ద్విపద భారతము/విరాటపర్వము
శ్రీరస్తు.
ద్విపద భారతము.
విరాట పర్వము.
_______
తిమ్మకవి ప్రణీతము.
పనప్పాకము. శ్రీనివాసాచార్యులచేఁ
బరిష్కృతముం బ్రకటితము
_____
చెన్నపురి :
శ్రీ "వైజయంతీ" ముద్రాశాలన్
ముద్రితము.
౧౯౧౧.
copy right Registered]
[వెల ౧౨ అణాలు.
Editor's note.
_____
While preparing the M. S. S. of this book for the Press I have had to remove some lines and to alter others. My reasons for taking this liberty were two-fold. First, as this book is mainly intended to be read by ladies, I considered it necessary to remove such descriptions and speeches as, in my opinion, were unsuited to be placed in their hands. Secondly, as the M. S. I was able to procure was very incomplete, being worm-eaten and ill-written. I have had to introduce new lines and alter others in order to preserve the continuity of the story and to remove errors in prosody and diction. In many places, I introduced lines of my own composition where the M. S. was found to be at variance with Tikkana's original.
I have on hand a few more Parvas ready for the Press, which I shall publish one after another in size and type uniform with this book. In my opinion this book can well be set down as a text-book for the students of the High School and Lower Secondary classes. The Dwipada style of cmoposi-tion is a compromise between the monotonous vachanam and the highly conventional Padya-Prabandham, and as such will very well meet the needs of the Telugu student population.
I am sorry I am not now in a position to give the reader any information regarding the author or the magnate in whose name the book is inscribed. In the subsequent volumes I hope to be able to place before them the results of my inquiries in this direction. For the present, I can with confidence say that the author belongs to a past decade and deserves a high place among Classic poets and should find a place in the library of every true lover of Telugu Literature.
P. SREENIVASA CHARLU.
భూమిక.
శ్రీమహాభారతకథ నెఱుంగనివారు హిందువులయం దుండుట యరుదు. అది సర్వనీతిబోధకంబును, సనాతనధర్మనిరూపకంబును, వర్ణాశ్రమాచారవిజ్ఞానప్రదాయకంబును నగుటంజేసి మనపురాతనగ్రంథంబుల నెల్ల నుత్తమం బగుట య ట్లుండ మనోహరకథారత్నంబులకు గని యౌటంజేసి మనవారి కెల్లరకుం బఠనయోగ్యంబగుచున్నది. దుర్యోధనాదులమాయలకు నెల్ల లోఁబడి పాండవులు సిరులం బాసి యరణ్యంబులఁ బండ్రెండేడ్లు వాసము చేసి పదుమూఁడవ యేఁ డజ్ఞాతవాసం బొనర్ప విరాటరాజ్యంబుఁ జేరిరి. అందు వా రొందినరాయిడుల వర్ణించు పర్వము విరాటపర్వము నాఁ బరఁగు.
విరాటపర్వమును సాంతముగఁ జదివినఁ బుత్త్రపౌత్త్రాభివృద్ధియును, గోధనసమృద్ధియుఁ, గామితార్థసిద్ధియుఁ గలుగునని పెద్ద లండ్రు. వాన లేనికాలమునం జదివిన వర్షంబు గురియు ననియు సస్యంబులు పూర్ణఫలం బిచ్చు ననియుం బ్రతీతి గలదు. ఏది యెట్లున్న నీపర్వమును సావధానంబుగఁ బఠించువారు నీతిసంపన్ను లగుదు రసుట నిస్సంశయంబు.
ఈగ్రంథమును ముద్రణమునకై సంస్కరించు నెడఁ గొన్నిపాదములను మార్చియు ననేకము లగుక్రొత్తపాదములను జేర్చియు సమగ్ర మొనర్చి ముంద్రింపించి యున్నాఁడ.
ఇంకను గొన్నిపర్వములు ముద్రణమున నున్నవి. అవియు శీఘ్రకాలమున వెలువడఁ గలవు. నాశక్తికొలఁది నాంధ్రశారదాదేవికి నే నొర్చు సేవలం బాఠకు లనుగ్రహించెదరు గాక యని ప్రార్థించు.
పనప్పాకము. శ్రీనివాసాచార్యులు.
పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/9 పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/10 పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/11 పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/12 పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/13 పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/14 పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/15 పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/16
శ్రీ రస్తు
ద్విపద భారతము
విరాటపర్వము
శ్రీరమ్యగుణవార, శ్రితజనాధార,
కారుణ్యఫూర, జంగలముమ్మధీర.
చండ తేజుఁడు మున్ను జనమేజయుండు
పాండవకథ లెల్లఁ బరిపాటి వినుచుఁ
జనవున ననియె వైశంపాయనునకుఁ
"జనుదెంచి పండ్రెండుసంవత్సరములు
వనితతో నుత్తలపాటులం బడలి
వనవాసమున నుండి వరుసఁ బాండవులు
ప్రజ లెఱుంగక యుండఁ బయివత్సరమున
విజయు లై యెచ్చోట విహరించి రొక్కొ ?
పరఁగంగ నాలవపర్వంబుకథయు
నిర వొప్ప నాకు నీ వెఱిఁగింపు" మనిన
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపింపఁ దొడఁగెఁ దద్వృత్తాంత మెల్ల :
ఆరీతిఁ బాండపు లతివతో గూడి
ఘోరాటవులలోనఁ గుశలు లై తిరిగి,
బహుమునీంద్రుల చేత బహుపురాణములు
బహుతీర్థములఁ గ్రుంకి పరిపాటి వినుచు,
నెలమిఁ బండ్రెండవయేఁడు నిండుటయు
వల నొప్ప యమునిచే వాంఛితంబుగను
వరముఁ గైకొని, వేడ్క వసుధపైఁ దమ్ము
నొరు లెఱుంగక యుండ నొకయేఁడు గడప
నారాధనము చేసి యముని వీడ్కొల్పి,
తా రొక్కచో డాఁగఁ దలపోసి యపుడు
విమలమనస్కు లౌవిప్రపుంగవులు
తమవెంట నగ్ని హోత్రములతో రాఁగ
నామహాపుణ్యుల కపు డిట్టు లనిరి:
“ఓమహాత్మకులార, యోపుణ్యులార,
ఓమహీసురులార, యుగ్రాటవులకు
మామీఁదఁ గృప గల్గి మముఁ గూడి వచ్చి
యలవి సేయఁగ రానియలజళ్ల కోర్చి
కలసి యుండితి రింత కాలంబుదనుక ;
నింక గోప్యము గాఁగ నేఁడాది మాకు
శంకింప కొక చోట జరపంగ వలయు.
రాయిడి పుట్టించి రారాజు మరల
కీయవస్థలు దెచ్చు టెఱుఁగరే మీరు ?
వాఁ డింక నజ్ఞతవాసంబువలన
బోఁడిగా మము రోయఁ బుత్తెంచు జనుల;
మీరు మే మొకచోట మెలఁగంగ రాదు
మీ రింక మముఁ బాసి మీత్రోవఁ. జనుఁడు.
ఏకాలమును మిమ్ము నెడసి పోనీక
చేకూరఁ బరిచర్య సేయ లే దయ్యె.
ఎడపక ధాత్రిలో నెట్టివారలును
బడనియాపద మాకుఁ బ్రాప్త మై వచ్చె
నెన్నఁడొకో మాకు నింక మీలోనఁ
బన్ను గా విహరించు భాగ్యంబు గలుగు!
నని దైన్యపాటుతో సందఱఁ బల్క-
జననాయకునిఁ జూచి సకలబ్రాహ్మణులు
"మీ కేల శోకింప? మీరు సాహసులు;
చేకొని రాజ్యంబు సేయ నున్నారు.
ఆపద పడువార, లకట మీ రేల,
ఏపార వేల్పులు నెందఱేఁ గలరు.
పాయక నిషధాద్రిఁ బ్రచ్ఛన్న వృత్తి
వేయికన్నులవేల్పు విహారించె మున్ను .
పురుషులలోపలఁ బొడ వైనహరియు
మరువున నొకచోట మరుగుజ్జు గాఁడె?
దుర్వహుం డై తల్లితొడఁ జొచ్చి మున్ను
నౌర్వునంతటివాని కలయంగ వలసె.
అదియు నేటికి ? సూర్యుఁ డాదికాలమున
మొదవుగర్భముఁ జొచ్చి ముమ్మాఱు డాఁగె.
వీ రెల్ల, నటమీఁద వెలయ శాత్రవుల
శూరు లై మర్థించి సుఖ మున్నవారు. .
ఆరీతి మీర లాయాసంబు లోర్చి
వైరులఁ బరిమార్చి వసుధ నేలెదరు.
అని మహీ దేవత లా పాండవులకు
మనసులో నున్న యుమ్మలికంబుఁ బాపి
"క్రమ్మఱ సంపద ల్గలుగు మీ" కనుచు
నెమ్మితో నేగిరి నిజపురంబులకు.
అప్పు డన్నర నాథు లఖిల సేవకులఁ
దప్పక పిలిపించి తగఁ గుస్తరించి
దొరల సామంతుల దుర్గాధిపతుల
వెర వొప్ప నందఱ వేర్వేఱ ననిచి
హరిణాక్షియును దాము నరదంబు లెక్కి
ధరణి నుత్తముఁ డైన ధౌమ్యుఁ దోడ్కొనుచుఁ
గొంతదూరం బేగి కువలయాధిపులు
వింతగా నొకచోట విడిపి నాఁ డుండి
మఱునాఁడు రేపాడి మజ్జనం బాడి
మఱవక సాంధ్యసమాధులు దీర్చి
సుఖ మున్న చోట నర్జునుఁ జూచి విభుఁడు
నిఖిలంబుఁ దలపోసి నెమ్మి ని ట్లనియె:
"ఈయిందువదనతో నెలమి నార్వురము
నీయందమున నున్న నెఱుఁగరే మనల?
పొడచూపఁగా రాదు భువిలోన మనకు.
బడలక యియ్యేడు వర్తించు టరుదు ;
ఎఱిఁగింపు దీనికి నేది కార్యంబు ?
ఎఱుఁగఁ దీఱదు నాకు హృదయంబులోన "
అనవుడు విభుఁ జూచి యాసవ్యసాచి
ఘనభక్తి దీపింపఁగా విన్నవించె:
"రాజేంద్ర , యమధర్మ రాజు నీ కిపుడు
తేజంబుతో నిచ్చె ధృతి నొక్క వరము ;
ఆవరంబునఁ జేసి యనఘాత్మ మనము
ఏవిధంబున నున్న నిఁక నేల వెఱవ !
మనమునఁ బ్రీతియౌ మగధపాంచాల
ఘనమత్స్యకాంభోజకటకంబులందు
ఏయొచ్చెమును లేకయే పట్టణములఁ
బాయక ధర్మంబు ప్రబల మై యుండు.
హరులును బసులు ధా న్యము నేయి నీరు
కరులును దోఁటలుఁ గలుగు నెప్పుడును.
కౌరవాధిపుఁ డేలుగజపురంబునకుఁ
జేరువ యని మీరు చింతింప నేల?
ఈపట్టణములలో నెం దైన మనము
భూపాల యుండుట బుద్ధికార్యంబు."
అనవుడు మనుజేంద్రుఁ డమరేంద్రసుతునిఁ
గనుఁగొని తనకోర్కి కానరాఁ బలికె:
" నాకుఁ జూడఁగ మత్స్య నగరంబు మేలు ;
ప్రాకట బహుభోగభాగ్యసంపదలు
వినయభూషణుఁ డైనవిరటుఁ డున్నాఁడు;
మనుజులతారతమ్యము లాతఁ డెఱుఁగు ;
ప్రణుతి కెక్కిన భూమిపతులలోఁ గొంత
గుణవంతుఁ డగువానిఁ గొల్చి యుండుదము.
ఉండుచో నేరూప ముచితంబొ మనకు
నొం డొండ వివరింపు డొనఁగూడి మీరు,
వెలయ నా కిప్పుడు వివరించి చూడఁ
బలుమాఱు మన కైన భ్రమ పుట్ట వలయు "
అనవుడు విభుఁ జూచి యమరేంద్రసుతుఁడు
మనసులోపల శోకమగ్నుఁ డై పలికె:
"అక్కట ధరణి నీయంతరాజునకు
నొక్క భూపతిఁ గొల్చి యుండంగ వలసె !
కపటం బెఱుంగవు కల నైన నెపుడు,
కృపయు నీతియు వేఱె కీర్తింప నేల ?
మన్నింప నేర్తువు మంచివారలను ;
సన్నుతించుట గాదు సహజంబ నీకు.
ద్రౌపదిఁ బట్టి శా త్రవు లీడ్చునపుడు
కోపింప నేరని గురుశాంతనిధివి;
ఇట్టిపుణ్యుఁడ వింక నేరూపుఁ దాల్చి
నెట్టన రిపులతో నిర్వహించెదవు ? "
అనవుడు నామాట లాలించి వినక
మనసున ధీరుఁ డై మనుజేంద్రుఁ డనియె:
"సన్యాసివేషంబు సమకూర్చికొనుచు
మాన్యుఁడ నై యుందు మత్స్యేశుకడను;
పలుకుదు మృదువుగా బహుపురాణములు;
పొలుపుగా నతనికి బుద్ధి చెప్పుదును ;
జూదంబు తల పెట్టి చూపి యాతనికి
మోదంబు పుట్టింతు; మున్ను నాచేత
భాసిల్లి నవరత్న పఙ్తిఁ గీలించి
చేసినపసిఁడిపాచికలు చూపుదును;
ఎచ్చోట విహరింతు రేది మీనామ
మచ్చుగా నెఱిఁగింపుఁ డని పల్కెనేని,
కంకుండు నా పేరు కౌంతేయునొద్దఁ
గొంకక వర్తింతుఁ గూర్మితో నందు.
మఱియు భూపాలుని మనసు లెఱింగి
నెఱువాది నై యుందు నేర్పు దీపింప "
అని చెప్పి నర నాథు డనిలనందనునిఁ
గనుఁగొని ధైర్యంబు కలఁగ నిట్లనియె;
« ఓభీమసేన, నీ వుగ్రసాహసుఁడ,
వేభంగి విహరించె దీమత్స్యపురిని ?
బకునిఁ గిమ్మీరునిఁ బట్టి సాధించి
ప్రకటకీర్తులఁ గన్న బహుసత్త్వనిధివి !
సౌగంధికములకై శంక లే కరిగి
బా గొప్ప యక్షుల బాఱ డోలితివి.
ఆహిడింబునిఁ జంపి తఖిలంబు నెఱుఁగ.
ఊహింప నీపాటి యున్నారె మగలు?
బిరుదుమాటలె కాని ప్రియ మాడ నేర,
వొరులచిత్తముఁ బట్ట నోపుదే నీవు ? "
అనవుడు విని భీముఁ డాధర్మజునకుఁ
దనవర్తనము లెల్లఁ దగఁ జెప్పఁ దొడఁగె:
"వంటలవాఁడ నై వసుధేశునగర
వంటలు రుచులుగా వండి పెట్టుదును.
ఎట్టివృక్షము నైన నిరుగేల విఱుతు,
కట్టకై వెదకను గత్తికై వెదక.
వెలయ వండెడువాఁడు వే ఱొక్కఁ డున్నఁ
జెలు వొప్ప వానితోఁ జెలిమి చేసెదను.
మఱియు భూపతివద్దిమల్లవర్గముల
విఱిచి యొడ్డుదు బాహువీర్యంబు మెఱసి.
హరితోడఁ బులితోడ హస్తీంద్రుతోడ
ధరణీశుండును దెచ్చి తలపెట్టెనేని
పట్టి చల్లార్పఁగ బలిమి నుక్కణఁగఁ
బట్టుదు వాని నేఁ బ్రాణంబుఁ గాచి.
వలలుండ నని చెప్పి వసుమతీ నాథు
తలఁపులోపల వత్తుఁ దమకంబుతోడ.
జనపతి నన్ను నే చ్చటివాఁడ పనిన
వినుతిఁ బాండవులతో విహరింతు నందు.
ఇది వర్తనంబుగా నే నుండుచోటు
పెదకి కానఁగ లేరు విపుల శాత్రవులు"
అనపుడు నది పోలు నని ధర్మరాజు
ఒనర నర్జునుఁ జూచి యుత్తలంబునను
" అర్జున, నీదులా వరిది చెప్పంగ
నిర్ణరాధిపుఁ డైన నిను గెల్వ లేఁడు.
కాలకేయులఁ జంపి ఖాండవం బేర్చి
శూలి నెక్కటి గెల్వ శూరు లున్నారె!
ఇంతవాఁడవు నీవ దెట్లొకో యింక
వింతలాగున బోయి విరటుఁ గొల్చెదవు ?”
అనిన ధర్మజుతోడ సమరేంద్రసుతుఁడు
తనకుఁ బొం దగురీతిఁ దాఁ జెప్పఁ దొడఁగె 7:
« అమరంగ నేను గా ర్యార్థినై తొల్లి
అమరావతికిఁ బోవ నం దొక్క నాఁడు
నలినాక్షి యుర్వశి నన్నుఁ గామించి
పిలిచినఁ బో నైతిఁ బ్రియముఁ గైకొనక;
అప్పుడు కోపించి హరిమధ్య నన్ను
దప్పక పేఁడి వై తగ నుండు మనుచు
శాపించి పోయిన జననాథ వినుము
నాపాలఁ గృప గల్గి నా కేశుఁ డెఱిఁగి
యేపాట నీకును నీ పేఁడితనము
ప్రాపించి యొకయేఁడు పఱిచి పోఁ గలదు.
ఆయేఁడు మీ కింక నజ్ఞాతవాస
మై యుండువేళకు నర్థిలో వచ్చుఁ,
బొ మ్మన్న వచ్చితి ; భూపాల నాకు
నిమ్ముగా ని ట్లుండ నిది వేళ యయ్యె
ధర బృహన్నలపేరు ధరియించి మించి
వెర వొప్పఁ బేఁడి నై విహరించువాఁడ.
ఏయునప్పుడు నాకి యిరుగేలఁ దాఁకి
కాయ కాచినపట్లు కానరా కుండ
సంకులు దాల్చి యాజాను బాహువుల
నంకించి ఱవిక చే నందంబు మాన్చి
ధృతి నాటయొజ్జ నై తెల్లంబు గాఁగ
నతనికన్నియలకు నాట నేర్పుదును.
జనపతి నన్ను నెచ్చటివాఁడ వనిన
విను కృష్ణయింటను విహరింతు నందు "
అనవుడు నది యొప్పు నని ధర్మరాజు
ననిచినవగ దోఁప నకులు నీక్షించి
"వీనిసౌందర్యంబు విశ్వమోహనము,
వీనిచారిత్రంబు విశ్వసంస్తుతము,
వినుతింపఁగా రాదు వినయసంపదలు.
వినుతింపఁగా రాదు వీర్యాతిశయము.
రసికుండు నయశాలి రాజపూజితుఁడు
వసుధలో భారతవంశవర్ధనుఁడు ;
సకలవిద్యలయందు సార్వభౌముండు ;
ప్రకటింప వీఁ డెట్లు పరుల సేవించు?"
నన విని నకులుండు నవనీశుతోడఁ
దనకుఁ దోఁచినరీతిఁ దగ నిట్టు లనియె:
"ధరణీశ, నాకు నై తలఁకంగ నేల
వెర వొప్ప నొకయేఁడు విహరించు టెంత
సాహిణి నై మత్స్య జనపాలునొద్ద
నూహించి దిద్దుదు నుత్తమాశ్వముల,
కుఱచకళ్లెంబులఁ గొదమగుఱ్ఱముల
నొఱపుగా మరిగించి, యోర్పు వాటిల్ల
బిరుదువారువముల బీరువోఁ దఱిమి
వరుస నోజకుఁ దెచ్చి పఱపింప నేర్తు.
ఒనర గోడిగజాతి నుత్తమం బెఱిఁగి
యను వైనమాపుతో హత్తింప నేర్తు.
తేజీలత్రాణల తెఱఁ గెల్ల నెఱిఁగి
నైజంబు చెడకుండ నడపింప నేర్తు.
మఱియు లాయములోని మాపటీలకును
మఱవక మేటి నై మనుజేంద్రుఁ గొలుతు.
అపుడు దామగ్రంధి యనుపేరు చెప్పి
రిపుల కగ్గల మైనరీతి నుండెదను.
అరసి నా చోటు రా జడిగెనేనియును
వరుసఁ బాండవులతో వర్తింతు నందు"
అనవుడుఁ గౌంతేయుఁ డటు సమ్మతించి
"వెనుకొని సహదేవు వీక్షించి పలికెః
"మవను కుందెడి వీనిమార్గంబుఁ జూడఁ;
బెనఁగొన్నవగల కొ ప్పెడువాఁడు గాఁడు.
తద్ధయు మన్నించి తగఁ గుంతిదేవి
ముద్దు సేయఁగ నుండు ముద మార నెపుడు.
కుటిలంబు లెఱుఁగడు, గుణగణాధికుఁడు,
పటుబాహుబలమునఁ బ్రౌఢుఁ డెంతయును.
తను వెంతయును లేఁత; దైవంబుకతనఁ
జెనసి రాజుల నెట్లు సేవింప నేర్చు?:
అనవుడు సహదేవుఁ డన్న నీక్షించి
తనకుఁ దోఁచీనరీతిఁ దాఁ జెప్పఁ దొడఁగెః
"కీలారితనము నేఁ గ్రీడతోఁ దాల్చి
యాలకుఁ గర్త నై యవనీశునొద్ద
నందంబుగా నుందు; నందు నొక్కింతఁ
బొందుగా నెఱుఁగుదు, భూనాథ, వినుముః
ఎచ్చోటనుండి నీ వేతెంచి తనినఁ
గ్రచ్చరఁ బాంచాలి కడనుండి యందు."
అనవుడు శంకించి యమతనూభవుఁడు
వనితఁ దప్పక చూచి వల నొప్పఁ బలికెః
"వనజాక్షి నీ విట్లు వర్తించునపుడు
జననాథునగర దుర్జను లుండి రేని
విపుల భారతవంశ విభులకు మాకు
నపకీర్తి రాకుండ నడఁకువ నుండు.
నీకంటె నెఱిఁగెడినెలఁత లున్నారె ?
చేకొని యెకమాటఁ జెప్పి చూపితిని."
అనుటయు నమ్మాట లాలించి యతివ
వినుతహాసము దోఁప విభున కిట్లనియెః
వర్తింతు నెట్లైన వసుధేశ యేను
"వర్తించుపనికి నై వగవంగ నేల?"
అనిన సంతోషించి యా ధర్మరాజు
మునుకొన్న వేడ్కఁ ద మ్ముల నెల్లఁ జూచి,
"ఇట్లున్న మనలను నింక శాత్రవులు
ఎట్లు కాంచెదరు తా రియ్యేటిలోన?
వేయుమాటలు నేల, వేడ్క నిందఱముఁ
బోయి కొల్తము మత్స్య భూమిపాలకుని.
అమరంగ మన వైనయగ్ని హోత్రములు
రమణమై ధౌమ్యులు రక్షింపఁ గలరు.
ఈరథంబులు గొంచు నెలమి సారధులు
ద్వారకానగరి కిం దఱు బోవువారు
పరగ ద్రౌపదియొద్దిపరిచారికలును
దొరసి వండెడువారు ద్రుపదుఁ జేరుదురు.”
అని బుద్ధిగాఁ జెప్పి యఖిల సేవకుల
ననిచి భూతలనాథుఁ డనుజులుఁ దాను
నొప్పుగా నరుగుచో నొనర ధౌమ్యుండు
చేస్పి ని ట్లని రాజు సేవించు తెఱఁగు :
ధౌమ్యుఁడు పాండవులకు సేవాధర్మంబు లెఱింగించుట.
"పాండునందనులార, బలియు రౌమీరు
ఒండొక్క విభుఁ గొల్చి యుండు టచ్చెరువు!
మద మేఁది మానాపమానంబులకును
మది నోర్చి కాని నెమ్మదిఁ గొల్వ రాదు,
ఓర్వక యొక రొక రుగ్రింతు రేని
గీర్వాణపతి నైన గెల్వఁ జాలుదురు.
కావున మీకు నేఁ గడఁగి భూపతుల
సేవించుగతిఁ గొంత చెప్పెద వినుఁడు.
ఎఱుఁగువారికి నైన నిటుపెద్దవార
మెఱిఁగించుభంగిపై నిష్టంబు కలదు.
మనుజేంద్రుఁ గొల్చునమ్మనుజుండు దెలిసి
తనకుఁ బోలినచోటఁ దా నుండ వలయు.
విభునిముందరఁ బోక, వెనుకకు రాక,
సభలోన నిల్వఁ బార్శ్వంబుల నొప్ప
నిలుచుచు, విభునిపై నిజదృష్టి నిలిపి,
మెలపుమై బనులకు మేకొన వలయు.
నరపతి మన్నించు నా కేమి యనుచు
మరియాద మీఱుట మఱిఁ గార్యహాని.
విభునియేకాంతంబు వెలిఁ బుచ్చ రాదు;
విభునితో నొకమాట వివరింపరాదు;
అంతఃపురంబులో నతిమైత్రి తగదు;
కాంతలు సభ నెందుఁ గాన్పింపరాదు.
ఒప్పువాహనములు నుత్తమాశ్వములు
నెప్పుడు విభుఁ డీక యెక్కంగరాదు,
మన్నించుచో నుబ్బు మనుజేంద్రుకినుక
దన్నుఁ జెందినచోటఁ దగదు దైన్యంబు,
ఎం డైన వా నైన నెల్లను నోర్చి
మండలేశ్వరుపంపు మఱిఁ జేయ వలయు.
భూమీశుసొమ్ముఁ దెంపున నాసపడక
పామునెమ్ములు గాఁగ భావింప వలయు,
ఆవలింతయుఁ దుమ్ము హాస్యంబు సుమియు
వేవేగ విభునొద్ద వెలిఁ బుచ్చరాదు
వైరిదూతలతోడ వడి నల్పుతోడఁ
జేరి భాషించినఁ జెడు నెంత వాఁడు.
తొడరి భూపతియొద్దిదోమతో నైన
విడువనిపగ మోఁచి విహరింపరాదు.
కుడిచి కట్టితి నేమి కొఱఁత నాకనుచుఁ
బుడమిలో మెఱయుచుఁ బొంగంగ రాదు.
ఇది యంతఁ దలపోసి యీమత్స్యవిభునిఁ
గదిసి వర్తింపుడు కార్యసిద్ధికిని."
అని లోకహితముగా నప్పురోహితుఁడు
వినిపించుటయు నీతి విని పాండుసుతులు,
"అతికృతార్థుల మైతి మయ్య, మీవలనఁ
జతుర సేవాధర్మ చరితంబు దెలిసె.
తల్లిదండ్రుల రీతిఁ దగ బుద్ధి చెప్పి,
ఉల్లంబు చల్లఁగా నుపచరించితిరి.
పోయి వచ్చెద మింకఁ బోలు పైనలగ్న
మాయితంబుగఁ జేసి యనుపుఁ డీ" రనిన
ధౌమ్యుండు నగ్ని హోత్రములు దెప్పించి
కామ్యపూజలు చేసి గమనమంత్రములు
జపము సేయుచు నున్న సమయంబునందు
నృపతు లేవురు లేచి నెలఁతయుఁ దారు
నసలార నతనికి నగ్ని దేవునకు
వెసఁ బ్రదక్షిణముగా వేడ్కతో వచ్చి
సుముహూర్త మనిపించుశుభనిమిత్తములు
క్రమముతోఁ జూచుచుఁ గదలి రందఱును.
విరాటనగరంబునకుఁ బోవఁ బాండవులు వెడలుట.
అప్పుడు ధౌమ్యుండు నరుదేర నృపులు
తప్పక కాళిందితటమును వెడలి,
మిగులుపాంచాలభూమికి దక్షిణముగ
మొగి శూరసేనభూములలోనఁ జొచ్చి,
పడమటిముఖముగాఁ బ్రతివాసరంబు
నడచి పోవుచు నెట్టి నగరంబుఁ జొరక,
అడవిలోఁ గూరలాహారంబు చేసి,
తడయక బహువినోదములు చూచుచును,
పొలు పారుచల్లనిపొదరిండ్లఁ జూచి,
చెలంగి యం తంతటఁ జేరి నిల్చుచును,
వెలయుపద్మములచే వినుతింపఁ బడిన
కొలఁకుల జలకేళిఁ గోర్కిఁ జేయుచును,
బహువర్ణమృగముల బహుపక్షితతుల
బహునదీనదములపంక్తిఁ జూచుచును,
జని చని మత్స్య దేశముఁ జేరఁ బోయి
తనరార నంతట ధౌమ్యు వీడ్కొలిపి
రతఁడుఁ బుణ్యాశ్రమోపాంతభూములకుఁ
జతురుఁ డై యేతెంచి సద్గోష్ఠి నుండె.
అటు పాండవులు పోవునపుడు పాంచాలి
పటుశోకవివశ యై పతుల కి ట్లనియె:
ఆసన్న మని వచ్చి యతిదూర మేను
గాసిల్లు టెఱుఁగరు కడవ నే గెదరు.
కొలఁకులు నదులును గోర్కిఁ జూపుచును
నిలిచెద మని యెందు నిలువ కేగెదరు.
మిడుకుమధ్యాహ్నము మెఱయఁ గాల్నడను
విడువక చనుదేర వెలఁదు లోపుదురె ?
కాళ్లసఖములందుఁ గ్రమ్మె రక్తములు;
వ్రేళ్లపుటంబుల విరిసె బొబ్బలును ;
పొందుగాఁ దఱచుటూర్పులు సందడించె;
ఇందుండి నొచ్చితి నేను రా లేను.”
అనవుడుఁ గరుణించి యాధర్మ రాజు పనివడ నకులుఁ దప్పక చూచి పలికె: "ఏది ప్రొద్దున నైన నీమత్స్యపురికిఁ బోదము మన మంచుఁ బొదిగూడి యిట్లు వడి వచ్చుమనవెంటఁ బాంచాలి యకట వడ దాఁకి రా లేక బడలుఁ జూచితివె? ఏ చందమున నైన నీచంద్రవదన మోఁచి తేవలె నీవు మొగిఁ గొంతదవ్వు." అనవుడు నకులుఁ డయ్యవనీశుమాట విననివాఁడును బోలె వెస నూర కున్న, మనుజేంద్రుఁ డప్పుడు మఱి యేమి యనక యను వొంద సహదేవు నట్ల పల్కుటయు, గొనకొని యతఁడుఁ గైకొన లేమి నెఱిఁగి, తనయానతిని గ్రీడి తలఁ దాల్చు నంచు మఱి ధనంజయుఁ జూచి మనుజవల్లభుఁడు తఱ చైనకన్నీరు దలఁక నిట్లనియె : "ఎం తెంత నడచిన నీ మత్స్యనగర మం తంత దూర మై యరుగు చున్నదియ. ఈమధ్యమున నుండ నిమ్ము లే దెందు. నీముగ్ధ రా నోప దిఁక నింద్రతనయ.
</poem>
ప్రాకటంబుగ నేఁటిపయనంబునందు
నీకు బొంకఁగ నేల నేను నొచ్చితిని.
ఓపి యీతనుమధ్య నొకయింత దవ్వు
ఏపు మీఱంగను నెంతయుఁ బ్రీతి
మూపుపై నిడికొని మోఁచి తెచ్చినను
నీ పేరుగా నొక్క నెలవు సేరుదుము."
అనవుడు నౌఁ గాక యని సవ్యసాచి
తనభుజంబులమీఁదఁ దరళాక్షి నునిచి
తామరఁ గొని తెచ్చుదంతి చందమునఁ
బ్రేమతో నే తేరఁ బృథివీశుఁ డపుడు
పురముఁ జేరితి మంచుఁ బురగోపురములు
సొరిదిఁ దమ్ముల కెల్లఁ జూపి యిట్లనియె:
పాండవులు తమయాయుధముల దాఁప నిశ్చయించుట.
"ఈదేహకాంతులు నీయాయుధములు
ఆదట ధరియించి యటఁ బోవ రాదు:
తగినరూపంబులు దాల్చి కైదువుల
నొగి దాఁప వలె నింక నొక్క దాపునను.
ఈగాండివముఁ గన్న నెఱుఁగరే మనల
బా గైన పెనుపాము భంగి నొప్పెడిని.
మనవిం డ్లెఱుంగ రే మహి నెల్లజనులు?
జనులకు నివి యవశ్యముఁ జూప రాదు.
అమరేంద్రతనయుండు ననయంబు వింటి
నిమిషమాత్రముఁ బాసి నిలువంగ లేఁడు.
ఎ ట్లైన నివి దాఁచు టిదియె కార్యంబు.
చోట్లు గుఱుతు గాఁగఁ జూచి రం" డనిన
నేఁ బోదు నని పూని యెలమి నర్జునుఁడు
పూఁబోణి నొకచోటఁ బొలు పొర నునిచి
యలయక వీక్షింప నటు పోయి పోయి
పొలుపు మీఱిన ప్రేతభూమిచెంగటను
గనియె నానాభూతకలితాట్టహాస
ఘనకాకఘూకభీకర మైనదాని ,
మిన్నేఱు శిరమున మేనఁ బాములను
జెన్నారఁ దాల్చుచు శివుఁ బోలుదాని,
గాండీవ మిచ్చినకర్త నాయందు
నుండు నీ విటఁ జూప మునుప రమ్మనుచు
మొగిఁ గ్రీడిఁ బిలుచుచొప్పున గాలిఁ గదలు
చిగురాకుచేతులఁ జెలు వైనదాని,
భావింప నిష్టంబుఁ బాండుపుత్రులకు
గావింప నొకవేళ గలిగె నా కనుచుఁ
బొనర సంతోషించి పులకించె ననఁగ
మనకంటకములచేఁ గర మొప్పుదాని,
విస్తార మగుజమ్మి వీక్షించె నపుడు.
ప్రస్తుతు లొనరించి బా గయ్యె ననుచుఁ
జెప్పంగఁ దొడఁగెఁ దోఁ చినయుపాయంబు
దప్పక చనుదెంచి ధర్మ రాజునకు :
“అల్లదె జమ్మి మీ రవధరించితిరె!
ఎల్లశస్త్రంబుల నిందు దాఁపుదము.
జనులకు రాఁ బ్రయోజనము లే దిందు ;
జననాథ వచ్చియు సాధింప లేరు.
శవము కైవడి దోఁపఁ జర్మంబు పొదివి
భువిమీఁద నేరికిఁ బొడసూప కుండ
శరచాపములఁ గట్టి జమ్మిపై బెట్టి
వెర వొప్ప నెందైన విహరించి మనము
క్రమ్మఱఁ జనుదెంచి కైకొనం దగును.
ఇమ్ముగా నీ వేళ కిది నాకుఁ దోఁచె."
అనవుడు నౌఁ గాక యని ధర్మ సూనుఁ
డనుజులుఁ దాను నొయ్యన జమ్మిఁ జేరి
"వెలయ మీమీవిండ్లు వెస నెక్కు డించి
యల వొప్ప నా చేతి కంది యిం" డనినఁ
బన్ను గాఁ దనవిల్లు పార్థుండు చూచి
కన్నుల బాష్పంబు గ్రమ్మ ని ట్లనియె :
“ఇది సాధనంబుగా నెల్ల రాక్షసులఁ
ద్రిద శేంద్ర వైరులఁ దివిరి సాధించి
యనిమొన గర్వాంధు లైనశాత్రువుల
జను లెల్లఁ గొనియాడ సంహరించితిని.
కడపట నొకమ్రానఁ గట్టి యీవిల్లు
విడువంగ వలసె, దైవిక మేమి చెప్ప !"
అని యెక్కు డించుచు నాధర్మ సుతుని
ధనువుఁ దప్పక చూచి తలఁకి వెండియును
"ధర్మజ, యీవిల్లు ధరియించి నీవు
దుర్మార్గులను నెల్లఁ ద్రుంచి వైచితివి.
భారతరాజ్యంబు భయము లే కుండ
నారసి యీవింట నాజ్ఞ పెట్టితివి.
దనుజు లెయ్యది గన్నఁ దల్లడిల్లుదురు,
ధను విట్టిదియు నీకు దాఁచంగ వలసె !"
అనుచోట ధర్మ జుం డది యెక్కు డించి
వెనుకొని భీముని వీక్షించి పలికె:
"సైంధవయక్షపాంచాల సైన్యముల
సంధించి బకవైరి చంపి తీవింట,
ప్రకటబాహాశక్తి పరఁగ నీవింట
నకులుండు సౌరాష్ట్రనాధు మర్దించె.
కాళింగ పాండ్యమాగధుల నీవింటఁ
జాల భీతిలునట్లు సహదేవుఁ డేసె.
ఇట్టి కైదువు లెల్ల నిదె నేఁడు మోఁపు
గట్టి మ్రాకున నౌర కట్టంగ వలసె !"
పాండవు లాయుధముల శమీవృక్షమున దాఁచుట.
అని యెక్కు డించుచు నన్ని కైదువులు
ఘనగదాఖడ్గచక్రములతోఁ గూడఁ
బెట్టెలోఁ బాములఁ బెట్టుచందమునఁ
బట్టి నెట్టనఁ గట్టి పైఁ దోలు బొదివి
యామీఁద వెండ్రుక లమరంగఁ జుట్టి
భూమీశుఁ డవి గొంచు భూజంబుఁ బ్రాఁకి
యప్పుడు ధీరుఁ డైయఖిల దేవతల
నొప్పుఁగాఁ బ్రార్థించి యోలి ని ట్లనియె :
"నేనును విజయుండు నే తెంచునపుడు
కాని మీరూపులు గాన రా నీక
వర్తింపుఁ డయ్య యెవ్వరు వచ్చి రేని ;
కీర్తింపు చున్నాఁడఁ గృతపుణ్యలార,
అరులపై మనభీముఁ డాగ్రహం బెత్తి
యరుదెంచుఁ బలుమాఱు నాయుధములకు,
ఇయ్యేటిలో మీర లితని కేమఱక
చయ్యన నొకమాయ సవరింపుఁ డయ్య."
అనుచు ధర్మ జుఁ డంత నామ్రను డిగ్గి
పొనరఁ బ్రదక్షిణం బులు చేసి మ్రొక్కి
భీముఁడీ పనికిఁ గోపించునో యనుచు
భీముని కొక్కింత ప్రియముగాఁ బలికి
యతనిఁ గౌగిటఁ జేర్చి యచ్చోటఁ గొంద
ఱితరులు వర్తింప నిచ్చలో బెదరి
తా రొండొరులుతోడ దగఁ బల్కురీతి
వారికి మఱుపెట్ట వలసి యిట్లనియె:
"మొదల నూఱేఁడులముసలి యై తల్లి
యిది యీడుదీఱిన నిట్లు చేసితిమి..
పూని పీనుఁగుఁ గాల్చి పోదురు కాని
మ్రాన గట్టెడువారు మహిలోనఁ గలరె ?
తడయక మనకుఁ బెద్దలు సేయుజాడఁ
గడఁగి చేయక పోదు కానఁ జేసితిమి."
అని యిట్లు పలుమాఱు నచటిగోపాల
జనములు విన నాడ సహదేవుఁ డంత
బలిసి యచ్చట నొక్క పసరంబు చచ్చి
యిలమీఁదఁ బడి యుంట నీక్షించి యీడ్చి
దానితో లొలిపించి తమకైదువులకు
వానకు మాటుగా వరుసఁ జుట్టించి
మఱియు నచ్చట నొక్క మనుజునిబొంది
యరసి నిస్సార మై యది యున్నఁ జూచి,
ఇది యుంఛవృత్తిచే ని ట్లయ్యె ననుచుఁ
గదిసి కైదువులతోఁ గట్టించె నదియు.
ఇత్తెఱంగున జమ్మి నెల్లకైదువులు
మొత్తంబుగాఁ బెట్టి మోదించి నృపులు
తోర మైపర్వు నీదుర్గంధ మెవరుఁ
జేరరు పొ మ్మంచుఁ జిఱునవ్వు నగుచు
నచ్చోటుఁ బాసి తా రామత్స్యపురికి
వచ్చుచో నప్పు డవ్వసుధేశుఁ డనియె:
"ఒరు లెఱుంగక యుండ నొక్కొక్క పేరు
ధరియింతు మది మీరు తగవుగా వినుఁడు.
అరుదార జయుఁడు జయంతుండునువిజయుఁ
డరయ జయత్సేనుఁ డలజయోద్బలుఁడు,
మఱవక మనలోన మనము పిల్చుటకుఁ
దెఱఁ గొప్ప నివి నామధేయంబు లిపుడు"
అని చెప్పికొని పోయి యట వేడ్కతోడఁ
దనరారఁ గాళిందితటిఁ జేరి నృపులు,
అందుఁ దీర్థము లాడి యట సేద దేఱి
యందఱు సుఖ మున్న యవసరంబునను,
పదిలంపునిష్ఠతోఁ బాండవాగ్రజుఁడు
ముద మొప్పఁ దూరుపు మొగముగా నిలిచి
కరములు మొగిచి యాకాశంబుఁ జూచి
పరఁగ నంతకు నిట్లు ప్రార్థించి పలికె:
"ధర్మ దేవత, నాకు దయ నొక్కవరము
నిర్మించి తది నేఁడు నెమ్మి నీ వలయు.
అది నమ్మి దుర్యోధనాదివైరులకు
నొదుఁగక వర్తింతు నుర్వి నీయేఁడు.
నాఁడు నాతమ్ములు నడుకానఁ బడినఁ
బోఁడిగా బ్రదికించి పొడచూపి నీవు
మాకు బుద్ధులు చెప్పి మము నూఱడించి
మాకు నిచ్చినయీవి మఱవంగ లేము "
అని తారు విప్రుని యరణి దేఁ బోయి
ఘనత నొందినమేలు గాన రా నాడి,
ఏ పార మోడ్చిన యిరుగేలు నొసల
దాపించునంతలో ధర్మరాజునకుఁ
గాషాయవస్త్రంబు మనకమండలువుఁ
బాషండగతి గానిపట్టెవర్ధనము
దండపుగోలయుఁ దగినపాదుకలు
మెం డైనజపమాల మెఱయ నాక్షణమ
యలవడి యతివేష మాయితం బైన
నెలమి సంతోషించి రెల్ల పాండవులు.
అప్పుడు మఱియుఁ బ్రత్యక్ష మై నట్లు
తప్పక నృపుల నంతకుఁడు మన్నింప
నేరూప మెవ్వరి కిష్టమై యుండె
నారూపములు చాల నంద మై యుండఁ
జీరలుఁ దొడవులు శృంగారములును
వారకంబులు పోలె వరుసగాఁ గలిగె.
పరితోషమున నంతఁ బ్రథమపాండవుఁడు
పరఁగఁ దమ్ములఁ జూచి పాంచాలిఁ జూచి
క్రమ మొప్ప నొక్క రొక్కరు వచ్చుపట్ల
రమణ గట్టడ చేసి రాజసం బణఁచి
యొగిఁ బెక్కు తెఱఁగు లై యున్న పాచికలు
తగ వొప్ప ముడిగొని తాను గ్రహించి
పోవుచో విరటుండు పుణ్యంబు పోలె
నా వేళ లీల నొ ప్పారెఁ గొ ల్వుండి.
ధర్మజుఁడు యతి వేషమున విరాటుసభకు వచ్చుట.
యతివేషధారి యై యరుదెంచుధర్మ
సుతునిఁ, దప్పక చూచి చోద్యంబు నొంది
తనప్రధానులకు నాతనివంకఁ జూపి
మనసులో హర్షించి మఱియు ని ట్లనియె:
"ఉన్నతి యతినాథు నొనరఁ జూచితిరె?
కన్నులపండు వై కానంగఁ బడియె.
భువనత్రయము నేలుపుణ్యుఁడో యితఁడు ?
అవనిలో భిక్షకుం డని చెప్ప రాదు.
ఓలి నీతనిఁ గొల్చి యుభయపార్శ్వముల
నేలోకో చనుదేర విభతురంగములు :
చెలు వైనమూర్థాభిషిక్తు నీపురుషుఁ
గొలిచి రా రేలొకో కోటిసద్భటులు ?
వెలిగొడుగులనీడ వింజామరలకు
నలవడెఁ దోఁచ నీ యతి భాగ్య రేఖ.
యతి రూపధరుఁ డైన నగుఁ గాక యితని
జతన మై పాయదు సౌభాగ్యలక్ష్మి,
ఈవంకఁ దనకు రా నేమి కారణమొ?
భావింప మన మేమి బ్రాఁతి యీతనికి?
అడుగులసౌభాగ్య మలరుఁగా ఇతని
కడిగిన నీరాజ్య మైన నిచ్చెదను.
ఇచ్చునంతియ కా దిఁ కేను నాప్రజలు
నిచ్చలుఁ బరిచర్య నెమ్మిఁ జేయుదుము "
అని లేచి నృపచంద్రుఁ డాయతీంద్రునకు
నెనసిసభక్తితో నెదురుగా వచ్చి
కన్నంతటనె మ్రొక్కి, ఘనతఁ దోడ్తెచ్చి
యున్న తాసనమున నొనరంగ నునిచి
పనివడి పన్నీటఁ బాదము ల్గడిగి
తనమేనివలువచేఁ దడి యొత్తి భక్తి
చెలువారఁ దనువున శ్రీగంధ మలఁది
పొలు పొప్పఁ జేతులు మోడ్చి యి ట్లనియె:
"ఎచ్చోట విహరింతు, రేది మీనామ,
మేచ్చోటి కేగెద, రేది కారణము ?
చెప్పుఁడు నిజముగాఁ జెలిమి మాతోడ;
ఇప్పుడు భాషింప నిచ్చె నీశ్వరుఁడు.”
అనవుడు విని మందహాసంబు చేసి
తనర నయ్యతి వేషధారి యి ట్లనియె:
"మన్ను, మిన్ను ను నీరు మారుతం బగ్ని,
ఇన్నియుఁ గూడఁగా నీశరీరంబు
ప్రజల కొదవెఁ దొట్రుపాటు గావింప;
నిజ మాడ నెవ్వఁడు నేర్చు లోకమున ?
అది యట్టు లుండె, మత్స్యాధీశ వినుము.
చదు రొప్పుకురుభూమి జన్మ దేశంబు,
చెలువార ధర్మజుచెలికాఁడ నేను.
పలుకు లేటికి ? కంకభట్టు నా పేరు.
నెఱవుగా జూదంబు నృపతిలక్షణము
నెఱుఁగుదు; కథలలో నేఁ బ్రవీణుఁడను.
నాకును బగవారు ధనం బెల్లఁ
జేకొని వెడలఁ ద్రోచిన వచ్చి యేను
నీగుణంబులు విని ని న్నొక్క యేఁడు
బా గొప్ప సేవింతుఁ బ్రతినతో ననుచు
రయ మొప్ప వచ్చిన రాక యీరాక,
నియమ మేర్పడ నిట్లు నేర్పుతో నుందు.
ఉపకారమునకుఁ బ్రత్యుపకార మేను
సృప చేయ నోపుదు నెఱి నొక్క యెడను.
ఇది వర్తనము గాఁగ నేఁడు నిండించి
పదిల మై పోవుదుఁ బగవారి గెలువ."
అన విని మనుజేంద్రుఁ డతని కి ట్లనియె
వినయహర్షంబులు విజ్జోడుపడఁగ :
"అట్ల చేయుఁడు, పొందుఁ డఖిలభోగముల
నేట్లు కావలసిన, నే నున్న వాఁడ,
ఎవ్వఁడు మీకును నెగ్గు గావించుఁ
ద్రెవ్వి వేయుదు వానిఁ దివిరి న స్బంపు,
ఇది యేల ? మీకు మ మ్మేలి సామ్రాజ్య
పదవిఁ జేకొన రాదె పరిణమించెదను.
ఏలినఁ ద్రిజగంబు లేల నోపుదురు!
పోలింప మామత్స్య భూమి మీ కెంత ?"
అన విని దరహాస మాననాబ్జమునఁ
దనరార నతనితో ధర్మజుం డనియె:
వడి నేలఁ బడి యుండి వట్టిపంటలను
గుడిచి నెమ్మది నుండుకొలఁది మాకొలఁది.
భూము లేలఁగ నేల? భోగంబు లేల?
భూమీశ నీ వింత బోధింప వలదు."
అనవుడు భూపాలుఁ డటు సమ్మతించి
తనకు జూదముమీఁదితమకంబు చెప్పి
మీతోడిసద్గోష్ఠి మే లయ్యె ననుచుఁ
బ్రీతుఁ డై కౌంతేయుఁ బెద్ద మన్నించె.
అతఁ డిట్లు భూనాధు నర్థితో గొలిచి
యతిమాన్యుఁ డై యున్న యవసరంబునను,
భీముడు బానసీడై విరటుఁ గొలువవచ్చుట
వంటలవానికై వడి దోఁప భీముఁ,
డొంటిమైఁ జట్టువం బొకకేలఁ బట్టి
చంక నుగ్రఫు హేతి సవరించి దిండు
వంకిణితోఁ గూడ వడిఁ బట్టి బిగిచి
కోలలు డాకేలఁ కొన్ని సంధించి
లీలఁ జిత్రించినలేఁదోలు దాల్చి,
అతిధీరుఁ డై తనయన్న చెంగటికి
గతిగూడి మత్తేభగమనంబుతోడ
విరటసభ్యుల కెల్ల వ్రేఁక మై తోఁప
వెరవుతో నాస్థానవీధి డగ్గఱెను.
అల్లంతఁ బొడఁగాంచి యతనియుద్ధృతికిఁ
దల్లడం బంది యెం తయుఁ జోద్య మంది
జనులు వారికి పౌరు సంభ్రమింపఁగను
దనలోన నిట్లని తలపోసి నృపుఁడు:
"భీమబాహాశక్తిపేర్మి వీక్షింప
మే మెన్నఁడును జూడ మిట్టిమానవుని.
మానవమాత్రుఁడే మహిలోన నితడు ?
భానుఁడో మఱిచిత్రభానుఁడో కాక !
ఇతనివంశముఁ బేరు నెట్టిదో ధాత్రిఁ
గృతమతిఁ దెలియువా రెవ్వరిచ్చోట ?
వచ్చు కార్యము చెప్పు వలెఁ గాక యితని
కిచ్చెద రాజ్యంబు నేను గైకొనక.”
అనుచోట విభుఁ జేర నరిగి వాయుజుఁడు
మునుకొని వినయసంపూర్ణు డై మ్రొక్కి,
"కులమున శూద్రుండఁ గువలయాధీశ
సొలయక మును ధర్మసుతు బానసీఁడ
వలలుండు నాపేరు; వసుధ నెవ్వరును
దలఁప నాసరి గారు తగినవంటలకు,
నినుఁ గొల్వ వచ్చితి ; నీ వింక నాకు
నొనరఁ గూడును జీరయును బెట్టు చాలు.
పురణించి యుబ్బెసపోక నీయెదుట
బెరసి యేనుఁగుతోడఁ బెనఁగు లాడుదును;
కాఱెనుపోతైన ఘనసింహ మైన
మీఱి పట్టఁగ నేర్తు మెదలి పోకుండ,
అంచితశక్తి నే నన్న మల్లులును
పంచబంగాళ మై పాఱిపోవుదురు,
ఏలిన నేలు న న్నేలుకూరులకు
మేలుబంతియ పోలె మేలఁగు చుండెదను."
అనవుడు విరటుఁ డయ్యనిలసంభవునిఁ
గనుఁగొని పలికె ను త్కంఠ దీపింప :
"ఎక్కడిమాట నీ వెట్లు శూద్రుఁడవు ?
చిక్కనినీమేనిచెలువంబు చూడఁ
బ్రాకటసామ్రాజ్యపద మౌను గాదె!
నీకు నేటికి నింత నీచవర్తనము ?
వివిధవాహనములు వివిధసంపదలు
సవరించి యిచ్చెదఁ జనవుతో నుండు."
అనుటయు భీముఁ డొయ్యన మోము గలఁగ
మనుజేంద్రుమాట సమ్మతి గాక పలికె:
"ఇవి యొల్ల, నా కిష్ట మైనమార్గమున
గువలయాధిప నన్నుఁ గొలిపించికొనుము.
ఓపవేనియుఁ దెల్పు ముత్తమోత్తమము,
వే పోయి వే ఱొక విభునిఁ గొల్చెదను,
ఏమియో నీచిత్త మెఱిఁగింపు మనిన"
భూమిపాలుఁడు వాయుపుత్రుఁ బ్రార్థించి
"నీకాంతి కను వైననీతిఁ జెప్పితిని ;
కా కున్న మానె నాగ్రహ మేల నీకు ?
వలల నావద్ద నీ వలసినయట్లు
కలకాలమును నుండు కడువేడ్క తోడ.
వండెడువా రెల్ల వరుస నీయాజ్ఞ
నుండెడివారిఁగా నొరిమగా నుండు."
మని చెప్ప బకవైరి యత్యాదరమున
మనుజేంద్రుఁ జేరి నెమ్మది నుండె నంత.
అర్జునుఁడు పేడి యై విరటుని సభకు వచ్చుట.
ధీరతఁ బేడి యై దేవేంద్రుపట్టి
వారక పురుషభావము లేక యణఁచి,
సంకుల ఘనబాహు సౌందర్య మెడల
నంకించి, ఱవిక దేహము కాంతి మాన్ప,
చెలు వైనపవడంబు చెవుల సొం పణఁప,
అలకలు నుదుటి సౌ రణఁగించి యలమ,
మంచు పైఁ గవిసినమార్తాండుపగిది,
నించునివుఱు గప్పుని ప్పున్నయట్లు,
వేషంబు ధరియించువిష్ణుచందమున,
రోషంబు మానినరుద్రుకైవడిని
వాడుదేరినమోము ప్రాభవం బణఁప
వేడుకతో వచ్చె విభుఁ డున్న యెడకు.
వచ్చి యచ్చట నున్న వారిచూడ్కులకు
మెచ్చుగాఁ దనరూపుమేల్మిఁ గాన్పించి,
ఓయారమున జంగ లొఱపుగా నిడుచుఁ
బాయక కరిరాజుబాగుఁ గైకొనిన, :
కొలువువారల కెల్లఁ గువలయాధిపుఁడు
సొలయక నరువంకఁ జూపి యిట్లనియె."
"పొలఁతిసింగారంబుఁ బురుష, భావంబుఁ
గలిగి యున్నది దీనిఁ గంటిరే మీరు ?
తేజంబుపొడపును దృష్టింప నరుఁడు,
రాజసంబును జూడ రమణి కా నోపు,
ఈడు జోడును లేక యెవ్వఁ డే నొకఁడు .
వేడుకఁ గైకొన్న వేషంబు గాక,
ఇంతవానికి నేల యీవికారంబు
పంత మాడినయట్లు ప్రాపించె నకట !
చెప్పుడు మీకుఁ దోఁ చినజాడ " యనినఁ
జెప్ప నేరక వారు చింతించు నెడను,
భూపాలు దగ్గఱఁ బోయి జిష్ణుండు
తీ పారుమాటలఁ దెలియ నిట్లనియె:
“నిన్ను వేడుకఁ గొల్చి నృపచంద్ర యేను
గన్నయలకు నాటఁ గఱప వచ్చితిని.
ఇల బృహన్నలనామ మింపారు నాకు;
మొలచె దైవాధీనమునఁ బేడితనము. .
దండలానకమును దగు ప్రెక్కణంబుఁ
గుండలియును నెఱుంగుదుఁ బేరణంబు
నటన నాయిరువది నాల్గుహస్తములు
బటువు చూపఁగ నేర్తుఁ బ్రతి తాళమునకు.
కేలఁ దాళంబులఁ గీలింప కొడల
నాలోలగతి గీత మభినయింపుదును.
తనరఁ బాదంబులఁ దాళ నిర్ణయము
గనుపట్ట భావంబుఁ గాన్పింప నేర్తు,
భావాశ్రయంబులు పరికింప నేర్తు.
భావించి న న్నేలు భరతవిద్యలకు. "
అనపుడు నృపచంద్రుఁ డమరేంద్రసుతునిఁ
గనుఁగొని తనకోర్కి కాన రాఁ బలికె :
"ని న్నిట్లు పేడిగా నిర్మించె బ్రహ్మ !
సన్నుతింపఁగ నీవు సౌభాగ్యనిధివి ;
ఘనములౌ భుజములుఁ గఠినకాయంబు
దిననాధు తేజంబు దీర్ఘనేత్రములు
నీకు నొప్పినయవి ; నీవు నాయొద్దఁ
జేణిని వర్తింపఁ జింతించెదేని,
ఒనర నావిండ్లలో నొకమంచివిల్లు
ఘనవజ్రకవచంబు ఖడ్గాయుధములు
వలయుభూషణములు వారువంబులును
వెలయ నిచ్చెద నుండు విభవంబు మెఱసి.
నిన్ను మాభూమికి నృపునిఁగాఁ జేయ
నున్నచో నిట్లాడ నుచితమే నీకు ?"
అనవుడు విభున కి ట్లనియె నర్జునుఁడు
తనరూపరేఖకుఁ దగుసిగ్గు దోఁప:
"అడుచందము తిర మై యుండు నాకు,
పోఁడిమిగా లేదు పురుష భావంబు ;
ఈనపుంసకవృత్తి యేమిశాపమునఁ
బూని యేతెంచెనో ! పొందుగా మిగుల
నడఁకువతో నుండు టది యొప్పుఁ గాని
తొడుగుచు మెఱవడి తోనుండ రాదు.
పాంచాలియింట నే వసియించినపుడు
మించినయారూపు మెఱసినఁ జాలు.
అచ్చోటఁ బాత్రల ననువుగా దిద్ది
మెచ్చులు పడయుదు మెఱవడితోను.
వీను మాటయొజ్జ నై విహరింతు నిచట ,
ఘనముగాఁ బిలిపింపు కన్యకాజనము."
అనవుడు మనుజేంద్రుఁ డాదరం బొప్పఁ
దనపుత్రి యైనయుత్తరఁ బిల్వఁ బనిచె.
అదియును గైసేసి యరుదెంచె నపుడు
పదనుపెట్టినపుష్పబాణంబుఁ బోలి,
ఘనలోకలోచనకైరవావళికి
నినిచిననిండు వెన్నెలసోగఁ బోలి,
కెరలినమత్త కోకిలచంచుధారఁ
జరుగక యున్న కెంజిగురాకుఁ బోలి.
కన్నులు గురులుఁ జొక్కట మైనపిఱుఁదుఁ
జెన్నార సరి లేనిచెలువంబు నొంది,
ప్రన్నని వయనుచే బటు వొప్పి చూడఁ
గన్నులపండు వై కల్యాణి యపుడు
తనవెంట నేతెంచు ధవళలోచనల
ననయంబుఁ బ్రీతిమై నం దంద పిలిచి
వచ్చి మ్రొక్కిన ముద్దు వచ్చి భూవిభుఁడు
గ్రుచ్చి కౌగిటఁ జేర్చి కూర్మి దైవార
మునివ్రేళ్లఁ జెక్కులు ముదముతోఁ బుణికి
తనమోముఁ గదియించి తనయమోమునను
నలినాక్షిమోముపై నలి రేఖ వ్రాసి
పలుమాఱుఁ గ్రొత్తగా భావించి చూచి
కువలయాధిపు డంతఁ గూతుఁ జూపించి
దివిజేంద్రసుతుతోడఁ దేటగా ననును:
ఇచ్చేడియకు నాట నెలమిమైఁ గఱప
వచ్చునే ? - యనుటయు వాసవాత్మజుఁడు
"పరిమళంబునఁ బొల్చు పసిఁడిచందమున,
కార మొప్పురుచి నొప్పుకస్తూరిపగిది,
అనఘ యీముగ్ధ నా ట్యము నేర్చెనేని
చెనసి పండినయట్టిచెఱకు గా కున్నె"
అని వేడ్క పుట్టించి యా కార్యమునకు
వినతి నీకొనుటయు విభుఁడు మోదించి
యసమున మన్నించి యాబృహన్నలకు
వెసఁ గప్పురముతోడివీడె మిప్పించి
చెలు వైనతొడవులుఁ జీనాంబరములుఁ
గొలఁది కగ్గల మిచ్చి కొమ రొప్పఁ బలికె:
"ఇచ్చెద నీ చేతి కీ పువ్వుబోణిఁ
జెచ్చెర మృదువుగాఁ జెప్పుమీ విద్య,
చెలులతో నాటలఁ జిక్కి యీబోటి
తలఁపక యొకవేళఁ దప్పు చేసినను
గన్నుల బెదరింతు గాని నీ వలిగి
చిన్నారి నెన్నఁడు శిక్షింప వలదు,
నీకుఁ జెప్పఁగ నేల ? నీవెఱుంగుదువు;
నాకు నీ చెలువ ప్రాణము గాన నంటి.
కొమ రొంద గురుఁడ వౌకొలఁదియే నీవు
కమల నేత్రకు నేనుగడయు నీక్కువము.”
అని యొప్పగించుచు నబ్బోటి కేలు'
చెనసి వానవపుత్రుచేతిలోఁ బెట్టి
"మరగ నీకన్నియ మాన్య నీ " కనుచు
విరటుఁ డుత్తరతోడ వేడ్క ని ట్లనియె:
"గురుఁ డేమి చెప్పిన గుణముగా నెఱుఁగు.
గురుఁడు దైవము నీకు గురుఁడు చుట్టంబు.
చందనపుష్పభోజనభూషణములు
విందుగా నితనికిఁ బెట్టింప వమ్మ,
చనవుతో నన్యవాసము రాణివాస
మును లేక మనయింట మొగి నుండు నితఁడు.”
నకులుఁ డశ్వశిక్షకుండై విరటు పాలికివచ్చుట
అని చెప్పి యిద్దఱు నపుడు వీడ్కొల్పి
జననాధుఁ డుత్తమాశ్వములు వీక్షించు
నాలోన నకులుండు నట సంభవించి
"కాలోచితం బీడఁ గల్గె నా కనుచు"
నొనరంగఁ జనుదెంచె నుదయార్కు పగిది.
జనులనేత్రములకు సంతసం బొదవ
నలజడిఁ జనుదెంచునతనిరూపంబు
వెలయంగ దవ్వున విభుఁడు వీక్షించి
ప్రజలకు నతని సౌభాగ్యంబుఁ జూపి
నిజ మైనప్రేమంబు నెఱయ నిట్లనియె:
"ఈవచ్చు చున్న వాఁ డెవ్వఁడో? వీని
భావంబు నిపు డేను భావించినాఁడ,
అరుదార నశ్వవిద్యాభిజ్ఞుఁ డౌట
సొరిది గుఱ్ఱముఁ జూచుచూడ్కి చెప్పెడిని,
అతిఘోరసమరసాహసుఁడు గా నోపు,
ఇతనిచందమును నాయితముఁ దెల్చెడిని.
ఎఱుఁగుదురేని నా కెఱిఁగింపుఁ డితని;
ఎఱుఁగ కుండిన మీర లెఱిఁగి రావలయు."
అను చుండ నృపుఁ జేర నరిగి పాండవుఁడు
మునుకొని కే లెత్తి మ్రొక్కి యిట్లనియె:
"దేవ న న్ని పు డేలు, తెఱఁ గొప్ప నిన్ను
సేవింతు హయముల శిక్షించుపనికి.
అనఘ దామగ్రంధి యను పేరు గలిగి
విను ధర్మజునియింట విహరింతు నేను.
బలయుతమ్ములలోనివానిఁగా నన్ను
నిల వేఱు సేయక యేలే నావిభుఁడు.