మూడవ భాగం

నరుడు - నారీ

మెరికా నుండి ఎల్లమందమూర్తి దిగినాడు మదరాసులో. టెన్నిసీ లోయల ఆనకట్టల విధానం సమగ్రంగా చూడడమే కాక అక్కడ పెద్ద ఇంజనీరు దగ్గర రెండేళ్ళు విద్యార్థిగా పని నేర్చుకునేవానిగా పనిచేశాడు. ఆ ఇంజనీరు “మాకు ఫర్టను” ఇంజనీరు శాస్త్రంలో ఉద్దండ పండితుడు.

లోకంలో వర్షం వల్ల ఎంత నీరు పడుతోంది; ఒక్కొక్క నది ఎంత నీరు మోసుకుపోయి సముద్రంలో కుమ్మరిస్తోంది. ఆ నీరు తీసుకుపోతూ, నీటితోపాటు మన్నూ కొట్టుకుపోతుంది. ఊళ్ళు కొట్టుకుపోతాయి. పొలాలు తేలుకుపోతాయి. ప్రతి నదీ ఈనాడు ఈ దారిని, ఆనాడు ఆ దారిని పోతుంది. వరదలు, ముంపులు, పంటనాశనం, మనుష్యుల ప్రాణనాశనం, పశువుల నాశనం, రోడ్లు, రైళ్ళు నాశనం!

ఈలాంటివి భారతదేశంలో నిత్య ప్రళయ తాండవ దృశ్యాలు. ఓనాడు గోదావరి, ఇంకో సంవత్సరం కృష్ణ, ఆ మరుసటి ఏడు గంగ, శోణానది, గండకి, బ్రహ్మపుత్ర వరదలు, వరదలు.

కోట్ల కోట్ల గుండిగెల నీటిని నిష్కారణంగా కళ్ళారా చూస్తుంటే దిగమ్రింగడంలో దాహం ఏ మాత్రమూ ఎప్పుడూ చాలని ఆ బ్రహ్మాండ వృకోదరుడు సముద్రుడు తాగిపారేస్తున్నాడు. ఆ నీరు మనకు వద్దా అండీ అని ఎల్లమందమూర్తి అనుకున్నాడు. తాగడానికి కావాలి. పొలం తాగడానికి కావాలి! విద్యుచ్ఛక్తి ఉద్భవింపచేయడానికి కావాలి.

గోదావరికి ఎన్ని ఆనకట్టలు కట్టవచ్చును? ఆ దివ్యమాత సముద్రతలానికి మూడువేల అడుగులకు పైన ఉద్భవించింది. ప్రతి నూరు అడుగులు దిగడంలోనూ ఒక ఆనకట్ట కడితే, కామధేనువు నందినీవత్సానికి పాలు చేసినట్టు ప్రాణయస్సులు చేసి ఉండును. ఒక్కొక్క ఆనకట్ట ఒక్కొక్క పొదుగు. ముఫ్ఫై ఆనకట్టలు! నాసిక ప్రతిష్టానం. నాందేడు, గ్రామమందెన గ్రామం, భద్రాచలం, పోలవరం, ఈలా ఆ తల్లికి ఆ తల్లి లోనికి ప్రవహించే నదులకు ఆనకట్టలు! ప్రపంచమంతా నూత్న జీవంతో ఫక్కుమనదూ? అప్పటికీ ఎల్లమంద తెలిపే లెక్కల ప్రకారం గోదావరి నీటిలో నూరోవంతే ఉపయోగం అయ్యేది.

ఆనకట్టలు, కాల్వలు, వేలకొలది కాల్వలు, కాల్వలపై కాల్వలు, వంతెనలు, కాల్వలు దేశం అంతా జీవన రక్తనాళ పూర్ణమయిన మహాశరీర మయిపోతుందని టెన్నిసీలోయ చూస్తూ ఎల్లమంద స్వప్నాలు తేలినాడు.

వరదలు అలంకరించుకొన్న అప్సరసలులా దేశాల ప్రవహించిపోతాయిగాని ఎంతమన్నో భూములలో నిలుస్తుంది. భూదేవి గర్భం చల్లబడుతుంది. భారతదేశం నలభైకోట్ల పుత్రులను కాదు, నాలుగువందల కోట్ల పుత్రికా పుత్రకలను భరించ గలుగుతుంది. ఎల్లమందమూర్తి ఈ స్వప్నప్రపంచంలోంచి ఒక్కసారిగా కూలబడుతూ ఉంటాడు. తన దేశంలో ఇలాంటివి ఎవరు చేయిస్తారు. ఇంగ్లీషువారికి ఏమి పట్టింది. మహాత్ముని ఉద్యమం భారతదేశానికి స్వరాజ్యం తీసుకువస్తే ఆదేశంమీదకు ఇతరులు రాకుండా ఉంటే చిక్కిన తన దేశ ప్రజలు వందల సంవత్సరాలనుంచీ పోయిన బలాన్ని తిరిగి సంపాదించుకొని ఛాతీలు విరిచి పనిచేయగలిగేసరికి మళ్ళీ ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో?

ఎల్లమంద లోకమంత నిట్టూర్పు విడిచాడు. అమెరికా అంతా గురువుగారి సహాయంవల్ల తిరిగి మహోత్తమ యోగ్యతా పత్రము పుచ్చుకొని ఎల్లమంద స్వదేశాభిముఖుడైనాడు. అతడు తాను వస్తున్నానని హరిజన సంఘం వారికి, తన మిత్రుడు లయనెల్‌కూ, తన గ్రామంలో తండ్రికీ తల్లికీ ఉత్తరాలు రాసినాడు.

ఎల్లమంద ఇంగ్లండులో చదువుకుంటున్నాడు. ఎల్లమంద అమెరికాలో ఉన్నాడు. జక్కరం గ్రామంలో మాదిగవాడలో ఎల్లమంద తండ్రీ తల్లీ అన్నతమ్ములూ, అక్క చెల్లెండ్రూ, చుట్టపక్కలూ ఆ గుడిసెలో, ఆ వాసనలో ఆ మకిలిలో, ఆ చినిగిన గుడ్డల బీదతనంలో, ఆ తిండిలేని ఆకలి హీనతలో, అలాగే ఒకరకం ఆనందంతోనే కాలం గడుపుతున్నారు.

ఆ ఆనందం ఏమి ఆనందం అని ఎల్లమందమూర్తి పళ్ళు బిగించి అనుకున్నాడు. తన వాళ్ళకు ప్రయత్నం చేసే శక్తిలేదు, జ్ఞానమూలేదు, ప్రయత్నం చేయాలన్న భావమూ లేదు. మహాత్ముని పవిత్ర శంఖారావంలో స్వరకల్పన, తాళము, ఆనందమూ, వాళ్ళ పల్లెలకు వినబడుతుందా?

2

ఎల్లమంద బాగా పొడుగ్గా ఎదిగి అయిదడుగుల పది అంగుళాల ఉన్నతి సంపాదించుకొన్నాడు. దేహం ఒక స్వచ్ఛత పొందింది. జ్ఞానం అతని మెదడు తలాల్లో నిత్యజీవ పవిత్రగంగా ఘరీ వేగంతో ప్రవహిస్తున్నది.

చక్కని అమెరికను దుస్తులతో అమెరికన్ వేషంతో ఎల్లమంద జపాను ఓడలోంచి దిగేసరికి లయొనెల్, లయనెల్ భార్య ఎలిజబెత్తూ, జెన్నిఫర్ నవ్వుతూ ఎదురు వచ్చారు. లయొనెల్ చేతులు చాచి వచ్చి ఎల్లమంద చేతులు గట్టిగా పట్టుకొని జాడించాడు. ఎల్లమంద సంతోషం వర్ణనాతీతమే! ఎల్లమంద లయనెల్ భార్యను బాగా ఎరుగును. ఎలిజబెత్ కూడా “మూర్తి” అంటే ఎంతో స్నేహంగా ఉండేది, ఇంగ్లండులో. ఇంక మూర్తీ కళ్ళ ఎదుట ప్రత్యక్షమయిన దివ్య సౌందర్య నిధి ఎవరూ?

ఒహో! ఒక్క నిమిషంపాటే అనుకో, అతడు ఆనవాలు పట్టలేక పోయాడే! ఈ బాలిక జెన్నీ! అన్నగారి హృదయం చూరగొన్న మురిపాల చెల్లెలు జెన్నీ! లయనెల్ అన్ని పొగడ్తలు ఈ బాలికవే! ఎంత అందమయిన బాలిక! సన్నగా బంగారు శలాకులా, మళ్ళీ తగిన బలంతో పొట్టిగా ఉన్న ఈ బాలిక అపశ్రుతి ఏమీలేని సౌందర్యాల నిధి!

ఎల్లమంద లయనెల్ భార్య ఎలిజబెత్తుకు, టోపి తల పైన నుండి తీసి నమస్కరించి కరస్పర్శచేసి, “ఎలిజబెత్! నీకు మా భరత భూమి కూడా బాగా సరిపడిందిలా ఉందే! నీ ఇంగ్లీషు గులాబులు ఇండియా ఎండలకు ఏమీ తగ్గలేదు.” ఎలిజబెత్ నవ్వుతూ, “మీ ఇండియా, రంగుల సౌభాగ్యాల సౌరభాల దేశమయ్యా! నాకు ప్రథమ పరిచయం ప్రేమ, ద్వితీయ పరిచయంతో గాఢ ప్రణయమే ఉద్భవించింది.” అని అన్నది.

లయొనెల్ జెన్నీని చూపిస్తూ, “ఈ అల్లరి అమ్మాయి ఎవరో ఆనవాలు పట్టగలవా?” అన్నాడు.

“అల్లరి అమ్మాయినే ఆనవాలు పట్టాను.” అని ఎల్లమంద చిరునవ్వుతో అన్నాడు.

“మా జెన్నిఫర్! జెన్నిఫర్!! ఈమే మూర్తీ!” అని వారిరువురను ఎరుకపరిచారు. ఎల్లమందకు ఆమె చేయి ఇచ్చింది. ఇద్దరూ కరస్పర్శ కావించుకున్నారు. మాటలు లేవు. ఇద్దరూ ఒకరికొకరు తీక్షణంగా చూచుకున్నారు. ఎల్లమంద గుండె అతివేగంగా కొట్టుకొన్నది. ఆమె హృదయమూ ఎందుకో వేగంగా కొట్టుకొంది. తెప్పరిల్లి జెన్నీ “అమెరికానుంచేనా మీరు వస్తున్నది?” అని ప్రశ్నించింది.

ఎల్ల: దారిలో జపానులో పదిహేను రోజులు ఆగి ఆ దేశంలోని ఇంజనీరింగు విధానాలన్నీ పరిశీలించాను.

జెన్నీ: 'దయబుటూ'ను చూచారా?

ఎల్ల: దివ్య బుద్ధ విగ్రహం పరమ సౌందర్యవంతంగా ఉంది. అలాంటి విగ్రహాలు ఆ రకంగా మన దేశంలో లేవు. అయినా ఈ భావం మన దేశంనుంచే జపాను వెళ్ళిందని ఆశ్చర్యము పొందాను.

ఎలిజ: మొన్న మేము శ్రావణబెలగోలా వెళ్ళి బ్రహ్మాండమయిన విగ్రహాన్నొకదాన్ని చూచివచ్చాము.

ఎల్ల: దాన్ని గురించి విన్నాను.

లయొ: మా విజ్జీకి ఎల్లా తెలిసిందో నేను చార్జీ పుచ్చుకొని మా ఇద్దరి కాపురం తిరుచునాపల్లిలో పెట్టిన వారం రోజులనుంచీ శ్రావణబెలగోలా వెళ్ళాలని పట్టుపట్టింది.

ఎలిజ: ఏముంది, నేను హిగిన్‌బాదమ్స్‌లో యాత్రికుల గ్రంథాలన్నీ కొన్నాను.

వారందరూ పోయి టాక్సీ కారులో ఎక్కారు. కస్టమ్సు వారు ఎల్లమంద మూర్తి వస్తువులు తనిఖీచేసి, వేయవలసిన వానికి పన్ను విధించి ధనం తీసుకొని రశీదులు ఇచ్చినారు. సామానులన్నీ ఒక టాక్సీలోవేసి రెండవదానిలో తామెక్కి అంతా కానుమెరా హోటలుకు చేరారు.

ఎల్లమందకు ఇంగ్లీషు హోటల్లో ఉండడానికి ఇష్టం లేదు. అతన్ని ఎదుర్కొనడానికి వీళ్ళు ముగ్గురూ తప్ప ఇంక ఎవ్వరూ రాలేదు. హరిజన సేవాసమితి కార్యాలయానికి వచ్చి తెలుసుకోవలసినదని, “కానుమెరా'కు ఉత్తరం వచ్చింది.

అతన్ని అక్కడ వదిలి లయొనెల్ ఎలిజబెత్, జెన్నీలు తమ ఇంటికి పోయారు. జెన్నీకి ఛాంపేను త్రాగినట్లు ఏదో హుషారుగా ఉంది. ఎల్లమందమూర్తి భోజనంచేసి కాసేపు విశ్రాంతి తీసుకొని, సాయంకాలం అయిదుగంటలకు జెన్నీగారి ఇంటికి తేనీటికి వెళ్ళ నిర్ణయమైంది.

నాలుగు గంటలకు వేషం వేసుకొని టాక్సీ చేసుకొని, మూర్తి హరిజన సేవా సంఘ కార్యాలయానికి వెళ్ళినాడు. అక్కడ పనిచేసేవారికి మూర్తి తన విలాసం ఉన్న చీటి ఇచ్చినాడు.వారు కూచోండనీ కార్యదర్శిగారు పని ఉండి రాలేకపోయారనీ, అయిదు గంటలకు వస్తారనీ చెప్పారు. వారిని మళ్ళీ దర్శనం చేసుకొంటానని చెప్పి అక్కడ సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయినాడు. సరిగా అయిదు కొట్టేసరికి జెన్నిఫర్ ఇంటి గుమ్మం మూర్తి ఎక్కినాడు.

3

వెళ్ళగానే జెన్నీగారి సేవకుడు, ఎల్లమంద టోపీ అంది పుచ్చుకున్నాడు. జెన్నీగారి తల్లి, తండ్రి గ్రామాంతరం వెళ్ళారని, లయొనెల్, అతని భార్య జెన్నీకి అతిథులుగా ఉన్నారనీ జెన్నీ ఎల్లమందమూర్తికి చెప్పింది. లయొనెల్, ఎలిజబెత్తులు వీరిరువురు కూర్చున్న కడకు వచ్చారు. మూర్తి నమస్కరించాడు. తేనీరు అయిదున్నరకు, ఆ తర్వాత నలుగురూ కలిసి వెస్ట్ఎండ్ సినిమాకు వెళ్ళి అక్కడ ప్రదర్శితమవుతున్న మంచి చిత్రం ఒకటి చూడడం, తర్వాత నలుగురూ కానుమెరా హోటలులో మూర్తికి అతిథులుగా భోజనం చేయడం, భోజనం ముందు నాట్యం. ఆ రోజు కానుమెరాలో నాట్యదినం. నాట్య కార్యక్రమం తెల్లవారగట్ల రెండు మూడింటివరకూ సాగుతుంది. ఇది మనవారి కార్యక్రమం.

నలుగురూ హాలులో కూచుని చెకచెక కబుర్లు చెప్పుకుంటున్నారు. మూర్తిచేత జెన్నీ చక్కని ప్రోత్సాహం ఇస్తూ మాట్లాడిస్తున్నది. అతని స్వప్నాలు ఆశయాలు చిన్ననాటి స్థితి మొదలయిన విషయాలు సినిమా బొమ్మల్లా వాళ్ళ హృదయావనికలపై దృశ్యమై మాయమైపోతున్నవి.

మూర్తి: మా ఇళ్ళలోకి దూరి వెళ్ళాలి!

జెన్నీ: సముద్రం ఒడ్డున పల్లెవాళ్ళ ఇళ్ళలా!

మూర్తి: పల్లెవాళ్ళ ఇంటికి పెద్దకులం వాళ్ళెవరయినా రావచ్చును. ఇంట్లో ప్రవేశించి కూచోవచ్చు.

జెన్నీ: మీ ఇళ్ళకు ఎవరూ రారు మూర్తిగారూ!

మూర్తి: నన్ను గారూ, గీరూ అనకు జెన్నీఫర్!

జెన్నీ: అయితే నువ్వు నన్ను జెన్నీఫర్ అనే పేరుతో పిలవకు 'జెన్నీ' అని పిలువు.

మూర్తి: అలాగే! మా గరువుగారి కొమరిత పేరు 'జోను' నన్ను 'జో' అని పిలవమనేది. అలాగే పిలిచాను.

లయనెల్: గురువని 'మాక్ పెరని' పిలుస్తువా మూర్తి!

మూర్తి: అవును “లయ!”

తేయాకు నీరు త్రాగినారు. ఎంతో సంతోషంతో కాలం గడిచిపోయింది.

ఎలిజబెత్తు జెన్నీలు సినీమాకై దుస్తులు మార్చుకొనడానికై వెళ్ళారు. మూర్తి లయొనెల్ సిగరెట్లు త్రాగుతూ కూచుంటే, లయనెల్ తన ఉద్యోగం విషయం అంతా మూర్తికి చెప్పినాడు.

వారంతా కలిసి సినిమాకు వెళ్ళినారు. జెన్నీ మూర్తి ప్రక్కనే కూచుని ఉంది.

ఈ మూర్తి నలుపు. తన చక్కని గులాబి రంగు ముందు మూర్తి నలుపు రాక్షసి బొగ్గు నలుపు. ఆమె వీళ్ళంతా ఒకనాడు నీగ్రోజాతి వారేమోననుకుంది. సినీమా చూసి, వారు మువ్వురూ భోజనపు దుస్తులు మార్చుకోవడానికి ఇంటికీ, మూర్తి కానుమెరాకు వెళ్ళినారు.

మూర్తిని అఖిల భారతీయ ప్రభుత్వంవారు తమ ఇంజనీరింగు శాఖలోనికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని విషయమై, మూర్తికి, కేంద్ర ప్రభుత్వానికి చేరాల ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఈలా జరగడానికి కారణం మూర్తి గురువుగారు అమెరికానుంచి మూర్తి విషయం రాజప్రతినిధికీ, ఇంగ్లాండు భారత కార్యదర్శికీ రాయడమే'

మూర్తి విషయం కానుమెరావారికి తెలిసింది. వారికి ఎంత గౌరవమో కలిగింది. రంగుతేడా కాని మేధావంతుడైన ఇంగ్లీషు “నీలరక్తపు” పెద్దమనిషితో సహా సమానంగా సంచరిస్తున్న మూర్తి అంటే ప్రేమ కుదిరింది. కానొమెరా మేనేజరు మూర్తిని అమెరికా విషయాలు అనేకం అడిగి తెలుసుకోవడం అంటే సరదాపడసాగినాడు.

మూర్తి వేషం మార్చుకుని సరిగ్గా అనుకున్న సమయానికి క్రిందికి దిగినాడు. జెన్ని, లయనెల్, ఎలిజబెత్తులు కారు దిగినారు.

లయెనెల్, జెన్నీ, ఎలిజబెత్తులు కొంచెం ఛాంపేను త్రాగినారు. మూర్తి తాను త్రాగనని కాంగ్రెసు నాయకులకు వాగ్దానం ఇవ్వడంచేత ఏవైనా రంగునీళ్ళు త్రాగేవాడే. కాని వాట్లజోలికి వెళ్ళలేదు. లయెనెల్ మూర్తిని చాలామంది తన మిత్రులకు ఎరుకపరచినాడు. వాళ్ళకు మూర్తి అంటే అంత గౌరవమేమి ఉంటుంది. “ఒక వెధవవాయి నిగ్గర్” అనుకున్నారు. కాని వాళ్ళందరికీ ఎలిజబెత్తుతో, జెన్నీతో నాట్యాలు కావాలి.

జెన్నీ, మూర్తికి ఆరు నాట్యాలు ఇచ్చింది. రెండు మూడు ఇతరులకు ఇచ్చింది. మూర్తితో కలసి బయట కూచుని మాట్లాడడం ఏర్పాటు చేసుకుంది. రెండు నాట్యాలు ఎలిజబెత్తుతో నాట్యమాడడానికి ఎలిజబెత్ నడిగి ఆమె అనుమతి పొందాడు.

మూర్తి ఎంతో అందంగా నాట్యం చేశాడు. జెన్నీ అతని చేతులలో ఇమిడి అతనితో నాట్యం చేస్తుంటే, ఆమె ఇంతకుముందు ఎవరితో నాట్యం చేస్తున్నా అనుభవించని ఆనందం అనుభవించింది.

అతడామెను ఏ లోకానికో తీసుకుపోయేవాడు. అతని అడుగు గోదావరి ప్రవహింపులా ఉంది. అతని స్వరూపము కంచుతో పోతపోసిన అపోలో విగ్రహంలా ఉన్నది. నడుం చుట్టూ చేయివేసి అతడు తన్ను తేల్చుకొని పోతూవుంటే జెన్నీకి హృదయము కరిగిపోయింది. ఆనందంతో ఆమె అతనికి మరింత దగ్గరగా వచ్చింది. చివరకు అతన్ని అదిమివేసుకొన్నది.

అతడు పురుషుడు, ఆమె స్త్రీ! యుగయుగాల నాటి నుండీ ఆమె అతణ్ణి కోరింది. అతడు ఆమెను కోరినాడు. గుహలలో, పొలాలలో, పట్టణాలలో, ఈజిప్టులో, గ్రీసులో, అరేబియాలో, చీనాలో, అమెరికాలో, జర్మనీలో, ఇంగ్లండులో, ఇండియాలో, నూగినియాలో, ఒకరినొకరు వాంఛించారు. కలుసుకొన్నారు. గాఢమధుర మత్తతాశ్లేషాలలో పరిమళ చుంబనాలలో వివశత్వం చెందారు. ఆమెకు ఒడలు తెలియలేదు. అతనికీ తెలియలేదు. ఇద్దరూ ఉప్పొంగిపోయినారు. నాట్యంలోనుండి నెమ్మదిగా హోటలు తోటలోనికి చేరారు. జెన్నీ కళ్ళు నక్షత్రాలులా మెరుస్తున్నవి. అద్భుత సౌందర్యవతి యని పేరుగన్న ఆ బాలిక ఈ సమయంలో సౌందర్యానికే సౌందర్యం దిద్దే సౌందర్య సంపూర్ణ అయింది.

ఇద్దరు కొంచెం చీకటి ఉన్న ఓ పూపొదరింటి మాటున వేయబడిన సోఫాలో చదికిలబడినారు. ఇద్దరికీ మాటలు లేవు. జెన్నీ అతని భుజాలపై రెండు చేతులువేసి “మూర్తి, నేనే నిన్నే... ప్రేమిస్తున్నానని... తెలుపుతున్నాను. నువ్వూ నన్ను ప్రేమిస్తుంటే నన్ను - నా పెదవుల్ని ముద్దు పెట్టుకో!” అని మధురమయిన వాక్యాలు పలికింది.

4

ఆ వాక్యాలు అస్పష్టంగానే! అతడు ప్రేమ ఎరగడు. స్త్రీలను వాంఛించకపోలేదు. కాని తన వ్రతం చొప్పున పరదేశాలలో ఉన్నప్పుడు బాలికల జోలికిపోలేదు. నాట్యం నేర్చుకొన్నాడు. ఇంగ్లీషు బాలికలతో నాట్యం చేయడం నేర్చుకున్నాడు అంతే! అతన్నీ కొందరు బాలలు కోరారు. అతడు తల్చుకుంటే పొందు కూడడానికి అదనులు దొరక్క పోలేదు. కాని త్రాగుడును ఏలా అతిదూరంగా ఉంచేశాడో, అలాగే స్త్రీ తోటి సంబంధాలు అతి దూరంగా ఉంచేశాడు.

పైకి కనబడేవారి తెలుపురంగు ప్రవహించే గులాబీ రంగులు ఎల్లమందకు గుండె కొట్టించిన మాట నిజమే! కాని తన జాతి నల్లరంగు, తన జాతి గుడిసెలు; తన జాతి వాడలు, దుర్గంధము, దుర్భరస్థితి, మురికిగుడ్డలు, కుళ్ళిన మాంసము, చదువులేని తనము నాగరికతలో అది ప్రాథమిక స్థితి - అతనికి అలాంటి సమయాలల్లో మరింత భయం కొలిపేవి. అతడు వణికిపోయేవాడు.

తన సంఘంకన్న హైన్య స్థితిలోవున్న సంఘాలు ప్రపంచమంతా ఉన్న మాట నిజం! మంచి స్థితిలో ఉన్న సంఘాలు వాని ప్రయత్నాలమీదనే అవి ఉన్నతస్థితికి రాగలిగాయి. కాని ఆఫ్రికాలో నీగ్రోలు, అండమాన్సు నూజిలాండు, బోర్నియాలలోని ఆదిమవాసులు తన భారతదేశములో తన సంఘంవలె ఉండే ఇతర సంఘాలు, నాగులు, వేప్చాలు, శబరులు, చెంచులు, యానాదులు, భంగీలు, పెరయాలు, మాలమాదిగలు, డోంభీలు, చచ్చటివాళ్ళు, వోర్లీలు, బిల్లులు కోతులు, గోండులు, సంతాలులు వీరందరి స్థితీ! బర్మాలో వారిస్థితీ! వీరందరూ అలాంటి పరమ హైన్య దశలో విముక్తి లేకుండా ఉండిపోవలసినదేనా? అని ఎల్లమందకి జెన్నీ ఎదుట కూర్చుండి ఆమెను దగ్గిరగా తీసుకొన్న ఆనందంలో, ఆమె తన్ను ముద్దు పెట్టుకోమని అడిగిన ఆనందంలో ఒళ్ళు ఝల్లుమంటుండగానే ఈ ఆలోచన అతన్ని విద్యుచ్ఛక్తిలా ఆవరించుకొంది.

కాని, అతని దేహాన్ని హృదయాన్ని జీవితాన్ని అలుముకొని ఉన్న గాఢపిపాస ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. అతడు జెన్నీని అతిక్రాంతాలింగనంలో అదిమికొని ఆమె పెదవులను మహోద్రేక చుంబనాన అదిమి వేసినాడు.

ఆ యిరువురికీ సర్వప్రపంచమూ మాయమయినది. వారిరువురూ ప్రపంచానికి, కాలానికీ అతీతమైపోయినారు. కాలమే ఆగిపోయినది!!  వారు కౌగిలింత విడినారు. అతడు వణికే కంఠంతో “జెన్నీ, నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగాడు.

ఆమె మాట్లాడక అతని మెడచుట్టూ చేయి వైచి తల వంచుకొని అతని పెదవులను ముద్దుపెట్టుకుంటూ ఉప్పొంగే తన అధరాన్ని అతని విశాల వక్షానికి అదిమివేసి “నీకోసం, నీకోసం ఇన్నేళ్ళు కనిపెట్టుకుని ఉన్నాను!” అన్నది.

ఆ సమయం అయిన్‌స్టెయిను రెలెటివిటీ సిద్ధాంతాన్ని మించిన సమయం.

ఆ సమయంలో మనుష్యుడు అన్ని స్థితులను దాటిన దివ్యస్థితిలో ఉంటాడు.

“నేను ఎంతో అదృష్టవంతుణ్ణి జెన్నీ!”

“నేను అదృష్టవంతురాలిని మూర్తీ!”

“నేను నికృష్టుడయిన హిందూజాతి అధమ సంఘానికి చెందినవాణ్ణి!”

“మా సంఘానికి ఏ స్థితీ లేదు మూర్తీ!”

“నువ్వు దేవకన్యవు!”

“అది వట్టి పొగడ్త!”

“నన్ను గురించి ఏమీ ఎరగవు, ఎలా నన్ను ప్రేమించగలిగావు?”

“నిన్ను గురించి నాకు తెలిసినంత నీకే తెలియదు!”

“నేను ఈ దేశం వచ్చి కొద్దిరోజులే అయింది.”

“నిన్ను ఏళ్ళ తరబడి ఎరుగుదును.”

“ఈ నా ప్రేమ -”

“నీ ప్రేమ కాదు - మన ప్రేమ!”

“మన ప్రేమ విషయం మీ తల్లితండ్రులూ, లయొనెలూ విని ఏమంటారు?”

“నా అంత అదృష్టవంతురాలు లేదంటారు?”

వారిద్దరూ మరీ మరీ గాఢంగా అదిమి వేసికొన్నారు.

“రా! మూర్తీ, నా దివ్యభర్తా! రా! మళ్ళీ ఆ నాట్యంలోకి వెళ్ళలేను. మనం ఏ చక్కని ప్రదేశానికైనా పోయి అక్కడ ఏవో మధురమయిన, పిచ్చివైన అత్యంతార్థవంతాలయిన మాటలు చెప్పుకుందాము! రా!” అని జెన్నీ అన్నది.

అతడు లేచి, ప్రణయసరస్నాతుడయిన వానివలె జెన్నీని తన కదిమికొని ముద్దులిచ్చి ఆమె కారుకడకు కొని పోయినాడు. వారిద్దరూ అప్పుడే పన్నెండు కొట్టినదని, తెలుసుకొని, రెండు గంటల కాలంవరకూ సముద్రతీరం వరకూ వెళ్ళివద్దామనుకున్నారు.

5

ఆమె తన కారు నడుపుకొంటూ అతన్ని తీసుకుపోయినది. తన కారు నడిపేవానితో అక్కడే ఉండమనిన్నీ, తన అన్నగారు అడిగితే ఇద్దరూ కలిసి సముద్ర తీరానికి వెళ్ళినారనీ చెప్పమని వారు బయలుదేరినారు.

ఆమె ప్రక్కనే అతడు అధివసించి ఉన్నాడు. ఆమె “నేను అందమయినదాననేనా మూర్తీ?” అని అడిగింది. “నువ్వా! ప్రపంచములో ఒక్క బాలికన్నా నీ ఎదుట తగుదునని సౌందర్యం విషయంలో నిలవగలదా జెన్నీ?”

“బడాయి పొగడ్త!”

“పొగడ్తా! కాని నా వంటి శుద్ద నీగ్రో మాటో?”

కారు ఆపుచేసి, “నన్ను అలా అవమానించినందుకు చూడు ఏం చేస్తానో?”

“నిన్ను అవమానించడమా?”

“అవును! నా ప్రియతముణ్ణి నీగ్రో అంటావా దుర్మార్గుడా!”

“ఇంత చదువుకున్నవాడవు శాస్త్రజ్ఞుడవు, శాస్త్ర పరిశోధకుడవు, నువ్వు కూడా ఏదో పారలౌకిక సంబంధమైన మాటలంటావేమి మూర్తీ?”

“నువ్వు దేవకన్యవు. దేవకన్యల ఎదుట ప్రాపంచికపు మాటలు ఎలా వస్తాయి?”

“నన్ను పొగడకు. సంపూర్ణంగా ప్రాపంచిక వాసనలలో మునిగివున్న దానిని నేను.”

“అది నమ్మమనేనా నీ ఉద్దేశం?”

“ఆ!”

“అయితే నువ్వు నన్నెలా ప్రేమించగలిగావు?”

“అమెరికా వెళ్ళి పెద్ద విద్య నేర్చుకు వచ్చిన మొనగాడవు!”

“అవును! భారతదేశంలో అతి నికృష్ణ సంఘానికి చెందిన హీనుణ్ణి!”

వారిద్దరూ పకపక నవ్వుకున్నారు.

ఆ వెన్నెలలో ఆమె అతని ఒడిలోకి ఒక వాగు ఇంకో వాగులోనికి ఒదిగినట్లు వాలిపోయినది. అతడామెను తన హృదయాన బిగియార కౌగలించుకొని, అమిత భక్తితో ప్రణయంతో, ఆనందావేశంతో ఆమె మోము, జుట్టు, కన్నులు, చెవులు, మెడ, వక్షసీమ, భుజములు ముద్దు పెట్టుకున్నాడు.

వారు ఒకరి నొకరు చూచుకుంటారు. పిచ్చిమాటలు పలుకుకుంటారు.

ఇంతలో ఇద్దరికీ ఒక్కసారే లయొనెల్ జ్ఞాపకం వచ్చినాడు.

ఇద్దరూ చటుక్కున లేచి ఒకరి నడుంచుట్టూ ఒకరు చేతులు అదిమిపట్టి రోడ్డుమీద ఉన్న కారుకడకు పరుగుపెట్టారు. కారులో ఎక్కి కానొమెరాకు చక్కా వచ్చారు.

కారుదిగి ఇద్దరూ తిన్నగా నాట్యంచేసే మందిరంలోకి పోయేసరికి లయొనెల్ నిలుచుండి, సోఫాపై కూర్చున్న భార్యతో ఏదో వాదిస్తున్నాడు.

ఎలిజబెత్తు గుమ్మంలో వచ్చే ఈ యువజంటను చూచి "అరుగో వస్తున్నారన్నది!” ఆమె భర్త తిరిగి, వీరిద్దరిని చూచి గబగబ రెండంగలలో వీరిద్దరికడకూ వచ్చినాడు. చిరునవ్వు నవ్వుతూ వీరిని చేరి, వారి మోములు చూచి, వారి ఫాలాలలో నృత్యం చేస్తున్న కాంతులు చూచి, వారి రహస్యము చటుక్కున గ్రహించినాడు.

తడబడుతూ ఎల్లమందమూర్తి “లయో! నీ... నీ... సోదరి నన్ను ధన్యుణ్ణి చేసింది. నన్ను వివాహం జేసుకోడానికి ఒప్పుకుంది. నీ అనుమతి... అనుమతి ఇవ్వ ప్రార్ధిస్తున్నాను!” అన్నాడు. వెంటనే లయొనెల్ మూర్తి చేయి దొరకపుచ్చుకొని, జాడించి, “నా అభినందనాలు, మూర్తీ! ఈ పవిత్ర క్షణంకోసం కలలు కన్నాను. కోరాను, భగవంతుణ్ణి ప్రార్థించాను. అలాంటిది నా అనుమతెందుకూ అనుమతి అయిదేళ్ళ క్రిందటే ఇచ్చాను,” అన్నాడు.

చెల్లెలిని దగ్గరకు తీసుకొని, ఆమెను నుదురుపై ముద్దిడి, “రండి! విజ్జీకి చెబుదాము!” అని మూర్తివైపు తిరిగి, నువ్వు విజ్జీతో ఈ నాట్యంలో పాల్గొనవలసి ఉంది. నువ్వు సమయానికి లేక ఎక్కడికో వెళ్ళిపోయావని, ఆమెగారికి కోపం వస్తే, నేను నీ తరపున క్షమాపణ అడుగుతున్నాను.” అన్నాడు.

మూర్తి తెల్లబోతూనే ఎలిజబెత్ కూర్చున్న తావుకు వెళ్ళి “ఎలిజిబెత్! నన్ను క్షమించాలి! నేనూ జెన్నీ కలిసి సముద్రం ఒడ్డుకు వెళ్ళాము. జెన్నీ నన్ను వివాహం చేసుకొని నా జన్మ పవిత్రం చేయడానికి ఒప్పుకొంది! ఆ విషయం మాట్లాడుకొంటూంటే ఆలస్యమయింది. నన్ను క్షమించమనీ, మా ఇద్దరినీ అభినందించమనీ ప్రార్థిస్తున్నాను.” అని చేయి చాపినాడు.

ఎలిజబెత్తు ముఖంలో కోపకాంతులు మాయంకాలేదు. ముందుకు చాపిన అతని చేతిని ఆమె గమనించదలచకోలేదు. “నువ్వు క్షమాపణ అడగనక్కరలేదు, నీ నాట్యం లేకపోయినందువల్ల నా మనస్సు ఏమీ కలతపొందలేదు! కాని నా మాట జెన్నీ వినేటట్లయితే ఒక నిగ్గర్ను పెళ్ళి చేసుకోవద్దని ఆమెకు నా హృదయపూర్వకమైన సలహాయిస్తున్నాను. అని లేచి, భర్తవైపు తిరిగి నాకు తలనొప్పిగా ఉంది. ఇంటికి పోవాలి!” అని బయలుదేరింది.

వారందరి మధ్యా ఒక పిడుగు పడింది. మూర్తికి వేయి బాంబులు మీద పడినట్లయింది. అతని హృదయంలోని రక్తం మాయమై స్పందనమాగిపోయింది.

లయొనెల్ నోటమాటలేదు. అతడు చైతన్యముడిగి అలాగే నిలుచుండిపోయినాడు. కాని జెన్నీ మొదట ఒక నిముషం ఆశ్చర్యంతో, తర్వాత కిలకిలనవ్వి.

“అన్నా! ఎలిజబెత్తు చిన్న బిడ్డ! పో ఆమెను సముదాయించు. మేం ఇద్దరం ఇక్కడే తోటలో ఒక గంటసేపు కూర్చుంటాము. తర్వాత ఇంటికి వస్తాను” అని అన్నగారిని తోసింది. లయొనెల్ మూర్తి రెండు చేతులు పట్టుకొని. విజ్జి తరఫున ప్రార్థిస్తున్నాను. ఆమెను నన్ను క్షమించు మూర్తీ!” అని దీనంగా వేడుకున్నాడు.

మూర్తి కన్నులు మెరిసినాయి. స్నేహితుని చేతులు గట్టిగా పట్టుకొని, ఈరోజు వచ్చినాను. ఒక్క రోజలో నా చరిత్ర పదియుగాల చరిత్రై నడిచింది. నా హృదయ పూర్వకంగా ఎలిజబెత్తును క్షమాపణ వేడుకుంటున్నాను.” అన్నాడు.

లయొనెల్ తమ కారులో కూర్చుని ఉన్న భార్య దగ్గరకు వెళ్ళిపోయినాడు.

ఎల్లమందమూర్తి చేయి పట్టుకొని జెన్నీ, “రా ప్రియతమా! ఇటలీ విరుచుకుపడితే, అబ్సీనియా పెట్టిన మోము ధరించావేమిటి? రా!” అని అతనిని తోటలోనికి తీసుకు పోయింది.

తోటలో మునుపు కూర్చుండిన బెంచిమీదే వారిద్దరూ కూర్చున్నారు.

“మూర్తి నేను డాక్టర్ను!”

“నేను నీ విషయం అంతా అడుగుదామనుకుంటున్నాను.” “నువ్వు ఈరోజే వచ్చావు! ఈ రోజున సంఘటించిన విచిత్ర పరిణామాలన్నీ ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నాయి.”

“అంటే?”

“నీ అనుమానపూర్వకమయిన ప్రశ్న నాకు అర్థమయింది. ఎలిజబెత్తు కోపం కూడా ఈరోజు కోసమే కనిపెట్టి ఉన్నదా? అని అడగదలచుకొన్నావా! తప్పకుండా. మా ఎలిజబెత్ హృదయంలో నిండివున్న ఇంగ్లీషుతత్వం మాయం కాలేదు. ఆమె దృష్టిలో మా లయొనెల్ ఇంగ్లీషువాడే! ఒకవేళ ఎప్పుడైనా అచ్చమయిన ఇంగ్లీషు రక్తం ప్రవహించే వాడు కాడు తన భర్త అని ఆలోచన వచ్చినా అది ప్రేమచే సమాధాన పెట్టుకుంటుంది. కాని, సాధారణంగా భారతీయులంటే ఆమెకు నిరసనా, వాళ్ళు బానిసలన్న భావమూ తన బోటివారిదే. ఈ రాజ్యమన్న అహంభావము ఆమె జీవితంలోనుండి పోలేదు. అవి పోవడానికి నువ్వూ నేనూ కారణభూతులం అవుతామేమో!” అని పలికింది.

పదినిమిషాలు మాటలులేక వారలా కూచుండి పోయినారు.

దీర్గ వినీల పక్ష్మాల వితానం క్రిందనుండి తన పురుషుణ్ణి జెన్నీ తొంగిచూస్తూ, “ఈ మహాపురుషుడు మళ్ళీ స్పృశించడానికి కూడా ఎంత సందేహిస్తున్నాడు?” అనుకుంది.

వెంటనే ఆమె అతని మెడచుట్టూ చేతులు పోనిచ్చి “మూర్తీ! లోకం తలక్రిందు లయినా జెన్నీ నీదే!” అని అతని తలవంచి అతని పెదవులు అతిమధుర పరీమళయుక్తమయిన ప్రణయగాఢతతో అదిమి వేసింది.


★ ★ ★