఎల్ల: చదివాను. కాని చాలా భాగాలు అర్థం కాలేదు. అప్పటికీ మా వేదాంతం ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని.
మిష: సరే ఆలోచించుకో!
ఎల్ల: ప్రాపంచకంగా మొదటి రోజులలో మీ మతములో కలిసినవారికి లాభం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీ మతంలో కలిసిన వారంతా చదువుకుంటున్నారు. అనేకులు బి.ఏ.లో విజయం పొందారు. వారందరికీ ఉద్యోగాలు లేవు. కాబట్టి అనేకులు మీరు పెట్టిన పాఠశాలలోనే ఉపాధ్యాయులవుతున్నారు. కొంతమంది ప్రచారకు లవుతున్నారు. మాలో చదువుకున్నవారు తక్కువ. అందుకని ప్రాపంచకంగా మాకే ఎక్కువ లాభాలు కలిగే వీళ్ళున్నాయి, కాదా అయ్యా! -
ఎల్లమంద మూర్తి లేక మూర్తికి మనస్సు పరిపరివిధాల ప్రవహిస్తోంది. ఏదీ తోచదు. బి.ఏ తో తన చదువు పూర్తా?
తర్వాత ఏమి చేయాలి? ఎవ్వరు తనకు తర్వాత చదువు చెప్పించేది? ఏమిటి చదువుతాడు? బి.యే. లో ఫిజిక్సు పుచ్చుకొన్నాడు, తర్వాత?
తన జాతికి ఎలా సహాయం చేయడం? మహాత్మాగాంధీ నిజంగా అవతారమూర్తి! హరిజనులని పేరు పెట్టి తమ జాతిని తక్కిన కులాలతోపాటు సమం చెయ్యాలని తమ పవిత్ర జీవితం అంకితం చేసుకున్నారు. తన దేశంలోనివారే ఆయన దివ్యాశయాలకు అడ్డం వస్తున్నారు. ఇంతకూ ఈ కాలేజీ చదువు తమ వారందరూ చదవాలి. బాలురూ బాలికలూ కూలిపని మానివేసి చదవాలి. ఉద్యోగాలివ్వడంలో ప్రభుత్వంవారే హరిజనుల వంతు ఎక్కువ చెయ్యాలి.
అంబేద్కరుగారు ఇతర మతం పుచ్చుకొంటే కొంత నయిం అని తక్కిన కులాలవారిమీద కోపంతో అన్నారు. తమ మాల మాదిగ, పెరియా దోబీ, మాలార్ మొదలగు కులాల వారందరూ ఇతర మతాలు పుచ్చుకొంటే ఈ సమస్యా పరిష్కారం దొడ్డిదారే అవుతుంది. క్రైస్తవులైతే మాత్రం పాశ్చాత్యులతో సమానం ఔతారా? ముస్లింలు ఔతే నవాబులతో, కోటీశ్వరులతో సమానం ఔతారా?
అమెరికాలో నీగ్రోలందరూ క్రైస్తవమతం పుచ్చుకున్నారు. అంతమాత్రాన వారి విషమ సమస్య తీరిందా! కులాలు లేవనుకొన్న జాతులలో కులం ఇంకోరీతిగా పరిణమిస్తుంది. అన్నిటికన్నా రష్యా నయం. రష్యాలో ప్రతి మనుష్యుడూ పైకి వెళ్ళడానికి వీలుంది. అందరూ ఒక్కటే అక్కడ. ఆ మహత్తు బోల్సివిజంలో ఉంది కాబోలు. అయినా అక్కడ కులతత్వం ఇంకోరీతిగా తలెత్తుతుంది. బోల్షివిక్కులు కాని వారిని వారు మాదిగవారితో సమానంగా చూస్తారు. ఒక్కొక్కరకం పనిచేసేవారు ఒక్కొక్క రకం కులం అవుతారు. కులతత్వం మానవజాతిలోనే ఉంది కాబోలు. |
ఎల్లమందకు తన గుడిసెలో నిదురపట్టదు. తనొక్కడూ పెద్ద ఉద్యోగానికి ప్రయత్నం చేసినంత మాత్రాన ఈ గూడెం అల్లావుద్దీను మాయ సెమ్మా తిప్పితే మారినట్లు లండను పికాడెల్లీ సర్కసు అవుతుందా?
రాజమండ్రి హాస్టలు భోజనాలు తన ఇంటి దగ్గర ఏవి? అతడు రహస్యంగా కంటినీరు కుక్కుకున్నాడు.
తనకు నాల్గేళ్ళపాటైనా భోజనాలు దొరికాయి. తన వారికేవి? తన గూడెంవారి కేవి ఆ భోజనాలు? తను హాస్టలులో ఉన్నంతకాలం హరిజన సంఘంవారు తనకు కొని ఇచ్చిన కాంపు కాటుమీద, పరుపుమీదా పండుకొనేవాడు. ఇంటిదగ్గిర తన వాళ్ళెవ్వరికీ లేని భోగాలు తనకెందుకు?
మహాత్మాగాంధీ తన జాతికోసం ఎన్నిసార్లు నిరసన వ్రతం చేసినారో! తక్కిన హిందువుల హృదయంలోంచి, వారి భావనలోంచి, వీరు అంటరానివారు, చూడరానివారు అనే భావం తీసివేయగలరా?
తమకు దేవాలయ ప్రవేశం లేదు. దేవాలయంలోనే దేవుడుండి, ఇంకోచోట లేడనా? కావలసిన వారికి భగవంతుడు ఎక్కడ బడితే అక్కడే వున్నాడు. అసలు ఉన్నాడో లేడో? ఇంతకూ నువ్వు దేవాలయంలోనికి రాకూడదు అని ఒక కులాన్ని అరికట్టడంలో ఉన్న అగౌరవం అనంతం.
దేవాలయం ఇవతల భగవంతుడు తమ్ము అంటుకుంటే మైల బడిపోతాడా! మంత్రాలు పాడు నోళ్ళల్లోనే ఉంటాయా? మంత్రం కూడా భగవంతుని రూపం కదా అదీ సర్వత్ర నిండి ఉండవలసింది కదా!
ఎవరు తనకు సలహా చెప్పేది? ఎవరు తనకు దారి చూపేది. కాంగ్రెసు వారి నడిగితే, దేశసేవ చేయమంటారు. ఇతరులను అడిగితే ప్రభుత్వోద్యోగం చేయమంటారు. అతడు భీమవరంలో వున్న దేశ నాయకుడైన దండు నారాయణరాజుగారి కడకు పోయాడు. నారాయణరాజుగారు అతనికి అనేక విధాల సహాయం చేస్తూ ఉండేవారు.
నారా: నువ్వు బి.ఏ. ప్యాసయినంత మాత్రాన ఊరుకొంటే లాభం లేదు ఎల్లమందా.
ఎల్ల: పై చదువులు చదవడం ఎలా అండి.
నారా: నీ జన్మలో నీకు మెట్లు వుండాలి. మెట్లు ఉండడం మూడు రకాలు. భగవంతుడే ఏర్పరచిన మెట్లు, ఇతర మనుషులు - చుట్టాలో, స్నేహితులో, దయ గలవారో - ఏర్పరచిన మెట్లు; తనకు తానే ఏర్పరచుకొన్న మెట్లు. ఈ చివరరకం మెట్లే ఉత్తమమయినవి.
ఎల్లమంద: అవునండి, ఏం ఏర్పరచుకోను నేను, నేను నిర్మించుకొనే మెట్లూ రెండు రకాలు ఉంటాయండి. నాకోసం మెట్లు కట్టుకొని నేను ఎక్కవచ్చును. నా జాతి కోసం నా దేశంకోసం మెట్లు కట్టుకుని నేను ఎక్కుతూ నాతోపాటు ఇతరులనూ ఎక్కించవచ్చును.
నారా: నీ మాట ఎంతో సమంజసముగా వుంది. నీ కొరకే నువ్వు మెట్లు కట్టుకుంటే, భారతీయ కేంద్ర ప్రభుత్వ సభ్యుడుగా కావచ్చును. నీ జాతి పేరును వాడుకుంటూ, నీ జాతివారినే నీకు మెట్లు చేసుకోవచ్చును. అలాంటి పెద్దలున్నారు. అనేకమయిన పార్టీలు అలాంటివి ఉన్నాయి.
ఎల్లమంద: అవునండి, చివరకు జాతీయ సంస్థ అయి, మహోత్తమమూ, పవిత్రమూ అయిన కాంగ్రెసునే తమకు మెట్లుగా ఉపయోగించుకొనే పెద్దలున్నారు కాదా అండి?
నారా: బాగా అన్నావు ఎల్లమందా! కనక నువ్వు నీచస్థితిలోని నీ జాతిని పైకి తీసుకు వెళ్ళడమా, లేక నీకు నువ్వు బాగుపడడమా నువ్వే ఆలోచించుకోవాలి.
ఎల్లమంద ఇంటికి వెళ్ళినాడు. ఒక రాత్రల్లా నిద్రలేదు. పక్కమీద దొర్లాడు. లేచి వీధిలోకి వచ్చాడు. కుక్కలు అరుస్తున్నాయి. చెడువాసన ప్రపంచమే నిండి వున్నట్లుగా అవుతున్నది.
ఇంట్లో తనవారి చెడు వాసన, చెడు బట్టల వాసన, నీచస్థితి వాసన.
ఆ దుర్గంధం ఏనాటికయినా తన జాతిని వదలదా? తనజాతి నిదురించే ఈ పల్లెపయిన ప్రసరించే చంద్రకిరణాలు సుగంధాల జల్లుతూ ప్రతిఫలించే దినాలు రానేరావా? ఈ దేశానికి సుగతి లేదా?
★ ★ ★