ద్వితీయస్కంధము - అధ్యాయము 2

ద్వితీయస్కంథము - అధ్యాయము 2


మ. బహువర్షంబులు బ్రహ్మ తొల్లి జగ ముత్పాదింప విన్నాణి గా

క హరిప్రార్థన ధారణా వశమునం గాదే; యమూఢోల్లస

న్మహనీయోజ్జ్వల బుద్ధియై భువన నిర్మాణ ప్రభావంబునన్

విహరించె న్నరనాథ ! జంతునివహావిర్భావ నిర్ణేతయై. (19)


వ. విను మూఢుండు శబ్దమయ వేదమార్గంబైన కర్మఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నానాలోక సుఖంబుల నిచ్ఛయించు. మాయామయ మార్గంబున

వాసనామూలంబున ( సుఖంబని తలంచి) నిద్రించువాఁడు కలలు గను తెఱంగునం బరిభ్రమించు, నిరవద్య సుఖలాభంబును జెందఁడు. తన్నిమిత్తంబున విద్వాంసుండు

(నామ మాత్ర సారంబులగు) భోగ్యంబులలోన నెంతట దేహనిర్వహణంబు సిద్ధించు నంతియ కైకొనుచు నప్రమత్తుండై సంసారంబు సుఖమని నిశ్చయింపక యొండు

మార్గంబున సిద్ధి గలదని చూచి పరిశ్రమంబు నొందకుండు. (20)


సీ. కమనీయ భూమి భాగముల లేకున్నవే ? పడియుండుటకు దూది పఱుపు లేల ?

సహజంబులగు కరాంజలులు లేకున్నవే ? భోజన భాజన పుంజ మేల ?

వల్కలాశాజినావళులు లేకున్నవే ? కట్ట దుకూల సంఘాత మేల ?

గొనకొని వసియింప గుహలు లేకున్నవే ? ప్రాసాద సౌధాది పటల మేల ?

తే. ఫల రసాదులు గుఱియవే ? పాదపములు, స్వాదుజలములు నుండువే ? సకల నదులుఁ

బొసఁగ భిక్షయుఁ బెట్టరే ? పుణ్యసతులు, ధనమదాంధుల కొలువేల ? తాపసులకు. (21)


క. రక్షకులు లేనివారల, రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్

రక్షింపు మనుచు నొక నరు, నక్షముఁ బ్రార్థింపనేల ? యాత్మజ్ఞునకున్ (22)


వ. అని యిట్లు స్వతస్సిద్ధుండు, నాత్మయు, నిత్యండును, సత్యుండును, భగవంతుండునైన వాసుదేవుని భజియించి తదీయ సేవానుభవానందంబున సంసార హేతువగు

నవిద్యచే బుద్ధిమంతుండు విడువంబడుం గావున. (23)


మ. హరిఁ జింతింపక మత్తుఁడై విషయ చింతాయత్తుఁడై చిక్కి వా

సరముల్ ద్రొబ్బెడు వాఁడు కింకిర గదాసంతాడితోరస్కుఁడై

ధరణీశో త్తమ ! దండభృన్నివసన ద్వారోపకంఠోగ్ర వై

తరణీ వహ్ని శివా పరంపరలచే దగ్ధుండు కాకుండునే ? (24)


క. మొత్తుదురు గదల మంటల, కెత్తుదు రడ్డంబు దేహ మింతింతలుగా

నొత్తుదు రసిపత్రికలను, హత్తుదురు కృతాంతభటులు హరి విరహితులన్ (25)


వ. మఱియు హరి చరణకమల గంధ రసస్వాదనం బెఱుంగని వారలు నిజ కర్మ బంధంబున దండధర ద్వార దేహళీ సమీప జాజ్వల్యమాన వైతరణీ తరంగిణీ దహన

దారుణ జ్వాలాజాల దందహ్యమాన దేహులం గూడి శిఖి శిఖావగాహంబుల నొందుచుండుదురు. మఱియు విజ్ఞానసంపన్నులై మను ప్రపన్నులెంతయు

మాయాపన్నులు గాక విన్నాణంబునం దమ తమ హృదయాంత రాళంబులం బ్రాదేశమాత్ర దివ్యదేహుండును, దిగిభరాజ శుండాదండ సంకాశ దీర్ఘ చతుర్బాహుండును,

భోగైశ్వర్య ప్రదుండును, కంజాత శంకచక్ర గదాధరుండును, కందర్ప కోటి సమాన సుందరుండును, రాకా విరాజమాన రాజమండల సన్నిభ వదనుండును, సౌభాగ్య

సదనుండును, ప్రభాతకాల భాసమాన భాస్కరబింబ ప్రతివిరాజిత పద్మరాగ రత్నరాజి విరాజమాన కిరీటి కుండలుండును, శ్రీవత్స లక్షణ లక్షిత వక్షో మండలుండును,

రమణీయ కౌస్తుభ రత్న ఖచిత కంఠికాలంకృత కంధరుండును, నిరంతర పరిమళ మిళిత వనమాలికా బంధురుండును, నానావిధ గంభీర హార కేయూర కటక కంకణ మేఖ

లాంగుళీయక విభూషణవ్రాత సముజ్జ్వలుండును, నిటలతట విలంబమాన విమల స్నిగ్ధ నీలకుంచిత కుంతలుండును, తరుణ చంద్ర చంద్రికా ధవళ మందహాసుండును,

పరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సూచిత సుభగ సంతతానుగ్రహ లీలా విలాసుండును, మహా యోగిరాజ విలసిత హృదయ కమల కర్ణికామధ్య సంస్థాపిత చరణ

కిసలయండును, సంతతానంద ( మయుండును) సహస్రకోటి సూర్య సంఘాత సన్నిభుండును, మహానుభావుండు నైన పరమేశ్వరుని మనోధారణా వశంబున నిలిపికొని,

తదీయ గుల్ప చరణ జాను జంఘాద్యవయవంబులు క్రమంబున నొకటి నొకటినిఁ బ్రతిక్షణంబును ధ్యానంబు సేయుచు నెంత కాలంబునకుఁ బరిపూర్ణ నిశ్చల

భక్తియోగంబు సిద్ధించు నంతకాలంబునుం దదీయ చింతాతత్పరులై యుండుదురు. అని మఱియు నిట్లనియె . (26)


సీ. ఆసన్న మరణార్థి యైన యతీశుండు కాలదేశములను గాచికొనఁడు

తనువు విసర్జించు తలఁపు జనించిన భద్రాసనౌస్థుఁడై ప్రాణపవను

మనసుచేత జయించి మానసవేగంబు బుద్ధిచే భంగించి బుద్ధిఁ దెచ్చి

క్షేత్రజ్ఞుతోఁ గూర్చి క్షేత్రజ్ఞు నాత్మలోపలఁ యాత్మను బ్రహ్మమందుఁ

తే. గలిపి యొక్కటి గారవమున, శాంతితోడ నిరూఢుఁడై సకలకార్య

నివహ మెల్లను దిగనాడి నిత్యసుఖము; నలయునని చూచు నటుమీఁద వసుమతీశ. (27)


వ. వినుమ ప్పరమాత్మయైన బ్రహ్మమునకుఁ దక్కకాల దేవ సత్త్వ రజ స్తమోగుణాహంకార నహత్తత్త్వ ప్రధానంబులకు సామర్థ్యంబు లేదు. కావునఁ బరమాత్మ వ్యతిరిక్తంబు

లేదు. దేహాదులం దాత్మత్వంబు విసర్జించి, యన్యసౌహృసంబు మాని, పూజ్యంబైన హరిపదంబున ( బ్రతిక్షణంనున) హృదయంబున నాలింగనంబుసేసి, వైష్ణవంబైన పరమ

పదంబు ( సర్వోత్తమం బని ) సత్పురుషులు దెలియుదురు. ఇవ్విధంబున విజ్ఞానదృగ్వీర్య జ్వలనంబున నిర్దగ్ధ విషయవాస నుండై క్రమంబున నిరపేక్షత్వంబున (28)


సీ. ఆంఘ్రిమూలమున మూలధార చక్రంబుఁ బీడించి ప్రాణంబు బిగియఁ బట్టి

నాభీతలముఁజేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీఁది కెగయఁబట్టి

యఈమీఁద నురమందు హత్తించి క్రమ్మఱఁదాలు మూలమునకుఁ దఱిమి నిలిపి

మమతతో భ్రూయుగ మధ్యంబుఁ జేర్చి దృక్కర్ణ నాసాస్య మార్గములు మూసి

తే. యిచ్ఛలేని యోగ యొక్క ముహూర్తార్థ, మింద్రియానుషంగ మింతలేక

ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి, బ్రహ్మమందుఁ గలియుఁ కౌరవేంద్ర ! ( 29 )


వ. మఱియు దేహత్యాగకాలంబున నింద్రియంబులతోడి సంగంబులు విడువనివాఁడు వానితోడన ( గణసముదాయ రూపంబుగు ) బ్రహ్మాండంబునందు ఖేచర సిద్ధి విహార

యోగ్యంబు నణిమాది సకలైశ్వర్య సమేతంబునైన పరమేష్టిపదంబుఁ జేరు. విద్యాతపో యోగసమాధి భజనంబు సేయుచుఁ బవనాంతర్గత లింగశరీరులైన యోగీశ్వరులకు

బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి యని చెప్పదురు. ఏరికిని గర్మంబుల నట్టి గతిఁ బొంద శక్యంబుగాదు. యోగి యగువాఁడు బ్రహ్మలోకంబునకు నాకాశపథంబునం

బోవుచు సుషుమ్నానాడివెంట నగ్నియను దేవతంజేరి జ్యోత్మిర్మయంబైన తేజంబున నిర్మలుండీ యెందునుందగులు వడక తారామండలంబు మీఁద సూర్యాది ధ్రవాంత

పదంబులఁ గ్రమ కక్రమంబున నతిక్రమించి, హరి సంబంధంబైన శింశుమార చక్రంబుఁ జేరి ( యొంటరి యగుచు ) పరమాణుభూతంబైన లింగశరీరంబుతోడ బ్రహ్మవిదులకు

నెలవైన మహర్లోకంబుఁ జొచ్చి దందహ్యమానంబగు లోకత్రయంబు వీక్షించుచుఁ, ద న్నిమిత్త సంజాత దాహతాపంబు సహింపజాలక. ( 30 )


సీ. ఇల మీఁద మనువు లీ రేడ్వురుఁ జనువేళ దిపసమై యెచ్చోటఁ దిరుగుచుండు

మహనీయ సిద్ధి విమానసంఘము లెందు దినకరప్రభములై తేజరిల్లు

శోక జరా మృత్యు శోషణ భయ దుఃఖ నివహంబు లెందు జనింపకుండు

విష్ణుపద ధ్యాన విజ్ఞాన రహితుల శోకంబు లెందుండి చూడవచ్చు

ఆ. పరమ సిద్ధి యోగి భాషణామృత మెందు, శ్రవణపర్వ మగుచు జరుగు చుండు

నట్టి బ్రహ్మలోకమంచు వసించును, రాజవర్య ! మఱల రాఁడు వాఁడు ( 31 )


వ. మఱియు నొక్క విశేషంబు కలదు. పుణ్యతిరేకంబున బ్రహ్మలోకగతు లైన వారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికార విశేషంబు నొందువారలగుదురు.

బ్రహ్మాది దేవతాభజనంబునం జనువారౌ ( బ్రహ్మా జీవితకాలంబుదనుక ) బ్రమలోకంబున వసియించి ( ముక్తి లగుదురు ). నారాయణ చరణకమల భక్తి పరాయణత్వంబునఁ

జనినవారు నిజేచ్ఛా వశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నత వైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు. ఈశ్వరాధిష్టితంబైన ప్రకృతియంశంబున

మహత్తత్త్వమగు. మహత్తత్త్వంశంబున నహంకారంబగు. అహంకారాంశంబున శబ్దతన్మారత్రంబగు. శబ్దతన్మాత్రాంశంబున గగన మగు. గగననాంశంబున స్పర్శరన్మాత్రంబగు.

స్పర్శతన్మాత్రాంశంబున సమీరణంబగు. నమీరణాంశంబున రూపతన్మాత్రంబగు. రూపతన్మాత్రాంశంబు వలనఁ దేజంబగు. తేజోంశంబున రసతన్మాత్రంబగు.

రసతన్మాత్రాంశంబు వలనఁ జలశంబగు. జలాంశంబున హంధతన్మాత్రంబగు. గంధతన్మాత్రాంశంబు వలన బృథివి యగు. వాని మేళనమునం జతుర్దశ భువనాత్మకంబైన

విరాడ్రూపం బగు. ఆ రూపమునకుఁ గోటియోజన విశాలంబైన యండకటాహాంబు ప్రథమావరణంబైన పృథ్వి యగు. దీనిఁ బంచాశత్కోటి విశాలం బని కొందఱు పలుకుదురు,

అయ్యవరణంబు మీఁద సలిల తేజ స్సమీర గగనాహంకార మహత్తత్త్వంబు లనియెడి యావరణంబులు క్రమంబున నొండుంటికి సశగుణోత్తరాధికంబలై యుండు. అట్టి

యేడింటి మీఁదఁ బ్రకృత్యావరణంబు మహావ్యాపకం బగుఇ బ్రహ్మాండంబు భేదించి, వైష్ణవ పదారోహణంబు సేయువాఁడ నిర్భయుండై, మెల్లన ( లింగదేహంబున )

బృథివ్యాత్మకత్వంబు నొంది, యట్టి పృథివ్యాప్తకత్వంబున ఘ్రాణంబునం గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబున, తేజోరూపకత్వంబున దర్శనంబున

రూపంబును, సమీరణాత్మకత్వంబున డెహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును నతిక్రమించి భూత సూక్ష్మేంద్రియ లయస్థానంబైన

యహంకారావరణ సంప్రాప్తుండై, యందు మనోమయంబును దేవమయంబును నైన సాత్త్వకాహంకార గమనంబున మహత్తత్త్వంబున సొచ్చి గుణత్రయంబును లయించిన

ప్రధానంబు నొంది, ప్రధానాత్మకత్వంబున దేహంబు నుపాధి పరంపరావసానంబునం బ్రకృతిం బాపి యానందమయుండై యానందంబునం బరమాత్మ రూపంబైన వాసుదేవ

బ్రహ్మమందుఁ గలియు నని చెప్పి వెండియు నిట్లనియె. ( 32 ).


ఆ. పరమ భాగతులు పాటించు పథ మిది, యా పథమున యోగి యరిగె నేని

మగుడి రాఁడు వాఁడు మఱి సంశయము లేదు, కల్పశతములైన కౌరవేంద్ర ! (33 ).


వ. వినుము. నీవడిగిన సద్యోముక్తియుఁ గ్రామముక్తియు ననియెడు నీ రెండుమార్గంబులు వేదగీతంబులందు వివరింపంబడియె. వీనిం జాల్లి భగవంతుండైన వాసుదేవుండు

బ్రహచేత నారాధితుండై చెప్పె, సంపార ప్రవిష్టుండైన వానికిఁ కంటె సులభంబు లేదు. ( 34 ).


                                                                             "సమాప్తము"