ద్విపద భారతము - మొదటిసంపుటము/ఆదిపర్వము - పంచమాశ్వాసము

పంచమాశ్వాసము


శ్రీ రామవిఖ్యాత, చిరతరోల్లాస,
నారీనుతక్రీడ, నరసయచౌడ,
తక్కక కర్ణావతారుండవనఁగ
దిక్కుల వెలయు మంత్రీ, చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పదొడఁగె.

ధనుర్విద్యా ప్రదర్శనము



కురుకుమారులకెల్ల కోదండవిద్య
గురుఁడిచ్చి, యొకనాఁడు కొలువులోపలను
ఆంబికేయునిఁబల్కు: "ననఘాత్మ, నీవు
[1]సంబంధియుతుఁడవై సభ్యులఁగూడి
నీకుమారుల కేను నేర్పినవిద్య
ప్రాకటలీల నొప్పనగొందుగాక ,
తజ్ఞులువీక్షించి తగునన్నఁదాఁక
విజ్ఞానిననరాదు విద్య నెవ్వరికి.
శరములుదూలింప సంధించునపుడు
గరిడివిస్తీర్ణంబుగాకున్నఁ గాదు.
[2]వాస్తుశాస్త్రజ్ఞులు వసుమతీసురులు
విస్తరింపుదురొప్ప విభుఁడ, యాస్థలము ;
పేర్చి భేతాళునిపీఠంబు తొలుత
దీర్చి యా వేల్పుఁ బ్రతిష్ఠింపవలయు ;


శకునవేదుల శిల్పశాస్త్రకోవిదులఁ
బ్రకటించి విశ్వకర్మలఁ గూర్పవలయుఁ ;
బవడంపుబోదెలుఁ బసిండికంబములు
నవరత్నవేదులు నవ్య పీఠములు
బచ్చెనగోడలుఁ బట్టుమేల్కట్లు
బచ్చఱాళులకప్పు బాగుగావలయు ;
నరనాథ, లగ్ననిర్ణయము సేయింపు ;
కరిపురంబెల్ల సింగారింపఁ బంపు ;
నృపపుంగవుల నెల్ల నెమ్మిరప్పింపు. "
అనుటయు, ధృతరాష్ట్రుఁడట్ల కాక నుచు,
ఘనునంపెఁ బురము సింగారింప విదురు.
అంత, నవ్విదురునియాజ్ఞక్రమమున
వింతగాఁ బౌరులు వేడ్కనప్పురిని
బసిఁడిమేడలయిండ్లు పసనారఁ దోమి,
వెస వెండిమేడలు వేగఁబుల్గడిగి,
సున్నంపుమేడలు సొంపురాఁబూసి,
క్రన్నన భువనేశ్వరములు భూషించి,
మాడుగులట్టళ్లుమణికవాటములుఁ
గ్రీడాగృహములు మిక్కిలిమెఱుఁగువెట్టి,
ముత్తెంపుగోపురంబులు ధవళించి,
క్రొత్తగా బంగారుకుండలెక్కించి,
మిసిమియుప్పరిగల మీఁదికోణములఁ
బసిఁడికోలలుపాఁతి పడగలుగట్టి,
గోడలయెడలఁ గుంకుమమప్పళించి,
వాడలఁ గస్తూరి వాసిల్లనలికి,
రంగైన బహునవరత్నముల్ మెఱయ
ముంగిళ్ల ముత్యాలమ్రుగ్గులు దీర్చి,


ఫల పుష్ప పల్లవ ప్రతతు [3]లయ్యెడల
నలువొప్ప బహుతోరణంబులు గట్టి,
ముంబైన సోపానములనీడ చూచు
డంబులుగల కల్వడంబులుగట్టి,
కడపట నుదయభాస్కరము గావించి,
కొడిగల రత్నపుఁగుచ్చులు గట్టి,
దీపించునమరావతికి బొమ్మవెట్టు
నీవురియనితోప నెల్ల సౌధములఁ
గాంతులుదైవాఱఁ గనకపుత్రికల
వింతవారలుచూచి వెఱుఁగంద నిల్పి,
యోలి సోరణగండ్ల నువిదలుచూడఁ
నీలిమపర్వెనో నెఱి నిట్లనంగఁ
బరిమళబహుళ ధూపంబు లెల్లెడలఁ
బరఁగించి, రత్నదీపము [4] లోలినిలిపి,
మారుబాణములకు మాఱుబాణములఁ
జేరినజనులు వీక్షింపనీ నేడు
అని విస్తరించినయట్లు సౌభాగ్య
మెనయఁ బురస్త్రీలనెల్లఁగైసేసి
యున్నంత, గరిడియు నూరితూర్పునకు
నన్నిసౌభాగ్యాల నాయితమయ్యె.
పిలువఁబంచిన రాజబృందంబువచ్చె;
నెలమిఁగూడిరిలోకు లిలయీనెననఁగ.
విదురుఁ డత్తెఱఁగెల్ల విభునితోఁ జెప్ప,
ముదమంది యారాజు ముత్యాలరథము
నెక్కుచుఁ దనయులనెల్ల రావించి,
తక్కక గురుని నెంతయుఁబిలిపించి,


“యింతులు పల్లకులెక్కిరం' డనుచుఁ
గుంతీసమేతులై కొలిచి రాఁ బనిచి,
గాంగేయ కృపులాదిగాఁగల దొరల
సంగరసన్నద్ధ సకలసైన్యముల
రాఁబంచి, బహుళతోరణరాజవీథిఁ
బూఁబోఁడులక్షతంబులుచల్లఁ గదిసి,
సంగడి విదురసంజయు లెల్ల తెఱఁగు
నింగితవేదులై యెఱిఁగింపుచుండ,
నడరి కృష్ణునికుక్షి నబ్జజాండములు
వెడలినగరిమతో వెస నూరువెడలి,
సిద్ధాంతనిపుణులు చేపట్టియున్న
శుద్ధలగ్నంబునఁ జొచ్చిరగ్గరిడిఁ ;
జొచ్చి సేనల నొక్కచో నుండఁబనిచి,
[5]యిచ్చమై రాజులకిమ్ములిప్పించి,
గాంధారియును దానుఁ గనకపీఠమున
బంధుకోటులుగొల్వఁ బసమీఱియుండె.
అప్పుడు బుధునితో నలరారుచంద్రు
చొప్పున ద్రోణుండు సుతునితోనిలిచి,
'ధనువునమెఱయుఁగదా గురుండెపుడు'
ననుచు నక్షత్రజ్ఞులాడ విల్దాల్చి,
'రామాస్త్రములుగాన రాజవైరమున
నేమిసేయునొ రాజు [6]లిందఱ! ననుచుఁ
దొనలమోములుదూర్చి తొలఁగించె' ననఁగ
వెనుకమాటున నస్త్రవితతి ధరించి,
వెనుకొని శిష్యులు విలు కోల జోడు
దొన బొమిడిక పూని తోరమై నిలువ,


నుర్వీశ్వరునిఁ దోడియోధులఁ బలికె :
"సర్వజ్ఞులందఱు సభఁగూడినారు;
వింటికి హరియొండె విశ్వేశుఁడొండె
దొంటిరాఘవుఁడొండె దుర్గతానొండె
నేతున్; రొండొకనికి నేర్తువనరాదు ;
బ్రాతిగా నట్లయ్యుఁ, బతి యాదరమునఁ
గురుకుమారకులకుఁ గొంత చెప్పితిని;
బరికింపు." డని చెప్పి పాయయిచ్చినను,
ఆచార్యులకుమ్రొక్కి యాకుమారకులు
వే చాపములుపూని వేడ్క మ్రోయించి
కనుచూపు మేరలక్ష్యము లేయువారుఁ,
గనరానిసూక్ష్మలక్ష్యము లేయువారు,
వెనుక ముందఱ నొక్క విధములక్ష్యములు
గనుఁగొని తునియ నొక్కట నేయువారుఁ,
దునిసి లక్ష్యంబు తోఁదొఱగుచోఁ దునుక
గనుఁగొని చూర్ణంబుగా నేయువారు,
ధరకమ్ము [7]నాడికాత్రయమునఁ గాని
తిరిగిరాకుండ నద్దివినేయునారు,
తగ్గక శరము పాతాళలోకంబు
డగ్గఱ ధరణిగాఁడఁగ నేయువారు,
గుఱిగొని తీగలాగునఁ బింౙపింౙ
గఱవఁ గోలలు నిడుపుగా నేయువారు,
నలుగుననొకట నైదారులక్ష్యములు
బలిమి నొక్కటఁ ద్రెవ్వఁబడ నేయువారు,
నొండొరుదలపడియుద్ధంబు సేయు
పాండిత్య మెంతయుఁ బ్రకటించువారు,


ముసల కుంత ప్రాస ముద్గర చక్ర (?)
అసి శూల హలముల హవణించువారు,
గ్రక్కున రథ తురంగమ వాహనముల
నెక్కి యుద్ధాటోప మిలఁ జూపువారు,
మఱియుఁ బెక్కనువుల మనుజేంద్రసుతులు
నెఱి విద్యచూపుచో నేలగ్రక్కదలె;
నాదిత్యురుచి మాసె నస్త్రదీధితుల;
భేదిల్లె దిశలు గంభీర[8]నాదముల.
అప్పుడు తమలోనియాగ్రహాటోప
ముప్పొంగి భీమదుర్యోధనుల్ గదిసి,
యొక్కటగదలెత్తి యురుచారురూఢి
నక్కనకాద్రివింధ్యములునా నొప్పి,
లోఁగకవ్రేసి, వ్రేటులుదప్పఁ గ్రుంగి,
వీఁగియుఁ గడిమిమై వెండియుఁగదిసి,
యుర్విపై గదలూది యొండొరుఁజూచి,
పూర్వసీమలుమాని పూపుమైఁజొచ్చి,
వ్రేటు వ్రేటునకంటె వ్రేఁకగావ్రేయ
వ్రేటుకందువులకు వేవేగఁ దొలఁగి,
గదలు వేమొగమునఁ గదియఁద్రిప్పియును,
అదియొందలేక వ్రేయక లాసిలాసి,
యాయస్త్రఘట్టన లగ్నులనీన
మాయపుఁద్రొక్కులు మహిఁగదలింప
నీసునఁబెనఁగుచో, నెఱిఁగి పట్టించి
యాసమయంబున నాచార్యుఁడనియె:

అర్జును నస్త్రవిద్యాకౌశలము



“ఇంక నా ప్రియశిష్యుఁ డింద్రనందనునిఁ
గొంకకచూడుఁడీ కోదండమునను!


'పాంచాలుఁదెత్తు నీపగదీర్తు' ననిన
సంచిత పుణ్యుఁ డీసత్యసంధుండు;
కారణంబున శిష్యగతినొందెఁగాని,
ఘోరాస్త్రవిద్య నాకొలఁది[9]వాఁడితఁడు.'
అనిచూపి నిలిపిన, నయ్యర్జునుండు
ధనువుతోడనెపుట్టెఁ దల్లికి ననఁగ,
నిరుగేల విలుగ్రాల, నిషుపరంపరలు
తొఱఁగించె నుప్పొంగుతోయధివోలె.
బాణపంజరములు బాణవర్షములు
బాణవేణిక లేయుబాగునుజూప,
'నెంతటఁబెట్టునో యీబాణమహిమ
కొంతవారింపఁడొకో! గురుఁ' డనుచు
సభికులు వెఱపు నాశ్చర్యంబునొంద,
నభినవంబుగఁ బార్థుఁడంత వెండియును
మిక్కిలియెండచే మేదినిగమర,
నొక్కటఁ బెక్కుసూర్యులఁ బొడిపించి,
పెలుచఁ గార్కొని వృష్టి పెద్దగా నుఱుమ
జలదాస్త్రమేసి యాసంభ్రమంబుడిపి,
యేయూఁతనిలువక యిలసంచలింప
వాయుబాణంబేసి వానవిప్పించి,
గరళధూమంబు లాకసమున నిండ
నురగాస్త్రమేసి యాయుబ్బు విప్పించి,
యురుతర పక్షవాయువు లుప్పతిల్ల
గరుడాస్త్రమేసి యాగర్వంబునణఁచె
దివ్యాస్త్రమహిమ లిత్తెఱఁగున మఱియు
నవ్యంబుగాఁజూపె నరులచూడ్కులకు.


గడుసూక్ష్మకుండగు; ఘనుఁడగుఁ ; గానఁ
బడ[10]కుండు; నంతనేర్పడు నెల్లయెడల;
భూమిలోనణఁగు; నభోవీథిఁదోచు
సామాదిబహువేదసమ్మితుండగుచు.
సాయకమహిమ నీచందమానరుని
గోయనిపొగడిరి కొలువువారెల్ల .
కదిసి గాంధారికి గాంధారిపతికి
విదుర [11]సంజయులంతవినిపించి రెఱుగ.
ఇంద్రాదులకురానిహృదయానురాగ
మింద్రసుతునకుఁగల్గె నిలయెల్లఁ బొగడ.
అప్పుడు, ప్రలయ కాలాభ్రనిర్ఘోష
ముప్పొంగ రాధేయుఁ డొగి మల్లచఱచి,
యాసభాస్థలి నక్కడక్కడపఱచి
యోసరిల్లక నిల్చి యుగ్రగర్వమున
నుర్వీశ్వరులఁబల్కు : “నోహో! యితండు
సర్వాధికుఁడె! యింతసన్నుతించెదరు!
దీనిఁజెప్పఁగ నేల! దివ్యాస్త్రమహిమ
యేనును నొక్కింత యెఱిఁగియుండుదును.”
అని విల్లుమోపెట్టి యర్జునుకంటె
ననువొప్ప వివిధసాయకవిద్యచూపి,
తనపెద్దకొడుకని తలఁపులోఁగుంతి
యనురాగపరిపూర్తిమైఁ జూచుచుండఁ;
"గర్ణుండనేను భార్గవునిశిష్యుండ;
నిర్ణయింపుఁడు విద్యనేర్తునోలేదొ!
అయ్యర్జునుని బలుననఘునితోడి
కయ్యంబుగోరి యీకడకు వచ్చితిని;


ఇందఱుఁజూడంగ నిపుడుగావలయు;
సందుచేకొనిపోకు చాపహస్తుండ!
ఎదుటనెవ్వఁడులేక యేయుటయొప్పె;
నిదె యింక నన్నేయు మెదిరించినాఁడ."
అనుడు, నర్జునుఁ డాత్మ నతనిఁగైకొనక
మునివ్రేల సాయక ముఖమంటి పలికె:
"పిలువక సరి యిట్లు బిరుదవైవచ్చి
పలికెదు; నీకెట్టిపౌరుషంబందు!
ఎవ్వఁడవని నీకు నిత్తుఁగయ్యంబు!
నివ్వెఱఁగయ్యెడు నీగర్వమునకు!
బుధుఁడైన గర్వంబుఁ బొరయఁడువిద్య;
నధముండు గర్వించు నల్పవిద్యలను;
పగయును మైత్రియు బంధుకార్యంబుఁ
దగువానితోడఁగదా! సేయవలయు."
ననినఁ గర్ణుఁడు పల్కు: "నస్త్రంబు గలిగి
నినువోలె మెత్తనై నేరముపలుక;
ఘోరాస్త్రజిహ్వఁబల్కుము; మాంసజిహ్వఁ
గూరిమిఁ గొసరినఁ గొనఁడుకర్ణుండు;
ఎవ్వఁడనైతినే నేమి! ర.” మ్మనుచుఁ

కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము


గవ్వడిపై మేఘకాండమేయుటయు,
ముడివడ బెడఁగైనమొగిళులనడుమఁ
గొడుకుఁగానక తల్లి కుంతి మూర్ఛిల్లి
త్రెళ్ళిన, విదురుండు దెలిపె; నాలోన
ఝల్లన నామేఘసంఘంబు వివ్వ
వాయుబాణంబేసి, వానిపై నరుఁడు
సాయకంబులు గొన్ని సంధించునంత,


నెడచొచ్చి గురుఁడు [12] దేవేంద్రజుశరము
లుడిపి, కర్ణునిఁజూచి యుగ్రుఁడై పలికె:
'ఆచార్యులముగాన, నాజిధర్మములు
వేచూపి తలపడవిడుతుము నిన్ను;
తక్కువవానితోద్వంద్వయుద్ధంబు
స్రుక్కక సేయనిచ్చుట దోష; మధికుఁ
డీనృపాలకుఁడర్హుఁ, డిందువంశ్యుండు,
సూనుండు పాండురాజునకుఁ గుంతికిని;
నెఱయ నీగోత్రంబు, నీతల్లిఁదండ్రి
నెఱిఁగింపు; [13]దొరవైన నితఁడుపోరెడిని.
ఎచ్చట నస్త్రంబు లెవ్వానిమొఱఁగి
తెచ్చినాఁడవొ! నిన్నుఁదెలియరా." దనినఁ,
దనకుసహాయమై దైవంబుదెచ్చె
ననుచు దుర్యోధనుండచ్చోటుగదలి :
ఆచార్య, నీకునిట్లడుగంగఁదగునె!
మీచందమొప్పదు; మెచ్చితివీనిఁ;
గులమడుగఁగనేల! కూతునిచ్చెదరొ!
వలనైనవిద్య యెవ్వనిపాలఁబోయె!
కులజుఁడే పెనువ్రేలుగోసిన యెఱుకు!
తలఁపరు పక్షపాతమున నాడెదరు;
రాజుగాఁడనిగదా! రణముమాన్చితిరి;
రాజుఁజేసెదఁ గర్ణు రాజులుమెచ్చ.
అని వేదపారగులైన బ్రాహ్మణుల
ఘనుఁడు సహస్రసంఖ్యలఁబిలిపించి,
కనకసంపన్నులఁగాఁజేసి, వారి
యనుమతితోఁ గర్ణు నంగభూమికిని


బట్టభద్రుని జేసి, పరఁగ నాతనికి
బట్టాంశుకంబులుఁ బసిఁడి[14]యుత్తరిగ
లురుహారములు రాజయోగ్యపీఠములు
హరులు మత్తేభంబు లాతపత్రంబు
లిచ్చిన, రాధేయుఁడిచ్చనుప్పొంగి :
"మెచ్చితి రాజేంద్ర, మేలునీ ప్రియము;
ఏమైననడుగు నీకి చ్చెద" ననిన
నామహీపతిపల్కు నందఱువినఁగ :
"ఈశ్వరుతోడ యక్షేశుండువోలె
వైశ్వానరునితోడ వాయువువోలె
జంద్రునితోఁ బుష్పచాపుఁడువోలె
నింద్రునితోడ నుపేంద్రుండువోలె
నాతోడ మైత్రి యున్నతిఁజేయు." మనిన
నాతం డచ్చోటికి నగ్నిదెప్పించి,
యావేల్పుసాక్షిగా నతనితో మైత్రి
గావించెఁ బాండవకౌరవు లెఱుఁగ.
సూతుఁడప్పుడు తనసుతుఁడుకర్ణుండు
బ్రాంతిగా నంగాధిపతియైనవార్త
విని వచ్చి గరిడిప్రవేశించుటయును,
వినుతి నారాచంబువిడువంగ రాక
ధృతి[15]సూతగోత్ర రాధేయనామములు
పతులెల్లవిన నంగపతి చెప్పుకొనుచు,
నయ్యకుమ్రొక్కి [16]లజ్జానతవదనుఁ
డయ్యున్నఁ, జూచియిట్లనియె భీముండు :
"కాకి కోయిలయని గారాము చేయు
నేకాలముననైన నెఱుఁగరాకున్నె!


ఇల సూతగోత్రుగా నెఱిఁగితి మితనిఁ;
గులమేలడాఁగును గోటి చెప్పినను,
కుక్క యందలముపైఁ కూర్చున్నయపుడె
.................................................
అంగరాజ్యమునకు నర్హుండె వీఁడు!
సంగతిఁ జనుఁగాక సారథ్యమునకు."
అనుడు దుర్యోధనుం డతనికిట్లనియె:
"తనకన్నుగానఁడు ధరణినొక్కొకఁడు!
శూరులజన్మంబు, సురలజన్మంబు,
భూరి నదీజన్మములుఁ గాననగునె!
శరవణంబునఁగాదె! జనియించెగుహుఁడు,
శరముకందువఁగాదె! జనియించెఁగృపుఁడు;
ఘనకుంభమునఁగాదె! గలిగె ద్రోణుండు;
మునినేత్రమునఁగాదె! మొలిచెఁజంద్రుండు;
తలఁప మీపుట్టువు తానెట్లు చెపుమ!
వలదన్నమానరు వాదంబుత్రోవ,”
అనిపల్కు నంతలో నర్కుండు గ్రుంకె
ఘన సహస్ర కరదీపికా దీప్తితోడ
గురునకుఁ దండ్రికి గురురాజు మ్రొక్కి
యరిగెఁ గర్ణుఁడుగొల్వ ననుజులుగొల్వ,
ధృతరాష్ట్రుఁడును రత్నదివ్యాంబరముల
శతసంఖ్యకరుల నాచార్యుంబూజించి,
యందఱననిచి రథారూఢుఁడగుచు
మందిరంబునకేఁగె మగువయుఁ దాను.
మఱునాఁడు ఱేపాడి మనుజేంద్రసుతులఁ
దెఱఁగొప్ప నాచార్యతిలకుండుచూచి:



కౌరవులు ద్రుపదునెదిర్చి పరాభూతులగుట

.


"గురుదక్షిణార్థమై గూర్చితి మిమ్ము :
నురుకీర్తులార, మాకొసగరె యొకటి!”
అనిన , దుర్యోధనుం : "డనఘ, మీకెద్ది
మనసునకిష్టంబు మమువేఁడు." డనిన,
దొల్లియేఁజెప్పితి; ద్రుపదు గర్వాంధుఁ
బ్రల్లదంబులు నన్ను బలికినవానిఁ
బ్రాణంబుతోడనే పట్టి తెం."డనిన
ద్రోణాజ్ఞ గురుకుమారులు నూటయొకరు
కర్ణుండుతోడుగాఁ గరిరథతురగ
దుర్ణివారబలంబుతో నూరు వెడలి
మున్నాడినడువ, నిమ్ములఁ బాండుసుతులు
విన్నాణముగ ద్రోణువెనుక నేవురును
నరదంబు లెక్కి సైన్యములతోనడవ,
నరుడందు నాచార్యునకుఁ గేలు మొగిచి :
“అనఘ, వీరేఁగెదరక్కట! తమకు
గొనకొని చిక్కునొకొ ! ద్రుపదుండు;
మీపూర్వసఖుఁడని మీఁదుచింతింప;
రేపాటిబిరుదులో! [17] యెఱుఁగరు తమ్ముఁ;
దడవరు ధర్మనందనుఁ బెద్దవాని!
నొడువరు భీమసేనునితోడు తోన;
ఆ రాజపుర మేమియగ్రహారంబె !
వీరలుదిరుగక విలువంప నేను."
అనునంత రథధూళి యాకాశపథము
మునుముట్టఁ, బురము నిమ్ములఁజుట్టుముట్టి,
కురుకుమారులు కంఠ[18]కుహరనాదములు
పరఁగింప, నందఱఁబాటికిఁగొనక,


పులిఁగోలవైచినపోల్కిఁ బాంచాలుఁ
డలిగి కార్ముకభీమమగురథం బెక్కి,
భట ఘోట రథ దంతిపంక్తితో వెడలి
పటుభంగిఁ గౌరవబలముపైఁ బడిన,
నీక్షింప భయమయ్యె నిరువాగురణము
నక్షీణసుభటశస్త్రాస్త్రదీధితుల,
తుండంబు లొండొండుతో బిట్టుపెనఁచి
శుండాలములపోరు చోద్యమైయుండె;
[19] జగతీశులర్థమై జగడింప, గిరులు
తెగి తాఁకినట్లయ్యెఁ దేరులుతాఁకి;
నానాభిధాన బాణంబులు వేయ
వేనామముల విష్ణువిధమైరిభటులు
అనుపమ శంఖ కాహళ పటహాది
నినదముల్ రథకింకిణీగుణధ్వనులు,
రౌద్రహుంకార పరస్పరాహ్వాన
భద్రేభగర్జితబాణనాదములు
సతతమైనిగుడఁ, బాంచాలుఁడావేళ
ధృతరాష్ట్రసుతులపైఁ దేరుదోలించి
గుఱుతింప నరుదైనకోలలుపఱపి,
[20]తఱుచుగా నరులకుఁ దాఁ గానరాక
యదలించి, [21]యందఱనన్నిదిక్కులకు
నొదిగింపఁ, గురువీరులుగ్రులై కదిసి,
పాంచాలుసేనల బాణవర్షముల
ముంచి, మొగ్గరములు మొగిఁజిక్కువఱచి,
తొడిఁబడఁ గాల్వురఁద్రుంచి తూటాడి,
బెడఁగుగాఁ దేరులుపెఱికిపేటాడి,


మొత్తమై దంతులమొత్తి మోటాడి,
మత్తిల్లుహయముల మట్టిమల్లాడి,
కన్నెకయ్యంబులు క్రమముతోఁ జేయఁ,
గన్నులఁ [22]గెంపెక్కి కాంపిల్యపతియుఁ
దలఁప వశిష్ఠనందనులపైఁ దొల్లి
చలముననలుగు విశ్వామిత్రువోలెఁ
గులిశధారలమించు క్రొవ్వాఁడితూపు
లలవోకనిగుడింప, నందంద వెఱచి,
దిక్కులు తెలియక ధృతినెత్తిపోయి
యొక్కలాగునఁ దోవలొయ్యననెఱిఁగి
పాఱి, రప్పుడు వెంటఁబడి ద్రుపదుండు
పాఱవాతి మెఱుంగుబాణంబులేసి:
"యేల వచ్చితిరి! మీరేలపాఱెదరు!
చాలునె! మీకుఁబాంచాలునేయుటలు!
వీచినచేతికి వెయ్యేండ్లటంచు
.................................................
యేనోరు పెట్టుక యేయవచ్చితిరి!
.................................................
బాసినవగ లేదు, పగపట్టలేదు,
.................................................
బాలుర మిమ్ముఁ జంపక కాచినాఁడఁ;
దేలిపొం." డనవిని దేవేంద్రసుతుడు

అర్జునుఁడు ద్రుపదుఁ బట్టి తెచ్చుట



రూపించి కురుకుమారులపలాయనము
చాపశిక్షకునకు సంప్రీతిఁ జూపి,


కురుకుమారులు కండక్రొవ్వున నతని
గురుదక్షిణార్థమై గొనిపోవవచ్చి
తతిగొనిపాఱిరి తమచేతఁగాక;
ఇతఁడునెగ్గులువల్కె; నిఁక నేనుబోదుఁ;
బవమానసూతి తోడ్పడ నాకుఁగలఁడు;
కవలిదే చక్రరక్షకులున్నవారు;
అన్న రావలదు; మీయడుగులఁగొలిచి
యున్నమే." లనిపోయె నుర్వీశుఁగూడ.
ఆవిధంబునఁబోయి యతఁడస్త్రరుచుల
భూవలయంబుగప్పుచుఁ గూడ సుట్టి:
"నిలునిలు పాంచాల, నీకుఁబోరాదు;
తలపడు మిదె పాండుతనయులమేము;
మాకౌరవులనన్నమాటలవరుస
చేగొని పసలావు సేయర." మ్మనుచు
భానుసమానాస్త్రపటలంబు లేయ,
నేనలతోడ నాక్షితిపతి తిరిగి
పలుతూవులేయంగం, బవననందనుఁడు
కలిగెఁగయ్యంబని గద త్రిప్పుకొనుచు
బరవీర ఘన[23]జానుబాహుమధ్యములుఁ,
గరితురగాది కంకాళమధ్యములు
వ్రేసివ్రయ్యలువావ, వీక్షించిద్రుపదుఁ
డోసరింపక వచ్చి యొక్కొక్కకోలఁ
బాండవసేనలఁ బదుల నిర్వదుల
జెండుగొట్టినయట్లు క్షితిఁ గూలనేసి,
యీసునరథముల కిభచయంబులకు
రా సందులేకుండ రణమధ్యసీమఁ


బాఱవాతిశరమ్ము పవనజునురము
దూఱ నొక్కటినాటి, ద్రుపదుఁడందంద
సేనాసమేతుఁడై చెదరక యింద్ర
సూనుపై శరములుచొనుపుచో, నతఁడు :
“నెఱిఁగితిఁ, గర్ణాదులితనికిఁగాక
[24]విఱుగుటకగు; వీఁడువేఁడివిల్కాడు.
వాలాయ మింతటివాడుగాకున్న,
నేలరమ్మను ద్రోణుఁ డితనినిఁబట్ట
మేనువంచింపక మేకొనిపెనఁగి
యేనుబట్టుకపోదు నిలఁగీర్తి గలుగ.”
అని దివ్యబాణంబులరిఁబోయ, నంత
ధనువు తున్కలుచేసె, తగ ద్రుపదుండు
మెఱుఁగునారసముల మేననెత్తురులు
వఱదలై పాఱ నావానవినొంచి,
కవల మీఁదఁ బ్రచండకాండంబులేయఁ,
దవిలి వేఱొకవిల్లుదాల్చి యర్జునుఁడు
నెఱి పిడుగులువోలె నిగుడి వక్షంబు
గఱవఁ బుంఖానుపుంఖములు బాణములు
పఱపుచో, నెడచొచ్చి పాంచాలుతమ్ము
డఱిముఱి సత్యజిత్తనియెడువాడు
నరునితోఁదలపడి నానాస్త్రవృష్టి
గురియ, భీముఁడు వానికొనరెట్టవట్టి
పాఱవైచినఁబోయె; బలమంతవచ్చి
దూఱంగ, నంతలో ద్రుపదభూవిభుఁడు
కోపించి భీముని గోత్రారిసుతునిఁ
జూపుడింపక వజ్రసూటిబాణములఁ


గప్పి పార్థునివిల్లుఖండించి యార్వ,
నప్పుడుకోపించి యమరేంద్రసుతుఁడు
ధీనుతగతిఁ దన తేరుపై నుండి
వాని తేరికిదాటి వడి వానిఁ దెచ్చి
బిగువుపగ్గంబులఁ బెనఁగొన మిగులు
నొగులఁ బాంచాలు నన్నొగలతోఁగట్టి,
శిథిలతఁ బాంచాలసేనలువాఱ
రథసూతుఁబడఁదన్ని, రథికులుగొలువఁ
గొనితెచ్చి 'గురునకు గురుదక్షిణార్థ'
మని ద్రుపదునిఁ జూప, నాతనిఁజూచి :
'అక్కట, ద్రుపదునకా! యిట్టియునికి!
నక్కచిక్కులు చిక్కినాఁడవి దేమి!
నిరతినన్నెఱుగుదా! నీచెలికాని;
నురురాజగర్వ మేయూరికిఁ జోయె!
అంటివి మమునొవ్వ నాఁడు; తత్ఫలముఁ
గంటి; తొంటివి యింకఁగలవె గర్వములు!
పోపొమ్ము కాచితి బుద్ధితో."ననుచు
జాపశిక్షకుఁడు పాంచాలునివిడిచి,
వినుతిఁగట్టఁగనిచ్చి వీడుకొల్పుటయుఁ,
జని యూరుచొరక యీశ్వరుఁగూర్చి తపము
నతఁడుసేయఁగఁజొచ్చె; నటపాండురాజ
సుతులతో గరిపురిచొచ్చెద్రోణుండు.
మఱునాఁడు కృప భీష్మ మంత్రికుమారు
లెఱుఁగ నర్జునుఁజూచి యిట్లనె గురుఁడు :
"చలమునఁ బాంచాలు జయకథాశీలు
గెలిచిననీకుఁ దక్కినరాజులెంత!
ఇచ్చిననావిద్య, యీడేరె నీకు;
నిచ్చెదె! దక్షిణ యింకనాకొకటి?


ఎన్నడు రణములో నీవునా కెదురు
పన్నక బహుబాణపటలియేయుచును
దాటుదో! యదినాకుదక్షిణ." యనిన
వాటంపుభక్తి ! నవ్వాక్యంబునకును
నరుఁడియ్యకొనె; నంత నరునకు బ్రహ్మ
శిరము బ్రహ్మాస్త్రంబుఁ జెప్పెద్రోణుండు.
పతి యంత యువరాజపట్టంబు ధర్మ
సుతునకు విదురభీష్ములు మెచ్చ నిచ్చి,
యనుపమ రాజచిహ్నముల నిచ్చుటయు,
జసులాత్మ నలర నజాతశత్రుండు
కరి కిటి గిరి శేష కచ్ఛపంబులకు
ధరణి భారముమోవఁ దాను దోడగుచు,
న్యాయమార్గంబున నడపి భూజనుల
శ్రీయు సుభిక్షంబుఁ జెందఁ జేయుచును,
నలువురుతమ్ములు నాలుగుదిశలు
బలిమిసాధించి కప్పంబులు చేర,
ధన ధాన్య పశు వాజి దంతులు నగర
మున నాఁటి లెక్కకు ముమ్మరింపంగ,
నానినవేడ్క సేనానిపట్టంబు
పూనినట్టి గుహుండువోలెఁ బెంపొంది,
యేకశాసనముగా నిలయేలునతని
యాకాంతి, యాశాంతి, యామూర్తి చూడఁ
జాలక, శకుని దుశ్శాసనుఁ గర్ణు
నాలోనఁగూర్చి యిట్లనియె రారాజు :
“రాజెఱుంగఁడు; యువరాజ్యంబుధర్మ
రాజునకొసగె నుర్వర హెచ్చువొంద;
మేలునఁ బగవారి మెఱయించుటెల్లఁ
బాలుపోయుటగాదె పాముకూనలకు!


సహజప్రతాపుఁడజాతశత్రుండు
మహినింతవాఁడైన మనకేమిగలదు!
వలదని నృపునకు వారింపరాదు;
కలదె! యింకనుబాయఁ గక్ష నా." కనుచు
ఘననీతిగణ్యుని గణికుఁడన్వాని
దనమంత్రి గాంధారితనయుఁడీక్షింప,
నింగితంబామంత్రి యెఱిఁగి కుమార
పుంగవునకు నిట్లు బుద్ధియేర్పఱచె :

గణికునుపదేశము



" ఓనాథ, వినుము దండోపాయనియతిఁ
గాని భూప్రజ రాజుఁగైకొనరెపుడు;
తగిన [25]దండముచాలు ధాత్రికి నైన;
దగనిదండము చెల్లుఁ దనవారిచోటఁ;
దనవారివలెనుండి దాయలై చంపు
జనుల శోధింపని జననాథుఁడేల!
తన కెవ్వ రెంతమంతనము చెప్పినను,
దనబుద్ధిలోఁగాని తానుండవలదు;
ప్రజలు మూఁకలుగట్టి బహుభాషలాడ
నిజము నిక్కము సేయ నృపునకుఁగాదు;
తనయూన మొకనితోఁ దలపోయవలదు;
.................................................
అరులు వచ్చినదాఁక నరులకుఁదాను
.................................................
పనివడి ప్రియములు పాటింపవలయు;
దార కుమార సోదరులాదిగాఁగ
వారువీరనక యెవ్వరినమ్మవలదు;


పాముచందంబునఁ బగపట్టకున్న,
భూమీశునకు భీతిఁబొందరు నృపులు;
అరిరాజు శిశువని యాలస్యమొప్ప;
[26]దరులు చేరువనున్న నటపాపవలయు;
నమ్మించియైనఁ బుణ్యము వైరిఁజంప;
నిమ్మాడ్కి నృపనీతి యెఱుఁగు కుమార!”
[27]అని పురస్త్రీలకు నాబుద్ధుఁడెట్లు (?)
మునునీతిచెప్పె నామునువునఁ జెప్పె,
విని సుయోధనుఁ డంత విభు నేకతంబ
కనుఁగొని దైన్యంబుగానరాఁ బలికె :

దుర్యోధనుఁడు తండ్రితో తనమనోదుఃఖము నెఱిఁగించుట



"పాండుసూనులకేనుభయమందుటెల్ల
మండలేశ్వర, నీవు మదినెఱింగియును,
రమణీయమగు యువరాజపట్టంబు
యమసూతికొసగితి వక్కట! తగునె!
జ్ఞాననేత్రుఁడవని జగతీశ! నిన్ను,
సూనులులేరని సురనదీసుతునిఁ
దలపోసి, ధర్మనందనుని రాజ్యమున
నిలిపెదరనివింటి నిక్కమీమాట.
వసుధాప్రజకు మంచివాఁడు గాఁగోరి
పసిఁడివెచ్చము సేయుఁ బార్ధుండు మిగుల.
పెద్దవాఁడవునీవు పృథివినీసొమ్ము ;
తద్దయు నాకురాఁదగదె! మీఁదటను.
నిజము చెప్పెద, వారు నృపతులై యుండఁ
బ్రజలకు నామీఁదఁ బట్టదుచూడ్కి


కావున, నిచ్చోటుకదలించి వారి
వేవేగ ననుపవే! వేఱొక్క యెడకు.”
అనిన నందనుతోడ నాతఁడిట్లనియె:
“తనయ, ధర్మజుఁ డట్టితలఁపులవాఁడె!
ఏజాడ నీ రాజ్యమేలఁ; డేలినను,
రాజు తానగుఁగాని, రాజు నిన్ జేయు.
పాండుండు రాజుగాఁ బాటించెనన్ను;
బాండునూనుఁడు నిన్ను బాటింపకున్నె!
వదలి యేనొకవంక వారిఁబొమ్మనిన
విదురుండు పోనీఁడు వేయేల!" యనినఁ,
గౌరవుండిట్లను : "ఘనరోషవిషము
వారిమాసందున వర్ధిల్లు నెపుడు;
నీవు పాండుఁడు నుండునెయ్యంబుగాదు;
గావున వెడలింపఁ గాదన రొరులు,
వదలఁడు నన్ను నశ్వత్థామ హితుఁడు;
తుదముట్ట విడువఁడు ద్రోణుఁడాసుతుని;
నయ్యిరువుర వాఁడు నగుఁ గృపాచార్యుఁ;
డియ్యెడ విదురున కేలావుగలదు!
ఏకభావుఁడు భీష్ముఁ డిందును నందు;
నేకార్య మనువుగా దీలోన మనకు.
కలదు గంగాతీరకాననాంతమున
వలనొప్ప వారణావతమనుపురము;
ఈశ్వరస్థాన మనేకభోగైక
శాశ్వతం బచ్చోట సౌఖ్యంబు గలదు;
గడిరాజ్యమది శత్రుగణము రాయిడికి
నెడరైనచో వీరినిడుము మే."లనిన
నొడఁబడి, యాంబికేయుఁడు పాపములకు
నొడిగట్టుకొని, వారినొక్కనాఁ డంతఁ


పాండవుల వారణావతగమనము


బ్రియపూర్వకంబుగాఁ బిలిచి యిట్లనియె:
"నయనిధులార, యోనందనులార,
యొండు ఠావుల మిమ్ము నునిచెద; నందుఁ
బొండు కుంతియు మీరు బుద్ధినొండనక.
గంగానదీ తుంగకల్లోల సుభగ
సంగతి నీశ్వరస్థానమైయున్న
వారణావతపుర వరము చేకొనుఁడు;
వైరులువచ్చుత్రోవకు నడ్డ [28]మగుఁడు;
మఱి యుత్సవముల బ్రాహ్మణ భోజనములఁ
గఱకంఠుఁ బూజింపఁగలుగు మీకచట."
అనవుడు ధర్మరాజవుఁగాక యనుచు
వినయంబుతోడ నవ్విభునకు మ్రొక్కి,
గాంధారిపాదపంకజముల కెఱగి
బాంధవులకుఁ జెప్పి పయనమౌనంతఁ,
బోయెదరని యాత్మఁబొంగియు వారి
నాయూరఁదెగటార్ప ననువుచింతించి,
యదయుఁ బురోచనుండనుశిల్పకారు
ముద మొప్పఁబిలిపించి మొదలికౌరవుఁడు
రౌద్ర దారిద్య్ర నిద్రా ముద్రనణఁచు
భద్ర కాంచనమిచ్చి, పసిఁడి తేరిచ్చి:
"రుచివిరోచన, యోపురోచన, నిన్ను
సుచితకార్యమున నియోగింపవలసె;
వారణావతమున వసియింపగోరి,
వారె పాండవు లటవచ్చుచున్నారు;
పొందుగా మున్నాడిపోయి వేవేగ
నందు లాక్షాగృహమాయిత్తపఱుపు;


మదియు నాయుధశాల కపరభాగమును
మృదుచతురస్రమై మెచ్చుగా వలయు,
ఆవాసమునఁగాని యచట వేఱొక్క
యావాసమునఁ బార్థులమరంగఁజొచ్చి
యొంటిమై నిద్రింప, నొకనాఁటిరాత్రి
మంటలుదగిలించి మడియింపు వారి.
ఇంతచేసిన, నాకునేకభోగముగఁ
జింతింప రాజ్యమిచ్చిన వాఁడవగుదు."
వనిన నింద్రార్ధమై హరునిఁగలంప
బనిఁబూని చను పంచబాణుండువోలె
వాఁడేగి, వారణావతమున మున్న
పోఁడిగాఁ గర్పూరమును సజ్జరసము
లక్క మైనంబుఁ దైలముఁ దట్టుఁ బునుఁగుఁ
దక్కోలమును హరిదళము నాజ్యంబు
గుగ్గులుధూళియుఁ గ్రొత్తకస్తూరి
యొగ్గైనమంటితో నొయ్యనఁగలిపి,
మెదిపి గోడలుపెట్టి మిద్దెయిల్ పన్ని,
మృదువుగా సున్నపుమెయిపూఁత పూసి,
తెల్లంబుగా మృత్యు దేవతవంట
యిల్లొ! [29]పావకునకు నిడిన నంజుండొ!
యన నస్త్రశాలకు నపరభాగమునఁ
బనివడి వాఁడట్లు పన్నుచునుండె.
అట పాండవులు రమ్యమైన లగ్నమున
బటుతర చతురంగబలములు గొలువఁ,
గుంతిఁదోడ్కొని బంధుకోటులనిలిపి,
యంతట దుర్యోధనాదులననిపి,


సంతోషమున నాత్మసఖుల వీడ్కొలిపి,
యెంతయు వేడుక యిగురొత్త నపుడు
గురు భీష్మ కృపులకు గురుభక్తి మ్రొక్కి,
పరఁగినబ్రాహ్మణప్రతతికి నెఱఁగి,
యారూఢచాపులై యరదంబు లెక్కి,
పౌరుల బహుదీనభాషలు వినుచు,
'నడరి యాపురలక్ష్మియయిదుప్రాణములు
వెడలెఁబొ' మ్మనితోప వెసనూరువెడలి,
యీసున గురుపతి యిలఁబొగడించు
వాసన వారణావతముమేలనియుఁ
దగఁ దండ్రియాజ్ఞగదా యిది! యనియుఁ
బొగులక తెగువమైఁ బోవుచున్నెడను,
గొంతదవ్వుల వీడుకొనువేళ విదురుఁ
డంతకసుతుఁజేరి యల్లసఁబలికె :
"పనిలేనిపని మిమ్ముఁ బతి తొలంగించె;
ననుమానములకెల్ల నాలయం బిదియు;
నచ్చటి శస్త్రవిషాగ్నిబాధలకు
హెచ్చరికలుగల్లి యీరుండవలయు;
బలవంతులని మిమ్ముఁ బరిమార్చుబుద్ధి
మెలఁగుఁగౌరవుఁ; డదిమీరుఁగన్నదియె;
యేనును వారి [30]సంచెఱిఁగి, మీకడకు
బూని యొక్కొకదూతఁబుత్తెంతు" ననుచు
జెప్పి కుంతికి మ్రొక్కి, చింతాభరంబు
గప్పినమనసుతోఁ గ్రమ్మఱవచ్చె.
పదియాఱు పదియేను బదునాల్గు మఱియుఁ
బదుమూఁడునగునేండ్ల ప్రాయంబునాఁడు


వరుస ధర్మజ భీమ వాసవి యములు
కరిపురిఁజొచ్చి యక్కరిపురిలోనఁ
గౌరవులును దాముఁగలిసివర్తింప,
వారక పదుమూఁడువర్షంబులయ్యె.
అవిగూడ నవిగూడ నైనప్రాయముల
భువి వారణావతపురిఁ జేరఁబోయి,
పురముశృంగారంబుఁ బురవిభవంబుఁ
బురపురంధ్రులుచల్లు పుష్పాక్షతములు
మెచ్చుచువచ్చుచో, మేదినీశ్వరుల
నిచ్చఁబొంగుచుఁ బౌరులీక్షించి యవుడు :
"దేవమూర్తుల [31] వీరిదృష్టింపఁ గలిగెఁ ;
బావనత్వముఁబొందె భవములు మనకుఁ ;
బట్టణంబిదిగాఁగఁ బాండునందనుల
నెట్టనరప్పించె నృపులఁగానోఁచి ;
తొడఁగి దుర్యోధనుదుర్మంత్రమునకుఁ
గడచివచ్చిరి దివ్యకాయులువీరు.”
అనికొనియాడ నొయ్యన రాజవీధిఁ
జనిచని నిజరాజసౌధంబుగదిసి,
గనకరథంబులు ఘనులంతడిగ్గి,
వెనుకవచ్చిన సేన విడియ వీడ్కొలిపి,
పుణ్యాహవాచనపూర్వంబుగాఁగఁ
బుణ్యుల విప్రోత్తములఁ బూజచేసి,
మంగళాలంకారమహితంబులైన
బంగారుగృహములఁ బరిపాటివిడిసి,
కడునొప్పు కరిపురీకనక సౌధములు
విడిచివచ్చినవంత విడిచిరి కొంత.
అంతఁ బురోచనుఁ డాజతుశ్శాల
యెంతయునేర్పుతోనీడేర్చివచ్చి,


ధర్మసూనునకది దర్శింపజేజేయ,
ధర్మజుండదిచొచ్చి తమ్ములుఁ దాను
నిచ్చలఁ బరమాత్ము హృదయంబులోన
జొచ్చినసుఖ మిందుఁజొచ్చినఁ గలిగె,
కదలిన నిది పుష్పకముఁబోలకున్నె!
కదలక యిదివోలుఁ గనకాద్రిగుహను.
ఈశ్వరునకు నిట్టియిల్లబ్బెనేని,
శాశ్వతంబుగ నేల! శయనించు నొలికి;
నారాయణున కిట్టినగరబ్బెనేని,
నీరధిలో నేల నిద్రింపఁదలఁచు!
కమలజుం డీయిల్లు గానండుగాక,
కమలంబులో నేల ఘనధూళిఁబ్రుంగు!
ఇంతచిత్రపుమేడ లింద్రుండు చూడ,
నంతరిక్షంబున నతఁడేలయుండు!"
అనికొనియాడి, గృహంబున్నయునికి
మనమలరింవక , మఱియొక్కనాఁడు
భీమునకదిచూపి పృథివీశుఁడనియె:
ఏమొకొచిత్ర! మీయిల్లున్నయునికి
నామదినమ్మదు నానావిధముల;
నీమించుపుట్టెనే! యితరమృత్తికల!
తైలాజ్యములతావితఱచు కుడ్యములఁ
జోలింపుచున్నవి; పొడవెల్ల లక్క;
కపటంబునకుఁగాని కలుగదీసొబగు;
విపరీతమునఁగాని వెలయదీయొప్పు;
ఆగ్నేయదిశనుండునదికారణముగ
నగ్నిభయంబున కర్హమీయిల్లు.
చక్కచూడ్కికి బురోచనుఁడు రోచనుఁడు
మక్కువ [32]వీనినమ్మఁగనెట్లువచ్చు!


విను మిదియునుగాక, విదురుండు మనల
'ననలవిషాస్త్రంబులరయుఁడి' యనియె."
అనినభీముఁడుపల్కు: “నట్లైన వీని
నెనయఁ దాఁగట్టినయింటితో గాల్చి,
కురురాజయత్నంబు కుడిపింత.' మనిన
ధరణీశుఁ:"డదిగాదు; తమకింపరాదు;
ఏమఱకుండుటే యిదినీతి; గాని,
భీమ, యీనీచుఁజంపఁగ నేమిగలదు!
కొన చిదుమఁగనేల! కురురాజు[33] తలఁపు
కనుఁగొంద; మెన్ని మార్గముల రాగలఁడొ!
మనము [34]మున్పడఁ, దప్పుమనమీఁద వైచి
మనుజేశునకు వాఁడు మంచివాఁడగును;
హత్తినకర్మాబ్ధి యతివోలె నిందుఁ
జొత్త; మింతేకాని సుఖకాంక్షవలదు."

విదురుఁడు పాండవులయొద్దకు దూతనంపుట



అని లక్కయింటికి నలవోకఁజనుచు
మనముల వారినమ్మనివారుగానఁ
బగళులవేఁటాడి పరఁగ రాత్రులను
మగఁటిమి విలుగోల మఱువకయుండ,
ముప్పదుల్ మూఁడును మూడుముప్పదులు
నప్పురి దివసంబులరిగె వారలకు.
అత్తఱి, విదురాజ్ఞ నాపురంబునకు
సొత్తినపరువుతో నొకదూతవచ్చి,
యేకాంతమున వారినేవురఁ గాంచి :
"యోకాంతినిధులార, యొక వార్త వినుఁడు,


విదురుఁడుపుత్తెంచె వేగుగానన్ను;
నిదె నేను ఖనకుఁడ నితరుఁడఁగాను.
దుర్యోధనునియాజ్ఞ దుర్మంత్రమెల్ల
నార్యపూజితుఁడైనన యతఁడు మున్నెఱిఁగి,
తెలువఁబుత్తెంచె నత్తెఱఁగెల్లవినుఁడు.
తలఁచి కృష్ణచతుర్దశినాఁటి రాత్రి (?)
లక్కయింట మహానలప్రయోగమునఁ
జిక్కించి, మిమ్ముహింసించు యత్నంబు
సేయ నంపించె నీశిల్ప[35]కారకుని;
నా యత్నమితఁడు సేయఁగనున్నవాఁడు.
చలమెవ్వరికి నేల! ‘చచ్చెడియంత
కలగన్నచోట మేల్కను' మనికలదు;
రం.”డనికొనిపోయి, రాత్రి యయ్యింట
గండిగా నొకచోట [36]ఖనకపుంగవుఁడు
విదురుండు చెప్పిన వెరవునఁ ద్రవ్వి,
యదియేరుపడకుండ నల్లనఁ గప్పి :
"యనలంబుదగులక యావల వెడలి
చన మీకునిదిత్రోవ జనపతులార! "
అని చెప్పి, వాఁడును నయ్యూరనుండఁ,
జనుదెంచెఁ గౌరవసంకేతదినము.
అప్పుడు కుంతి బ్రాహ్మణపురంధ్రులకుఁ
దప్పక దేవతార్థము కుడువఁబెట్ట
వంటలురుచులుగా వండించిపెట్ట,
మింట నొయ్యనజారి మిహిరుండు గ్రుంకె.
ఆయెడఁ గుంతికినాప్తురాలై న
బోయత యేవురుపుత్రులుఁ దానుఁ


జనవున నప్పురోచనుదూతయయ్యు
[37] మనసీక యందునెమ్మదినుండుఁగాన,
నెడతాఁకి యెడతాఁకి యిచ్చటివేగు
మడఁతి వానికి నాఁడు మఱి చెప్పుచుండి,
కుంతియింటనె కూడు కుత్తుకబంటి
వింతగా భుజియించి, వెస నిద్రతోడ
జతుశాల (?) కేతెంచి శయ్యపైఁ గూలి
మృతిఁబొందినట్లున్న, మేదినీపతులు
తారును భోజనోత్తరవేళ నెలమిఁ
జేరి కుంతికిఁ బాదసేవలు చేసి
శయనించి; రప్పురోచనుఁడు నచ్చోట
శయనించ గలదు నిషాది వేగనుచు.
ధరనట్లుకాదె! నిద్రాపరాయణునిఁ
బరఁగనమ్మినవానిపని మోసపోవు!

లక్కయిల్లు గాల్చుట



అందఱు నిద్రవో, నారాత్రి నిద్ర
పొందని పవమానపుత్త్రుండు లేచి,
యనలార్చి తెచ్చి యొయ్యన [38]రవుల్కొలిపి,
మును బురోచనుఁడున్నమూల దగిల్చి,
పోరాకయుండఁ దల్పులుదరికొల్పి,
ధీరుఁడు చిచ్చు మీఁదికిఁ బాఱఁజిమ్మి
విదురోపదిష్టభూవివరంబు తెఱచి,
పొదఁడని తనవారి బోధించినడపి,
లాగైన యస్త్రశాలలు దరికొల్పి
వేగంబె తానును వెడలి, యవ్వార్త


దూతకునెఱిఁగించి, త్రోవనేమఱక
యాతతగతి గంగనార్వురు దాటి
నడచుచో, నిద్రగానమిఁ జాలపెద్ద
[39] నడికినకుంతి నన్నను దోడివారి
భుజముల నఱకడంబున రెండురొండ్ల
గజలీల భీముఁడొక్కటధరియించి,
యుపపర్వతములతో నొకకొండవోలె
నుపపర్వతములెల్ల నురలఁ ద్రొక్కుచును,
గమనవేగంబునఁ గాళ్లఁబెనంగు
ద్రుమములు లతలును [40]దుమ్ముగా నడఁచె
సురభిధూమంబులు సురవిమానముల
బెరయ వహ్నియుఁగాల్చెఁ బెరిగియయ్యిండ్ల,
ఏవురుసుతులతో నిటనిషాదియును,
నావేశ్మకారుండు నయ్యింటిలోన
బావకశిఖలతో భస్మమైపడిన,
వేవేగఁ [41]బౌరులవ్విధమునీక్షించి:
కుంతియు నేవురుకొడుకులుఁ గాలి;
రంతంత నివెచూడుఁ డాఱుకుప్పలును;
జనలేక యిదె పురోచనుఁడునుగాలెఁ;
దనకుచ్చితం బేలతనుఁగాల్పకుండు!
నేమనియెఱిఁగింత మిదికరిపురికి!
నేమనిపలవింత మిమ్మహాత్ములకు!"
అనియేడ్చుచో, దూత యందఱఁగూడి
పనవ వచ్చినయట్లు భస్మంబుచొచ్చి,
వదలక యాబిలద్వారంబుఁ గప్పి,
విదురున కావార్త వినిపించెఁ బోయి.


ఆ వెన్క పౌరజనావలి దూత
పావకవార్త చెప్పఁగ , విని విభుఁడు
కులిశంబు తాఁకునఁ గుధరంబుగూలు
బలువున ధాత్రిపైఁబడి మూర్ఛనొంది,
ధృతిగలవిదురుండు తెలుఁపగాఁ దెలిసి,
సుతులకు వాపోయె సురలెల్ల నవ్వ
అప్పుడు కృపభీష్ము లాచార్యముఖ్యు,
లప్పురిఁగలవార, లచ్చటిభటులు,
నంతఃపురావాసు, లఖిలకౌరవులుఁ
గుంతికిఁ దత్పుత్రకులకు వాపోవ,
రారాజు తనకేడ్పురాకయే శిల్ప
కారునకై యేడ్చెఁ గడుపాపబుద్ధి.
అంతఁ, 'బ్రమాదాగ్నినైనయాపదకుఁ
జింతింపవల,' దని సేనాధిపతులు
చెప్ప, నించుక ధైర్యచిత్తుఁడై నృపుఁడు
నొప్పుగా వారికి నుదకంబులిచ్చి,
శ్రాద్ధకర్మంబులు సకలంబుఁజేసి,
బుద్ధిలో నేప్రొద్దుఁ బొగులుచునుండె.
అంతనక్కడ భీముఁ డన్నదమ్ములను
గుంతినట్లెక్కించుకొని సాహసమున
నినరశ్మి దూరని యీరంపుత్రోవఁ
గొనలు మిన్నందిన కొండలత్రోవఁ
నేరుదాటఁగరాని యేఱులత్రోవఁ
ఘోరరాక్షసులుండు కుటిలంపుత్రోవఁ
నేతేర, నాఁకటనెరిసి పాండవులు
పాతాళమునఁ బ్రొద్దుపడనున్నవేళ
'నీరుపట్టయ్యెడు నిలుభీమ' యనిన,
నీరుపట్టినయట్టి నేల నాతఁడును


[42] జెదరక శాఖలన్ జేచాచి మింటి
యుదరంబుత్రోచిన యొక మఱ్ఱి గాంచి,
యభవునకిల్లైన యామ్రాని మొదల
విభునిఁ దమ్ములఁ దల్లి వెరవొప్పనునిచి,
“యుదకంబులెక్కడనుండునో! ' యనుచుఁ
దుదికొమ్మ వాయుపుత్రుడు ప్రాఁకి చూడఁ,
గాక బక గ్రౌంచ కారండ [43]కమఠ
కోక బలాకాదికూజితంబులను,
వారిహారి మదాంధ వనగజ గంధ
పారణావారణ భ్రమర భాషలను
గాననయ్యెను నొక్కకమలాకరంబు
పూని విష్ణుఁడువోలె భువనభారమున.
వాయునందనుఁ డంత వసుధకుడిగ్గి,
యాయతగతి నేఁగి యమ్మడుఁగుఁజొచ్చి,
మొదలఁ గుత్తుకబంటి మొలబంటిగాఁగ
నుదకంబుద్రావి యాయువు నిల్వనమ్మి,
డొక్కలవలె నాకుడొప్పలు కుట్టి
యొక్కతోయము తోయ మొగినందునునిచి
గొనితెచ్చునంతకుఁ, గుంతియు సుతులుఁ
దనువులు మఱచి నిద్రలువోవ నతఁడు
నుదకంబుడించి వారున్నజాడకును
మదిలోని శోకంబుమల్లడిగొనగ
నుండుచోఁ, గర్ణుని యుద్దండగతికి
మండునోనామీఁద మారుతియనుచు
శంకించుగతిఁ గ్రుంకె జలజబాంధవుఁడు;
హుంకరింపుచు గూబ లుఱుములు చూపె,


బడబాగ్ని భాస్కరప్రభకోర్వలేక
వెడలె వార్థిననంగ వెససంజదోచె;
కమలయుండఁగ రాత్రి గండుతుమ్మెదలు
కమలంబులో నుండఁగాదని చెలులు
చోపిన నవియెల్లచో నుండెననఁగఁ
గాపురం బేతెంచెఁ గడలఁజీఁకట్లు;
రాజైనచంద్రుండు రానున్నతోవఁ
[44]బూజార్థమైన కర్పూరంపుమ్రుగ్గు
బెరయ దిశాకాంత పెట్టెనోయనఁగఁ
గరమొప్పెఁ జుక్కలు గగనభాగమున;
మహి ధార్తరాష్ట్రులు మనవారలనియు,
సహజనామంబుల శకునులమనియు,
[45]శిక్షించునో భీమసేనుడన్నట్లు
పక్షు లూరకయుండెఁ బలుకులుమాని;
మొగి నీలి[46] చీరపై ముత్యాలువోలె
గగనంబుపైఁ దారకంబులు వొడమెఁ;
దనమనుమలకైన తాపంబు మాన్ప
నెనసినవేడ్కఁ దా నేతెంచెననఁగ,
ధవళంపు వెన్నెల దట్టమై పర్వ
ధవళాంశుఁ డుదయించె దండి తూర్పునను.
అత్తఱి, నచ్చటికనతిదూరమున
నుత్తుంగగృహమున నొక్కరాక్షసుఁడు
నిరులుగ్రమ్మెడు మేను, నెఱసంౙగ్రుడ్లు,
నెఱిగొంకిగోళ్లును, నిడుపైనకాళ్లు,
నందమౌనొక బ్రహ్మహత్యయువోలె
డిందనిబిరుదు హిడింబుఁడన్వాడు


మానుషగంధంబు [47]మఱివల్చుటయును,
లేనవ్వుతో నావులించుచు లేచి,
తనచెలియలిఁజూచి దర్పించిపలికె:
"వినుమ హిడింబి, దైవికమున నేఁడు
మనుజులువచ్చిరి మనవనంబునకుఁ;
జని, వారిఁజంపి, మాంసము తెచ్చి నీవు
దీనపుమృగములఁదినినయావెగటు
మాన, నేర్పునవండుమా చవిపుట్ట.
దేవదానవులునుదృష్టింపరాని
యీవనస్థలియేడ! యీమర్త్యులేడ!

హిడింబ భీముని మోహించుట



పొ." మ్మనుటయు, నదిపోయి హిడింబి
యమ్మారుతాత్మజు నాననప్రభయుఁ
గన్నులసొబగు, విశాల[48]వక్షమును,
నున్నతఘనభుజాయుగమును జూచి,
పులకించి పంచాస్త్రభూతంబుసోఁకి,
తలంపునఁ దమకించి తనమేనుమఱచి,
కామరూపిణిగానఁ గడునొప్పుమనుజ
కామినియై, భీముఁగదియనేతెంచి:
"యనఘ, యేను హిడింబుఁడనురాక్షనునకు
ననుజ; హిడింబనియండ్రునాపేరు;
కామరూపిణి; నేమిగమ్మన్న నగుదు;
నీమూర్తివసఁజొక్కి, నిన్నుఁగామించి
వచ్చితి; నిమ్మహావనములో మీరు
చొచ్చివర్తించుట చోద్యంబు దలఁప!


మిమ్మునంజుడు చేసి మృదువుగా వండి
తెమ్మని నన్నుబుత్తెంచె మాయన్న;
ఆలిగా నన్నేలు; మట్లైన మిమ్ముఁ
బాలించుఁ; బట్టిచంపఁడు హిడింబుండు."
అనిన భీముడునవ్వి యానాతిఁబలికె :
"వినుము, రాక్షసులకు వెఱువమెన్నఁడును;
నిండారు సుఖమున నిద్రించువీరి
లెండని యేనేల లేపుదుఁ దొలఁగ!
వనశాంతిగా నేఁడు వధియింతు వాని
ననువెఱపింపక నాకారిఁదెమ్ము .
అనునంత, రాక్షసుం డతులకోపమునఁ
జనుదెంచెఁ దనపండ్లు సానపట్టుచును.
'వచ్చినపని యేలవదలితి' వనుచు
నచ్చెలియలిఁజంప నాయితం బైనఁ,
జెచ్చెర నది భీమసేనునిమఱుఁగుఁ
జొచ్చెఁ; జొచ్చిన వాయుసుతుఁడాదరించి,
కలహసన్నాహంబు గానరా లేచి,
చులకనిచూడ్కి నాసురవైరిఁజూచి :

భీముఁడు హిడింబాసురు మడియించుట



"యోరిరాక్షస, నీకు నుర్విలోఁ బులుగుఁ
బూరేఁడు నాహారమునకబ్బుఁగాక,
చిక్కునె పాండవసింహంబు లకట!
చక్కజత్తువుగాక సరి నెదుర్కొనిన,
నేలకు వ్రేగైన నిను బోరఁగనుట
చాలనుత్తమ.” మన్న సైరింపకసుర :
"మానవాధమ, నిన్ను మడియించుటెంత!
యేను జీరికిఁగొన నింద్రాదిసురల


ఉరవడి మ్రింగెద నోలి మిమ్మెల్ల
నఱిగిపోదురుగాక యరిది నాకుక్షి”
ననుచు దండాకారమగు బాహుదండ
మనిలజుమీఁద నయ్యసుర యెత్తుటయు,
నదలించి [49]తనదుబాహాశక్తి వానిఁ
బ్రిదులకుండఁగఁబట్టి భీమసేనుండు :
ఆజియిచ్చటనైన నాసంభ్రమమున
రాజులనిద్రాభిరతి యేమియగునో!
యెడగలుగఁగ వీనినీడ్చెద;” ననుచు
నొడలెల్లదోఁగ దైత్యుని భీముఁడీడ్చె .
విడిచినఁ గాల్కొని వీఁగకయ్యసుర
పిడికిటఁబొడిచిన, భీముండువొడిచె.
 [50]పసరించుపోటుల వసవిచారింప
నసురమర్త్యుఁడు మర్త్యుఁడసురయు నైరి.
అప్పుడు రణకాంక్ష నతఁడును నితఁడు
నుప్పొంగి పేర్చి బాహువులప్పళించి,
యురమును నురము, బాహువులు బాహువులు,
శిరమును శిరము నూర్జితశక్తిఁదాఁకి
పిడికిటిపోటులఁ బెడచేతివాట్ల
విడువనివ్రేటుల విసరు [51]దాటులను
నుక్కులై పోరుచో, నురుపాదహతుల
నిక్కినధూళి మునింగిరిర్వురును.
తుదినుండి మొదలికిఁ దొలుసంౙమొగులు
పొదివిన భూధరంబులజోడు వోలె
మఱయుచో, భీమునిమెదలరాకుండ
నిజకటంబునఁబట్టి యింద్రారియార్వఁ
గలఁగెఁబయోధులు, కంపించె గిరులు,
తలగ్రుచ్చెఁగూర్మంబు, తడఁబడెదిశలు.


ఆమహాధ్వనివిని యట నిద్రదెలిసి,
భీమునిఁగానక పృథయుఁ బార్థులును
జింతించి, రాక్షసస్త్రీనొద్దఁగాంచి ;
“యింతచక్కనిశాంత యెట్లొకో గలిగె!
ధాత్రికిఁదిగిన గంధర్వకన్యకయొ!
చిత్రమీరూపంబు! క్షితిలోన లేదు;
ఇది భీమువృత్తాంత మెఱుఁగుఁబొమ్మనుచుఁ
గదిసి యందఱునడుగఁగ, వినయమున
నది చెప్పె : "మీభీముఁడసురతో వాఁడె
చెదరక కయ్యంబు సేయుచున్నాఁడు.
ఆరాక్షసుని చెలియల నే హిడింబ;
నీరూపుగైకొంటి నిందఱువినుఁడు.
అలవోక మిమ్ము మాయన్న హిడింబుఁ
డిలఁగూల్చి తెమ్మని యిటనన్నుఁబనుప
వచ్చి భీమునిరూపవైభవంబునకు
నిచ్చ నేఁజొక్కుచో, నెఱిఁగి రాక్షసుఁడు
మీతోడ నన్నును మ్రింగెదననుచు
నేతేర, మీనిద్ర యెడలునోయనుచు
వాతనెత్తురులొల్క వాని వాతుల
సూతి దవ్వుగనీడ్చి శూరతమెఱయ
నచ్చోటఁబెనఁగెడు; నసురవధించి
వచ్చునింతట.” నన్న వారు బిట్టులికి
యుదరాగ్ను [52]లొదుఁగ నయ్యుదకంబు ద్రావి,
కదలి యాహవభూమిఁ గదియవచ్చుటయు,
నసురఁగౌఁగిటనూఁది యనిలనందనుఁడు
వెసవానివ్రేయుచో, వీక్షించి నరుఁడు :


“ ప్రొద్దువోయినఁగాదు పొరిగొనువీనిఁ;
బెద్దసేయకుభీమ, బెగడెడుఁగుంతి.
కయ్యంబు వెండియుఁ గలిగెడుఁ గాని,
యియ్యగ్రభుజుఁగూల్పు, మిదిదైత్యవేళ.
అనిన వాయుజుఁ డట్టహాసంబుచేసి,
మనుజభోజను నూఱుమాఱులు దాఁకఁ
గడకాలువట్టి యాకసమునఁద్రిప్పి
పుడమితో వ్రేయుచుఁ, బోనికోపమున
వెసఁద్రొక్కి, కోలెమ్మువిఱిచి, దిక్కులకు
నసురఁ బాఱఁగవైచె నమరులువొగడ.
కలిగే సంవత్సరగ్రాసమై వాని
పొలను రక్తంబు జంబుకభూతములకు.
అనిలజుపై నంత నప్సరస్ స్త్రీలు
గొనకొని కురిసిరి కుసుమవర్షములు.
అప్పుడు ధర్మరాజంబయుఁ దాను
నుప్పొంగి కౌఁగిట [53]నొదిగించె భీము."
అనియిట్లు జనమేజయావనీంద్రునకు
మునిచెప్పెనని చెప్ప మోదించిమునులు:
'అనఘాత్మ, తరువాతనైనవృత్తాంత
మనువొప్పఁజెప్పవే!' యని యడుగుటయు,
ఇదిసదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యాశ్వాసమొప్పె నేనవది.

——♦♦♦♦§♦§♦♦♦♦——

  1. సంబుద్ధి
  2. వస్తు (మూ)
  3. లంయడల
  4. లలో నిలిపి (మూ )
  5. ఇచ్చలదగురాజుకిమ్ము లిప్పించి
  6. లిద్దఱు (మూ )
  7. నాడిగా (మూ)
  8. నాసముల. (మూ )
  9. గాఁడితఁడు (మూ)
  10. కుండ నంతనేర్పడ
  11. సంజయులకు వినిపించిరెరింగి. (మూ )
  12. దేవేంద్రుని
  13. దొరసిన (మూ )
  14. యుత్తెరలు
  15. సూత్ర
  16. లజ్జాయత (మూ)
  17. యెరుంగము
  18. కురహ (మూ )
  19. జగతిశమార్థమై
  20. తరచునరిలకు
  21. యన్నిటి (మూ )
  22. కెంపెట్టి (మూ )
  23. సార (మూ )
  24. విఱిగినతగు (మూ)
  25. చందము (మూ)
  26. వరులు
  27. "అని పురందరుకు బృహస్పతి యెట్లు," అని వ్రాసెనేమో
  28. మనుచు (మూ)
  29. పావకునకునిదియు జుంగరియొ (మూ)
  30. చెంచెఱిఁగి (మూ)
  31. వారి. (మూ)
  32. వినియునమ్మంగ (మూ )
  33. తనకు
  34. మున్పిన (మూ)
  35. కారునకు
  36. ఘనిక (మూ )
  37. మనసికయుండు
  38. లావు (మూ )
  39. నడుకున
  40. ద్రుమముగా
  41. చారులువేగ (మూ)
  42. జెదరకబారలచేచాచికంట
  43. కుదర (మూ )
  44. భూజాతమైన
  45. శిక్షింపుచో
  46. చిరము (మూ)
  47. మాఱు
  48. వక్షతయు (మూ )
  49. వాని
  50. పసిమిన
  51. వాటులును (మూ)
  52. లొలుక (మూ )
  53. నొనరించె (మూ)