ద్విపదభాగవతము/కల్యాణకాండము

శ్రీరస్తు
శుభమస్తు

ద్విపదభాగవతము

కల్యాణకాండము

విదర్భరాజు తనకుమార్తె రుక్మిణిని శిశుపాలుని కిచ్చుటకుఁ దీర్మానించుట


ఆరూఢయౌవన నాయింతి జనకుఁ
డేరాజు తనయున కిత్తు నేననుచు
జింతించి చైద్యుండు శిశుపాలుఁ డర్హుఁ,
డింతికి నని నిశ్చయించి పెండ్లికిని
సకలదిక్పాలుర సకలభూపతుల
సకలమహీశ్వరసమితి రప్పించి
ధీయుక్తిమై నాఱుదినములలోన
నాయతంబగు లగ్న మరుదెంచుటయును
నంత రుక్మిణి యంతయు నెఱిఁగి

రుక్మిణీదేవి తనపురోహితుని శ్రీకృష్ణునివద్దకు పంపుట


చింతించి "నేనింక శిశుపాలు నెట్లు
వరియింతు? త్రైలోక్యవరుఁడు నావిభుఁడు

హరి నాకుఁ బ్రాణేశుఁడై యున్నవాఁడు
నేనేమి సేయుదు నిటమీఁద నింక!
నానోములన్నియు నన్నుఁ ద్రెక్కొనియె
నెవ్వరు గలరింక నాబారి గడప?
ఎవ్వఁడోపుడు నాకు నీవార్తఁ జెప్ప.”
అని పల్కి, చింతించి యవ్వరారోహ
తన పురోహితపుత్రు ధర్మచరిత్రుఁ
బిలిపించి యెంతయుఁ బ్రీతి నెమోము
కలఁగఁగఁ బలికె గద్గదకంఠి యగుచు;10
అనఘాత్మ! మనవారు లవనీతి సేసి
నను చైద్యపతికి నున్నతిఁ బెండ్లి సేయఁ
దలఁచుచున్నారు నాతలఁపు జీవనము
జలజాక్షుఁ డనుచు నిశ్చలవృత్తి నుందు
నీమాటనన్నియు నెఱిఁగింపరాదు
నామీఁదఁ గృపఁగల్గి నన్ను మన్నించి
యరసి తోపుట్టినయట్లుగాఁ జూతు
మెరవు సేయకఁ జిత్త మెఱిఁగి వర్తింతు
వటుగాన నాకైన యక్కరఁ దీర్ప
నిట నీవె కాక యింకెవ్వరు బంధు
లాయసంబునఁ జని యాద్వారవతికి
బోయి కృష్ణునిఁ గాంచి పొసగంగఁ జెప్పి
మరుఁ డెత్తుకోల నామానంబు గొనును
పరువెత్తి రాకున్నఁ బరిణయలగ్న
మెడ లేదు! తానింక నే తేరకున్న

విడుతుఁ బ్రాణంబులు వేరొండు లేదు!”
అనిన నావిప్రుఁడు నతివచోధనుఁడు

పురోహితుఁడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి రుక్మిణి ప్రేమను రూపును వర్ణించుట


జనియె సత్వరమున శౌరిసన్నిధికి
అరుదార ద్వారపాలావళిచేత
హరి విని యెదుఱేఁగి యా విప్రవరునిఁ20
దోడ్కొనిపోయి సంతుష్టుఁ గావించి
వేడ్క ప్రియంబును వెలయ నిట్లనియె.
“ఎవ్వరు బుత్తెంచి రెందుండి వచ్చి
తెవ్వరు నీనామ మెఱిఁగింపు” మనిన
“అనఘాత్మ! భీష్మకుండను విదర్భేశు
తనయ రుక్మిణియను ధవళాయతాక్షి
[1]తనుమధ్య యుత్ఫుల్ల తామరసాక్షి
గరుడకిన్నెరయక్షగంధర్వసతులు
దొరయలే రాయింతితో నీడుఁ బోల్ప;
దేవర సౌభాగ్యదివ్యవర్తనలు
వావిరి జనులెల్ల వర్ణింపుచుండ
విని పుష్పధన్వుని విషమబాణములు
యనువొందఁ దనువున నటనాటుటయును
జిత్తంబులో నీదు చెలువైనమూర్తి
చిత్తరువొత్తిన చెలువంబుఁదోఁపఁ
జింతించు వెఱఁగందు చేష్టలు మఱచు

నంతకంతకు నిన్ను నభినుతి సేయు
విరహాగ్నిశిఖఁ గ్రాఁగు వెలువెలనగుచు
మరులెత్తినట్లు పల్మరు చిన్నఁబోవు30
నీభంగినున్న యీయిభరాజగమనఁ
బ్రాభవంబునఁ జైద్యపతి పెండ్లియాడ
నెల్లుండి చనుదెంచుటెఱిఁగి యాయింతి
యెల్లవిధంబుల నిది నీకుఁ జెప్పఁ
బుత్తేర వచ్చితిఁ బుండరీకాక్ష!
చిత్తంబులో నొండు చింతింప నేల?
ఆభామ నిజభార్యయై యుండునట్టి
సౌభాగ్య మెవరికి సమకూరు? నీవు
నారుక్మి ణిభ్భంగి నాసలుఁ సేయు
కారుణ్యమూర్తివి కమలాక్ష! నిన్ను
గదసి నీదరహాసకౌముదిఁ గ్రోల
ముదితనేత్రచకోరములు చేరఁగోరు
నలవడి నీ ప్రయాణాంబువులోన
కలకంఠిచాతకి కడువేడ్క సేయు
నీ వెటులైనను నేచినవేడ్క
నా వెలందుక నేలుటది నీకు నొప్పు;
నిను నమ్మియుండిన నెలతుక నొకఁడు
కొనిపోవఁగాఁ జూడఁగూడునే నీకు?
పురవరాంగణములఁ బొరి దుర్గఁగొలువ
నరుదేర నాకన్య నాసురలీల40
వరియించి చైత్యభూవరుసైన్యములను

సరగున సమయించి జలజాక్షిఁ గొనినఁ
గీర్తియు లాభంబు గెలుపు పౌరుషము
నార్తరక్షణమును నగు నీకు కృష్ణ!
ఈ కార్యమెడయైన నిందిరారమణ!
ఆకామినీమణి యసువులు విడుచు
నిన్నిమాటలుఁ జెప్ప నెడలేదు వేగ
నున్నతి పరిణయంబొనరించు టొప్పు.”
అనియని చతురోక్తు లల్లనఁ బలుక
ననియె విప్రునితోడ నంబుజోదరుఁడు

శ్రీకృష్ణుడు రుక్మిణినిఁ గాపాడి వరించుట కొప్పుకొనుట


“వనజాక్షి రూపులావణ్యసంపడలు
విని చిత్తమునఁ జూడ వేడుక పుట్టి
వచ్చెదమనువేళ వరపుణ్య నీవు
విచ్చేసితివి లెస్స విధమయ్యెఁ దలఁప
నాకన్యకకు నాకు నలరుబంధుఁడవు
గాక యెందును వేరు గలదయ్య మనకు?
ఇదె వచ్చి శిశుపాలు నే గెల్చి సేనఁ
జదిపి యందఱు మెచ్చఁ జపలాక్షిఁ దెత్తు”
అనుచు మజ్జనభోజనాదికృత్యములు
తనరార సలిపి యాతనిఁ బూజసేసి50

శ్రీకృష్ణుఁడు కుండినపురికిఁ బయనమగుట


సైన్యసుగ్రీవాదిచటులాశ్వపాంచ
జన్యచక్రస్ఫూర్తి చదలెల్లఁ గప్ప

గరుడకేతన కాంతి కరమొప్పుచున్న
యరదంబు సన్నాహమై మ్రోల నిలుప
దారకుఁడును విప్రతనయుఁడుఁ దాను
నారూఢశుభవేళ నరదంబు నెక్కి
గగనంబునను దివాకరబింబమోయ
నఁగఁ జనియె విదర్భ నలినాక్షురథము;
పోవుటయును సీరి జింతించి
“యావిష్ణుఁ డొంటిమై నరిగెఁ బెండ్లికిని
బలియురు మాగధప్రముఖభూపతులు
కలహంబు పుట్టునే గదిసెద” ననుచు
బలువొప్పఁ జదురంగబల సైన్యపతులుఁ
గొలువంగ హలివచ్చె కుండినపురికి.

పౌండ్రకదంతవక్త్రాదులు కుండినపురి కేతెంచుట


అంతట శిశుపాలుఁ డతివైభవమున
దంతితురఁగసద్భటపదావళియు
వలనొప్ప పటహాదివాద్యముల్ మొరయ
బలియుఁడై చనుదెంచెఁ బరిణయంబునకు
హరితో విరోధాత్ములగు సాల్వమగధ
ధరణిఁ బౌండ్రకవరదంతవక్త్రులును60
గొమరార శిశుపాలుఁ గూడి యేతేర
నప్పుడు భీష్మకుం డధికవైభవము
లొప్పారఁ బురమున నుత్సవం బొదవ
కలుపదంబులు మేలుకట్లు తోరణము
లలవడ నేతెంచి యధికవైభవము

కలయఁ గుంకుమనీటఁ గలయాపులలికి
మెలుపార కస్తూరి మేడలఁ బూసి
మొనసిన కప్పురమున మ్రుగ్గు వెట్టి
తనరారఁ గదలికాస్థంభంబు లెత్తి,
పురము సింగారించి పురుహూతులీలఁ
దరుణులు గొలిచిరా తరుణులుఁ దాను
వందిసన్నుతగీతవాద్యముల్ మొరయఁ
జెంది పేరంటాండ్రు సేసలుఁ జల్ల
గురుసంపదల నెదుర్కొని తోడితెచ్చి
ధరణీశవరుల నండఱి మనోహరము
లగుచోట విడియించి యఖిలసౌఖ్యములుఁ
దగుభక్తి నొనరించి దక్షులఁ బిలిచి
ఘడియారమిడఁగ మంగళతూర్యనినద
మెడపక మ్రోయంగ నెఱిఁగి రుక్మిణియు70

రుక్మిణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాకకై పరితపించుట


కలఁగి మ్రాన్పడి నిల్చు, కళవళంబందుఁ
బెలుకుఱులోఁ దాఱు పెదవులుఁ దడపుఁ
బలుకకూరకనుండుఁ బలుమాటలాడు
నిలువనేరక వ్రాలు నిట్టూర్పువుచ్చు
నంతయు హరిఁ జేర్చు నంతరంగమున
సంతాప మొదవంగఁ జర్చించి చూచు;
“నక్కట! యెక్కడి కరిగెనో! విప్రుఁ
డెక్కడఁబోయనో! ఏలకోతడసె!

హరికి యిక్కడివార్త లందెనో! నడుమ
దిరిగెనో! శౌరిఁ దోతెచ్చుచున్నాఁడొ!
ఈకార్య మెఱిఁగింప నిందిరావిభుఁడు
కైకొనకుండునో! కడువేడ్కతోడ
వచ్చునో! ఎవ్వరే వలదందురొక్కొ!
మచ్చికతో నన్ను మన్నించునొక్కొ!
నెడమకన్నును జన్ను నేడమభుజంబు
వడి నదరెడి హరివచ్చు నిశ్చయము.”
అని యిచ్చ నూహింప నంబుజోదరుఁడు
చనుదెంచి సీరితో సైన్యంబుతోడ
నాపురోద్యానంబు నందొప్ప విడిసి
భూపాలతనయ కింపుగఁ దనరాకఁ80
జెప్పి పుంచినఁ జెన్నార విప్రుఁ
డప్పొలంతుకఁ గాంచి హరి వచ్చె ననుడు
హరుషాశ్రువులు గ్రమ్మ నందంద మేను
గరుపార నవ్విప్రుఁ గని యిట్టులనియె,
“పురుషార్థపరుఁడవు పుణ్యచిత్తుఁడవు
పరమాప్తుఁడవు నాకుఁ బ్రాణంబు నీవ!
ప్రాణవల్లభుఁడైనఁ బద్మాక్షుఁ దెచ్చి
ప్రాణంబుఁ గాచితి పలుకులిం కేల!”
అని పల్కి యతనికి నందంద మ్రొక్కి
కనకాంబరము లిచ్చి ఘనతతో ననిచె.

రుక్మిణి గౌరియాలయమునకు వెడలుట


గౌరికి మ్రొక్కింపఁ గరము సంప్రీతి

నారాజబింబాస్య నటతోడి తేరఁ
గలికి రాయంచల గతుల గీడ్వఱచుఁ
జెలువలు నలుగడఁ జెన్నారి కొలువ
పటహకాహళశంఖఫణవాదు లొలయ
పటుతరంబగు వీరభటకోటి కొలువ
దేవతనగరి కేతెమ్మన్న, శౌరి
కావార్త యెఱిఁగింప నవ్విప్రుఁ బంచె,
ఆమెలఁత కాల్నడ నరుదెంచె నప్పు
డేమని వర్ణింతు! ఇభపురాధీశ!90
అడుగడుగిడుచోట నవనియంతయును
గడునొప్పు పద్మరాగశ్రీ వహించు;
ఉచ్చిఁతపండ్లతో నుల్లసంబాడు
నచ్చపలాక్ష్మికి నంగుష్ఠచయము;
వదనఖద్యుతు లనుపచరించు నెలవుఁ
గదియ మౌక్తికములుఁ గట్టి నట్లుండు;
తనరు గచ్ఛపనిధిద్వయ మింతిపాద
వనజాతములమీఁద వ్రాలెనో యనఁగ;
గమనజాడ్యము శుభాకరమును నగుచుఁ
గమనీయలీల మీఁగాళ్ళొప్పు సతికి;
పగడంపుఁదీగెలపంక్తులో యనఁగ
మగువకు నొప్పారు మడిమెల తీరు;
తరిసేయు మదనుపుత్తళికలుఁ దమకు
నెరతనంబంచును నెరసులు వలుకు
గనకకాహళకాంతిఁ గడచి చూపరకుఁ
గనుపట్టు కాంతజంఘలు దన్యమగుచు;

కదళికాయుగళంబు కటిభార మొప్ప
నదనపుఁగరికరయమళంబు పసిఁడి
తొలచి నిలిపిన భంగిఁ దొలుకాడు రుచులఁ
గలకంఠి కొప్పారుఁ గరభోరుయుగము;100
వెడవిల్తుఁ గల్యాణవేదిక తోడఁ
దడఁబడు కొంత నితంబభారంబుఁ
గరిశిరస్పధియై కనకపుపెట్టె;
వరసైకతంబనా వలనొప్పు కటియు;
కటిసూత్రఘంటికాఘనరత్నకాంతి
పటిమతో నొప్పారు పసిఁడిదువ్వలువ;
కామునికై పుత్రకామేష్టి వెల్వ
హోమగుండముభంగి నొప్పారు నాభి;
చలదలపల్లవసంకాశమగుచు
పలుచనై కనుపట్టు భామిని కడుపు;
అలమిన ముష్టిలో నడఁగి చూపరకు
కలదు లేదను వాదుఁ గలిగించు నడుము;
ఆపూర్ణకుచవిహారాద్రులకిడిన
సోపానములభంగిఁ జూపట్టు వళులు;
హరినీలనాళంబులం దుద్భవించు
గురుహేమసరసిజకోరకద్వయము
కరణి నూఁగారుపై ఘనకుచద్వయము
కరమొప్పుఁ జూడ నా కామినీమణికి;
పసిఁడి మించుల మించు పణఁతి కక్షములు;
బిసవల్లి కలయోజ బెరయు చేఁదోయి;110
కెందమ్మిరేకుల గెలిచి కెంపొదవు

నందమై లేమకు నరచేతు లమరు;
విద్రుమలతలతో నీడు దోఁగాడు
విద్రుమద్యుతి చేతివేళ్లు పెంపొదవు;
కలువరేకుల మించుఁ గరనఖద్యుతులు;
పొలుచు శంఖముభంగిఁ బొలఁతికంఠంబు
జలజంబుఁ దెలివియుఁ జంద్రకాంతియును
జలజాస్య నెమ్మోము సరిసేయరాదు;
చెలువారు పగడంపుజిగురకొ! బింబ
ఫలమకొ! యననొప్పు బామ కెమ్మోవి;
వెలఁది వెన్నెలనీట వెలసిన కుంజ
కళికెలో యననొప్పు కాంతపల్వరుస;
దరహాసచంద్రిక ధళధళ వెలుఁగు
కరిదంతరుచి మించు గండపాలికలు;
పొలుపైన పసిఁడితిలపుష్పమో యనఁగ
నలినాక్షి కొప్పొరు నాసాపుటంబు;
చారు శ్రీవర్ణంబు సరినచ్చులొత్తి
చేరినయట్లొప్పుఁ జెవులు రుక్మిణికి;
కందర్పుఁ డింపుగాఁ గదల నిర్గమము
ముందట విల్లునమ్ములు నిడెననఁగఁ120
దరలాక్షి నెమ్మోము తామరమీఁద
గరవంకబొమలతోఁ గనుదోయి వొలుచు;
శశి యింతినెమ్మోము సవతుగాలేక
యసలార సగమైన యట్లొప్పు నొసలు;
వదనాంబుజాతంబు వాసనగ్రోలఁ
గదియు తేంటులభంగిఁ గాన్పించు గురులు;

తొయ్యలిమోము చందురువెంటఁ దగులు
నయ్యహిభంగిఁ జెన్నగు నీలవేణి;
భావజన్ముని నెత్త పలకచందమున
నావామలోచనకసలారె వెన్ను;
కటకనూపురహారకంకణరత్న
పటలరోచుల దిశాభాగంబుఁ గప్పు
గరిరాజుగమనంబుగతి రాజతనయ
యరు డెంచే గౌరినిజాలయంబునకు
ఈభంగి సౌభాగ్య మెసఁగ నేతెంచి

రుక్మిణి కృష్ణుని బతినిగాఁ జేయుమని గౌరిని బ్రార్థించుట


యాభామినీమణి యంబిక కెఱఁగి
ఘనసారమృగమదగంధమాల్యములు
కనకపుష్పంబుల ఘనధూపదీప
నైవేద్యతాంబూలనవ్యోపచార
భావార్చనల సేసి ప్రణుతించి మ్రొక్కి,130
“అంబిక! గౌరి! లోకాంబ! కల్యాణి!
అంబుజాసనవంద్య! ఆత్మసంచారి!
శంకరుమేనిలో సాబాలుఁగొన్న
శంకరి! పావకశశిభానునయన!
ఈ లగ్న మెడరుగానీక శ్రీవిభుని
వాలాయమున నాకు వరునిఁ గావింపు”
మని ప్రదక్షిణపూర్వమై భక్తి విప్ర
వనితలకును బెక్కువాయనా లిచ్చి
కంకణఝణఝణత్కారంబు లెసఁగ

నంకించి వెసఁబాడియాడి కీర్తించి
కన్నుల మెఱుఁగు లక్కజముగా నిగుడఁ
గ్రన్ననఁ జండికాగారంబు వెడలి

చండికాగారము వదలి వచ్చుచు కృష్ణునిఁ గానక రుక్మిణి కలఁగుట


జలజాక్షురామికిఁ జంచలంబందుఁ
దలపోయు, మార్గంబుఁ దప్పక చూచు
“నావల శుభలగ్న మాసన్నమాయె
నావిష్ణుఁ డేలకో యరుదేరతడసె!
ఆవిప్రవరునితో నాడినమాట
నేవిధంబున తప్పఁడేలకో! ఇంక
నింతట హరి రాక యెడసేసెనేని
కంతుని పూనిక కడతేరకున్నె!"140
అని విచారింపుచో నాసీరితోనఁ
జనుదెంచి విమలభీషణవృత్తిఁ దోఁప
గరుడకేతనకాంతి గగనంబు గప్ప
నరదంబుపైఁ గృష్ణుఁ డడ్డంబు వచ్చి
కనియెఁ గోమలి నీలకచఁ గంబుకంఠిఁ
దనుమధ్య నుత్ఫుల్ల తామరసాక్షి
నారూఢయవ్వన నమృతాంశుముఖిని
హారకంకణనూపురాలంకృతాంగి
నాదిమలక్ష్మిఁ గన్యాశిరోమణిని
వైదర్భిఁ గని యదువరుఁ డుత్సహించె.

శ్రీకృష్ణుఁడు రుక్మిణిని దనరథముపై నెక్కించుకొని చనుట


ఆకన్యయును బ్రేమ నంబుజోదరుని
రాకాశశాంకవిరాజితవదను
మకరకుండలకర్ణమాణిక్యరుచిర
వికచగండస్థలు విభవేంద్రవంద్యుఁ
నారూఢయవ్వను నతులసౌభాగ్యు
నారాయణుని హరి న్నళినాక్షిఁ గాంచి
సిగ్గును భయమును జిడిముడిపాటు
నగ్గలింపఁగ నిల్చె నంబుజనయన;
ఆలోనఁ గృష్ణుఁడు నవ్వాలుగంటి
నాలింగనము సేసి యర్మిలి నెత్తి150
కొనిపోయి రథముపైఁ గూర్చుండఁ బెట్టి
యనునయోక్తులఁ చేర్చి యంగంబు నిమిరి
దారకుఁ జూచి "రథము వేగ పఱవు
ద్వారకాపురిక" ని దైత్యారి కదలె.

పౌండ్రకాదులు శ్రీకృష్ణునిఁ దాఁకుట


ఆసమయంబున హరి భీష్మతనయ
నాసురంబునఁ గొంచు నరుగుటనెల్ల
విని చైద్యమాగధవిభు లాగ్రహమునఁ
జనిరంతఁ బౌండ్రకసాల్వవైదర్భు
“లెక్కడికృష్ణుడు? ఎక్కడి రాముఁ
డుక్కడంచెద”మని యరువడిఁగదలి

చటులఘోటకకరిస్యందనవీర
భటపాదహతుల భూభాగంబు వగులఁ
బేర్చినయలుకలఁ బృథులరావముల
నార్చుచు దాటిరా యాదవోత్తములఁ
గవిసియుఁ గార్చిచ్చుగతిఁ బెచ్చు పెఱిగి
యవిరళంబుగ వెంటనంటఁ దాఁకుటయు
నాయడ బలభద్రుఁ డనుజన్ముఁ జూచి
“యీయింతయును నీవు యిందుండ నేల?
కొని వేగ మరుగు మీకూటపమూఁక
నణఁచి యేనునుఁగూడ నరుదెంతు" ననుచుఁ160

బలరాముఁడు యుద్ధము చేయుట


గమలాక్షు ననిచి యక్కామపాలుండు
సమరసన్నుద్ధుఁడై చతురత నిలిచి
యాదవనికరంబు యత్యుగ్రసింహ
నాదంబుతోఁ దూర్యనాదంబు లొలియఁ
దలకొని యొండొంటిఁ దార్కొని మంట
లొలుక కైదువల సముద్ధతిఁ జూపి
యరదంబు నరదంబు నశ్వ మశ్వంబు
కరిఁ గరి కాల్వురుఁ గాల్వురుఁ దొడరి
యీరసంబున ముట్టి యిరువాఁగు గిట్టి
పోరాడ సురుల కద్భుతముగా నిగుడి
విలుకాండ్లు గవిసి దోర్వీర్యయంబు మెఱసి
పలునారసములు నిర్భరముగా నేయ
నలువురు నేవుర నలినుచ్చిపారఁ

దలలొక్క పెట్టు భూతలముల రాల్చి
రథములఁ జెక్కి సారథుల నుక్కడఁచి
రథరథ్యనివహంబు రణభూమిఁ గూల్చి
కరులఁ జెండాడి పుష్కరములఁ దునిమి
హరుల విదారించి యాశ్వికోత్తములఁ170
బ్రాణంబు లెడలించి బాణాసనములఁ
దూణీరములఁ ద్రుంచి దొరల గీటణఁచి,
వారు వీరన కెల్లవారికాయములఁ
దోరంపురుధిరంబుఁ దోఁగించిరంత;
దొంకెనపోటులు దూరఁగానాటి
బింకంబు లెడలక బెరయు వీరులును
గోరీ పెక్కండ్రను గుదులుగాఁ గ్రుచ్చి
పేరు వాడునట్టి బిరుదులువారు;
తల త్రెవ్విపడియు ముందఱఁ దమ్ముఁబొడుచు
బలియులనొప్పించి పడియెడువారు;
శిరములు వగిలినఁజిందెలఁగట్టి
సరకు సేయకఁ బోరుసల్పు లావరులు;
దొఱసిన వేటాడితునుకలుగాఁగ
యఱిముఱిఁ దెగవ్రేసి యార్చురాహుతులు;
సామజంబులనడుము సరిగ్రుచ్చిపారఁ
దోమరంబుల వ్రేసి త్రుళ్లు మావుతులు;
లవణిసారించి పల్లమును గుఱ్ఱమును
రవుతును జిదియ భోరన మ్రోచువారు;
ఱోలుచు నెత్తురుఱొంపిలో మునిఁగి
కాలార్పనేరని కరితురంగములు;180

దారగండులు వడి ధరణిపై వ్రాలు
తేరులు వెసనోళ్లుఁ దెఱచు పీనుగలుఁ
జదిసిన కండలు జదుపంబులైన
మెదడు మిడమిడమని మిడుకు బొమ్మలును
నవ్వెడి మోములు నలినంగకములు
విఱిగినవిండ్లును విటతాటమైన
వుఱియలతో నొప్పు బోమిడికంబులును;
కరవాలకంకణకలితమై పడిన
కరములుఁ తుమురైన కాండకుంతములు;
పఱియలై కూలిన పలకలు నాజిఁ
దఱచుగాఁ దెగిపడ్డ ధవళచామరలు;
నాడాడకుఁజింపులై దూర మెడలి
చూడనక్కజమైన జోడుపక్కెరలు;
నెత్తురు నెఱచియు నెరి బొట్టకోలఁ
గుత్తుకబంటిగాఁ గ్రోలు భూతములుఁ;
గొడపంపుఁగంకాళి ఘోరనాదముల
వెడయాట లాడెడు వేతాళములును;
వలనొప్పు భూతేశువక్షంబు వోలె
లలితకపాలమాలాయుక్తమగుచు190
సమధికదానఢ్య సరసంబెవోలె
కమనీయమార్గణఘనఘోష మగుచుఁ
గలగొన వైశాఖకాలంబె వోలె
నలినొప్పు బాణాసనధ్వస్తమగుచు
విహితమహారణ్యవిభవంబె వోలె
బహుఖగనాగసంప్రస్థితంబగుచు

సరభసనైదాఘసమయంబె వోలె
సురుచిరవాహినీశోణితం బగుచు
మహనీయవారాసిమధ్యంబె వోలె
సహజబాడబఘోషసౌరభ్య మగుచు
నలమి బీభత్సభయానకరౌద్ర
కలితమై యొప్పారి కలనొప్పెఁజూడ;
దట్టించెనంత యాదవసేనఁ దఱచు
నెట్టన నాచైద్యనృపుసేన విరిగె.
మగధసేనలుఁ గూలె మడసె వైదర్భ
జగతీశుసైన్యంబు సాల్వుఁడు విఱిగె

శిశుపాలుఁడు క్రోధముతో హరిపైఁ గవయుట


అంత నాశిశుపాలుఁ డందఱఁ జూచి
యెంతయు దర్పించి యెలుఁగెత్తిపలికె.
“కడుఁ గ్రొవ్వి గొల్లలుఁగానక నన్ను
దొడరి నే నున్నచోఁ దొయ్యలి నెత్తి200
కొనిపోయి రిద్దఱు కూల్చెద నొండె
చనియాజి వారిచేఁ జచ్చెద నొండె
యిట్టిజీవమునొంది యింటికిఁబోవ
నెట్లోర్తు? నాశౌర్య మెన్నటికింక?"
అనిపల్కి పేర్చి తానటు సేనఁ దాఁకి
వనసమూహము నేర్చు వహ్నిచందమున
దర మిడి పటురథదంతియశ్వములఁ
బొరిమార్పఁ దద్బలంబులు పెల్లగిల్లె.
బలము వీఁగుటఁ జూచి బలభద్రుఁడంత

హలముసలోగ్రబాహార్గళుఁడగుచు
యరదంబు డిగివచ్చి యాసాల్వతేయు
నరదంబు నుగ్గుగా నడిచిన నతఁడు
గదపుచ్చుకొనిఁ సీరిఁ గదియ నాలోన
నదలించి మాగధుఁ డడ్డంబు దాఁకి
శరపరంపర లేయ, జడిసి మాగధుని
హరులను సారథి నవలీలఁ గూల్చె,
తేరిపై నురికి యుద్వృత్తిఁ గంఠమున
సీరంబుఁ దగిలించి చెచ్చెరఁ దిగిచి
రోఁకట నడపఁగ రుధిరంబుఁ గ్రక్కి
వీఁకరి మాగధవిభుఁడు మూర్ఛిల్లె;210
నక్కజంబుగ వాని నరదంబు మీఁద
నెక్కించుకొని సాల్వుఁ డేఁగె నాలోన
నతనితోడనె యఖిలసైన్యములు
నాతురఁబడి గుండెలవియంగ బఱచె.

రుక్మి కృష్ణుని తూలనాడుచుఁ గవియుట


అంతకుమును విదర్భాధీశతనయుఁ
డంతకసముఁడు క్రోధాత్ముఁడై రుక్మి
తనసేనతోడ ముందఱ నేఁగి కృష్ణు
గనుఁగొని భీషణోగ్రస్ఫూర్తిఁ బలికె.
“ఓరి! గోపాధమ! ఓడక నన్ను
జీరికిఁగొనక నా చెలియలిఁ బట్టి
కొనిపోయెదికఁ నెందుఁ గొనిపోయె దీవు?
నిను నాశరంబుల నీరుఁ గావింతు;"

నని గుణధ్వని సేసి యాఱుబాణములుఁ
దనువుఁ గీలింప దానవాంతకుఁడు
నల్లన నవ్వుచు నతనికేతనము
విల్లునుద్రుంచిన వేరొక్క ధనువుఁ
గొని బాణవర్షంబుఁ గురియఁగ శౌరి
కనిసి తేజుల సూతుఁ గీటణఁగించి
దనువుఁ ద్రుంచుటయు, నాతఁడు వమ్మువోక
ఘనమైన ఖేటకఖడ్గంబుఁ గొనుచు220
హరితేరిపైకి రయంబునఁ గదిసి
కరవాలమున వేయఁ గమలాక్షుఁ డతని
పలుకయు వాలును బాణాష్టకమునఁ
దృణమాత్రమునఁ ద్రుంచి ధృతిమూర్చ వుచ్చి

శ్రీకృష్ణుఁడు రుక్మిని ధ్వజస్తంభమునకుఁ గట్టి తల గొరుగుట


తనపాగఁగొని ధ్వజస్తంభంబుతోడ
మెలివట్టి మెడగట్టి మిడమిడఁ జూడ
నలుకమైఁ బేర్చి పెద్దమ్మున శిరముఁ
బలుపున జుట్టును బాఱఁగ గొఱిగి
యునిచిన భేదంబు నుమ్మలికంబుఁ
బెనుపాటు గదుర నిర్విణ్ణుఁడై యున్న
యన్నను గనుగొని యడలు దీపింపఁ
గన్నుల నీరొల్క గద్గద యగుచు
మొగము వెల్వలబార ముదమున సిగ్గు
వగయుఁ దోఁపఁగ నిల్చి వైదర్భి పలికె.

రుక్మిణి తనయన్నను విడిచిపుచ్చుమని శ్రీకృష్ణునిఁ బ్రార్థించుట


“అక్కటా! ఈతఁడు నీయంతరం బెఱుఁగ
కిక్కడ నీచేత నిటుగట్టు వడియె
వెరగొప్ప నన్నుఁ దా విడిపింతు ననుచు
నరుదెంచినాఁడు నాయగ్రజుఁ డితఁడు
కలనిలోఁ బడువారిఁ గావక యిట్లు
పొలువసేతలు సేయఁ బోలునే యకట!230
నన్ను మన్నించి క్రన్నఁనఁ బ్రాణమెత్తు
మిన్ని దప్పులుఁ గాచి యతనిఁ బోవిడువు;”
మని పల్కు నంతలో నడరి సీరియును
జనుదెంచె వైదర్భి సైన్యంబు బఱచి,
హరిఁగూడుకొని సీరి యరడంబు మీఁదఁ
దురపిల్లు రుక్మి నుదురుఁ జూచి పలికె.

బలరాముఁడు రుక్మిని విడిపించుట


“తగువాఁడు వియ్యము ధరణీశసుతుఁడు
తగదిటుసేయ నితని వేగ విడువు”
మనిపల్కి బోధించి యతని విడిపించి
మనసు క్లేశము మాన్పి మరి రుక్మి ననిపి
యారామఁ దోడ్కొని యనుజుండు దాను
ద్వారవతికి నేఁగెఁ దాలకేతనుడు
పౌరు లెదుర్కొని పట్టణం బెల్లఁ
గోరిసింగారింప గురుమూహూర్తమున
రాముఁడు హరియుఁ బురప్రవేశంబుఁ

గామించి సేసిరి కడుసంతసమున.
గురులచేతను ననుజ్ఞఁ గొని శుభలగ్న
మరయించి పెండ్లికి నఖిలవస్తువులు
సమకూర్చి బాంధవ సమితి రప్పించి

శ్రీరుక్మిణీదేవి వివాహము


విమలమణిస్తంభవివిధశిల్పముల240
నెరవుగాఁ బెండ్లికి వేది దీర్పించి
పరవుగా ముత్యాలపందిలిఁ బెట్టి
ఘంటామృదంగమంగళతూర్యరవము
లింటింట మ్రోయఁగ నెల్ల వీథులను
గనకతోరణములు గలువడంబులును
గనకకుంభంబులుఁ గర మొప్ప నెత్తి
కస్తూరిచందనగంధసారాది
వస్తువిస్తరధూపవాసనలొలయ
నందలంబులును నందంద పంపించి
నందాదిగోపబాంధవుల రప్పించి
దేవతాతిథిగృహదేవతార్చనలు
గావించి రేవతీకాంతయుఁ దాను
తరమిడి యయ్యశోదయును రోహిణియు
హరిపరిణయంబున కాత్మల నలర
శతకోటికందర్పసన్నిభమూర్తి
యతులితశృంగార మంగీకరించె.
కంతుబాణంబునఁ గడిగినభంగి
కాంతమైనార్చి సింగారించి తెచ్చి

తనరారు గృహదేవతలయొద్ద నిలిపి
యనుపమంబగులగ్న మాసన్నమైన250
సాందీపనియమితసద్విజోత్తములుఁ
జెంది పుణ్యాహంబు సేయించి రంత.
ఆనకదుందుభి హలపాణియుగ్ర
సేన నందాదులుఁ జెలులుఁ జుట్టములు
వలనొప్ప విప్రభూవర వైశ్యశూద్రు
లెలమి మహోత్సవం బేపారుచుండఁ
గొమరారు నప్పసిఁడికుడుక నక్షతలు
నమరఁగఁ దలబ్రాలు నఖిలవస్తువులు
బసిఁడిపళ్ళెరముల బహుభంగిఁ బూని
రసికత మీరి పేరంటాండ్రు పాడ
నాలోన రుక్మిణి నంబుజోదరుని
బ్రాలపొంగులమీఁదఁ బరగంగ నుంచి
తెరపట్టి సౌభాగ్యదివ్యవస్తువులుఁ
గరముల నునిచి మంగళరావ మెలయ
నాయెడ ఘడియార మరసి దైవజ్ఞు
లాయతమాయత మని ప్రీతిఁ బలుక
శుభలగ్న మరుదేర సుముహూర్త మనుచు
నభినుతు లొనరించె నమరసంఘంబు;
తెరయెత్త ముఖచంద్రదీప్తులు వొలయ
యిరువురు నొండొరులీక్షించి రంత;260
హరిచూడ్కి సతిచెక్కుటద్దంబులందుఁ
గరమొప్పు పత్రరేఖలభంగి నమరె;
వనితచూపులు హరివక్షంబుమీఁదఁ

బెనుపార నీలాలపేరులట్లుండె;
సురభూరుహముమీఁద సురవల్లి నిగుడి,
విరులు రాల్చినభంగి వెలఁదొప్ప నెక్కి
పరువడిచేఁ దలఁబ్రా లొప్పబోసె;
కరమర్థి హరి కరగ్రహణంబు సేయఁ
గలితమౌ వందిమాగధరావములును
జాలువారు సద్విజాశీర్వాదములును
మంగళపాఠకమహితవాక్యములు
నింగి ముట్టగను ఘూర్ణిల్లె నంబుధులు.
అంత హోమాదికృత్యములెల్లఁ దీర్చి
సంతోషచిత్తుఁడై శౌరి పెంపొందె.
అనుపమభక్ష్యభోజ్యాన్నపానములఁ
దనిపి యందఱికిని దగకట్ట నిచ్చి
నందయశోదల నయవాక్యవస్తు
సందోహములఁ బ్రీతి సలిపి వీడ్కొలిపె;
శోభనదినములు సొంపార దీర్చి
యాభామినియుఁ దాను నంబుజోదరుఁడు270
కేళిహర్మ్యములందుఁ గృతకాద్రులందు
శైలసానువులందు సరసులయందు
వైదర్భితో రతివల్లభకేళి
నాదట సుఖలీలలందె మురారి.

ప్రద్యుమ్నుని జననము


అటనొక్క యేడాది కబల రుక్మిణికిఁ
బటుతరంబైన గర్భశ్రీవహింప

మగువకు ఘృతకశీమంతోత్సవంబు
నెగడింపఁ దొమ్మిదినెలలు నిండుటయు;
హరఫాలనయనాగ్ని నడఁగిన మరుఁడు
హరికిని రుక్మిణియందు ప్రద్యుమ్నుఁ
డనుపేర హరి యవతారభేదమున
జనియించెనో యన! జన్మించె తనయుఁ
డాపుత్రుఁ గనుగొని యతిగారవముగ
నేపార సంతోష మెసంగి వర్తిల్ల;

పురిటింటిలోనుండి ప్రద్యుమ్నుని శంబరుఁ డపహరించుట


“మువ్వంటుదినమయ్యొ! ముద్దులపట్టి
నెవ్వఁడో కొనిపోయె నింటిలోనుండ!”
అని మహారోదన మటు సేయ శౌరి
విని సంభ్రమించి యవ్విధమెల్ల మున్నె
యెఱిఁగినవాఁడయ్యు నెఱుఁగనియట్లు.
వెఱఁ గంది నలుగడ వెదకంగఁ బనిచె.280
వదలకఁ దన పూర్వవైరంబుఁ దలఁచి
యదయుఁడై శంబకుండను దైత్యవరుఁడు
కొనిపోయి జలధి నక్కొమరుని వైచి
చనియె, నాశిశువు మత్స్యము మ్రింగె నంత.

సముద్రములో వేయఁబడిన బాలకుని మత్స్యమొకటి మ్రింగుట


ఆనావికులు వల నమ్మీను దిగిచి
కానుక యిచ్చినఁ గని శంబరుండు

యడబాల కొప్పింపుమని పంచె, వాఁడు
తడయక యమ్మీను దళనంబు సేయఁ
గడుపులోనున్న చక్కని కుమారకునిఁ
గడు వేడ్క నా దైత్యకాంత కొప్పించె;

మాయావతి ప్రద్యుమ్నకుమారుని మక్కువతోఁ బెంచుట


నంత మాయావతి యాపుత్రుఁ గాంచి
సంతసంబునఁ దేలి సౌమనస్యమున
నాపుత్రు శుభరేఖ లంతరంగమున
నాపోకఁ గనుఁగొను నందంద పొక్కు
నక్కున నిడు మద్దులాడుఁ చన్నిచ్చు
జిక్క కౌఁగిటఁ జేర్చు చేష్టలు మఱచు
నీరీతిఁ బెంచగా నెలమి కందర్పు
డారూఢయవ్వనుఁడై చూడ నొప్పె;
ఆలోలమదనుని యాకారసరసి
నాలోలనయన మాయావతి మునిగి290

మాయావతి ఆరూఢయౌవనుఁడగు ప్రద్యుమ్నుని గాంచి మోహించుట


రతి కాససేసి గౌరవము వోనాడి
చతురత గతులను సరసభావమున
నాపడఁతి యొకనాఁ డతిరహస్యమున
పై పడి పట్టిన భావజుం డలిగి
“కటకటా! ఈపని గర్హణంబనక
నిటు సేయఁదగునమ్మ! ఇందీవరాక్షి!
తల్లివి నీవు నీతనయుఁడ నేను

చెల్లునే పాపంబు సేయంగ నీకు?
ఎక్కడ వినఁజూడ మిట్టి దుర్నీతి
నెక్కడగలిగె! నీ వెవ్వతవ”నుండు;
హరికి రుక్మిణికిని యవతరించుటయు
నెఱిఁగి శంబరుఁడు తానిందుఁ దెచ్చుటయు
జేరిన చందంబుఁ జెప్పె, వెండియును
నారామ భావజు నల్లన పలికె.
“రతి నేను నా పుష్పరతుఁడవు నీవు
ప్రతిలేని యాదిదంపతులము గాన
వీండొక గతిగాదు వీని నిర్జించి
దండిమై మనము వోదము ద్వారవతికి.
ఇతఁడు మాయావిధం బెఱుఁగు నీతనికి
బ్రతిలేని విద్య లభ్యాసంబు సేయు;”300
మనుచు మాయావతి యమ్మహావిద్య
మనసిజునకు నిచ్చె మంత్రయుక్తముగ
ప్రద్యుమ్నుఁ డంత నాపడఁతిచేఁ బెక్కు
విద్యలు నేర్చి యా వెలఁదియుఁ దాను
ధ్రుతిఁబూని వర్తింపఁ దెలిసి శంబరుఁడు

శంబరప్రద్యుమ్నుల యుద్ధము


నతి వేగమునను మహాగ్రహం బొదవ
మదనునిఁ దెగటార్ప మది విచారించి
గదఁగొని లయకాలకాలుఁడో యనఁగఁ
బఱతెంచి వైచిన భావజుం డలిగి
యుఱక యాతనివక్ష మురుముష్టిఁ బొడిచె;

వాఁడు మహాశక్తి వైచిన మరుఁడు
పొడిగాగ నది ద్రుంచెఁ బుడకచండమున.
అప్పుడయ్యసుర మహాబలం బొదవ
నుప్పరం బెగసి పై నురగమై పడిన
గరుడుఁడై యాపాము ఖండించె మరుఁడు ;
తిరుగక దనుజుఁడు ధీరుఁడై పేర్చి
వనదమైఁ పాషాణవరుషంబుఁ గురియ
ననిలుఁడై విరియించె, నద్రియై పడిన
కులిశమై దునుమాడె, కొంకక వాఁడు
కలుషించి కేల ఖడ్గము నెత్తుకొనుచు310
బలువిడిఁ గవిసిన భావసంభవుఁడు
తలఁ ద్రెవ్వనేసె నుద్ధతకోపుఁ డగుచు,
దేవసంఘము లార్చె దివిఁ బుష్పవర్ష
మావిష్ణుతనయుపై నందంద కురిసె.

ప్రద్యుమ్నుఁడు సతితోఁగూడ ద్వారవతికి వచ్చుట


అసుర నీగతిఁ దెగటార్చి, వానింటి
వసురత్నభూషణావళులెల్లఁ గొనుచు
నంతరిక్షంబున నాద్వారవతికి
గాంతాసమేతుఁడై కంతుఁ డేతెంచె.
అంతట బురజనులందఱుఁ జూడ
నతంత శౌరి గృహంబున నిలువ
వైదర్భి దగ్గఱవచ్చి యీక్షించి
యాదవాన్వయజాతు నాజానుబాహు
నీలనీలాంగు నున్నిద్రాంబుజాక్షు

బాలభానుప్రభాప్రతిమానవస్తు
హారకుండలకిరీటాకల్పకలితు
నారాయణాత్మజు నారీసమేతుఁ
గనుఁగొని కృష్ణుగానోపు ననుచు
ననుమానమును బొంది యా కాంత పలికె.
“సుందరాంగుండేరి సుతుఁడకో! ఈ తం
డెందుండి వచ్చెనో! ఎవ్వడో! ఇతని320
నేయమ కనియనో! ఈ కుమారకుని
యేయింతినోచెనో! ఇతని కౌఁగిటికి!”
అనిపల్కి తనకన్న యర్భకుఁ దలఁచి
స్తనములుఁ జేప బాష్పములుబ్బి నేలఁ
జింద "నేఁ గాంచిన శిశువు ప్రాణంబు
లిందాక నుండిన నింతె కాకున్నె!”
హరియెడ నాతని యంగంబు సొబగు
మెరమెరఁదోఁప నర్మిలిపేర్మిమాన
దన వసుదేవుఁడు హరియును బలుఁడు
జనుదేర దేవకీసతులును దాను
మారుని యాకార మహిమ వీక్షింప;
నారదుండేతెంచి నలినాక్షుఁ గాంచి
యెసఁగ బాలుని పురిటింటిలోనుండి
యసుర యెత్తుకఁబోయినది యాదిగాఁగ
చెప్పి నీపుత్రుఁడు చిత్తజుండీతఁ
డిప్పొలంతుక కోడలిది రతిదేవి
యని చెప్పి నారదుండరుగ నందఱును
మనముల సంతోషమగ్నులైరంత.

కడువేడ్క రుక్మిణి కదియంగ వచ్చి
కొడుకుఁ గోడలి నెత్తుకొని కౌఁగిలించి330
వసుదేవదేవకీవనజాక్షహలుల
కెసలార మ్రొక్కించి యింపులఁ బొదలె.
పురిఁటిలోఁ జెయిదప్పి పోయిన కొడుకు
మరలి యిన్నేండ్లకు మగువయుఁ దాను
నేతెంచె హరిభాగ్య మెట్టిదో! అనఁగఁ
జాతుర్య సుఖలీల సలిపె మురారి.

సత్రాజిత్తుని వృత్తాంతము


అంత సత్రాజిత్తుఁడను రాజవృషభుఁ
డెంతయు భయమంది యిందిరావిభుని
కాస్యమంతకముతో నమృతాంశుమండ
లాస్యక నిచ్చెదమని చెప్పుటయును
వెఱఁగొంది యారాజు వెన్నునికేల
వెఱచి యమ్మణితోన వెలఁది నెట్లిచ్చె
నాకథఁ జెప్పవేయని వేఁడ శుకుండు
ప్రాకటంబుగఁ గురుప్రవరుతో ననియె.
అనఘ! సత్రాజిత్తుఁడను ధరాధీశుఁ
డినుగూర్చి తపమాచరింప సౌతనికి
మెచ్చి వరంబిచ్చె మిహిరుండు వేఁడ
నిచ్చె స్యమంతాఖ్య నెసఁగు రత్నంబు
నామణి వక్షంబునందొప్పఁ దాల్చి
తామరసాప్తుఁ డితండకో! యనఁగ340
ధరణి యేలుచునుండి ద్వారకాపురికి

నరుదెంచి యొకనాఁడు హరిఁజూచు వేడ్క
సరసిజసఖుఁ డేల చనుదెంచె! ననుచుఁ
బురము వారెల్ల నద్భుతమంది చూడ
శౌరిగేహమునకుఁ జనుదేర, కృష్ణుఁ
డారాజు మన్నించి యర్థిఁ బూజించి
యొక కొన్నినెల లుండి యొక్కనాఁ డతని

శ్రీకృష్ణుఁడు సత్రాజిత్తుని స్యమంతకమణిని యాచించుట


నకుటిలచిత్తుఁడై యబ్జాక్షుఁ డనియె;
“ఈ రత్న మిమ్ము నీ కేవస్తువైనఁ
గోర నీ కిచ్చెదఁ గొనుమన్న" నృపతి
“కనకంపుమాడలుఁ గడఁగి యిచ్చలును
నెనిమిది బారువులిచ్చు నీరత్న
మెవ్వరిచే నున్న [2]నీతిబాధలును,
జివ్వయు [3]దురితముల్ చెందవు నరుల
నినదత్తమీరత్న మీనోప” ననుచు
ధనలోభమున బల్కెఁ దగువాఁడు దన్ను
నడిగిన వస్తువు లడఁచి యీనేర
కడలిన దుఃఖార్తులగుటెందు నరుదె!

సత్రాజిత్తు ప్రసేనునకు మణినిచ్చుటయు, వాఁడు వేటకుఁ బోవుటయు


వనజాక్షునకు నీక వంచించి రత్న
మనుజునికిచ్చిన నాప్రసేనుండు350

నామణి ధరియించి యశ్వంబు నెక్కి
కామించి యడవి కొక్కఁడు వేఁట వెడలి
మృగముల నొంప నమ్మేదినీవరుని
మృగరాజు చంపి యామిషశంక నతని
మెడనున్న రత్న మర్మిలిఁ గొంచు కొండ
పడలోని కరుగంగ భల్లూకవిభుఁడు
యా కేసరినిఁ ద్రుంచి యామణిఁ గొంచుఁ
బ్రాకటంబుగ మహాభవనంబు సొచ్చె.
అంత సత్రాజిత్తుఁ డనుజుఁడు రామి
కెంతయుఁ జింతించి యిచ్చలో వగచె.

సత్రాజిత్తు శ్రీకృష్ణుడు మణి నపహరించెనని సందేహించుట


“కటకటా! అడవి కొక్కరుఁడునుఁ బోయెఁ
గుటిలత నెవ్వరు కూల్చిరోగాక!
తనకు నమ్మణి యీని తప్పున శౌరి
మనప్రసేనుఁ బట్టి మడియింపఁబోలు!
అతఁడేల లోబడు నన్యులచేత?
ఇతరులీసాహసం బేల కావింత్రు?
అడిగిన యీ నేరకనుజన్ముఁ గోలు
పడితినక్కట!" అని పలవింపుచుండ
విని పౌరులెల్లను విష్ణుని దలఁచి
యనుమానపడుచుండ నామాట లెఱిఁగి360
యపరిమితజ్ఞాని యగు శౌరి యట్టి
యపకీర్తి నెబ్భంగి నడఁగింతు ననుచు

నడవికిఁ దను బౌరులందఱుఁ గొలువఁ

శ్రీకృష్ణు డపవాదమును సహింపక మణిని వెతుకుటకై యడవికిఁ బోవుట


గడువేగ నరిగి సింగముచేతఁ బడిన
హయముఁ బ్రసేనుని యచ్చోట గాంచి
రయమున సింహనిర్గమనమార్గమునఁ
జని ఋక్షవిభుచేతఁ జచ్చినసింహ
మునుగాంచి పురజనంబుల కెల్లఁ జూపి
యాగుహవాకిట నందంఱ నునిచి
వేగమే కృష్ణుఁడా వివరంబు సొచ్చి

శ్రీకృష్ణజాంబవంతుల సమావేశము


చనె; జాంబవంతుని సదనంబు నందుఁ
దనరారు సఖి నునుతల్పంబు మీఁదఁ
దనయ నందిడి దాది దానికి రత్న
మనునయంబునఁ జూపి యాడింప, కృష్ణుఁ
డరుదేరఁ బొడగాంచి యదరి యేడ్చుటయుఁ
బరుషత భల్లూకపతి యేఁగుదెంచి

శ్రీకృష్ణజాంబవంతుల యుద్ధము


యట్టహాసము సేసి హరిఁగిట్టి ముష్టి
ఘట్టనంబులఁ బాదఘాతల నొంపఁ
గడఁగి మాధవుఁడు నిర్ఘాతంబు వోని
పిడికిటఁ బొడిచిన బెదరక జాంబ370

వంతుఁడు మురవైరివక్షంబుఁ బొడువ
నంతకాకారుఁడై హరి వానిఁ దాఁకె.
ఇరువురు నీరీతి నిరువదిదినము
లురువడి పోరాడి యొగి కైటభారి
భల్లూకపతిగుండెఁ బగులంగఁ బొడువ
నొల్లనొల్లన వోయి యురుమూర్ఛఁ దెలిసి
యేయుగంబులయందు నీరీతిఁ దొడరి
పాయకిర్వదినాళ్లు బవరంబు సేయ
నెవ్వీరునకుఁ జెల్లు నతఁడెంత సేసె
నెవ్వరొకో! అని యిచ్చలోఁ దలఁచి
యంబుజోదరు నట నాత్మలోఁ దెలిసి
జాంబవంతుఁడు భక్తి సాష్టాంగ మెఱఁగి
చేతులు మొగిడించి శిరసునఁ దాల్చి.
యాతతప్రీతి నిట్లని సన్నుతించె.
“దేవ! జగన్నాథ! దేవేంద్రవంద్య!
గోవింద! కృష్ణ! ముకుంద! సర్వేశ!
నీవాదిమూర్తివి నిగమార్థవిదులు
భావించి కనియెడి పరమాత్మవీవ!
పొరిపొరి బ్రహ్మవై పుట్టింతు జగము!
హరిమూర్తివై నీవె యనిశంబు బ్రోతు!380
హరుఁడవై యడగింతు వఖిలభూతములఁ
బరమాత్మ! నీలీలఁ బ్రణుతింప వశమె?
దశరథాత్మజుఁడవై ధరణిఁ బాలించి
దశకంఠు గెలిచి సీతాదేవిఁ దెచ్చు
శ్రీరాముఁడవు నిన్నుఁ జింతింప మఱచి

వైరంబు గొని పోరి వంచితు నైతి
నాతప్పు సైరించి నన్ను మన్నించు
నీ తత్వ మెఱుఁగంగ నేర్తునే” యనిన
“నాతోడ నిరువదినాళ్లు పోరాడ
భూతేశునకు నైనఁ బోలునే యందుఁ
బెద్దవు నీవు నాపిడికిళ్లు దాఁకి

శ్రీకృష్ణుఁడు జాంబవతీకన్యను బరిగ్రహించుట


తద్దయు నొచ్చె నీ తను"వంచుఁ బలు క
[4]సరసిజోదరుఁడు ఋక్షపున కిట్లనియె.
“ధరణిపై నీస్యమంతక నిమిత్తమునఁ
బరపైన యపకీర్తి పాటిల్లె మాకు;
నేపార నీరత్న మిచ్చి సంప్రీతి
వేపంపు” మనుటయు విని భల్లుఱేఁడు
నామణి నర్పించి యాత్మసంజాత
వామలోచన జాంబవతినిచ్చి హరికిఁ
బ్రణమిల్లి “ఈకన్యఁ బత్నిగా నేలు
ప్రణవాత్మ!" అనిపల్క, పద్మాక్షుఁ డతని
మన్నించి కన్యకామణితోడ మణి
గ్రన్ననఁ గైకొని కదలి యేతెంచె.390

బిలద్వారమందుండిన పౌరులు పురమును జేరి శ్రీకృష్ణుఁడు మడిసెనని చెప్పుట


చెన్నార వెన్నుని సేవించి వచ్చి

మున్ను బిలద్వారమున నున్న పౌరు
లాకంజలోచనుఁ డాపెడ నడఁగి
రాకున్న బెగడి పురంబున కరిగి
యావార్త నెఱిఁగింప నఖిలబాంధవులు
దేవకియును వసుదేవుఁడుఁ గలఁగి
దేవతాగణముల ద్విజలోకతృప్తిఁ
గావించిరంత; నామలలోచనుఁడు
ద్వారకాపురి సొచ్చి తగ నుగ్రసేను
నారూఢగతిఁ గాంచి యందఱుఁ జూడఁ
బ్రీతి సత్రాజిత్తుఁ బిలిచి ప్రసేనుఁ
డాతల వని మృతుఁడైన చందంబు
మరి జాంబవంతుఁడు మణి హరించుటయు
సరయ నాతఁడు కయ్యమాడిన తెఱఁగు
నచ్చుగా నెఱిఁగించి యతని కారత్న
మిచ్చి మనోవ్వధ నెడలె మురారి.400
ఉత్తములగు వారికొక నింద వొడమ
నుత్తలపడి తీర్ప కోర్తురే నిలువ!
అంత సత్రాజిత్తుఁ డమ్మణి దాన
వాంతకుచేఁ గొని యంతరంగమున
సిగ్గును దుఃఖంబుఁ జిడిముడిపాటు
నగ్గలంబొదవ నిట్లని విచారించె.
“అక్కటా! శ్రీనాథు నఖిలలోకేశు
నెక్కటి నిందించి నృపకోటిలోనఁ
బాపంబు సేసితిఁ బద్మాక్షుచిత్త
మేపాటి నొచ్చెనో యేమిగాఁగలదొ?

హరిమానసము రోషమడఁగెడు నట్టి
వెర వేదియో యని విన్నపాటు నొంది

సత్రాజిత్తు సత్యభామను శ్రీకృష్ణునకు భార్యగా నర్పించుట


తనకూఁతు సత్య నుత్తమగుణాభరణఁ
దనరార గైసేసి తనవారుఁ దాను
మణితోడఁ గామినీమణి నొప్ప నిచ్చి
యణిమాదిగుణపూర్ణుఁడగు హరి కనియె.
“పరమేశ! నాకూర్మిపట్టి యీకన్యఁ
బరిణయంబై రవిప్రభ నొప్పుమణియు
ధరియింపు” మన్న మాధవుఁడా నరేంద్రుఁ
గరుణించి నెమ్మోముఁ గనుఁగొని పలికె.410
“అరులు మిత్రులు నాకు నరయంగ లేరు
పరమాప్తుఁడవు మాకుఁ బావనచరిత!
ఈనాతి నిమ్ము నాకిమ్మహారత్న
మేనొల్ల నే నీకు నిచ్చితి” ననుచు
నాతని కర్పించి యాసత్యభామఁ
బ్రీతిని బెండ్లాడె పీతాంబరుండు,
సత్యభామయుఁ దాను సంప్రీతితోడ
నత్యుదాత్తసుఖంబు లందె మురారి.

శ్రీకృష్ణబలభద్రులు కరిపురంబునకు వెడలుట


ఆలోనఁ బాండవులట లక్కయింటఁ
గాలి చచ్చుట విని కాలక నుంట

దెలిసినవాఁడయ్యుఁ దెలియని యట్లు
బలభద్రుఁడును దాను బయనమై కదలి
కరిపురంబున కేఁగి గాంగేయ విదుర
కురుపుంగవులఁ గనుగొని పాండుసుతులఁ
దలఁచి దుఃఖించి బాంధవులును దాను
కలిసి వర్తింప; నక్కడ నొంటియైన

శతధన్వుఁడు సత్రాజిత్తుని వధించి మణిని హరించుట


యక్రూరకృతవర్మ లా కృష్ణుతోడ
వక్రుడౌ శతధన్వు వడిఁ జూచి పలికి
“రడరుచు సత్రాజతను వాఁడు నీకుఁ
గడఁగుచు యీనున్న కన్యయు హరికి420
నిచ్చె నాతని రత్న మే వెంట నై న
పుచ్చుకొమ్మ" నుటయుఁ బొరి నొక్క రాత్రి
తనయింట నున్న సత్రాజిత్తు నిద్ర
దనిసి యుండగ మెడఁ దఱిగి వధించె.
తరుణులందఱు నేడ్వఁ దనరి యామణిని
హరియించె శతధన్వుఁ డఱ యింతలేక
సత్యభామయుఁ దండ్రి చావున కడలి
యత్యంతశోకాన నతని కాయంబుఁ
దైలపక్వముఁ జేసి తగుచోట నునిచి
యా లేమ కరిపురి కరుదెంచె నంత.

శ్రీకృష్ణుఁడు శతధన్వునిఁ జంవుట


ఆమాట విని కృష్ణుఁ డబల నూరార్చి

రాముఁడుఁ దానును రథమెక్కి కదలి
తరలాక్షిఁ దోడ్కొని ద్వారకాపురికి
నరుదేర శతధన్వుఁ డాస్యమంతకము
నక్రూరునకు నిచ్చి యతిజవాశ్వంబు
విక్రమంబున నెక్క, హలియును దాను
పటురయంబున వానిపజ్జఁ దాఁకుటయుఁ
జటులత వాని యశ్వము జవం బెడలి
భరమోర్వకను బడి ప్రాణముల్ విడిచె.
తురగంబు కూలినఁ దోరంపు భీతి430
నాతఁడు కాల్నడ నరుగుటఁ జూచి
యాతతరయమున నరదంబు (ద్రోలి
ఘనచక్రధారచేఁ గంఠంబు నఱికి
తనువెల్ల నరసి రత్నముఁ గాన లేక
“శతధన్వు నూరకే చంపితి నకట!
ఇతడు మహామణి నెందుంచినాఁడొ?
అరసికొందము గాక" యని రథం బెక్కి
యరుదేర హలపాణి హరి కిట్టులనియె.

బలరాముఁడు మిథిలానగరమునకు వెళ్లుట;
అచ్చట దుర్యోధనుఁ డతనివద్ద గదాయుద్ధ మభ్యసించుట


“ఈ మిథిలాధీశుఁ డితఁడు నాసఖుఁడు
కామించి యారాజుఁ గాంచి వచ్చెదను
నీవు పొమ్మని” పల్కి నీలాంబరుండుఁ
వేవేగ మిథిలకు విచ్చేయ నతఁడు
యెదుఱేఁగి సీరికి నెంతయు వేడ్కఁ

జదురొప్ప దేవోపచారసత్క్రియలు
నతిభక్తిఁ బూజింప నతనిగేహమునఁ
జతురత నొకకొన్ని సంవత్సరములు
కలసి వర్తింప నక్కడ సుయోధనుఁడు
హలితోడఁ బటుగదాభ్యాసంబు సేసె.

అక్రూరుని వృత్తాంతము


వనజాతుఁడును ద్వారవతికి నేతెంచి
తనరారు మణి శతధన్వుని వద్దఁ440
గానక యుండుటఁ గాంతకుఁ జెప్పి
పూని సత్రాజిత్తు భూమివర్యునకుఁ
బరలౌకికంబులు భక్తిఁ జేయించె.
అరయ నారత్నంబు యక్రూరుఁ డెత్తి
కొనిపోయి వనభూమి కుశలియై యుండె.
అనఘమానసుఁ డైన యక్రూరుఁ డరుగ
నాపట్టణంబున నఖిలమంత్రులకు
దూపిల్లె భయకష్టదుష్టరోగములు.
అని చెప్పుటయు విని యక్రూరుఁ డెట్లు
ఘనపుణ్యుఁడయ్యె నక్కథఁ జెప్పుమనుఁడు;
మున్నశ్వపాలుఁడు మొగి ననావృష్టి
ఖన్నుఁడై కాశి కేఁగినఁ గాశిరాజు
హరువరంబునఁ గనె యమృతాంశువదనఁ
దరలాక్షికాందిని తన కూర్మిపుత్రి;
ఈకన్నెచే నన్ని(యీతి)బాధలును
శోకరోగాదులు సోఁకక యడఁగు;

ఆకన్యఁ బ్రీతిమై యశ్వపాలునకుఁ
జేకొని వడిఁ బెండ్లి సేసి పంపుటయు
నానాతి వరియించి యఖిలదుఃఖములు
మాని సుఖించ నమ్మనుజవల్లభుఁడు.450
ఆయింతి సుతుఁడైన యక్రూరుఁ డలిగి
పోయినకతమునఁ బుట్టె నీపాప

అక్రూరుని శ్రీకృష్ణుఁడు పిలిపించి బుద్ధులు చెప్పి మఱల వానికే మణిని ప్రసాదించుట


మనిచూచి శౌరియు నక్రూరుఁ బ్రేమఁ
బనివడి దూతలఁ బంచి రప్పించి
యతనితో నొక్కనాఁ డతిరహస్యమున
శతదళనేత్రుఁడు చతురుఁడై పలికె.
“అడరి సత్రాజిత్తు నడఁచి మాణిక్య
మురవడిఁ గొంపోవ నొగి వెంటఁ దగిలి
శతధన్వు నూరకె చంపితి గాని
యతులితంబగు రత్న మతనిచేఁ గాన
మక్కటా! శ్రీధనం బది పాడిగాదు
యిక్కువ జ్ఞాతుల కిది యహితంబు
నీయింట నతని మానిక ముండె గాన
యీయధ్వరములు నీకిటు సేయఁగల్గె
నిది నాకుఁ బ్రియమన్న" నిందిరావిభుని
పదపంకజములకుఁ బ్రణమిల్లి యతఁడు
“గోవింద! కృష్ణ! ముకుంద! మురారి!
పావనగుణపూర్ణ! పద్మాయతాక్ష!

సర్వాత్మలందును జరియించు నిన్ను
సర్వేశ! ఎఱుఁగంగఁ జనునయ్య నాకు”460
అని పల్కి హరిచేతి కక్రూరుఁ డెలమి
తనరార నాస్యమంతక మిచ్చి మ్రొక్కె
శౌరి సంతసమంది జ్ఞాతులు చూడఁ
గోరి యారత్న మక్రూరున కిచ్చె!
ఈ కథవిన్న మీ కీప్సితార్థములు
ప్రాకటంబుగ నిచ్చు భవబాధ లుడుగు
నపకీర్తు లడగించు నఘములుఁ జెఱచుఁ
గపటంబు లెడలు మంగళములు నిచ్చు"
నని చెప్పి మరియును నంబుజోదరుఁడు

శ్రీకృష్ణుఁడు ఇంద్రప్రస్థపురమునకు వెడలుట


తనరంగ నింద్రప్రస్థంబున కరిగె.
అఖలలోకారాధ్యుఁడగు విశ్వగురుఁడు
సుఖతరంబుగఁ బాండుసుతుల నీక్షించి
సుదతి గొంతికి ధర్మసుతునకు మ్రొక్కి,
కదియంగ భీమునిఁ గౌఁగిటఁ జేర్చి
నవ్వుచుఁ దనమ్రోల నమ్రులై యున్న
కవ్వడికవల నొక్కట నెత్తి ప్రేమ
నందఱి సేమంబు లడుగంగ వార
లందఱుఁ బూజింప నానందమంది
గొంతియుఁ గృష్ణు నక్కునఁ జేర్చి దుఃఖ
మంతకంతకుఁ బేర్చి యార్తిమై నేడ్వఁ470
గరపల్లవంబునఁ గన్నీరుఁ దుడిచి
నరుదండఁ దన మేనయత్త నూరార్చి

ధర్మనందను గేలు తనకేలఁ బట్టి
యర్మిలి నిగుడ నిట్లనియె నాశౌరి,

శ్రీకృష్ణుఁడు పాండవుల క్షేమవార్తల నరయుట


“అక్కటా! దుర్మదులగు శత్రుజనులు
పెక్కు పాటుల మిమ్ముఁ బెట్టంగ వినుచు
నొప్పగించిన యట్టులుంటిమి గాని
యప్పటప్పటికి మిమ్మరయంగ లేక
దైవంబుకతన నింతటి బాధలుడిగె
నేవిధంబునఁ బుణ్యులీలోకములును;”
అనవుఁడు ధర్మరాజా కృష్ణుఁ జూచి
వినయ బాంధవములు వెలయనిట్లనియె.
“అనఘాత్మ! నీ మర్మమరయక యున్న
మననేర్తుమే మేము మర్త్యులలోన?
తల్లియుఁ దండ్రియుఁ దైవంబు గురుఁడు
నెల్ల బాంధవులును నిల నీవె మాకు!
ఈ కొద్ది వాక్కేల నిహపరంబులకు
మాకెవ్వరున్నారు? మధుకైటభారి!”
అనుచు మజ్జన భోజనాది సత్కార
వినయోపచారాది విధులఁ బూజింప480
హరియుఁ బాండవులును నన్యోన్య మైత్రి
నురుతరంబుగ నుండ నొకయేఁడు చనియె.

శ్రీకృష్ణుఁడును బార్ధుఁడును వేఁటకై వెడలుట


అత్తరి నొకనాఁడు హరియుఁ బార్ధుఁడును

జిత్తాబ్జముల వేడ్క చిగురులు వొడమ
వాయు వేగములైన వాజులఁ బూని
యాయుధ పరిపూర్ణమగు రథంబెక్కి
యగణిత సారమేయావళితోడ
మృగయలాయుధ రశ్మి మెఱసి తో నడువఁ
గాకోల భీకర కాకోదరంబుఁ
గాక ఝిల్లికము భీకర రావకులము
నపరిమితాభీల హర్యక్ష కులము
కుపిత కోలాంగూల కోలాహలంబు
కరితుండ ఖండిత ఘన పిప్పలంబు
వర తపః పరికీర్ణ పల్లవ స్థలము
ప్రకటిత కుంజర వ్రాత కంటకము
వికృత భల్లవ్యాఘ్ర వృక సమూహంబు
నగు మహారణ్యంబు నందంద చొచ్చి
మృగయానురక్తులై మెలఁగి యాలోన
వలలొగ్గి తెరలొత్తి వర భటోత్తములు
బలిసి కొమ్ములనుండి పదిలమైనూఁద490
పరఁగఁ గిటివ్యాఘ్ర భల్లసారంగ
కరి సింహ శరభ ఖడ్గకలులాయములు
గండభేరుండాది ఘనమృగాదులును
దండిమైఁ బరవర్వెఁ ,దగిలి యేయుచును
గుక్కల విడుచుచుఁ గోరి పెన్వలలు
నెక్కొనఁ జుట్టియు నిబిడాస్త్రసమితిఁ
బొలియించియును మృగంబులఁ గీటణించి
యలసి కృష్ణార్జునులర్కకన్యకకుఁ

జనుదెంచి శీతలజలమాని తీర
మునఁ దరుచ్ఛాయ నిమ్ముల విశ్రమింప

కాళిందీపరిణయము


రక్తాబ్జపదతలరాజీవ వదన
మౌక్తిక మణిదంత ఘనమాననయన
పులిననితంబ కంబుపమానకంఠ
యావర్తనాభ రథాంగ వక్షోజ
శైవాలరోమసంచయ బిసపాణి
యననొప్పు కాళిందియను వరారోహ
చనుదెంచి కృష్ణుని సన్నిధి నిలువ;
వనిత సౌభాగ్య లావణ్య చాతుర్య
మనిమిషనేత్రుఁడై హరి చూచెనంత,500
నరుఁడింతిఁ గనుఁగొని “నలినాక్షి! ఏఁటి
కరుదెంచితీ వెవ్వె”రని పల్కుటయును,
మురిపెంపు సిగ్గును మోమున బెరయఁ
దరలాక్షరోచులు దనర నిట్లనియె.
“కాలాత్ముఁడగు సూర్య కన్యక నేను
కాళింది యనుదానఁగమలాక్షుఁగూర్చి
తపమాచరింతు నీ తటమున, వేఁట
నెపముననేతెంచు నీరజోదరుని
కామించి వచ్చిన కార్యమం”చనిన;
ఆమెను మన్నించి హరి తోడుకొనుచు
కరిపురి కేతెంచి కాళింది కన్యఁ
బరిణియంబై యొప్పెఁ బద్మలోచనుఁడు.

అర్జును రథసూతుఁడై తోడువచ్చి
నిర్జరాధిపునాజ్ఞ నెదరి ఖాండవము
హుతవాహనునికి నాహుతిగా నొనర్చి
యతనిచే గాండీవమనుపేరి ధనువుఁ
దఱుగని యమ్ములుఁ దరుచర ధ్వజము
వఱలెడు రథమును వాజులుఁదెచ్చి
నరునకు నిచ్చె; నానరు చేత మయుఁడు
దరికొను ఖాండవ దహనంబుఁ బాసి510
బ్రదికి సభామంటపంబును గట్టి
గదయు శంఖమునిచ్చి కడుభక్తి నరిగె.
హరియును రథమెక్కి యతివయుఁ దాను
దరమిడి చనుదెంచె ద్వారకాపురికి;
సాత్యకి నరుతోడ శస్త్రాస్త్ర విద్య
నత్యుదాత్తత చేర్చి హరిఁ గొల్చివచ్చె;
హరియుఁ గాళిందియు నసమాస్త్రుకేళి
సరస సౌఖ్యక్రీడ సలిపి రింపొంద.

మిత్రవిందాపరిణయము


వారక నాలో నవంతిభూపతులు
వీరులు విందానువిందులు ప్రేమఁ
దమ ముద్దు చెలియలి ధవళాయతాక్షి
విమలేందువదన సంవ్రీడనిదాన
నారూఢలీల స్వయంవరోత్సవము
గారవంబునఁ జేయగాఁ గృష్ణుఁడెఱిఁగి
చని భూపతులనెల్ల జడిసిపోఁద్రోలి

వనితఁదోడ్కొని వచ్చె ద్వారకాపురికి.
 

సత్యాపరిణయము


అగ్నిజిత్తుండను నా రాజుతనయ
నగ్నిజిత్తాఖ్య నాయబ్జలోచనుఁడు
కడు వేడ్కతోఁ బెండ్లిగానిచ్చఁగోరి
కడఁకఁ గోసలపతికడకేఁగె నతఁడు.520
కొనకొని హరి నెదుర్కొని తోడుకొనుచుఁ
జని యిష్టపూజల సంప్రీతుఁజేసి
“కారుణ్య గుణపూర్ణ! కల్యాణశీల
వారిజోదర! లోకవంద్య! శ్రీకృష్ణ!
నా యింటి కరుదెంచి నన్ను మన్నించి
తే, యుగంబులయందు నేఁ గృతార్థుండ
నేమి విచ్చేసితి రెరిగింపు”మనినఁ
దామరసాక్షుఁడాతనికిట్లు జెప్పె.
“నీ కూఁతు సత్య నున్నిద్రాంబుజాక్షి
మాకు ని”మ్మనిన నమ్మనుజేంద్రుఁ డనియె.
“హరి! నీవు మా యింటి యల్లుండవౌట
పరమ కౌతుకము మా బంధులకెల్ల
నీ పట్టణంబున నేడు శాశ్వతము
నేపారు నురు వృషభేంద్రంబు లిట్లు
శాతశృంగోత్తుంగ చటుల సత్వమున
భూతలాధీశులఁ బొలియించుచుండు
వాని నేడింటిని వసుధపైఁ గూల్చు
వానికిఁగాని యీ వనిత నీననుచు

నొక వెఱ్ఱితనమున నున్నాఁడ గాక
యకలంక! నీ కంటె నధికులు గలరె? 530
ఈకొని యుంకువ యిద్ది యొండొల్ల
నీకసాధ్యంబేది? నీరజోదరుఁడ!
అని లోన నాఁబోతు లన్నింటి నడఁచి
పెనుపార నీకన్యఁబెండ్లిఁగ”మ్మనిన;
హరి యేడురూపుల నాఁబోతుఁ గమిసి
పరువడి లేఁద్రాటఁ బట్టి బంధించి
ధరఁ గూల్చి పేర్చిన దైత్యారిఁ జూచి
పురజనులద్భుతంబును బొంది చూడ
నా పౌర కామినులంబుజోదరుని
చూపు చెంగలువల సొరిదిఁ బూజింప
నీ కృష్ణుఁడిట దానె యేతెంచి పొందు
నీ కన్య సౌభాగ్య మెట్టిదో యనఁగ!
శుభలగ్న మరుదేర సుందరీతిలక
నభినవంబుగఁ బెండ్లియయ్యె మురారి.
అతిసంభ్రమంబున నా కోసలేంద్రుఁ
డతిశయంబుగఁ గన్యకరణంబుగాఁగఁ
బదివేలు గోవులఁ బదివేలు కరుల
విదితంబుగా మూఁడువేల యింతులను
జటులవాహముల వింశతిసహస్రముల
పటుశతాంగంబులు పదివేలనిచ్చి540
యనిచి పుత్తేరంగ నంబుజోదరుఁడు
వనితఁ దోడ్కొని ద్వారవతి కేఁగుదెంచి
సత్యయుఁ దానును సౌభాగ్యలీల

నత్యుదాత్తత సుఖంబందె మురారి

శ్రీకృష్ణుఁడు భద్రను లక్షణను వివాహమాడుట


పూని కేకయరాజపుత్రిని భద్ర
మేనత్తకూఁతు నర్మిలిఁ బెండ్లియయ్యె.
మరి స్వయంవరమున మద్రేశతనయ
నరమి లక్షణఁ బెండ్లియయ్యె మురారి.
వఱలు రుక్మిణి జాంబవతి సత్యభామ
మెఱయు కాళిందియు మిత్రవిందయును
సత్యయు భద్రలక్షణయును ననఁగ
నత్యుదాత్తత భామలయ్యెనమండ్రు
పట్టపుదేవులై భాసిల్లుచుండ
నెట్టన నరకుని నిర్జించి శౌరి
వెలఁతుల పదియాఱువేలను దెచ్చి
యెలమి పెండ్లయ్యె నంచిట్లు సెప్పుటయు;
నరకుఁ డెవ్వఁడు? వాని నలినాక్షుఁ డేలఁ
బరిమార్చె? నెక్కడి పడఁతులు వారు?
ఈ కథ నెఱిఁగింపుమని వేఁడుటయును
జేకొని శుకయోగి చెప్పంగఁ దొడఁగె.550

నరకాసురుని వృత్తాంతము


ధరణీసుతుఁడు నుద్ధత బాహబలుఁడు
నరకాహ్వయుండు దానవకులేశ్వరుఁడు
వరశక్తి మహిమ దుర్వారసత్వమున
ధరణిపైఁ గల రాజతతి నెల్ల నోర్చి

తన శాసనంబులఁ దగనిల్పి యంతఁ
దనివోక యతిబలోదగ్రుఁడై నడచి
యమరాధిపతిఁ గెల్చి యగ్ని నోడించి
శమనుని గెల్చి రాక్షసుఁ బార ద్రోలి
వరుణ గర్వము మాన్పి వాయువుఁ బఱపి
పొరి కుబేరుని ద్రోలి భూతేశుఁ గిట్టి
వనధీశుపాశంబు వజ్రివజ్రంబు
ధనదుని పెన్నిధుల్ తనసొమ్ముగాఁగ
నదితి కుండలములు హరియించి యెందు
నెదురెవ్వరునులేక యేపు దీపించి
ప్రాగ్జోతిషంబుగాఁ బరఁగు(దుర్గాన)
దిగ్జేయశక్తి వర్తింపుచో నంత;

దేవేంద్రాదులచేఁ బ్రార్ధింపఁబడి శ్రీకృష్ణుఁడు నరకునిపై దండెత్తుట


దేవేంద్రుఁడును సర్వదిక్పాలకులును
గోవిందుతో నర్ధిఁ గూడి చెప్పుటయు
విని సత్యభామతో విహగంబు నెక్కి
చనుదెంచి ప్రాగ్జోతిషము మీఁద శౌరి560
గిరి దుర్గమంబు నగ్నిపరీతమగుచు
మురయంత్ర బహుపాశములఁ జుట్టివచ్చి
పరులకభేద్యమైఁ బరగు నప్పురికి
నరుదెంచి పాంచజన్యధ్వాన మెసఁగ
నార్చిన నతిభీషణార్చులు నిగుడ
పేర్చి మిన్నందిన భేదింపరాక

హరి శార్ఙ మెక్కిడి యయ్యగ్నిఁ జల్లార్చి
కులిశబాణంబునఁ గోటలుఁ గూల్చి
బలువిడి మురయంత్ర పాశంబులడచి
దానవసేనలు దఱిమి పై నడవ
నానాస్త్రములఁ ద్రుంచె నలినాక్షుఁడంత;

మురాసురసంహారము


అంతయుఁ గని మురుఁడతి రౌద్రమెసఁగ
నంతకాకారుఁడై యైదు మోములను
ఘనరోష విస్ఫులింగములుప్పతిల్ల
సునిశిత కీలోగ్రశూలంబుఁ గ్రాలఁ
గలుషించి జగములొక్కట మ్రింగఁజూచు
ప్రళయ కాలమునాటి ఫాలాక్షుఁడనఁగ
దట్టించి హుంకార ధ్వని దిక్కులగల
నట్టహాసము సేసి హరిమీఁదఁ గవిసె.570
జ్వాలా కరాళ జిహ్వమగు శూలాన
వ్యాళాహిదమనుని వైచె తాఁగదసి
కడుఁబేర్చి నిసితమార్గణములు మూఁడు
తొడిగి శూలంబుఁ దుత్తునియలు చేసె.
నురుశరాష్టకమున నురమాడ నేయఁ
దిరుగక దైత్యుఁడు తీవ్రకోపమున
హరిపై మహాశక్తి నదరింప శౌరి
శరములు మూఁట జర్ఝరితంబు సేయ
గదఁగొని లయకాలకాలుఁడు వోలె
చదియఁ బక్షీంద్రు పక్షము వ్రేయుటయును

హరి నందకంబెత్తి యమ్మురాసురుని
కరమును గదయును ఖండించివైచె.
యాదవోత్తముఁడు చక్రాభీలధార
నైదు శిరంబుల నవలీలఁ దునుమ
బలభేదిచేఁ గూలు పర్వతం బనఁగ
నలవరి మురదైత్యుఁ డవనిపైఁ గూలె.

మురాసురుని పుత్రులు తామ్రాదుల యుద్ధము


ఆమురాసుర పుత్రులైన తామ్రాదు
లాముకుందుని మీఁద నందంద కవిసి
కరవాలముసలముద్గరభిండివాల
పరశుతోమరగదాపాశశక్తులను580
బలములుఁ దారును బాణజాలముల
బలువిడి గురియించి పక్షీంద్రుమేను
హరిమేను నొ(ప్పింప హరియుఁ గోపించి)
కరములఁ ద్రెవ్వి యంగంబులఁ దునిమి
బరులు వ్రక్కలు వాపి పథములు మురిసి
శిరములు.................పగిలి
యెమ్ములు చిద్రుపలై యెఱచులు చదిపి
యమ్ములు పొడిపొడియై జోళ్లు విఱిచి
కరుల.............................
..................రవరలై ధాత్రి దొరగె
నందంద మేనులు నన్నిచందములఁ
జిందువందై హతశేషులు వఱవ

నరకాసురుని యుద్ధము


..............చ్చి నరకుండుగ్ర స్ఫూర్తిదనర
మకుట కుండల దీప్తి మలయుచు నిగుడ
నగణిత కటక హారాది................
....రుకేతన కాంతి దళదళ వెలుఁగ
చరమాద్రిపైఁ బొల్చు సప్తాశ్వుఁడనఁగ
యరదంబు .....................
.....................రాధీశు మాడ్కి
హరిఁదాకి పెల్లేసె నమరులు దలఁక     590
శౌరియాతని యంపజడి మాన్పి రెండు
నా...................................
..........................డిసోలి గొబ్బున లేచి
యార్చి మహాశూలమంకించి వైవ
నెదువంశవల్లభుఁడాఱు బాణముల
..........................లుగమ్ములు జొనిపె
గరుడుని రెక్కలు కసరంద నేయ
నురగారి పటునఖోద్ధూతఘట్టనలఁ
(గదియుచు) నదియును ఖండించె; శౌరి
త్రిదశులు భీతిల్ల దిక్కులల్లాడ
ప్రళయభానుప్రభాపావక శిఖల
.........................................,
(దను)జాధివుని మేనుదారించి శిరము
ఘనతీవ్రధారను ఖండించుటయును
మండిత మణిదీప్తి మకు................,
............................................,

(క్రూ)రాత్ముఁడగు నరకుఁడు గూలుటయును
బోరన మందార పుష్పవర్షములు
దివిజులు..............................,
.........................వినువీధిఁ బొలిచె.600

భూదేవి తనకుమారుఁడు నరకుని చావునకై దుఃఖించుట


తనయుఁడు గూలిన ధారుణి దుఃఖ
వనరాశిలో మున్గి వనమాలి మ్రోల
కటక తాటంక కంకణ చారుహార
పటురత్న భూషణ ప్రభలు శోభిల్ల
వరుణాత పత్రంబు వాసవ జనని
యురుతర కుండల యుగళంబుఁ దెచ్చి
హరికి సమర్పించి.............................,
పరమానురక్తిమైఁ బ్రార్ధింపఁ దొడగె

భూదేవి శ్రీకృష్ణుని బ్రార్ధించుట


“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిహ్న!
భానువత్సంకాశ! భక్తలోకేశ!
కంబుచక్రగదాశి ఘనశార్ఙహస్త!
అంబుజనాభ! పీతాంబరాభరణ!
విశ్వవిశ్వంభర! విశ్వైకజనక!
శాశ్వత! సర్వజ్ఞ! సర్వలోకేశ!
[5]నీలామనోనాథ! నిఖిలాండనాథ!

ఉరురజోరూపుమైఁ బుట్టింతు జగముఁ
బరమ! సత్వస్థితిఁ బాలింతు వీవ
తామసరూపుమై దండింతు వీవ
నీమేన జనియించు నిఖిలభూతములు610
నవని యప్పులునభమగ్ని వాయువులు
రవిసుధాకరులాత్మ రాజీవభవులుఁ
సకలేంద్రియంబులు సకలశక్తులును
సకలంబు నీరూపు చర్చించి చూడ!
పూతాత్మ! శ్రీకృష్ణ! పురుహూతవంద్య!
నీ తత్వమెఱుఁగంగ నేనెంతదాన?
నరకుండు నీ దయ నాకుద్భవించు
వరపుత్రుఁడీతఁడు వరశక్తి పేర్మి
దేవతాద్రోహియై తెగియె నీచేత
దైవీక మెవరికిఁ దప్పింపరాదు!
కావున నితనికి గలిగె నీలోక
మేవిధంబున ధన్యుఁడిది లెస్సయయ్యె!
దురితారి! వానిపుత్రుఁడు భగదత్తుఁ
గరుణించి నీవ యిక్కడ ప్రతిష్టింపు”,
మని మ్రొక్కి ధరణి జయాంకమై బఱఁగు
వనమాల మురవైరి వక్షంబునందు
పూజించి వీడ్కొని భూదేవి చనియె.

పదియాఱువేల గోపికలను శ్రీకృష్ణుఁడు పెండ్లియాడుట


రాజీవనేత్రుఁడు రమణీయమూర్తి

నరకునింటికి నేఁగి నరసిద్ధసాధ్య
సుర యక్ష గంధర్వ సుదతులఁ దెచ్చి 620
యతఁడొకపరి పెండ్లియాడెడు వేడ్క
జతనంబు సేసిన జలజాతముఖుల
వెలఁదులఁ బదియాఱు వేలనూఱ్వురను
జలజోదరుఁడు జూచి సంతసంబందె.
ఆకన్యకలచూపు లబ్జాక్షుమేన
దాఁకొని చెంగల్వదండలై యొప్పె;
జలజాక్షురూప మా జలజాతముఖులు
తలలెత్తి యందంద తమకించి చూడ
దినకరోదయబింబ దీప్తమౌ కంజ
వనము చందంబున వదనంబులొప్పె;
పొలఁతుల నందలంబులఁ బెట్టి శౌరి
పొలుపార ద్వారకాపురికిఁ బుత్తెంచె.
వరుణుని ఛత్రంబు వరుణునికిచ్చె;
సురదంతి హయమును సురపతికిచ్చె;
ధనపతి నిధుల నాతనికిచ్చి వుచ్చె;
వనజోదరుఁడు భక్తవత్సలుఁడంత
నగణితప్రీతిమై నభయంబులిచ్చి
భగదత్తు నప్పురి పట్టంబుగట్టి

శ్రీకృష్ణుని యమరావతీప్రవేశము


ప్రమదంబుతో సత్యభామయుఁ దాను
నమరావతికి వచ్చె నమరారివైరి.630
హరిఁజూచు వేడుక నా పట్టణంపు

తరుణు లొండొరులకుఁదమకంబు లొదవ
వలకారిచూపు నీవాళ్ళుగాఁ జేసి
యాలోకగురుఁజూచి రందంద వచ్చి;
పొలఁతుల చూపు లప్పుర వీధులందుఁ
గలువ తోరణములు గట్టినట్లొప్పె;
భామల కన్నులపండువై సత్య
భామయుఁ దానును బక్షీంద్రు నెక్కి
యేతేరనింద్రుఁడు యెదురేఁగి శౌరిఁ
దోతెంచి పూజలఁ దృప్తి గావించె;
హరి కుండలంబులయ్యదితికి నిచ్చి
పరమానురక్తి సంభావించి మ్రొక్కె;
నా దేవమాతయు నంబుజోదరుని
నాదట దీవించి యక్కునఁ బేర్చి
శచియు నింద్రుఁడు పరిచర్యలు సేయ
నచలితసౌఖ్యాత్ముఁడై యుండెనంత.

పారిజాతాపహరణము


సత్యభామయుఁ బారిజాతంబుఁ జూచి
నత్యుదాత్తతఁ బ్రీతి హరి వేఁడుటయను;
వేగంబె శౌరి యావృక్షంబుఁ బెఱికి
నాగారిపై నిడి నాతియుఁ దాను640
ద్వారకాపురికేఁగ వాసవుఁ డెఱిగి
యైరావతారూఁఢుడై దేవకోటి
కొలువంగ వలచేతఁ గులిశంబుఁ దాల్చి
బలువిడి నార్చుచుఁ బద్మాక్షుఁ దాఁకె.

ఇంద్రుఁడు శ్రీకృష్ణునితో యుద్ధముఁ జేయుట


అనలకృతాంత దైత్యాధీశవరుణ
యనిలకుబేర భూతాధీశవరులు
తమ వాహనముల నుద్ధతి నెక్కి పేర్చి
కమలాక్షుఁ దాఁకిరి కరముగ్రవృత్తి;
నార్పుల బొబ్బల నట్టహాసముల
దర్పించి కవిసి నాదనుజారి మీద
వ్రేసియుఁ బొడిచియు వివిధ బాణముల
నేసియు నొప్పింప నిందిరావిభుఁడు
పారిజాతముతోడఁ బక్షీంద్రు తోడ
వారిజాననుతోడ వరశక్తి దిరిగి
పటుశార్ఙ నిర్ముక్త బాణజాలముల
చటులతఁ జూపి నిర్జరసేనఁ బఱపి
యమరాధిపతి నొంచి యనలుఁజల్లార్చి
సమవర్తి గెలిచి రాక్షసుని నిర్జించి
వరుణ బీరము మాన్పి వాయువుఁ బఱవ
నరవాహు గెలిచి పినాకి సృక్కించి650
బృందారకశ్రేణిఁ బెఱికి యందంద
యందఱి గెలిచి తా(రేఁ)గె ద్వారకకు.
పారిజాతము సత్యభామ గేహమున
నారూఢగతి నిల్పి యతి సౌఖ్యమైన
శుభముహూర్తమున భూసురులు దీవింప
నభినుతులొనరింప నంబుజోదరుఁడు
పదియాఱువేలరు పంకజాననల
వదలని వేడ్క వివాహమై వేర్చి

యందఱకును నిండ్లునారామములును
జెందిన దాసదాసీజనంబులను
గంధమాల్యాంబర ఘనభూషణములు
బంధురమైన సంపదలును నొసఁగి

శ్రీకృష్ణుని లీలావిహారములు


హరి పెక్కు రూపంబులై సౌఖ్యలీల
పరిణమింపగఁ జేసి పడఁతుల నెల్ల
నేయింటఁ జూచిన నిందిరాధీశుఁ
డాయింటి రమణిని ననఁగి వర్తింప
పడఁతులు గృష్ణుతోఁ బాయని వేడ్క
నడరి నర్తింపుదు రహమును రేయి.
హరి యోగవిద్యా మహత్వ కౌశలము
సరసిజాసనుఁడైనఁ జర్పింపఁగలడె!660

రుక్మిణీదేవి సౌధవర్ణనము


ఈభంగి నొకనాఁడు యిందిరావిభుఁడు
సౌభాగ్య రుక్మిణీ సదనంబులోనఁ
జూపట్టు వైడూర్య సోపానములును
నేపార నీలాల నెనయు నరుంగుఁ
బసిఁడి కంభంబుల పట్టపుసాల
లసమాన బహుదీప్తి నడుకు వుత్తళులు
మరకత రుచిఁబోల్చు మదురులనొప్పు
సిరిమాఱు గచ్చు సేసిన కుడ్యములును
గరమొప్పు నవచంద్రకాంతజలములు

కరిదంతముల నవకంబైన తలుపు
పగడంపు గడపలు పసిఁడి బోదెలును
నిగిడిన వజ్రాల నెగడిన గడియ
మేలైన కెంబట్టు మేల్కట్టు మెఱయు
నాల వట్టంబును నడపసంబెళయుఁ
గస్తూరి గంధ మంగళ ధూపములును
శస్తమై తగు మల్లసాలలు నొప్పె.

శ్రీకృష్ణునికి రుక్మిణి రాజోపచారములు గావించుట


సంసారసౌఖ్యరసాయనంబైన
హంసతూలికపాన్పునందున్నయట్టి
శౌరికి రాజోపచారకృత్యములు
వారకఁ గావించి వైదర్భి వేడ్క670
కర్పూరమిశ్రితక్రముక భాగముల
నేర్పార వాసించి నిండారు వేడ్క
కంకణస్వనములు గలయంగఁ గులికి
యంకించి చేచాఁచి యఱచేతికిచ్చి
ధవళ తాంబూలపత్రముఁ గొనగోర
సవరించి చూర్ణమిశ్రము సేసి మడిచి
చిటపట మేళంబు సేసి యొప్పుచును
జిటిక వెట్టినమాత్రఁ జేతికందించు;
స్తనకుంభములను మాధవు పాదతలముఁ
దనకారనొత్తు మెత్తని కేల లీలఁ
గరకంకణంబులు ఘల్లుఘల్లనఁగఁ

గరమూలరుచులు దగద్ధగ మెఱయ
గుఱకుచములురాయఁ గురులు ఫాలమున
నొరయ హారావలులుయ్యాలలూఁగ
పయ్యెద వడిజారఁ బాలిండ్లు తళుకు
లెయ్యడఁదామెయై యిరువంకఁ బొడమ
కన్నులమెఱుఁగు లక్కజముగాఁ బొలయ
చిన్ని చెక్కులచెంతఁ జెమటలు వొడమ
దంతమరీచులందఱమిల్లు నవ్వు
వింతయై మోమున వెన్నెలఁగాయ680
లీలఁ దాటంకపాళికి వెల్లఁకదియ
తాలవృంతంబు మెత్తని కేల బూని
యల్లల్లఁజూచుచు హరిచూపుగముల

శ్రీకృష్ణుఁడు రుక్మిణి చిత్తమును శోధించుట


కెల్ల నింపొదవించు నింతి నెమ్మనముఁ
గనుఁగొను వేడుకఁ గలుషించినట్లు
వనజాతనేత్రుఁ డవ్వనిత కిట్లనియె.
“రాజన్యుని విదర్భరాజు కూఁతురవు!
భూజనులెల్లర పొగడొందునట్టి
లావణ్యభాగ్యవిలాసచాతుర్య
వీ వసుంధర నీకు నీడు లేదెందు!
పరగు మాగధచైద్యపౌండ్రాది నృపులు
వర రూప భాగ్య లావణ్య సంపన్ను
లారూఢ సామ్రాజ్యులతులవిక్రములు
వారలు నినుఁగోరి వచ్చిన చోట

నందఱ నొల్లక యతిహీనకులుని
మందలోఁ బెఱిగిన మలినాంగు భీరు
నాచారదూరుని ననృతవర్తనుని
యే చూపుఁ జూచి నన్నేల కామించి
తాదిగర్భేశ్వరి వక్కటా! పుట్టు
బీదను! నను నీవు పెండ్లిగాఁదగునె?690
మీయన్న రుక్మిమామీఁది క్రౌర్యంబుఁ
బాయఁడు; మీతండ్రి పగవాఁడు నాకు;
నీవును నామీఁద నెయ్యంబు లేవు
కావున నీయింటి కడకు నీ వరిగి
వలనొప్పఁగన్నిచ్చ వచ్చినవారిఁ
గలసి భోగించుము కమలాస్య!” అనిన
నామాఁట తనకునమ్మై తాఁకుటయును
భామినీమణి డిల్లపడి మూర్ఛ మునిఁగె!
నుడివడి చేనున్న సురటల్ల జాఱఁ
దొడిగిన సొమ్ములు తొడుసూడి పడఁగఁ
దన్ను దానెఱుఁగక ధర వ్రాలియున్న

మూర్ఛపోయిన రుక్మిణిని శ్రీకృష్ణుఁ డోదార్చుట


యన్నాతిఁ గనుగొని యంబుజోదరుఁడు
సరభసంబున లేచి సతినల్లనెత్తి
కరముఁ గౌఁగిటఁ జేర్చి కన్నీరుఁదుడిచి
చెక్కిలి నొక్కెత్తి చికురముల్ దుఱిమి
యక్కటికముతోడ నక్కాంత కనియె.
“నవ్వులాటకు నన్న నామాట కింత

నివ్వెరపడి వ్రాల నీకేల యింతి?
ఎలనాగ! నీచిత్త మెఱిఁగెడి కొఱకు
పలికితిగాని నా ప్రాణంబు నీవ!700
పరమసాధ్వివి నీవు భయభక్తులందు
నెరసులేకున్ని నే (నెఱి భాగ్యశాలి)
ఇమ్ముల ననుఁబాయ కే ప్రొద్దునుండు
నమ్మహాలక్ష్మి నీవంభోజనయన!”
అని పల్కి శయ్యపై నల్లనఁజేర్చి.
యనునయంబున దేర్చి యబలకుఁ దార్చి
సరసరతిక్రీడ సంతుష్టుఁ జేసి
పరమపావనమూర్తి పంకజోదరుఁడు
కందర్పకోటి సంకాశలావణ్యుఁ
డిందిరావిభుఁడు లోకైకశరణ్యుఁ
డారసి యందఱి కన్నిరూపముల
సౌరతిక్రీడల సతతంబుఁ దేల్చె.

ప్రద్యుమ్నాదికుమారజననవృత్తాంతము


హరికి రుక్మిణికిని నగ్రనందనుఁడు
పరమానురక్తుఁడై ప్రద్యుమ్నుఁడట్టి
వీరుఁడు మొదలుగా వినుసమేష్టుఁడును
జారువేష్టుండును జారుదేహుండు
జారుతృప్తుండును జారుచంద్రుండు
జారుహస్తుండును జారువీర్యుండు
[6]జారుధీమణి విచారుండు(ను) బదురు;710

జాంబవతీకాంత చతురతఁగాంచె
సాంబాది దశకంబు సత్పుత్రవరుల;
భానుమంతాదులఁ బదురు కుమాళ్ల
మానుగా సత్యభామకుఁబుట్టిరెలమి;
భానుచంద్రాదులు పదురు కుమాళ్లు
శ్రీనిత్యయగు నాగ్నజితి కుద్భవిలిరి;
మిత్రవిందకు ప్రభామిత్రులు సుతులు
గత్రవంతాదులు గలిగిరి పదురు;
కాళింది కామిని కనియెఁ బెంపొంద
బోలశ్రుతాదులఁ బుత్రులఁ బదుర;
భద్రకుఁ బుట్టిరి భద్రాదిసుతులు
భద్రమూర్తులు మహాభాగులు పదురు;
సత్యభాషిణి గాంచె సంతతిఁ బదుర
సాత్యకి మొదలైన సత్పుత్రవరుల;
వెలఁదులు పదియాఱువేలునూఱ్యురును
తలతలఁ బదియేసి తనయులఁగనిరి.
వినుతింపఁ బదియాఱు వేలును నూట
యెనమండ్రుభార్యల కేపారుపుత్రు
లాయెడ లక్షయునఱువదియొక్క
వేయును నెనమండ్రు విష్ణునందనులు.720
కన్యలునందఱు గల్యాణమతులు
ధన్యమై కృష్ణు సంతానంబు నిగుడ
వారలసుత పౌత్రవర్గంపు సంఖ్య
వారిజాసనుఁడైన వర్ణింపనేర
డట రుక్మపుత్రిక యగు రుక్మవతికిఁ

బటుతరంబగు వేడ్క ప్రద్యుమ్ను వలన
ననిరుద్ధుఁడుదయించెనని చెప్పుటయును
మునినాధ! ఈరుక్మి మురవైరితోడ
వైరంబు మానఁడు వరపుత్రి నెట్లు
శౌరి పుత్రునకిచ్చి సాజన్యుడయ్యె?
నీవెఱుఁగనిదేమి? నిఖిలజగముల
లేవెఱిఁగింపు లాలితపుణ్య యనుఁడు;
శుకుఁడు పరీక్షిత్తుఁజూచి యీయర్థ
మకలంకగతి వినుమని చెప్పదొడఁగె.
ఆ కృష్ణుతో వైరమయ్యును రుక్మి
తూకొని చెలియలితోడి నెయ్యమున

అనిరుద్ధుని వివాహము కలహము


మేనల్లుఁడనుచు నర్మిలి కూఁతు నిచ్చె
గాని నెమ్మనములు గలయవెన్నండు;
ఆరామనం దను కనిరుద్ధునకును
నారూఢిఁ దన పౌత్రియగు లోలనేత్రి730
లోచనయను కన్య రుక్మి యిచ్చుటయు;
ఆచెలి పెండ్లికినై విదర్భకును
యానకదుందుభి హలి కృష్ణమదన
సైనేయ కృతవర్మ సాంబాదులైన
బంధులతో వచ్చి బహు వైభవమున
బంధురప్రీతి శోభనమొప్పఁజేసె.
కుడిచి కూర్చుండి పెక్కులు వినోదములు
గడు వేడ్క జూచుచోఁ గాళిందివిభుఁడు

నారుక్మియును గూడ హలపాణితోడఁ
గోరిజూజము సమకొలిపి యాడించి
భాగంబు దానయై పణముగా నొడ్డి
వేగంబె మాడలు వేయేసి గెలిచి
కైలాటములు జేసి కల్లలు వెనచి
తాలాంకుఁ గెలిచిరందఱుఁ దచ్చ సేసి.
ఓడియు బలభద్రుఁడుడుగక లక్ష
మాడలు పణమొడ్డి మరిగెల్చుటయును;
ఆ విదర్భుఁడు గెల్చె ననుచు నొండొరులు
చేవేసి నవ్వుచు సీరి నీక్షింపఁ
దాలాంకుఁడదరి యుత్తాలరొషమునఁ
గాళిందిపతి మోముఁగనుఁగొని పలికె740
“పాపాత్ములార! ఈ పలక నా గెలుపొ?
ఏపార వైదర్భుఁడిటు గెల్చినాఁడొ?
ఉన్న రూపెఱుఁగింపుడొక పక్షమేల?”
అన్న ప్రలంభారి కనియె నారుక్మి.
“గోపాలకులు మీరు! గొల్ల జూదములు
నేపార నొండురు లెగ్గులాడుటయుఁ
గాక! ఈ రాచ యోగ్యంబైన యాట
మీకేల? వడిలేచి మిన్నక పొమ్ము!
మాడలోడితిమని మాటిమాటికిని
గాడఁ నాడిన నీకుఁ గలదయ్య గెలుపు?
కడపి యాడుటగాదు కాక యేమేని
నడుగరాదే మమ్ము నక్కఱ యేని?”

బలరాముఁడు రుక్మిని జూదపు పలకనెత్తి కొట్టి చంపుట


అనిపల్కి ప్రహసించి యార్చువైదర్భుఁ
గని సీరి మిడుగులు కన్నులఁదొఱుఁగఁ
బటురోషముననెత్తి పలక వేత్రిప్పి
నిటలంబు వ్రేయఁ బెన్నెత్తురు దొఱఁగి
వెడవెడ మిడి గ్రుడ్లు వెడలి రోఁజుచును
పడి తన్నుకొని రుక్మి ప్రాణంబు విడిచె!
కాళింగుఁ జంపి యక్కడి ధూర్తసమితిఁ
ద్రోలిన నందఱుఁ దుప్పలఁ దూలి750
పులిగన్న పసులను బోలి వైదర్భు
బలము భీతిల్ల సంభ్రమమేచఁ బఱచె;
హరివచ్చిదేమిదేమని చూచుచుండ
నరదంబు వెసనెక్కి హలధరుఁడంత
లోచనతోననిరుద్ధు నెక్కించి
వేచని యావురి వెలవెలనున్న
నా రుక్మి మడియుట (నం)తయు నెఱిఁగి
శౌరి సీరినిగూడి చనియె ద్వారకకు;
అరసి దుఃఖాక్రాంతయైన రుక్మిణిని
గరమర్థిఁ గుందార్చెఁ గమలలోచనుఁడు.

బాణాసురవృత్తాంతము


ఆలోన బలిదానవాధీశసుతుఁడు
వ్యాళేంద్రసదృశుఁడు వేచేతివాఁడు
నారూఢజయశాలి యరిశైలవజ్రి

భూరిప్రతాపుఁడద్భుత బలోన్నతుఁడు
బాణాసురుఁడు తపోబలముల పేర్మి
స్థాణుని మెప్పించితనపురంబునకుఁ
దననివాసమున కాతని రక్ష సేసి
యనుపమజయకీర్తులంది పెంపొందె.

బాణాసురుఁడు శ్రీ శంకరునికిఁ దనయుద్ధకాంక్షఁ దెలిపి ప్రార్థించుట


అతఁడు(ను) గర్వాంధుఁడై యొక్కనాఁడు
భూతేశు పాదాబ్జములమీఁద వ్రాలి760
వినతుఁడై చేతులు వేయును మొగిచి
యనుకంపఁ దోఁప నిట్లని విన్నవించె.
“దేవ! మహాదేవ! దేవతారాధ్య!
భావజసంహార! భక్తమందార!
నీవు ప్రసాదింప నిఖిల రాజ్యములు
నీవేయి చేతులు నివినాకుఁ గలిగె!
అవనిలో నాకంటె నధికుఁడు లేమి
నివి వృధాకథలయ్యె నిభచర్మవసన!
తురగఖురోద్ధూతధూళి పెల్లగయు
దురములోఁ దురగంబుఁ ద్రోలంగలేదు;
మండిత దోర్దండ మండలాగ్రమునఁ
జెండాడి పగతులఁ జిక్కింపలేదు;
చటుల కార్ముకముక్త శర పరంపరలఁ
బటు మాంసముర్వికి బలిసేయలేదు;
దంతికోదండ! గదాతాటనముల

దంతికుంభముల విదారింపలేదు;
వీరరక్తంబుల వేతాళసమితి
నారూఢగతి నోలలాడింపలేదు;
యొఱపైన నృపలోకమురు శరీరముల
మెఱసి ఢాకినులకు మేపఁగలేదు;770
నీయాన! రణకేళి నెఱపంగ లేదు!
వేయిచేతులుమోవ విసమయ్యె నాకు
కలన మీరెడుశక్తి కలిగియు లేని
ఫలమయ్యె ముచ్చట బాపవే తండ్రి!”
అని గబ్బుమైనాడ నసురమాటలకుఁ
గినిసి యల్లన నవ్వి గిరిజేశుఁడనియె.
“నీవేమి సేయుదు నీపాలిదైవ
మీవిధిఁ బ్రేరింప నిట్లంటిగాక!
దురములోపల నిన్నుఁదొడరి నీవేయి
కరముల వ్రేఁగు నొక్కట మాన్పనోవు
అలఘువిక్రమశౌరి యేతేరగలడు;
తలఁచిన నీకోర్కి తలకూడగలదు.
తప్పక నీకేతుదండంబు విఱిగి
యెప్పుడు ధరఁగూలు నెఱుఁగు మద్దినము
ననుమోచునట్టి రణంబుగాగలదు.
మనములో నెఱిఁగి యేమరక వర్తింపు”
మని వీడుకొలిపిన హరునకు మ్రొక్కి
చని సంగరోద్యోగ చతురుఁడై యుండె.

బాణాసురపుత్రి ఉషాకన్య స్వప్నములో ననిరుద్ధునిఁ గూడుట


ఆ బాణనందన యతిరూప హరిణ
శాబాక్షి కలకంఠి సమదేభగమన780
కమలకోమలనేత్రి కరివైరి మధ్య
భ్రమరసన్నిభ వేణి పంకేరుహాస్య
కంబుకంధర మౌక్తికాకుందదంత
బింబఫలాధరి బిసలతాపాణి
యననొప్పి కందర్పునసిపుత్రివోలె
తనరు యుషాకన్య దానొక్కనాఁడు
పొలుపారు మేడపై పువ్వుపానుపున
నలవడి నిద్రితయై యున్నచోట;
కలలోన నొక్క చక్కని రాచకొడుకు
జలజాతనేత్రుఁడు సౌభాగ్యమూర్తి
తను డాయవచ్చి మెత్తని కేలుఁగేల
ననువొప్పఁ గీలించి యంగంబు నిమిరి
యల్లనఁ గౌఁగిట నందందచేర్చి
యుల్లాసరసవార్ధి నోలలాడింప
నంతట మేల్కాంచి యబల చిత్తమున
సంతోషమును సిగ్గు జళుకును బొడమ;

ఉషాకన్య విరహము


కలలోని సేఁత నిక్కముగాఁగ దలఁచి
కళవలపడు మేను గరుపార నిలుచు;

దిక్కులు పరికింపుఁ దెలిసియారూప
మెక్కడ బొడగాన కెంతయు వగచి;790
కొలఁదినై ప్రహ్లాదకులపయోరాసి
“కలఁపగాఁబుట్టిన కట్టడినైతి;
ఏమని యెఱిఁగింతు నీముటలొరుల
కేమిగాఁగలదకో; ఇటమీఁద” ననుచుఁ
గలఁగుఁ జేట్పాటున కడు చిన్నబోవు;
పలుకనేరక డిల్లపడు; మారుమాటఁ
బొరిపొరి నాలించుఁ బువ్వుపాన్పునను
బొరలు గ్రమ్మఱ నిద్రవోచూచు లేచు;
ఎలుఁగెత్తి యిందురావే యని పిలుచు;
తలుపులోనున్న యాతని రమ్యమూర్తిఁ
దలపోయుఁ దలయూఁచుఁ దన్నుఁదా మఱచు;
వలరాజు చెలిమికి వంతలోఁగుందుఁ
జెక్కునఁ జెయిఁజేర్చి చింతించునంత
నెక్కొన్నఁదగ వేఁడి నిట్లూర్పు వుచ్చు;
నొగలు; హాయనుచుఁ గన్నుల నీరునించు;
మొగమెత్తకంగుటంబున నేల వ్రాయు;
పులకించు; చమరించుఁ బొరిమూర్ఛఁబోవు;
అలుగు; నాతని యొప్పు నంతంత పొగడు;
పొరి కాముఁడాడించు బొమ్మచందమునఁ
బరవశయై పంచ బాణాగ్నిశిఖల800
కగ్గమై యందంద యాఱడిపొందు;
దిగ్ధనలేచి భీతిల్లి శయ్యవ్రాలు;
గోరికెలాతనిఁ గోరి రేకెత్తఁ

గూరుకుఁ గానక కొందలమందు.
ఈ భంగి మదనాగ్ని నెరియుచునున్న
నాభామచెలియ కుంభాండునిపుత్రి
చిత్రరేఖనుపేరఁ జెన్నారు లేమ
మైత్రి వాటించి యమ్మగువకిట్లనియె.

చిత్రరేఖ ఉషాకన్యను నూరార్చుట


“ఇదియేమి నీచంద మెలదీగబోఁడి?
మదిలోన నీకింత మరుఁగనేమిటికి?
ఏల చింతించెదవేల మూర్ఛిల్లి
యేలనారటఁ బొందెదిభరాజగమన?
పురుషుఁడు నీతోడ భోగించినట్టి
మురిపంబుదోఁచె నీమోముదామెరను
బొరిఁ బోతుటీఁగకుఁ బొలియంగరాని
వర హార్మ్యమునకు నెవ్వఁడు వచ్చెనబల?
పడుచుకూఁతుర! ఇట్టిపని యెట్లువుట్టె?
ఎడసేసి నాకేల యెఱిఁగింపవైతి?
ఎవ్వనిఁగనుఁగొంటి వెవ్వనిబొంది
తెవ్వఁడు సేసె నేఁడీసాహసంబు?810
వనిత! నీమదిలోని వగపెల్లఁదీర్తు
నను వింత సేయక నాకెఱిఁగింపు”
మనిన నెచ్చెలిఁజూచి హరుషంబు సిగ్గు
ననుకంపయును దోప నయ్యింతిపలికె.

ఉషాకన్య చిత్రరేఖతోఁ దనస్వప్నవృత్తాంతముఁ జెప్పుట


“ఈ మేడపై నుండి యేనిద్రవోవ
యేమి చెప్పుదు నీకు నిగురాకుబోఁడి!
నీలవర్ణమువాఁడు నిడు గేలువాఁడు
వాలారు చూపుల వలనొప్పువాఁడు
రతినాయకునకు నౌరసపుత్రుఁడొక్కొ!
ఇతఁడు నా సౌభాగ్య మేపారుఁవాఁడు
కలలోననేతెంచి కౌఁగిటఁజేర్చి
చెలఁగి చిత్తజుకేళిఁ జిక్కించె నన్ను!
ఇతనితోఁ గలసి పేరడిగి మాటాడు
తతిపాపి నాసిగ్గు దాఁపురంబయ్యె
నంత మేల్కంటిని యతఁడంతఁ బోక
నంతరంగములోన నడఁగి యున్నాఁడు;
కూడిపాయుట సమకొనెగాని వానిఁ
గూడియుండెడు వేడ్క కొనసాగదయ్యె;
నతనిఁదోతేకున్న నంగజాస్త్రముల
ధృతిదూలి ప్రాణంబు తెగిపోవఁగలదు820
యేమిసేయుదు” నని యిలవాలి యున్న
యా మెలంతనుగని యానాతి పలికె.

చిత్రరేఖ చిత్రపటము వ్రాసి ఉషాకన్యకకుఁ జూపుట


“కటకటా! కలలోనగన్న రాకొమరు
నెటుపట్టి తేవచ్చునే ముద్దరాల!

ఏతరుణులయందు నిటువంటి తలఁపు
యే తెఱంగునఁ జూచి యెఱుఁగము వినము,
నీకేల ముచ్చట? నీకేల బెగడ?
నీకేల వెనుఁబడ నీరజవదన?
మూఁడు లోకంబుల ముదితయేఁదొల్లి
పాడిగా నెఱుఁగని పురుషులు లేరు;
నా కౌసలంబున నరవరోత్తముల
నీకుఁ జూపెదఁ జూడు నిఖిలలోకాన!
వచ్చి పొందిన భూపవరుని నీమ్రోలఁ
దెచ్చి పెట్టెద నింత ధృతిఁ జిక్కఁబట్టు”
మనిపల్కి నవ్వుచు నాచిత్రరేఖ
పనుపడ నొక చిత్రపటము సంధించి
సకలలోకంబుల జననాథసుతుల
నకలంకమతి వ్రాసి యబలతో ననియె.
“నీతలఁపుననున్ననృపకులోత్తంసుఁ
డేతెఱంగో వ్రాసితిటుజూడు” మనుచు;830
పాతాళవాసులఁ బన్నగాధిపులఁ
జాతుర్యగుణుల రాక్షసకుమారకుల
నలకూబరాది యున్నత యక్షవరుల
నలజయంతాదుల నసురాధిపులను
గరుడఖేచరసిద్ధగంధర్వవరుల
వరుసతో వేర్వేర వనితకుఁ జూపి;
ఆలోనఁ గురుపాండవాదులఁ జూపి;
యాదవవీరుల నందఱఁజూపి;

ఆదినారాయణుఁడగు కృష్ణుఁ జూపి;
అనుమానపడి చూడ నంత ప్రద్యుమ్నుఁ
గనియీతఁడాతఁడే కాఁబోలుననుచు
మనములో శంకించి మరియనిరుద్ధుఁ
దనుకాంతి రూపంబుఁ దప్పకఁ జూచి
తలఁపులోపలి కూర్మి కట్టుముట్టాడఁ
బులకించి తిలకించి పూఁబోడి పలికె.
“కలలోనఁ గన్న చక్కని వాఁడె వీఁడు!
కలయల్ల నాకు నిక్కవమయ్యె నేఁడు!
నీ కౌసలంబును నీ దయాగుణము
నీ కూర్మి పెంపును నీవచోరతియు840
నాకంజసూతికి నలవియే పొగడ?
నాకెవ్వరికదిక్కు నలినాయతాక్షి!“
అని పల్కి యంతంత యతిశయంబైన
మనసిజానలము పైమలసి మట్టాడఁ
దన్ను దానెఱుఁగక ధర వ్రాలియున్న
యన్నాతి బోధించి యల్లననెత్తి
కన్నీరు దుడిచి యంగంబెల్ల నిమిరి
చెన్నార నెయ్యంబుఁజిలుక నిట్లనియె.

చిత్రరేఖ తన మాయచే ననిరుద్ధుని యపహరించుట


“పైదలి! నీదైన భాగ్యంబు కతన
యాదవోత్తముఁడైన హరిపౌత్రుడబ్బె!
ఆ సుందరాకారు నర్మిలిఁ దెచ్చి
నీ సమ్ముఖమువేసి నెమ్మివాటింతు.

వెఱవాయు”మనిపల్కి వెలఁది బోధించి
తెఱవ మాయాగతి దివమున కెగసి
రాజీవనేత్రి సురక్షితంబగుచు
రాజితంబైన ద్వారకకేఁగి యందు
యువిదలతోఁగూడి యుద్యానభూమిఁ
దవిలి రతిక్రీడఁ దనిసి నిద్రించు
యనిరుద్ధుఁగాంచి మాయలుఁగొల్పి యెత్తు
కొని వియద్గతి వచ్చి కోర్కులు బొదల850
బాణతనూజ తల్పము క్రేవఁబంచ

అనిరుద్ధుఁడు ఉషాకన్యతోఁ గ్రీడించుట


బాణునందను నుంచి పడుతుక చనియె.
అనిరుద్ధుఁడంత మాయానిద్రఁ దెలసి
కనువిచ్చి పరికించి కనకతల్పమునఁ
దనకు బాపకలతఁ దలయాపు సేసి
కనుమోడ్చి ముఖచంద్రకాంతులు వొలయ
జక్కవ కవఁగప్పు జలజమో యనఁగ
నొక్క కేలునను నురోజంబులదిమి
కలయఁ గంకణమణిగణమరీచికల
మలయుచు దిన ద్యుతి మాయంగఁ జేయుఁ
దనబోఁటి మాటలఁ దాపంబుఁ దీరి
మనమూరడిలి యాదమఱచి నిద్రించు
నయ్యుషాసతిఁగాంచి యంతరంగమున
నెయ్యంపురసముబ్బి నీటులు వొడమ
నందంద కనుఁగొని యంగజాస్త్రములఁ

గంది నెమ్మదిఁదమకంబగ్గలింపఁ
గదసి కేలును గేలుఁ గదియించుటయును;
అదరి మేల్కని లేచి యంగంబు వణఁకఁ
గుచభారమెడలంగఁ గౌనసియాడఁ
గుచకుంభములఁ జేల కొంగున నదిమి860
లక్ష్మీసుతుని రాజ్యలక్ష్మియో యనఁగ
పక్ష్మలలోచన ప్రభలుప్పతిలగ
శయ్యపై డిగి నిల్చి జలజాతనేత్రు
నయ్యాదవోత్తము నర్ధినీక్షించె.
ఇరువుర చూపులే యేపారఁ దనకు
శరములుగాఁ బంచశరుఁడేయఁ జొచ్చె!
ఆలోన ననిరుద్ధుఁ డాలోలనయనఁ
గేలుఁగేలునఁ బట్టి గిలిగింత వుచ్చి
చెక్కులు బుడుకుచు సిగ్గుఁ బోగొట్టి
గ్రక్కున నందంద కౌఁగిఁటఁ జేర్చి
మాటల మఱిగించి మక్కువఁ బెంచి
కూటంబుఁజవిజూపి కోర్కులు నింపి
యిది రాత్రి యిదిపగలని సంధ్య ప్రొద్దు
లిది వింత తావని యెఱుఁగంగ రాక
యకుటిల క్రీడల నఖిలభోగముల
నొకనాల్గు నెలలుండ నొక్కనాఁడెఱిఁగి

అంతఃపురవాసులు బాణాసురునకు ననిరుద్ధుని గుఱించి తెలియపర్చుట


యంతఃపురజనాళి యరిగి బాణునకు

నంతయు నెఱిఁగింప నతఁడు గోపించి
చనుదెంచుచో లీల సౌధంబుమీఁదఁ
దనకూఁతుతోడ నాదట జూదమాడు870
వనజాతనేత్రుని వనమాలిపౌత్రు
ననిరుద్ధు విక్రమయనిరుఁద్రు గాంచి;
తన కెలంకుల నున్న దనుజులఁ జూచి
“చని యాదురాత్మునిఁ జంపి రం”డనిన
వారలు చనుదెంచి వనజాతనేత్రు
నీరసంబునఁ బట్టనెంతయు నలిగి
పరిఘంబుఁ ద్రిప్పి యప్పగతుల నెల్ల
ధరణిఁ గూల్చుటయు నుద్ధత బాణుఁడలిగి

అనిరుద్ధుని నాగపాశములచే బాణాసురుఁడు బంధించుట


యనిరుద్ధు నాగపాశావళిఁ గట్టి
పెనుపరి చెఱసాలఁ బెట్టంగఁ బనిచె.
అనిరుద్ధుఁ డనిరుద్ధుఁడై యున్న భంగిఁ
గని యుషాకన్యక కడుఁ జిన్నబోయి
యతి దుఖఃపరవశయై రేయుఁబగలు
నతనితోడిదె లోకమై యుండెనంత.

నారదునిచే ననిరుద్ధుని యునికిఁ దెలిసి శ్రీకృష్ణుఁడు సైన్యముతో శోణితపురిని చుట్టుముట్టుట


అక్కడ ననిరుద్ధు నాతోఁటలోన
నెక్కడ పోకయు నెఱుఁగంగలేక
బలభద్రమురహరిప్రద్యుమ్నముఖ్య

లలమి దిక్కులనెల్ల నందంద వెదకి
కానక యెంతయుఁ గళవళంబంది
మానసంబుల దుఃఖమగ్నులై యుండ;880
కోరి కైలాటంబుఁ గూడుగా మెలఁగు
నూరివంద్యుఁడు బ్రహ్మసుతుఁడు నారదుఁడు
హరి సన్నధికి వచ్చి యనిరుద్ధువార్తఁ
గరతలామలకంబుగాఁ జెప్ప శౌరిఁ
విని వృష్టిభోజాంధవీరులతోడ
ఘనయోధరథవాజికరులతోడుతను
బలభద్రసాత్యకిప్రద్యుమ్నసాంబ
[7]జలసత్యకృతవర్మసారణులాది
ద్వాదశాక్షోహిణీ దళసంఖ్యతోడ
యాదవరత్నంబు హరి దండువెడలె.
దళములు నడువంగ ధారుణి వడఁకె!
జలధులు కలఁగెనాశాచక్రమగలె!
హరియును నిట్లు నిత్యప్రయాణముల
నరుదెంచి రజతాద్రి యత్తీరభూమి
స్థాణునిచే రక్షితంబై వెలుంగు
శోణితపురము ముచ్చుటు విడియించి
యుపవనంబులు రాల్చియూళ్ళను గాల్చి
చపలత బహుజలాశయములఁ జెఱచి
పెరయీఁగ నందంద పేర్చిన పగిది
పురికోటలగ్గలద్భుతముగాఁ బట్టి890

వీరును వారును వెసఁబోరఁజూచి
పౌరులందఱు భయభ్రాంతులై నిలువ

దొమ్మియుద్ధము


పనిగొని రుద్రుఁడు “బాణుని వీఁడు
గొనగొని నేఁగాచికొని యుండ నిట్లు
పగతురచే బాధపడుటేట్లుజూతు
నిగిడి సైన్యంబుల నీరుగావింతు”
ననిపల్కి పటహమహారాన మొలయ
వినుతలీలలు మహావృషభంబు నెక్కి
శూలపినాకాదిసునిసితాయుధము
లోలోన భయదనలోర్చులుం బర్వ
జ్వాలకరాళవిశాలరావముల
ఫాలనేత్రుఁడు మహాప్రమథులుఁ గొలువ
బహుభూతభేతాళపైశాచకోట్లు
నహితభీకరలీల నలమిఁతో నడువ
గినిసి ముందఱఁగార్తికేయుఁడేతేరఁ
జనుదెంచి యాదవ సైన్యంబుఁ దాకె.
సాత్యకి బాణుతో సమరంబు సేసె;
నత్యునగ్రత వీరులందఱు దొరసి
వారువీరన కెల్లవారునుఁ బేర్చి
పోరాడిరమరులద్భుతమంది చూడ900
నప్పుడు బ్రహ్మాదులంతరిక్షమునఁ
దప్పక నిల్చి యుద్ధముఁ జూచుచుండ
పరశుతో మరగ దాపట్టిసముసల

పరిఘముద్గరశరప్రాశఖడ్గముల
ఘనరోషములతోడ గదిలిశాత్రవులఁ
దునిమియు నలిచియు దూరనేయుచును
బటురౌద్రయోధనిర్భరలీల మెఱయఁ
జటులత నిరువాగు సరియకాఁబోర
సడలెను హయములు సామజంబులును
పడియె తేరులు వీరభటకోటి గడసె.
కాలువలైన రక్తప్రవాహములఁ
గీలాలములఁ గన్నుగిలుపుచు నవ్వు
తలలు తామరలు; నుద్ధతమాంసమడును;
[8]తలమెదళ్ళు పులినతట ప్రదేశములు;
పెనుపారఁ బ్రేవులు బిససమూహములు;
తనరారు కేశసంతతిశైవలంబు;
రాలినమణికోటి రక్తోత్పలంబు;
నీలాబ్జసరములు నెలకొన్న తేంట్లు;
ఘనరథాంగంబులు కమఠసంఘములు;
ఒనరు వింజామరలొగి మరాళములు;910
తలకొన్న భూతభేతాళవర్గంబు
జలపక్షి నివహమై జలకేళిఁదేలి
కొలను చందంబునఁ గొమరగ్గలించి
కలను జూడగ భయంకరమయ్యెనపుడు!
ప్రమదబలంబులు పటుశక్తి మెఱసి
కమలనాభుని సేనఁగారింపఁదొడఁగె

విద్యుత్ప్రభాభాస వివిధబాణములు

ప్రద్యుమ్న గుహుల ద్వంద్వయుద్ధము


ప్రద్యుమ్నుఁడాగుహుపై నాటసేసె;
ఆతఁడు కోపించి హరితనూభవుని
కేతుదండము విల్లు గృత్తము సేయ
వేఱొక్క విలుగొని విష్ణునందనుఁడు
నూఱుబాణంబులు నొప్పింప గుహుఁడు
ఘనశక్తివైవ నిర్ఘాతశతంబు
చనుదెంచుగతి వచ్చు చటులతఁజూచి
యరదంబు దిగినిల్వనాతని శక్తి
హరుల సూతుని తేరు నడగించి చనియె;
రతిపతి యొండొక్క రథమెక్కి గుహుని
శితిశరంబున నేయశిరమును నురముఁ
బగిలి నెత్తురు గ్రమ్మఁబబలగాత్రంబు
చిగురొత్తు కింశుకచెల్వు వహించె;920
సేనాని పఱచుండఁజేరి యాప్రమథ
సేన బ్రద్యుమ్నుఁడు చెండాడఁదొడఁగె;

హలిపుష్పదత్తుల ద్వంద్వయుద్ధము


హలి పుష్పదత్తుని నాఱుబాణముల
చెలఁగియేయఁగ వాఁడు చేయార్చి యార్చి
యిరువది బాణంబులేసి నొప్పింప
పరుషతకోర్చి యాబలభద్రుఁ డలిగి

[9]మేటితూపులు నూఱు మేన గ్రుచ్చుటయు
నాతఁడు గదఁగొని యవనికి దాఁటి
సూతాశ్వరథమును జూర్ణంబు సేసి
తలవేయ నడువను ధాత్రిపైవ్రాలె
కులిశంబుఁ దాఁకిన కొండ చందమున;
 

బాణపుత్రుఁడు సాంబునిపైఁ గదియుట


బాణపుత్రుఁడు సాంబుపై నార్చియేడు
బాణంబులేసిన బద్మాక్షసూనుఁ
డాతనిమీఁదఁ బదాఱుబాణంబు
లాతతంబుగ నేయ నతఁడు కోపించి;
హరుల నాల్గిటిఁజంపి యాఱుబాణముల
నరదంబు సూతుని యవలీలఁగూల్చె.
విలుదుంచుటయుఁ బెంపు విడువక వ్రాలుఁ
బలుకయుఁ గొని మీఁదఁబారుతెంచుటయుఁ930
గని బాణసూనుఁడు కంపించి తేరి
వెనకకు జాఱి యుద్వేగుఁడై పఱచె;
బాణుఁడు సాత్యకిపై నార్చి వేయి
బాణంబు లడరింపఁ బటుశక్తి నతఁడు
కినిసి తచ్చరములఁ గృంతముఁజేసి
ఘనశరంబుల మోము గాడంగనేయ
సూనిన ఖిన్నమై యొకసాయకమున
సైనేయు సృక్కించి శౌరిపై నడచె;

శ్రీకృష్ణబాణాసురుల ద్వంద్వయుద్ధము


చండాంశుదశకర చటులంబులగుచు
మండితదోర్ధండమహిమ దీపింప
శ్రీరమ్యతర మేరుశిఖరమో యనఁగ
చారుకిరీటనిశ్చలకాంతి నిగుడ
లలితాంబుధరతటిల్లతికలో యనఁగ
బలిసి యుగ్రాయుధప్రభలుప్పతిలఁగఁ
దాఁకునఁబూర్ణ సుధాంశుచే నైన
ప్రాకట ముక్తాతపత్రంబు వెలుఁగఁ
బ్రథమాద్రిఁ దోతెంచు భానుఁడో యనఁగ
రథమెక్కి గర్వదుర్వార వేగమున
హరిమీఁద జనుదేర నతని కేతనము
మురిసి కూలుటయును ముదమంది(మదిని)940
“కలిగెఁ గదా! నాకుఁ గదనరంగమునఁ
గలుషంబుతోఁ జేతిగమి తీఁటమాన్ప”
నని మురారాతిపై నంబకాష్టకముఁ
జొనుపుటయును శౌరిచూచి కోపించి
పటుశార్ఙనిర్ముక్తబాణజాలముల
విటతాటముగ దైత్యవిభునేయ నతఁడు;
యేనూఱు చేతుల నేనూఱు విండ్లు
బూని నానాస్త్రముల్ పొరినేర్చి నారిఁ
దొడిగి పల్లేసినఁ దొలఁగక వాని
నడుమనే తునుమాడె నలినలోచనుఁడు
తొడిబడ విండ్లన్ని దునిమి రథములఁ
బొడిసేసి సారథి బొడవడగించి

యరదంబుఁ దునుమాడి యార్చియాశౌరి
శరముల మేను జర్ఘరితము చేసె;
కడుఁదుర్లు గుట్టినకరణి మేనెరియ
నొడలు పెన్నెత్తురులొలుక నయ్యసుర
మరలిచూడక పార మదనారి యంత

పినాకి కృష్ణునితోఁ బోరాడుట


హరిఁ దాఁకె బహుపిశాచావళితోడ
యాదవవీరులు నసురవీరులును
నాదటఁ బోరాడ నతిభీషణముగఁ950
గమలాక్షుసేనలగ్గలికమై తరుమఁ
బ్రమథసేనలు భూతబలమును దిరిగి
జడలు వీడఁగ మేను జళుకంద కాళ్లు
వడవడ వణఁకంగ వాతెరలెండఁ
బెదవులు దడవుచు భీతిఁ బెల్లుఱికి
యదవద పఱచె నాహరుఁడున్న కడకు;
పఱతెంచు సేనల భర్గుఁడు జూచి
వెఱవకుండని నిల్పి వృషభంబునెక్కె;
గరుడ వాహన యక్షగణములకంత
సరభసంబున మహాసంగ్రామమయ్యె;
దిక్కులొక్కట మ్రోసె దిగిభంగులొరలె;
చుక్క లెల్లడరాలె సురకోటి వెఱచె;
బ్రహ్మాదిసంయమిప్రతతి భీతిల్లె;
బ్రహ్మాండభాండంబు పగిలినట్లయ్యె!
హరుఁడు పినాకమునందేనుశరము

లురుముష్టి సంధించి యురమాడనేయ
హరిశార్ఙ నిర్ముక్తమగు శరాష్టకము
హరుమీఁద వెననేసి యార్చిన గినిసి
పాశుపతాస్త్రంబుఁ బశుపతి వ్రేయ
నాశౌరి యేసె నారాయణాస్త్రంబు.960
ఇరువుర శరములు నెలమి నొండొండఁ
బరుషమై రవికోటి పడినచందమున
డాయచుఁ బేర్చి మంటలు మింటనంట
మ్రోయుచు రెండస్త్రములు శాంతమయ్యె.
బ్రహ్మాస్త్రమడరింపఁబంకజోదరుఁడు.
బ్రహ్మాస్త్రమున శాంతపఱచె నాహరుఁడు.
ఆరూఢగతి హరుఁడనలాస్త్రమేయ
వారుణాస్త్రంబున వారించె శౌరి.
జలద బాణమునఁ బాషాణవర్షంబు
గలగొని యడరింపగాఁ గృష్ణుఁ డలిగి
యురగ బాణంబేయ నురక మురారి
గరుడాస్త్రమున దాని ఖండించివైచె.
వారణోజ్వలబాణవహనసత్వమున
నారుద్రుఁడడరింప నద్రులఁ బగిది
దారుణంబుగ మత్తదంతులు గవియ
నారసింహాస్త్ర మున్నతిఁ బ్రయోగించి
ఘోరకంఠీరవ కోటులచేతఁ
గోరి యాకరికోటిఁ గూల్చెనాశౌరి.
అంతట హరుఁడు కాలాంతకమూర్తి
యెంతయు హరిఁజూచి యెసఁగు రోషమున970

దాపజ్వరంబు నుద్ధతిఁ గూర్చి యేయ
నేపార నదిసేన నెరియింపఁ జొచ్చె.
ఉష్ణజ్వరమువచ్చు నురువడిఁజూచి
వైష్ణవాస్త్రముఁదొడ్గి వారిజోదరుఁడు

శీతజ్వరపీడితయై తాపజ్వరము శ్రీకృష్ణుని శరణు వేఁడుట


శీతజ్వరంబుఁ జెచ్చెర నేయుటయును
భూతకోటులు భయభ్రాంతిఁ గంపింప
తాపజ్వరంబు మేన్దప్పి కదియ్య
వాపోవుచును వచ్చి వారిజోదరుని
బదములపై వ్రాలి ప్రణుతింపదొడగె.
“యదువంశవల్లభ! అఖిలలోకేశ!
కారుణ్యమూర్తివి కంజాతనేత్ర!
వారిజోదర! భక్తవత్సల! కృష్ణ!
నెట్టున నీశక్తి నిఖిలజంతువులఁ
బుట్టింతు రక్షింతు పొలియింతు వీవ!
ప్రకృతియుఁ బురుషుఁడు పరమశాంతియును
వికృతులనానీవ విశ్వలోకేశ!”
అని సన్నుతించెడు నమ్మహాజ్వరముఁ
గనుఁగొని పలికె నాకమలనాభుండు.
“నీవేల వెఱచెదు? నీవున్న యెడల
సేవ నపథ్యంబు సేసిన వారిఁ980
గారింపుమర్థి నీకథ విన్నయట్టి
వారిఁబొందక నీవు వర్తింపుచుండు.”
శీతజ్వరంబంత శివు మేను సోఁకి

యాతతజాడ్యంబు నావలింతయును
ఘనమైన యాతన గంపంబుఁ గదిసి
కనుమోడ్చి నిద్రించుగతి నుండెనంత;
అంబిక శ్రీకృష్ణునిఁ బ్రార్థించుట
అంబర కేశాంగమర్థంబుఁ గొన్న
యంబరాంబర జగదంబ యేతెంచి
కరకరిఁ బోరు శంకరశార్ఙధరుల
నిరువురకడఁజొచ్చి యేపార నిలిచి
హరిమోముఁజూచి యిట్లని నుతియించె.
“వరద! జగన్నాథ! వసుదేవపుత్ర!
దేవదేవారాధ్య! దివ్యస్వరూప!
గోవింద! మధువైరి! గోపాలవంద్య!
నీవు మేల్కని చూడ నిఖిలంబుఁ బుట్టు
నీవు నిద్రించిన నిఖిలంబు నడఁగు!
మాయచే నఖిలంబు మాయగావించు
మాయస్వరూప! చిన్మయ! హృషీకేశ!
మూఁడుమూర్తులు నీవ మొగివానిమీఁద990
పోఁడిగాఁ బెరిగెడి పొడవవు నీవ
బాణుఁడు దనకు సద్భక్తుఁడుగాన
స్థాణుడాతనికినై సమరంబు సేసె;
భక్తవత్సలుఁడగు పరమాత్మ నీకు
భక్తుఁడుగాని నీపగవాఁడు గాఁడు.
ఇతనికి నీకును నేమి భేదంబు?
హితమతిఁ దలపోయ నేకరూపంబు!

నీనామమేప్రొద్దు నిష్ఠతో జపము
పూని యనుష్టింతుఁ బుండరీకాక్ష!
నను జూచియైనను నాగకంకణుని
ననుకంప వీక్షింపు”మని సన్నుతింప
నాతతజయశాలియైన కృష్ణుండు
శీతజ్వరము మాన్చెఁ జెచ్చెర నంత.

బాణుని రెండవ యుద్ధము


అంతయుఁ గని బాణుడట రథంబెక్కి
యంతకాకారుఁడై హరిమీఁదఁ గవిసి
యురుతరకనకపుంఖోజ్వలంబైన
శరపరంపరలు భీషణముగా జొనుప
హరి వాని బాణంబులవలీలఁ దునిమి
యిరుబాణమొక్కట నిరమేయుటయును;
క్రమ్మర మూర్చిల్లి క్రన్నన దెలిసి
యమ్మురారాతిఁ బెక్కమ్ముల నొంచి1000
భల్లమొక్కట వామభాగంబు నొంప
విల్లూడిపడుటయు విష్ణుఁడు కనలి
ధారుణి వడఁక పాతాళంబు బెదర
వారాసి కలఁగ దిగ్వలయంబు పగులఁ
దారలు డుల్ల నుత్తానచక్రంబు
దారుణశక్తిచే దనుజుని వైచె!
అరమంట లందంద యెగసి మిన్నంద
నురుముచందంబున నురుఘోష మెసఁగ
గుఱి మానికొమ్మలు కుప్పలై పడఁగ

నఱికినక్రియ భీషణస్ఫూర్తి మెఱయఁ
గటక కేయూరకంకణహేతిరుచులఁ
బటుతరంబుగ బాణుబాహులు నఱుకఁ
గని నీలకంఠుఁడు కమలాక్షు కడకుఁ
జనుదెంచి భక్తవాత్సల్యతఁ బలికె
“విశ్వజగన్నాథ! విశ్వరూపాఖ్య!
విశ్వవిశ్వంభర! విశ్వసంహార!
వేదాంగవాహన! వేదాంతవేద్య!
వేదగోచర! సర్వవేదాంతకృష్ణ!
అవని భారముమాన్ప ససురాళిఁ దునుమ
నవతరించినవాఁడ వంభోజనయన!1010
నీవాదిమూర్తివి నిఖిలమూర్తులును
నీవెకాకొండక నెఱిఁజూపగలడె?
బాహాసురుఁడు నాకు భక్తుఁడు వీని
బాహులన్నియుఁదుంప బంతంబుగాదు.
ననుగృపఁజూచి మన్నన నాల్గుచేతు
లునుపవే” యనుటయు నుగ్రాక్షుఁజూచి
గరుడుని డిగి వచ్చి కరకంఠుకేలుఁ
గరములఁ గీలించి కమలాక్షుఁడనియె.
“నీ భక్తుఁడననేల? నిగిడియే ప్రొద్దు
మాభక్తుఁ డీతడు మాప్రాఁతవాఁడు
మాన్యుఁడు ప్రహ్లాదు మనుమని కొడుకు
ధన్యాత్ముఁడగు బలితనయుఁడు గాన
నీతని కరుణించి యిచ్చితినాల్గు
చేతులు; నినుపూజ సేసెడికొఱకు

నీ భక్తులగు వారు నెఱి మాకు ప్రియులు
మా భక్తులగువారు మరి నీకు ప్రియులు
గాక నెందును వేరు గలదయ్య మనకు?
శ్రీకంఠ!” అని పల్కి శివుని వీడ్కొలిపి
చెలువార నాలుగు చేతులుఁదక్క
బలితనూభవు వేయి బాహువుల్ త్రుంచి1020
యేచి నెత్తురుగమ్మనేపారమేను
పూచిన మోదుగుఁ బొలుపారు నతఁడు
హరిపదాంబుజముల కందంద మ్రొక్కి
పరమసదానందభరితుఁడై పలికె.
“ఆదినారాయణ! అఖిలసన్మునులు
వేదాంత విదులును వెదకంగలేని
భవదీయ శ్రీపాదపద్మయుగ్మంబుఁ
దవిలి కొలువగంటి ధన్యుండనైతి!
అన్ని చేతులునేల యీశానుపూజ
కున్న చేతులెచాలు నురగేంద్రశయన!”
అని పల్క విని బాణు హరి డాయఁబిలిచి
తనువెల్ల నిమిరి ఖేదంబెల్ల మాన్పి
యమరత్వమును బ్రమదాధిపత్యమును
గమలాక్షుఁడిచ్చిన బహుసంతసిల్లె.
 

ఉషాకల్యాణము


బలిపుత్రుఁడును నాత్మభవనంబునకును
బలకృష్ణ సాత్యకి బ్రద్యుమ్నముఖులఁ
గొనిపోయి పూజించి కొమరారు వేడ్క

ననుపమ మణి భూషణాదులర్పించి
యయ్యుషాంగనతోడ ననిరుద్ధుఁదెచ్చి
యయ్యాదవాఢ్యుల కర్ధి మ్రొక్కించి1030
సకలవస్తువులను సమకూర్చి తెచ్చి
ప్రకట మంగళమైన బల్ముహూర్తమున
ననిరుద్ధయుషలకల్యాణవైభవముఁ
బెనుపారఁ జేయించి పెండ్లింటిలోన
నందఱ భక్ష్యభోజ్యాది వస్తువుల
నందంద తనిపి యాయసురాధిపుండు
వేయురథంబులు వేయుయేనుఁగులు
వేయువాజులఁ బదివేలు ధేనువుల
బహురత్నభూషణప్రముఖాంబరముల
బహుళ దాసీజన ప్రముఖసంపదల
నల్లునికింపార నరణంబు లిచ్చి
యుల్లముల్ చిగురొత్తి యొప్పారువేళ
ననిపివుత్తేర నాయాదవోత్తముఁడు;
అనుకంపబాణుఁ గృతార్థునిఁ జేసి
మన్నించి వీడ్కొల్పి మహితసంపదల
నన్నయుఁ దానును నరిగె ద్వారకకు.
అనిరుద్ధుఁడునుష నిత్యానందలీల
మనసిజక్రీడ నెమ్మది నోలలాడి
రీపుణ్యకథవిన్న నిష్టసౌఖ్యములుఁ
బ్రాపించు భవరోగబాధలు మాను1040
ధనధాన్యబహుపుత్రదారాభివృద్ధిఁ
దనరారకృష్ణుఁడు దనలోకమిచ్చు

నని చెప్పుటయు విని యభిమన్యసుతుఁడు
వినుతుఁడై శుకయోగివిభునకిట్లనియె.
“ఘనపుణ్యుఁడగు హరి కల్యాణకథలు
విని కృతార్థుఁడనైతి విష్ణుఁడు మరియు
ధారుణి పాలించి ధర్మవర్తనుల
నేరీతి విహరించె? నెఱిఁగింపు”డనిన
మధువైరికథలవాఙ్మనసగోచరము
లధిప! ఏర్పడ వినుమని చెప్పదొఁడగె.
అని యిట్లు నిత్యధర్మారంభుపేర
జనలోకనవపారిజాతంబుపేరఁ
జతురకళాపూర్ణచంద్రునిపేర
నతులవైభవనిర్జరాధీశుపేర
శోభితనవరూపసూనాస్త్రుపేర
నౌభళమంత్రికందామాత్యుపేరఁ
గోరి భరద్వాజ గోత్రసంజాతు
డారూఢమతి నయ్యలార్యనందనుఁడు
శృంగారరసకళాశ్రితవచోధనుఁడు
సింగనామాత్యుఁడు చెలువగ్గలింప1050
సలలితరసభావశబ్దగుంభనల
వలనొప్ప శ్రీభాగవతపురాణమున
మహనీయమగు దశమస్కంధసరణి
విహితలీలలనొప్పు విష్ణుచారిత్ర
మారూఢభక్తి కల్యాణకాండంబు
నారవితారార్కమై యుండఁజెప్పె.1053

కల్యాణకాండము సమాప్తము.
  1. ఒకేపాదమున్నది.
  2. నీతిబాధ లుడుగు
  3. దురితంబు
  4. ఒకేపాద మున్నది.
  5. ఒకే పాదమున్నది
  6. ఒకే పాదమున్నది
  7. “జలసత్య” అర్థము విచార్యము. పేరై యుండు నేమో?
  8. తల మెదళ్ళు పెండెలు గట్టుపులిన దేశములు
  9. ఒకే పాదము కన్పడుచున్నది