ద్విపద భారతము - మొదటిసంపుటము/ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము
ద్వితీయాశ్వాసము
శ్రీలక్షితాకార, శ్రితజటాభార,
లాలితగుణధామ, లంకావిరామ,
శరణని తలఁచు సంసారభీతులకు
వరము లీనేర్చు దేవా! చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పఁ దొడఁగె:
గరుడోత్పత్తి
"అత్తఱి నొక్కనాఁ డతివిచిత్రముగ
నుత్తుంగ[1]తైజసయోగాప్రమేయ
మయ్యున్న యండంబు సవిసిన, నందుఁ
జయ్యన సూర్యతేజఃప్రకాశుండు,
వితత[2]పక్షాంచలావిర్భూతవాత
హతసప్తశైలసంహతుఁడు ధీమంతుఁ
డుదితుఁడై, పవిచేత నూనంబుగాని
ఛదములుగల కులాచలమో యనంగ
దిగ్గన నెగసి, యేతెంచి వేగమున,
నగ్గరుడఁడు తల్లి కందంద మ్రొక్క,
వినమితుండగు పక్షివిభు [3]సవతితల్లి
కనుఁగొని సంతోష[4]కలితయై పలికె? :
"వినుము నీడోద్భవ, వినతకు నింటి
పనులు దీర్పఁగవలెఁ; బడుచులఁ బట్టఁ
దీఱదు వీరి నెత్తికొని చరింపు ;
అని ప్రభుత్వంబుగా నాడువాక్యములు
విని, యొండునాక యవ్వినతానుమతిని
జరమభాగమున నాసర్ప[5]శాబముల
నిరవుగా నిడికొని యేఁగి, శైలములు
వనములుఁ బురములు వరుస దీవులును
వనధులు దిశలు భూవలయంబు నదులు
నొండొండ చూపుచునుండఁగా, బాఁప
తండంబు వేగ నుద్ధతకోపు లగుచు
వినతకొడుకని కాద్రవేయులు గరుడుఁ
బనులు పంపుచు, వీపుపై నెక్కికొనుచు,
నొకనాడు దమకు సూర్యునిఁ జూపుమనఁగ,
వికటభోగులఁ బక్షి వీపునఁ దాల్చి
సప్తమారుతజవసత్వుఁడై యెగసి
సప్తాశ్వమండలస్పర్శుఁ డౌటయును,
బన్నగావలి చండభానువేఁడిమికి
నన్నియుఁ బెటపెటమని ప్రేలి ముణిఁగి
ధరమీఁదఁ బడి మూర్ఛదగిలియుండుటయు,
గరుడనిఁ గోపించి కద్రువ వగచి :
“యుసురుచాలనిపుత్రు లొకవేవురేల !
యసమశౌర్యుఁడు చాలఁడా యొక్కఁ!” డనుచు
వినతాత్మజునిలావు వినుతించి, యంత
దనయులదెసకు నెంతయుఁ జిన్నవోయి,
యొసగిన యినరశ్మి నందఱుఁ గమరి
వసుధపై ద్రెళ్లిన వారలఁ జూచి,
యింద్రుఁనిఁ బ్రార్థించి హితసుధావృష్టి
సాంద్రతఁ గురియించి సమసినవారి
నియ్యెడఁజాకుండ నేనడ్గి వేగఁ
జయ్యన బ్రదికింతుఁ జలమున" ననుచుఁ
దనరినభక్తి వృద్ధశ్రవుఁ గూర్చి
వినయంబుతో నిట్లు వినుతి యొనర్చె:
“దేవతాధీశ, యతిస్తోత్రపాత్ర,
పావకప్రభృతి దిక్పాలకసేవ్య,
శ్రీపతి సత్కృపాశ్రీయుత, వజ్రి,
పాపవిదూర, సౌభాగ్యసంపన్న,
మాపాలఁ గృప గల్గి మమ్ము రక్షింప
నీపాఁపకొదమల కిమ్ము ప్రాణంబు."
లనిన నింద్రుఁడు కృప నాశీవిషముల
తనువులు దడుపుసుధాధారవృష్టి
గురియింప, మూర్ఛగైకొనినసర్పములు
వరుసతో బ్రతికె నవ్వాసవుకరుణ.
నప్పుడు కద్రువ యతిరాజసమున '
నెప్పటిపోల్కి నయ్యిరువురిచేతఁ
బనిగొనుచుండ, నాపన్నగాంతకుఁడు
జననికి నొకనాఁడు సద్భక్తి మ్రొక్కి :
"తల్లి, ని న్నిది యేమి! తవిలి మీవార
లిల్లాదిగా వీరి కిచ్చిరొ వెలకుఁ!
గాదేని, నీ కొండుకడ దిక్కులేమి
నీదెస పొంది నీ విడుమఁబొందెదవొ!
కాకున్న, [6]ననదవై కడుపుఁగూటికిని
ఈకద్రువకుఁ బను లిట్లు చేసెదవొ!
అదిగాక, ప్రతినకునై పూని తగవు
వదలక యిట్లుండవలసెనో నీకు!
కులిశసన్నిభపటుక్రూరతుండాగ్ర
దళితనిష్ఠురధరాధరుఁడనై వీరిఁ
జేపట్టి, [7]కుచ్చితుచెలువున నేను
నీపాఁపకొదమల నిట్లు మోచుటకు
బనియేమి! చెప్పు మేర్పడ నాకు," ననిన,
వినత యగ్గరుడని వీక్షించి పలికె :
" ఖగనాథ, వినుమయా! కద్రువ నన్ను
బగగొని కపటంపుఁబన్నిదంబునను
గెలిచి యోడింప నీ క్రియ దాసినైతిఁ;
దలకొని నాకు నీదాసీత్వ ముడిపి
గైకొని రక్షింపు; గలరె నీకంటె
నాకు దిక్కొరులు పన్నగవైరి!" యనిన,
మనమున మిగులనుమ్మలికంబుఁ బొంది :
"జనని, నీవింక విచారింపవలదు;
ఇప్పని చింతింప నెంతటిభార!
మిప్పుడేఁ దీర్చెద; నిదె చూడు!" మనుచు
నలవు మీఱఁగ మారుతాశనజననిఁ
బలికె బ్రియోక్తితో బక్షినాయకుఁడు
దలపోసి: “నీవు మాదాసీత్వ ముడుప
వలయు; మీమదిలోని వాంఛితం బేమి!
కోరుఁ ; డట్టిది మీకుఁ గొనివచ్చి యిత్తు
వారిధినున్న దేవతలచేనున్న'
ననవుడుఁ బ్రియమంది, యహిరాజజనని
వినతాతనూజు భావించి, దీవించి,
యావైనతేయు కిట్లనియె: "నోగరుడ,
వేవేగఁ బోయి తే వెస నమృతంబు.
ఘనపరాక్రమము వేగంబును గలిగి
వినుతిఁ బెంపొందిన విహగముఖ్యుఁడవు;
దాస్యంబుఁ బాపుకోదలఁచెద వేని
హాస్యంబు పొందక యమృతంబు మాకుఁ
దెచ్చియి." మ్మనవుడుఁ దెచ్చెదననుచు
నచ్చుగా మైకొని, యట దల్లికడకుఁ
జనుదెంచి తత్ప్రయోజన మెఱిఁగించి:
అమృతాహరణము
'చనితెత్తు నమృత మీక్షణమున.'ననినఁ,
దనయుఁ గౌఁగిటఁ జేర్చి తగ నాదరించి,
తనరార నొండొకతడవు వీక్షించి :
కలఁగక యట్టి దుర్ఘటమైనపనికి
దడయక మైకొని తనయ, వచ్చితివి.
అమరులసాధింప నలవియె మనకు!
నమృతంబు సాధింప నలవియె నీకు!
నెలమి నేఁ బెక్కువేలేఁడులు తపము
నలయకచేయఁ, బుణ్యానుకూలమున
గలిగిన నాదైనగర్భంబునందుఁ
బొలుపార రెండండములు పుట్టుటయును,
దవిలినపుత్త్రవత్సలత నందొకటి
యవియింప నేరమి నయ్యండమునను
గొడుకొక్కరుఁడు [8]పిచ్చుకుంటయి పుట్టి,
పెడఁబాసి చనియెఁ గోపించి శపించి,
దానిచే సుమ్మి యీదాస్యంబు నాకు
నిడుమలఁ గుడిచి, యే నిట నిన్ను గాంచి,
యుడుకాఱి వగదప్పి యుండితిఁ; బిదప
నిను బాసి యేరీతి నిలువంగనేర్తు!"
ననవుడు తల్లితో ననియె మోదమున :
"నమరలోకం బెంత! యస్వప్ను లెంత
యమృతంబు సాధించు టది యెంత నాకు!
నీకేల మదిలోన నేఁ డింతచింత!
గైకొని యమృత మీక్షణమునఁ దెత్తు."
ననవుడు ప్రియమంది, యప్పు డావినత
గొనకొని యాత్మలోపలఁ బతిఁ దలఁచి,
తనయునితనువు హస్తంబున నిమిరి,
తనరారువేల్పులఁ దలఁచి యిట్లనియె:
"అనిలుండు నీ ఱెక్కల, నలుండు శిరము,
తనువు సూర్యుఁడు, వీఁపు తారకావిభుఁడు
కాతురు; వేల్పులు కరుణతో నిన్ను
బ్రోతురు ; విజయంబు పొందు నీ వనఘ!”
అనుచు దీవించినయమ్మకు మ్రొక్కి :
"జనని, యే నమృతంబు సాధించునపుడు
ఘనజవసత్వంబు గలుగంగవలయుఁ;
గనుఁగొన క్షుత్తుచేఁ గాదు కార్యంబు;
ఆహార మేది పద్మాక్షి, నా!” కనిన :
"సాహసబలుఁడ, నీచనుత్రోవ జలధి
లోఁ గిరాతాలి వాలుచునుండు ; వారు
లోఁగక జనుల నుశ్లోకుల నెపుడు
కారించి, యేపుచుఁ, గడువ్రొవ్వి, గణన
మీఱి, దుర్వారు లమేయప్రతాపు
లగ్లలమై యుందు; రల కిరాతులను
డందు విప్రుండు నీకనశనం బగును;
ఎందు నీకును జయం బెసగు ఖగేంద్ర!"
నచ్చట విప్రుఁ డని యెఱుంగుటకు
వినిపింపు గుఱుతైనవిధము,' నావుడును :
“పక్షీశ, బోయల భక్షించునపుడు
కుక్షిలోనికిఁ బోక, కుత్తుకయందుఁ
జిక్కుగాలము క్రియఁ, [9] జిచ్చునుబోలె
మిక్కిలిమండుచు మెఱయుచునుండు."
అని బ్రాహ్మణునిగుఱుతంతయుఁ జెప్ప,
విని ముదమంది యవ్విహగవల్లభుఁడు
వినయంబుతోఁ దల్లి వీడ్కొని, ధరణి
ననువొంద నిలిచి, యాయతపక్షయుగము
కొండొక యల్లార్చి, కుప్పించి, యమర
మండలియును మర్త్యమండలి పొగడ,
దిగిభముల్ చెదర, భీతిలి శేషుఁ డదర,
జగములన్ని వణంక, శైలముల్ బెణఁక ,
జవమున నెగసి నక్షత్రమార్గమున
బవనవేగమున నిర్భరగతిఁ బఱచి,
వారిధిలోన నెవ్వారి కభేద్య
శూరులై వాలి యస్తోకశౌర్యమున
మత్తులై త్రిదివసమాజంబునైన
నొత్తిగెల్వఁగఁజాలు నురుశక్తిగలుగు
శబరవే[10]షుల గాంచి, చటులవేగమునఁ
బ్రబల[11]గుహానిభవక్త్రంబుఁ దెఱచి,
బలువిడిఁ బెక్కండ్రఁ బట్టి యొండొండ
తలఁగక మ్రింగ, నత్తఱి గళబిలము
చొచ్చి లోనికిఁబోవ సుడిసి కార్చిచ్చు
నచ్చున నేర్చిన, నట వాని విప్రుఁ
డని మది నెఱిఁగి విహంగపుంగవుఁడు
వినయవాక్యంబుల విప్రుతోఁ బలికె :
అనఘచరిత్ర, బ్రాహ్మణుఁడ, వెల్వడుము
నిను మ్రింగ'; ననిన భూనిర్జరుం డనియె:
“ద్విజకులోత్తమ, యేను ద్విజకులోత్తముఁడ;
సుజనమాన్యుండఁ; బ్రసూనాస్త్రుబారిఁ
బాఱి, నిషాది నాపత్నిగాఁ జేసి,
వీరిలోపలఁ గూడి విహరింతు; నన్ను
నీ వెఱింగితి; ధర్మనియతి నీకంటె
భావించి కాంచు నేర్పరు లెందుఁ గలరు!
నాకూర్మిసతి కంఠనాళంబు చొచ్చి
నీకుక్షిలోపల నిలిచియున్నదియు ;
ఆకాంత రాక నేనవల రాఁదగదు;
నీకృప కలిమి మన్నించి నాకిమ్ము
విహగేంద్ర!" యనవుడు, విప్రుని మ్రింగ
విహితంబు గాదని వెలయ నిషాది
మగుడింపరామియు మదిలోనఁ దలఁచి,
తగిలి భూసురునిప్రార్థనమును జూచి :
అనఘాత్మ, యోధరామరవర్య, వేగ
చనుదెండు వెలువడి సతియును నీవు.'
అనవుడుఁ బ్రియమంది, యవనీసురేంద్రుఁ
డనురాగ ముప్పొంగ నపుడు నిషాది
సహితుఁడై వెలువడి సద్వృత్తినరిగె .
విహగాధిపతి బోయవీడెల్ల మ్రింగి,
పోయి సురాచలంబున నిష్ఠతోడఁ
“కరుణావిధేయ, జగజ్జీవజనక,
కర మొప్ప మాతల్లిఁ గద్రువ తనకు
మరియాదమాలి, నెమ్మది దాసిఁ దేలి
పరికింప నన్నును బంటుగా నేలి
కొనియుండ, నయ్యురగులకు నమృతము
గొని తెచ్చియిచ్చి, మేకొనఁగ దాసీత్వ
ముడిపికోఁబూని పోవుచునుండి, జలధి
నడుమనున్నట్టి కాననచరావలుల
ఘనబుభుక్షార్తిఁ బెక్కండ్ర మ్రింగినను
దనివి లేకున్నది; తవిలి యాహార
మనఘాత్మ, దయచేసి యర్థి నన్ననుపు."
మనుడు నాకశ్యపుఁ డాత్మసంభవునిఁ
గనుఁగొని, యాతనికడఁకకు మెచ్చి:
సుప్రతీకవిభావసుల శాపవృత్తాంతము
"మును విభావసుఁడను మునివరుఁ డొక్కఁ
డపరిమితం బైన యర్థంబుఁ బడసి,
విపులలోభాత్ముఁడై, వీసంబు నందు
[12]వ్రయము గాకుండ నేర్పడఁ బాఁతి దాఁచి,
దయ లేక శిశువులు దగఁ గూటి కేడ్వ,
[13]నాయివారముల హీనాశ్రయవృత్తిఁ
బోయినంతనె పొద్దుపుచ్చుచు, దినము
లొకరీతి గడుపుచు నున్నచో; నంత,
నొకనాఁడు వానిసహోదరుండైన
సుప్రతీకాఖ్యుం డచ్చోటికి వచ్చి,
యప్రయాసంబున నతనికి విత్త
మేరాళముగఁ గల్గు టెఱిఁగి తా నతనిఁ
జేరి యిట్లనియె: "నొచ్చితి; బేద నైతిఁ;
బితృ[14]పితామహులెల్లఁ బెంపారఁ దొల్లి
యతులధనాఢ్యులై యందఱు నేఁగ ,
దాఁచిన యర్థమంతయు నొక్కరుఁడవె
చూచి చేకొంటి; వచ్చుగ విభాగించి
నాకు నీవలదె ధనంబులో సగము!
చేకొని తండ్రి చేసినఋణంబున్న
వడిఁ బంచి నా కిచ్చువాఁడవు గావె!
గడుసరితన మేల! కన్నవారెల్ల
నగుదురు; గాన, సన్నకుసన్నధనము
సగమి" మ్మటంచు వేసరక వేడుటయు,
నలిగి, విభావసుం డర్థలోభమునఁ
బెలుచఁ దమ్మునిజూచి "పృథివిపై గజమ
వై యుండు” మని శాప మర్థి నిచ్చుటయు,
నాయెడ సుప్రతీకాఖ్యుండుఁ గనలి,
శాపించె మఱల గచ్ఛపముగా మిగులఁ
గోపించి మదిఁ గొంకుఁ గొసరును లేక.
సరవి న ట్లన్యోన్యశాపముల్ వార
లిరువురుఁ గాంచిరి; యేనుగౌ వాఁడు
మొగి నాఱుయోజనంబుల విస్తృతంబు,
తగనున్నతంబు ద్వాదశయోజనములుఁ
గలిగి, యొక్కెడ నొక్కకానలో నుండఁ,
నలువారఁ బదియోజనంబులువిరివి,
పొలుపార యోజనంబులుమూఁటిపొడవు
ధరియించి, తొంటిక్రోధంబునఁ జేసి
సరిఁ గలహింతు రచ్చలముతో; నిపుడు
నారెండు నాహారమగు; నట కేఁగ
నారయ జయసిద్ధియగు నీకుఁ బుత్ర!"
యనవుడుఁ బ్రణమిల్లి, యచ్చటి కేఁగి,
కనియె నాగరుఁడండు గజకచ్ఛపముల;
గగనంబు నీలమేఘంబు నొక్కటనె
తెగి కలహించు నత్తెఱఁగున నుభయ
వనములలోని జీవంబులు బెగడఁ
గనలుచు నొండొంటిఁ గదిసి తాఁకియును,
దొక్కియుఁ, గఱచియు, దోఁగ నీడ్చియును,
నొక్కట నిగిడియు, నొరసియు, నిట్లు
వెక్కసంబుగఁ బోర వీక్షించి, వాని
గరుడఁడు గజకచ్ఛపములతోఁ గశ్యపునొద్ద కేఁగుట
ఱెక్కల నడఁచి, యారెంటిని గాళ్లఁ
బెనచి, నభోవీథి బిట్టు లంఘించి
చనుచోట గాంచ భీషణగహనంబు;
తనరు కైలాసభూధరమునుబోలె
ననుపమలీల శివాన్వితం బగుచు,
రమణ ధనదునిమందిరంబును బోలె
నమలిన కాంచనాయతపూర్ణ మగుచు,
దండిమై మునిజనస్థానంబుఁ బోలె
శాండిల్య కౌశిక సంయుక్త మగుచు,
జలజమిత్రుని దినచక్రంబు పోలె
విలసిల్లు రాజర్క[15]విన్యాసమగుచుఁ,
బురణింప ఘనరుద్రభూమియుఁ బోలె
నరుదాఁర బ్రబలభూతావాస మగుచు,
వేదప్రవర్తితవిప్రాళి పోలె
మోదమై గాయత్రిముఖ్యతఁ బొల్చి,
కనుఁగొనఁగా వర్షకాలంబుపోలె
మునుకొన్న జీమూతములఁ దేజరిల్లి,
గుఱుతైన దేవేంద్రుకొలువును బోలె
వరుస నొప్పగు వహ్నివరుణులు గలిగి,
సలలితంబైన కాసారంబు పోలెఁ
బొలుపైనయట్టి యంబుజములు గలిగి
విలసిల్లుచున్న యవ్విపినమధ్యమున
లలి నొప్పుచుండు నలంబతీర్థంబు.
అచ్చోట రోహణంబను వటభూజ
మచ్చరువై విహాయసమెల్లఁ గప్పి
తేజరిల్లుచు వైనతేయునిఁ జూచి :
యోజగన్నుతశీల, యొనర నాయందు
శతయోజనంబుల శాఖలుగలవు.
జతనమై యుండి కచ్ఛపమును గజము
నాహారముగఁ గొని యరుగుము; నీకు
నూహింప నిదిగాని యొండిమ్ములేదు."
అనవుండు పక్షీంద్రు 'డౌఁగాక!' యనుచుఁ
దనపాదయుగళంబు తరుశాఖ నూఁద,
ఫెళ ఫెళధ్వనులఁ బెంపెక్కి యొక్కింత
నిలువక విలయాభ్రనిర్ఘోషఘోష
ములఁ గొమ్మవిఱుగ, నప్పుడు ఖగేంద్రుండు
నెలవుగాఁ దరుశాఖ నిలిచి తపంబు
నతినిష్ఠఁ జేయుచు ననశనస్థితులు
యతులకు నుపహతియగునని, శాఖ
క్షితిమీఁదఁ బడకుండఁ జెలువొంద దానిఁ
గఱచిపట్టుక, గజకచ్ఛపంబులను
నిఱికిపట్టుక దివినేఁగుచో, నెచట
నిలువనాధారంబు నెఱిఁ గానలేక
పలుశాఖతోడుతఁ బలువిడి తండ్రి-
కడకేఁగి మ్రొక్కినఁ, గశ్యపబ్రహ్మ
కొడుకులావునకు నెక్కుడు ముదంబంది,
యమ్మహాశాఖయం దతినిష్ఠనున్న
యమ్మునీశ్వరులఁ బ్రియంబునఁజూచి:
యలఘుబలోదాత్తుఁడగు నీసుపర్ణుఁ
డలమి యీశాఖ మీకగుబాధకులికి
విడువకయున్నాఁడు, వీని మన్నించి
కడఁకమై మీరొండుకడ కేఁగవలయు."
ననుచుఁ బ్రార్థించిన యతని వాక్యములు
విని, యతుల్ తరుశాఖవిడిచి శీతాద్రి
కరిగిన, గరుడఁ డత్తఱిఁ దరుశాఖ
ధరణిపై విడువక తండ్రి కిట్లనియె:
ఈశాఖ విడిచిన నిందుచే జనులు
నాశముగానికాననమానతిమ్ము'
అనవుడు విని : “తుహినాద్రిప్రాంతమున
ఘనత నిష్పురుషనగంబున వైవు;
చను మదిలక్షయోజనములదూర'
మనిన గరుత్మంతుఁ డతులవేగమునఁ
జని, తరుశాఖ యచ్చట దిగవిడిచి,
ఘనుఁడు శీతాద్రిపై గజకచ్ఛపములఁ
దనివోవభక్షించి తగఁదృప్తిఁబొంది,
యనఘుండు మఱి తుహినావనీధరము
చలియింప నురపడి జరణంబు లూఁది,
బలువిడి గంపింపఁ బద్మజాండమ్ము
భల్లున నవియ భూభాగంబులద్రువఁ
దల్లడించుచు జీవతతియెల్లఁ దూల
నురవడి మింటికి నుప్పరం బెగసి,
కరువలికంటె వేగమె పోవుచుండ,
నప్పు డాసురపురియందు నెల్లెడలఁ
దప్పక దుర్నిమిత్తంబులు దోప,
వెఱఁగంది ధిషణు రావించి యింద్రుండు :
'సరవి నుత్పాతసూచనకుఁ గారణము
నెఱిఁగింపు.' డన మతినెఱిఁగి యాగురుఁడు
తెఱఁగొప్పఁ బలికె నాదేవేంద్రుతోడ :
“శతమఖ, విమము; కశ్యపువరంబునను
నుతకీర్తి వినతాతనూజాతుఁ డగుచు
జలనిధిలోనున్న శబరుల నెల్లఁ
గలగొని మ్రింగి, యాగజకచ్ఛపముల
నొక్కక్కట మెసవి, మహోగ్రతేజమునఁ
జక్కనఁ దల్లిదాస్యం బెడఁబాపు
కొఱకునై, యురగముఖ్యుల కమృతంబు
తెఱఁగొప్పఁ గొనిపోవఁ దివిఱి యిచ్చటికి
వచ్చుచునున్నాఁడు వైనతేయుండు.
- * * * * * * * * *
నీకు నసాధ్యుండు నిర్జరనాథ,
కైకొని నీవు నగ్గరుఁడనిమహిమ
గ రుడ నిమహిమ
యెఱుఁగుదు; వెట్లన్న నెఱిఁగింతు వినుము.
గణములు దనకు నొక్కట సహాయముగ,
గణనమీఱినమునిగణములతోడఁ
బరమపుణ్యుఁడు కశ్యపబ్రహ్మ వేడ్క
పురణింప నరుదైనపుత్త్రకామేష్టి
సలుపుచో, నీవు నిర్జరులతోఁ గూడి
యెలమి రాఁ, [16]బాదము లిట్టట్టువడుచు
మానితాంగుష్టప్రమాణదేహములఁ
బూనిక ఫలమూలములు సమిధలును
వరుసతో గొనివచ్చు వాలఖిల్యాది
పరమసంయముల నేర్పడఁజూచి నగినఁ,
గనుఁగొని, రోషించి, ఘనమునీశ్వరులు
చనుదెంచి, నీమీఁదిచలమున నప్పు
డతివీర్యవంతంబులైన మంత్రముల
నతినిష్ఠ ననలున కాహుతుల్ వ్రేల్చి :
'శతమఖుకంటెను శతగుణవీర్య
యుతుఁడు కశ్యపునకు నుదితుఁడై, యాతఁ
డింద్రున కింద్రుఁడై యెసగుత.' మనిన
నింద్ర, నీ వంతయు నెఱిఁగి భీతిల్లి,
వాలఖిల్యులఁ జేరి వరుస బ్రార్థింప,
నాలోనఁ గశ్యపుఁ డమ్మునివరులఁ
గనుగొని: "మీ రిట్లుగా నియమింపఁ
జనునె! యాతఁడు బ్రహ్మసమ్మతి నింద్రు
డయ్యున్న నింక రెండవయింద్రుఁడైనఁ
జయ్యనఁ ద్రైలోక్యజనులకు బాధ
యగుఁ; గాన, వేఱొక్కయనువున నతని
'ఖగముల కింద్రుడౌఁ గా' కనకున్నఁ
గాదు; మీపలు కమోఘము గానఁ, బిదప
నాదినాకాధిపు నమరత్వ ముడుగు;
నదిగానఁ గరుణింపు" డన మహామునులు
ముదమంది నీకు నిమ్ములఁ గరుణించి,
యాపుత్రకామేష్టియందు జన్మించు
నాపుత్త్రకుఁ బతంగాధ్యక్షుఁ జేసి.
రట్టి యామునుల మాహాత్మ్యంబువలనఁ
బుట్టిన తార్క్ష్యుఁ డిప్పుడు వచ్చుకతనఁ
బూని మహోత్పాతములు పుట్టె" ననిన
నానిర్జరాధీశుఁ డమృతరక్షకులఁ
దగఁ బిల్చి:"కడుఁబ్రయత్నమున మీరెల్ల
ఖగపతి యమృతంబు గైకొనకుండ
రక్షించుకొని, లావు ప్రకటించి బిలిచి,
పక్షి నాహవమునఁ బఱపుఁ డీక్షణమ."
గరుడఁ డమృతరక్షకులతో యుద్ధ మొనర్చుట
యనవుండు నట్లకా కనుచు వారేఁగి,
మును నిశితాయుధంబులు పూని రేయుఁ
బవలును నమృతంబు పటుభంగిఁ గావఁ,
బవమానవేగుఁడై పక్షీంద్రుఁ డపుడు
బెడిదంపుమ్రోతలఁ బిడుగునుబోలెఁ
గడఁకమై విష్ణుచక్రంబునుబోలె
ఱెక్కలుగలమహాద్రియుఁబోలె రభస
మెక్కుడై వచ్చెఁ; బక్షీంద్రునిపక్ష
వాతూలగతి రెండువ్రయ్యలు గాఁగ
నాతతలీల మహాభ్రముల్ దునిసి
తునుకలు నలుదెసఁ దూలి పాఱంగ,
వరుస మహావేగవాయువేగమునఁ
బరతేరఁ, దత్సుధాపాలురు భీతిఁ
గలగుచుఁ బాఱిపోగమకించి, నిలిచి
బలపరాక్రముఁడైన పక్షీంద్రుఁ గనిరి.
కని యనల్పక్రోధగర్వులై తాకి,
పనుగొని నిశితాస్త్రపంక్తులు దాల్చి
తడఁబడనేసియుఁ, దాఁకనేసియును,
- * * * * * * * * * *
మొత్తియు, నొత్తియు, ముసలఘాతముల
నొత్తియుఁ, దాఁచియు, నుదరితాఁకియును,
ధట్టించియును మహోద్ధతి నిట్లుపోరు
నట్టినిలింపుల నరవాయిగొనక,
పక్షవిక్షేపణ[17]ప్రనృతరేణువులఁ
జక్షులఁ గప్పి, చంచల మందఁజేసి,
విదితకోపోద్రేకవిస్ఫులింగములఁ
బదనఖతుండాగ్రపక్షఘట్టనలఁ
గనుకని రక్త మంగంబులఁ దొరుఁగ
దనువులు చించి, యుద్ధతి వ్రక్కలింప,
నమరులు, వసువులు, యక్షకిన్నరులుఁ,
గమలబాంధవులు, నేకాదశరుద్రు
లందఱు నొక్కట నాజి చాలించి
యందంద పాఱిన, నట పక్షివిభుఁడు
సమరకేళీలోలచతురుఁడై యప్పు
డమృతంబుకడ కేఁగి, యచ్చట ఘోర
తరసమీరణప్రేరితంబైన యగ్ని
దరికొని మిన్నులుదాఁకెడిశిఖలు
గలిగి త న్నటుపోవఁగానీగయునికి
దెలిసి, దక్షిణవార్థి దివ్యజలంబు
పుక్కిటఁ గొనివచ్చి పోసి చిచ్చార్చి ,
తక్కక చని, తీక్ష్ణ[18]ధారమై దేవ
కల్పితంబైన చక్రంబురంధ్రమున
నల్పాంగుఁడై చొచ్చి, యట మహాఘోర
గరళాగ్నికీలసంఘటితవిస్ఫురణ
నరుణరుణాక్షివిధాగ్నులఁ జూపు
మాత్రనె పరుల భస్మముసేయు నుగ్ర
గాత్రమై యతిభయంకరలీలనున్న
భుజగయుగంబును బొడగాంచి, తనదు
నిజపక్షయుగముచే నేత్రముల్ గప్పి,
నలిరేఁగి వానిఫణంబులు ద్రొక్కి,
చెలఁగుచు నమృతంబు చేకొని వెడలి,
దివికి లంఘించి యుద్దీప్తబలుండు
దివిజులనెల్లను దృణలీల గెలిచి
విష్ణువు గరుడు ననుగ్రహించుట
పోవుచో, నప్పు డంభోరుహనాభుఁ
డావైనతేయు పరాక్రమశక్తి
కెంతయుఁ బ్రియమంది, యిచ్చలో నతని
సంతతసత్కటాక్షంబున నునుపఁ
దలఁచి, సన్మునులు బృందారకానీక
ములు సందడింపుచు ముందఱనడువ ,
వాణీశ్వరుండు గీర్వాణేశ్వరుండు
రాణింప నుభయపార్శ్వంబుల నడువఁ,
జల్లనిచూపుల సకలలోకులకుఁ
దల్లియై ప్రోచు పద్మాదేవి దనదు
వక్షస్థలంబున వరశుభోన్నతుల
సాక్షాత్కరించి ప్రసన్నత నిలువ,
దివ్యరత్నోజ్జ్వలదీప్తులతోడ
భవ్యమై కౌస్తుభాభరణంబు వెలుఁగ,
నొసవరిలాగున నొఱపైన మంచి
పసిఁడిచాయలచీర పసమీఱఁ గట్టి,
మహితప్రభావనిర్మలరత్నఖచిత
బహువిధాలంకారభానుప్రకాశ
వరపుష్పకం బెక్కి, వైభవోత్సాహ
తరసమగతి నొప్పు తనచిత్తమునకు
మెచ్చులు వొదలంగ మెఱసి యక్షేశుఁ
డిచ్చమై : “నవధారు హేవజ్రధీర ,
సకలలోకారాధ్య, సన్మునిస్తుత్య,
మకరాంగశతకోటిమహిత, పరాకు!
సందీప్తఘనచక్రసంహృతదనుజ,
యిందిరానాయక, హెచ్చరిక!' ననఁగ,
దేవదేవుఁడు సర్వదేవతామయుఁడు
వేవేగ నేతెంచి, విహగవల్లభున
కాదటఁ బ్రత్యక్షమై నిల్చునంత,
నా దేవదేవు శుభాకృతి భక్తి
భావించి పులకించి ప్రమదంబుతోడ :
.........................................
"పద్మాలయసద్మ, పద్మపత్రాక్ష ,
పద్మజవినుత, సద్భావనాతీత,
సత్యస్వరూప, నిశ్చలతత్వరూప,
భక్తలోకాధార, [19]ప్రణవస్వరూప,
నక్తంచరాంతక, నాగేంద్రవరద,
నీదయాదృష్టిచే నిఖిలలోకములు
ప్రోదియై నుతికెక్కి పొదలుచున్నవియు.
లోకంబులకు నీవు లోనుగానేర్తు;
లోకంబు లెల్ల నీలో నున్ననేర్తు;
వాదిదేవుఁడవు; సర్వాత్మైకపరుఁడ;
వాదట బ్రహ్మాదులైన నీమూర్తి
కనఁగ నెంతటివారు! కమలాధినాథ!”
అని సన్నుతించిన యావైనతేయుఁ
గనుఁగొని మనమున గారవం బార:
"వినతాతనూజ, నీవిక్రమక్రమము
లావును జవముఁ జలంబు సద్భావ
మేవలనను మేల; యెవ్వారు నిన్నుఁ
బోలరు మగఁటిమి బొంకుటగాదు;
మేలువరం బిత్తు మెచ్చితి నడుగు."
మని ప్రసన్నాతుఁడై యాన తిచ్చుటయు,
మనమునఁ బొంగి, సామజవరదునకు
వినతుఁడై కరములు వెరవొప్ప మొగిచి
తనర నిట్లనియె: "నీదయ నాకు నెపుడు
నమృతంబు గోరక యజరామరంబు
సముచితంబుగ నిచ్చి, సకలలోకముల
కగ్రణివైన నీయగ్రంబునం దు
దగ్రతేజత నిన్ను దయఁగొల్చియుండ
వరమిచ్చి కరుణింపు వరదయామూర్తి,
పరమకృపాలోల, భక్తవత్సలుఁడ! "
యనవుండు దయచేసి, హరి ఖగేశ్వరునిఁ :
“దనకు వాహనమవై ధ్వజమవై యుండు.'
మనుటయు, నతఁడు 'మహాప్రసాద'మని
వినతుఁడై లక్ష్మీశు వీడ్కొని పోవ,
గ రు త్మ దిం ద్రు ల మై త్రి
మగఁటిమి వాటించి మఱియు నింద్రుండు
ఖగపతిపై మదోత్కటవృత్తి వచ్చి
భిదురంబు వైవ, నాభీలరవంబు
లొదవంగ మండుచు నురవడి వచ్చి
గరుడనివక్ష ముగ్రతఁ దాఁకుటయును :
- * * * * * * * * *
"నీ వెటు నను నొంప నేరవు; వినుము,
వావిరి మునిసంభవంబవు, నింద్రు
కైదువవును గానఁ, గడుఁజిన్నబుచ్చ
గాదు; కావున, నీవు కడఁగి మదేక
పర్ణంబు ద్రుంపు; దోర్బలశక్తి నే సు-
పర్ణుండఁ గాఁగ నీబలిమి యీపాటి
గాని లే", దనిన, నక్కడిభూతసమితి
మానుగా ఖగపతిమగఁటిమి చూచి,
[20].................................................
చెందినఁజూచి, శచీపతి యప్పు
డచ్చెరువడి పల్కె: “ననఘ, నీతోడ
నచ్చినవేడ్క మానక చెల్మిసేయ
నిష్టమయ్యెడు నాకు; నిట్టివిక్రమము,
శిష్టధీరత నీకుఁ జెల్లెఁగా; కెందు
నెవ్వారలకుఁ గల్గు నిట్టిసామర్థ్య!
మెవ్వారలకుఁ గల్గు నీశక్తి పెంపు!
అమరుండ, వజితుండ, వజరుఁడ, వెందు
నమరుఁడవైన నీ కమృతమ దేల!
అమృతసేవకుల నాహవమున గెలిచి
క్రమమున విజయంబు గైకొన్న నీకు
నమృతాభిలాష లే ; దన్యులకొఱకు
దమకించి గొనిపోవఁదగదు పక్షీంద్ర !
ఇతరుల కీసుధ యిచ్చిన, వార
లతిబలవంతులై యమరసంఘముల
కరయఁ బోర నసాధ్యు లగుదురు; గానఁ,
దిరుగనిమ్మిది వైనతేయుఁడ, మాకు;
నీకు నిష్టావాప్తి నెఱనిత్తు." ననిన,
నాకౌశికునితోడ ననెఁ బక్షివిభుఁడు :
“అనఘ, మదీయాంబకైన దాసీత్వ
మనువుగా ననుపుదునని పన్నగులకు
'నమృతంబు దెచ్చిత్తు' నని పూని నొడివి,
క్రమముతో నమృతంబు గైకొంటి , దీని
నయ్యురగుల కిచ్చి యంబదాసీ[21]త్వ
మొయ్యనఁ బాపిన, నురగముల్ దీని
సేవింపకుండ శచీనాథ, మఱల
నీ వెత్తుకొని పొమ్ము నేర్పున." ననిన
గరుడనికడిమికిఁ గడుసంతసిల్లి,
పురుహూతుఁ డతని నింపునఁ జూచి పలికె:
'గరుడ, నీబలపరాక్రమములు వినఁగఁ
బరితోషమయ్యెడుఁ; బక్షీశ, తెలుపు'.
మనవుండు నిట్లను: "నాత్మసంస్తుతియుఁ,
దనరంగ నితరనిందయును సత్పురుష
గుణములుగా; వైనఁ, గొనకోని నాదు
గుణములగల తెఱంగులు విన్నవింతు.
స్థావరజంగమతతులతో భూమి
లావునఁ దాల్తు ; నలంఘ్యపయోధి
వారిరత్నాలతో వరుసఁ జల్లుదును;
మీఱిన పక్షసమీరవేగమున
వరుస ముజ్జగములు వడిఁ జుట్టివత్తు;
నరయంగ మేరువునైన మత్పక్ష
హతి నుగ్గుసేయుదు." నన సంతసిల్లి :
'పతగాధిపతి, నాకు బద్ధసఖ్యుండ
వై యుండు ; మిగులనెయ్యంబార నిత్తు
నేయది నీకిష్ట మెఱిఁగింపు. ' మనినఁ:
"బాకశాసన, భవత్పాలితంబైన
లోకంబులందుఁ బెల్లుగ భుజంగములు
తిరుగుచు జీవులఁ దెగటార్చు; నట్టి
యురగు లాహారమైయుండు వరంబు
వినతాదాస్యవిమోచనము
నా కిమ్ము;" నావుడు నాకేశుఁ డొసగె.
ఆకశ్యపాత్మజుం, డమరనాయకుఁడు
విడువ కదృశ్యుఁడై వెంట నేతేరఁ,
దడయక కద్రువతనయులకడకు
బృందారకులకూటిబిందెను గొనుచు,
నెందును గదలక యేపుమై ధరకుఁ
జనుదెంచి, సుధకలశము దర్భమీఁద,
నునిచి యిట్లనియె నయ్యురగులతోడ :
నమరనాయకభోజ్యమైనట్టి యమృత
మమరులు సాక్షిగా నర్థితోఁ దెచ్చి
యిచ్చితి నిదె మీకు; నింక మాతల్లి
నచ్చుగా దాసీత్ వమది పాసె నుష్ణ
కరహిమాంశులు గుఱిగాఁగ; మీ రిపుడు
కర మొప్ప స్నానాదికర్మముల్ దీర్చి
యొదవువేడుక నుపయోగింపు." డనుచు
ముదముతోఁ దమతల్లి మూఁపున నునిచి,
వినతులు సేసి, దర్వీకరారాతి
వినతఁ దోడ్కొని పోయె వినువీథి. నంతఁ,
గొనకొని యయ్యురగులు.[22]రోస ముడిగి,
[23]2 యనఘము లొక్కజలాశయమ్మున కేఁగి
స్నానంబు చేయ, నచ్చట ము న్నదృశ్యుఁ
డై నిల్చియున్న యయ్యమరనాయకుఁడు
సుధ యెత్తుకొనిపోయి, సురలలోఁ దొంటి
విధమున నునిచి ప్రవీణుఁడై యుండె.
అంత నాయురగు లయ్యమృత మచ్చోట
నంతయు వెదకి తా రటుగాన లేక,
యమృతకుంభస్థితి నమరినదర్భ
లమృతంబుమాఱుగా నందఱుఁ దలఁచి
నాఁడు దర్భలు నాక, నాసర్పములకు
[24]వాఁడిమై జిహ్వలు పాయగాఁ ద్రెవ్వి
చిరతరలీల ద్వజిహ్వలునాఁగఁ
బరఁగి; రమృతస్థితిఁ బరమపవిత్ర
మయ్యె దర్భయు ; విహగాధిపు డంత
నయ్యురగులఁ బాసి, యమృతాంబురాశి
కడఁ దల్లి నునిచి, యాకశ్యపబ్రహ్మ
కడకేగి యతనికి గడుభక్తి మొక్కి,
వలనొప్పఁ దనపోయివచ్చిన తెఱఁగు
తెలియంగ వినిపించి దీవనలంది,
కమలాక్షుకృపఁ ద్రిజగంబులయందు
విమలవిఖ్యాతిచే వెలయుచునుండె.
గరుడని విజయంబు కడుభక్తి విన్న
నరులకు ఘనప్రసన్నత మహిమ లలరు,
బహుళతీర్థస్నానఫలము, గోదాన
మహనీయఫలమును, మహితభూదాన
ఫలముఁ, గన్యాదానఫలమును గలుగు;
వెలయుదు రాపూర్ణవిభవసంపదల.
నటుగాన జనమేజయక్షమారమణ,
పటుతరభక్తిసంపదతోడ వినుము.
కావక శాపాగ్ని కలుగుపన్నగుల
దేవతాద్రోహులఁ దీర్పవే దేవ!
ఈరీతి క్రతువు మున్నెఱిఁగియెకాదె
చేరిరి హరి నీశు శేషవాసుకులు!
ఒకఁడు వంశము పెంచు; నొకఁడు హరించు;
నకట! తక్షకుచేత నణగునీకులము.
సర్పయాగసంకల్పము
అనినఁ, గోపాటోప మాత్మ రెట్టింప
జనకునిఁ దలచి, తక్షకుకీడు దలఁచి,
జనులెల్ల వలదని చాటిన వినక,
జనమేజయుఁడు సేయ సర్పయాగమ్ము
నారీతిఁ గోరి, యుదంకు వీడ్కొలిపి,
దారుణయజ్ఞంబు దగఁ జేయఁ దలఁచి,
జాబాలి జమదగ్ని జహ్ను శాండిల్య
కౌబిల మాండవ్య కణ్వ వశిష్ఠ
కపిల భరద్వాజు కశ్యపుల్ మొదలు
తపసుల నుత్తమోత్తముల రప్పించి,
పుణ్యాహవాచకపూర్వంబు గాఁగఁ
బుణ్యాంగనలుఁ గూడి పుణ్యుల గూడి,
దురితవిదూరబంధురకురుక్షేత్ర
విరచితశాలాప్రవేశంబు చేసి,
యాతంత్రమున బ్రహ్మ [25]యధ్వర్యుఁ డనఁగ
హోత యుపద్రష్ట యుద్గాత యనఁగ
వలయుఠావుల విప్రవరుల వరించి,
కులకాంత [26]క్రేవలఁ గూడి వర్తింప,
ఫలసూపములు, నెయ్యి, పాయసాన్నములుఁ,
గలపులు, శాకముల్, కపురవీడెములుఁ,
గార్పాస[27]రాజిత కనకవస్త్రములుఁ,
గర్పూరకస్తూరికాకుంకుమలును,
గుశ కూర్చ సమిధలుఁ, గుసుమాక్షతలును,
వశు పాత్ర పూర్ణకుంభములాదిగాఁగ
యాగోపకరణంబులన్నియుఁ గూర్చి,
భోగిభీకరమంత్రముల వ్రేల్చు నప్పు
డందంద యాగాగ్నియం దంతమగుచు
దందశూకావలి తమదుచొ ప్పెడలి
తొరఁగె దీర్ఘములైన తోఁకలతోడఁ,
దరణి కన్నెఱుఁగని తనువులతోడ,
గుఱుతైన క్రొవ్వాఁడి కోఱలతోడ,
నెఱినిప్పు లురలెడు నేత్రాలతోడ,
మత్తిల్లు ఫణిఫణామణిదీప్తితోడ,
బిత్తరమ్ములు చిమ్ము పెదవులతోడ,
నక్కు వాయని దంటనాల్కలతోడ,
మక్కలించిన పొట్టమడతలతోడ,
మాయపుఁ బలువన్నె మచ్చలతోడఁ
బాయక చిగురుఁగుప్పసములతోడఁ.
దొరఁగునప్పటి హోమధూ[28]మమ్ము తాకఁ
దిరమేది మూర్ఛిల్లె దేవలోకంబు;
హోతలు శాలలో నుండలేరైరి;
యాతాపమునఁ గ్రాఁగె నఖిలదిక్కులును;
మడిసిరి కొందఱుమనుజు లావేళ,
నడుమింట రానోడె నక్షత్రకులము.
వెలయ నధ్వరవహ్ని విషవారిఁదోఁగి
మలినమై రాఁజి, క్రమ్మఱఁ బ్రజ్వరిల్లఁ,
గుటిలఫణారత్నకోటులు చిటిలి
పెటపెటధ్వనిఁ బాఱె బ్రిదిలి యవ్వలికిఁ.
ౙలౘల నురియు మాంసములచప్పుళ్లు
చలములు గొని కులాచలములఁ బొదివె.
చచ్చియు, నొకకొన్ని సామగానముల
పచ్చితీపుల నిల్పెఁ బ్రాణవాయువులు.
కాలకంఠుఁడు చూచె గడియంబు ముట్టి;
నీలకంఠముఁ బట్టె నెఱవైనభయము.
తక్షకుఁ డింద్రు శరణుచొచ్చుట
అప్పుడు, తక్షకుం డార్తరావంబు
ముప్పిరిగొన దర్భముఖములు గఱచి,
యింద్రుకొల్వున కేఁగి యిట్లను నవని :
"నింద్ర, రక్షింసవె! యేను దక్షకుఁడ;
నొడ లుండఁబట్టకఁ యురగవంశంబు
మడియింపఁదలఁచిన మత్తాత్మకుఁడను
ఎరగొని యొక్కనాఁ డే బరీక్షిత్తు
గఱచితి మీదెఱుంగని పాపమునను.
[29]నోళ్లవలన మున్నును నక్కలుండ
వూళ్లననుమాట వొనఁగూడె మాకు (?)
దర్పించి యారాజుతనయుఁ డొక్కరుఁడు
సర్పయాగం బిఫ్టు జరపుచున్నాఁడు.
చచ్చిన సర్పంబు సంయమిగ్రీవ
నచ్చలంబున వైచె నాపరీక్షిత్తు.
అతనిచే నట్లు మహాశాప మందె;
నితఁ డది తలఁప కిట్లేఁపుచున్నాడు.
[30]ప్రోవుగా మాసర్పములు గూలె నగ్ని;
నే వెరవునఁ దప్పు నీబారి నాకు!
దయమాలి మంత్రాధిదైవంబు నన్ను
బయనమై యున్నది పట్టుకపోవ.
జీవరక్షార్థమై శేషవాసుకులు
శ్రీవిష్ణు నభవునిఁ జేరిరి మున్ను.
సకలలోకైకరక్షకుఁడవు గాన ,
“ నొకఁడ నే వచ్చితి [31]నోము న' న్ననుచుఁ
గోర, దేనికి మందుగోరని యమృత
ధార దాఁచితి; రది తగిలె మీచేతఁ;
బుడెసెఁ డాయమృతంబు పోయింపు నాకుఁ;
గడపెద నీబారి కరుణావిధేయ!”
అని చొచ్చిపోయి, దైన్యంబున నతని
కనకమహాపీఠకముఁ జుట్టి యుండె.
ఆవిధంబున సర్పయాగ మానృపతి
గావింప, నాగలోకమున నింటింట
బాలవృద్ధాంగనల్ బలసి వాపోవ,
ఆస్తీకుఁడు సర్పయాగమును వారించుట
నాలించి, యాస్తీకుఁడనుమహామౌని
యనఘ, జరత్కారుఁ డనుమునీంద్రునకు
నెనయ జరత్కారు వనునాగసతికి
జనియించినట్టి యాసంబంధమునను
వినయంబుతో సర్పవితతి ప్రార్థింప,
మాతృవంశమువారి మరణభయంబు
నే తెఱంగున నైన నే మాన్తు ననుచుఁ,
జలకాకపక్షులసంయమివరుఁడు
చెలులును శిష్యులు సేవింపఁ గదలి,
జనమేజయునియాగశాలకుఁ బోయి,
వినయసంపూర్ణుడై, వేగిరపడక,
మునుల నానాతంత్రములనున్న వారి
గొనియాడి, తజ్ఞులఁ గోరి కీర్తించి,
పాత్రంబులొడ్డినఫణితి నుతించి,
ధాత్రీశు నియతచిత్తమునకు నలరి,
మఱియుఁ బదార్థసామగ్రి నుతించి,
నలిఁ దొంటిక్రతువులనన్ని పోనాడి
మెచ్చించుటయుఁ, బల్కె మేదినీనాథుఁ:
"డిచ్చెద నీకోర్కి యేమైన నడుగు;
నిక్క; మెవ్వఁడవయ్య! నీ దేహకాంతి
పిక్కటెల్లఁగఁజొచ్చెఁ బృథివి నెల్లెడల.
నీవయస్సులవారు నీతోడిమునులు
దేవతామూర్తులు దీప్తిసమ్మితులు.
..... . . . . . . . . . . .
నీవాక్యవిభవంబు నీచిత్తశాంతి
భావించి యాశ్చర్యభరితుండనైతి,"
ననవిని, యాస్తీకుఁ డనియె: "రాజేంద్ర,
ఆస్తీకజన్మవృత్తాంతము
తనయుండ నే జరత్కారుసంయమికి;
నాతండు బ్రహ్మచర్యంబు వేదంబు
ప్రీతివ్రతంబుగాఁ బెంపొందుచోటఁ,
బితరు లాతనిఁగాంచి పెంపార ననిరి:
'ధృతిమంత, యిట్టిప్రతిజ్ఞలు గలవె!
ఉత్తమాంగములేని యొడలునుబోలె
సత్తనయుఁడు లేని సంసారమేల!
నెఱి నిట్టనియమంబు నీవు చేకొనఁగ
నరయుచున్నారము నరకాన నుండి;
చేయంగదే! దారచింతనం.' బనిన,
నాయుత్తముఁడు వారియాజ్ఞకు వెఱచి:
'నా కిది [32]సేయ, మన్నామకకన్య
నాకు నౌగాని యన్యస్థితిఁ గాదు.
కలుగునొకో జరత్కారు వెందైన!
నిలిపెదఁ గుల;' మని నిఖిలంబు నరసి,
యట్టిది నాగకన్యక గల్గుటయును
నెట్టన నెఱిఁగి, పాణిగ్రహణంబు
చేసి . . . . .. . . . . . .. .
. . . . . . . . . . . . . . .
మానిని కిట్లనె: "మగువరో, యొకటి
నే నీకుఁ జెప్పెద నిర్ణయం బిపుడు,
ఎప్పుడు నీవు నాయిచ్చ నొప్పింతు
వప్పుడు నిను డించి యరుగుదుఁ జువ్వె”.
అని యొడంబఱచి, సంయమి జరత్కారు
నొనరఁ బెండిలియాడి యుండె. నంతటను
నొక్కనాఁ డువిద సూర్యుడు గ్రుంకువేళ
మక్కువ నిద్రించు మగని వీక్షించి:
"తెలుపకుండిన నెట్లొ! తెలిపిన నెట్లొ!
యలర నివ్వలఁ గర్మ మవ్వల సుఖము!
ఏమి సేయంగ నా కేమి యయ్యెడినొ!
పాముతోఁ జెలిమయ్యెఁ బతితోడ నాకుఁ !
గదలి సాంయంతనకర్మంబు [33]దీర్ప
నిదె సర్వమునులు నేఁగెదరు గౌతమికి;
నలిగిన నలిగెఁ; గార్యము చూత.” మనుచుఁ
దెలిపిన, మాతండ్రి దృష్టిఁ గెంపొదవ :
"నే నిద్రపోవుచో నినుఁ డెట్లు గ్రుంకుఁ!
బూని కార్యము తలపోయలేవైతి!
సుఖ మేల చెఱిచితి! సుప్తిఁ బోలంగ
సుఖమెందుఁ గలదు! సుస్థిరమతి ;" ననుచుఁ,
“బతియిచ్చ యెఱుఁగని పడఁతి కాపురము
ధృతిఁ దోవతప్పిన తెరువరియాత్ర;
గావున, నొడఁబాటుగల నిన్ను డించి
పోవనె తగు నాతపోవనంబునకు.
కలఁ డుదయింప నీగర్భగోళమునఁ
గులదీపకుండైన కొడుకు భీతిలకుఁ'
అని చెప్పి ముని పోయె; నాతనిసుతుఁడ;
దినకరతేజ, యాస్తీకుఁడ నేను.
నన్ను మెచ్చితినంటి; నామాతృకులము
మన్నింపవే! యిట్టిదుఖ మింక వలదు.
ఘనుఁడ, నీచేయునాగప్రళయమున
[34]కనిలుండు, నీలుండు, నాశరభుండుఁ,
గర్కోటకుండును, గాలదంతుండు,
దర్కింపఁ బారావతంబనుపాము,
నక్షతుఁ, డశ్రుతుం, డాకక్షకుండు,
లక్షింప శంఖపాలుఁడు, ధనంజయుఁడు,
మణినాగ శబల వామన కిటింజయ శ
రణ శకునులు, బాండరము ననుఫణులుఁ,
బోనర నేరక ప్రాతపుష్కరకంబు
లనునివిమొదలుగా నన్నియు వెడలెఁ.
గద్రువ మే నెఱుంగక మూర్ఛపోయె.
రౌద్ర మిం కేటి! కుర్వర మోవవలయుఁ!
జక్రిహిం సిది యేల! చక్రిభక్తుఁడవు!
విక్రమం బిది యేల! ద్విజులు పన్నగులు.
గుహ చొచ్చి, పవసంబు గ్రోలుచుఁ జొక్కి,
తుహినాంశునిజకాంతి తూకొనఁగలిగి,
కంచుకమోక్షంబుగలుగు భోగీంద్రు
లించుకవెల్తి యోగీంద్రులుగారె!”
అనుటయు, జనమేజయక్షితీశ్వరుఁడు
కనికరం బెంతయఁ [35]గలిగి నవ్వుచును
ఆక్షణంబున సర్పయాగంబు మానెఁ.
దక్షకుం డావేళఁ, దాను నింద్రుండు
నిట 'తక్షకాయ సహేంద్రాయ' యనెడు
కుటిలమంత్రంబుల చుట్టులు వదలి,
హాహారవంబుతో నంతరిక్షమున
నాహుతి దిరుగుచు నగ్నిలోపలికి
నేతేర నాస్తీకుఁ డెలుఁగెత్తి నిలిపి,
పాతాళమున కంపె భయమెల్ల మాన్పి.
ఎనయంగ నాస్తీకముని ఫుణ్య చరిత
వినిన వారికి లేదు విషధరభీతి,
ఆస్తీకముని మాన్పె, నట్లు యాగంబు
ప్రస్తరింపుట మాని, పారీక్షితుండు
నిగమార్థవిదులకు నిఖిలహోతలకుఁ
దగవొప్ప సంపూర్ణదక్షిణ లిచ్చి,
యెనసిన వేడ్కతో నమ్మునీశ్వరుల (?)
ననుపక తనయూరి కరుదెంచి, యందుఁ
బదివేలపసిడికంబములకూటమున
మృదులతల్పంబున మెఱసి కూర్చుండి
యుచితాసనంబుల నునిచి సన్మునుల
సుచిరతేజస్కుల సొరిదిఁ బూజించి,
వ్యాసు నశేషభావనఁ బూజ చేసి,
యాసంయమికి మ్రొక్కి యంజలి చేసి :
అయ్య, వేదవ్యాస, ఆగమావాస,
నియ్యనుగ్రహములు నిఖిలవేదములు;
నీవాక్యసీమలు నిఖలశాస్త్రములు ;
భావింప నూతనబ్రహ్మవు; గానఁ,
బంచమవేదంబు భారతాఖ్యంబు
మించినవేడ్క భావించినకవివి.
అది నాకు సర్వంబు నానతియీవె!
ముద మొప్ప వినియెద మునులసన్నిధిని.
నాకలోకంబున నాగలోకమునఁ
జేకొని చదువఁబంచితిని శిష్యులను;
ఈలోకమున నాకు నెఱిఁగింపవలయుఁ
ద్రైలోక్యమున నది తనరునట్లుగను.”
అనిన, వేదవ్యాసుఁ డతనిప్రార్థనకు
ననుకూలచిత్తుఁడై యందఱఁజూచి,
వారివారికి వేడ్క వర్తిల్లుటెఱిఁగి,
యారాజవరున కిట్లని యానతిచ్చె:
"ఆనిన బ్రహ్మహత్యాది[36]పాపముల
కేను బ్రాయశ్చిత్త మిది చేసినాఁడ.
వినియెడువేడ్క దా వినుమ యెవ్వరికి
జనియించు నాతండు జగతి నానాఁడు.
నీనిమిత్తంబున నిఖిలమానవులు
నానుకయున్న భవాంబుధి గడచి
శ్రీనిధిపదభక్తి చెందఁగలారు;
మానవనా, ధనుమానంబు లేదు.
కావున, నీపుణ్యకథ కడముట్ట
సావధానమున వైశంపాయనుండు
చతురుండు సకలశాస్త్రార్థకోవిదుఁడు
హితమతి నన్నియు నెఱిఁగించు నీకు."
నని వానిఁ జూపి సంయమి పోవుటయును,
జనలోకపతి వేడ్కసంధిల్లనున్న,
వదలక యతని కావ్యాసజనంబు
మొదలుగా నక్కథ ముని చెప్పదొడఁగె:
ఉపరిచరవసువృత్తాంతము
“వసువనియెడురాజు వనధిపర్యంత
వసుధయేలుచు, నూఱువర్షముల్ తొల్లి
తపనున కగ్గితోఁ దప మాచరింప,
విపులాంశుఁడైన యవ్వేలుపునృపకు
ననలభానుసమానమగు విమానంబు
వినువీథి నెపుడైన విహరించుదారిఁ
గాంచి యాకాశమార్గమునఁ జరింపఁ,
గాంచనరుచులు లోకములెల్ల నిండ
నుపరిచరుండయి, యుర్వి నారాజు
నపరిమితానందుఁడై యొప్పుమిగిలె.
ఆరయ నొక్కయే ఱాతనిపురము
చేరువఁ బాఱు విశేషసంపదలఁ.
జూచు నొక్కొకమాఱు సుకుమారమీన
లోచన శుభగుణలోలదృష్టులను;
బలుకు నొక్కొకమాఱు బక చక్రవాక
కలహంస మధుకర క్రౌంచనాదముల;
మెలఁగు నొక్కొకమాఱు మృదుల మృణాళ
వలనహస్తవిలాసవైభవం బొప్ప;
వెలయు నొక్కొకమాఱు వీచిసంక్షోభ
కలిత కైరవ ఫేన కమలహాసముల;
వనవారణములు ప్రవాహమధ్యమున
మునుఁగఁ గుంభకుచాద్రులును గాననైన,
భయవతిగతిఁ బద్మపత్రాంబరమున
నయమతిఁ గప్పు నున్నతి నొక్కమాఱు;
నిగిడినయిసుకతిన్నియ పిఱుందునకు
దగుమొలనూలని తజ్ఞు లెన్నంగ.
దరి నోలిరాలిన తరుముకుళముల
యురుపంక్తి శోభిల్లు నొక్కొకమాఱు;
అరవిందములమీఁద నళిసమూహంబు
సరసవైఖరి వ్రాలి సందడించుటయు,
రాజితకల్హారరాజిహస్తముల
నోజతోఁ దొలఁగించు నొక్కొకమాఱు;
వీక్షింప నీరీతి విలసిల్లు నేఱు
లక్షించి, కోలాహలం బనుకొండ
రతిరాజవశత నేర్పడఁ బాఁడు గలంగి,
సుతభిక్ష మిడద! నేఁ జూచెద, ననుచు
నెడపక యయ్యేటి కెలమి నడ్డంబు
వడినఁ, బ్రవాహంబు పాఱక నిలిచి,
'యుచితనాథునిఁ గూడి యుబ్బెనో,' యనఁగఁ
బ్రచురంబుగా నుబ్బి పట్టణంబునకు
బెదరుపుట్టించినఁ, బృథివీశుఁ డెఱిఁగి
తుదికాల నక్కొండఁ దొలఁగఁద్రోచినను,
అక్కిందనున్నవా రటమున్ను పుట్టి
రొక్కకూఁతురుఁ బుత్త్రుఁ డుత్తమాకృతులు.
మగవాని రాజుగా మత్స్యరాజ్యమున
దగనిల్పె నృపతి, యాతన్వికిఁ జొక్కి :
“గిరికినిబుట్ట నాగిరిజయుఁబోలె
గిరికాభిధానంబు కృతిమతిఁ దాల్చి,
నాధర్మపత్నివై, నవరత్నఖచిత
సౌధవీథుల యందుఁ జరియించు కాంత!”
అని దానిఁబెండ్లియై, యసమాస్త్రరతులఁ
దనియక, యొకనాఁడు ధరణీశ్వరుండు
వేటలోనుండియు, విరహతాపంబు
గాటమైయుండ నక్కాంతనే తలఁచె.
తలఁచినతలఁపు ప్రత్యక్షంబుకంటె
నెలకొని నిజమైన నెఱి నోర్వలేక,
మనసున రతిచేసి మదనాంబుధార
వినయంబు చాలక వెడలించి, దానిఁ
జయ్యన దొప్పలో సవరించి, యంత
నయ్యెడ సకలభాషార్థజ్ఞుఁడగుట
నొకడేగ రప్పించి యుర్వీశుఁ డనియెఁ :
"బ్రకటితపురుషార్థపరుఁడ వోపక్షి,
విష్ణువాహనవంశ[37]విదితుఁడ వీవు;
విష్ణుభక్తుఁడ నేను ; వినుమొకమాట.
చిత్తజుజలము నించితి మేను మఱచి;
యెత్తెఱం గొనరింతు: నిది యమోఘంబు!
కట్టెద నీమేడఁ; గడువేగఁ బోయి,
నెట్టన నీవయ్య నీచెలియలికి.
ఘనతఁ బక్షంబులు గలిగినవాని
తనయకు నీదుబాంధవ మెందుఁ గలదు!”
అనుచు దగ్గఱఁబోయి యావీర్యపాత్ర
యనఘుండు మెడఁగట్ట, నది మీఁది కెగసి
పోవఁబోవఁగ, మాంసబుద్ధి నచ్చటికి
నావల నొకపక్షి యడ్డంబు వచ్చి
యాలంబు సేయ, వీర్యంబు దొలంకి
కాళిందినడునీటఁ గాఱెఁ; గాఱుటయు,
నది మ్రింగి గర్భమై యందొకమీను
చదురైనవిధియాజ్ఞఁ జరియింపుచున్న,
మత్స్యగంధి జననవృత్తాంతము
నంబుధిలోన జాలంబులు వన్ని
పంబినయామీనుఁ బల్లెవాఁడొకఁడు
వేఁటలాడుచుఁ బట్టి వేతెచ్చి యింట
వాటంపుఁగూరకు వాలంగఁ దఱుగ,
ముత్తెంపుఁజిప్పలో ముత్యమున్నట్లు
చిత్తజుదీమమై చెలువ యొకర్తు
కానవచ్చిన, [38]నిధి కన్న నిర్వేదము
పూనిక నాత్మలోఁ బొంది [39]ధీవరుఁడు
నబ్బాలికామణి నాలిచే నొసగ
గుబ్బుగుబ్బునఁ జన్నుగుబ్బలు చేఁపి
పడఁతి యిట్లను : "దీని భవు డిచ్చెఁగాక!
మడుఁ గెట్లు! మీ నెట్లు! మఱి బిడ్డ యెట్లు!
అనపత్యతాదోష మణఁగెఁబో నేఁడు!
పొసరఁ బొందెడుసొమ్ము పొందునెందున్న
రక్షించి మన మొకరాజున కిత్త;
మక్షణంబునఁ దీఱు నక్కరలెల్ల.
మత్స్యమారణ మింక మానుము నీవు;
మత్స్యగంధనునామ మలరు దీనికిని;
బూని పెంతముగాక పూఁబోఁడి". ననుచు
.........................................................
ఇరువురుఁ బ్రియముతో నేకతమ్మునను
నరయ, నిత్యము నది యభివృద్ధిపొంది,
కరువునఁబోసిన కనకంపుఁబ్రతిమ
కరణి యౌవనవేళఁ గడుఁ జూడనొప్పఁ,
గాళిందిలో నోడ గడప నయ్యతివ
జాలించెఁ గైవర్తచక్ర[40]వర్తియును.
వేదవ్యాసావతారము
అంతట, నొకనాఁడు హరిపరాయణుఁడు
శాంతిశీలుఁడు పరాశరమునీశ్వరుఁడు,
మాససహస్రంబు మఱి తీర్థయాత్ర
చేసి, యచ్చోటికిఁ జెలువొప్ప వచ్చి,
లోలవీచుల నాకలోకంబు ప్ఁరాకు
కాళింది దాట నక్కడ త్రోవలేక
'యోడవా రెచ్చోట నున్నారొ' ! యనినఁ,
జేడియ విని వచ్చి చేతులు మొగిచి:
యేతెంచి మునినాథ, యెక్కవే యోడ;
చూతువుగాని నా [41]సూటి యీపనికి;
వావిరి యమునాప్రవాహంబు దాటి
యావల నున్నాఁడవని విచారింపు.
దట్టపుభవవార్ధి దాటెడునీకు
నిట్టికాలువ లెంత! యేతెంతుగాక.”
యనిన నాయింతి నయంబుఁ బ్రియంబుఁ
దనుకాంతియును జూచి, తాపసోత్తముఁడు
కన్నులతళ్కులఁ గల్కిమొగంబు
నన్నువనడుము ధైర్యముఁ జుట్టికొనఁగ,
నతిలావణ్యప్రవాహంబునందుఁ
బతితుఁడై యాకాశపథము చూచుచును,
జాపలంబున బ్రహ్మచర్యధనంబు
తీపువిల్కాఁడనుతెక్కలి గొనఁగ,
నేమియు ననక , మునీంద్రుఁ డయ్యేట
భామినివలకేలు ప్రాపుగాఁ బట్టి,
యుచితాసనంబున నుండి, యాయతివ
కుచములపొబగును, గురులతేటయును,
నయనవిభ్రమమును, నడుములేమియును,
బ్రియదర్శనంబైన పిఱుఁదుఁ, బిక్కలును,
ముంగొంగు లెగఁద్రోచి మోఁకఱించుటయుఁ,
దొంగలించెదు మిసిమితొడలక్రొమ్మించు,
దర్విచే నుదకంబు తప్పించునపుడు
పర్వి కానఁగవచ్చు బాహుమూలములు,
బలువున మునివ్రేళ్లఁ బలక తొక్కుటయుఁ,
దలదిండులైన పాదముల పెంపులును,
గిన్నెరశ్రుతినాడు కృష్ణాహిపోలె
వెన్నున విహరించు వేణియుఁ జూచి,
కాతుకంబున నోడగడపకయుండఁ
జేతులు ముని పట్టి చెలువ కిట్లనియె :
“అంగజు[42] సాక్షిగా నబల, యిచ్చోట
సంగమమగుఁగాక సరి నీకు నాకు.
ఉత్తమసతితోడ యోగ మౌనేని,
హత్తిన బ్రహ్మచర్యము చెర్గి [43]పోదు ;
చెరిగిపోయినఁ బోయెఁ; జెప్పెడి దేమి?
తెఱవ, నీపొత్తు సంధిలవలె నాకు.
చూచితి శర్వాణిఁ; జూచితి రతిని;
జూచితి హరిరాణిఁ; జూచితి రంభ;
వింతపుట్టి యెఱుంగ; వేయేల! నేఁడు
కొంత, నీయెడ నయ్యెఁ గన్నుల మరులు."
అనిన, ధైర్యముఁ బట్టి యబల యిట్లనియె:
"నను నేల పట్టెడు! నాకుల మెంత!
యేము పల్లియవార; మీవు సన్మునివి!
రామలు లేరె! పరాశరబ్రహ్మ!
[44] చెలువుదైవ మెఱుంగుఁ! జిఱుమీనుపొలను
వలచు నాదేహంబు పతి కయోగ్యంబు.
[45]అట్టులె గాక, మత్స్యంబుగర్భమున
బుట్టితి; మానుసుబుద్ధి నెన్నకుము
గుణదోషములలోన గుణములల్పములు;
గణుతింప నేను నీ కాంతికిఁ గలనె!
అతివలయెడలఁ బాత్రాపాత్ర[46]చింత
యతనుండు తా నెఱుంగఁగనీఁడు మొదల;
ఆపాటివారమే! యిటువిడు" మనినఁ,
దాపసారాధ్యుఁ డాతరుణి కిట్లనియె :
"లీల నీతనువు పల్లియవంశమునను
నేలపుట్టఁగనేర్చు నిభరాజగమన!
నీచరిత్రం బేను నిజయోగదృష్టి
జూచితి; నొక్కరాజునకీవుసుతవు.
'మీనగంధము పోదు మేదీఁగె' ననుచు
మానిని, నీవనుమానింపవలదు;
ఘనసార మృగమద ఘనగంధసార
ఘనసార రసములు గలుగునెత్తావి
చుట్టుయోజనమున జోడుముట్టంగ
నెట్టనఁ గలిగింతు నీశరీరమున;
జనులెల్ల నీవు యోజనగంధివనఁగ
వనితాలలామ, ప్రవర్తింతుగాక."
అనునంత, నతనివాక్యప్రభావమునఁ
దనమేన సౌరభతతులుల్లసిల్లి
యీలువసళ్ళింప, నించుక సిగ్గు
జాలివెట్టంగ నాజవ్వనిపల్కెఁ :
“గట్టినవలువూడ్చి, కాంతునితోడ
నెట్టి [47]ప్రౌఢలకైన నీపట్టపగలు
రతి సల్పవచ్చునె! రాత్రిగా; దీవు
[48]యతిపతి; వదిగాక, యేను గన్యకను;
ఈవు మున్నలిగిన నెసగు దావాగ్ని;
గావున, నేమి పల్కఁగ నేమి యగునొ!"
అనుటయు, మునిచంద్రుఁ డంధకారంబు
కెనయైనమూడ [49]మం చట గల్గఁజేసి,
కాంతియుఁ గన్నెఱికముఁ జెడకుండఁ
గాంతకు వర మిచ్చి, కక్కూర్తితోడ
వరద నొయ్యన వచ్చి, వడి నొక్కచోట
నొరగిన యాయోడ [50]నొడ్డునఁ జేర్చి,
'రమ్మ'ని కామినీరత్నంబు డించి,
సమ్మదంబున దర్భశయ్య గావించి,
యువిద మన్మథకేళి నోలలాడింప,
ధ్రువకీర్తి యపుడు సద్యోగర్భమునను
నుత్తుంగభుజములు, యోగదండంబు,
జొత్తిల్లుజడలును, సోగకన్నులును,
నీలాభ్రరుచులును, నెఱిఁగృష్ణమృగము
తోలుపుట్టంబు, వర్తులకమండలము,
లీలముక్తాక్షమాలిక, జన్నిదంబు,
వేలఁబవిత్రంబు వెసఁ దోడ మొలవ,
బ్రహ్మాంశమునఁ దాఁ దపస్వియై పుట్టె
బ్రహ్మణ్యుం డావ్యాసభట్టారకుండు.
ద్వీపంబునందు సంధిల్లుటఁ జేసి
ద్వైపాయనాఖ్యగాఁ దండ్రి గావింప,
ధర నిట్లు జనియించి తల్లిదండ్రులకు
గరములు మొగిచి : "యోకరుణాఢ్యులార,
తపమున కేఁగెద; దయతోడననుపుఁ ;
డపరిమితోత్సాహుఁడై యున్న వాఁడ.
మీనిమిత్తంబున మేనుసిద్ధించె;
నేనుజేసినపుణ్యమెల్ల మీసొమ్ము.
పలుమాఱు వేడ్కతోఁ బనిగల్గునపుడు
తలపుఁడు వచ్చెదఁదాత్పర్య మొప్ప; "
నని చెప్పి మ్రొక్కి , [51]హిమాద్రియవ్వలికిఁ
జనియె నాతఁడు దేవచక్రంబు పొగడ.
అట పరాశరుఁడును నయ్యేఱుదాటి,
కుటిల [52]కుంతలను వీడ్కొని వేగనరిగె.
ఆవిధమఃనఁ దప మయ్యద్రి నతఁడు
గావించి, మఱి పెక్కు కాలంబునకును
ఆదిమబ్రహ్మఁ బ్రత్యక్షంబుచేసి,
యా దేవుచే విద్యలన్నియునేర్చి,
యాదరంబున లెక్కకధికంబులైన
వేదంబు లొండొండ[53] విభజించి తీర్చి,
సారబంధంబుగా జనులకుఁ జదువ-
నేరవచ్చినసాటి నెఱి నాల్గుశ్రుతులు
విరచించి, పిదపఁగావించెభారతము
సరవి సపాదలక్షశ్లోకములను.
అంతట నది మాకు నానతియిచ్చె;
నింతయు నీకు నే నెఱిఁగింతు వినుము.
పంచాక్షరియుఁబోలెఁ బరఁగినకథను
బంచమవేదంబు పాయక వినినఁ,
బంచపాతకములుఁ బాయు భూనాథ!
పంచ [54]వక్త్రుండిచ్చుఁ బరమసంపదలు.
పరగఁ ద్రేతాయుగపరిణతిఁ దొల్లి
గురువధ నుగ్రుఁడై కువలయాధిపులఁ
బరశురాముఁడు తనపరశువుధార
నిరువదియొక్కమా ఱేరి చెండాడి,
[55]పేరిననెత్తుటఁ బితృతర్పణంబు
కోరినట్లనె చేసి కోపంబుమాని,
తెలిసి ధారుణియేడుదీవులు నపుడు
లలిమీఱ బ్రాహ్మణులకుధారవోసి
తపమున కేఁగంగ, దైన్యంబుతోడ
నృపుల భార్యలువచ్చి, నెఱిదిక్కు లేక
తడయుచు, [56]దాఁగుచు [57]దరిసి, కశ్యపునిఁ
బొడగాంచి వేడ్కఁ దత్సుణ్యున కెఱఁగి :
" పావకముఖములఁ బతులతోఁగూడఁ
బోవ మాకబ్బకపోయెఁ బూర్వమున ;
నింక నేగతిఁబోదు! మేదియాధార !
మంకిలిగాకుండ నానతియీవె!
కన్నుగానక క్రొవ్వి కార్తవీర్యుండు
పన్నినకలహంబు ఫలియించెమాకు. "
అనినఁ, గృపారాశియగు కశ్యపుండు
వనితలఁబలికెఁ దత్వము విచారించి :
“కులమునిల్పుటకంటెఁ గువలయాక్షులకుఁ
గలవె ధర్మంబులు కలకంఠులార !
తప్పులుపట్టక, దయ నేను మీకుఁ
జెప్పెదధర్మంబు చెవిదూర వినుఁడు.
వెరవొప్ప నిందఱు విప్రవీర్యంబు
ధరియింపఁగలరె సంతానసిద్ధికిని !
ఏవగింపక సేయుఁ ; డిదిమహాధర్మ
మేవిధంబులయందు నే వినియుందు;
నేయుగంబునఁ జేయ రెవ్వారు మున్ను ;
నాయాజ్ఞ నిది మీరునడపుఁడు మేలు. "
అనుడు నమ్మునియాజ్ఞ యందఱుఁజేసి
తనయులఁగాంచ, నత్తనయు లింటింటఁ
బెరిగి విప్రులయాజ్ఞఁ బృథివి రక్షింపఁ,
బరఁగిన ధర్మప్రభావంబువలనఁ
గురిసె వర్షంబులు గోరినయట్లు ;
ధరణి సస్యములెల్ల ధాన్యమై [58]యొఱగెఁ;
బెల్లుగా మొదవులు పిదికెఁజన్నవిసి ;
కల్ల [59]పేదఱిమి రోగములస్తమించె;
నిరువురఁగూఁతుల నెనమండ్రసుతుల
నిరపాయులగువారి నెలఁతలు గనిరి;
పదివర్షములనాఁడె బ్రహ్మచారులకుఁ
జదువక ప్రాపించె సర్వవిద్యలుసు ;
ముదిసియు, నౌషధంబులలావువలన
వదలరుతఱుచు; చావరు మహీజనులు.
ధరలోన నగ్నిహోత్రములేని ద్విజుఁడుఁ,
బురుషునిఁబాసినపొలఁతియు లేదు.
వన్యధాన్యంబుల వనచరుల్ దనిసి,
సన్యసించిరి హింస జంతువులందు.
హరులును గరులు వాహనములుగాని,
నరవాహములులేవు [60]నరులమోయుటకు.
ఇట్టివైభవముల [61]నెనసి మానవులు
పుట్టయీనినయట్లు భూమిఁగ్రిక్కిఱియ,
గిరి శేష మాతంగ కిటి కూర్మములకు
ధరియింపరాక యెంతయు భారమైన,
ధర నిండుచూలుకాంతయుఁబోలె నలసి,
శరధిలో నురగేంద్రశయుఁ గానఁబోయి,
నామంబునొడివి ప్రణామంబుచేసి
లేమ యల్లన లక్ష్మి లేనెత్త లేచి,
నడుఁకుచునిట్లనె: "నాప్రాణనాథ,
జడిసితి మాన్ప వేజింతుభారంబు!
నాకునై కిటివైతి; నలిఁ గూర్మమైతి;
నీకుఁబోవునె దేవ, నేఁటిపట్టునను.
పుక్కిటఁ బదునాల్గు భువనంబులందు
......... .......... .......... ........ ........
ఏనిదే లెక్కకునెక్కుడైనట్టి
మానవమాత్రుల మఱిమోవఁజాల.
[62]ఖిలమైన ధర్మ మీక్రియ రాజసుతులు
చెలువార నాచరించిన ప్రభావమున
శాఖోపశాఖలై చెలువుప్పతిల్ల
లేఖపూజిత, ముప్పులేకయున్నారు.
ఇన్నియు నీమూర్తు; లివి యింకఁ గొన్ని
నిన్ను గూడినఁగాని నిలువలే. " ననినఁ
గరుణించి, ధరఁజూచి కమలాక్షుఁడనియె:
"నరులువ్రేఁగైరని నాతి, యోడకుము ;
నచ్చనియీవ్రేఁగు నరుఁడనై పుట్టి
పుచ్చెద ములు ముంటఁబుచ్చినయట్లు.
ఏనట్లుపుట్టిన, నింద్రాదు లమర
[63]యోనులు నరులుగా నుదయింపఁగలరు.
తెలిపి వారలరెండు తెగలగాఁగూర్చి,
కలహింపఁజేసెదఁ గళ్యాణి, వినుము.
అందు నిందునుగూడి యధికమానవులు
మ్రందుదు ; రంత నెమ్మదినుందుగాని ”.
అని భూమివీడ్కొల్పి, హరి యంత వెనుక
మనుజుఁడై, శ్రావణమాసకృష్ణమున
నష్టమి రోహిణి నర్ధరాత్రమున
దృష్టింప వసు దేవదేవకులందుఁ
బన్న గేంద్రుఁడు బలభద్రాఖ్యఁ దనకు
నన్నయై మునుబుట్ట, యదుకులాఁబుధిని
[64]కృష్ణ నారాయణ కేశవ జిష్ణు
విష్ణు నామసహస్ర విభవంబునందు
రామ రామాంతర రామావతార
సామర్థ్యరూపమై జనియించి మించె.
హరిజన్మ మదివిన్న నఖిలపుణ్యులును
హరిరూపులై యుందు రందును నిందు.
సురాసురులయంశమున భీష్మాదివీరులు జనించుట
హరి యిట్లు జనియింప, నసురులు సురలు
[65]హరివాక్యమున ధాత్రి నటపుట్టుచోట,
వసువులయంశముల్ వలనొప్పఁ దాల్చి
పొసఁగ భీష్ముఁడువుట్టెఁ బుణ్యమానసుఁడు ;
ద్రోణుండుపుట్టె శుక్రునియంశమునను ;
క్షోణిఁ గర్ణుఁడుపుట్టె సూర్యాంశమునను;
రూఢి నేకాదశరుద్రులంశమున
[66]గూఢముగ నుదయించె గుణమూర్తికృపుఁడు :
మహినిఁ గామ క్రోథ మద మత్సరముల
సహవాసలీల నశ్వత్థామపుట్టె;
ఉరుశక్తి ద్వాపరయుగము నంశమున
ధరఁ బుట్టె శకుని జూదపునేర్పుతోడ ;
[67]ఘనుఁడు హంసుండను గంధర్వునంశ
మున ధృతరాష్ట్రుండు పుట్టె భూవిభుఁడు ;
విను మంత [68]మతియనువేల్పునంశమున
జనియించె గాంధారి శతపుత్త్రమాత ;
కలియుగాంశంబునఁ గడుఁగ్రూరుఁడగుచుఁ
దులితార్కుఁ డుదయించె దుర్యోధనుండు ;
తనరఁ బౌలస్త్యసోదరులు నూర్వురును
ననుజులై యుదయించి రాకౌరవునకు;
శిశుపాలుఁ డుదయించెఁ జెలఁగి హిరణ్య-
కశిపునంశంబునఁ గడుఁగ్రూరుఁడగుచు ;
అనువొప్ప సహ్లాదుఁడను దైత్యునంశ
మున శల్యుఁడుదయించె భుజబలోన్నతుఁడు ;
తగవొప్ప బాష్కలదైత్యునంశమున
భగదత్తుఁ డుదయించెఁ బరమవైష్ణవుఁడు ;
విప్రచిత్తను యక్షవిభుని యంశమున
సప్రతాపుఁడు జరాసంధుండుపుట్టె;
ననఘ! నపుంసకుండగు[69] గుహ్యునంశ
మునఁదోచె మలకంటి (?) మొండిశిఖండి ,
మానుగాఁ బుట్టిరి [70]మరుదంశమునను
శై నేయ విరట పాంచాలురన్ నృపులు ;
సదయాత్ముఁడైనట్టి జమునియంశమున
విదురుండు జనియించె విష్ణుభక్తుండు ;
అదె బ్రహ్మయంశంబునందుఁ బాండుండు
నుదయించె నెంతయు నుర్విమోదింప ;
సిద్ధి బుద్ధి యనంగ సిద్ధకామినుల
యిద్ధాంశములఁ బుట్టి రిలఁ గుంతి మాద్రి ;
ధర్మాత్ముఁడైన యంతకునియంశమున
ధర్మరా జుదయించె ధరయెల్లఁబొగడ ;
నామహాత్ముని తమ్ముఁ డనిలునంశమున
భీమ సేనుఁడు పుట్టె భీమప్రతాపి ;
నరుఁడనుముని వచ్చి నా కేంద్రునంశ-
భరమునఁ గ్రీడియై ప్రభవించి మించె ;
[71]సహజు లశ్వినులయంశమ్మున నకుల
సహదేవు లొదవిరి జగతినిఁగ నలు;
శ్రీయంశమున యాజ్ఞ సేని జన్మించె ;
నాయెధృష్టద్యుమ్నుఁ డగ్నియంశమున ;
వివరింప భారతవీరులు మఱియు
దివిజాంశ దనుజాంశ దృష్టరూపముల
నవతరించిరి; యందు నమరాంశులెల్ల
రవి తేజుఁడైన ధర్మజుని వారైరి;
యసురాంశభవులెల్ల నాసుయోధనుని
వసమున నుండిరి వైరంబుదలఁచి.
అట్టిభారతవంశమనుసముద్రంబు
పుట్టెఁ జంద్రునినుండి బుధుఁడాదిగాఁగ.
జలరాశిఁ జంద్రుండు జనియించెఁగాక ;
జలధి చంద్రునియందు జనియించుటరుదు !
నుతికెక్క దుర్యోధనుఁడు బడబాగ్ని ;
యతిరథ సమరథు లందు జంతువులు;
సొరిదిఁ బుట్టిన రాజసుతులు రత్నములు ;
అరయ వారలకీర్తి యమృతరసంబు ;
మొగి ధర్మసుతునితమ్ములు తరంగములు;
తగఁ జెలియలికట్ట ధర్మజుతాల్మి
కలహనహాయులు కలిసిననదులు;
తలకొన్న శకునిజూదము, దానివిషము ;
అరయ మధ్యస్థుఁడై వినోదించు
నారాయణుం డాదినారాయుణుండు.
సకలభూతోద్భవము సరవితోవిన్న ,
సకలసంపదలిచ్చు సర్వేశ్వరుండు.
ఇట్టివంశమున ననేకులు నృపులు
పుట్టి, యీయిలయేలి పోయిన వెనుక ,
యయాతి చరిత్ర
నహుషాత్మజుండైన నవకీర్తి శాలి
యహిమాంశునిభుఁడు యయాతిభూవిభుఁడు
సకలరాజ్యంబును సవరగా నేలి,
ప్రకటించి క్రతువులు బహుభంగిఁజేసి,
యతఁడు శుక్రునికూఁతు నసురేశుకూఁతు
మితి దేవయాని శర్మిష్ఠలన్వారిఁ
బరఁగవరించి, యాభార్గవియందు
వరుసతో యదునిఁ దుర్వసువునిఁ గాంచె.
సహ్యధర్మాత్ముఁ డాశర్మిష్ఠయందు
ద్రుహ్వ్యానుపూరుల దొరయంగఁబడసె.
అంత, శర్మిష్ఠపై నవనీశుకూర్మి
కొంతకాలముకు శుక్రునికూఁతురెఱిఁగి,
కోపించి జనకుతోఁ గుందిచెప్పుటయుఁ,
దాపసుండాకవి తద్దరోషించి:
'నాకూఁతు నవ [72]మాననము చేసెఁగానఁ,
జేకూరు వీనికి శిధిలంపుముదిమి.'
అనిశాపమిచ్చిన నతఁడునట్లగుచుఁ
దనయులకిట్లనుఁ దా: 'సుతులార,
మీజవ్వనంబిచ్చి మీలోననొకఁడు
నాజరగొనుఁ' . డన్న నలుగురుసుతులు
'నోపము పొ ' మ్మన్న, నొనరఁ బూరుండు
చేపట్టిజర, తనచిన్నిప్రాయంబు
జనకునకిచ్చిన, జననాథుఁడలరి
తనపంపుసేయని తనయుల విడిచి,
తనరాజ్యమునఁ బూరుఁ దగివొప్ప నిలిపి
ఘనతపోమహిమ నాకంబున కేఁగె."
అనవిని జనమేజయావనీనాథుఁ
డనఘవైశంపాయనార్యు కిట్లనియె :
"వినుతాత్మ, మావంశవృద్ధులందఱును
ఘనధర్మపరులని కలయ నెన్నుదురు.
రాజయ్యుఁ దా నెట్లు రమణ యయాతి,
యోజ శుక్రునికూఁతు నుద్వాహమయ్యె
నీసందియము నాకు నెఱుఁగంగఁజెప్పు;
మేసమ్మతులఁ జూడ నిది యధర్మంబు."
అనిన నానృపుఁజూచి యమ్మౌని పలికె :
"విను మేర్పరింతు నావృత్తాంతమెల్ల ;
మును వృషపర్వుండు ముదమొప్ప దనుజ
ఘన రాజ్యమంతయుఁ గడిమి నేలుచును,
నొనరిన దానవయోధులఁ గూడి
తనర స్వర్గముమీఁద దండెత్తిపోయి,
యమరులుఁ దానును నతిఘోరరణము
నమితంబుగాఁజేసి యపజయంబొదవి,
యే తెంచి, తమపురోహితునకు నపుడు
[73]బ్రాఁతితో బ్రణమిల్లి భక్తినిట్లనియె:
"భార్గవ, యెప్పుడు బవరంబులోన
స్వర్గధీరులు మాకు జలదరింపుదురు.
నేఁడిదె దైత్యుల నిర్జరోత్తములు
పోఁడిమిఁజంపిరి పుణ్యాత్మ వారి
సంజీవనీమంత్ర సామర్థ్యమునను
సంజీవితులఁజేసి జయమిమ్ము మాకు ".
ననుచుఁ బ్రార్థన సేయ, నలరిశుక్రుండు
తనమంత్రశక్తిచే దనుజులఁగా చె.
ఈవిధంబున మఱి యీల్గురాక్షసుల
నేవెంట నాశుక్రుఁ డెలమిరక్షింప,
బ్రదికి దానవులెల్లఁ బ్రబలులై సురలఁ
బ్రిదులక చంపంగ, భీతులై వారు
తమకు సంజీవని తగులమిఁజేసి
తమసేనపొలియుట తర్కించిచూచి,
తమపురోహితునాజ్ఞఁ 'దత్పుత్రుఁ గచుని
[74]నమర నీమంత్రార్థ మర్థింత ' మనుచుఁ
గచుఁడున్న కడ కేఁగి, గారవంబొప్ప
నుచితంబుగావించి యొనరనిట్లనిరి:
"ఓమహాత్మక, నీవు యోగ్యవిప్రుండ ;
వేము మీశిష్యుల ; మిందువచ్చితిమి ;
శుక్రసంజీవనీ సురుచిరస్ఫూర్తి
విక్రాంతి దైత్యులు వెఱవరుమాకు ;
వారిచేఁదెగిన మా వరసేనలెల్లఁ
బోరిలోఁ బోయినపోకయైచనిరి ;
కావున, నీ వింకఁగౌశలంబొప్ప
నేవిధంబుననైన హితమాచరించి,
శుక్రుచే సంజీవి <>సుపద.</>శుభదమంత్రంబు
సక్రమంబునఁగాంచి జరగిరావయ్య !
అట్టైన, మాకు నీయమరరాజ్యంబు
నెట్టనసిద్ధించు నీప్రసాదమున. "
ననుచు దేవతలెల్ల నర్థిఁ బ్రార్థింప,
ననయంబుఁ గచుఁడును 'నవుఁగాక ' యనుచుఁ
జనుదెంచి, యాశుక్రసంయమీంద్రునకు
వినతి దండము వెట్టి వేడ్కనిట్లనియె:
కచుఁడు సంజీవనీవిద్యకై శుక్రునొద్ద కేఁగుట
"ననఘాత్మ, యేను బృహస్పతిసుతుఁడ ;
నొనరంగఁ గచుఁడ; మీయొద్దనె విద్య
లన్నియుఁ జదువంగ నరుదెంచినాఁడ ;
నన్ను శిష్యునిగాఁగ నడుపవే ! ” యనినఁ,
గావ్యుండు ‘నట్లనె గావింతు' ననుచు
భావ్యంబు మదిలోనఁ బరికించి చూచి :
‘రూఢి వీఁ [75]డమరపురోహితుకొడుకు
ఈడఁజదువుట నాకు నెన్నిక ;' యనుచు,
నాకచునకు వేడ్క సఖలశాస్త్రములు
జోకగాఁ జెప్పుచు శుక్రుఁడున్నంతఁ,
గచుఁడును గురుసేవ కడఁకఁ జేయుచును
నచట శుక్రునికూఁతురగు దేవయాని
నిచ్చలుఁ దనతోడ నెయ్యంబు సేయఁ,
గ్రచ్చఱ నొకనాఁడు కాననంబునను
హోమధేనువుఁ గాచుచుండంగఁ జూచి,
తామసులైనట్టి దానవులలిగి,
'పగవారిబాఁపనిపట్టివీఁ ' డనుచుఁ
దెగిచంపి ; రంతలొ దినపతిగ్రుంకె ,
హోమధేనువులెల్ల నొగిఁ దోవఁబట్టి
తామె యింటికిరాఁగఁ, దనసఖుఁ గచుని
గానక భార్గవి కలఁగిశోకింప,
దానవాచార్యుండు తనయ కిట్లనియె:
"శోకింపనేటికి సుదతి, నీకిప్పు
డేకోర్కియైన నే నిచ్చెదనడుగు ;"
మనిన, నాతండ్రితో నతివయిట్లనియె :
"అనఘాత్మ, నేఁ డేమి యావులవెంటఁ
గచుఁడురాఁడాయెను ! గానలోపలను
[76]బ్రచురంపు, మృగకోటి పాలాయెనొక్కొ !
ఏవిధంబుననైన నెఱిఁగి, నీమహిమఁ
దేవయ్య వాని నాదృష్టిభూమికిని."
అనుడు శుక్రుఁడు తనయాత్మఁ జింతించి,
దనుజులచేనొచ్చి ధరనుండుటెఱిఁగి,
సంజీవనీవిద్య చయ్యనఁబుచ్చి
సంజీవితునిఁజేసి, సామర్థ్యమొప్ప
రప్పింపఁ, గచుఁజూచి రాను భార్గవియు
నుప్పొంగె హర్షాశ్రులొలుకంగ నపుడు.
వెండియు నొకనాఁడు వికటాటవులను
దండినావులఁగావ, దనుజులు కినిసి
కచునిఁ జూర్ణముచేసి కలితమద్యమున
నుచితంబుగాఁగూర్చి యుశనునకొసగ,
దానవాచార్యుం డుదగ్రుఁడై త్రావి
తానుదన్నెఱుఁగక దర్పించియుండె.
అంత మాపటివేళ నావులవెంట
నెంతయుఁ గచుఁగాన కిట దేవయాని
జనకునకిట్లను: “జనక, యిదేమి !
ఘనుఁడు నీశిష్యుఁ డెక్కడఁబోయినాఁడు ?
అసురులు నేఁడును నడవిలోఁ బట్టి
[77]మిసిమింతుఁజేసిరో మిన్నక వాని ” !
అనవుడు భార్గవుఁ డాత్మజకనియెఁ :
“దనయ, యావ----పై దానవులెల్లఁ
జలముగొన్నారు; నేఁ జాల రక్షింప ;
నలయక కచుడింక నరుగనీ దివికి,
తాడెక్కుమానిసిఁ దగఁ గ్రిందుపట్టి
యెడగాను ద్రోయంగ నెవ్వరివశము ! "
అనినఁ, దొయ్యలిపల్కు : 'నతఁడులేకున్నఁ,
గొన నన్న పానముల్ కుందుచు. ' ననుడుఁ,
దనయపై ననురాగదయుఁ డౌటఁజేసి
విని, భార్గవుండు వివేకించిచూచి,
యన్నిలోకంబుల నతఁడు లేకున్నఁ
గ్రన్ననఁగని, తనకడుపులోఁ జూడఁ
బోవంగ నందులో [78]బుగ్గియైయుండె ;
గావున, సంజీవిఘనమంత్రశక్తి
బ్రదికించి, వానికిఁ బ్రాణమంత్రంబు
లొదవినదయతోడ నుపదేశమిచ్చి:
'యిందాఁక నాజ్ఞాన మెడలించెమధువు ;
నిందితంబగుఁగాక నెఱి నింతనుండి;
[79]పరఁగ మధుపానంబు పాతకం.' బనుచు
గురుసమయముచేసి గురుపుత్త్రుఁబలికె ?
"ఓవత్స, నీవు నాయుదరంబు చించి
వేవచ్చి యీమంత్రవిభవంబుచేత
ననుబ్రదికింపుము నయవిధి. " ననిన
ననయంబు నా తండు నట్లకాఁజేసి,
దండప్రణామంబు తగ నాచరించి
కొండంతభక్తితో గురునకిట్లనియె:
“అనఘాత్మ, నీచేత నఖిలవిద్యలును
దనరంగ నేర్చితి ధర్మమార్గమున ;
భారతీదానంబుఁ బ్రాణదానంబు
నేరుపఁగల నింక నెఱయ నన్యులకుఁ ;
బోయెదనే;" నన్నఁ బొంగి భార్గవుఁడు
ధీయుక్తి నాకచు దీవించియనిపె.
కచదేవయానుల పరస్పర శాపప్రదానము
అనిపిన నాదేవయానికిఁ జెప్పి,
చనియెదనని పోయి జవ్వనిఁబలికె:
"గురుఁడురమ్మని నాకుఁ గోరిపుత్తెంచె;
గురునిచే నంపించుకొని వచ్చినాఁడ;
నెఱి నింకఁ బోయెద నిజగేహమునకు;
నెఱిఁగింపవచ్చితి నింతి, నీ. " కనిన,
ననఘు నాకచుఁజూచి యా దేవయాని :
"వినుమయా కచ, నీవు విభుఁడవై నాకు
నుండుదుగా; కింక నొండుఠావునకు
దండికూరిమిమాని తగునె నీ కేఁగ!”
అనవుడుఁ, గచుడు నెయ్యముమాని పలికె:
“ననునిట్లు నీవాడ నాయమె ముగ్ధ !
గురుపుత్రి వరియించు కునుతులుగలరె !
తరుణి, ధర్మములెల్లఁ దప్పనాడెదవు !
ఒనఁగూడ వీమాట -------- . " ననినఁ
గనలి, యాభార్గవి కచునకిట్లనియె :
“ఓదురాత్మకుఁడ, నీవును బ్రాహ్మణుఁడవె !
నీదురుక్తులు నమ్మి నేవెఱ్ఱినైతి,
నీతోడఁజేసిన నెయ్యమింతయును
[80]నీ తెఱంగుననయ్యె నీటివ్రాక్పగిదిఁ !
గావున, మాతండ్రికరుణించినట్టి
జీవమంత్రము నీకుఁ జెడిపోవుఁగాక. "
అనుచుశపించిన నాకచుండలిగి,
యెనయ నాసతిఁజూచి: “యింతి, నేనిట్లు
ధర్మవాక్యము నిన్ను దాఁక నాడినను
ధర్మమే శపియింపఁ దరుణుకి నీకుఁ !
బ్రాణమంత్రము నాకుఁబనిసేయకున్నఁ,
ద్రాణ నాశిష్యులు [81]తా మొనర్చెదరు.
ఎనయంగ నీకును హితుఁడైన మగఁడు
మనుజేశుఁడగుఁగాక మహిమీఁద.” ననుచుఁ
గ్రమ్మఱశపియించి కచుఁడు షోవుటయు,
నమ్మానినియు నుండె నాత్మవగచుచును.
అంత, నావృషపర్వునాత్మజయైన
కాంతశర్మిష్ఠ భార్గవపుత్రిఁగూడి
పరిచారికలు పెద్దపరిచర్యసేయ
నరుదెంచి, వనములో నలరఁగ్రీడించి,
చీరలుధరఁబెట్టి శీతాంబు కేళి
వారకగావించి వారిలో వెడలి
శుక్రుకూఁతురుచీరఁజుట్టెఁ ; జుట్టుటయు
నక్రమంబున, దేవయాని యిట్లనియె:
"నాపుట్టమిది ; గట్ట నాయమె నీకు !
నేపున నీకట్టునీమైలనాకుఁ
గట్టవచ్చునె ! నాతిక్రమముఁదప్పితివి”.
[82]ఇట్టన, మైమయి వేచి శర్మిష్ఠ
కవిపుత్రికిట్లనుఁ : "గాంత, నేఁజాల
వివరింప కిటఁగట్ట వీడనాతిదవు!
రాచకూఁతురనేను ; రమణ నాయొద్ది
గోఁచిబాఁపనికీవు కూఁతుర వింతె!
నీచీర నేఁగట్ట నెఱిగాదుగాక ;
నాచీరగట్టిన నాతి, నీ కేమి?”
యయాతి, నూతఁబడిన దేవయాని నుద్ధరించుట
అనుచువివాదించి, యసురేంద్రపుత్రి ,
గొనిపోయి భార్గవి గూపంబులోనఁ
ద్రోయించి, యడవిలోఁ దోడనెవచ్చి
ధీయుక్తిఁ బురములోఁ దెమలకయుండె.
అటమున్నె, యాకానయందు యయాతి
[83]పటురీతి మృగకోటిఁబట్టి వేఁటాడి
యానూతిచేరువ నటపోవ, నేడ్పు
వీనులసోఁకిన, వేఁటచాలించి,
తరుణిగాఁదలపోసి, తద్దయువగచి,
పరికించి నూతిలోపలఁ జూచునపుడు,
కనుఁగవఁ గన్నీరు కడునించి యేడ్చి
కొనగోరఁ గన్నీరుగొని మీటుదానిఁ,
బడినభారంబునఁ బయ్యెదజారి
కడలేనికుచకాంతి గప్పినదాని,
నెడగల నుడివోలె నింపైననాభి
బడుగునెన్నడుముతోఁ బ్రకటించుదానిఁ
గనుఁగొని, యారాజు కరుణాత్ముఁడగుచు
వనిత వేవెడలించె వలకేలుపట్టి.
ఆరీతి నాకూప మా దేవయాని
వారక వెడలి, యావసుమతీశునకుఁ
దనచరితంబెల్లఁ దప్పకచెప్ప,
వనమువెల్వడివచ్చి పడి యయాతియును
దనపురంబున కేఁగె దళములతోను
చనినంత, భార్గవి చనక యూరికిని
ఘూర్ణికయనుచెలిఁ గోరిరావించి :
"నిర్నిమిత్తము నన్ను నేఁడు శర్మిష్ఠ
నూతిలోపలఁద్రోచి, నూర్గురుఁ దాను
నేతెంచెఁగాన నేనింటికి రాను.
ఈ తెఱంగంతయు నీవిప్పుడేఁగి
మాతండ్రికెఱిఁగింపుమా ! చాలు. " ననిన,
నదియును 'నగుఁగాక' యని పోయి, యతని
కొదవంగ నంతయు నోడకచెప్పె. ;
జెప్పిన, శుక్రుండు చేరంగఁబోయి
తప్పక కూఁతుతో దయనిట్లుపలికె :
శర్మిష్ఠ దాసియై దేవయానిఁగొలుచుట
"ఓబాల, నీ కేల యుగ్రకోపంబు !
[84]ఈబాము లేనుండ నెట్లుగావచ్చు !
శర్మిష్ఠచేసినసాహసంబెల్లఁ
గర్మవశం; బింతె! కందంగవలదు.
ఇల్లు [85]వట్టుము ; నీకు నిచ్చోటనుండఁ
దల్లి, ధర్మముగాదు ; తరుణివినీవు. ”
అని యొడంబఱుచుచో, నంతట దైత్య-
ఘనుఁడైన వృషపర్వ [86]క్రవ్యాదవిభుఁడు
తనతనయ చేసిన దంటతనంబు
మనముననెఱిఁగి, యమ్మగువఁ దోడ్కొనుచు
వచ్చి యాగురునభివందించి పలికె:
'హెచ్చి మాశర్మిష్ఠ యీయింతి కెగ్గు
లొనరించె; దీనినేలుఁడుదాసిగాఁగ;'
ననిన, నాశుక్రుండు నంగీకరించె.
అప్పుడు వేడ్కతో నాదేవయాని
యుప్పొంగి, శర్మిష్ఠ యొగిఁదన్నుగొలువ,
జనకుండు వృషపర్వసహితుఁడై యగ్ర
మునఁబోవ, నే తెంచెఁబురవరంబునకు.
దేవయాని వసంతవన విహారము
అంత, నాభార్గవి యట యొక్కనాఁడు
కాంతశర్మిష్ఠాదికాంతలు గొలువ
వనకేళిచేయుచో, వలనొప్ప నపుడు
వనమున నొప్ప [87]య్యె వాసంతలక్ష్మి,
మాకంద మందార మధుక మాలూర
శాఖోట పాటలి చంప కాశోక
సల్లకీ బిల్వాది సకలభూజములు
మొల్లంబుగాఁ బూచె ముదమొంద నలులు.
విరహులపై దండువెడలంగ మదనుఁ
డిరవుతో మునుబంచె నెలగోలనంగ,
మిండతుమ్మెదపిండు మించుఁబూఁదేనె
కండక్రొవ్వునఁ గ్రోలి [88]కలగుండుపెట్టె;
"మానినీమణులార, మానంబుమాని
మానుగాఁ గలియుఁడు మగల ' నన్నట్లు,
మావిలేఁజివురెల్ల మత్తిల్ల [89]మెసవి
కోవిలకదుపులు గొణఁగంగఁదొడఁగె;
ఫలరసధారలు బాగుగాఁ గ్రోలి,
చిలుకమూఁకలు గూడి చెరలుగొట్టుచును,
పంచబాణుని తేరి [90]వార్వాలమనుచు
ముంచి పాంథులమీఁద మొగమెఱ్ఱచేసె ;
విరహులవిరహాగ్ని విదితంబుసేయ
మరుఁడుపుత్తెంచిన మందిది యనఁగ
మలయాద్రిచలిగాలి మధుర సౌరభము
వలనొప్పఁ బొలసె నవ్వనవీధులందు.
అప్పుడు భార్గవి యతిసంభ్రమమున
నుప్పొంగి, చెలులతో నుద్యానవీథి
విహరించి, యెంతయు వేడ్కలింపార
బహుపుష్పవితతులు బహుభంగిఁగోసిఁ
పోగులుపోయించి, పుష్పాస్త్రునచట
బాగుగానొదవించి భక్తివ్రాయించి,
పూజించి యవ్వేల్పుబోఁటికిమ్రొక్కి
యోజతోఁ గొనియాడె: "నోరతిరాజ,
చిగురుఁగైదువుచేతఁ జిత్రంబుగాఁగ
జగములన్నియు గెల్చు జగదేకవీర!”
.......... .......... .......... .......... .........
.......... .......... .......... .......... ........
యయాతి దేవయానిని వివాహమగుట
అనుచుఁబ్రార్థనచేసి యంజలిచేసి
మనముననలరి నెమ్మదిగుండె, నంత,
నటయయాతియు వేటలాడంగఁబూని,
బటురీతిఁ జతురంగబలములతోడ
వేఁటకుక్కలు వలల్ వెస[91] బోయవాండ్రు
వాటంపుడేగలు వలనైన తెరలు
మొదలైనసాధనంబులు చాల గలిగి,
పదిలుఁడై యడవికిఁ బసతోడవచ్చి,
తెరలును చలలును దివిఱిపన్నించి,
చుఱుకుగా మృగముల జోరువెట్టించి,
వటహ భేరీ శంఖ పణవ నిస్సాణ
పటువాద్యములు చెవుల్‌పగులమ్రోయించి,
బెదరినమృగరాశి ప్రిదులక డాసి,
వదలక కుక్కలఁ బాఱంగవిడిచి,
బాణజాలములేసి పార్థివోత్తముఁడు
త్రాణతో శరభాలి ధరమీఁదఁగూల్చి,
సింగాలవధియించి, చెండిబెబ్బులుల,
భంగించియలుగులఁ, బందులఁగ్రుచ్చి,
మన్నుబోతులఁద్రెంచి, మహిషాళిఁద్రుంచి,
చిన్ని [92]కొర్నవగండ్లఁజెలఁగిఖండించి,
కడతులఁగారించి, ఖడ్గజంతువుల
మడియించి, చిఱుతలమదమెల్లఁద్రెంచి,
దుప్పులఁదెగటార్చి, తూఁటాడి కరుల,
నొప్పించి యెద్దుల, నుడుగక మఱియుఁ,
దక్కినమృగములఁ దవిలిచెండాడి,
వెక్క సంబుగ డేగ వేఁటయు నాడి,
తనసేనలును దాను ధరణినాయకుఁడు
వనములో వేడ్కమై వర్తించునంత,
విరిదమ్మివిరులపై విహరించి, యలరు
తరుణుల మనుగురుల్ తరళింపఁజేసి,
వనపుష్ప సౌరభ వాసితంబగుచు
మనుజేశుపై వీచె మందమారుతము.
తరుణుల చదురులు, దంటమాటలును,
బరిహాసములు వినఁబడెఁ; బడుటయును,
జెవులలో నమృతంబు చిలికినట్లై న
నవలీల నే తెంచె నరనాయకుండు.
చుక్కలలోనున్న శుభ్రాంశు కలికి
చక్కఁదనంబున [93]జవ్వనంబునను
జెలులలోపలనెల్లఁ జెలువమై మిగుల
లలితభావంబున లలినొప్పుదాని,
నెఱిగలకురులును నిడుదకన్నులును,
మెఱుఁగుఁజెక్కిళ్లును, మించినమోవి,
నగెనగెననియెడి నవకంపుమోము,
జిగిబిగి గలిగెడి చిన్ని చన్నులును,
దెగెఁదెగెననియెడి [94]తేలికనడుము,
ధగధగమనియెడి తను [95]వల్లరియును,
నూఁగారు [96]సౌరు, నన్నువలైనవళులు,
బాగైనపిఱుఁదును, [97]బసిమిపాదములుఁ
గలిగి కాంతలకెల్లఁగాంతియై [98]నిలిచి
యలరెడు నా దేవయాని నానృపుఁడు
గనుఁగొని, యాశ్చర్యకలితుఁడై మున్ను
మనముననెఱుఁగనిమాడ్కి నిట్లనియె:
"ఇందీవరాక్షి, నీవెవ్వరిదాన !
వెందుండివచ్చితి విచ్చటికిపుడు ?
వెస నీకుఁ బే రేమి ? వీరలెవ్వారు ?
మసలక చెప్పు మామననుమోదింప.”
అనిన, భార్గవినవ్వి యతనికిట్లనియె;
“విను, మఱచి తె నన్ను విజ్ఞానివయ్యు !;
శుక్రుండుమాతండ్రి; సురుచిర తేజ (?)
విక్రాంత, నా పేరు విను దేవయాని ;
పరిచారికలు నాకుఁ బరఁగవీరెల్ల ;
సొరిది నీవన [99]శోభఁ జూడవచ్చితిమి.
మున్ను నే నూతిలో మొఱవెట్టుచుండఁ
గ్రన్ననఁ గడఁక నాకడకేఁగుదెంచి,
నావలచేయి యున్నతి వడిఁ బట్టి,
వే వెడలించితి విపినకూపంబు.
కావున, నదియపో కరుణావిధేయ,
భావింప నాకయ్యెఁ బాణిపీడనము.
నాఁటనుండియు నిన్ను నాటినకూర్మి
వాటమైయున్నది వదలింపరామి.
ఈకాంత [100]లిందఱు నెలమిసేవింప
నీకాంతనయ్యెద నెలమిఁగైకొమ్ము."
అనిన, యయాతి [101]శంకాయత్తుఁడగుచు
మనమున ధైర్యంబు మఱువెట్టిపలికె:
"ఓముగ్థ, యీమాట లొనఁగూడవెందు ;
నేమురాజన్యుల ; మీవుబ్రాహ్మణివి ;
కాన, వివాహంబు కాఁగాఁదు నిన్ను ;
నేను ధర్మముదప్ప నెట్లు సేయుదును ! "
అనవుండు నయ్యింతి యనుకూలయగుచు,
మనమునఁ దమతండ్రి మహితాత్ముఁదలఁచెఁ ;
దలఁచిన, శుక్రుండు తడయకవచ్చి
[102]నిలిచె నాపుత్రికానృపుల కట్టెదుర.
అప్పుడారాజన్యుఁ డాదేవయాని
యుప్పొంగి ప్రణమిల్ల, నుబ్బిభార్గవుఁడు
ఆసీనుఁడై వేడ్క, నవనీశుఁబలికె :
"భానురాత్మక, నీవు పరమపుణ్యుఁడవు ;
రాజవు ; సద్ధర్మరతుఁడవు ; గానఁ,
దేజిత నాకూఁతు దేవయాన్యాఖ్య (?)
నిచ్చితిఁబత్నిగా; [103]నీమె యెల్లెడల
నచ్చినధర్మంబునకు నగు నీకు."
అనుచుఁ బార్థివచంద్రు ననుమతుఁజేసి,
తనపురంబునకు నాతనయతోఁగూడఁ
దోకొని, వేడుకఁదూర్యముల్ [104]మొరయ
భూకాంతునకుఁ బెండ్లి పుత్రికఁజేసి,
దివ్యభూషణములు దివ్యాంబరములు
దివ్యగంధములుఁ బుత్రికి నల్లునకును
గట్టంగనిచ్చి, యాకావ్యుండు వారిఁ
బట్టణంబునకంపి, పార్థి వేంద్రునకు
శర్మిష్ఠఁజూపి సంశయమేదిపలికె:
"ధర్మాత్మ, వృషపర్వదానవేంద్రునకుఁ
గూఁతురీకోమలి, కోమలగాత్రి;
బ్రాఁతి నాపుత్రికిఁబరిచారికనక,
శయనంబువెలిగాఁగ సర్వభోగములు
నయవిధి దీనికి నడుపుము నీవు. ”
అనిచెప్పి భార్గవుండటపోయెఁ; బోవ,
మనుజేశ్వరుండును మదిలోననలరి,
దేవయానియుఁ దాను దేవేంద్రుభాతి
భావజరాజ్యసంపదలందుచుండె.
అంత, గర్భిణియైనయా దేవయాని
కెంతయు నరుచితో నెసగెవేవిళ్లు ;
మోమువెల్వెలఁబాఱె; మురిపెంబుదక్కె ;
వేమాఱు నయనముల్ [105]వెల్లనైతోచెఁ
బాలిండ్లముక్కులపస వల్లనయ్యె ;
బాలకి యాలోనఁ బదియగునెలను
యదుఁడు తుర్వసుండను నిరువురసుతుల
ముదమొప్పఁగాఁగాంచె; మోదించి నృపుఁడు
పుత్త్రోత్సవంబులు పొలుపారఁజేసి,
ధాత్రియేలుచునుండె ధర్మమార్గమున.
పుత్త్రులులేని యాభూజనులెల్లఁ
బుత్త్రులఁగాంతు రీపుణ్యకథవినిన.
యయాతి, శర్మిష్ఠకుఁ బుత్త్రదానంబుసేయుట
ఒకనాఁడు వేడ్కతో నుద్యానవనము
కొకఁడు నే తెంచుచో, నొంటిమై నచటఁ
జీఁకటిలోనున్న శీతాంశురేఖ
తేఁకువ నొప్పెడు దేహంబుదాని,
సమ్మతి ఋతుశుచిస్నాతయై వచ్చి
కమ్మనితావులఁ గరమొప్పుదానిఁ,
బలుమాఱు పయ్యెద పాటించుకొనుచు
జిలిబిలిసిగ్గునఁ జెలువైనదాని
నమలాంగి శర్మిష్ఠ నారాజుచూచి
తెమలియుండఁగఁ, గాంచి తెఱవయుఁగదిసి
ప్రణమిల్లి పలికె : “నోపార్థివచంద్ర,
గణుతింప దై త్యేంద్రకన్యను నేను ;
వెసఁ గానలోఁగాయు వెన్నెలపోలెఁ,
బస దేఁటిగొననిపుష్పము తావివోలె,
నవనిఁదాఁచిన రత్నహారంబు పోలె,
ధవుఁబాయు కామినీతండంబు పోలె,
నాజవ్వనంబెల్ల నానాఁటికిట్టు
లోజ నూరకపోయె నోదయాధార !
ఋతుమతినై యేను నిట్లున్న దానఁ ;
జతురత నాకోర్కి సలుపు వే దేవ !”
అనుటయు, రాజన్యుఁ డబలకిట్లనియె:
"వినుము, నీమాటలు వినఁగూడవిపుడు ;
శుక్రుండు నిను మున్ను జూపి [106]చెప్పుచు, న-
వక్రముగ నాకునేవాక్యంబుచెప్పె
నావిధంబున నేను నరుగుదుఁ; గాని,
యే వెంట నామాట లేదాటవెఱతు."
అనవుడు శర్మిష్ఠ : "యట్లేల ! దీనఁ
దనరిన సత్యంబు దలఁగదు నీకుఁ ;
'బ్రాణసంకటముల, బ్రాహ్మణక్రియల,
రాణతోఁ బెండ్లిండ్ల, ద్రవ్యభంగముల,
నతివయు ఋతుమతియైయుండుచోట్లఁ
బతి కల్లలాడినఁ బాపంబులేదు',
అని చెప్పవిందు నే నఖిలశాస్త్రముల ;
విను నీవుబొంకితి వెసఁబెండ్లియందు. "
అనియొడంబఱచిన నతఁడిచ్చగించి,
[107]యొనరిన రత్నంపుటోనరులందు
నిపుణత బహుపుష్పనిర్మితశయ్య
నపరిమితో త్సాహుఁడై పవ్వళించి,
శర్మిష్ఠనీక్షించి, సరసంబులాడి,
మర్మంబులన్నియు మఱి యంటియంటి,
మెఱుఁగుఁ జెక్కిలిగీఁటి, మించుఁబాలిండ్ల
గుఱుతులుగాఁ గొనగోళ్లునాటించి,
బిగియఁ గౌఁగిటఁజేర్చి, బింబాధరంబు
తగవొప్పఁజవిగొని, తద్దహర్ష మున
యువతి మన్మథకేళి నోలలాడించి
యవనీశ్వరుఁడుపోవ ; నపుడు శర్మిష్ఠ
వలుదక్రొమ్ముడి వీడి, వదనంబువాడి,
తిలకకస్తురిజారి, దిటవెల్ల దారి,
తఱుచావులింపుచు, ధవళనేత్రముల
నెఱికెంపుదోపఁగ, నిలుగుచు, మఱియుఁ
బొదవిన సంభోగభూరిచిహ్నము
లొదవంగ, గర్భమై యోగ్యంపుఁదిథుల
దృహ్వ్యానుపూరుల ధృవకీర్తియుతుల
సహ్యధైర్యులఁ గాంచె సత్క్రమంబునను.
అంతట, నొక్కనాఁ డాదేవయాని
కాంతుండుఁ దానును గదియంగనుండి,
శర్మిష్ఠకొడుకులు చదురొప్ప నచటి
కర్మిలినేతెంచి యాడుచుండఁగను,
రూపవైభవకళారూఢి నారాజు-
రూపంబులైయున్న, రోషించిచూచి
మగనితోనిట్లను : 'మనుజేశ, వీరు
తగవొప్ప నెవ్వరితనయులో ! ' యనిన
రాజూరకుండిన, రమణి యాసుతుల
నోజతోనడిగె ని: 'ట్లోబాలులార,
మీతల్లిదండ్రుల మృదురీతి నాకుఁ
బ్రీతిఁజెప్పుఁడు మీకు బెల్లమిచ్చెదను. '
అనిన బాలురుపల్కి: 'రతివ, మాతండ్రి
తనర యయాతి ; మాతల్లి శర్మిష్ఠ.'
అనవిని భార్గవి యతిశోక కోప-
వినతయై, యచ్చోటవీడ్కొనిపోయి
తనతండ్రికంతయుఁ దప్పక చెప్పఁ,
శుక్రుఁడు యయాతిని శపించుట
గనలి, యాశుక్రుఁ డాకన్యనూరార్చి :
“నిను డాఁగురించి యానృపతి శర్మిష్ఠ
ననుభవించినయట్టి యాపాపమునకు
వదలజవ్వన, మెల్ల వాసియుఁదక్కి
ముదిమినొందు" ; నటంచు ముని శాపమిచ్చె.
నిచ్చిన, వివశుఁడై యెఱిఁగి యయాతి
యచ్చుగా శుక్రున కందందమ్రొక్కి,
యనయంబు భక్తితో నంజలిచేసి:
"యనఘాత్మ, చేసితినపరాధమేను ;
గావవే! ముదిమి నేఁగడవంగనోవ ;
భావింప విషయానుభవకాంక్ష గలదు."
అనియనిప్రార్థింప, నతఁడు చింతించి
తనలోన నొక్కింత దయచేసి పలికె:
"భూప, యీముదిమి నీపుత్త్రులలోన
నేపుత్త్రునకు నైన నిచ్చి, నీవిపుడు
వానిప్రాయముగొను ; వలనొప్ప వెనుక
పూని రాజ్యభరంబు పూనునువాఁడె".
అననియ్యకొని, నృపుఁ డతనివీడ్కొనుచుఁ
దనపురికేతెంచి తరుణియుఁ దానుఁ,
గొడుకులనేవురఁగూర్చి యిట్లనియె:
యయాతి యదుప్రభృతుల శపించుట
"వెడగైన ముదిమిచే విహరింపఁజాల;
నుడుగదు భోగేచ్ఛ యొగి నింక నాకు ;
నడుకక మీలోన నలి నెవ్వఁడైన
జవ్వనంబిచ్చి నాజరగొనుం ". డనిన
నవ్వి, యిట్లనిరందు నలుగురు సుతులు :
"విభువర, నీకేమివెఱ్ఱిపట్టినదొ!
విభవులై చరియించు విభుకుమారకులు
చిన్నిప్రాయంబిచ్చి, చెడ్డయీముదిమి
క్రన్ననఁదాల్తురే కడఁకనెందైనఁ !
గొంచక యెటువంటి కూళ[108]మానిసియుఁ
బంచదారకుఁ దౌడు ప్రతి[109]విల్చుకొనునె!
అని విడనాడిన, నారాజు కినిసి
తనయుల నలువురఁ దప్పకపలికె:
"పుత్త్రులా మీరలు! భువి మత్తులార !
శత్రులుగాక ; యేజనకుఁడ మిమ్ముఁ
బనిచినఁ, జేయంగ భావ్యంబుగాదె!
తనరఁ దండ్రికిఁగానితనయులేమిటికి !
నాచార [110]వినతులై యతినింద్యులగుచు
భూచక్రమున మ్లేచ్ఛభూమిపాలింపుఁ ; "
డనుచు యయాతి దృహ్వ్యానుతుర్వసుల
కొనరంగ యదునకు నొసగెశాపంబు.
అప్పుడాపూరుండు నాతండ్రికెఱగి,
తప్పక కేల్మోడ్చి తగ నిట్లుపలికె:
'పూనెద నీజర భూనాథ, నాకు
జానొప్ప నిమ్ము నాజవ్వనఁబంది. '
అనవుడు రాజన్యుఁ డతనిహర్షించి,
తనజరాభార మాతనయునకిచ్చి,
వానియౌవనలక్ష్మి వలనొప్పఁదాల్చి,
మానుగా రాజ్యంబు మహిమదీపింపఁ
బెక్కుకాలంబులు పెక్కురీతులను
దక్కక [111]పాలించి ధర్మమార్గమునఁ,
దనయనుభవవాంఛఁ దనిసి మానుటయుఁ,
దనయునిప్రాయంబు తనయునకిచ్చి,
తనవార్ధకంబంది, తన్నాదరించి,
యనువొప్పమన్నించి, యాప్తమంత్రులను
విప్రుల రావించి విత్తంబులొసగి,
సుప్రశస్తంబైన శుభముహూర్తమునఁ
నొనరంగఁ బూరుని యుక్తమార్గమునఁ
దనరఁ బట్టముగట్టి, ధరణీవిభుండు
రాజధర్మంబులు రాజనీతులును
రాజైనసుతునకు [112]రాజిల్లఁజెప్పి,
మునివృత్తిగైకొని, మునులును దాను
వనముల కేఁగి, యవ్వనములలోన
బహువత్సరంబులు బహువిధంబునను
బహుతపంబులుచేసి, పార్థివోత్తముఁడు
స్వర్గలోకముచేరి, శంభులోకమును
దుర్గమంబైనట్టి ద్రుహిణలోకంబు
మొదలుగాఁగల లోకములయందుఁ బ్రీతి
వదలక కొన్నాళ్లు వసియించి, తిరిగి
సాంద్రవైభవములు చాలఁగైకొనుచు
నింద్రలోకంబునకిరవొందవచ్చె.
వచ్చినఁజూచి యవ్వాసవుండలరి
యచ్చుగాఁబూజించి యాసీనుఁజేసి,
పలికెఁ బార్థివుఁజూచి పరమమోదమున :
యయాతి స్వర్లోకభ్రష్టుఁడగుట
"కలితాత్మ, నీవంటి ఘనపుణ్యచరితు,
మానైన బహువిధమఖ సోమయాజిఁ
గానమెచ్చోటను; గాంతివిశాల,
ఈవుచేసినతపం బేలాటితపము !
భావించిచెప్పు తప్పక నాకు. " ననినఁ
దనలోన నెంతయుఁ దలఁచి, యయాతి
వినతుఁడై హరిఁజూచి వేడ్కనిట్లనియె:
"ఎట్టిదేవతులును, నెట్టిదానవులు,
నెట్టిమునీంద్రులు, నెట్టిరాజులును
జేయంగలేరు నేఁజేసినతపము;
నాయజుండెఱుఁగును నన్యులెఱుఁగుదురె!”
అనినఁ, గోపంబెత్తి యమరనాయకుఁడు
మనుజేశునిట్లను : " మదియించి, నీవు
పెద్దలతపమెల్ల బీరుచేసితివి ;
తద్దయు ధర్మంబుఁదప్పితి; గానిఁ,
బోయి యధోలోకముననుండు. " మనిన,
నాయయాతి తలంకి యతనికిట్లనియె:
"అనఘాత్మ, చేసినయపరాధ [113]మునను
ననుగట్టఁ దెచ్చితి నలి నేనె త్రాళ్లు ;
భూలోకమున కేను బోవంగనోప;
నోలి సత్పథమందు నుండెద నిపుడు."
అనుచుఁ బ్రార్థనచేసి యంజలిసేయఁ,
గనికరంబున వజ్రి గైకొని యనిచె.
ననిచిన, నారాజు నాకాశవీథి
కొనరంగనే తెంచి యుండుచో; నంత,
నతనిదౌహిత్రకు లాయష్టకాదు
లతులితతేజస్కు లందుండివచ్చి,
యారాజుఁబొడగాంచి యంజలిచేసి
ధీరతఁబలికిరి: "దేన, నీవిప్పు
డెందుండివచ్చితి ? వెవ్వరవయ్య !
యెందుల కే తెంచి ? తెఱిఁగింపుమాకు. "
అనవుడు రాజన్యుఁ డష్టకాదులకుఁ
దనతెఱంగంతయుఁ దప్పకచెప్పె.
చెప్పిన విని, వారు చెలఁగి హర్షమున
నుప్పొంగి, దండంబు లోలిఁ గావించి :
'యెనయంగ మీకు దౌహిత్రులమేము
మనుజేశ, చెప్పవే మాకుధర్మముల !'
ననుడు యయాతి యయ్యష్టకాదులకు
ఘనతరమహిమలు గలుగంగఁజెప్పి,
ధర్మంబులన్నియుఁ దగ నేర్పరించి,
కర్మంబులన్నియుఁ గడముట్టఁ దెలిపి,
కొంతకాలము వారిఁగూడి యచ్చోట
సంతసంబుననుండి, జగదీశుఁ డంత
మనుమలుఁ దానును మఱియును వేడ్క
పొనరంగఁ బ్రాపించెఁ బుణ్యలోకములు.
ఇట పూరుఁడును శాస్త్రహితమార్గమునను
బటుబుద్ధిఁ గ్రతువులు బహుభంగిఁజేసి,
నడవడి రాజ్యాధినాథులౌనట్టి
కొడుకుల నెక్కుడు కొమరొప్పఁబడసి,
థర్మమార్గమ్మున ధరణియంతయును
ధర్మాత్ముఁడై యేలి ధన్యుఁడై యుండె.
ఈయయాతిచరిత్ర మెవ్వరువిన్నఁ,
బాయుఁబాపంబులు; ప్రబలుఁబుణ్యములు ;
అతఁడువోయిన వెన్క నవనినాయకులు
చతురతఁ బెక్కండ్రు చని. " రనివేడ్క,
జనమేజయునకు వైశంపాయనుండు
మును చెప్పెనని చెప్ప మోదించి వార :
'లనఘాత్మ. తరువాతనైనవృత్తాంత
మనువొప్పఁజెప్పవే! ' యనియడుగుటయు,
[114]గౌరీశ పూజాధిక మతానుచార,
చారణ (సంస్తుత) చరితానుసార,
సారస్వతామృత సాధనధీర,
ధీరాంగరంజితాదిమశుభాకార,
కారాగృహాగత ఘనశత్రుశూర, (?)
శూరతాలంకార, సుజనమందార,
భారతాధిప, నీకుబహుళార్థసిద్ధి.
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్ర
మతిమద్విధేయ తిమ్మననామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యాశ్వాస మొప్పె రెండవది.
- ↑ తేజసంయోగప్రయోగ
- ↑ పక్షానిలా
- ↑ జూచి తల్లి
- ↑ కలితుండై (మూ )
- ↑ బక్షములు (మూ)
- ↑ నవతమై (మూ )
- ↑ కుచ్చంబు (మూ)
- ↑ పిచ్చగుంటయై పుట్టి (మూ),
- ↑ చిక్కున
- ↑ వేషము
- ↑ మహాభవక్త్రం బటు (మూ)
- ↑ 'వ్యయమ'ని సవరింప వీలున్నను, తిక్కనప్రయోగము 'వ్రయమ'ని యుండుటచే నట్లే యుంచఁబడినది. చూ. తిక్కన, శాంతి ప. 4 ఆ. 345 ప.
- ↑ 'యాయావర' మను సంస్కృతపదమున కియ్యది వ్యావహారికరూపమై యుండును.
- ↑ మాతా (మూ)
- ↑ విశ్వాస (మూ )
- ↑ దపములు (మూ)
- ↑ ప్రసవ (మూ )
- ↑ ధామమై వేగ (మూ)
- ↑ ప్రణవానుకార (మూ )
- ↑ "అచటిభూతములెల్ల గరుడనిఱెక్కలబలిమి కచ్చెరువడి, యాతని 'సుపర్ణుఁ'డని
పిలిచిరి" అను విషయము లుప్తమైయుండును. - ↑ 1. దాసీత్వ-చయ్యనఁ బాపిన సర్పముల్ దీని (మూ)
- ↑ దొసుగు లుడిగి
- ↑ అనఘములు పన్నగులాయంబు కేగి
- ↑ పోడిగా జిహ్వలు పోలిగా ద్రెవ్వి. (మూ)
- ↑ అద్వశ్యులనఁగ.
- ↑ కోకిల
- ↑ కాయత (మూ)
- ↑ ధూమ్రమ్ము (మూ)
- ↑ ఈద్విపద అనన్వితముగా నున్నది. ఇట్లు సవరించినఁ గొంతసరిపడునేమొ!
“తోళ్లు నమలిన జిత్తులనక్క లుండ
నూళ్లఁ గుక్కల మోఁదు టొనఁగూడె మాకు." - ↑ పోనెనానా
- ↑ నోడకు మనుచుఁ గోర నేటికి (మూ)
- ↑ నాయ (మూ)
- ↑ దప్ప (మూ)
- ↑ ఈపాముల పేర్లపట్టిక, తుదిమొదలు లేక చీకాకుగా నుండుటచేఁ, గొంతవఱకు నక్షరములపోల్కినిబట్టి కవిత్రయభారతానుసారముగా సవరింపఁబడెను.
- ↑ గనలి (మూ)
- ↑ పాతకుల (మూ)
- ↑ విదుడవునీవు (మూ )
- ↑ నిదిగన్ననిర్వేద
- ↑ దేవలుండు
- ↑ వర్తులును (మూ)
- ↑ మాలు నాపనికి (మూ)
- ↑ కాంతిగా
- ↑ చిర్వవోదు
- ↑ చిలువదైవ మెరుంగు చిరుమేనుపొలను(మూ)
- ↑ అందునగాధమత్స్యంబు
- ↑ మింత
- ↑ ప్రౌఢులకైన (మూ)
- ↑ యెతిరితి
- ↑ మచ్చట
- ↑ వొయ్యన
- ↑ హేమాద్రి.
- ↑ కుంతలిని
- ↑ విభగించి తిగిచి.
- ↑ వర్ణుండిచ్చు. (మూ)
- ↑ పెరిగిన.
- ↑ తాకుచు.
- ↑ దడసి. (మూ)
- ↑ మెరిగి.
- ↑ పెదరమి.
- ↑ నరులు మోవమిని.
- ↑ నెంచి. (మూ)
- ↑ కిల.
- ↑ యోనుల నేరులఁ. (మూ)
- ↑ సహస్రనామకుఁడగు విష్ణునవతారములలో రామత్రయ సామర్థ్యము గలిగి కృష్ణుఁడు జన్మించెనని కవితాత్పర్యమేమో!
- ↑ హరిలోకమున.
- ↑ గూఢగా. (మూ)
- ↑ ఘనుడై ననఘుడై గంధర్వయంశ.
- ↑ మయయను.
- ↑ దైత్యునంశ.
- ↑ మనుదేశమునను. (మూ)
- ↑ సహృదయు అశ్వినులంశమున. (మూ)
- ↑ అవమాన్యత. (మూ)
- ↑ భ్రాంతితో. (మూ)
- ↑ అమరనిమంత్రంబు లందింతుమనుచు. (మూ)
- ↑ విందమర. (మూ)
- ↑ ప్రచితంపు. (మూ)
- ↑ మిసిమిగా.
- ↑ బుద్ధి.
- ↑ పరగని మధుపానపాతకుండనుచు. (మూ)
- ↑ నీ తెఱంగుననీటనెఱివ్రాయుపగిది.
- ↑ తామెనేర్చెదరు. (మూ)
- ↑ యెట్టైననేమైనయేవి.
- ↑ పటురిమ (మూ)
- ↑ ఈబాములనునుండ. (మూ)
- ↑ వట్టుట.
- ↑ గంహరి.
- ↑ యవ్వనవసంతంబు. (మూ)
- ↑ కడుగుందుపెట్టి.
- ↑ చెమసి.
- ↑ బాణాల. (మూ)
- ↑ బోవు.
- ↑ కొరున్‌వలేళ్ల. (మూ)
- ↑ జవ్వనియగుచు.
- ↑ తెలినినెన్నడుము.
- ↑ వల్లకి
- ↑ నారు.
- ↑ బసని.
- ↑ గెలిచి. (మూ)
- ↑ కేళి.
- ↑ లిద్దఱు.
- ↑ కామ్యకచిత్తుడగుచు. (మూ)
- ↑ నిలిచె నానృపతిలకాపుత్రిక ట్టెదుర.
- ↑ నీ వెల్లయెడల.
- ↑ మెఱయ. (మూ)
- ↑ వేడ్కయై. (మూ)
- ↑ చెప్పుచును-నక్రంబుగా. (మూ)
- ↑ యొనరినరత్నంబుటొపరిగలిగి - నెపురైనబహుపుష్పనిర్మితశయ్య. (మూ)
- ↑ మానసలు.
- ↑ బిల్చు.
- ↑ నియతులై.
- ↑ కావించి.
- ↑ రాజెల్ల. (మూ)
- ↑ మేను. (మూ)
- ↑ గౌరీపూజాభికమతాభిచార. (మూ)