ద్విపద భారతము - మొదటిసంపుటము/సభాపర్వము - ద్వితీయాశ్వాసము

ద్వితీయాశ్వాసము


శ్రీభోగ సంపన్న, శివచాపభిన్న ,
సౌభాగ్యసుత్రామ, సాకేతరామ,
శరణాగతత్రాణ జయబిరుదమున
ధర నెగడిన మహాత్మా, చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పఁదొడఁగె.
దానధర్మాచార తత్పరుఁడైన
భూనాథ కులశిరోభూషణుం డధిక
వైభవసురరాజు చార్యాహిరాజు
.........................................
సత్కాంతిరాజు [1]నిశ్చలగిరిరాజు
సత్కీర్తిరఘురాజు సద్ధర్మరాజు
రాజసూయ మహాధ్వరంబొప్పఁ జేసి
తేజంబుతోడ సుస్థిరలక్ష్మి నుండ,
నతనిని నారదుం డఖిలభంగులను
స్తుతియించి, శ్రీకృష్ణుసొంపుతోఁ బొగడె
రాజులువినఁగ సంరంభంబుతోడ:
"రాజీవనేత్రుండు రవికోటితేజుఁ
డతఁడు కేవలుఁడె మహానుభావుండు!
సితపద్మభవ మునిశ్రేష్ఠులయాజ్ఞ
నాదినారాయణుం డబ్జనాభుండు
వేదాంతవేద్యుండు విమలాత్మకుండు


యదువంశమునఁ బుట్టె నఖిలంబునెఱుఁగ ;
మధువైరిపనుపున మనుజేంద్రులెల్ల
యక్షగంధర్వ విద్యాధర సిద్ధ
రాక్షసాంశంబులఁ బ్రభవించిరుర్వి."
ననుచు నానారదుండనిన, వారలకు

ధర్మజుఁడు శ్రీకృష్ణుఁ బూజించుట
ననఘుండు భీష్ముఁడిట్లనియె : “ఋత్విజుఁడు
గురుఁడు స్నాతకుఁడు సత్కువలయేశ్వరుఁడు
వరసంయమియు మునివర్ణితయశులు
పూజనీయులు వీరు పుణ్యచరిత్ర!
రాజితంబునను వీరలలోనఁ బెద్ద
యగువానిఁబూజింపు." మనిచెప్పుటయును,
దగ ముదంబంది యాధర్మనందనుఁడు
గాంగేయుతోడను గడఁగి యిట్లనియె:
[2]ఆంగికు లుత్తములగు వీరిలోన
నెవ్వనిఁబూజింతు నెఱిఁగింపు." మనిన
నవ్వసుధీశుతో నాతఁడిట్లనియె :
"సర్వలోకములను సర్వ తేజములఁ
బర్వెడి సూర్యునిభాతి, సుధాంశుఁ
డేపారఁగా ధాత్రి నెల్ల కాంతులను
జూపట్టుభంగిని శోభితంబుగను
దనదీప్తి జగములఁ దగ వెలిఁగించు
ఘనుఁడచ్యుతుండు పంకజలోచనుండు
పరికింప నర్హుండు పసనర్ఘ్యమునకు ;
నొరులరుహులుగారు యుక్తి భావింప.


హరిపూజసేయుట యజ్ఞ ఫలంబు
సరసత్వమున నీకు సమకూరు. " ననిన
నొగి నాసహాదేవుఁ నుదకంబుఁబోయ
నిగమవేద్యుండైన నీరజాక్షునకుఁ
బూని యర్ఘ్యంబిచ్చి పూజసేయుటయు,
దాని సహింపకత్తఱిఁ గలుషించి
శ్రీకృష్ణుదూషించి శిశుపాలుఁడపుడు
శ్రీకరుండగు యుధిష్ఠిరునకిట్లనియెఁ ;

శిశుపాలుఁడు ధర్మజునధిక్షేపించుట

"బట్టాభిషిక్తులు బలసియుండఁగను
నెట్టణంబుగ ధర్మ [3]నియతులుండఁగను
అతివిష్టాచార్యులార్యులుండఁగను
మతిదప్పి భీష్మునిమాటలునమ్మి
యేల దాశార్హుని నిల నర్హుడనుచుఁ
జాలఁబూజించితి సద్భక్తితోడ?
కురువృద్ధుఁడగు భీష్మకువలయేశ్వరుఁడు
పరధర్మ మెఱుఁగక వాసుదేవునకు
జడునకు నేల పూజలుసేయఁబనిచె ?
[4]వెడగుఁదనంబిది ; వృద్ధున కేల
బుద్ధులుగలుగును భువనంబునందు !
నిద్ధ తేజులు విప్రు లెల్లభూపతులు
[5]నుండంగ, నర్ఘ్యంబు నుచితో క్తినిచ్చి
పుండరీకాక్షునిఁ బూజింపఁదగునె !
అతనికిఁ గూర్తురే నఖిలసంపదలు
నతివేగమున నిచ్చుటదితగుఁగాని ;


యితనికి బహుమాన మిటుసేయఁదగునె!
క్షితిఁ బెద్దయనుచుఁ బూజించితే కృష్ణు !
వసుదేవుఁడుండంగ వసుమతీనాథ !
అసమాన ఋత్విజుండనివిచారించి
వరుసఁబూజించితే వ్యాసుఁడుండఁగను !
హరిని నీవాచార్యుఁడని కొల్చి తెట్లు ?
ద్రోణుండు కృపుడును [6]ద్రౌణియుండఁగను ;
క్షోణీశుఁడని పూజ సొరిదిఁ జేసితివొ !
యాదవు లెచ్చోట నవనినాయకులె !
మేదినిలోన నమితధర్మపరులు
పూజనీయులు గుణాంభోనిధులుండఁ,
బూజించి తేలయ్య పుష్కరనయను !
బాలిశుండగు భీష్ముపలుకులునమ్మి
బేలవై తేలయ్య పృథివీశతిలక !
నీవధికుఁడవని నిఖిలభూపతులు
వే వేగవచ్చిరి వేడుకతోడ
నీమఖంబునకును నెఱివచ్చినట్టి
యామహాత్ములనెల్ల యవమాన మేల.
చేసి కృష్ణునిఁ బూజచేసితివీవు!
ఈసమస్తధరిత్రి నిటధర్మతనయ,
ధర్మమేనీకును ! ధర్మాత్మ, వినుము
ధర్మంబెఱుంగకిత్తఱిని నీవిడిన
భావంబునకు సిగ్గుపడక యర్ఘ్యంబు
గోవిందునకు నందుకొన నుచితంబె!
భువి నపుంసకునకుఁ బూర్ణేందుముఖియుఁ,
జెవిటికి గీతంబుఁ, జీకు కద్దంబు,


హారంబుతరుచరు, కఖిలగంధములు
గౌరవోన్నతి నాసికాహీనునకును,
వేదురునకుఁజీర, విరసచిత్తునకు
వేదంబు, లోభికి వితరణగుణముఁ
జేయుట విష్ణుఁబూజించుట ; మఱియు
నీయననీశ్వరు లిందఱుం [7]డంగ
నర్చింతురే కృష్ణు? " నని యెగ్గులాడి.
పేర్చినయలుకతోఁ బెరమెనేఁగుటయు,
నతనిపిఱుందనే యమసుతుండరిగి
యతులితప్రియభాష సప్పుడిట్లనియె:

ధర్మజాదులు శిశుపాలు ననునయించుట

“ధీమంతులకుఁ గృపాదృష్టియుక్తులకుఁ
గోమలయశులకు గుణవిశాలురకుఁ
జారునిర్మల ధర్మచరితులై నట్టి
భూరితేజులకు నెప్పుడుఁ గోపమేల ?
క్రూరంబు శిఖికంటెఁ గులిశంబుకంటె
దారుణంబైయుండు ధారుణిలోన
ఆదినారాయణుండైనట్టివాఁడు
వేదాంతవేద్యుఁడై వెలసినవాఁడు
ప్రల్లదులను ద్రుంపఁ బాల్పడ్డవాఁడు
........ ........ ........ ........ ........ .....
శరణాగతులఁబ్రోవఁ జాలెడువాఁడు
పరమాత్ముఁడై లక్ష్మిప్రబలినవాఁడు
నాతఁడర్హుండని యాభీష్ముఁడెఱిఁగి
సతతంబుఁ బూజింప సరవితోఁ బనుప,


నేనుబూజించితి ; నిదియెగ్గుగాదు;
మానసంబున నీవు మానుకోపంబు,
గురుఁడు దైవంబని కుంభినీశ్వరులు
వరుసతోఁ గృష్ణుని వదలకకొలువ,
నిందింపఁదగునయ్య నీకునచ్యుతుని !
నెందును బగమాను హితబుద్ధి," గనుచు;
శిశుపాలు రమ్మని చెలఁగిపిల్చుచును
విశదోక్తులందును వేడ్కమన్నింప,
నంత భీష్ముఁడు పాండవాగ్రజుకనియె :
"నంతరంబెఱుఁగనియట్టివీనికిని
బ్రియము చెప్పంగను బేలవె నీవు !
నయవిహీనుఁడు జగన్నాథదూషకుఁడు
శిశువు క్రూరాత్ముఁ డీశిశుపాలుఁ ; డతని
వశవర్తుఁ జేయంగవలదు నీకధిప!”
అని ధర్మసూసున కంతయుఁ జెప్పి
జననాథచంద్రుండు జాహ్నవీసుతుఁడు
బాలుండయిన శిశుపాలునికనియె:
"నేలరోషంబు లక్ష్మీశ్వరుమీఁద !
తగదంటివర్ఘ్యంబు ధంణీధరునకుఁ
దగవెఱుంగవు మహాధర్మబాహ్యుఁడవు :
క్రూరచిత్తుండవు కుంభినిలోన ;
నేరుపెఱుంగవు నీతిదూరుఁడవు ;
హరితోడఁ బోరినయట్టివారెల్ల
[8]మరణంబులగుదురు; మఱి కైటభారి
శరణన్నవారెల్ల జయమునొందుదురు;
సరసిజాక్షునితోడ శత్రుత్వమేల !


బాలుఁడైయున్నను బ్రాహ్మణోత్తముఁడు
చాలంగఁ బూజ్యుండు జగములయందు;
నతులవిక్రమశాలియౌ మహీవిభుఁడు
సుతికిఁ బాత్రుండెందు నూతనశ్రీల ;
నీ రెండువిధముల నెలమిఁగృష్ణుండె
యారయ [9]నర్హుఁ డర్ఘ్యంబునకిలను..
నచరాచరంబైన జగములకెల్లఁ
బ్రచురంబుగాఁ గర్త పద్మలోచనుఁడు.
వృద్ధులై యుండియు విశ్వంబులోన
బుద్ధులు లేనట్టి పురుషులేమిటికి !
పరమాత్ముఁ డాద్యుండు భక్తవత్సలుఁడు
........ ........ ......... ........ ....... ........
కర్తగావునఁ బూజ కడిఁగిచేసితిమి.
మూర్తిత్రయాత్మకు మురవైరి భక్తిఁ
బూజించినను మహాభువనంబులెల్లఁ
బూజితంబులయగు భూరి తేజమున.
బుద్ధియు మనమును బుండరీకాక్షుఁ
డిద్ధ తేజుఁడు పరమేశుఁ డవ్యయుఁడు ;
చెలువొందుప్రకృతియుఁ జిరపరంజ్యోతి
జలజారి సూర్యులు జగతియు గాడ్పుఁ
బావకుండును నభోభాగంబు యముఁడు
దేవేంద్రుఁడును మునిదిక్పతితతియు
సకలభూతంబులు సచరాచరములు
వికచాబ్జనేత్రుండు వెలయంగఁ దానె.
యిట్టిమహా [10]త్మకుఁ డిందిరాధిపుఁడు
నెట్టణంబుగ యోగినివహంబులకును


గానంగఁబడుఁగాక ; కష్టజీవులకు
నేనాఁటఁ గనఁబడు నిందిరాధిపుఁడు?”
అని భీష్ముఁడాడినయవసరంబున ను
అనఘుఁడై నట్టి సహాదేవుఁడపుడు
పలికె: "శ్రీకృష్ణునిఁ బద్మలోచనునిఁ
గలుషుఁడై దూషించు కపటాత్ముతలను
జరణంబుఁబెట్టెదఁ జయ్యన." ననుచు
నరుగుదెంచినఁ, జూచి యాసభ వారు
భయమందియుండిరి; బ్రహ్మాదిసురలు
రయమున దివినుండి రాజితంబైన
పుష్పవర్షంబులు పొలుపుమీఱంగ
నిష్పత్తిఁగురిపించి నిగుడిరి; యంతఁ
గలహబంధుండైన ఘనుఁడు నారదుఁడు
పలుమాఱు నృత్యంబు పటుభంగి నాడె.
అంతట శిశుపాలు నాత్మసైనికుఁడు
దంతివైరిబలుండు దగు [11]సునీధుండు
కోపించి సేనలఁగూడి తానుండ,
నేపార శిశుపాలు నెల్లసైన్యముల
రవమున కప్పుడు రాజసైన్యాబ్ధి
వివిధభంగుల నందు వేగంబె కలఁగె.
అతులభయంకరంబైన యారవము
నతిచిత్రముగ విని యమనందనుండు
గాంగేయునకు భక్తిగలిగి యిట్లనియె:
"సంగరవిజయులు జగదీశులెల్ల
మొరయుచున్నారు సముద్రములట్లు ;
గరిమ నామఖము విఘ్నము నొందకుండ



......... ......... ........ ......... ..........
డత్తఱి భీష్ముఁ డాయధిపతికనియె
"నారాయణుఁడు జగన్నాథుఁ డచ్యుతుండు
కారుణ్యమున నీమఖంబు గావఁగను
ఒరులు విఘ్నముసేయ వోపుదురయ్య !
హరిమీఁదగూడిన యుఖిలసేనలును
ఈశిశుపాలుండు నీక్షణంబునను
నాశంబులగుదురు నామాటనిజము.
కుక్కలు మదకుంభి కుంభస్థలములు
వ్రక్కలింపంగను వసుధలోఁ గలవె !
హరిపరాక్రముఁడైన హరిమహత్త్వంబు
ధరఁగొందఱెఱుఁగరు తత్త్వహీనమున."
అని భీష్ముఁడాడిన, నాగ్రహంబునను
మును శిశుపాలుండు మొనసి యిట్లనియె:

శిశుపాలుఁడు శ్రీకృష్ణు నధిక్షేపించుట

"నీముదివెఱ్ఱియు నీపాండవులును
దామోదరునిఁ బరతత్త్వమటంచు
భ్రామికంబులయందుఁ బల్కుచున్నారు;
భూమిలో నెవ్వరుఁ బూజింపరతని ;
నిన్ను ధర్మజుఁడు మన్నింపుచున్నాఁడు ;
చెన్నలరఁగ యుధిష్ఠిరుఁడును నీవు
నోడగట్టినదూల మొరపున మిగులఁ
గూడియున్నారు దిక్కులు సంచలింప.
కృష్ణునిఁజేపట్టి కిల్బిషంబునను
[12]నైష్ణికంబున నొందినాఁడవు నీవు.


అవని నీయట్టి దురాత్ముండు గలఁడె!
వివరింపు మున్ను గోవిందునిచేఁత;
[13]పూతకిఁజంపి యాపూజ్యశకటము
రీతిభేధించి గిరిన్ గేలనెత్తి,
వృషభంబువధియించి విగ్రహంబునను
విషచిత్తుఁడైన గోవిందునిపేరు
పొగడ నీకొకజిహ్వ పొందుగా ; దదియుఁ
బగిలి వ్రక్కలునూఱు పరఁగునుగాక,
అతివల, గోసమూహంబు, బ్రాహ్మణుల,
నతులితాన్న ములిడినట్టివారలను,
విశ్వసించినవారి వేగఁద్రుంచినను
విశ్వధారుణియందు వే పాపమండ్రు ;
వనజనేత్రుండు గోవధయు స్త్రీవధయుఁ
జెనసిచేసెను భూప్రసిద్ధంబుగాను ;
అట్టిగోవిందున కర్ఘ్యంబు నీవు
గట్టిగా నిప్పించి ఘనతనుండితివి.
అదియునుగాక, పరాంగననాక
కదిసి యంబికయనుకన్యకామణిని
నీవుదెచ్చు టెఱింగి నీసహోదరుఁడు
శ్రీవిలాసుండు విచిత్రవీర్యుండు
ధర్మజ్ఞుఁడై దానిఁ దగవిడ్చిపుచ్చె.
దుర్మదాంధుండవు దురిత దేహుఁడవు
జననిందితుండవు సంతానహీనుఁ
డన నున్న నినునమ్మ నగునె లోకులకు !


తలపోయ మును సముద్రంబుతీరమున
విలసితంబుగ నొక్క వృద్ధహంసంబు
క్రమముదప్పక ధర్మకథలుచెప్పుచును,
గ్రమముదప్పక యట్టి ఖగములనెల్ల
శిక్షింపుచును ధర్మశీలుఁడై ప్రాణి
రక్షకుండై విహారముసేయుచుండు ;
విహగంబులును దాన విశ్వాసమంది
సహజపాథోరాశి జలచరంబులగు
పక్షుల మాధుర్యభక్ష్య భోజ్యముల
దక్షతఁదెచ్చి నిత్యముఁ బెట్టుచుండి
తమయండషండముల్ దత్సమీపమున
నమర నిక్షేపించి యతిదూరమరుగ,
నాసమయంబున నాహంసరాజు
గ్రాసంబుగా సర్వఖగకులాండములు
భక్షించియుండినఁ, బఱ తెంచి యొక్క
పక్షి వీక్షించి తప్పక పక్షి తతికి
వృత్తాంతమంతయు వేగఁ జెప్పినను,
జిత్తంబులందును జింతించి వగచి
యాముదిహంసను నడగించి నపుడు.
భీమవిక్రమమునఁ బేర్చి మిక్కిలిని
ధర్మచిత్తుండవై ధర్మసత్కథలు
కూర్మిఁ బాండవులకుఁ గురుకుమారులకుఁ
దెలుపుచుఁ గలహంస ధృతి నొనర్చెదవు.
బలియురఁ బెక్కండ్రఁ బద్మలోచనుఁడు
దండించె నని సంస్తుతంబొనర్చెదవు ;
వుండరీకాక్షుని భూరిబలంబు
నేనెఱుంగనిదియే నిఖిలంబునందు !
మానుషంబునఁ బొంగు మాగధునకును


విఱుగఁడే పదిమార్లు విక్రమంబెడలి !
మెఱసి జరాసంధు మేటిసాహసుని
భీమార్జునులఁ దోడువెట్టుక పోయి
భూమిసురాకృతిఁ బొంగణఁగించె ;
నిది విక్రమంబె మహీమండలమున !
మదదైత్యహరు నేల మాటిమాటికిని
బొగడుచున్నాఁడవు [14]బూతుచందమున !
పొగడక నీకును బొద్దు [15]పో దేని
సుగుణాకరులు రణశూరులై నట్టి
జగదీశ్వరులు కర్ణశల్యులాదిగను
యోధులఁ బొగడు మత్యున్నతితోడ.
సాధునిందయు నన్యజనకీర్తనంబుఁ
జేయరు గాంగేయ, సృష్టినుత్తములు
ఏయెడ నని మునులెంతయు ననిరి."
అనుచును దుర్భాషలాడుట చూచి
యనిలతనూభవుండలిగి రౌద్రమునఁ
బ్రలయకాలమునాఁటి ఫాలాక్షుపగిదిఁ
గలనను శిశుపాలు ఖండింపఁజూడ,
భీమునివారించి భీష్ముఁడిట్లనియె:

శిశుపాలుని జన్మవృత్తాంతము

"ఈదురాత్ముండు మహీస్థలిఁ దొల్లి
చేదివంశమునఁ బ్రసిద్ధుఁడైనట్టి
యాదమఘోషున కాసాత్వతికిని
బుట్టెను ఘనచతుర్భుజములతోడ,
నెట్టనంబుగ ఫాలనేత్రంబుతోడ,


బంధుర దైతేయభావంబుతోడ ;
సంధిల్లుటయుఁ, జూచి జననియు గురుఁడు
నరుదంది భయమంది యట్లున్నఁ, జూచి
వరుస నక్కడ నభోవాణి యిట్లనియె:
'నొరులు వీనినిజంప నోపరెవ్వరును ;
దొరయంగ వీనినెత్తుకయుండువేళ
నెవ్వరిచేత నీయెక్కుడుకన్ను
నివ్విశాలభుజంబు లివిరెండు నణఁగు,
నతనిచే శిశుపాలుఁడణఁగు గ్రక్కునను
జతురంబుగా; ' నని సర్వంబుఁ దెలిపె.
అదినిమిత్తంబుగా నాకుమారకుని
వదలక చూడంగవచ్చువారలకు :
'బాలుండువీఁడె నాపట్టి; ముద్దాడుఁ
డోలిమై.' నన వార లొదవినప్రీతి
నెత్తుక ముద్దాడి యింపుసొంపలర
బత్తితోఁ జేతికి ఫలములనొసగి
వారి [16]యూరికిఁజన, వసుధ నీవార్త
బోరనవిని యదువుంగవులైన
భీమవిక్రములు గంభీరనాయకులు
రామకృష్ణులు నిందురవితేజు లపుడు
అమరంగ జయశీలు నాశిశుపాలు
సుముఖులై వేడుకఁజూడంగఁ గోరి
పోయిరి బుధబంధుపుంజంబుతోడ.
ఆయెడఁ దన మేనయత్త సాత్వతియు
బాలకుండగు శిశుపాలునిఁదెచ్చి
చాలంగ సంతోషజనితయై యపుడు


బలభద్రుకిచ్చినఁ, బరఁగంగ నతఁడు
జలజాక్షుచేతికిఁ జియ్యన నిడిన,
శిశుపాలు మిక్కిలిచేతులుఁగన్ను
దిశయెఱుంగక పోయెఁ దెల్లమిగాను.
దానిఁదలంచి సాత్వతి యశరీర
మానితవాక్యంబు మదిలోన నెఱిఁగి,
హరిచేత శిశుపాలుఁ డణఁగు గ్రక్కునను
బరమార్థమని కైటభద్వేషికనియె:
"మకరాంకజనక, నీమఱఁదిని వీనిఁ
బ్రకటితబలు శిశుపాలునివలన
నూఱుతప్పులుగాపు నూతనంబుగను;
మాఱుమాటాడక మన్నించు నన్ను . ,
అని వానిజనని పద్మాక్షుఁ బ్రార్థింప,
వనజనేత్రుండును వరమిచ్చెఁ ; గాన
నపరాధములునూఱు నటు నిండుదనుక
నుపమ యూరకయుండుటుచితంబు మనకు.
కనకాంబరునిచేతఁగాని యీదుష్టు
మనచేత నాజిలో మరణంబుగాఁడు.
ఇతరమానవులు నన్నెగ్గులాడినను
హతముసేయుదు మదీయాస్త్రములందు."
అనెడుభీష్మునిమాట లాలించి, భీము
మునుపుగైకొనక, యమ్మురవైరికనియె:
"అవమాన్యుఁడగు నిన్ను నాస్థానమునను
అవిరళమతి మాన్యుఁడని పాండుసుతులు
గాంగేయుఁడును నిఫ్డు గడఁగిపూజించి ;
రాంగిక మెఱుఁగక యధికదుర్బుద్ధి,
నీవునుగైకొంటి నెఱయఁగాఁ బూజ;
యీవసుమతి నీకు నిటు చెల్లునోటు !


నాతోడ వడిఁ బ్రథనము సేయు నిలిచి
యీతఱి.” ననుచును నెగ్గులుపలుకు
శిశుపాలుఁగనుఁగొని శ్రీకృష్ణుఁడనియె
విశదోక్తులను మహీవిభులువినంగ :
"అమరఁ బ్రాగ్జ్యోతిషంబనుపురంబునకుఁ
బ్రముదితంబుగవచ్చి భగదత్తుతోడఁ
బోరాడ నీచేదిభూపతి పోయి
ద్వారకానగరంబు దగ్థంబుచేసెఁ
గ్రూరుఁడై యన్యాయ [17]కుశలతఁబేర్చి,
భూరివిక్రములగు భోజరాజాది
ధారుణీశులు [18]రైవతనగంబునందుఁ
జారుతరంబగు స్మరపరవశతఁ
బొలఁతులతోఁగూడి భోగింపుచుండఁ
దెలిసి నారలను వధించె నేకతమ;
దేవాభుఁడగు వసుదేవుండుసేయు
పావన హయమేధ పటుమఖంబునకు
నర్చితంబైనట్టి హయమును గొనియెఁ ;
బేర్చి యామఖముకుఁ బెరిమ విఘ్నంబు
చేసె వీఁడతిపాపశీలుఁడై పూని;
భాసురమతియైన బభ్రునిభార్యఁ
దనకుభార్యనుజేసె దర్పంబుతోడ ;
ననురక్తి మా మేనయత్త తాఁబలుకు
మాటకునై నూఱుమాఱులు వీని
మాటలకోర్చితి మఱి వీనిఁద్రుంతు."
ననుటయు శిశుపాలుఁ డబ్జాక్షుకనియె:
"నొనరంగ నీకూర్మియును నీదుపలుకు


నాకదియేటికి నయమార్గదూర !
నాకునిచ్చినయట్టి నలివలోచనను
నీవువరించితి నిఖిలంబు నెఱుఁగఁ ;
గావున మఱి సిగ్గుగలదె నీకెందు?"
ననుచు దుర్భాషల నాడుచునుండ
విని కృష్ణుఁడప్పుడు వేగఁ గోపించి
తలఁచినంతటిలోనఁ దద్దయు వచ్చెఁ
గలితనిర్వక్ర విక్రమము చక్రమును.

శిశుపాలవధ

అది శతకోటిబాలార్కప్రకాశ
విదితమై శతకోటివిస్ఫూర్తియగుచు
వచ్చినఁ, జక్రంబు వాసుదేవుండు
చెచ్చెఱ నుగ్రుఁడై చేతసంధింపఁ
గులగిరులూటాడెఁ; గూర్మమల్లాడె;
జలధులుగలఁగె; నాశాచక్రమగలె ;
రవితప్పఁదిరిగెఁ; దారకములు డుల్లె ;
దివికంపమందెను; దేవేంద్రుఁడడలె;
నుడుగక యొకమ్రోఁత యూఱక మ్రోసె;
నడరి రసాతలంబద్భుతంబందె;
బ్రహ్మాండములు భయభ్రాంతివహించె;
బ్రహ్మాది సన్మునిప్రణుతాంఘ్రుఁడైన
హరి యట్టివేళ మహారౌద్రమునను
బిరబిరమని త్రిప్పి బిట్టువ్రేయుటయు,
గురుతర నిర్ఘాత ఘోషంబుతోడఁ
బరిపూర్ణ విలయోగ్ర పాపకశిఖలు
భూమండలమున నభోమండలమున
భీమమై పర్వంగ బెట్టునవచ్చి


చేదిభూవిభు శిరశ్ఛేదంబు చేసె ;
నాదట వానిమహాకళేబరము
కులిశంబుచేఁ బడ్డకొండచందమున
నిలమీఁదబడె రక్తమెంతయుఁదొరగ
జగతీతలేశులు సంచలంబందఁ
దగ శిశుపాలునితనువుననున్న
తేజంబువెలువడి దిశలెల్లవెలుఁగ
రాజకోటలుచూడ రాజార్కనయను
దేహంబుసొచ్చె సందేహంబులేక .
యూహింప నయ్యెడ నుర్వీశులనిరి :
"జయపుండరీ కాక్ష , జయచక్రపాణి,
జయరమాధీశ్వర, జయహృషీకేశ,
ఖగరాజగమన, రాక్షసరాజదమన,
నగరాజహస్త, పన్నగరాజశయన,
రక్షించుసర్వేశ, రాజీవనాభ,
యీక్షించుమముఁ గృప నిభ రాజవరద!”
అనుచు సన్నుతిచేసి యందఱు మ్రొక్కి
మనమున సంతోషమగ్నులై యంత
ననురక్తి రాజసూయాధ్వరంబొప్ప
ఘనత సంపూర్ణంబుగా నొనరించి
యాధర్మనందను నధికపుణ్యాత్ము
యోధాగ్రవర్యు నత్యుత్తమోత్తమునిఁ
గని మోదమునుబొంది కమలాక్షుఁడాది
యనిమిషావళి గొనియాడిరి మఱియుఁ
గురువీరులెల్లఁ బేర్కొనిరివేర్వేఱ.
వరుసతో నంత నైశ్వర్యుఁడై యున్న
ధర్మజుకడకు భూధవులేఁగుదెంచి
యర్మిలి సద్భక్తి నప్పుడిట్లనిరి:


“సకలరాజన్యవంశములలోనెల్లఁ
బ్రకటమై యొప్పె నీభరతవంశంబు ;
రంజిల్లఁ జేసితి రాజసూయంబు ;
మంజులవాక్య, నీమహనీయకృపను
ఇలఁ గృతార్థులమైతి; మేము భూములకు
నెలమిఁబోయెద." మన్న నెఱిఁగి ధర్మజుఁడు
ఆనతియొనరింప, నపుడు భీముండు
ననిచె భీష్ముని ధృతరాష్ట్రు; నర్జునుఁడు
ననిచెను యజ్ఞ సేనాదుల ; సుబలు
వెనువెంటనరిగి వావిరి భక్తిననిచె
నకులుండు ; కృపు ద్రోణు నయభక్తిఁ బంచె
నకలంకమూర్తి సహాదేవుఁడంతఁ;
బరగ విరాటుని భగదత్తుఁబనిచె
సరసచిత్తమున ధృష్టద్యుమ్నుఁడపుడు ;
సార్వ తేయుల మహీపతులను ననిపె
సర్వసొమ్ములునిచ్చి సౌభద్రుఁడెలమి ;
ధరణీసురులఁబంచెఁ దమగృహంబులకుఁ
గరుణవాటిల్లంగ గౌఁగిళ్లఁ జేర్చి ;
పాండునందనులను బద్మలోచనుఁడు
నిండు వేడుకల మన్నించి యిట్లనియె:
"సకలభూతములు పర్జన్యునిఁ బక్షి
నికరంబు [19]ఫలధారుణీజంబు నెపుడు
భజియించుకైవడి బంధువులెల్ల
భజియింపుదురు నిన్ను భక్తియుక్తముగ."
అనిన శ్రీకృష్ణున కనియె ధర్మజుఁడు :
“అనఘాత్మ, నీకృపయందు నామఖము


సఫలమైయుండును జగమెల్ల నెఱుఁగ;
సభికసంస్తుతుల, నేఁజతురుండ నైతి; (?)
ద్వారావతీపురీస్థలినుండి నీవు
దూరంబుగానుండఁ దోచు మామదికి ;
శుభములుదలఁచు మెచ్చోటను మాకు ;
నిభరాజవరద, నిన్నెంతయుఁ బాసి
నిమషమాత్రంబును నిలువనోదుదుము
క్రమముతో." ననవు డు కంజనాభుండు
నాధర్మనందను నట్లూఱడించి
సాధులు నుతియింప సంతోషమునను
అనిలవేగములైన హయములుపూను
కనకరథంబెక్కి కదలిపోవుటయు,
ధర్మతనూజుండు తమ్ములుఁ దానుఁ
బేర్మిఁ గృష్ణునినంపి పెరిమనేతెంచి
యుండంగ, మేటిసుయోధనుండంత

మయసభాసందర్శనమున దుర్యోధనుఁడు లజ్జితుఁడగుట

దండితో శకునియుఁ దానును గూడి
సమధికంబైన యాసభఁ జూచు వేడ్క
గొమరొప్ప నక్కడ కొన్నిదినములు
నిలిచి యాసభరమణీయతఁ జూచి,
లలిత నిరంతరాలంకారమహిమఁ
దేజంబుతోఁ దత్ప్రేదేశంబునందు
రాజితంబైన ద్వారమున నెయ్యమున[20]
.......... ........ ....... ....... ........ .........
......... ....... ....... ........ ........ .......


నీలరశ్మిచ్ఛటానిచయంబుపర్వ,
నాలోనసని జలంబని సంశయించి
రమణీయ దివ్యాంబరములన్నియును
గ్రమమున నెగఁద్రోచు కడురభసమునఁ
జొచ్చిన, నది నీలశోభితమణుల
నచ్చుగాఁ జూపట్టునాస్థలంబయ్యె.
అటుమీఁద నేఁగంగ నంబుజాకరము
పటుతరంబుగఁజూచి బహునీలరుచుల
మణితలంబనుచుఁ గ్రమ్మనఁ జొచ్చుటయును,
బ్రణుతికినెక్కిన భవ్యాంబరములు
తడిసినఁ గ్రమ్మఱ తడయ కే తేర
నడరి పాండుకుమారులయ్యెడ నగిన,
ధర్మంబుదలపోసి ధర్మనందనుఁడు
కూర్మిరెట్టింప నాకురుమహీపతికి
దివ్యవస్త్రములును దివ్యగంధములు
దివ్యభూషణములుఁదెఱఁగొప్పఁ బనిచె
ననిలసూనునిచేత నానందమునను;
బనిచినఁ గురుమహీపతియును గట్టి
చాలంగ ధర్మజుసభఁజూచి లజ్జ
నోలి పాండవులను నొగివీడుకొనుచు
నిజపురంబునకును నేర్పునవచ్చి,
భజన లేకతలంచి బహుభంగి వగచి
రాజచంద్రుఁడు ధర్మరాజశేఖరుని
రాజసూయమహాధ్వరంబు మానవుల
నయనోత్పలముల కానందమై యొప్ప
నియమింపఁగాఁ దన నేత్రంబులకును
బావకనిచయమై పరఁగుచునుండె.
భావింపఁగాఁ దగు పసిఁడిగాచినను


గందినకైవడి శౌరవేశ్వరుఁడు
కుంది మనోవ్యధఁ గొసరి వివర్ణ
దేహుఁడైయుండె ధాత్రీరాజ్యభార
మోహంబుదక్కి యిమ్ముల సుహృజ్జనుల-
తోడ మాటాడక తుది రహస్యమున
నోడకయుండె యధోచితంబుగను.
వేదనఁబొరలుచు విముఖుఁడైయున్న
యాదుర్యోధను నప్పుడు చూచి
శకుని యిట్లనియె నాశ్చర్యంబుతోడ :

దుర్యోధను దురాలోచన

"వికలుఁడవై రోషవేషంబునొంది
యేల నాతోడ నీ [21]విన్నిన్నినాళ్ల-
వోలెను బలుకవు భూమీశతిలక !
ఇంతచింతింపంగ నేటికినీకు ?
నెంతటికార్య మిట్లెఱిఁగింపవలయు.
నేనుండఁగా నీకు నేటికిఁ దలఁక !
గానఁగఁబడు నెంతకార్యంబుదీర్తు:
వ్యాకులపడకుండు వసుధేశతిలక !
లోకంబులో నృపలోకసంసేవ్య !"
అనిన సుయోధనుం డాశకునితోడ
వినుపింపఁబూనె వివేకంబుతోడ:
"నీవునుజూచితి నేనుఁజూచితిని
భూవలయంబున బురణించిచూడ
నేయుగంబునఁగల్గ దీసభమహిమ
శ్రీయుతంబై భూప్రసిద్ధమైయుప్పె.


అతిమనోహరమైన యాసభయందు
నతులితభద్రసింహాసనాసీనుఁ
డంతకతనయుఁ డత్యంతసంపన్నుఁ
డెంతపుణ్యంబు దానిలఁజేసెనొక్కొ !
సకలభూపతులు నసంఖ్యంబులైన
ప్రకటితార్థములు దప్పకతెచ్చిపెట్టి
కొలుచుచునుండిరి కొంకకకదిసి;
బలవంతులై ప్రతాపమునశోభిల్లి
భూసురోత్తములకు భూరిదానములు
చేసి దిగ్విజయలక్ష్మీసమగ్రమున
నున్నారు రాజులై యుర్వియేలుచును
సన్నాహమునఁ బాండుజగదీశసుతులు.
వారికెవ్వరుసాటి వసుధీశకోటి ;
వారికి వరదుఁడై వాసుదేవుండు
హితమాచరింపుచు నెల్ల కాలంబుఁ
జతురత్వముననుండు ; శౌర్యంబునందుఁ
జేదిభూపతి శిరశ్ఛేదంబుఁజేసె
మేదినీనాథులుమిక్కిలిబెగడ;
యాదవోత్తముఁ గృష్ణు నందఱుఁజూచి
భేదింపఁగాలేక పెంపుతోడుతను
బొగడుచునుండిరి భుజశక్తిదఱిగి;
తెగువతోఁ బాండుధాత్రీనాథసుతుల
సంపదలెల్ల నీక్షణములోపలను
సొంపుతోఁగొనుబుద్ధి చొనుపంగవలయు."
ననుకురురాజు భవ్యాలాపములను
మనమునఁ దలపోసి మామయిట్లనియె:
"మీతండ్రి ధృతరాష్ట్ర మేదినీశ్వరుని
నీతివిచారించి నెఱయఁ గావింపు."


మని శకునియు వేగ మాసుయోధనునిఁ
గొనిపోయి ధృతరాష్ట్రకువలయేశ్వరుని
సన్నిధినిలిపి నిశ్చలవృత్తిఁ బలికె :
"నెన్నికకెక్కిన యాసుయోధనుఁడు
నీకుమారుఁడు ధారుణీనాథుఁ డాత్మ
వైకల్యమునను వివర్ణమునిందుఁ
బొందియున్నాఁడు పెంపున విచారింపు
ముదంబుగా." నన్న నాధృతరాష్ట్ర
ధరణీశుఁ డాసుయోధనుశరీరంబు
పరికించినిమిరి తత్పరబుద్ధిఁబలికె:
"శాశ్వతైశ్వర్యంబు సకలలక్ష్ములును
విశ్వంబులోపల వెలయంగఁగలవు ;
అనుజులు మిత్రులు నఖిలబాంధవులు
ననుకూలురై యుందు రనిశంబునీకు;
నింద్రునికంటెను నెక్కుడైనట్టి
సాంద్రభోగము నీకుఁ జాలంగఁగలదు ;
సకలభూపతులును సతతంబు భక్తి
ప్రకటంబుగాఁగ నీపంపుసేయుదురు.
ఏమితక్కువనీకు నెల్లసౌఖ్యముల !
నీమేనుడస్సిననిర్ణయంబేమి ?
నిజదేహకాంతులు నీ కేలదఱిగె?
......... .......... .......... .......... ............
[22]సరసత్వమున నీవు సకలసామ్రాజ్య
పరభారకముదప్పి పరఁగియుండితివి. "
అనవుడు ధృతరాష్ట్రుకాతఁడిట్లనియె:


పాండవాభ్యుదయమునకు దుర్యోధనుఁ డసూయవడుట

"జననాథ, పాండవక్ష్మాతలేశ్వరుల
భాగ్యభోగంబులు పర్జన్యుకంటె
యోగ్యమైయున్నవి యున్నతంబగుచు ;
సకలదిక్కుల వారిసత్ప్రతాపములు
వికటమైచూపట్టి వెలసెను బేర్మి ;
నరుఁడు విక్రమశాలి నయగుణోన్నతుఁడు
పరరాజ్యవిజయుండు బలసమగ్రుండు
కొమరొప్ప నుత్తరకురుభూములాది
యమర దేశములెల్ల, నర్థి సాధించె ;
శక్రుండు ద్రుపదరాజన్య శేఖరుఁడు
చక్రధరుండును జగతిలోఁ దక్కఁ
దక్కినరాజులందఱుఁ బాండవులకు
మ్రొక్కి యప్పనము లిమ్ములఁ బెట్టువారె;
కాని, కొల్వనివారిఁగానము జగతిఁ
గానన శైలసంఘ ద్వీపములను.
వనధి వేష్టిత చక్రవాళమధ్యంబు
ననురక్తితో నేలె నఖిలంబుఁ బొగడ.
నేనొకరాజనా యీమహీస్థలికి !
దీనిఁజూడఁగఁజాల; దిక్కు లెఱుంగ
ధర్మనందనుఁడు రత్నపరిగ్రహంబు
పేర్మి సేయఁగ నన్ను బెద్దయుఁ బనిచె.
నేనునుజూచితి నెసగ నమ్మణుల
భూనాథ, యేజగంబులఁగాన నెందు.
యజ్ఞదీక్షితుఁడైనయమనందనునకు
విజ్ఞానవంతులు విశ్వభూవిభులు


కాంభోజపతులు ఉత్కటరథంబులును
జృంభితహయములు నింధురావళులుఁ
దెచ్చియిచ్చిరి మహాతేజంబుతోడ ;
మెచ్చి శ్రీకృష్ణుండు మెలఁకువతోడఁ
దరుణార్కరుచుల రథవ్రాతములును
దురగరత్నములు బంధురరత్నములును
బదునాల్గు వేలు నిర్భరగజేంద్రములు
ముదముతోఁ బాండవముఖ్యునకొసగె.
నవరత్నములు సువర్ణములు గంధములు
వివిధాంబరంబులు వేడ్కతోడుతను
గేరళ సింహళ కేకయ చోళ
శూరసేన సుపాండ్య శోభితనృపులు
ధర్మరాజునకు మోదమ్ముతోడుతను
అర్మిలినిచ్చిరి యధికలక్ష్ములను;
నరుఁడు నాద్యుండైననారాయణుండు
నిరువురు సుఖగోష్ఠి నేకతంబునను
వర్తింపుదురు మహావైభవంబునను ;
మూర్తితో ధర్మజుమూర్థాభిషిక్తు
కావిరాటుండు పరాక్రమోన్నతుఁడు
వేవేగమున రెండు వేలదంతులను,
వేడుక ద్రుపదుఁడు వెయ్యేనుఁగులను,
జూడనొప్పిన తమసురుచిరాశ్వములఁ
బదునాల్గువేలనుబటువిలాసినులఁ
బదివేలదాసులఁ బసనిచ్చిరపుడు,
గాంధార కేకయ కాంభోజ మద్ర
బంధుర కాశ్మీర బహుళకులూత
కురు మరు మాళవ కుంతల మగధ
కరహాట వంగాంగ కాళింగ నృపులు


భగదత్తుఁడాదిగాఁ బార్థివోత్తములు
నగణిత గోమహిషాశ్వదింతులను
అజముల రథముల సంబరంబులను
నిజభూషణంబుల నీరజాననలఁ
దెచ్చియిచ్చిరి యాయుధిష్ఠిరునకును.
అచ్చుగా మఱియును నపరిమితంబు
రత్న కాంచనముల రాజీవముఖుల
రత్న సాను ధరాధరశ్రేష్ఠ తుహిన
గిరి ముందరాచలక్ష్మితితలేశ్వరులు
కురు కుసుమాసవ కోమలపాత్ర
దివ్యౌషధంబులు దివ్యాంబరములు
[23]దివ్యేంద్రనీల సుస్థిరచంద్రకీర
మరకతవర్ణసుమానితహరులు,
వరమౌ క్తిక చ్ఛత్ర వర్ణితతల్ప
చామర దివ్యాస్త్ర సముదయంబులును,
గోమలంబగుపట్టు గొలైనగములు
నిచ్చిరి ధర్మజు కింపుసొంపారఁ ;
జెచ్చర గంధర్వచిత్రరథుండుఁ
దుంబురుండునుగూడి దొరసి నూఱేసి
కంబువర్ణములైన గంధర్వహరుల
మహిమతోనొసగిరి మహనీయముగను;
బహుభంగి నందుకై పరఁగఁజిక్కితిని.
ఒకలక్షభూసురు లొగి భుజియింప
సకలయత్నములందు శంఖంబుమ్రోయుఁ
దనకుఁదాన సమంచితంబుగానెపుడు;
మునుమిడి యాగంబు ముగియునన్నాళ్లు


నుడుగకమ్రోసెఁ బెంపొదవి శంఖంబు.
అడరి జన్నముచూడ నరుదెంచినట్టి
సర్వభూములమహీశ్వరుల భూసురుల
దుర్వారవైశ్య శూద్రుల నాప్తజనులఁ
బ్రాణబంధువులను బ్రాణిసంఘముల
క్షోణిపైఁ బేదల సుజనుల నరిసి
ప్రతిదివసంబును భాసురాన్నములు
చతురత్వమునఁబెట్టి సంతోషమునను
అర్ధ రాత్రంబున నన్నంబుగొనును
అర్ధేందుధరుకృప నాద్రౌపదియును.
అధికుఁడాధర్మజునధ్వరంబునను
అధమాధముండును అధికపూజ్యతను
బొందుఁ ; [24]గానప్రియంబును బొందఁడెందు.
ముందు హరిశ్చంద్రు మూర్థాభిషిక్తుఁ
డరుదుగా రాజసూయాధ్వరంబొప్ప
సరవిఁజేసెను; గాని, చర్చించిచూడ
ధర్మనందనుమహాధ్వరముతో నదియుఁ
బేర్మితో సరిగాదు పృథివిఁ దర్కింప.
ఆయాగదీక్షితుండై ధర్మసుతుఁడు
పాయక ధారుణీపతులు భూసురులుఁ
[25]దిరుగువాఱి భజింప దిక్పతిశ్రేణి
వరుసఁగొల్వఁగనున్న వాసవుఁబోలె.
ధర్మనందనుఁడు మోదముఁబొందియుండ,
ధర్మమూర్తులు మునీంద్రసముత్కరంబుఁ
గొనియాడ, ధౌమ్యుఁడు గోచరతీర్థ
ఘనజలంబులను యోగ్యంబుగాఁ బూని


యభిషేక మొనరించె నతినిచిత్రముగఁ.
బ్రభ నభిషిక్తుఁడై పరఁగినయట్టి
సత్యసంధుఁడు ధర్మజమహీశునకును
సాత్యకి మౌక్తికచ్ఛత్రంబుపట్ట,
భీముండుఁ బార్థుండుఁబ్రేమంబుతోడఁ
జామరంబులు విశేషంబుగా నిడిరి;
కమలనాభుండును గవలును ద్రుపదు
కొమరుండు వేర్వేఱ కువలయేశ్వరుల
మ్రొక్కింపుచుండిరి మోదంబునందు ;
దిక్కులరాజులుఁ దెఱఁగొప్ప నేను
జిన్నఁబోయున్నను చేష్టలెఱింగి
వెన్నుండు పాండుభూవిభుతనూజులును
ద్రౌపది సాత్యకి దగుసంతసమునఁ
జూపట్టియుండి; రచ్చో యుధిష్ఠిరుఁడు
నెనయంగ నెనుబదియెనిమిదివేలు
ఘనమహీసురులకుఁ గల్యాణమొప్పఁ
జేసి, ప్రత్యేకంబు చెలఁగి ముప్పండ్రు
దాసుల వేర్వేఱ తడయకయిచ్చి,
పదివేలు వేదవిప్రవ్రాతములను
బదవికెక్కిన హేమపాత్రంబులందు
భుజియింపఁగాఁజేసి, భూషణవ్రజము
నిజవస్త్రములు గంధనివహంబు నొసఁగి
[26]మన్నించియుండును మహనీయరుచుల.
నెన్నంగ నాజన్మమేమిఫలంబు!
పాండునందనుల సంపదలుచూడంగ
మండలంబుననోర్వమఱి " యనుటయును
శకునియిట్లనియె నిశ్చలవృత్తితోడ :
"నకలంకమగుచున్న యయ్యక్షవిద్య


నేర్పరినగుదును నిఖిలంబెఱుంగ ;
దర్పంబులణఁతు ద్యూతముల బాండవులఁ
దూకొనియాడ నాతో నొనఁగూర్పు ;
శోకింపకుండుము సుఖవిశేషములఁ
జాలంగ. " ననియాడు శకునివాక్యమ్ము
లాలించి కురుపతి హర్షించిమించి,
చతురత ధృతరాష్ట్రుచరణాబ్జములకు
నతిభక్తితోమ్రొక్కి యప్పుడిట్లనియె :
"జననాథశేఖర, శకునిమాటలకు
ననుకూలమైయుండ ననిశంబువలయు ;
శకునియు నను సర్వసామ్రాజ్యమునకుఁ
బ్రకటితకర్తగాఁ బరఁగంగఁజేయు ;
నొడఁబడు మతనికార్యోక్తుల. " కనినఁ
గడువిచారముచేసి గౌరవంబునను
బలికెను గురుమహీపాలచంద్రుండు :
"కులగిరిధైర్యుండు గుణసమగ్రుండు
విదురుండు సత్కళావిదుఁ డుత్తముండు
సదమలచరితుండు శాస్త్రార్థవేది
నీతిమార్గంబున నిర్జరగురుని
బ్రాఁతిగెల్వఁగఁజాలు భావంబువాఁడు
సమచిత్తుఁ డుభయపక్షములవారికిని
క్రమమొప్ప నతనితోఁ గడువిచారించి
చేయుదమీపని సిద్ధంబుగాను ;
పాయక భీష్మునిబాహాబలమున
విదురునిమతమున విశ్రుతంబుగను
వదలక మనమహీవలయంబునిలిచె."
ననవుడు ధృతరాష్ట్రు కాసుయోధనుఁడు
మనమునదుఃఖించి మఱియునిట్లనియె:


"పాండుపుత్త్రులమీఁద పక్షంబుకలిగి
యుండునువిదురుండు యుక్తంబుగాను ;
అతఁడేలశకునికార్యములకు లీల
క్షితిలోన నొడఁబడుఁ జింతించిచూడ ?
నుర్వీశ, యిందులకొడఁబడవేని,
సర్వభక్షకుఁజేతఁ జత్తునీక్షణమ ;
విదురుండు నీవును వేడ్కనుండుండు
హృదయంబులుప్పొంగి యెల్లకాలంబు. "
నని యడలుగమాటలాడినఁ జూచి
మనుజేశ్వరుండు కుమారునకనియె:
"నీకు విచారింప నెఱయంగ వలదు
చేకొని యొకరీతి చేసెదనింక ;
శిల్పకాచార్యులఁ జెలఁగి రప్పించి
కల్పింతు నొకసభ గౌరవంబునను.”
అని ధృతరాష్ట్రుండు నాక్షణంబునను
అనఘాత్ములను శిల్పకాచార్యవరుల
రప్పించి, హాటకరత్నహర్మ్యముల
నొప్పుగాఁదెప్పించి యురుతరచిత్ర
సన్మణిద్వారదేశములు నిర్మించి
సన్మోదముననుండుసమయంబునందు,
ధృతరాష్ట్రుఁడొకనాఁడు తెల్లమిగాను
మతిమంతు విదురుఁ గ్రమ్మనబిలిపించి
యేకాంతమున భక్తి నెల్లనుబలికి,
కైకొని శకునియుఁ గౌరవేశ్వరుఁడు
పలికినపలుకులు పరఁగఁజెప్పినను,
కలఁగి వే వివశుఁడై కడువడిఁదెలిసి


తగఁ [27]గలిద్వారసందర్భంబునగుట
జగడంబు జూదంబు సత్ప్రజాక్షయముఁ
గాఁగలవని మదిఁ గడిమితోనెఱిఁగి,
లోఁగుచు నృపునకాలోన నిట్లనియె:

జూదమాడఁదగదని విదురునుపదేశము

"ఇట్టికార్యమునకు నేనొడఁబడను ;
బుట్టును మీఁదను భూరివైరంబు.
పుత్త్రులకెల్లను బోరాటమేల
ధాత్రిఁజేసెదవు చిత్తంబుననెఱిఁగి !
ఇదిమీఁద నొప్పదు ఎన్నిభంగులను;
వదలక జూదమేవలన నాడినను
ఎట్టిశాంతులకైన నీసులువుట్టు;
గట్టిగా నీనేర్పుకలిమి నీశకుని
కురుమహీపతుల దుర్గుణములువాపి
కురువంశమెల్లను గోరి రక్షింపు.”
మన విదురునిఁజూచి యారాజుపలికెఁ :
“దనయుల కేల యుద్ధముసంభవించు ?
నీవును నేనును నీతి [28]మంతులగు
పావన భీష్మకుంభజులుండఁగాను ;
అటుగాన యిందుల కనుకూలమొందుఁ;
దటుకున నీవు రథంబెక్కిపోయి
ధర్మనందనుని మోదమునఁ దో తెమ్ము
పేర్మితో." ననిపంపఁ బెద్దయు నతఁడు
నేకాంతమున భీష్నుకెఱిఁగించియుండె,
ప్రాకటంబుగ ధృతరాష్ట్రుఁడంతటను


ఘనతమీఱంగఁ దాఁగట్టించినట్టి
కనకసన్మణిసభ కౌరవేంద్రునకుఁ
జూపి యతనితోడ సొలవకిట్లనియె:
"నాపదయగుజూద మాడంగవలదు;
కలహంబు మీలోనఁ గలయంగఁబుట్టు;
నిలఁ బ్రజాక్షయమగు నింతమీఁదటను
నీవుఁ బాండవులును [29]నెయ్యంబుగలిగి
వావిరి సుఖలీల వర్తించుటొప్పు;
వలదుజూదంబాడ ; వారిలక్ష్ములకు
నిల నసహింపంగ నేటికినీకు?
పాపంబుగట్టుకోఁ బాఁడియే నీకు !
నోపికగలిగుండు ముచితయత్నముల ;
వేదార్థవిదుఁడైన విదురున కిదియ
యేదియు సమ్మతంబెంతయుఁ గాదు ;
ధర్మనందనుసంపదకు నెక్కుడైన
భర్మంబు నీకును బసఁ జాలఁగలదు ;
అతఁడుచేసినయట్టి యజ్ఞంబుకంటె
నతివిశేషంబుగా యజ్ఞంబుసేయు ;
భూలోకమునఁగలభూపతులెల్లఁ
జాలంగ సంపద చయ్యనఁదెచ్చి
యిత్తురునీ." కన్న నిలనాయకునకు
నత్తఱిఁ గురుపతి యల్లనఁబలికె :
"ధర్మజుతోడ జూదంబులాడుటయె
ధర్మయజ్ఞము నాకు ధరణీతలేశ !
అందుమూలంబున నఖిలసంపదలుఁ
జెందునునాకుఁ బ్రసిద్ధంబుగాను.


ఇందులకును మీరలేఁగుదేరంగ
నందున నేనుండి యాసభమహిమ
[30]చూచుచు, నచటి సంశోభితరత్న
వైచిత్రిభావించి వదలకమగుడి
మానిత విమలసన్మణితలంబునను
గానక యే తేరఁ గటిశాటిదడియ,
ననుజూచి భీముండు నగియె మిక్కిలిని.
కని ధర్మజుఁడు, నాకుఁ గనకాంబరములు
పుత్తెంచినను ముదంబున ధరియించి
తత్తరంబున మణిద్వారకవాట
దేశంబు వీక్షించి ధృతి లోనికరుగ,
నాశశికాంత శిలాగ్రంబుదాఁ
నాలలాటమునొవ్వ, నను బిట్టునవ్వె
బాలాజనంబు లపారంబుగొల్వ
ద్రౌపది రూపసౌందర్యగర్వమున.
ఆపట్టునను ద్రోవయరయంగలేక
బ్రమసి యేనుండంగఁ, బఱతెంచి కవలు
కమనీయ రాజమార్గంబిది యనుచుఁ
దోకొనిపోయిరి; దొరయంగ నట్టి
శ్రీకరసభఁజూచి సృష్టిలోపలను
బ్రాణంబుతోడను బ్రదుకంగఁజాలఁ.
ద్రాణతోఁ బెద్దలు తద్దయు మిగుల
నవమానమొందిరి; యధములందఱును
బ్రవిమలశ్రీలతో బహుమానములను
బొందిరి యేను భూభువనమెఱుంగఁ;
గుందుచున్నాఁడను గురుతరంబుగను.
.......... .......... ........ ......... .......
.......... .......... .......... ......... .......


చేకొనుకంటెను సృష్టిలోపలను
శ్రీకరంబెయ్యది సృష్టీశ్వరులకు ?
నముచిదానవుఁడు కానఁ దపంబుచేసి
యమితప్రతాపుఁడై యలరుటచూచి
ధరణీధరారి యధర్మంబునందు
దురమున వాని నుద్ధురశక్తిఁద్రుంచె ;
నలరినగతి శత్రులగువారినెల్ల
నిలనాశనముసేయ నెంతయువలయు.
నధముఁడైయొండెను నధికుఁడై యొండె
నధిగత పరమార్థులగువారు మెచ్చఁ
జెట్టు చుట్టును జనించినయట్టి మేటి
పుట్టచందంబునఁ బొదలుశాత్రవుల
నణఁచంగవలయు బాహాశక్తితోడ.
గణుతింప వ్యాధినిఁగలితౌషధములఁ
జక్కఁబెట్టకయున్న జనుల బాధించు
నిక్కువం; బటుగాన, నెఱయఁ బాండవుల
లక్ష్మి సర్వంబుఁజాలంగఁ గైకొందు
సూక్ష్మమార్గంబునఁ జోద్యంబుగాను.
పాండవేయులలక్ష్మి బహుభంగిఁ గొనక -
యుండిననాఁడు నాయుదరరోగంబు
మానదు పది వేలమార్గంబులందుఁ ;
గాన దీనికి సుపక్రమము గావింపు."
మనఁ గురుపతితోడ నాడెనాశకుని:
"అనుపమంబగు నాగజాశ్వసన్నాహ
మొనరింప, కాజిలో నుభయసైన్యములు
చెనకకమున్నె ప్రసిద్ధంబుగాను
నాయక్షవిద్యను నైపుణంబునను
నీయెడఁ బరధరిత్రీశులలక్ష్మి


నీకునిప్పించెద ; నెఱయ ధర్మజుని
జోకతో రిప్పించు ; సులభంబునందు
జూదంబునన్ వాని సొలనకోడింప
మేదినీరాజ్యంబు మెఱసి నీకొదవు;
నూరక పాండవేయులతోడఁ గదిసి
పోరాడి గెలువ వేల్పులకశక్యంబు. "
అనువేళ ధృతరాష్ట్రుఁ డా వాక్యములకు
నొనరంగ నొడఁబడ కొదవియిట్లనియె:
"విదురునిమతమున విశ్వభూభగము
వదలకసేయుదు వ్రతముగానెందు.
జూదంబులాడంగఁ జూడ నిగ్రహము
వాదంబుఁ బుట్టును; వలవదీవనులు.
పాండ వేయులతోడఁ బగ నీకువలదు;
నిండినవేడ్కతో నిరతంబునుండు ;
నామాటద్రోవక నడవునీతులను,
వేమఱు." ననవుడు విని సుయోధనుఁడు
తుది ధృతరాష్ట్రునితోడ నిట్లనియె:
"విదురుండు పాండుభూవిభుతనూజులకు
హితముగా విహరించు నెప్పుడు , నతని
మతముసేయకుము సమ్మదచిత్తమునను ;
దలపోయ నెందు జూదము పురాణములఁ
గలదు దోషములేదు గౌరవంబందు ;
దేవలుండటుచెప్పె దిక్కు లెఱుంగ ;
దేవతాధర్మంబు ధృతిఁ బడయుదురు;
కావున శకునికింకను నానతిమ్ము ;
రావించు వడి ధర్మరాజు నిచ్చటికి. "
ననుటయు ధృతరాష్ట్రుఁ డాత్మఁజింతించి
యెనయంగ నొడఁబడె నెట్టకేలకును --


ఒడఁబడి విదురుని నొప్పరావించి
తడయకిట్లనిపల్కెఁ దప్పకయుక్తి :
"సౌవర్ణ నవరత్నసభ యిదిచూడఁ
బావనమతియైన పాండవాగ్రజునిఁ
దమ్మలఁ దోతెమ్ము తగిలియిచ్చటికి ;
నిమ్ముల జూదంబు నీకురురాజు-
తోడ నాడంగ బంధురముగా వలయు
వేడుక." ననవుడు విని విదురుండు
చకి తాత్ముఁడై మదిఁ జాలఁజింతించి :
"యకట యిట్లేల ! మాయాద్యూతమాడ
నుభయపక్షమువారి కుగ్రవైరంబు
త్రిభువనంబెఱుఁగంగఁ దెల్లమినగును."
......... ......... ........ ......... .........

విదురుఁడు ధర్మజుఁదోడ్తెచ్చుట

అని పెక్కుమాఱులు నతనిఁబ్రార్థించి
చెప్పిన, వినకున్నఁజేసి యావిదురుఁ
డప్పుడు ధృతరాష్ట్రుననుమతంబునను
బోయె నింద్రప్రస్థపురవరంబునకు.
నాయెడ ధర్మజు [31]హరిని భీమునిని
విజయుని గవలను వేడుకఁజూచి,
నిజమతిఁజింతించి నెఱిధర్మజునకు
భయభక్తియుక్తితోఁ బరఁగనిట్లనియె:
"జయమెనీకును సరేశ్వర, మిక్కిలియును
పుణ్యాత్ముఁడవు గుణాంబుధివి లోకమున
గణ్యయశుండవు కారుణ్యనిధివి


నీకునుసేమంబు నెఱయ నెయ్యెడను
ఆకల్పముగ." నన్న నాధర్మజుండు
విదురునిఁబూజించి వేడ్కనిట్లనియె:
“పదవినున్నారము పరఁగనందఱము ;
నీవువచ్చినపని యెఱిఁగింపునాకు
నీ వేళ.” యన నతండిట్లనిపలికె :
“తనసభఁజూడ జూదంబాడ నీవు
చనుదేరఁ బుత్తెంచెఁ జయ్యన నన్ను."
అనుటయు ధర్మజుండటువిచారించి
పనివడి ధృతరాష్ట్రుపంపు మాకిపుడు
చేయకపో రాదు చెనసియింకనుచు
నాయతవిధియుక్తుఁడై క్షణంబునను
అనుజులుఁ దానును ఆద్రౌపదియును
ఘనుఁడుదౌమ్యుండాదిగా బుధశ్రేణి
యే తేర నిభపురి కేఁగె నెయ్యమున.
నాతఱి భీష్ము ద్రోణాచార్యు శల్యుఁ
గృపుని నశ్వత్థామఁ గీర్తిభానుజునిఁ
దపన తేజునిసుయోధను భక్తిఁజూచి,
యాసభాస్థలియందు నాధృతరాష్ట్రు
భాసురయశునిఁ [32]బ్రతాపవర్తనుని
గనుఁగొనఁ దారకాగణములలోన
నొనరిన రోహిణీయుత సుధాకిరణుఁ
డుండినకైవడి నొప్పు గాంధారి
పుండరీకాక్షి సంపూర్ణేందువదన
తోడుగ సుఖలీలదొరయంగనున్న
ప్రోడను రాజన్యపుంగవుఁ జూచి


దండప్రమాణంబు తగనాచరించి
నిండినభక్తితో నెఱినుండుతఱిని
....... ....... ....... ........ ......... ........
....... ........ ........ ........ ....... ........
ఇందీవరాక్షిని నిభరాజగమనఁ
గుందేందురుచిని సద్గుణగణశీల
నలినీలవేణిని నబ్జసంభవుఁడు
చెలువుగా జగములఁ జిత్రంబుగాను
శృంగారలక్ష్మిగాఁ జేసె నేరుపున ;
నాంగికమైన యాయంగనఁబోల
సతులులేరని చాలసన్నుతిసేయు
చతురతయొప్పె నాసమయంబునందు.
అంతఁ బాండవులును నాదినంబుననె
సంతోషచిత్తులై సంభ్రమంబునను
ఆసీనులై యున్న యాసమయమున
నాసుయోధనుఁడు దా నప్పుడిట్లనియె:
“ధర్మనందన, నీకు దాక్షిణ్యనిధికి
ధర్మవర్తన వినోదంబు జూదంబు ;
ఆడుద" మనవుడు నతఁడునిట్లనియె:
"నోడక జూదమిట్లొగి నాడవలదు ;
జూదంబు వాదంబు సుజనఖేదంబు;
...... ....... ....... ....... ........ ....... ....
ఇదిదోషమాడంగ నేపారవినుము
పదహీనులగుదురు బహుళదుఃఖములఁ
బొందుచుండుదురు భూభువనంబునందు.
నందందు ధరణి మాయాద్యూతమునను
అడరంగఁ బాతకంబండ్రు మానవులు ,
ఎడర ధర్మద్యూత మిరవొందఁజేయ


ధర్మంబుగలుగును దఱ్వార్థముగను
నిర్మలమతినని నెఱిదేనలుండు
చెప్పినాఁ." డన యుధిష్ఠిరునకు శకుని
యప్పుడిట్లనియె నాహ్లాదంబుతోడ :
"నిందింపఁదగునయ్య, నీకు జూదంబు !
లెందును బలవంతు లితరులగెలుతు.
రయ్య, జూదంబునీ వాడలేవేని
చయ్యనఁ గదలుము, శాంతంబువలదు
నన ధర్మజుండును నతనికిట్లనియె:

థర్మరాజు శకునితోజూదమాడుట

"మునుకొని బలవంతు మునుసభాస్థలిని
జూదమాడంగను సొలవకపిలువ
నాదట నాడక యటుచననగునె!"
యనుచుఁ గర్మము దన్నునటుచుట్టుకొనఁగ
వినయోక్తులందును వేడ్కనిట్లనియె:
"ఎవ్వరు నాతోడ నిటుజూదమాడ
నివ్వేళఁ బూనుదు రిటచెప్పు?” డనిన
రాజరాజకిరీటరత్నంబు ధర్మ
రాజునకును గురురాజు తాఁబలికె:
"మామామ శకుని ప్రేమమున నీతోడ
నేమంబులందును, నెత్తంబులాడు ;
నొడ్డినధనమెల్ల నొనర నేనిత్తు
దొడ్డగా నాడుము దురితవిదూర. "
అని తనచేతిరత్నాభరణంబు
గొని యొడ్డినను జంద్రకులధర్మజుండు
దివ్యభూషణము వార్ధిసముద్భవంబు
భవ్యంబుగానొడ్డి పరఁగి యుండగను,


గురు భీష్మ కృప శల్య కుంభజపుత్త్ర
సరసిజహితసూను సౌబలాదులును
ధృత రాష్ట్రవిదురులు తేజంబునందు
ధృతిఁజూచుచుండిరి తెరలకయచట.
బద్ధమత్సరుఁడై ప్రభావంబునందు
సిద్ధంబుగా యుధిష్ఠిరుఁడు నయ్యెడను
గనకనిష్కంబులు, ఘనపురంబులును,
అనుపమ దివ్యవస్త్రానీకములును,
మరకత హరినీలమణి పద్మరాగ
వరవజ్ర మౌక్తిక వైడూర్య పుష్య-
రాగ గోమేధిక రత్న ప్రవాళ
నాగేంద్రమణులు, భాండాగారములును,
గలిత పంచద్రోణ కాంచనసహిత
[33]నలినమందిరపూర్ణ నవనిధానములు,
మాణిక్య కింకిణీమాలికానేక
బాణ తనుత్రాణ బహురూపములును,
ధన్యవరూధయూధములు, సువర్ణ
మాన్యఘంటాధ్వాన మదసింధురములు,
నమిత వినూత్న రత్నాభరణములుఁ,
గమనీయ నిజసభాగ్ర సమగ్రపాత్ర
పాణులై యొప్పెడు పరిచారకులును,
క్షోణీధరారాతి సుతునకు చిత్ర
........ ........ ........ ....... .......
........ ........ ........ ........ ..........
అజ మేష గో మహిషానీకములును,
రజతపాత్రంబులు, రత్నాంబరములు,


నొక్కొక్కయొడ్డున నోడినఁ, జూచి
తక్కక విదురుండు ధర్మసూనునకు
వగచి యాధృతరాష్ట్రవసుధేశుకనియె:
"జగతియందును గురుక్ష్మాతలేశ్వరుఁడు
దోషంబులకుఁబుట్ట దుర్నిమిత్తములు
ఘోషతోఁబుట్టెను గోచరంబుగను.
దశదిశలను సుకృతమునొందినట్టి
శశివంశజుండైన శంతనుచక్ర-
వర్తికులంబున వసుమతియందుఁ
గీర్తిపొందని కురుక్షితిపతిపుట్ట
సకలపాపంబులు సంభవంబొందెఁ ;
బ్రకటితముగ మీఁద ప్రళయంబుతోచుఁ ;
గులమునకును నెగ్గు గొనకొనిపుట్టు
నిలలోన నిప్పుడే యీతనికతన.
కులనాశకుఁడగు దుర్గుణుని దుర్మదుని
వలదనివారించి వంశరక్షణము
చేయఁగానగు నంచుఁ జెప్పెశుక్రుండు.
పాయక యటుగాన, పాలించుకులము ,
యదు వృష్ణివీరులు హరి నియోగించి
ముదమునఁ దమకులంబునకును మిగుల
దూషకుండగు కంసుఁ దునిమించి శౌర్య
భూషణులైరి భూభువనమెఱుంగ.
వాసవసుతు ధర్మవర్తనుఁ బనిచి
రాశి జూదము నివారణముగావింపు;
జనవిగ్రహము మాన్చి సత్ప్రధానులకు
ననుకూలమొనరించు మద్భుతంబుగను;
మనుజాధముని దుష్టమానసు శకుని ,
ఘనబహిష్కృతుఁ బాపకలితు దుర్మార్గు


నీతిదూరుని లోకనిందితుఁ డుజను
జాతరోషుని దురాచారుఁ గ్రూరాత్ము
దుర్యోధనుని దుర్మదుని నివారించి
యార్యసమ్మతమున నన్వయంబెల్ల
రక్షించు; దగఁబాండురాజనందనుల
లక్షణజ్ఞుల సముల్లాసచిత్తులను
ధీరుల మన్నించి ధృతరాష్ట్ర, నీవు
ధారుణిఁబాలించు ధర్మమార్గమున.
వినుము శృంగారంబు పెనఁగొనియున్న
ఘనసముత్తుంగ ప్రగల్భద్రుమముల
సంగారమునకై రయంబునఁ గాల్చు
వెంగలికైవడి వీఁగకింతయును
సమకట్టె లోభి వశంబునఁ జాల
కుమతి నీతనయుండు కరుకులేశ్వరుఁడు
పాండునందనులను బరఁగఁగల్మషము
నొండొండ..... ......... ....... ........ ........
అసమసాహసులతో నాజిసేయంగ
మసలుచునున్నాఁడు మదమునఁగదిసి.
తరమెఱుంగక ప్రల్లదంబున వీఁడు
మొఱయుచునున్నాఁడు మొక్కలంబునను.
కురుకులక్షయకారి గుణవిహీనుండు
దురి తాత్ముఁ డీతనిఁ దొలుతవారించి
సృష్ఠీశ, యిఁకనుపేక్షింపక నీవు
దృష్టంబుగా మాన్పు తెలివి జూదంబు
బుద్ధిగా, " దనవుడుఁ బుత్త్రమోహమున
సిద్ధంబుగా నొండుసేయంగలేక
యూరక ధృతరాష్ట్రుఁడుండెఁ జిత్తమున ;
నారయ విదురుండు నాసుయోధనుని-



విదురుఁడు దుర్యోధనుని దూషించుట

తోడనే పలికె నుద్ధురరౌద్రమునను :
"ఓడక దుష్కీర్తికొడిగట్టినట్టి
పాతకుండపు ; గుణప్రకటశూన్యుఁడవు ;
నీతిదూరుండవు నిందితాత్ముఁడవు ;
అన్యాయమున జూదమాడెద వేల !
మాన్యులు బుధశిరోమణులు దూషింప.
ప్రకటసౌబలుని మాయాద్యూతమునను
సకలభూపాలైకచక్రేశులైన
పాండుకుమారుల బహుళసంపదలు
దుండగంబున నీవు తొలుతగై కొనిన
నవ్వరా నిన్ను నానాజనంబులును !
మవ్వమిగా. " నన్న మఱి సుయోధనుఁడు
విదురునకలిగి యావేళ నిట్లనియె:
"ఎదిరితలంపు నీ వెఱుఁగవేమియును;
బరులగుణంబులు పలుమాఱు నీవు
వరుసఁ గీర్తింతువు వాచానురక్తిఁ ;
బరఁగ పాండవపక్షపాతివి; కపట
నిరతుండవై మహానిష్ఠురత్వమునఁ
గుడిచినయింటి కే కుఱుచదలంచి
యెడపక దోషంబు లెపుడుఁ జేసెదవు;
[34]క్రూరోరగముభంగిఁ గొసరక నీవు
ఆరయఁగా విఘ్నమాచరించెదవు;
పరులసంపద సుఖో పాయంబునందు
వెరవారఁ గొనుట భూవిభులకునెల్ల


నైజంబుగాదె నానా ప్రకారమున !
భూజననుత, నాకు బుద్ధులేమియును
జెప్పకుండుము నుతిచేసెద నిన్ను ;
నెప్పుడు ధర్మజుహితమిగోరుదువు."
అనుసుయోధనునకు విఁదురుఁడు
కనలి యిట్లనియెను గడిమిదూషించి :
"చెడుబుద్ది నీకునుజెప్పెడివారి
నెడమాటలే వినవేఱుకగాక,
మీయట్టివారలమాటలు వినఁగ
నీయట్టివారలు నేర్తు రే యెందు !
కొంకక నీయట్టిగుణహీనునకును
బింకపుమాటలే ప్రియాయులై యుండు ;
నీకుఁబ్రియంబుగా నెరవై నమాట
నాకునాడఁగ రాదు న్యాయంబుమాని.
పగగొని తమతోడ బలములఁగూర్చి
తెగి తేజమునఁబోరి ధీరులసిరులు
రాజులు జయమునరప్పింతురెందుఁ
దేజంబుఁ గీర్తియు ధృతియును మిగుల.
నాతలనెవ్వరు నగకుండ రాజ,
నీతిచెప్పితి నిదినీకింపుగాదు;
పథ్యంబుగాఁగొనరు పాపమానసులు
తథ్యంబుగా సభ్యతతులు పల్కి నను.
ప్రియభాషణములన ప్రియము సేయుదురు
నయవివర్జితులు [35]వినాశ కాయువులు.
కాన సజ్జనులు దుస్కార్యవంతులకు
నేనాఁటఁ జెప్పరు హితబుద్ధులెల్ల.


మొదల నప్రియములై మునుకొనితోచి
తుదిఁ [36]బ్రియంబులగు హితఁ భూషణములు.
తరువులెక్కంగను దావలు వలయుఁ ;
దెరలక నదులీఁదఁ దెప్పలువాయు. ;
నమరులకైన సహాయంబువలయు
రమణనొండొరులకు [37] రాజతంత్రముల.
ఎంతబుద్ధులు నీకు నెలమిఁజెప్పినను
నంతయు నీకును నప్రియంబయ్యె.
చిత్రయశుండు విచిత్రవీర్యునకుఁ
బుత్త్రుండ నీతివిస్ఫురితశీలుఁడను;
నన్న నాదరము మిన్నక చేసి కినిసి
యెన్నిదుర్భాషణ లెగసియాడితివి !
తరమెఱుఁగక పాండుతనయులతోడ
దొరయని జగడంబు తుదిఁ జేసుకొంటి.
బ్రదుకుదుగా కేమి ప్రాణంబుతోడఁ ;
గొదలేదు నీబుద్ధి కుంభినియందు."
అనివిదురుడు వికలా నుండగుచు
జననాయకుని సభాస్థలినుండుతఱిని,
శకుని ధర్మజునితో సరవినిట్లనియె :
"సకలసంపదలును సరవి నోడితివి;
రాజశేఖర, ధర్మరాజ, రాజాధి
రాజ, రాజశశాంక, రాజామరేశ,
యింక నేమిటినొడ్డి యిపుడు జూదంబు
శంకింపకాడుదు సంభ్రమంబునను ? "
అనిన ధర్మతనూజుఁ డవనీతలంబు
తనరంగనొడ్డి యాతనితోడ ననియె:


ధర్మజుఁడు సర్వస్వము నోడుట

"దేవతాసీమలు దీపించువిప్ర
భూవలయంబును బుధపురంబులును
గుడ్డవృత్తులుఁదక్కఁ గుంభినియెల్ల
దొడ్డుగాఁగైకొను దోరంబుగాను
ఈజూదమాడి నేనిప్పుడోడినను
రాజితంబుగ. " నన్న రయమున శకుని
ధర్మజుతోడ జూదంబాడి గెలిచి
పేర్మితోఁ గైకొనెఁ బృథివీతలంబు.
వెండియు నొడ్డిన, విపులార్థములను
మండలాధిపుల సామంతభృత్యులను
దమ్ముల నత్యంతధర్మవర్తనుల
సమ్మదచిత్తుల సాహసాధికుల
నభిమానపురుషుల నర్క తేజులను
బ్రభుశేఖరుల జగత్ప్రఖ్యాతయశుల
సత్యవాక్యుల నాదిజగదీశనిభుల
నత్యుత్తముల సుగుణాంబురాసులను
బవమాననందనుఁ బర్జన్యసుతునిఁ
గవలను నోడెఁ దక్కకధర్మసుతుఁడు,
వివరింపఁ దన్నును వేగంబయోడెఁ
దవిలి యందంద ద్యూతవ్యసనమున.
ఆవేళ శకునియు యమనందనునకు
భావించి పలికెను బటుశఠత్వమున :
"ఓరాజశేఖర, యోధర్మతనయ,
వారకయోడితి వలయునర్థములు ;
కమలాక్షి పాంచాలకన్యక రూప
రమణీయ సంపూర్ణరాజబింబాస్య


నలువొప్ప నీదుధనంబుగావునను
దలకొనియొడ్డి జూదంబాడు. " మనిన
'నవుఁగాక' యని జూదమాడి ధర్మజుఁడు
ధవళలోచన సాధ్వి ద్రౌపదినోడె.
వెసనోడి మిక్కిలి [38]వికలాత్ముఁ డగుచు
నసహాయుఁడై దుఃఖమధికమై యొదవ
హరి -------సాంభోరుహమునందు నిలిపి
తెరలక సర్వంబుఁ దృణముగాఁదలఁచి
పాండవాగ్రజుఁడంతఁ బరతత్త్వబుద్ధి
నుండంగఁ, గృపుఁడును నొగిఁ గుంభజుండు
గాంగేయుఁడును గుణాకరు ధర్మసుతుని
నాంగితుఁ గనుఁగొని యధికశోకమునఁ
దద్దయుఁబొగులుచు దరినుండి రంత
నెద్దియుననలేక హీనస్వరముల.
విదురుఁడు మిక్కిలి విముఖుఁడై కలఁగి
మదిలోన శోకాగ్నిమగ్నుఁడై యుండె.
ఆసభ వారు బాష్పాంబుపూరములు
వే సముద్రముభంగి వెల్లియైనిగుడఁ
గుపితదుఃఖముల నెక్కొనియుండిరపుడు.
అపుడు భూతాక్రోశమయ్యె నెయ్యెడను;
అగుటయుఁ గర్ణుండు నాశకునియును
అగణితదుర్గుణుండాసైంధవుండు
దురితశరీరుండు దుశ్శాసనుండుఁ
బరమానురాగులై బలసియొండొరుల
మొగములుచూచుచు ముచ్చటలాడి
నగుచుండిరచట నానాప్రకారముల.


ధృతరాష్ట్రుఁడును సభదిక్కున రవము
నతిభంగి విదురుని నడిగె గ్రక్కునను:
"ఎవ్వ రేమివిధంబు లిటయోడి పిదప
నెవ్వరోడిరి ? నాకునెఱిఁగింపు.” మనిన
నన్నరపతితోడ నతఁడిట్టులనియె:
“నన్న, యీశకుని మాయాద్యూతమునను
సకలార్థములునోడె శమననందనుఁడు,
[39]వికలులై పాండుభూవిభుతనూభవులు
దీనతనున్నారు తెలివిలేకిపుడు
మానుగా.." ననుచుఁ గ్రమ్మనచెప్పుచుండ
నా వేళఁ గురుపతి హర్షంబుతోడఁ
బావనమతులైన పాండు [40]నినుతుల
దాసులగాగెల్చి తారతమ్యంబు
వాసి దలంచక వరుసనిట్లనియె:
"వరవుళ్లఁగలిసి నివాసంబుదుడువఁ
దరళాక్షిఁ దన్వంగి ద్రౌపదినిపుడు
వేగంబె తో తెమ్ము విదుర, నీ.” వనిన
నాగుణాంభోరాశి యతనికిట్లనియె:
"నీనిష్ఠురతకును నీపాపమునకుఁ
గానంగఁజాలుదు కష్టవర్తనము ;
దుర్జనుండవు మహాదురితదేహుఁడవు
వర్జించు నిన్ను నైశ్వర్యంబు ; మీఁదఁ
జెడుదువు నీవును సిద్ధంబుగాను.
పుడమియేలెడు పాండుపుత్రుల సాధ్వి
యగుద్రౌపదిని నేలయవమానమిపుడు
తెగువఁ జేసెదవు ధాత్రీశులుదిట్ట !


పాండవేయులలక్ష్మి పరఁగఁగైకొంటి
దుండగంబున నృపస్తోమంబు నగఁగ.
ప్రకటంబుగా నిట్టిపాపస్వభావు
శకునిమాటలు వినఁజనునె నీకెందు!
ఈజూదమున నీకు నెగ్గులుపుట్టు
నీజగంబున. ” నన్న నేచి యంతటను
దుర్యోధనుఁడు మహాదుర్మదాంధుండు
కార్యజ్ఞుఁడగు ప్రాతికామికిట్లనియె:

ద్రౌపదినిఁదోడ్తేర దుర్యోధనుఁడు ప్రాతికామినంపుట

“విదురుఁడెప్పుడు పాండవేయులమెచ్చి
మొదలనుండియుఁ బక్షమునఁజరియించు;
వెఱచు; నీవేఁగి యా వెలఁది ద్రౌపదినిఁ
దఱితోడఁ దో తెమ్ము తడయక. " యనినఁ
బ్రాతికామేఁగి ద్రౌపదికినిట్లనియె:
“నాతి, నీపతి ధర్మనందనుఁ డిపుడు
ధార్తరాష్ట్రునకు జూదంబాడి మిగుల
మూర్తిశోషిల్లఁ దమ్ములఁ దన్ను నిన్ను
సర్వార్థముల నోడె జగమెల్లనెఱుఁగ.
దుర్వివేకమున నాదుర్యోధనుండు
నిన్నుదో డ్తెమ్మని నిష్ఠురత్వమున
నన్ను బుత్తెంచెను [41]నడుఁకక రమ్ము."
అనుటయుఁ బాంచాలి యతనికిట్లనియె:
"మునుకొని యేయుగంబులయందునైన
భార్యనోడినయట్టిభర్త దాఁగలఁడె !
యూర్యోక్తిగానియీయాలాపమిపుడు


విననపూర్వంబయ్యె విశ్వధారుణినిఁ ;
జెనసి ధర్మజుఁడిట్లు చేయువాఁడొక్కొ !
మును తనునోడి దుర్మదవృత్తితోడ (?)
ననునోటువడుట యెన్నఁగ నిదినిజమొ!
కల్లయో!" యనుచును గడుసంశయమున
నెల్లగానికి మఱియిట్లనపలికె: (?)
"ధర్మనందనుని మోదంబుతో నడిగి
పేర్మిఁ దత్సభకును బెంపుదీపింపఁ
దోకొని పొ." మ్మన్న ధృతి వాఁడునరిగి
ప్రాకటంబైన ద్రౌపదిపల్కులెల్ల
ధర్మనందనుని కెంతయు నెఱిఁగింప,
ధర్మదేవతను జిత్తమునందు నిలిపి
యధికచింతాక్రాంతుఁడై యుండుటయును,
అధముండు దుర్మార్గుఁడగు సుయోధనుఁడు
ప్రాతికామికి నతిత్వరత నిట్లనియె :
"నీతఱి సభ వారలిందఱు నెఱుఁగ
ద్రౌపదిఁదోడ్కొని తడయకరమ్ము
నైపుణ్యమున." నన్న నలి వాఁడునరిగి
పాంచాలితోడఁ దప్పక యిట్టులనియెఁ :
"జంచలలోచన, శమననందనుని
నడిగితి; సభవారు నటవిచారించి
వడి నిన్నుఁదోడ్కొని వరుస రమ్మనుచు
నన్నుఁబుత్తెంచిరి నలినాక్షి !" యనిన
నున్నయాద్రౌపదియును దలపోసి
దుర్మార్గుఁడైనట్టి దుర్యోధనుండు
ధర్మంబుదప్పినతలఁపునక పుడు
ధర్మనందను సమ్మతమునకు వెఱచి,
ధర్మస్వరూప యాద్రౌపది కడఁగి


యేకవస్త్రముగట్టి యెంతయుఁ జాల
శోకాకులతనొంది చుఱచుఱమనుచుఁ
గబరీభరముజూఱఁ గన్నీరుగాఱ
సొబగుదేహముగండ శూన్యతపొంద
వాతెఱయెండ భావముదూలియుండ
భీతిమిక్కిలిపట్టఁ బెనుదగదొట్టఁ
జెమటమేనునఁబుట్టఁ జింతదాఁబుట్ట
భ్రమచుట్టుముట్ట నాపద్మాయ తాక్షి
యరిగి యాకురువృద్ధునాస్థానమునను
దరలత్వముననుండె ద్రౌపది ; యంతఁ
బాండునందనులు ద్రౌపదిఁజూడలేక
నిండినలజ్జతో నిబిడదుఃఖముల
మోముదమ్ములు వాంచి ముఖముద్రలు పడ
నేమియు ననలేక యిట్లున్న యెడను,
బాండవేయుల దైన్యభావంబు చూచి
నిండినమదిఁ గురునృపకులోత్తముఁడు
సహజన్ముఁడైన దుశ్శాసనుఁ బిలిచి
బహుమానమొనరించి భక్తినిట్లనియె:
"ఎఱుక యించుకలేక యీప్రాతికామి
వెఱచు భీమునకును; వేడ్క నీవేఁగి
ద్రౌపదిఁ దో తెమ్ము తత్ క్షణంబునను

దుశ్శాసనుఁడు ద్రౌపదినిఁ దలపట్టి యీడ్చుకొనివచ్చుట

ఏపార." ననవుడు నెంతయు నతఁడు
చనియెను ముదమున సంభ్రమంబునను.
మునుకొని యంతట మొగిద్రౌపదియును
దురితాత్ముఁడైనట్టి దుశ్శాసనుండు
విరసుఁడై కొనిపోవ వే వచ్చుటెఱిఁగి


గాంధారికడ కేఁగఁ గడుభయంబునను,
బంధుర సద్గుణాభరణయైనట్టి
యాకృష్ణపిఱుఁదున నరిగియిట్లనియె:
“నేకచిత్తమున నీవెచటి కేఁగెదవు ?
కొంకక చనుదెమ్ము కురురాజసభకు
శంకింప ; కున్నతి శకునిజూదమున
ధర్మనందనుఁడును దను నిన్నుఁ దనదు
కూర్మిసోదరులను గొనకొనియో డె;
నలి వేణి, కురుపతియర్థంబవైతి ,
వలయక యే తెమ్ము హర్షంబుతోడ."
ననుచు డాయఁగవచ్చుటంతయుఁ జూచి
వనజాక్షి ద్రౌపది వానితో ననియె:
"నేనురజస్వల; నేక వస్త్రంబు
పూని కట్టినదానఁ ; బుణ్యచరిత్ర,
ననుముట్టఁగా నీకు న్యాయంబుగాదు ;
గొనకొని యొక్కింతగుణము గ్రహించు;
మానాభిమానంబు మదిలోన విడిచి
మానిత కురువృద్ధమండలేశ్వరుల
ఘనసభాస్థలికెట్లు కడఁగిరా నేర్తు?”
ననిన ద్ర్పుపదితోడ నతఁడిట్టులనియె :
"ఏక వస్త్రంబు నీ విఁకఁగట్టి తేమి !
యేకవస్త్రముఁ గట్ట కిఁకనుండి తేమి !
యేకాత్మతోడ నీవేఁగుదెమ్మిపుడు ;
రాకున్న నిన్ను సంరంభంబుతోడ
బలవంతమునఁ డత్సభాస్థలంబునకు
నెలమిఁ గొంచునుబోదు నిదినిశ్చయంబు.
అనవుడు ద్రౌపది యతనితోఁబలికె:
“విను, ధర్మమార్గంబు వివరింపు; నన్ను


మును [42]బలాత్కారమ్మునను గొనిపోవఁ
జనునె నీకును రాజసభలోపలికిని!"
అంచునుబలికిన, నాగ్రహంబునను
వంచనలేక దుర్వారసత్వమున
దురితశరీరుండు దుశ్శాసనుండు
తరుణి నుత్తమసాధ్వి ద్రౌపదీ దేవి
నతిరాజసూయమహాధ్వరాంతమునఁ
జతురావబృథమున జగతీసు రేంద్ర
వేదమంత్ర పవిత్ర విమలోదకములఁ
బ్రోదిఁ బావనములై పొలుపారునట్టి
యసమానపుశిరోరుహంబులదానిఁ
దలపట్టి యీడ్చి యుద్దండతఁ దెచ్చె
నోడక సభకు నార్యులు చింతతోడఁ
జూడంగ నధికనిష్ఠురవృత్తి మీఱ.
గాలిఁదూలినయట్టి కలితపతాక
వోలె దుశ్శాసనుభూరిహస్తమునఁ
బట్టంగఁబడి కృష్ణ [43]పటుకీరవాణి
నెట్టన భీతితో నెఱిఁ గర్ణశకుని
సైంధవ కురురాజ సభకునేతెంచి
బంధురకోప నిర్భరలజ్జలందు
నాసభవారికి నప్పుడిట్లనియె:
"రాశికెక్కిన ధర్మరాజు ధన్యుండు
దైవయోగమునజూదంబున [44]నొడ్డి
భావింప నటయోటుపడియుండుఁగాక ;
ధర్మంబుదప్పునే తనువుపోయినను !
ధర్మాత్ములార, సత్యవ్రతులార,


సాహసాధికులార, సభ వారు వినుఁడు;
ద్రోహియైనట్టి యీదుశ్శాసనుండు
పాతకుఁడై దోషభాషణలాడి
నీతిదప్పి త్రిలోకనిందితుఁడగుదుఁ
దలవట్టి యీడ్చుక తద్దయువచ్చెఁ ;
దలఁపంగ నిది యుచితంబుకాదనక
యూరకయుండుట యుర్విధర్మంబె !
యారయ నోకరుణాంభోధులార ! "
యని 'భరతాన్వయం బతినింద్యమయ్యె .
ననుమాన మింతలే;' దనికృష్ణతలఁచి,
భయమందె ద్రౌపది పర్వేందువదన.
రయమున నపుడు నీరజలోచనుండు
కరుణించి ద్రౌపదిఁ గడుసంభ్రమమున
నరసి రక్షింపంగ నాత్మలోఁదలచె.
అపుడు త్రిలోకజయప్రతాపముల
నుపమవర్తింపుచునుండెడు పాండు-
రాజనందనుల పరాజయంబెల్ల
రాజితారుణనేత్ర రాజీవములను
వీక్షింపుచుండిన వెలఁదిఁ బద్మాక్షి
నీక్షించి దుఃఖించి యెంతయుఁగనలి
పాండవాగ్రజునితోఁ బవనజుండనియె:
"కొండలఁబోలిన కుంజరంబులను
జవహయంబుల రత్నసముదయంబులను
వివిధభూషణ వస్త్రవిసరంబు ధనము
సర్వసామ్రాజ్యంబు సకలార్థములను
బర్వేందువదనల బాణాయుధముల
నొగి మమ్ము నోడిన నోడితిగాక,
యగణితంబైన మాయాద్యూతమునను.


అంచితశుకవాణి నలినీల వేణిఁ
బాంచాలి నోడంగఁబాఁడియే నీకు !
శకునికైతవ మాత్మఁ జాలంగనెఱిఁగి
ప్రకటితంబైన మాయాద్యూతమాడి
వేగ నధర్మప్రవృత్తుండవైతి
వాగ మోక్తులెఱింగి యధిప, నీబాహు
నాహంబుసేయంగఁదగు నీక్షణంబ
యూహించి." యనవుడు నొనర భీమునకు
నర్జనుండనియెఁ బ్రియాలాపములను :
"నిర్జరారాతి సునీతిమానసుఁడు
ధర్మతనూజుండు ధర్మవర్తనుఁడు
ధర్మంబుదప్పిన, ధరణీతలంబు
తల్లడిల్లును ; రసాతలముకంపించుఁ ;
బెల్లగిల్లును మహాపృథివీధరములు ;
కమఠంబుముణుఁగు; దిగ్గజములుమ్రొగ్గుఁ ;
గమలాప్తచంద్రులగతులు గీడ్వడును.
తగిలి సుహృద్ద్యూతధర్మయుద్ధమునఁ
బగతునిచే నోటువడియెఁ గావునను,
గురుల ధర్మాత్ములఁ గోపింపఁదగునె !
ధరణి శూరులకును దర్కించిచూడ ;
దైవికమునను జూదంబాడి యోడెఁ
బ్రావీణ్యమతియైన పాండవాగ్రజుఁడు."
అనిన శోకాక్రాంతులగు పాండవులను,
వనితద్రౌపదిఁ జూచి వగచి మిక్కిలిని

వికర్ణు నార్యవచనములు

అనియె భక్తి వికర్ణుఁడార్యులతోడ :
"ఘనజగద్ద్రోహి దుష్కర్మతత్పరుఁడు


దుశ్శాసనుఁడు, దురాత్ముఁడుసుయోధనుఁడు
దుశ్శాస [45]నస్థులై దుష్ట [46]వర్తనలఁ
బాండవేయులను ద్రౌపదిని నీభంగి
నొండొండయవమాన మొనరింపుచుండఁ
బెంపుతో మీర లుపేక్షింపఁదగునె !
సంపూర్ణచిత్తులు సభికు లుత్తములు
గాంగేయ ధృతరాష్ట్ర కలశజ కృపులు
నింగితజ్ఞులు లోకహితదయాపరులు
పలుకకయుండంగ [47]భావ్యమా మీకుఁ !
దలఁపఁ దక్కినసభాస్థలిలోనివారు
మహిత కామక్రోధ మదలోభములను
మహిలోనఁదక్కి నిర్మలచిత్తులగుచు
నధికధర్మము వల్కుఁ డఖిలంబునెఱుఁగ;
బుధనుతులార, సత్పుణ్యాత్ములార,
మీరూరకుండిన మెఱసి యేనొకటి
కోరి ధర్మంబుగైకొని యెఱింగింతు;
'పరికింప జూదంబుఁ పానంబు వేఁట
పరుషోక్తులును బహుభక్షణాసక్తి
........ .......... ........ ......... ..........
......... ........ ......... ......... ..........
ధారుణి ధర్మంబుదప్పి వర్తిల్లు
వారికృత్యంబులు వర్ణింపఁదగదు ;
మాయజూదంబున మఱియొడ్డినట్టి
యాయుధిష్ఠిరునకు ననిలజపార్థ
నకుల సహాదేవ నరవరేణ్యులకుఁ
బ్రకటిత సత్కులభామయైనట్టి


పాంచాలిఁ గల్యాణిఁ బణముగా నొడ్డె
నంచితంబుగ [48] నొకఁ; డట్టిద్రౌపదిని
ధర్మవర్తనిఁ బుణ్యతరుణీలలామ
నిర్మలమానస నీరజపంక
బింబాధరోష్ఠిఁ బుష్పిత నేకవస్త్రఁ
గంబుకంఠిని నధికక్రోధమునను
దక్కక యీసభాస్థలములోపలికి
నక్కట నీ తోడ్తేరనర్హమా?" యనిన
నావికర్ణుని పల్కులన్నియు వినఁగ
నోపక కర్ణుఁడత్యుగ్రుఁడై పలికె:

కర్ణుఁడు వికర్ణునిఁ గినియుట

"కురువృద్ధు లధికులు గుణవంతులుండ,
వరుసతోడుతఁ బిన్నవానికి నీకు
నిట్టిమాటలుపల్క నేమికారణము?
నెట్టణంబుగ దయానిపుణత్వమునను.
ద్రౌపది [49]యత్యంతధర్మచరిత్ర
యేపార ననిపల్కి తీవు నెయ్యమున;
శమనతనూజుండు సకలలక్ష్ములను
గ్రమమున నోడుచోఁ గాంతఁ బాంచాలి
నేటికినోడె మహీస్థలంబెఱుఁగ!
మాటికి నిటువంటిమాటలు మాను;
'యేకవస్త్రముతోడియేణాక్షి దీని
నీకొలువునకుఁ దా మేభంగులందు
రప్పించినా! రిదిరౌద్రంబుతోడఁ
దప్పఁజేసితి.' రని తడయకాడితివి;


లోకంబులో నొకలోలలోచనకు
నేకభర్తయెకాక, యీవధూమణికి
నేవురుభర్తలు! ఇదిదూషితంబు;
భావింప దీనిని జంధకి యండ్రు ;
అట్టిదానిని విగతాంబరఁ జేసి
గట్టిగాఁదెచ్చినఁ గలుషంబులేదు. "
అనుచుఁ గర్ణుండు దా నావికర్ణునకు
ననుపమప్రతిభాషలాడు నా వేళ
పెరిమ దుశ్శాసనుఁబిలిచి [50]యిట్లనియె:
“పరవీరవిజయుల పాండునందనుల
వలువలు, ద్రౌపదీవస్త్రసంఘమును
ఒలువుము భయమంద కుగ్రంబుతోడ. "
ననిపంచినను వాఁడు నట్లకాకనుచుఁ
జనుదెంచినను, బాండుజననాథసుతులు
అలఘు మాయాద్యూతమందున నోడి
బలిమియేమియులేక పై వస్త్రతతులు
మునుబెట్టి యాసభమ్రోల నుండుటయుఁ,
జెనసి యుద్ధతి దుస్స సేనుండు ద్రుపద-
రాజతనూభవ రాజితాంబరము
రాజసంబున నొల్వ రమణ డగ్గఱిన,

ద్రౌపదీమానసంరక్షణము

నావేళ ద్రౌపది యతిభీతినొంది
భావజజనకునిఁ బద్మలోచనునిఁ
గరిరాజవరదునిఁ గారుణ్యనిధిని
బరమాత్ము నచ్యుతు భక్తవత్సలుని


వేదాంతవేద్యుని విమలాబ్ధిశయను
నాదినారాయణు నాద్యంతరహితు
సర్వభూతాత్మకు సర్వలోకేశు
సర్వగీర్వాణాబ్జసంభవ వినుతు
శరణాగతత్రాణు సకలకల్యాణు
మురదైత్యహరణుఁ బ్రమోదవిస్ఫురణు
ద్వారకాపురివాసుఁ [51]దరళితోల్లాసు
ధీరుని రవికోటి తేజష్ణుఁ గృష్ణుఁ
జిత్తాంబుజంబునఁ జింతించిపలికె:
“సత్తుగా నిన్ను నే శరణువేఁడితిని
ఘన మనో వాక్కాయకర్మంబులందు ;
ననిశంబునిన్నె కా కన్యమెఱుంగ ;
నీమహదాపద కిటనీ వెదిక్కు;
స్వామి, సర్వేశ్వర, సత్కృపాంభోధి,
కావంగఁ బ్రోవంగఁ గర్తవునీవు ;
ఈ వేళ నను బ్రియంబెసగ రక్షింపు ;
భద్రేభవరద, యోప్రహ్లాదవరద,
యద్రీంద్రధర, రావణానుజవరద,
మానుగా నాయభిమానంబు గావు
మానితంబుగ ననుమానంబులేక."
అని సన్నుతించిన, హరియు సత్కృపను
వనజాక్షి ద్రుపదభూవరతనూజకును
అక్షయవస్త్రంబు లఖిలంబు నెఱుఁగఁ
దత్ క్షణంబున నిచ్చెఁ దాత్పర్యమునను.
అట దుస్స సేనుండు నాగ్రహంబునను
దటుకునఁ గదిసి యాద్రౌపదిచేల


పట్టియొల్వంగ, నా భామినీమణికిఁ
బట్టుచీరలు వెలిపట్టుచీరలును
దట్టపుఁబులిగోరుతరముచీరలును
జుట్టుభవంతులుసొరిదిచీరలును
చెల్లారువన్నెలుజిలుగుచీరలును
నల్లగంటుకులు సన్నంపువస్త్రములు
కస్తూరిమళ్లును గందుచీరలును
విస్తారమగు తమ్మివిరులచీరలును
రుద్రాక్షవన్నెలు రూఢిమైనొప్పు
భద్రాక్షవన్నెలుఁ బవడంపునిన్నె
గల రాసులాదిగాఁగలిగినయట్టి
లలితవస్త్రంబులెల్లను జాలఁగలిగి
కొండలపొడవులై కుంభినిఁబడఁగ
నొండొండ వస్త్రంబులొలువంగ నలసి
యధికలజ్జాపరుండై మాని పోయె
శిధిలంబుతో దుస్ససేనుండు కణఁగి.
ఆవేళ ద్రుపదరాజాత్మనందనను
వావిరిఁ గురుమహీవరునిసోదరుఁడు
దుస్ససేనుఁడు మహాదురితవర్తనుఁడు
నిస్సంశయంబున నెఱి వల్వలొలువఁ,
గనుఁగొని భీముఁడాగ్రహమున నొదవి
వనధిపైఁగినిసిన వనజాప్తకులుని
చెలువునఁ బురములు చెనకిననాఁటి
జలజాక్షు బాణంబుచందంబునందు
నతిభయంకరలీల నరుణాక్షుఁడగుచుఁ
బ్రతిభట భయదండపాణియుఁ బోలె
దంతసందష్ట దారుణముఖుండగుచు (?)
నంతట సభవారలందఱు వినఁగఁ


బలికె మారుతి ప్రతాపముననుప్పొంగి:
"కలబాంధవులు కురుక్ష్మాపతి చూడ
సమరరంగమున దుశ్శాసనుఁబట్టి
క్రమముతో వానివక్షస్‌స్థలిచించి
రాజిత రుధిరధారలు క్రోలిక్రోలి
తేజంబుతో వానిదేహాంతరంబు
ప్రేవులుఁజీరెద భీమంబుగాను
దేవకోటులు ప్రస్తుతింప రౌద్రమున ;
చెనసి వానిని నిట్లుసేయకుండినను,
దనరంగఁ బితృప్రపితామహులకును
దప్పినయాదురితము నొందువాఁడ ;
నిప్పుడు తత్వార్థ మేనాడుమాట
సందేహమునులేదు జగతీతలమునఁ
బొందుగా.” నని మహాద్భుతశౌర్యమునను
మిగులుటయును జూచి మించి యాసభను
మగఁటిమిగల కురుమండలేశ్వరుఁడు !
నమితభయభ్రాంతుఁడైయుండె ; నంత
రమణతో నాధృతరాష్ట్రునిందించి
పెరిమఁ బాంచాలి నుపేక్షించుచున్న
వరయోధులనుజూచి వైళంబునందు
నెల్లవారునెఱుంగ నెసగుహస్తములు
మొల్లముగావించి మును విదురుండు
పెద్దయెలుంగునఁ బెరసి యిట్లనియె:

విదురుని ధర్మప్రసంగము

"పెద్దలకెల్లను బృథివిలోపలను
ధర్మంబు సత్తుగాఁ దగఁ జెప్పకున్నఁ,
బేర్మి భావంబులు పెక్కులుపుట్టు ;


నీవికర్ణుఁడు నిర్జ రేశ్వరగురుని
భావంబులనుబోలు బహుళనీతులను
బాలుఁడై యుండియుఁ బరమధర్మంబు
చాలంగబలికెఁ బాంచాలిపట్టునను ;
[52]అతులితంబైనట్టి న్యాయంబుగాన
నతనివాక్యంబు మీరటుసేయఁదగును;
ధర్మజ్ఞులై సభాస్థలికిని వచ్చి
ధర్మసందేహ మత్తఱి నడ్గినపుడు,
నిజము చెప్పక యున్న నిఖిలభూస్థలిని
భజనతో ననృత సద్భయముల నెపుడు
పొందుచుండుదురు సత్పురుషులై మిగుల
నిందయేమియులేక నెయ్యంబునందు ;
ధనలోభమునను సంతతమును సభను
ననృతవాక్యములాడినట్టి సభ్యులకు
సిద్ధించుఁ బాపంబు శీఘ్రంబుగాను ;
ఇద్ధర నీయర్థ మితిహాసములను
వినఁబడెఁ; బ్రహ్లాదవిబుధారిసుతుఁడు
జననుతుండగు విరోచనుఁడును, ధన్యుఁ
డగుసుధన్వుడు, నొక్కయలివేణికొఱకుఁ
దగ బ్రతిగ్రహము మోదంబునఁ జేయ
నేమెపెద్దలమని యిద్దరుఁగూడి
మోమోటమాని యిమ్ములఁబోరుచుండి
ప్రహ్లాదుకడ కేఁగి పస సుధన్వుండు
నాహ్లాదచిత్తుఁడై యప్పుడిట్లనియె:
"ధర్మవిదుండవు తలఁపంగనీవు
అర్మిలిమావాదమటుదీర్పవలయు ;


నిజముచెప్పకయున్న నీమస్తకంబు
త్రిజగములెఱుఁగఁగ దివిజాధినాథు
కులిశంబువ్రచ్చు [53]నికుంఠితంబుగను
నెలవుమై." ననినఁ బ్రహ్లాదుండు వెఱచి
కశ్యపుకడ కేఁగి కమనీయనీర
జాస్యుఁడై పల్కె. యథార్థంబుగాను.
తగవిరోచనుని సుధన్వుని పలుకు
లొగిఁ దెల్పఁ గశ్యపుఁ డుచితోక్తిఁబలికె :
"సాక్షిదప్పఁగఁ జెప్పజాలినవారు
తత్ క్షణంబున మహీస్థలిలోని వరుణ
పాశబద్ధులనంగఁ బరఁగుదురెందు ;
దేశంబులందును దృఢముగా మఱియు
నన్యాయసభలోన నతులధర్మంబు (?)
విన్యాససభయందు వెలయదుగాన,
ధర్మంబు సభ్యులు దప్పకుండంగ
నిర్మలమతి నెందు నెఱిఁజెప్పవలయు."
ననినఁ బ్రహ్లాదుండు నతనికిట్లనియెఁ :
"దనర సుధన్వుండు నాతనయునికంటె
నుత్త ముం." డనిచెప్పియుఁడి మెప్పించె.
నత్తఱిఁ గశ్యపుఁ డాసుధన్వుండు
నరిగిరి ప్రహ్లాదు నభినుతింపుచును
బరమవిజ్ఞానులై పాటించిమించి.
మీరు ద్రౌపదియందు మెఱయ ధర్మంబు
గోరి [54]సెప్పు." డటన్నఁ గొలువువారెల్లఁ
బలుకకుండిరి; యంతఁ బాంచాలిపలికె:
"నలఘుమదీయస్వయంవర వేళఁ


దెఁఱగొప్ప ఛప్పన్న దేశాధిపతులు
వరుసతో గములుగావచ్చియున్నపుడు,
పెనఁగొని విల్లెక్కు పెట్టి బాణంబు
గొనకొనితొడుగంగ గుఱియేయఁబూన
నసమర్థులై తేజమణఁగి యందఱును
వెస మర్లిచూడంగ, వృత్రారిసుతుఁడు
నలవోక నావిల్లు నవలీలనెత్తి
యెలమితోడుత గుణమెక్కించి మించి
యలఘుఁడై బాణంబులైదు సంధించి
తలకొని మత్స్యయంత్రంబుపడవేసి
నన్నుగైకొనిపోవ, నరనాథులెల్లఁ
బన్ను గాఁ బై కొని పర్జన్యసుతుని
బాణజాలములను భరియింపలేక
యేణులగతిఁ బాఱిరేపెల్లఁబొలిసి,
నాఁటిరోషంబు మనంబుననుంచి
పాటించకివుడు నెపంబుసంధించి
సకల తేజంబులుఁ జదురొప్పునన్ను
నకలంకగతి నీదురాత్ముఁడై నట్టి
దుస్ససేనుండతిదోషవర్తనుఁడు
దుస్సంగి [55]చండాలదుర్మార్గుఁ డిట్టు
లవమానమొనరించె నాగ్రహంబునను.
ప్రవిమలయశులైన పాండునందనుల
చెలువనై గోవిందుచెల్లెలనంగ
వెలసియుండిననన్ను విరసంబునందు
నింతసేయుదురయ్య యీసభచూడ !
నెంతయు. " నని దుఃఖమీఁదుచుండఁగను


ద్రౌపదిఁజూచి శా తనవుఁడిట్లనియె :
"ఓపుణ్యసాధ్వి, నీలోత్పలనేత్ర,
నీవుపల్కిన ధర్మనిజవాక్యములను
దైవజ్ఞుఁడ ధర్మతనయుఁడె యెఱుఁగు ;
నితరులెఱుంగలే రెన్ని భంగులను,
అతిపాపచిత్తులై యవమానమిపుడు
వదలక నినుజేయు వారలందఱును
గొదలేక మీఁదఁ ద్రుంగుదురు గ్రక్కు నను. "
అనుచున్న సమయంబునందు నాసుదతిఁ
గనుఁగొని రోషించి కర్ణుఁడిట్లనియె:
"ఏవురుపతులు నిన్నీ జూదమునను
వావిరి విడిచిరి; వరుసనొక్కరునిఁ
గైకొను” మనుటయుఁ గౌర వేశ్వరుఁ
నాకంజనేత్రతో నప్పుడిట్లనియె :
“అంకంబునకు హరిణాంకబింబాస్య,
శంకింప కే తెమ్ము సంభ్రమంబునను. "
అనుటయు భీముండు నధికసాహసుఁడు
ఘనుఁడు కౌరవకురంగ మృగేశ్వరుండు
ప్రళయకాలమునాటి ఫాలాక్షుఁడగుచుఁ
బలికెను సభవారు భయమందిచూడ :

భీమప్రతిజ్ఞ

“ అధిక రాజ్యమదంబునందును గ్రొవ్వి
యధముండవోరోరి ! యతిదుష్టచరిత,
'వావివర్తన' లేనివాఁడవు సర్వ
కోవిదనిందితక్రోధచిత్తుఁడవు
దుర్మదుండవు జగద్ద్రోహివి పాప-
కర్ముండవగు నిన్ను ఖండింతుమీఁద.


పరమపతివ్రతఁ బాంచాలి నెట్లు
సరవి యెఱుంగక సభికులుదిట్టఁ
'దొడలమీఁదికిరమ్ము తొయ్యలి ! ' యనుచుఁ
గడుపాతకములై నకష్ట భాషణలు
పలికియుండితి; గానఁ బరమార్థముగను
గలనను నీయూరు కాండద్వయంబు
బలిమి నాగదచేత భగ్నంబుచేతుఁ;
దెలియంగ నిది నాప్రతిజ్ఞ లోకమున ;
నిక్షత్త్ర మొనరింతు నిన్ను నీవారిఁ
దత్ క్షణంబున. " నని దర్పితప్రౌడి
విలయకాలమునాఁటి వికలకృతాంతు
వడుపున రుద్రుఁడై పటుగదా ఖడ్గ
కాండాసనములున్నకడ చూచుటయును,
దండపాణి చలించె; ధాత భీతిల్లె ;
జగములు భయమందె; జలధులు కలఁగె;
నగములు వణఁకె ; పన్నగములు ముణిఁగె.
అపుడుశంకింపుచు నాసభ వారు
నిపుణోక్తులందు వర్ణించిరిభీము ;
తమయన్నయైనట్టి ధర్మజువదన
కమలంబుఁజూచి యాఘనునాజ్ఞ వేచి
యుండుచో భీముఁగుంభోద్భవ విదురు
లొండొండ భయభక్తియుక్తి నిట్లనిరి:
“శౌర్యంబుచూపెడి సమయంబుగాదు
కార్యంబుగావించు గతి యిదిగాని. '
యనుచు శాంతునిఁజేసి యట్లున్న యెడను,
దినకర తేజుని ధృతరాష్ట్రవిభుని
యనలహోత్రములాఱె నద్భుతంబుగను ;
గనుఁగొనఁ గౌరవాంగనలచిత్తముల


వ్యాకులతలు పుట్టె వరుస నందంద;
లోకనిందితు లతిలోభవర్తనుల
ధార్తరాష్ట్రుల గృహాంతరముల మొఱసె
ధూర్తశృగాలసందోహఘూకములు
మదధార లుడిగె సామజయూధములకుఁ;
గొదలేక ఘోటకాక్షుల నీరువెడలెఁ;
జుక్కలు నిల రాలె క్షోణి కంపించె;
మిక్కిలిరుధిరంబు మేదినిఁ గురిసె.
అట్టిమహోత్పాత మడరి పుట్టుటయు,
గట్టిగా విదురుండుఁ గలశజకృపులుఁ
దమలో విచారంబు దగఁజేసిరంత
సమచిత్తులై యొక్కసంస్థానమందు:
'నడుగక ధృతరాష్ట్రునకు నరిష్టంబు
పొడము నిశ్చయముగా భూము లెఱుంగఁ;
బాండవేయులతోడఁ బగపెట్టుకొనిరి
భండనంబునఁ జావఁబడుదురుగాక.'
అనవుడు గాంధారి యామాటలెల్ల
విని విదురునిఁ గొంచు వేగంబె పోయి
ధృతరాష్ట్రుముందట ధృతిఁబెట్టుటయును
నతిభక్తితో నాతఁ డన్నకు మ్రొక్కి:
"దుర్యోధనుఁడు చేయు దుష్కార్యములకు
నార్యసమ్మత, నీవు ననుకూలమైతి;
వేనెంత చెప్పిన నిచ్చలోఁ గొనక
మానవాధిప, మోహమగ్నుండవైతి;
కార్యంబుదప్పె నేగతి మీఁద నింకఁ!
గార్యంబు లెచ్చెను గౌంతేయులకును.
హరిసూనుచేఁ బవనాత్మజుచేత
దురములోఁ బడుదురు దుర్యోధనాది


కురువీరులెల్ల [56]సంకోచంబులేక ;
పరమార్థమిదియుఁ దప్పదు చిత్తగింపు."
మనవిని ధృతరాష్ట్రుఁ డంతరంగమున
నినిచినభీతితో నిట్టూర్పుపుచ్చి
తతితోడ నట సుయోధనుని రప్పించి
చతురోక్తినిట్లనె సభయెల్లవినఁగ :
"సతతంబుఁ బాండురాజాత్మనందనుల
మతివిచారింపక మఱచితి తప్ప ;
పరమపతివ్రతఁ బాండవసతిని
వరతపస్విని సత్యవతిఁ బుణ్యసాధ్వి
నిజగుణాకర నయోనిజఁ గంబుకంఠి
రజనీకరానన రాజీవనయన
మానవభామగా మదిలోనఁదలఁచి
మానవ, నీనవమాన మీసభను
జేసితి; దోషంబుఁజేసితివీవు ;
చేసితి దప్పంగఁ; జేసితికీడు;
పాపాత్ములను గూడి బాల్యంబునాఁటి
[57]చాపల్యమును మానఁజాలవు నీవు.
నీవుపుట్టఁగఁ బాండునృపతనూభవులు
ఏ వెంట దుఃఖితులెంతయునయిరి;
వారితోఁ బగగొనవల. " దనిబుద్ధి
నేరుపుతోఁ జెప్పి నెఱి సుయోధనుని
శాంతునిఁగావించి సకలాప్తనీతి
వంతులమాటలు వదలకవినుచు


ధృతరాష్ట్రుఁడు ద్రౌపదికి వరములొసగుట

ద్రౌపదిరావించి తనరనిట్లనియె :
"ఓపుణ్యవతి, సాధ్వి, యోసత్యనిరత,
కొమరారుచున్న మాకోడండ్రలోన
నమిత [58]పతివ్రత వతిసత్యవతివి ;
వరమిచ్చెదను నీకు వనజాక్షి వేఁడు
పరఁగంగ." ననిన ద్రౌపదియు నిట్లనియె :
"ఇలనాథ, వరమునాకీఁజాలుదేని,
దలఁపంగ ధర్మజుదాస్యంబుమానఁ
గృపసేయు." మనిన నాక్షితిపతి యిచ్చి
యుపమ వెండియుఁబల్కె నుచితభంగులను:
'ఇంకొక్కవరము నీకిచ్చితి నడుగు
శంకింప.' కనినఁ బాంచాలి యిట్లనియె:
"ధర్మజునలువురుతమ్ములు నెల్లఁ
బేర్మి దాస్యముమానఁ బెద్దయు నిచ్చి
హయ రథ గజ వివిధాంబరావళులు
ప్రియమున నొసగుము ప్రేమ వారలకు. "
ననుటయు ధృతరాష్ట్రుఁ డావరంబొసగి :
'వనజాక్షి, యింకొక్కవరము నీవడుగు
పరమార్థముగ, ' నన్నఁ బాంచాలిపలికె:
"వరవైశ్యసతికిని వరముదా నొకటి,
క్షత్త్రియసతికిని జర్చింపరెండు,
ధాత్రి శూద్రస్త్రీకిఁ దలఁపంగ మూఁడు,
పరమపవిత్ర సద్బ్రాహ్మణస్త్రీకి
వరములునూఱైన వడి వేఁడనగును;
కాన నాకిఁక వేఁడఁగారాదు వరము ;
భూనాథ, యీవరంబులురెండు చాలు."


అనవిని ధృతరాష్ట్రుఁ డతివ పాంచాలి
ఘనగుణంబులకును గడుసంతసిల్లి
పాండవాగ్రణిఁజూచి భక్తినిట్లనియె :
“దండితో నీవు నీతమ్ములుఁ గూడి
లాలిత సామ్రాజ్యలక్ష్ములయందుఁ
జాలభోగింపుఁడు సంతోషమునను ;
మునుపటియట్ల భూములవాని గొలువ
దనరంగ నేలుఁ డింద్రప్రస్థపురము.
ఎఱుఁగుదు ధర్మంబులెల్లను నీవు ;
కఱటినాతనయుండు కలుషమిత్తుండు
నీకుఁజేసినయెగ్గు నెఱయంగ మరువు;
లోకంబులో గుణశ్లోకులు ఘనులు
కైకొన రధములకష్టభాషలు ;
చేకొని మన్నింపు చెనఁటినాసుతుని.
ఏను బుద్ధులుదప్పి యిట్టిజూదంబు
పూనికావించితిఁ బుణ్యహీనుఁడను ;
గావున, నను వింతగాఁజూడవలదు;
పావనాచార, సౌభాగ్యసంభరిత,
మీతల్లి గాంధారిమిక్కిలిదలఁచి
[59]మాతలంపులెఱింగి మన్ననల్ చేసి,
దుర్యోధనాదుల దుర్గుణావళులఁ
గార్యముల్ గావని గైకొనవలదు.
విదురుఁడు మంత్రిగా వెలసిధర్మములఁ
బొదలినయట్టిసత్పుణ్యాధికుఁడవు.
కురుకులనిజరక్షకుండవుగాఁగ
సరవి మేలుగను రాజ్యముసేయఁదగుదు."


వని ధర్మజునినంప, హర్షంబుతోడఁ
గనకలతాతన్వి కాంత ద్రౌపదియుఁ
బురుషసింహముల నప్పుడు దనపతుల
నరుదుగా శాంతుల నందందచేసె.
ఆవేళ భీముండు నన్నకిట్లనియె:
"వావిరి ద్రుపదభూవరతనూభవను
అవమానమొనరించినట్టిశాత్రపుల
బవరంబులోపల భంజించి నిన్ను
నేలింతు ధర [60]యబ్ధియెల్లగా. " ననుచు
ఫాలాక్షశౌర్యసంపద మించియుండె.
మృగమధ్యముననున్న మృగరాజుభంగిఁ
దగసహోదరుల మధ్యంబుననున్న
యనిలతనూభవు నపుడువారించి
ఘనుఁడు ధర్మజుఁడు వేడ్కనునిట్టులనియె :
"ఎంతతప్పునకైన నీ వేళ నోర్చి
యెంతయు మీఁదటనేచి శాత్రవులఁ
దునుముద. " మనుచు బుద్ధులు చాలఁజెప్పె.
కనకరథములెక్కి కాంతయుఁ దారుఁ
బోయి యింద్రప్రస్థపురవరంబునను
బాయక సకలసంపదల నుండుటయు,
నాతఱిఁ గురురాజు నాదుస్ససేను-
చేత వృత్తాంతంబు చెనసి తా వినుచుఁ
దవనజ శకునిసైంధవులతోడుతను
నిపుణతఁదలపోసి నిశ్చయంబుగను
ధృతరాష్ట్రుకడకేఁగి తెలివినిట్లనియె :
"[61]ప్రతిభటావళి నెన్నిభంగులనైన


నణఁచుటయే నీతియని దేవమంత్రి
ప్రణుతికెక్కఁగఁజెప్పెఁ బర్జన్యునకును ;
సంతసంబునఁ బాండుజననాథసుతుల
కెంతమేలొనరింప హితులమా మనము !
పాములనలిగించి పటుకంఠమునను
సోమించి విడిచినచొప్పున మనము
నాసమయంబున నటువోవవిడిచి
మోసపోయితిమి భూములవార లెఱుఁగ.
వాసవి విల్లు తీవ్రముగఁబట్టినను,
భీముఁడుగదగొన్న , బిరుదులై కవలు
భీమాయుధంబులఁ బెరిమఁబట్టినను
హరిహరబ్రహ్లాదులైనను వారి
నరుదుగా సాధింవ ననిమొనలేరు;
కావున వారి వేగమునరప్పించి
ప్రావీణ్యమునను [62]బాపద్యూతమునను
గెలిచి పాండవులను క్షితివెడలంగ
నలుకతోఁ ద్రోవంగ నారూఢివలయు. "
ననుటయు ధృతరాష్ట్రుఁ డటుసమ్మతించి
మొనసి పునర్ద్యూతమును నాడఁదలఁచి

పునర్ద్యూతము ; అరణ్యగమనము

ప్రాతికామినిబంచెఁ బాండునందనులు
ఏ తేర సభకును హితవాక్యములను (?)
వాఁడుఁ బాండవులను వరుసతోఁ బిలువఁ,
బోఁడిమి ధృతరాష్ట్రుభూవరునాజ్ఞ
నరుగుదెంచిరి లీల హస్తినాపురికి ;
సరవిఁ దొల్లిటియట్ల సభపెద్దలెఱుఁగ


శకుని ధర్మజునితోఁ -------------
"సకలసామ్రాజ్యంబు సమధికార్థములు
ధృతరాష్ట్రభూపతి ధృతి మీకునొసగె
నతులితభంగితో నవియొడ్డవలదు ;
క్రొత్త యీపదము దిక్కులయందువినఁగ;
సత్తుగా జూదంబు సరవినాడంగ
నోడినవారలు నున్నతశక్తిఁ-
గూడి నిత్యమును సంకుచితమార్గమున
ద్వాదశాబ్దములు కాంతారమధ్యమున
మోదంబుతోఁ గందమూలఫలములు
భక్షింపుచును మహాబ్రహ్మచర్యమున
దక్షతవర్తించి, తఱితోడ నొక్క
వర్షంబు నజ్ఞాతవాసంబుచేసి,
హర్షజ్ఞులగులోకులటయెఱిఁగినను
వనమునఁ బండ్రెండువత్సరంబులును
మునుజరింపుచుఁ బదుమూఁడవయేఁట
నజ్ఞాత వాసంబు నటుసల్పువారు;
తద్‌జ్ఞతనొడ్డి జూదంబునీవాఁడ
నోపితివేనియు యుక్తితోనాడు
దీపించి." యనిన విధిప్రేరణమున
ధర్మనందనుఁడు జూదంబాడి యోడె
ధార్మికులును సభాస్థలివారు నెఱుఁగ.
పటుశుభాశుభకర్మఫలము లెవ్వరికి
నటనుభవింపక యరుగంగరాదు;
కావునఁ బాండవాగ్రజుఁడు జూదంబు
దైవికంబుగనోడి తమ్ములుఁ దాను
నడవి కేఁగఁదలంచి యఖిలరాజ్యమును
విడిచి సుహృద్బంధువిప్రులతోడఁ


బొదివి భీష్మద్రోణభూరికృపాది
విదురాంబికేయుల వీడ్కొనిపోవ,
నెదుట ధర్మజుఁజూచి యెంతయుఁబొగిలి
విదురుండుపలికె వివేకంబుతోడ :
"కాంతారములకు నేఁగఁగలేదు కుంతి
సంతతవ్రతశీల సాధ్వి కల్యాణి ;
అరసి పూజించెద నతిభ క్తియుక్తి
సరసత మద్గృహస్థలియందు నిలుపు ;
ధరవర్తనుఁడవు తర్కింపనీవు ;
దుర్మదారాతి సింధురమృగేంద్రుండు
భీముండు సంగ్రామభీముండు ఘనుఁడు ;
భీమానుజుఁడు రిపుపృథివీత లేశ
నికరవిదారుండు నీతిసాహసుఁడు;
నకులుఁడు శత్రుభూనాథభంజనుఁడు
కారుణ్యనిధి బంధుకల్ప [63]భూరుహము ;
ధీరుండు మఱి సహదేవుఁడుత్తముఁడు
పరమవిజ్ఞానసంపన్నుండు ఘనుఁడు;
తరుణిద్రౌపది దయాధర్మంబులందు
వెలసినసతి ; గాన విశ్వభూస్థలిని
బలియురు మీరలు భాగ్యవర్తనులు;
ఇతరులు మిము గెల్వ నెవ్వరు లేరు ;
వ్రతయుక్తు లనఘులు వ్యాసశిక్షితులు
విక్రమక్రములు గోవిందరక్షితులు;
శక్రునిగురువుతో సరియైనవాఁడు
ధౌమ్యుండు మీకు నుత్తమపురోహితుఁడు ;
సౌమ్యులు మీరు రాజశ్రేణిలోన


దైవమానుషములఁ దర్కింప నధికు
లీవసుంధరలోన నెన్నిభంగులను ;
చంద్రసూర్యులు గాడ్చు శమనుండు వహ్ని
యింద్రాదిదివిజులు నీశుండు హరియు
.......... ........... .......... .......... ..........
మిమ్మునెవ్వరును బేర్మిని గెల్వలేరు
ఇమ్మహిఁ గలరాజులెల్లఁ ; గ్రమ్మఱను
వైళమేతెంచి భూవలయమేలుండు
వాలాయముగ." నన్న వరుస ధర్మజుఁడు
విదురుని సద్భక్తివినుతించి పలికె:
"విదితకీర్తివి శాస్త్రవిదుఁడవు నీవు;
నీకృపగలుగంగ నేము లక్ష్ములను
బ్రాకటవిజయసంపదల నుండుదుము.
నీకడనుండును నెఱయంగఁ గుంతి
[64]శ్రీకర, యేమువచ్చెడియంతఁదాఁక."
అని విదురునియింట నటు కుంతినునిచి
యనఘులు కురువృద్ధులాజ్ఞగైకొనుచుఁ
బోవంగఁదలఁచి యప్పుడు భక్తిఁ గుంతి-
దేవిపాదములకు దృఢభక్తిమ్రొక్క,
నా [65]గొంతిదేవియు నాత్మనందనుల
వేగంబెగనుఁగొని వేదనఁబొంది
పలికెను: “వల్కలాంబరములు గట్టి,
నలువొప్పఁ గృష్ణాజినములు ధరించి,
మునివేషధారులై మునుకొని మీరు
చనియెదరా ! వనస్థలమున," కనుచుఁ
గన్నుల బాష్పాంబుకణములు దొరఁగ
విన్నఁదనంబున వెచ్చనూర్చుచును


అతులశోకాక్రాంతయగుచు నిట్లనియె:
"సుతులార, భానుతేజోమూర్తులార,
కదిసి మీ తేజంబు గాంచకముందె
సద [66]యాత్ముఁడైన మీజనకుఁడుత్తముఁడు
పాండుభూవిభుఁడేగెఁ బర్జన్యపురికి ;
నుండితినేటికి నుర్విలోపలను !
భర్తతోడనెగూడి పరలోకమునకు
స్ఫూర్తి నేఁగఁగనైతిఁ బుణ్యంబుతోన ;
మీమనోవ్యథలు పేర్మిని జూడవలసె
నేమి సేయుదు ! " నని యేడ్చుచునుండి
యెల్లవారునెఱుంగ నిట్లనిపలికె:
"బల్లిదులై ప్రతాపమున శోభిల్లు
పాండవేయులకునే బహుళదైన్యమున
నొండొండ వర్తింపుచుండంగవలసె;
ఓపుండరీకాక్ష, యోరమాధీశ,
యోపుణ్యమూర్తి, నీలోత్పలవర్ణ,
కరుణించు వీరలగౌరవంబునను;
నిరతంబు నీపాదనీరజాతములు
గొలుచుచున్నారు గైకొనిప్రోవఁదగును
విలసితంబుగ. " ననివేఁడియు మఱియు
" గాంగేయకుంభజ గౌతమ విదురు
లాంగికులుండంగ నక్కట ! యిపుడు
పాండుసూనులకు నాపదపొందవలసె
మండలంబునను సన్మానంబులేక ;
యురుదోషములకెల్ల నొడిగట్టినాఁడు
కురురాజు; సభవారు గొంకిరిమిగుల.”


ననుచు దుఃఖింపుచు నాకుంతి దేవి
ఘనుని సహా దేవుఁ గనుఁగొనిపలికె:
"అన్నలతో నీవునరిగెదవయ్య!
యున్నత శైలమహోగ్రాటవుల,
ఒక్కఁడ వీవైన నుండితివేని,
తక్కక తనయులందఱు నుండినట్ల
నాకు నెమ్మదిని మానసముండు." ననుచు
శోకించి ద్రౌపదిఁజూచి నేత్రముల
వారిధారలుగ్రమ్మ వరుస నిట్లనియె :
"సారసనేత్ర, పాంచాలువంశమును
బాండుకులంబును బ్రబలె నీకతన
దండిఁబుట్టుటను మోదమునఁజొచ్చుటను
పురుషగోరాజులు భూనుతపుణ్య
పురుషులు ఘనులు నీపురుషులు ; వీరి
చిత్తముల్ రాగిల్ల సేవలుచేయు
సత్తుగా భయభక్తిశక్తియుక్తులను. "
అని కుంతి దేవియు నా వేళయందుఁ
దనకు మ్రొక్కినయట్టి ద్రౌపది సాధ్వి
నాలింగనముచేసి యలర దీవించి,
చాలను బుత్త్రుల సరవి దీవించి,
సదయాత్మయైయుండె సాధ్వీలలామ
విదురుమందిరమున వెసవారు వినఁగ.

పాండవుల ప్రతిజ్ఞలు

అమితపరాక్రమాభ్యధికుఁడైయున్న
యమసూతితో భీముఁడపుడిట్లుపలికె:
"సాహసంబున రణస్థలమున నాదు
బాహుగదాహతిఁ బగఱఁజింపుదును


దుర్యోధనాదుల దుర్మదాంధులను
గ్రౌర్యచిత్తులఁ బాపకర్ముల శఠుల
నతుల కృతద్రోహులైన దుర్జనుల
మతిహీనులను మహామర్త్యనిందితుల."
ననుచు భీముఁడువల్క ; నా వేళయందుఁ
గనలి యర్జునుఁడును గడువడిఁబలికె:
"అంగజారికిని బాణాననంబైన
బంగారుకొండ నిర్భరరుచిమించు
కమనీయ మత్కర కాండానన-----
సమరరంగంబునఁ జంపుదు నేను
గర్ణాది దుర్జనాగ్రణుల నందఱను
నిర్ణయంబుగ దేవనివహంబు వొగడ.”
అనుటయు నకులుండు నధికరోషమున
గొనకొని పలికె: " నాకుంతంబుమొనను
సకలకౌరవసేనఁ జంపుదు నేను
నకలంకవృత్తి నుగ్రాహవంబునను."
అనిన సహాదేవుఁ డలిగియిట్లనియె:
“మును గపటద్యూతమున మమ్మునోర్చు
పాపాత్ము శకుని నాబాణజాలమున
నేపారఁ దునుముదు నిందఱునెఱుఁగ."
ననుచు నతిప్రతిజ్ఞారూఢులగుచు
ఘన కరిపురము వేగంబున వెడలి
పాండవేయులు పోవఁ, బటుధృతరాష్ట్ర
మండలాధీశ్వరుమందిరంబునను
నుదురుచు గోమాయువులు పట్టపగలు (?)
బెదరుచు నఱచెను భీషణంబుగను;
అప్రదక్షిణముగా నగ్నులువెలిగె;
నప్రియంబుగఁ బల్కె నాకాశవాణి ;


యెసగె నుల్కాపాత మెంతయు దివిని;
అసమాన విద్యుత్సహస్రంబు దోచె;
పర్వంబులేకయే పట్టె భాస్వంతు
దుర్వారశక్తితోఁదొనె రాహువును;
భూకంపమయ్యె; నప్పుడు సభవారు
నాకంపమునుఁ బొంది యటనున్నతఱిని,
బలికె నారదుఁడు సభాస్థలి వినఁగ
నలఘువాక్యముల నత్యద్భుతంబుగను :
"పదునాలుగగునేఁట భారతరణము
త్రిదశులెఱుంగఁగ ధీరతనగును;
పాండవేయులు ప్రతాపంబు రెట్టించి
చెండుదు రతిశక్తి [67]చెంది కౌరవుల;
విజయలక్ష్ములయందు వెలసియుండుదురు
భజనకెక్కినయట్టి పాండునందనులు
ఇదియథార్థం." బని యేఁగినపిదప:
'మదచిత్తుఁడగు కురుక్ష్మాపతికతన
నేయరిష్టముపుట్ట నిటమీఁదఁగలదొ!
పాయక.' యనుచుఁ గంపమునొంది కుంది
మదిలోనశంకించి మంత్రరక్షకుని
విదురునిఁబిలిచి భావించి యాలోన
ధృత రాష్ట్రుఁడంతటఁదెలిసి యిట్లనియె:
"నతిపుణ్యులైన ధౌమ్యాదులు గొలువఁ
బాండునందనులు ద్రౌపదిఁగూడి యెచట
నుండంగఁబోయిరి? యుచితమార్గమున."
అనుటయు విదురుండు నాధృతరాష్ట్రు
మనుజేశ్వరునిఁజూచి మహిమనిట్లనియె:


పాండవులరణ్యమున కేఁగిన విధమును
విదురుఁడు ధృతరాష్ట్రున కెఱిఁగించుట

“వదనసరోజంబు వస్త్రా[68]ంతమునను
బొదువుగాఁ గప్పుక పోయె ధర్మజుఁడు ;
బాహుయుగ్మముచాచి పవననందనుఁడు
సాహసంబుననేఁగె జగమెల్ల నెఱుఁగ;
నిసుముచల్లుచు నమరేంద్రసుతుండు
కొసరక చనియె సంకుచితమార్గమున ;
భూ రేణుపుంజంబు పొదిగినమేన
నారయ నకులుండు నరిగె శీఘ్రమునఁ ;
దొడరినలజ్జ నధోవక్త్రుఁడగుచు
నడరి సహాదేవుఁ డవలీలఁబోయె;
వెన్నుపైఁ గ్రుమ్ముడివెడలంగ నేఁగు
మిన్నక ద్రుపద భూమీనాథతనయ ;
కోమలకీర్తియై గురురౌద్రయామ్య
సామగానము రూఢిఁ జదువుచు నేఁగె
ధౌమ్యుండు జనులద్భుతంబందిచూడ.
సౌమ్యవర్తనమున సత్యవాక్యముల."
అనవుడు ధృతరాష్ట్రుఁ డావిదురునకు
మనమున వెఱఁగంది మఱియునిట్లనియె:
"ఈవిధంబున వారలేటికిఁజనిరి?
భావజ్ఞ, నాకుఁదప్పక యెఱిఁగించు."
అనవిని విదురుండు నాధృతరాష్ట్రు
జననాథుతోడను సరవినిట్లనియె:
"నీతనూభవులును నెఱయ దుఃఖముల
నీ తెఱఁగునఁబోదు రెంతయు ననుచు


యమసుతుఁడరిగె జింతాక్రాంతుఁడగుచు;
రమణ భీముఁడు 'సంగరస్థలమునను
జేతులుకసివోవఁ జెనసి శాత్రవుల
శాతాయుధంబులఁ జంపగఁగలను'
అనుచు బాహులుచాచి యరిగె వేగమున ;
'అని నింతకునుదఱచైనబాణముల
వెసవేసి రిపుల వావిరిఁద్రుంతు' ననుచు
నిసుముచల్లుచుఁ బోయె నింద్రనందనుఁడు ;
'తనరూపుచూచి భూతలమువారెల్ల
నొనర దుఃఖంబులనొందుదు' రనుచు
ధూళిగప్పినమేన దొరయంగ నేఁగె
నోలి నానకులుఁ డత్యురుపరాక్రముఁడు ;
'తనదీనవదనపద్మము విలోకించు-
జనులకు నెగ్గులు చాలంగఁబుట్టు'
నని యాననమువంచి యాసహదేవు
చనియె గూఢాచారసన్మార్గమునను ;
తడిసినయేక వస్త్రంబుతోడుతను
గడువడి వీడినకచభరంబునను
శోకంబుతో నేఁగె సొలసిద్రౌపదియు
'నాకౌరవస్త్రీలు నధిక దుఃఖములఁ
బొందుదు రిటమీఁదఁ బొ ' మ్మనునట్టి
చందంబునందును; సమరంబునందుఁ
బాండవేయులచేతఁబడుకౌరవులకుఁ
బాండిత్యమహిమను బరలోకగతులు
చేయింప సూచించుచందంబుదోప
నాయెడ నతిరౌద్ర [69]యామ్యాగమోక్తి


దగఁ బఠింపుచు నేఁగె ధౌమ్యుండు వడిని
దెగువతో " ననవుడు ధృతరాష్ట్రవిభుఁడు
శోకించి విదురునిఁజూచి యిట్లనియె:
"భీకరశౌర్యులు పృథివీశసుతులు
పాండ వేయులు జగత్ప్రఖ్యాతయతులు
చండాంశు తేజులు సజ్జనోత్తములు ;
వారలతోడ దుర్వారవైరంబు
కౌరవేశ్వరునకుఁ గడుసమకూరె;
ఎంత చెప్పిననైన నెఱుఁగఁడు ; బుద్ధి
మంతుఁడుగాఁడు దుర్మదుఁడునాకొడుకు ;
కడఁగి మీఁదను బ్రజాక్షయముగాఁగలదు
పుడమిపై." నని భయంబునుబొంది మిగుల
వెచ్చనూర్చుచు మనోవికలుఁడై యుండ,
నచ్చట సంజయుఁ డారాజుకనియె:
'పాండవేయులు ధర్మపరులనియెఱిఁగి-
యుండియుఁ దోలించితుర్విఁ [70]గానలకు ;
చేకొంటివీవ యీసృప్టీతలంబు ;
నీకును వగవంగ నిరతంబునేల!
కలశజ విదుర గంగాతనూభవుల
పలుకులు వినవైతి పరమార్థముగను ;
కర్ణ గాంధారులకఱపులు వినుచు
దుర్ణీతివంతుఁడై దుర్యోధనుండు
పగయయ్యెఁ గలశజ [71]ప్రముఖయోధులకు ;
మగఁటిమిఁ బాండుకుమారులతోడఁ
దొడరుఁగా కేమి పొందుగ నీసుతుండు,
తడయక యింక నీతనయుండు దక్క


గురుభీష్మవిదురులఁగూడి నీవరిగి
కరమర్థిఁ దో తెమ్ము కడఁగి పాండవుల
వెరవొప్ప నీవింక విచ్చేయకున్న,
నెఱుఁగుదురే యొరు లీకార్యమునకు
నఱిముఱి." ననవుడు నావిదురుండు
తఱితోడ నపుడట దగ్గఱవచ్చి
ధృతరాష్ట్రుతోడను దెలియనిట్లనియె:
"క్షితినాథ, మిక్కిలి చింతింపనేల!
పటుకృప నీయెడఁ బాండునందనులఁ
దటుకున రప్పించి ధారుణీతలము
పంచిమ్ము సగఁబాలు ప్రఖ్యాతముగను;
వంచించి వారికి వసుధయీకున్న,
మెత్తురే! నిన్నును మేదినిలోన
నుత్తములెల్ల నత్యుచితోక్తి." ననిన
జనపతి విదురుభాషణములు వినియు
వినకుండి, విపినప్రవేశులైనట్టి
పాండవేయుల ధర్మపరుల రావింప
కుండె నుపేక్షించి యొగిఁ గిల్బిషమున.
ద్రోణుండు పాండుపుత్త్రులకు నందఱకుఁ
బ్రాణపదంబయ్యుఁ బస వారివెంట
నరుగఁడ; ద్రుపదరాజాత్మసంభవుని
దురమున మీఁదట దునిమెడికొఱకుఁ
గలశజుఁడుండెను ఘనతరప్రీతి
వెలయంగ ధృతరాష్ట్రవిభునిసన్నిధిని.
తదనంతరంబ యింద్రప్రస్థపురము
ముదమున నిరువదిమూఁడేండ్లునిండఁ
జెలఁగి రాజ్యమ్మునుజేసి, జూదమున
నెలమితో నోడి, యయ్యెడ పాండుసుతులు


అడవికిఁజనిరి బ్రాహ్మణసహస్రములు
కడువడి నేతేర గౌరవంబునను.
అనుచు సభావర్వమందలికథలు
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపించి శాస్త్రోక్తివిఖ్యాతముగాను
మునిసహస్రంబు లిమ్ములఁ బ్రస్తుతింప.
పంచఘంటానాద, పాండవాహ్లాద,
పంచాస్త్రసమశౌర్య, భర్మాద్రిధైర్య,
శ్రీరంగయామాత్యశేఖరపుత్ర,
కారుణ్యనిధి, దానకర్ణావతార,
శ్రీయనంతామాత్యశేఖరోత్తంస,
కాయజసమమూర్తి, కమనీయకీర్తి,
ధర్మసమగ్రంబు తలకొన్నయదియుఁ
బేర్మిఁ బుణ్యంబులఁ బెనుపొందునదియు
నసమసాహిత్యవిద్యాచతుర్ముఖుఁడు
రసికుండు బాలసరస్వతీశ్వరుఁడు
పసనొనర్చిన సభాపర్వంబునందు
నసదృశంబుగ ద్వితీయాశ్వాసమయ్యె.


ఇది సభాపర్వము.

  1. ధైర్యమునకు హిమవంతునివంటివాఁడని కవియూహ కాఁబోలు !
  2. ఈపదమునీతఁడు పదింపది గాఁ బ్రయోగించును : సభ్యులనియూహయా!
  3. నీతు.
  4. ఉడుగు.
  5. చూడంగ. (మూ)
  6. ద్రోణుండుండంగను. (మూ)
  7. ననంగ. (మూ)
  8. మృతులగుదురనునర్ధములో నిట్టిప్రయోగము శ్రీనాథునిరచనయందును గలదు.
    'మాటనాల్కనయుండంగ మరణమయ్యె. ' కాశీ , 5 అ, 154 ప.
  9. నర్హంబులవనిలోపలను.
  10. త్ముని యిందిరాధీశు. (మూ)
  11. సునాముండు. (మూ)
  12. 'ఛాందస' మను వ్యావహారికపదానుసరణముగా నైష్ఠికత్వమను నర్థములో నీయపశబ్దమును బ్రయోగించియుండును.
  13. 'పూతకింజంపిన పూజ్యసంఘముల - రీతిభేదించి గిరికేలనెత్తి'. అని యీపాదములిట అనన్వితములుగా మూలమునఁగలవు. "పూతనాఘాతంబు చేత నేతరమైన...” అనుపద్యము పైరచనకాధారమైయుండును. చూ.నన్నయ, భా.సభా. 2 అ. 41. ప.
  14. పూత.
  15. పోదెందు. (మూ)
  16. వారికి. (మూ)
  17. కులశత.
  18. రైవతానగంబునను. (మూ)
  19. లోధారుణీజంబునందు (మూ) చూ. నన్నయ, సభా. ద్వి. ఆ. 79 ప.
  20. గ్రంథపాతమైయుండును. చూ, నన్నయ. భా.
  21. వెన్ననినాళ్ల. (మూ)
  22. 'సకలధరణిరాజ్య భోగసుఖపరాఙ్ముఖత్వముఁ బొంద నేల.' అని నన్నయ. సభా. ద్వి. అ. 102. ప. నన్నయభారతముననుకరించియు, నీరసిల్లఁజేసిన రచనా భాగము లిట్టివింకను గలవు.
  23. దివ్యవీతేంద్ర సుస్థిర చంద్రకీర్ణ-మరకతవస్త్ర సమానితహరులు. (మూ) 'ఇంద్రనీల....పిక చంద్ర... కీరవర్ణతురంగంబులను, , అని. నన్నయ, సభా. ద్వి. ఆ. 113గ.
  24. కాని+అప్రియుము.
  25. తిరుగ. (మూ)
  26. మన్నింపుచుండును. (మూ)
  27. కలిప్రవేశసమయమని కాఁబోలు కవియూహ! 'కలి ద్వాపరసమీపంబగుటయు.' అని. నన్నయ.
  28. వంతుండు. (మూ)
  29. నేమంబులకును. (మూ)
  30. చూచునప్పటికి. (మూ)
  31. ద్యూతాహ్వానమునకై విదురుఁడుపోయినపుడు, పాండవులయొద్ద కృష్ణుఁడున్నట్లు వ్రాయుట, వ్యాస నన్నయ భారతవిరుద్ధము.
  32. భాత. (మూ)
  33. పద్మాదినవనిధానములని కాఁబోలు కవియూహ.
  34. ఉత్సంగతలమునం దుగ్రవిషోరగంబున్నట్లు నీవు మాయొద్దనునికి. అని నన్నయ.
  35. క్షీణాయుష్కులనునర్థములో నపశబ్దముఁ బ్రయోగించియుండును.
  36. ప్రియంబై యుండు దూషభాషణలు.
  37. రాజితతతులు. (మూ)
  38. వికలచిత్తుండగుచు. (మూ)
  39. వికలవ్యులై.
  40. భూపతుల. (మూ)
  41. నడుగక. (మూ)
  42. బలవత్కారమున.
  43. పటికీర్ణవేణి.
  44. నోడి. (మూ)
  45. నస్థులు.
  46. వర్తనులు.
  47. బాధ్య. (మూ)
  48. గాననాద్రౌపదియును (మూ)
  49. అధర్మవిజితయని. నన్నయ. సభా. ద్వి. అ. 229. గ.
  50. దుర్యోధనుఁడు కర్తఆధ్యాహార్యము.
  51. దరళి. (మూ)
  52. తతు ........ ధర్మంబు ? (మూ)
  53. నంకురితంబుగాంగ.
  54. సేయు. (మూ)
  55. చాండాలి. (మూ)
  56. సంకోశంబుతోడ.
  57. చాపలత్వము. (మూ)
  58. పాతివ్రత్యమతి. (మూ)
  59. మాతలం పెఱింగి మన్ననల సేవించి. (మూ)
  60. యెల్ల.
  61. ధృతి. (మూ)
  62. అనుద్యూతమని. నన్నయ. పునర్దీవ్యాయభద్రంతే. అని. వ్యాస. భా.
  63. భూజనుండు. (మూ)
  64. శ్రీకేళి.
  65. కుంతి. (మూ)
  66. యాంగు. (మూ)
  67. చెది (మూ)
  68. ర్ధ. (మూ)
  69. యాయాగ. (మూ)
  70. వారలను.
  71. ప్రకర. (మూ)