ద్విపద భారతము - మొదటిసంపుటము/ఆదిపర్వము - సప్తమాశ్వాసము

సప్తమాశ్వాసము


శ్రీకర, శ్రితకల్పవృక్షావతార,
పాకశాసనభోగ, భవ్యసంయోగ,
నీలవర్ణునిమీఁద నిజమైన భక్తి
కీలుకొల్పెడువివేకీ చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్రమిట్లని చెప్పఁదొడఁగె.
అంత నావైభవంబంతయుఁ జూచి,
శాంతితో హరిచూడ శమననందనుఁడు
కవలిరువురుఁ దాను గ్రక్కున లేచి
జవమొప్ప బోయెఁ బాంచాలి రానమ్మి.
విల్లు వంపఁగరాక విఱిగిన సిగ్గుఁ,
బల్లవాధర విప్రుపాలై నసిగ్గుఁ,
బ్రజలుమెచ్చక తమ్ముఁబలికిన సిగ్గు
నిజమనోవీథుల నిగుడఁ బార్థివులు
కలశాబ్ధి కల్పాంత ఘనపవనమునఁ
గలఁగినట్లు కలంగి కడుఁ దమలోన:

అసూయ చే ద్రుపదుపైనెత్తివచ్చిన రాజుల


విజయుఁడు పరాజితులఁ జేయుట



"మనలం బాంచాలుండు మాయలుపన్ని
తనయస్వయంవరోత్సవమని కూర్చి,
మంత్రసిద్ధుండైన మానవుచేత
యంత్రంబుసేయించి యటుగన్యనిచ్చె.


చదురులు మనతోడఁ జనునె యీతనికి!
గదనోర్విఁ గూలము కలుషాగ్నులుడుగ."
అని యేకయత్నమై యరదము ద్విరద
మనుపమాశ్వములు జోళ్ళాభరణములు
విలు కోల మొదలుగా వీరయత్నములు
వెలయ సన్నద్ధులై వేల్పులు బెదరఁ
గమలజాండంబల్లకల్లోలపడఁగ
సమకొన్న భేరినిస్సాణముల్ మ్రోయ
[1]సమవర్తి సంవర్తచండమార్తాండ
సమరేఖ నస్త్రశస్త్రంబులు మెఱయ
నార్చుచుఁ బాంచాలునరికట్టుకొనినఁ,
జర్చింప నసమానసమరమై యతఁడు
క్షాత్రతేజముమించి జయముతోనున్న
శ్రోత్రియసభమాటు చొచ్చెెఁ; జొచ్చుటయు,
విప్రు : "లహో! యేల వెఱచెదు ద్రుపద!
క్షిప్రము తుమురుచేసెదము పార్థివుల.
నడినెత్తు లడతుమా! నలిపుస్తకముల;
మెడలు బిగింతుమా! మీఁదిధోవతుల;
దండంబులున్నవి; దర్భలు చాలు;
నొండొండ మంత్రింప నుదకంబుగలదు;
హుంకారముల శక్తియొకవంకఁ బొదలఁ
బొంకంబు చెడదు తపోవైభవంబు;
[2]మొగమోటములుమాని మూఁకలకుఱికి
[3]యగలింతుమా! సేనలటునిటు పడఁగ.”
అనునంత, నర్జునుం డఱనవ్వునవ్వి :
"పనివడి మీరేల పలికెదరిట్లు!


ఉవిద నేఁ గైకొన్నయుడుకునఁ గాదె!
తివిఱెదరిట్లు ధాత్రీపతులెల్ల.
నాకాంక్షఁదీర్తు; రంభాదికామినులఁ
గైకొనఁజేసెదఁ గ్రమముతోడుతను ;
ధృతి నన్ను నాశీర్వదింపుఁడు చాలు
జతురత ద్రుపదరక్షణ మేనొనర్తు."
అని యర్జునుఁడు విప్రులనుమతివడసి,
తనకుఁ బాంచాలుండు తగనిచ్చినట్టి
సమరోచితాస్త్రశస్త్రములు ధరించి,
కమనీయకవచంబు గైకొని యపుడు
చలియింపకుండఁ బాంచాలి వేఱొక్క
స్థలముననుంచ ధృష్టద్యుమ్నుఁబనిచి,
భీమసహాయుఁడై పృథివీశకులముఁ
జీమలకంటె సూక్ష్మించి చూచుచును,
శరములేయుచుఁ బల్కెశక్రనందనుఁడు :
"హరిణాక్షి రాదింక నాలంబులేల!
చాలుమీయలుక! పాంచాలుపై [4]నుఱుకఁ
బోలునే! యతడేమి బొంకె మీయెడల!
గుఱియెవ్వఁడేసినఁ గూఁతునీఁగోరి
మఱికదా రప్పించె మక్కువ మిమ్ము!
జనకుండు నిలుపఁడా! జానకికొఱకు
ననలాక్షువిల్లు బ్రహ్మాభేద్యముగను;
మీకు సత్వంబున్న మృడునిపైనలుగుఁ;
డీకలహమున మీకేది జయంబు!"
అనుడు మార్గణవృష్టి నందఱు ముంప,
మనుజేంద్రు నావృష్టి మరలించి నిలిచి,


నలుఁగడనిగుడు బాణప్రవాహములు
కలనువట్టని పాటి క్రందునఁబఱపి,
“యదెపోయెఁబోయె భీమానుజుం డనుచుం
త్రిదశులు దివిఁజూడ ద్విజకోటియాడ,
నాతిధైర్యమువీడ, నారదుఁడాడ,
[5]నాతూపు నెఱినాడ, నతఁడల్కతోడ
[6]నగి పెద్దలడుగుప్రశ్నములకు సరిగఁ
దగ యాజ్ఞవల్క్యుఁ డుత్తరమిచ్చినట్లు
కౌరవ కాళింగ గౌడాంగ వంగ
కేరళ కేకయ [7]కీచక సాళ్వ
చేది జరాసంధ సింధు గాంధార
వైదేహ బాణప్రవాహంబు లెల్ల
ఘోరాస్త్రతతియను కుంభజుచేతఁ
బారణసేయించి పార్థుఁడుప్పొంగె.
[8] (అప్పుడు శల్యుండు నంగాధిరాజు
ముప్పిరిగొనుకోపమును సంభ్రమంబు
నీనును గదురఁ దీవ్రేషుజాలముల
నేసిరాపవనసురేంద్రనందనుల;)
ఏయుచో నొక్కమహీజమ్ము వెఱికి
వాయునందనుఁడును వారిపైఁగవిసె ;
వారిరువురు నంత వజ్రసంకాశ
ఘోరబాణంబులు గురిసిరి మిగుల;
ఆపవనజుచేత నరిరాజసేన
చాపకట్టై త్రెళ్లె సమరమధ్యమున.
రణభూమి యీక్షింపరాక దేవతలు
మణివిమానములెక్కి మరలిరి దివికి.


అన్యోన్యశరధార లనలంబు లీనఁ,
గన్యావిహహాగ్నిగతి మండుచుండె;
లాజలగతి హారలత లందుఁదునిసె;
రాజరక్తం బాజ్యరాజి[9]గా దొఱఁగె;
విసిరి భీముఁడువ్రేయ విఱిగినరథము
లసమున సమిధలై యాయగ్నిఁబడియె;
ఆసర్వనృపుల వీరాలాపరవము
రాసియై వేదమంత్రధ్వనిఁ బోలెఁ ;
బదిటఁ బదారింటఁ బండ్రెంట రెంటఁ
బదివేలు లక్ష తప్పనిసాయకముల
నాటింపఁ, జూచి సైన్యములురోషమున
మీటుగల్గినయట్టి మెఱవడితోడఁ
గరివాఁడు హరివాఁడు కాల్నడవాఁడు
నరదంబువాఁడునై యాశ్చర్యలీల
సవ్యసాచిరథంబు సందీక పొదివి
సవ్యాపసవ్య శస్త్రంబులఁ గప్ప,
వాయుజుండును సైన్యవారిధిమీద
బాయక బడబాగ్ని పడినట్లు గదిసి,
తాపులుఁదోపులు దప్పఁ గావించి,
వీపుల దాపల విఱుగఁ ద్రొక్కుచును,
వాటుల వ్రేటుల వడిఁ బాఱమీటి,
మీటుల గూటుల మెల్లెవాపుటను
గలగుండువెట్టి, దిక్కరిచొచ్చికలఁచు
కొలనుసేసిన, గండుగూలి యబ్బలము
అర్జునుపసవ్రేట్ల నాభీమువాట్ల
జర్జరితాంగులై జడియఁజొచ్చుటయుఁ,
 


గర్ణాదు [10]లొక్కఁడొక్కఁడ యేనికెక్కి
తూర్ణవైఖరి భీముతోఁ బార్థుతోడ
సమరంబుసేయ, నాచండాస్త్రవృష్టి
గమలబంధుఁడు [11]డాఁగి కమ్మెఁజీఁకట్లు;
అరుణరత్నాభ సంధ్యారాగ మెసగెఁ;
గరికుంభదళిత ముక్తాతారలడరె;
నిబిడహుంకృతి ఘూకనినదంబు లెసగెఁ;
బ్రబలి బాణాంధకారము పెచ్చుపెరిగె;
ధరణీశ్వరుల మోముదమ్ములు మొగిడెఁ;
గరమొప్పఁ బ్రతిపక్ష కలకలంబడఁగె;
ఘనభూతమిథున చక్రంబులు గూడె;
ననిమిషేక్షణ చకోరావలి చెలఁగె;
వదల కెల్లెడ బాణవాయువుల్ వీచెఁ;
గదనమొప్పె నకాలకాళరాత్రగుచు.
దేవేంద్రుఁ డమరావతీకవాటములు
వేవేగఁ బెట్టించె విజయాస్త్రభీతి.
పెండ్లికి [12] వచ్చినపెంపేది రంభ
పెండ్లికేఁగిరి భటుల్ బీభత్సుఁడనుప.
రథములువిఱిగి, వారణములు దొఱఁగి,
పృథివిపైఁ బీనుఁగుపెంటలై పడియె.
అట్టిచో శల్యుఁడాహవదక్షు ననిలు
పట్టి నార్చుచు నిల్వఁబట్టిన, నతఁడుఁ
దనకాలఁ దగిలినతామరనూలు
వనకరి గొననికైవడిని గైకొనక
తానంత శల్యునిఁదగులఁబట్టుటయు,
లోనయ్యెఁగీర్తికి; లోనయియతఁడు


విడిపించుకొని భీమువ్రేయుచో, నతఁడుఁ
గడిమినాతనిలావు గైకొని తెలిసి
తానట్లు వ్రేయ నాతండుమూర్ఛిల్లె.
జానొప్ప వేవేగ శల్యుండు గదిసి
మల్లయుద్ధమునకు మఱి తొడఁబడినఁ,
బెల్లార్చి భీముండు పృథివిపై కొంత
సదవుచ్చుకొని రెండుసగములుచేసి,
వదలక యవిరెండు వంకలఁజిమ్మి,
కనుమోసమునఁజొచ్చి కచ్చయు మెడయుఁ
బెనఁగొన నిరుగేల బిగియంగఁబట్టి,
కాలుకాలగ్రహించుగతిఁ జూచి, శల్యుఁ
డాలోనఁ గడు భీము నడఁగఁబట్టుటయు,
మంచుననిలువని మార్తాండు పగిదిఁ
బొంచినబంధనంబులు ద్రెవ్వ నిలిచి,
ననిలునాత్మఁదలంచి యనిలనందనుఁడు
ఘనశక్తి నిరుగేలఁ గబళించి యెత్తి,
మలయవైచినయట్లు మహిఁద్రెళ్ల వైవఁ
గలకల నవ్విరి కన్నవారెల్ల.

అర్జునుఁడు కర్ణు నోడించుట



కానీనుఁ డట పార్థుఁగట్టల్కఁదాఁకి
నానాస్త్రములు మేననాటి యార్చుటయు,
సింహంబునకుఁ బ్రతిసింహ మన్యోన్య
సంహారమతిఁ దోచుచందంబు దోచె.
ఆవేళఁ జూచుసైన్యము లిరువురను
భావించు తమలోనఁ బలుకుదురిట్లు,
"ఈతండు నీతండు నేమౌదురొక్కొ!
చాతుర్యరేఖల, సరివచ్చినారు;


పోలికలిట్టివీభువినెన్ని లేవు!
వాలంపవాన సర్వముఁగానవచ్చు;
[13]నంటిన భావమెన్నఁడునిరువురకు
వింటలే; దిదియెందు [14] విన్నది లేదు;
కుడువఁబోవుచునేలకూరాకులడుగఁ
దొడిర;" మ్మనుచునుండఁదొడరి రిర్వురును.
బలశిలీముఖ[15]శాతభల్లనారాచ
విలసార్ధచంద్రాది విశిఖంబులేసి,
యొండొరుచాపంబు లొండొరుపడగ
లొండొరుకవచంబు లోలి ఖండించి,
ధనువులు నాలోన ధరియించునంత,
నినతనూజుఁడు ఫాలమేడింట గ్రుచ్చి
కోదండగుణ మొక్కకోలఁ ద్రుంచుటయు,
మోదించి చిఱునవ్వు మొలవ నర్జునుఁడు
నారిగైకొని నాల్గునారాచములను
వారిజాప్తతనూజువక్షంబు నాటి,
మూఁడువాలమ్ముల ముఖవీథిగ్రువ్వ,
వాఁడర్జునునిగ్రుచ్చి వాఁడితూపులను
పటుతరనారాచపంక్తులీరీతిఁ
దటుకుననేయుచో, దగనర్జునుండు
సరికక్షనిలువక శాతనారాచ
నిరవధి [16]వృష్టి నించిన,మూర్ఛఁబొంది
భానుతనూజుండు వడివడిఁ దెలిసి
యూనిననెత్తుట నుదయార్కురీతిఁ
బగులుమేనికిఁగాక పడగకుఁగాక
తెగుసారథికిఁగాక తేరికిఁగాక


గాలివానఁజరించు కారాకువోలెఁ
జాలఁదూలి చలించి శక్రజుఁ బలికె :
"నన్నిట్లుమార్కొని నడుఁకక నిలిచి
కొన్నిబాణములేయఁ గుంభినిమీద
హరిసూనుఁడోపు శ్రీహరియోపుఁగాక
బిరుదుల మూఁడవపేరు నేనెఱుఁగ.
నీవెవ్వఁడవు నాకు నెఱిఁగింపు తొలుత;
చేవేఁడి మఱికాని నేయ నీమీఁద;
నిజవిద్య మఱికాని నెఱప నీ మీఁద;
ద్విజమాత్రుఁడవొ! కాక [17]ధృష్టతె?"ట్లనిన
ననిమిషేంద్రుని పుత్రుఁ : “డాప్రసంగంబు
వెనుకచెప్పెదఁగాక; వినుము నిన్నిపుడు
తల దునుమకమానఁ దప్పించుకొనుము:
పలుకులతో నిఁకఁ బనిలేదు కర్ణ!”
అని వేగ మీఁద దివ్యాస్త్రంబులేయ,
ననిఁ గాలువొందక యతఁడువణంకి
'విప్రుని నిన్నేయ వెఱతునే' ననుచు
క్షిప్రవైఖరిఁ బాఱె సేనలు చెదర.
ఆకర్ణశల్యులిట్లైన విస్మయము
గైకొని యిట్లనుఁ గౌరవేశ్వరుఁడు :
“ఆలంబులోఁ గర్ణునలయించి తఱుమఁ
జాలునెయొకఁడు! వాసవిచాలుఁగాక;
లోపంబులేక శల్యునిఁద్రెళ్లవైవ
నోపునేయొకఁడు! వాయుజుఁడోపుగాక;
ఉఱికెదవీరిపై నొగి విప్రులనక
నఱికెద; నావెంటనడువుఁడీ దొరలు.


అనఘులార ! యనిత్య మధ్రువప్రాణ
మనుమాన [18]మీచందమన మున్ను వినరె!”
అనియార్చి కవయుచో, హరివారికనియె:
"జననాథ, యీవృథాసాహసం బేల!
కరమెన్నఁ దమకు శక్యముగాని పనికి
జొరక నెమ్మదినున్కి సుమతికి మనికి.
విలువంచినప్పుడే వీరలబలిమి
తెలియవు నీ కేమి తిక్కపట్టినదొ!
ఇరువురుగూడినా రిలకెల్లఁగలరు;
వరుస నెవ్వరు తోడువత్తురో వెనుక!
దొఱఁకొన్న విరిపాటి దునియదు రణము;
మరలుటకార్యంబు మాకుఁ జూచినను."
అనిచెప్ప హరిమాట లతఁడు పాటించి
తనవీరసైన్యంబు తప్పకత్రిప్పి,
పనిగానిసిగ్గునఁ బట్టణంబునకుఁ
జనుచు [19]మేలందినజాడగా నడచి
కరిపురికరిగినఁ, గలరాజులెల్ల
మరలిరి తమతమ మనికిపట్టులకు.
తనియ దక్షిణలిచ్చి తమగ్రామములకు
ననిచెఁ బాంచాలుండు నంత బ్రాహ్మణుల.
ఇట భీమపార్థులు నింతిఁ దోడ్కొనుచుఁ
బటువేషములతోడ వచ్చిరి మరలి.
కుంభినీపతులిట్లు కోమలిఁగొనుచుఁ
గుంభకారులవాడ గొమరొప్పఁ జొచ్చి,
తమవిడిసిన [20]యింటిద్వారదేశమునఁ


అర్జునుఁడు ద్రౌపదినిఁ దల్లికి నివేదించుట



గొమరొప్పనిలిచి: "యోకుంతి! ముదంబు
లూరఁగ నటపోయి యొకభిక్ష దెచ్చి
నారమిచ్చటి;" కన్న నాతి: వేవేగఁ
గొదలేక భిక్షు యేగురుఁ బంచుకొనుఁడు
మొదలనెట్లట్ల,”ని మునుముట్ట నాడి
వెలుపలకేతెంచి వీక్షించునపుడు,
నెలకొన్న పండువెన్నెలసోగవోలెఁ
బూని వర్షమువెంట భువిడిగ్గి మరలఁ
గా నేరకున్న తొల్కరిమెఱుఁగువోలె
దూరఁ జెందొవరేకుదొనఁ జోటులేక
జారిన పంచాస్త్రుశరమును బోలెఁ,
జెదరక శుక్రుసంజీవనివలన
బ్రదికిన బంగారుప్రతిమయుఁబోలె
నభినవశ్యామాంగి యలినీలవేణి
త్రిభువనలక్ష్మి యత్తెఱవయుండంగ,
వీక్షించి యానందవివశయైకుంతి :
"ఈక్షితిఁ గంటినే యిటువంటికొత్త!
ఇందుఁజూచి కఱంగు నిందుకాంతముల
పొందునఁ గన్నులీపొలఁతినెమ్మోముఁ
గనుఁగొని హర్షాశ్రుకణములు విడిచె;
వినక కానక యేల వీరినిట్లంటి!
నెప్పుడు నన్నట్టులే వీరినంటి;
నిప్పువ్వుఁబోఁడి చొప్పెఱుఁగలేనైతిఁ ;
జయ్యన మీదువిచారించి కాని,
యెయ్యెడఁ బలుకుట యిదికార్యహాని.
తనయులురారని తలఁకుచునుండి
మనముచలించి యామాటలాడితిని.


ఏవుర కొకయింతి యిదియు నక్రమము!
నావాక్యమునుదప్పి నడవ రెన్నడును;
ధర్మమేగతినుండెఁ దలకూర్తు" ననగ
ధర్మరాజంత నంతయు వినివచ్చి,
తమ్ములుఁ దానును దల్లికి మ్రొక్కి,
తమ్ములఁ జూచి యా ద్రౌపదిఁ జూచి,
హరినూతినిట్లను: "నర్జున, నీవు
వరియింతుగాక యీవామాయతాక్షిఁ,
జాపచాతురిఁగాదె చనుదెంచె!” ననఁగ,
నాపుణ్యుం: “డిట్లేలయానతిచ్చెదవు!
అన్నవునీవుండ నర్హమా! నాకుఁ
గన్నియ మున్నాడికైకొన దేవ !
మీరు వరింపుఁ డీమృగరాజమధ్య;
నేరూపమున మాకు నిదిమనోహరము.
............................................
అనుఁగాక యేమి, మృగాక్షి యేవురకు
మనమున నభిలాషమగ్నయైయుండు.”
............................................
నావిధంబంతయు యమసూతి యెఱిఁగి,
దేవేంద్రసుతుఁజూచి తేటనవ్వమర :
"నేవురు వరియింత మీ పువ్వుఁబోఁడి;
నేవెంట గురువాక్య మేటికిఁదప్ప!
కుంతి 'యేగురుఁబంచుకొనుఁ' డన్న మాట
యెంతయుఁబాటింత మిది దాటరాదు.
భావింప నిదిధర్మపథముగాకున్న
నేవురకును బ్రేమ యిందేలమొలచు?
వ్యాసమహాముని వాక్యంబు లెల్ల
మోసమే! మనకుధౌమ్యుఁడుఁ జెప్పెనిట్లు."


కృష్ణుఁడు పాండవులఁ జూడవచ్చుట


అనునంత, రామసహాయుఁడై శౌరి
కనకరథంబున గరుడాంకమమర
[21] మేదినిడిగ్గిన మేఘమోయనఁగ
నాదినారాయణుండచటి కేతేరఁ,
దమకుఁబ్రాణముగాన దైత్యారిరాక
కమర మేనులువొంగ నతిసంభ్రమముస
నాచారములు సేసి, యర్హపీఠముల
[22]నాచారుమూర్తుల నర్థిఁబూజించి,
సేమంబులడుగుచు శ్రీకృష్ణుఁజూచి
భీమాగ్రజుఁడుపల్కెఁ బ్రేమరెట్టింప :
"లక్కయింటికిఁదప్పి లక్ష్మీశ, యేము
తక్కకవెడలి యీధాత్రి నేరికిని
వివరింపఁగారాక విప్రవేషములు
నివిడివర్తించుచో నీవెట్లుగంటి?
భువనంబులన్నియుఁ బుక్కిటనిడిన
దివిజవంద్యుఁడవీవు తెలియనిదేది!”
అనినఁ గృష్ణుఁడుపల్కు : "నమరులకైనఁ
గనుఁగొనఁ బనిగొనఁగారానివిల్లు
నృపతులందఱుఁజూడ నీసహోదరుఁడు
చపలాక్షికై వంచె సత్వంబుకలిమి
ఇట్టిచేఁతల మిమ్ము నెఱుఁగుట యరుదె!
పట్టిచూడఁగరాక ప్రబలులోకముల.
దుర్యోధనుఁడుసేయుదుష్కార్యములకు
ధైర్యసమ్మతులార, తగులక మీరు


వెడలితి; రిదిపదివేలు: మామేలు;
కడపట నిచ్చోటఁగంటిరి శుభము.
'ధర్మ మెక్కడనై నఁ దలఁగాచు' ననుట
ధరాత్మ, నిజమయ్యెఁ దలఁప మీయందు.
రప్పించు మిము ధృతరాష్ట్రుఁ డక్కడికి ;
నిప్పించుఁ [23]ద్వద్భాగ మేనె చూచెదను.
ఈ వైభవమ్మెసు ref>మ్మిచ్చె</ref>మ్మిచ్చునసూయ;
భావింపఁ గురురాజుఁ బార్థ, నమ్మకుము,
ఏనింకఁబోయెద; నిచ్చటనున్న
మీనిర్ణయములను మెచ్చుగా.” దనుచు
గుంతికిఁ దత్పుత్రులకును జెప్పి
కంతుజనకుఁడు వోయెఁ గణఁక ద్వారకకు,
అప్పుడింద్రజు [24]గెల్పు నాత్మసంభవుని
నొప్పియుఁజూచి, మనోవ్యధ నినుఁడు
జగమునిర్వాహంబు చాలించెననఁగ
మొగి [25]మింటఁ బశ్చిమాంబుధిచాయ డిగ్గె;
'తగఁ గాలనృపతి యాధర్మాధికులను
బగలుచేసెదవని పట్టించె గిరిని
..............................................
..............................................
రథముసగంబు సారథిపిచ్చుగుంటు
రథికుఁ డట్లయ్యుఁ జేరఁగవచ్చి నన్ను'
[26]అని ప్రతీచీకాంత యనురక్తి నెఱపెఁ
[27]దనువెల్లననఁగ సంధ్యారాగమెసగె;
'ఇందిర హరిదేవి యిల్లడసొమ్ము
మందిరమనివచ్చి మనలోన జేరెఁ;


జీఁకటిపొద్దు రక్షింత' మన్నట్లు
మూఁకలుమూకఁలై మొగిడెఁ బద్మములు;
వరుస మిన్ననునీలవస్త్రంబుమీఁదఁ
బఱపుమై ముత్యాలు పచరించిరనఁగ
నక్షీణ తారతమ్య ప్రభావమున
నక్షత్రకులములు నభమునఁదోచెఁ;
దనమీదఁ బార్థుండు ద్రౌపదిఁదెచ్చు
కినుకపోలిక నుర్వి గిరికుచ[28]శ్రీలు
చూపక మేలుముసుంగిడె ననఁగ
వేపర్వె జీఁకట్లు విశ్వంబునిండ;
శ్రీకంఠుఁ డర్ధనారీస్వభావంబు
గైకొన్న, నతనివక్షము [29]తెన్నుచూచి,
యాలీల తమకురా [30]నట్లాయె ననఁగ
నోలినొప్పెఁ గొలంకు లొంటిజక్కవలఁ;
జంద్రాన్వయుల పెండ్లి సంభ్రమంబునను
జంద్రునెచ్చెలులెల్ల సంప్రీతిఁగనుట
తగవని వికసించెఁ దత్కైరవములు
జగతిపైఁ బర్వంగఁ జంద్రికావితతి.
ఆరాత్రి కుంతి భిక్షాశనంబునకు
గారాబుకొడుకులఁ గ్రమ మొప్పఁబనుప,
వారేఁగి భిక్ష పూర్వప్రకారమునఁ
గోరితెచ్చినఁ, గుంతి కోమలిచేత
దేవార్థ మొకపాలు తివియించి, యందు
భావించి యతిథితర్పణకొకపాలు,
చిక్కినయది రెండుసేయించి, యొకటి
తక్కక మును వృకోదరునకిప్పించి,


[31]...................................
....................................
నీకినిల్వఁగఁ గొంతనిలిచినకూడు
చేకొని యదిరెండుచేసి, వేవేగఁ
గోడలుఁ దానును గుంతిభుజించి
వేడుక శయ్యల విరచింపఁబనుప,
నవదర్భశయ్యలు నాతి యేవురకు
సవరించి, మఱి వారిచరణాగ్రభూమి
నాదిగర్భేశ్వరియయ్యు శయించె;
[32] రాదు స్మయంబంత రాచకూఁతునకు;
వింతవారలుగదా వీరనికొంత
చింతింప; దెవ్వరు చెప్పిరోబుద్ధి!
ఇట్టివృత్తాంతంబు లెంతయునరయ
నెట్టనఁ దనయుని నృపుఁడు దా మున్న
యతిరహస్యంబుగా ననుపుటఁజేసి
యతఁడేఁగి యన్నియునరసి, యారాత్రి
ధరణీశుకడ కేఁగి తగుభ క్తి మ్రొక్కి
వరుసతోడుతఁజెప్పె వారివర్తనము :
"జననాథ, యే వారిచరితంబులెల్లఁ
గనుఁగొనివచ్చితి గడఁగి మీరనుప;
సుక్షత్రియులు వారు చూచినఁదెలియు;
నీక్షోణిపై నెన్న నితరులుగారు.
తలపోఁతకై రాత్రి తమలోనఁ దారు
పలుకుకొన్నారట్టి పలుకులేవింటి.
పరసేన భేదనో[33]పాయ క్రమంబుఁ,
బరబాణ భంజనోపాయ క్రమంబుఁ,


బరిగణించిరి, విప్రభాషలుగావు.
ధరణీశ, యొక్కచోద్యము వినుమింకఁ;
జెలువ వారికిఁ జేయుసేవాక్రమంబు
తలఁపవచ్చునె! వింతఁదనమింత లేదు;
ఆవిల్లువంచిన యతని తోయంబు
ఏవురన్నలుఁ దమ్ము లీక్షించి చూడ;
[34] జరఠ యొక్కతె వారి జనని కాబోలు!
వరుస భిక్షాన్నంబు వారికిభుక్తి"
అని వేషధారుల యఖిలవర్తనముఁ
దనయుఁ డెఱింగించె దండ్రి కెంతయును.
అంతటఁ బాంచాలుఁ డమ్మఱునాఁడు
కాంతతో మంత్రిసంఘంబులఁ దాను
నవవేషకుల వర్తనంబు లెఱుంగ
నవిరళంబగు నుపాయంబు దలంచి,
నాలుగురథములు నాల్గుజాతులకు
జూలనొప్పిదముగాఁ జక్కఁబన్నించి
[35]'యేజాతితమజాతియో యారథంబు
రాజిల్లనెక్కి వారలు నగరికిని
వచ్చునట్లుగఁ జేసి వరుసఁదోడ్తెండు
మచ్చిక;' నని చెప్పి మంత్రులననిపె.
పురుషార్థములునాల్గువోలె నారథము
లరుదారఁగొనివచ్చి యామంత్రివరులు
పాండుపుత్రులఁగాంచి భక్తితో మ్రొక్కి :
........................................
"యీవాహనములెక్కి యే తెండు; మిమ్ము
భూవరుండట పిల్వఁబుత్తెంచినాఁడు;


ఈ తేరువిప్రుల; కీ తేరునృపుల;
కీ తేరువైశ్యుల; కిది శూద్రులకును.
వీనిలో నొక తేరు విభులార, యెక్కి
జానొప్ప ద్రౌపదీసహితులై రండు. "

పాండవులు ద్రౌపదీ సహితులై ద్రుపదునగరి కేఁగుట

అనిన, ధర్మతనూజుఁ డట్ల కాకనుచు
ననుజులుఁ దాను నొయ్యన రాజరథముఁ
బరువడినెక్కినఁ, బంచాయుధములు
హరిదాల్చినట్లయ్యె నయ్యరదంబు.
అత్తయుఁ గోడలు నందలంబులను
ముత్తైదువలమూఁక మొనసియేతేరఁ,
బంచపాండవులును బాంచాలుసభకు
నంచితలక్ష్మితో నరుదెంచునపుడు
నెడనెడ నెదురుగా నీప్సితార్థములు
జడియక ద్రుపదుండు జాతిజాతులకు
రసికతఁబుత్తేర, రాజయోగ్యముల
వెసఁగయికొనుచు నవ్వీరులువచ్చి
రాజయోగ్యములైన రత్నాసనముల
నోజతో గూర్చుండి రుచితంబుగాను.
ఎంతైనఁ దమ్ముఁదా మెఱిఁగించుకొనక
కౌంతేయులని యెఱుంగఁగరాదు గాన,
వారలఁబూజించి, వసుధేశుఁడాత్మ
నేరూపమును నిర్ణయింపంగరాక
తిన్నన ప్రియముతోఁ దెలియనిట్లనియె:
"ఎన్నఁ బుణ్యశ్లోకు లెవ్వారు మీరు?
రామఁ గైకొన నమరావతినుండి
భూమిడిగ్గిన దివ్యపురుషులో! కాక,


భవుపంచముఖములో! పంచవర్ణములొ!
వివరింపరాజులో! విప్రులో! చెపుఁడ;
ఆస్తోకభుజధారు లమలవర్తనులు
విస్తీర్ణవక్షులు వృషభకంధరులు
కర్ణాంతనేత్రులు కఠినైకగాత్రు
లర్ణవగంభీరు లర్థినేవురును.
విలువంచి గుఱిద్రుంచి వెలఁదివరించి
కలహించి నిర్జించి కడుమించియున్న
యతఁ డెవ్వఁ డిందులో? నందఱు నొక్క
ప్రతినుండ నితఁడని భావింపరాదు.
ఏనును బాండవు లిలలేనివగల
నూనియుండెదఁగాన నొత్తియడిగెద.
వారలుగారుగా! వటులార, మీరు,
కోరిక లట్లైనఁ గొనసాగు." ననినఁ,
బాండవాగ్రణి నవ్వి పాంచాలుఁబలికె :
"నొండేల ! పాండవేయుల మేము ద్రుపద
యమసూతి నేను; భీమార్జునుల్ వీరు;
యమలువీరిరువురు; నాయింతి కుంతి.
మహిమీఁదఁ గురురాజుమనసు రావలసి
విహరించుచుంటిమి విప్రవేషముల.
నినువంటిచుట్టము నేనెందుఁగాన;
ఘనుఁడ! లోకులకింకఁ గాననయ్యెదము"
అనవిని పాంచాలుఁ డానందలహరి
గనువ్రాల్చి గద్గదకంఠుడై తెలిసిఁ
కలరూపొకొ! యని కదలనిభీతిఁ
గలరూపకానమ్మి కడుసంభ్రమమున
నిందఱ గాఢగాఢాలింగనముల
నందందగ్రుచ్చుచు, హరిని మెచ్చుచును,


బసిమి నేవురఁ దనభక్తిశక్తులకు
బొసఁగిన [36]యుక్తితో, బూజలు చేసి :
"యిదిగదా! నాఫల; మిదినా ప్రతిజ్ఞ;
వెదకిననిధిఁగంటి; విఖ్యాతిఁగంటి;
నాభాగ్యమునఁగాదె! నాఁడగ్నిఁదప్పి
యీభంగి నుండితి రినతేజులార!
కూరిమిఁ బార్థుకుఁ గూతునీగంటిఁ;
గోరిననాగోర్కి కొనసాఁగఁగంటి.
విల్లుపట్టినయట్టి విధము వీక్షించి
యుల్లంబు నరునిఁగా నూహించిచూచి,
యిందువంశాధీశ, యెఱుఁగలేనైతి;
సందేహమిటపాసె సంతోష మెసగె .
వాసవికింక వివాహయత్నంబు
చేసెద లగ్నంబుచింతించి, ” యనినఁ
బాంచాలువీక్షించి పలికె ధర్మజుడు :
"మంచిమార్గము నీదుమాటయిట్టిదియె;
ఇంక నొక్క విచార మించుక గలదు.
పంకజానన నేము పరఁగ నేవురము
వరియించువారము వైదికస్థితిని;
పరికింప మాకుంతిపలుకు నిట్టిదియె.
తల్లివాక్యంబని ధర్మంబుఁదప్ప;
మెల్లఠావులఁ దొల్లి యిట్టివిగలవు;
[37]ఘనజటిలాకన్య గౌతముకూఁతు
మునులేడ్వురును గాదె మున్ను గైకొనిరి!


పూచి దాక్షాయణిపూబోణిఁ గాదె!
ప్రాచేతసులుకొంటఁ బదుగు రొక్కతెకు;
[38] నాశినౌరునికూఁతు నగితాఖ్యకన్య
నీశయ్య నైషధులేవురు గొనరె!
వింతగా." దనిన వివేకించి ద్రుపదుఁ:
“డింత కార్యము నిర్ణయింప నే వెఱతు;
నెల్లి ధృష్టద్యుమ్నుఁ డీవును గొంతి
యెల్లపెద్దలుఁ గూడి యీ ప్రయోజనము
మనమునఁగాంతము; మాకుఁజూచినను
విను లోకమునకిది వింతగానోపు.”

వ్యాసుఁడు ద్రుపదుఁ గానఁబోవుట



అనునంత ద్రుపదుని యాత్మసందేహ
ఘనతిమిరమువాపు గ్రహరాజు వోలె
వ్యాసుఁ డచ్చోటికి వచ్చిన ద్రుపదుఁ :
'డీసమయంబున నీపుణ్యమూర్తి
వచ్చుట నాభాగ్యవైభవం' బనుచు
నిచ్చలోఁబొంగుచు నెదురుగాఁబోయి
“మునిసింహ, తుభ్యన్నమోనమ' యనుచు
.............................................
‘ముక్తీశ ! తుభ్యన్నమోనమ' యనుచు
నిలమ్రొక్కి కైదండయిచ్చుకవచ్చి
కలితజటా[39]భారుఁ గనకపీఠమున
నునిచి పూజించిన, నోలిఁ బాండవులు
మునికిఁ దల్లియుఁ దారు మ్రొక్కిరి ప్రీతి.


అంత వారల మౌని యాశీర్వదించి,
సంతోష మొప్పఁ బాంచాలునిఁబలికె:
"కూతుఁగాంచి పయోధి కొనియాడ [40]వెలసెఁ;
గూఁతుఁగాంచి హిమాద్రి కొనియాడ [41]వెలసె;
[42]నీవు ద్రౌపదిఁ గాంచి యీ పాండవులకు
దేవిగా నీఁగంటి; [43]ధృవగీర్తి గంటి;
వేలుపుమ్రాఁకుల విద్రుమలతికఁ
గీలుకొల్పుటయిది కీర్తింపనొప్పు.
[44]నీకు వీరల ప్రాపు, నీప్రాపు వీరుఁ
గైకొనివచ్చిరి కడునొప్పుఁ బనులుఁ.
ఏవురకొకకన్య నెట్లిత్తుననుచు
నీవు చింతించుట నృప, యేనెఱింగి
తెలుపవచ్చితి; నీకుఁ దెలియ దీకుంతి
పలుకు ధర్మజుపల్కుఁ బరమార్థమగుట;
ఈజాడ యెంతయు నెఱిఁగింతు నీకు
రాజ ర"మ్మని యోగిరాజు లోపలికిఁ
బాంచాలుఁ గొనిపోయి పలికె నేకతమ:
“పాంచాలికిట్టి శోభనము భావ్యంబు;
మఱి దీనిపూర్వజన్మస్థితి వినుము;
తెఱఁగొప్ప వినిన వర్ధిల్లుఁ బుణ్యములు;

పంచేంద్రోపాఖ్యానము



లలనాలలామ [45]నాలాయని యనఁగఁ
గలదు మౌద్గల్యునిగాదిలిబోఁటి;
చిత్తజుదీమంబు, చెంగల్వబంతి,
మెత్తనిమేనిది, మీనాయతాక్షి,


కిసలయతామ్రోష్ఠి, కిన్నెరకంఠి
పసిఁడిశలాకతోఁ బ్రతియైనముగ్ధ.
పతికంటె దైవంబు పడఁతికి లేమి
వితతంబుగా నది విన్నదిగానఁ
తనసుఖంబెఱుఁగక తగువేళ లెఱిఁగి,
[46]జనులతోఁ బలుక సతతంబుఁ బతికి
నోలిమై గ్రాగిన యుదక మార్చుటలు,
మేలిమికూడ్గూర మేళవించుటలు,
నలికిమ్రుగ్గిడి శయ్యయావటించుటలు,
లలిఁ దాళవృంతచాలనము చేయుటలుఁ,
బలుకులవినయంబుఁ, బాదసేవనముఁ,
దెలివినాజ్ఞాక్రియ తీయనిభక్తి,
తాలిమి, యణకువ, తగవు ధైర్యంబు
లాలిత్య మభిరతి లజ్జ మానములు
దయ ధర్మ మతిథిసత్కారంబు నిష్ఠ
ప్రియము దాక్షిణ్యంబుఁ బెంపాదిగాఁగఁ
బుణ్యలక్షణములప్రోవై ధరిత్రి
బుణ్యాంగనలమించి, పూబోణి మఱియుఁ
బతిభక్తిఁబరఁగు; నప్పతి దేహమైన
జతనంబువదలి కుష్ఠవ్యాధిపట్టి
మఱియును నీరుగ్రమ్ముచు [47] నీగకాటు
తఱచునఁజెడి వాచి తద్దయుఁబగిలి
వాసనఁ బ్రేవులు వాతికిరాఁగ
రోసి యెవ్వరు 'నమ్మరో' యని తొలఁగ
నెడపక పాతలనిఁగలఁ జోవుచును,
దడఁబడఁగుంటుచు 'దైవమా ' యనుచు


వర్తింపఁ, బరిచర్యవదలక యింతి
మార్తాండతేజుగా మగనిఁదలంచి,
మడుఁగుఁ బుట్టంబున మసటువోఁ బుండ్లు
దుడుచుచు నొత్తుచుఁ, దొయ్యలి మఱియుఁ
బురుషుఁడెక్కడకైన బోవలెననిన
నిరవొంద వీపుననిడుకొని చనుచు,
నతఁడుభుజించినయన్నశేషంబు
సతతంబుఁగుడుచుచో, జననాథ! వినుము,
పొనర నమ్మునివ్రేలు భోజనవేళఁ
దునిసి యన్నములోనఁ దొరఁగిన, నింతి
విరిదమ్మిరేకులవీడు పూఁదేనె
కరణి బాష్పంబులు కనుఁగవఁ దొరఁగ:
“నక్కటా! యీ వ్యాధి యర్హమాయితని;
కెక్కడవేగింతు నేమిటమానుఁ;
దునిసి యిప్పుడు వ్రేలు దొరఁగె నన్నమున;
ముని యెంతనొచ్చెనో! ములుగుచున్నాఁడు.
[48]అనగ వాయంద మాసోగభావ
మానయ మాకాంతి యాచక్కఁదనము
నెడపక యెల్లవా! యీకూటఁబడితి;
వొడలంట నిన్నెవ్వ రోసరించెదరు.'
అనుచు నయ్యంగుళి నల్లనఁబుచ్చి,
తనచీర నతనిహస్తముఁ జక్కఁదుడిచి,
హితునిచిత్త మెఱింగి యితర పాత్రమున
నతివ యన్నమువెట్టి యల్లనఁగుడిపి,
యోకరింపక తొంటియోదనంబబల
గైకొని భుజియింపఁ, గడుమెచ్చి మౌని:


“యువిద, నీతలఁపొప్పు; నొడ[49]వెడుభక్తి;
జవరాలవైయుంటి సంసర్గలేక,
కుసుమమంజరికంటె గోమలంబైన
పసమేనికొప్పైన పాటన లేక,
మాకోపమునకోర్చి, మాసేవనేర్చి,
వే కూరలోపలి వెంట్రుకవోలె
నవసియు నేఁటియన్నము భుజించుటకు
ధవళాక్షి, మెచ్చితిఁ దగ వరమడుగు.'
అనుటయు, సిగ్గు నొయ్యారంబు భయము
దనరార నింతి మౌద్గల్యునిఁజూచి :
"యోదేవ, రతికాంక్ష యుండునుల్లమున;
నైదు దేహంబు లీవర్థి ధరించి,
యనవరతాసక్తి నంగజక్రీడ
ననుఁగటాక్షింపవే! నాకిదివరము;
అంతతో రతికాంక్ష యణగునా." కనినఁ,
గాంతకోరినలాగు గైకొని మౌని
పెక్కులోకంబులఁ బెక్కుకాలములఁ
దక్కక రతికేళి దరళాక్షిఁ గూడి,
యాదేహములువీడి యతఁడుపోవుటయు,
నాదట రతికాంక్షయణఁగక యతివ
యాశరీరమువీడి యవనిపై మఱియుఁ
గాశీశుకడుపునఁ గన్యయైపుట్టి,
చిన్నిప్రాయంబునఁ జెలువున సతుల
కెన్నఁగా నెక్కుడై యిలయెల్లఁబొగడఁ
గమ్మనిశీతాంశుకళయునుబోలె
నమ్మానినీమణి యహరహంబునకు


నల్లనఁబెరిగి, తన్నడిగెడివారి
కెల్లకాలంబునునెదురులు చూచి,
కానక యంతలోఁ గన్నియముదిసి
కానకుఁబోయి శంకరునకుఁదపము
నతిఘోరనిష్ఠఁ జేయఁగ, శంకరుండు
నతివతపంబున కాత్మలో మెచ్చి,
వేదాంతసీమల విహరింపనేర్చు
మేదు ప్రభగల్గు మృదులపాదములు,
గౌరికిఁ గూర్చుండ గద్దియయగుచుఁ
జారలపులితోలు జారినతొడలు,
ముదిపాఁపమొలనూలు ముచ్చుట్టు మలచి
గదురుటేనుఁగుతోలు గట్టిన పిఱుఁదు,
బాగుగా బహుదీప్తి భాసితంబైన
యోగ[50]పట్టముచేత నొప్పునెన్నడుము,
హరివాహ ఘంటాంకు శానల హేతి
వరశూల [51]పరశువుల్ భయదఖడ్గమ్ము
నరుదుగా ధరియించి యరుణనఖాళిఁ
బరిచితంబైనట్టి బాహుదండములు,
గౌరీసమాశ్లేష కలితహస్తముల
నారూఢి నీలిమ హత్తెనోయనఁగ
గంఠమాలికయైన కాలసర్పంబు
కంఠధూమముసోఁకి కందేనోయనఁగ
....................................
....................................
విసమునఁ గనటైన విపులకంధరము,
బసనియెమ్ముల పేర్లు భాసిల్లునురము,


నైదక్షరంబుల నమరుమంత్రంబు
నైదుమొగంబుల నమరెనోయనఁగ
నైదుమాఱులు నాథునడిగినసతికి
నైదవతనమీయ నైదయ్యె ననఁగ
నైదువర్ణములైన యైదుమోములను
వేదనిశ్శ్వాసముల్ వెడలఁజేయుచును,
[52] గృతకకోపాక్రాంత గిరిరాజ్యకన్య
నతిసక్త నంకభాగాసీనఁజేసి,
యిక్షుచాపునిదేహ మింక లేకుండ
లక్షించినట్టి లలాటనేత్రంబు,
వలపునఁ దలకెక్కువడువుదీపింపఁ
జలిలేమవిడిసిన చదురుకెంజడలు,
మెఱయు వెన్నెలపువ్వు మేకొన్న వేయి
చెఱఁగులతలపాగఁ జెలువొప్పుమౌళి,
..................................
..................................
నునుబూది మైపూత నునుపుగాఁబూసి
యాలమిండనినెక్కి యతిసంభ్రమమున,
బసవని టెక్కె మభ్రంబున గ్రాలఁ,
బసగల్గు ధవళాతపత్త్రముల్ మెఱయ,
సతులు వింజామరల్ జానొప్పవీవ,
సుతులు బరాబరుల్ సొంపారఁజేయ,
వరహంస గజరాజ వాహ[53]నులగుచుఁ
బరమేష్ఠి యింద్రుండు భక్తి సేవింపఁ,
గరి మేష మహిష రాక్షస నక్ర హరిణ
తురగవాహనములు దొరయంగ నెక్కి


శక్రాగ్ని యమ దైత్య జలనాథ వాత
చక్రి భూషాప్తులు సరవితోఁగొలువ,
గంధర్వ సంగీతగతులతోఁ గూడి
బృందారకులు పరివేష్టించి కొలువ,
జావుఁ బుట్టువు లేని సడిసన్న పెద్ద
జీవరాసులకెల్ల జీవంపుముద్ద
యస్త్రప్రాణులలోన నాదివిల్కాడు
[54]శాస్త్రవాదంబుల జగజోలికాఁడు
విసమైన నఱిగించు విషమవైద్యుండు
బిసరుహాసనవైరి[55]విదుల కాద్యుండు
దేవాదిదేవుండు దేవతాత్మకుఁడు
దేవపూజ్యుఁడు మహాదేవుఁ డావేళఁ
బ్రత్యక్షమగుటయుఁ, బద్మాక్షి మ్రొక్కి
ప్రత్యయంబున నిట్లు ప్రణుతింపఁదొణఁగె:
"సత్యాత్మ, సన్మయ, సదమలభావ,
నిత్య, నిత్యానంద, నిర్మలాకార,
శంకర, సర్వజ్ఞ, శాంభవీరమణ,
పంకజభవవంద్య, భవ, వామదేవ,
భర్గ, విరూపాక్ష, భావనాతీత,
సర్గలక్షణకల్ప, సకలనిధాన,
శాశ్వత, భూతేశ, జన్మవినాశ,
విశ్వేశ, విశ్వాద్య, విద్యానవద్య,
త్రినయన, శ్రీకంఠ, త్రిపురసంహార,
ఇనవహ్నిశశినేత్ర, హితజగత్పాత్ర,
ఉగ్ర, నిర్గుణ, గణ్య, యురుతరపుణ్య,
నిగ్రహాప్రతికార, నిరుపమాకార,


శాంతాత్మ, శివ, శంభు, చంద్రార్ధమకుట,
కాంతానుషంగిత, కలితసంగీత,
శర్య, మహేశాన, జాహ్నవీమకుట,
సర్వసమ్మిత, [56]భూతజగదధివాస,
నిర్మలగుణ, భీమ, నిరవధితేజ,
ధర్మసంభవదేహ, ధర్మాత్మవాహ,
మదనకోటిసమాన, మదనసంధాన,
మదనమర్దనదక్ష, మర్దితదక్ష ,
కర్మకలాపైక కారణాధార,
( నిర్మల నాకధునీ జటాభార,)
రుద్ర, విద్రావిత రూఢాసురేశ,
భద్రాత్మ, పరమేశ, పరశుప్రకాశ,
కల్యాణనగచాప, కల్యాణ [57]కరణ,
కల్యాణవారాశి, కల్యాణనిలయ,
తారకాధిపజూట, తారకాలోక,
తారకాసురవైరి, తారకా[58]పాంగ,
హరినేత్రపూజిత, హరిహయవినుత,
[59]హరిబాణ, జితదైత్య, హరిరాజవర్ణ,
కృష్ణాజినచ్ఛన్న, కృష్ణాజివినుత, (?)
కృష్ణాభిరతికంఠ, కృష్ణాజిధీర, (?)
నందితాండవలోల, నందితాజాండ,
నందితాపసగమ్య, నందితాను[60]చర,
సప్తసామ[61]స్తుత, సప్తార్చిరూప,
సప్తలోకాధార, సప్తాశ్వనయన,
విజ్ఞానమయరూప, విమలకలాప,
ప్రాజ్ఞ[62]మానసగమ్య, బంధురక్షమ్య,


భక్తపరాధీన, భక్తినిధాన,
శక్తిసమాలింగ, సద్భావలింగ,
అక్షర, అవ్యక్త, ఆద్యంతరహిత,
అక్షయ, అచ్యుత, [63]హర, నీలకంఠ,
మూర్తిత్రయము నీవ; మూర్తివి నీవ;
మూర్తి[64] భావనసేయు మూర్తివి నీవ;
కర్తయు నీవ; వికర్తయు నీవ;
భర్తయు నీవ; సంహర్తయు నీవ;
గౌరీయుతుఁడవయ్యు గరిము నొక్కఁడవు;
చీరలేకుండియు క్షితి నీశ్వరుఁడవు;
అరయ నుగ్రుఁడవయ్యు నధికశాంతుఁడవు;
గరళకంఠుఁడవయ్యు గడునమృతుఁడవు;
బ్రాఁతిగా శుచివై కపాలహస్తుఁడవు;
భూతనాథుఁడవయ్యు [65] భూతియుక్తుఁడవు;
కడు రెండువేలనాల్కలశాస్త్రి నీకుఁ
దొడవఁట పొగడెడు దొర వేఁడి నిన్ను!'
అని సన్నుతించుచో, హరుఁడు : “ నీకెద్ది
వనిత, వాంఛిత!' మన్న, వదలకిట్లనియె:
“మగని మగాతని మగవాని నాకు
మగదిక్కు, మగదెస మదనారి, యీవె !'
అని యిట్లు మదనపరాధీనగాన
మన నైదుమాఱులు మగనివేఁడినను;
నగుచు శంభుండు తా నాతికిట్లనియె:
“మగలేవురగుదురు మహిలోన నీకుఁ ;
[66]బాంచభౌతికమైన ప్రాణంబు భాతిఁ
జంచలేక్షణ, నీవు సమకూరు.' దనిన
 


నావారిజాక్షి: 'యేనట్లైన నొల్ల;
దేవ, యీ వరము ధాత్రికి హాస్యకరము.
ఒకతెకొక్కడెకాక, యుర్విఁ బెక్కండ్రు
వికృతపుమగలైన విననెట్లుపొసఁగు!
నాలుకతడఁబాటు నగచాప, యోర్చి
పాలింపు' మనుటయుఁ, బార్వతీ ప్రియుఁడు :
ఏనఁటవరమిత్తు! నిది నగుఁబాటు
గా నెట్లువచ్చు! ముగ్ధా! వెఱనకుము;
ఏవురు నీమీఁద నెడపనిప్రేమ
గావింతు రన్యోన్యకలహంబు లేక;
నీకు నేవురమీఁద నిచ్చ భోగేచ్ఛ
చేకూరుఁ; బ్రాయంబుఁజెలువంబుఁజెడదు;
అనిశంబు మగుడఁ బ్రాయమువచ్చు నీకు;
దినమొక క్రొత్త వర్ధిలుఁ జక్కఁదనము.
ఆవిచారముచాలు నబల, యిచ్చటికి
దేవేంద్రుఁదోడ్కొని తెమ్ము పొ.'మ్మనిన,
నదియుఁ : 'దెచ్చెదఁగాని యభవ, యిచ్చోటఁ
గదలకయుండుమీ కరుణాఢ్య!' యనుచు
నాయతగతి యొక్క యతిదూరయాత్ర
పోయి, గంగాతీరమునఁ గాచియుండె.
అటమున్న యముఁడు నిజాధికారమునఁ
బటుజంతుహింస తప్పక చేసిచేసి
వేసరి : 'యీ ఘోరవృత్తి కేనోప;
నాసరివారిలో నవ్వు బాటిదియు
తియ్యని సంసారతృష్ణ పోలేక
[67] కుయ్యిడుజనులను గూల్ప నావశమె!


కర్మవశంబునఁ గడుబాలుఁడనక
కూర్మి [68]వృద్ధనకుండఁ గూల్ప నావశమె!
తపసినై పోయెదఁ; దగఁ జాలుమణిగ;
మివుడుకోపింపనీ యిఁకబ్రహ్మ.' యనుచు
నైమిశారణ్య పుణ్యక్షోణిఁ జొచ్చి
యామునిశ్రేణితో నద్దేవుఁడచట
సత్రయాగము నిష్ఠ జరుపుచున్నంత,
ధాత్రిఁ జావులు లేక దట్టమై ప్రజలు
తరములతాత లాతరముల తాత
లరయ నవ్వలితాత లాండ్రును దారు
[69]గరిటంటుగాళ ముక్కాలంబుఁ గుడిచి,
గురుకూటములువోలె గోళ్లుమీటుచును,
సుఖమున్నచో, వజ్రి, సొంపుతోనరిగి
...........................................
దండప్రణామముల్ తగనాచరించి
పుండరీకాననుఁ బొందుగా బలికె?:
'ఓ బ్రహ్మ, సంసారమొల్లఁడు శమనుఁ;
డాబ్రహ్మమగుకార్య మటువెట్టిపోయెఁ;
గాలుఁడయ్యును గూడు కాలఁదన్నుదురె!
భూలోక మెడ లేదు పుట్టిన ప్రజకు.'
అనినఁ బల్కు విధాత: 'యట్లేలవగవఁ!
జనియెడుఁ దనకార్యసరణికై యముఁడు,
[70]తనువపేక్ష కరంబుతఱచైనప్రజల
మునుకొని యొకఁడెట్లు మోదు నవ్వేల్పు!
అమర వాయువు నీవు నశ్వినీసురులు
నమరేశ, [71] పిలువఁగ నరుగుఁ; డవ్వేల్పు



నేవురుఁ [72]గూడక యిప్పటిభార
మేవిధంబునఁబాయ దీవసుంధరకు.
అనుటయు దేవేంద్రుఁ : ‘డట్లేల నాకు
మనుజుఁడనై పుట్టి మరణంబునొంద !
యముఁడాఫలమ్ముఁ దానందని'మ్మనుచు
నమరాధిపతిపల్కి యట మరుచును
దెరువున గంగానదీతీరభూమి
బారిపొరి శోకించుపూఁబోఁడిఁ గాంచి,
మనసిజుచేఁతల మగ్నుడై యపుడు
తనలోన నిట్లని తలపోయఁదొడఁగె:
'అహహ ! మనోహరంబయ్యెఁ జూపులకు ;
మహి నెంతటికిలేఁడు మాయపుబ్రహ్మ !'
అనివితర్కింపుచు హరి దాన్గిఁదిసి:
“ వనజాక్షి యక్కట! వగచుచు నిచట
నెవ్వనికొంటిమై నెదురుచూచెదవు ?
ఎవ్వతెవీవు ? నీయభిలాషయేమి ?
చెప్పు.' మన్న లతాంగి: చెప్పెదఁగాని,
యిప్పుడునావెంట నింద్ర, యేతెమ్ము ;
తెలియ నొల్లకయున్నఁ దిరిగిపో.మ్మనిన,
వెలఁదిరూపవిలాస విభ్రమంబులకు
నింద్రుఁడెంతయునోడి: “ యేఁగూడివత్తుఁ
జంద్రాస్య ! పద.' మని చనఁజొచ్చి వెనుక .
తోయజూనన యింద్రుఁదోకొని యిట్లు
పోయి కైలాసాగ్రమునఁ జంద్రధరుని
సీక్షింపవచ్చుచో, నింద్రుకన్నులకు
దక్షారి వరుణుఁడై తగఁదోఁచె; దోప,


నామాయయెఱుఁగక యైశ్వర్యగర్వ
ధూమాక్షుడై వజ్ర ధూర్జటిఁ బలికె  :
'అగుర! యేఁబూర్వుండ; నపరుండు తాను;
వగ నింద్రుఁడను నేను; వరుణుండు తాను;
ననుజూచి గద్దియ నాయమా దిగఁడు!
కొనియెద నొక వ్రేటు ఘోరవజ్రమున.'
అనినఁ, జింతింపక హరుఁడు వెండియును
వనితకిట్లనె: 'వీని వనజాక్షి, కంటె!
కన్నులు వెయిగల్గి కానఁడునన్ను;
బన్నుగా నట వీనిఁబట్టితె,' మ్మనిన
నతివ నాలాయని యతనిఁబట్టుటయు,
మతి నాతఁడలరి మన్మధవికారమునఁ
బరవశుఁడై జాఱఁ, బంచబాణారి
దరహాసమున ధరాధరభేదిఁ బలికె :
'వాసవుఁడవు నీవు వరుణుండ నేను
ఈసున నాకొండ యెత్తుమా నీవు!
ఏనైన నెత్తెద నీక్షింపు.'మనిన
మానక యాకొండ మఘవుఁడెత్తినను,
ఉన్నారు వేలుపు లొక నల్వురింద్రు
లెన్నసహస్రాక్షు లిటవజ్రధరులు.
వారినింద్రుఁడుచూచి వడిఁదన్నుఁ జూచి
యూరకేచింతింప, నుగ్రుండువలికె :
'ఎక్కడ గూడినా రేవురింద్రులును!
ఒక్కఁడు జముఁ, డింద్రుఁడొక్కడు, గాడ్పు,
నిరువురశ్వినులును, నెలమినేగురును
గుఱుతుగా నాయజ్ఞఁ గూడినారిచట;
నీవెలఁదియు మీరలేవురుఁ బోయి
భూవలయంబునఁబుట్టి వేడుకను


హరికి సహాయులై యవనిభారంబు
హరియింపుఁ డీయింతి యాలుగానుండు.
నిదివిష్ణుసంకల్ప మేమిటఁబోదు;
మొదలధాత్రీదేవి మొఱవెట్టుకొనియె.
అనిన, నీశ్వరునాజ్ఞ నరుదెంచి మర్త్య
తనులైనయా మహాత్మకులు పాండవులు.
నాఁటినాలాయని నాథ! నీపుత్త్రి;
యేటికిఁజింతింప నిత్తుగా." కనిన,
నాశ్చర్యకలితుఁడై యపుడైనవారి
నిశ్చయింప విభుండు నేరక పలికె
“ఈవు చెప్పుదువంట! యీవలశంక
గావించువారలు గలరె సర్వజ్ఞ
వీరి నిజాత్మలు వీక్షించి కాని,
యీరూపములు నమ్మ నింతినినమ్మ;
దివ్యదర్శనమిచ్చి దృష్టింపఁ జేసి
భవ్యాత్మ నాశంకఁ బాపవే!" యనినఁ,
దాపసోత్తముఁడంతఁ దన ప్రభావమున
భూపాలునకునిచ్చె భువి దివ్యదృష్టి.
ఇచ్చిన వెలుపలికేతెంచి నృపతి
యచ్చోట నృపమూర్తులై యున్నవారి
నినకోటితేజుల హేమభూషణుల
ననిమిషనేత్రుల నమరసేవితులఁ
[73]గాసర మృగ దంతి కనకవిమాన
వాసులు యమ వాయు వాస వాశ్వినుల
నాలాయనిని బుణ్యనారినిఁజూచి,
చాలనక్కజమంది జయవెట్టి మ్రొక్కి :


"లోక పాలకులార, లోకజ్ఞులార ,
నాకుఁగల్గితి రిట్టినవకృపాయు క్తి ;
నేనెట్టిసుకృతినొ ! యెట్టిధన్యుఁడనొ !
పూని మీమూర్తులు పొడగంటి. "ననుచు
గీర్తింపఁగాఁ, దొంటి క్రియ రాజు దృష్టి
వర్తింపఁ జేసి యవ్వసుధీశుతోడ :
“ నింకఁ బాండవులకు నింతి నేవురకు
శంకింప కీనేర్తె జననాథ ! ' యనిన:
నేనుగృతార్థుండ ; నేనుధన్యుఁడను ;
బూని దేవతలకుఁబుత్రి నీఁగంటి
నెంతయుమీకృప ; నేనుమీవాఁడ ;
నింత చెప్పకయున్న నేమియు నెఱుఁగ."

ద్రౌ ప దీ క ల్యా ణ ము


అని మ్రొక్కి వ్యాసమహాముని ననిచి,
జనపతి లగ్న నిశ్చయము చేయించి,
చక్రధరాదుల సకలబాంధవుల
సక్రమగతిఁ బిల్వఁ జారులఁబనిచి,
కలయ నక్కాంపిల్యఘనపట్టణంబు
లలితవైఖరితో నలంకరింపించి,
యంత ముహూర్తదినాగమంబైన
నెంతయు సంతోష మిగురొత్త నృపుఁడు
జలముల మంగళస్నానంబుచేసి,
తిలకించి నగరికి ద్విజులరావించి-
పుణ్యాహవాచన పూర్వంబుగాఁగఁ
బుణ్యాంగనలచేతఁ బువ్వుఁబోఁడికిని
నలుగు పెట్టించి, కొట్నంబువాటించి,
యిలువేల్పులకుఁ బూజలిప్పించి వరుసఁ,


[74] బరువడి నంకురార్పణము గావించి,
దొరఁకొని మంగళ తూర్యముల్ మ్రోయఁ
గన్నియఁగైసేయఁగా నియమించి,
యన్నియత్నంబులు ననువులుచేసె.
ఇట పాండవులు ధౌమ్యు నెలమిరప్పించి,
పటుతర భాగ్యసౌభాగ్యంబు మెఱయ,
వందిబృందములు కైవారముల్ సేయ ,
దుందుభి ఫటహాది తూర్యముల్ మ్రోయ,
మణిగృహంబులలోన మానినీమణులు
ప్రణుతవైఖరి నెల్ల పనులకుఁ దిరుగ,
సలలితమంగళస్నానముల్ చేసి
చెలువుమీఱంగఁ గైసేసి రేవురును.
స్నాతక వ్రతములు సకలంబుఁదీర్చి,
భూతలాధీశులు పొడసూపునట్టి
విప్రులఁబూజించి, వేదఘోషముల
సుప్రశస్తంబైన శుభలక్ష్మితోడ
ధవళవస్త్రంబులు ధవళమాల్యములు
ధవళగంధంబులుఁదగు వేడ్కఁదాల్చి,
యనుపమంబగులగ్నమాసన్నమగుట
విని మహోత్సవమున విడిదికి వెడల,
స్యందనకోటులు సందడింపంగ
నిందిరావల్లభుఁ డెదురువచ్చినను,
భావింప దైవంబు ప్రత్యక్ష మగుట
నేవేల్పులకు దారె యెక్కుడై నృపులు
రథముల నిజమనోరథముల నెక్కి
పృథివి యాకాశంబుఁ బెనఁచుకచూడఁ,
 


[75]గడు నురుగుపట్టి గంగాప్రవాహంబు (?)
వెడలినగతిఁ గ్రంతవీధులనడవఁ,
గాంతలు ద్రౌపదీకల్యాణమనుచు
నంతంతఁ గర్ణసౌఖ్యముగఁ బాడఁగను,
గ్రందుగ నాతపత్త్రంబులనీడ
మందమందానంద మాధుర్యలీలఁ
జనుదేర, నెదురునేసలుచల్లి ద్రుపద-
తనయుఁడెదుర్కొని తగురీతి వారి
విభుమందిరమునఁ బ్రవేశింపఁ జేయఁ
ద్రిభువనంబులు వేడ్కఁదేలె నద్దినము.
అంతఁ, బాంచాలుండు హర్షించి వారి
వింతగా మధుపర్కవిధిఁ బూజచేసి,
కన్యకావరణంబు గావించి, పిదపఁ
గన్యధారాపూర్వకము [76] నీయ, నృపులు
మంగళసూత్రముల్ మక్కువముడిచి,
తొంగలించినవేడ్కఁ, దూర్యముల్ మ్రోయ
ధౌమ్యుండు కదిసి మంత్రంబులు చెప్ప
రమ్యవైఖరిఁ దలఁబ్రాలొప్పఁబోసి,
కరమున విమలరక్షాబంధనములఁ
దిరమొప్ప నేవురుఁ దెఱవకు ముడిచి,
హోమవేదిక యెక్కి యుచితమార్గముల
ధీమంతు లగ్ని ప్రతిష్ఠ గావించి,
కన్య నేవురుఁగరగ్రహణంబు చేసి,
ధన్యతఁబులకించి తగనుత్సహించి,
హోమంబులన్నియు నొప్పొరఁదీర్చి,
హేమంబు ద్విజులకు నిచ్చిరి తనియ


ఆపాండుతనయుల కపుడు పాంచాలుఁ
డే పార నైదువేలిభములు [77] మోయఁ
దగినవిత్తంబులు దండితేరులును
బొగడనొప్పిన యశ్వములు నూఱువేలు,
దాసీసహస్రంబు, దంతిశతంబు,
గోసహస్రంబును గొనియాడ లక్ష ,
రత్న [78] పేటీసహస్రంబులు నాల్గు
యత్నపూర్వకముగా నరణమిప్పించి,
పరఁగ దివ్యాంబరాభరణమూల్యముల
గరమొప్ప బంధువర్గముఁ బూజచేసి,
కనకపాత్రములలో గమ్మనిరుచుల
జనములు [79]మెచ్చ భోజనము పెట్టించి
కట్టనిచ్చిన, నంత గమలనాభుండు
దట్టంపుఁ బ్రియముతో ధర్మరాజునకుఁ
గలిమియేర్పడ రత్న కాంచన తురగ
[80]కలితరథంబులు ఘనతతోనిచ్చె.
అత్తఱి విదురుచే నాపాండుసుతుల
వృత్తాంతమంతయు విభుఁడు దానెఱిఁగి,
వెస నాత్మలో భీతి వెలుపలిప్రీతి
పొసఁగ [81] నౌర్వానలంబున నబ్ధివోలి,
పెద్దకొల్వుననంత భీష్ముండు గురుఁడు
నొద్దికఁ గృపుఁడు దుర్యోధనాదులును
హీరభూషణులు బాహ్లిక సోమదత్త
భూరిశ్రవ స్సూతపుత్త్ర సౌబలులు
నున్నచో, విదురు లోకోత్తరుఁబలికె :
"ఎన్న మాకపకీర్తి యాశుండుమాన్చె;



మఱియుఁ గల్గిరి చాలు మహిఁ బాండుసుతులు;
ఉఱక మ్రోయుచునుండె నుర్విదుర్వార్త ;
బోరన రప్పించి భూమి పాలిచ్చి,
వారికి హితుఁడనై వర్తించువాఁడ. "
అనవిని తండ్రికిట్లనియె రారాజు

దుర్యోధనుఁడు తండ్రితో దుర్మంత్రణము సేయుట



“మనము వారలకింక మంచివారలమె!
ఇంక సామోపాయ మేటికి వినుము;
కొంకక భేదంబు గొనియాడవలయు ;
'నేగురకొకయింతి యిదిహేయ' మనుచు
బాగొప్పఁ బాంచాలుపట్టు వదల్చి,
ద్రుపదుని వారిసందున ముడివన్ని,
నిపుణత వారి నన్నెలవువావుదము;
కాదేని, నేర్చిన కాంతలఁ బంచి
యా దేవి నిన్నొల్ల డతనికివలచు
నిను దప్పనాడె నీనృపతిఁగీర్తించె..
నని పాండవులలోన నలుకపుట్టించి,
పోరాడి తమలోనఁ బొలియఁజేయుదము;
నారులెంతకు లేరు నరులబోధింప!"
అనినఁ, గర్ణుఁడువల్కు : "నది నీతిగాదు;
కినియరు వారెంతకీలువన్నినను;
అనుపమ నేనాసహాయుల మగుచు
మనమెత్తిపోద మీమార్తుఱమీద.
బలములపసలేని పాంచాలుఁడెంత!
తలఁప రాజ్యము లేని ధర్మరాజెంత !
వినిపించె వారియొద్దను 'వీపుఁదోమ
మనుజుండులేఁ' డని మనవేగువాఁడు.


ఇల భీమపార్థుల [82] కేఁబిఱుఁదీయఁ ;
గలశజాతుఁడు గెల్వఁగలఁడు పాంచాలు."
ననిన భీష్ముఁడువల్కు: " నందు మీరేఁగి
మును ద్రుపదునిచేత మోసపోయితిరి;
ఎన్నఁబార్థుని చేత నింతికైపోయి
మొన్నగదా ! మీరుమోదులువడుట ;
హరికి సైన్యంబు లేదని తలంచెదరు;
వరచక్రముండంగ వలయునే సేన !
ఈవేళ వారల కెగ్గుచేసినను,
భావింప మీకంటెఁ బగవారు లేరు.
కానఁడుకర్ణుండు కార్యంబుకొలఁది ;
తానఁట ! వారితోఁ దలపడఁగలడె!
పరబుద్ధివినువారి బ్రదుకేమి బ్రదుకు !
వరనీతిఁ బాలిండు వారిరప్పించి."
అనవిని కోపించి యంగరాజనియెఁ:
“దనరంగ దురమన్నఁ దలయేర్చుమీకు;
ముదిసి ముప్పునఁ బ్రాణములు వీడఁజాల ;
రిదికార్యమనికాన; రేలపాలీయ!
కురుకుమారులకీక ఘోరాస్త్రసమితి
హరినందనునకు ద్రోణాచార్యుడీఁడె !
వుట్టినకురురాజుఁ బొలియింపుఁడనుచు
నెట్టనఁ జెప్పరే | నృపునితో మీరు.
అచ్చిపెట్టినజీతమా! బూదిలోని
గచ్చకాయలు [83] మీరకారణహితులె !
ఆమేటివారల నటఁదెచ్చుకొనుట
పాముల నింటిలోపల నిడికొనుట. *


అనుడుఁ, గోపాటోపమడర రాధేయుఁ
[84]గొనకంట నీక్షించి కుంభజుఁడనియె:
"కలిగితివొకఁడవు! కౌరవకులము
నిలుప! నెవ్వరమును నీసమానులమె!
పాండునందనులతోఁ బగగొని నిలిచి
యుండఁ జూచెదు కర్ణ, యొనరదుగాని,
నినునమ్మి రారాజు నృపతిని విడిచె;
ననిసేయనోపిన నరుగుదు గాక.”
అనునంత, ధృతరాష్ట్రుఁ డయ్యిరువురకు
ఘనతరంబగు కార్యకలహంబు మాన్చి:

విదురుఁడు పాండవులఁ దోడ్తేర నేఁగుట


యీకర్ణకౌరవులేమెఱుంగుదురు!
నాకొడుకులరాక [85]నాకార్య." మనుచు
వివిధవస్త్రంబులు వివిధరత్నములు
వివిధభూషణములు వేడ్కఁ [86] గృష్ణకును,
ఛత్రచామరములుఁ జారుహారములు
ధాత్రినొప్పారు విత్తము ధర్మజునకు,
దాసీసహస్రంబు దంతిశతంబు
వాసిగా ద్రుపదభూవరునకు నిచ్చి
విపులరథంబిచ్చి విదురునిఁబనుప,
నృపునకు మ్రొక్కి యన్నీతికోవిదుఁడు
ఘనవస్తువులతోడఁ గాంపిల్యపురికి
జనుదెంచి, ద్రుపదునిసభఁ జొచ్చి, యందు
శౌరికి భక్తవత్సలునకు మ్రొక్కి ,
కూరిమిదైవాఱఁ గుంతికి మ్రొక్కి,


నుతరీతిఁ బాండుసూనులఁ గౌఁగిలించి,
ధృతరాష్ట్రుఁడిచ్చిపుత్తెంచు వస్తువుల
వారికివారికి వరుసతో నొసగి,
బోరన ద్రుపదుచేఁ బూజలువడసి
పంకజనాభునిఁ బరికించి పలికె:
"ఇంకఁ బాండవులకు నేవిచారంబు!
పాంచాలుఁ డిటఁగల్గెఁ బరమ బాంధవుఁడు;
వంచింప నికరాదు వారి వైరులకుఁ;
దలఁపులో నదిగాక తరలవునీవు;
కలుగునేవారికి గమలాక్ష, వెఱపు!
కలిగిరి వెండియుఁ గౌంతేయులనఁగఁ
గలఁగిరి తమలోనఁ గౌరవాధిపులు.
పాండునిపాలిత్తు, బార్థులకనుచు
నిండినకొలువులో నృపుఁడాడె మొన్న;
గురు భీష్మ కృపు లెఱుంగుదు; రిప్పుడతఁడు
పురికిరమ్మని పిల్వఁబుత్తెంచె వీరి.
[87]కీడెంతయెఱుగక కెలనిమెచ్చులకు
వేడుక నటియించు వీరిపైనతఁడు;
అవనిలో ధర్మజుఁ డర్ధ మేలినను,
నవఖండపతివోలె నయమొప్పఁగలడు."
అనినఁ బాంచాలుండు హరియు నిట్లనిరి:
"వినుము, నీకంటే వివేకులు గలరె!
[88]యెన్న మీఁదెఱుగక యీవు పాండవుల
మిన్నక యిట్లేల మేకొనిపిల్వ!


కొనిపొమ్ము పార్థులఁ గుతలమేలింపు;
ఘనపుణ్య, నీవు గల్గఁగ విచారంబె!
కరుణించి మునునీవు గఱపినత్రోవ
నరుదేరఁబట్టికదా! వీరు బ్రదుకు
ట." ను నంత, ధర్మరా జతని కిట్లనియె:
"మనుజేంద్రుఁ డెపుడు మీమాటకు వెఱచుఁ
గార్యార్థమగుప్రేమఁ గలిసియుండంగ
దుర్యోధనుఁడు మాటదొరఁకొనఁ; డంత
ధార్తరాష్ట్రుల కేమితప్పుచేసితిమొ!
వార్తయునొల్లరు వసుధ మేమన్న;
నతనికిఁ బ్రతికారమాత్మలో నొల్ల;
మతనిచేఁతలకు భయంబునొందెదము.
హరియును దోడురా నరుదెంచి, యచటఁ
గురురాజు వెట్టినకూడు గుడిచెదము.”

పాం డ వు ల హ స్తి పు ర ప్ర వే శ ము


అని పయనమునకు నాయిత్తమైనఁ,
దనయు ధృష్టద్యుమ్ను ధర్మరాజునకు
బలమును దోడిచ్చి పాంచాలుఁడనుప,
వెలయంగ నారాజువీడ్కొని కదలి
ద్రౌపదివెంటరా ధౌమ్యుఁ డేతేర
నాపాండుపుత్రులు హరియును దారుఁ
గుంతీసమేతులై కురురాజుపురికి
నెంతయు లక్ష్మితో నేతెంచుచుండ,
నిట వారికెదురుగా నిభపురాధిపుఁడు
పటుగతి నందనప్రతతిఁ బుత్తెంచి,
నృపతులు సేవింప నెమ్మిఁ గొల్వునకు
నపరిమితోత్సాహుఁడై వచ్చి, యంతఁ


బౌరులు సేవింప భటులుమైవంప
వారువచ్చిన లేచి, వరుసయేర్పడఁగ
నాలింగనంబుల నభినందనములఁ
జాలదీవనలఁ బూజావిశేషముల
హరిపూర్వముగ వారినందఱఁ బ్రీతిఁ
బొరయించి, మణిపీఠముల నుండఁబనిచి,
మఱదలిఁ గోడలి మఱి లోనికనిచి,
నెఱి వారినూరార్చి నిజపీఠమెక్కి
పేరుపేరునఁబిల్చి ప్రేమఁ బాండవుల
నారాజరత్న మిట్లని చెప్పఁదొడఁగె :
"అరయరు నన్ను జాత్యంధు; నిట్లేల
నరనాథులార, మిన్నక తిరుగంగ!
ఇందునందునునేల! యేనున్న కాల
మందఱు మనవలదా! యొక్క కుదుట.
ఏమిట మీకు నే హితుఁడఁగా నైతి!
నేమితలంచుక యేఁగితి రట్లు!"
అని పాండవులఁబల్కి , యందఱకన్ని
కనకగేహములిచ్చి కడఁకతోననిచె.
అప్పుడాపురమున నైదువర్షంబు
లప్పాండుసుతులు నెయ్యముఁదియ్య మెసగఁ
గౌరవసుతులతో గలిసి క్షీరంబు
నీరంబుఁగలిసిననేర్పున మెలఁగి,
హరియును దారును నధికంపుఁగూర్మి
జరియింపుచుండిరి సంతసంబునను.
అనియిట్లు జనమేజయావనీంద్రునకు
ముని చెప్పెనని చెప్ప మోదించిమునులు:
'అనఘాత్మ! తరువాతనైనవృత్తాంత
మనువొందఁజెప్పవే! యనియడుగుటయు,


ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యాశ్వాస మొప్పె నేడవది.

  1. సమవర్త
  2. మొకమాటములు
  3. అకలింతుమా (మూ)
  4. నురక (మూ)
  5. నాదూపు
  6. దొగి
  7. కీచకాస్వాంత
  8. గ్రంథపాతమగుటచే సందర్భానుసారముగా నీపంక్తులు చేర్చఁబడినవి. (మూ)
  9. మీందొఱంగె (మూ )
  10. లెక్కడెక్కడ యేనకెక్కి
  11. గ్రాగి
  12. వచ్చుటవెంపోయి (మూ)
  13. అట్లైన
  14. విందును
  15. కర్త
  16. ముష్టి (మూ)
  17. ధృష్ట మెట్లనిన (మూ)
  18. మాచంద్ర
  19. యేలిందిన
  20. యట్టి (మూ)
  21. మేదికి
  22. ఆచార (మూ)
  23. దద్భాగ
  24. గెల్వ
  25. మిన్ను
  26. అనినబ్రాచీ
  27. తనువెల్లి (మూ)
  28. స్త్రీలు
  29. తన్నుచూపి
  30. నట్లాడె (మూ )
  31. ధర్మజాదులకు అన్న మిడిన విషయమిట లుప్తమైయుండును.
  32. రాదిస్వయంబంది రాచకూంతులకు,
  33. పాయనక్రమము (మూ)
  34. జనని
  35. యేజాతితనజాతియందారథంబు (మూ). అర్థస్ఫూర్తికై యతిభంగమంగీకరించఁబడినది; మూలమునను యతిలేదు.
  36. భక్తితో
  37. ఘనజటాలునికూతు కౌతునికన్య
           మునులేవురునుగారె మున్ను గైకొనిరి
           పూచి దక్షిణియను పూబోణింగాదె
           ప్రాచేతసులు కొంట పదవకొక్కండు. (మూ)
    వ్యాసభారతమునుబట్టి పైవిధముగా మార్చఁబడినది.
  38. మూలభారతములం దీగాథ కన్పడకుండుటచే ఈ విషయస్వరూప మిట్టిదని సవరింప
    వీలు కాదయ్యెను.
  39. చారు (మూ)
  40. వలసె
  41. వలసె
  42. నీద్రౌపదిని గాంచి,
  43. ధృతి
  44. అన్వయము చింత్యము.
  45. నారాయణి (మూ)
  46. జనులలో
  47. నింగెకాటు (మూ)
  48. అనఘవాయంద మాసొగభావ (మూ)
  49. యదు (మూ)
  50. వట్టెయు
  51. భయవజ్ర (మూ)
  52. కృతకాల కుపితాంఘ్రి గిరిరాజకన్య
       నతిసక్త వామాంక నభ్రాంతిచేసి,
  53. వాహన్య (మూ)
  54. శస్త్ర
  55. బిదుల (మూ)
  56. భీతజగతాన్నివాస
  57. కరుణ
  58. ధాంగ
  59. హరిజాణ
  60. చిర
  61. స్వత
  62. సౌగ్యగమ్య (మూ )
  63. హరి
  64. భావము
  65. భూత
  66. పంచభూతిక (మూ)
  67. కుయ్యని యజనంబు గూల్పనావశమె (మూ)
  68. వృద్ధునకిట్లు
  69. గరిగంటి
  70. తనువుప్రేక్షకరంబు
  71. పిలువక (మూ)
  72. గూడుక. (మూ )
  73. కాసార (మూ)
  74. పనిపడిశంకురార్వణము. (మూ)
  75. నూరువట్టి, అనియుండఁదగునేమో!
  76. సేయ, (మూ )
  77. మ్రోవ.
  78. పీఠ
  79. వెట్ట.
  80. కనక
  81. పూర్వాంతంబుల.(మూ )
  82. కెబిరుదుదివియ.
  83. మీరు. (మూ )
  84. గొనికొండ
  85. నాకుంగాదెపుడు,
  86. గృష్ణునకు (మూ)
  87. ఈ మాట ధృతరాష్ట్రునిపట్ల నిజమేయైనను, ఈ సందర్భమున రాయబారిగా వచ్చిన
    విదురుఁడు పల్కఁదగినది కాదు.
  88. ఈవాక్యము సందర్భోచితముగాలేదు.