దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/2 బెజవాడ
పిమ్మట పెనుగొండగ్రామమునకు బోయితిమి. శ్రీ శివశంకరపిళ్ళె యను నొకన్యాయవాది గుత్తిలో కేశవపిళ్ళెగారి వలెనే పలుకుబడి కలిగి, కాంగ్రెసువ్యవహారములలో నచట శ్రద్ధవహించుచుండెడివారు. వారితో పరిచయముచేసికొని నెల్లూరు జేరి అక్కడ మహాసభ సమావేశపరచితిమి. ఇచ్చటి ఆంగ్లేయవిద్యాధికులకును చిత్తూరులోనివారికిని చెన్నపట్టణమునం దభిమాన మెక్కువగానుండి, చెన్నపట్టణము ఆంధ్రములో చేర దనుతలంపుతో ఆంధ్రరాష్ట్రనిర్మాణముపట్ల వైముఖ్యముండెను. కాని సామాన్యజనుల అభిప్రాయము అనుకూలముగనే యున్నదని గుర్తించితిమి. తిరుపతి, చిత్తూరుపట్టణములందు దక్షిణాదిఅరవవైష్ణవులు, ఆంగ్లేయవిద్యాధికులు సహజముగ అరవదేశాభిమానులై యుండుటవలన వారు ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునకు వ్యతిరేకాభిప్రాయములు వెలిబుచ్చుచుండిరి.
2 బెజవాడ
__________
వేసవికాలము తిరిగివచ్చునప్పటికి బెజవాడలో రెండవ ఆంధ్రమహాసభ సమావేశమగునట్లు నిర్ణయించబడెను. బెజవాడలో శ్రీ పెద్దిబొట్ల వీరయ్యగారు, శ్రీఅయ్యదేవర కాళేశ్వరరావుగారు, అయ్యంకి వెంకటరమణయ్యగారు మొదలగు దేశాభిమానులు ఆంధ్రమహాసభను బాపట్లలోకంటె నెక్కువ వైభవముతో జరుపవలెనని కొన్నివేలరూపాయలు చందాలు వసూలుపరచి, పెద్ద పాక యొకటి సభాస్థానముగను, మరికొన్ని యితరపాకలు ప్రతినిధులనిమిత్తమును, వంటలు, భోజనముల నిమిత్తము మరికొన్ని పర్ణశాలలు నేర్పరచిరి. కాని తలవని తలంపుగా గొప్ప గాలివానవచ్చి వాటి నన్నిటిని నిర్మూలము గావించెను. బెజవాడ సన్మానసంఘమువారు వెనుదీయక మరల ఎంతయో సొమ్ము వ్యయముచేసి, అట్టివియే పాకలను నిర్మాణముచేసిరిగాని మరల నట్టి విపరీతవర్షమే కురిసి పాకల నన్నిటిని నేల గూలవేసెను.
బాపట్లలో మహాసభకు ఎనిమిదివందలప్రతినిధులు వచ్చియుండిరి. ఈసారి దేశములో రాష్ట్రనిర్మాణమునుగూర్చి తీవ్రమగు ఆందోళనజరిగియుండుటచే కొన్నివేలప్రతినిధులు రాగలరని బెజవాడవారు అందుకు తగినట్లు గొప్పఏర్పాటులు గావించిరి. బాపట్లలో రెండురోజులు సభ ముగిసిన మరునాడుదయమున ప్రతినిధులు వారివారి స్వస్థానములకు బోవుటకు రైలు స్టేషనుకు బోవునప్పటికి ఆకస్మికముగ పెద్దవర్షము కురియనారంభించెను. ఎంతతడవైనను వర్షము ఆగలేదు. రైళ్ళు రాలేదు. బాపట్ల సన్మానసంఘమువారు భోజనములులేక స్టేషనువద్దనున్నవారల కందరికి మరల వంటలుచేయించి భోజనములుపెట్టి ఆదరింపవలసివచ్చెను. ఈసారి వర్షము ప్రప్రధమముననే బెజవాడలో పాకలను పాడుచేసెను. ఇది తలచుకొని పలువురు విస్మయాకులచిత్తు లగుచుండిరి. మూడవసారి వేసిన పాకలుమాత్రము వర్షోపద్రవములేకుండ నిలచియుండెను. ఈమహాసభకు బందరు న్యాయవాదులలో ప్రముఖులైన శ్రీ పురాణము వెంకటప్పయ్యగారు సన్మానసంఘాధ్యక్షులుగానుండిరి. న్యాపతి సుబ్బారావుగారు సభాధ్యక్షులుగ నుండిరి. సభాదినమున ఉదయమే ప్రతినిధులు కృష్ణానదిలో స్నానములుచేసి ఊరిలోనూరే గింపుగావించిరి. శ్రీ సెనగపల్లి రామస్వామిగుప్త యనువారిని గూర్చి పైన కొంత వ్రాసితిని. సభలలో ఈయన మిక్కిలి ధైర్యముతో ఆవేశపూరితుడై దీర్ఘముగ నుపన్యాసములుచేయుచుండెను. ఆంధ్రదేశమున జరిగిన మహాసభలలో ఆరోజులలో ఈయన హాజరై, గంభీరముగ నుపన్యసించని సభ లేదనియే చెప్పవచ్చును. ఈ ఆంధ్రమహాసభాసమావేశములలో ఆయన యుత్సాహమునకు మేర లేకుండెను. ఊరేగింపులలో జయజయ ధ్వానములలో రామస్వామిగారి జయఘోష లెక్కువ వినబడుచుండెను.
మహాసభకు వేలకొలది ప్రజలు హాజరైరి. ప్రతినిధులు రమారమి రెండువేలుగా నుండిరని జ్ఞాపకము. రాష్ట్రనిర్మాణ తీర్మానము ఈసారి తప్పక నెగ్గించవలెనని పలువురు గట్టిపట్టుపట్టియుండిరి. మహాసభకు మోవర్ల రామచంద్రరావుగారును విచ్చేసిరి. వీరు రాష్ట్రనిర్మాణమునకు సుబ్బారావుపంతులుగారి వలెనే వ్యతిరేకులు గాన వారిరాకకు సంతసించితిమి. కానివా రేమందురో యను సంశయము పలువురను బాధించుచుండెను. మొదటిదినమున సన్మానసంఘాధ్యక్షులు ప్రతినిధుల సన్మానవచనములతో నభినందించుచు ఆంధ్రరాష్ట్రనిర్మాణము మిక్కిలి ఆవశ్యకమని ప్రతిపాదించిరి. ప్రతినిధులును ప్రేక్షకులును అమందానందముతో పొంగిపోయిరి. నేను ప్రచారసంఘవారు గావించిన పర్యటనవిశేషములనుగూర్చి నివేదిక వ్రాసి సభవారికి చదివి వినిపించితిని. సభాధ్యక్షులైన సుబ్బారావుగారి ఉపన్యాసవివరములు నే నిప్పుడు వ్రాయజాలను గాని అది సభాసదులకు సంతుష్టిగావించలే దనిమాత్రము స్పష్టమే. మరునాడు మరల సభ సమావేశమై కొన్ని కాలేజీలు విద్యాశాలలు స్థాపించవలసినదని, ఆంధ్రులకు ప్రభుత్వోద్యోగములలో ఎక్కువ అవకాశమియ్యవలెనని కొన్ని తీర్మానములు చర్చించి అంగీకరింపబడినవి. పిదప మధ్యాహ్నము సమావేశమగునట్లు నిర్ణయింపబడెను. మధ్యాహ్నమగుసరికి మరల వర్షము ప్రారంబమయ్యెను. శ్రీ సుబ్బారావుపంతులుగారు పెద్దలగుటచే సుస్తీచేసి సభకు రాజాలకపోయిరి. వారిస్థానమున మరియొకరి నెవ్వరినో యెన్నుకొని రాష్ట్రనిర్మాణతీర్మానము చర్చించబడెను. ఈసారి తప్పక నెగ్గుననుట స్వతస్సిద్ధముగనే గన్పడెను. పలువురు అనుకూలముగ బల్కువారే యేర్పడిరి. పైనుండి వర్షముగురియుచు తాటాకుపందిరిమీద పడినవర్షము సభాసదులమీద పడుచున్నను కొందరు గొడుగులువేసుకొనియు, కొందరు తలపైన గుడ్డలుకప్పుకొనియు సభాస్థలము విడువక జయజయధ్వానములు మిన్నుముట్టునట్లు హర్షధ్వనులు గావించుచు తీర్మానమును అంగీకరించిరి. విశాఖపట్టణజిల్లావారు మూడవ ఆంధ్రమహాసభను వారిపట్టణమునకు ఆహ్వానముచేసిరి. పెద్దతటాకములోని నీరు కట్టతెగి ప్రవాహముగ పారి, చుట్టుప్రక్కల నేలపై పెద్దవెల్లువలై పారినట్లు ఆంధ్రరాష్ట్రనిర్మాణాశయము ఇక నే అడ్డులేక ఆంధ్రదేశము దంతటను వ్యాపించగలదని స్పష్టమయ్యెను.
- _____________