దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/లాయరే ముద్దాయి ఆయెను

లాయరే ముద్దాయి ఆయెను

పిమ్మటిదినములలో ముఖ్యాంశ మొక్కటి వివరింపదగియున్నది. బందరు సమీపమున అవనిగడ్డలో నొక డిప్యూటీ తహశ్శీలుదారుడు మాజస్ట్రేటుగా సహితము వ్యవహరించు చుండెను. ఇతడు చాల లంచగొండియనియు, ప్రజలను పీడించు చున్నాడనియు చెప్పుకొనుచుండిరి. తనపశువులు మరియొకరి పొలములో బడి పైరు నష్టపరచిన వనుకారణమున వాని నారైతు బందెలదొడ్డికి తోలుకొనిపోవుచుండగా నడ్డగించి ఒక రైతు తనయింటికి తోలుకొనివెళ్ళి కట్టివేసుకొనెను. అవనిగడ్డ మాజస్ట్రేటుదగ్గర ఛార్జిదాఖలు చేయబడినది. ఇది అవకాశముచేసుకొని పశువులఖామందైనరహితును జయిలులోబెట్టి నూరురూపాయల లంచము తీసికొని విడుదలచేసి, పిమ్మట కేసు విచారణచేసి దొంగనేరముక్రింద రు 10/- లు జరిమానా విధించెను. ఇట్టివియే అనేకులవలన లంచములు పుచ్చుకొనినట్లు జిల్లాకలెక్టరుకు మహజరులు వచ్చినందున డిపార్టుమెంటల్ విచారణ చేయుటకు కలెక్టరు నిర్ణయించి, అందుకు తనకు సహాయోద్యోగియగు బోసు అనువారిని నియమించెను. ఆయన సాకల్యముగా విచారించి,మాజిస్ట్రేటు లంచములు పుచ్చుకొనినట్లు రుజువైనదని జిల్లాకలెక్టరుకు నివేదిక నంపెను. ఆకాలమున శ్రీ పండిత నాగేశ్వరరావుగారు హెడ్‌క్వార్టర్సు డిప్యూటీమాజిస్ట్రేటుగా నుండి, జిల్లాకలెక్టరుకు మిక్కిలి యిష్టులుగా నుండిరి. బోసుగారి నివేదికను కలెక్టరు నాగేశ్వరరావుగారి కిచ్చి, దానిని చదివి అభిప్రాయమును తెలుపుమనెను. నాగేశ్వరరావుగా తా నివేది కను పరికించి సాక్షులు ప్రమాణముచేసి సాక్ష్యమీయలేదు గనుక అది విచారణలో గొప్ప లోపమని తెలిపిరి. అంతట కలెక్టరు నాగేశ్వరరావుగారినే సాక్షులను క్రమముగా విచారించి నవేదిక పంపవలసినదని ఆర్డరువేసెను. ఇంతలోనే అవనిగడ్డ మాజిస్ట్రేటు నాగేశ్వరరావుగారిని దర్శించి, వారి అభిమానమును సంపాదించుకొనగల్గెనని ప్రజలు బాహాటముగ చెప్పుకొనసాగిరి.

నాగేశ్వరరావుగారు మాజస్ట్రేటుమీద మహజరులు పెట్టినవారిని వారి సాక్షులను విచారణచేయుటకు వాయిదావేసి నోటీసులు పంపిరి. వానిని పుచ్చుకొనక తప్పించుకొని తిరుగుచు మహజరులుపెట్టినవారు, సాక్షులు వాయిదాలకు హాజరుగాక పోవుట సంభవించినది. నాగేశ్వరరావుగారియొద్ద హాజరైన యెడల మహజరులోని అంశములు అబద్ధములని తీరుమానించి తమపై నేరారోపణ చేయుదు రనుభయము కలిగి వారట్లు తప్పించుకొనుచుండిరి.

ఇట్లుండగా చల్లపల్లి జమీందారుగారికి వారిసోదరులకును గలిగిన విరోధములనుబట్టి వారి రహితులలో కక్షలు ప్రబలి నొకరిపై నొకరు దౌర్జన్యములుజరుపుకొనినట్లు పెద్దకేసులు మాజస్ట్రేటుకోర్టులో దాఖలైనందున ఆవిచారణ నాగేశ్వరరావుగారే జరుపుట సంభవించినది. జమీందార్లమధ్య విరోధమును బట్టి ఏర్పడిన కేసు గనుక బందరులోని పెద్దవకీళ్ళందరును ఏదో ఒకపక్షమున పనిచేయుటకు వాయిదానాడు కోర్టులో హాజరైరి. ఇతరు లనేకులుగూడ వింతజూచుటకు వచ్చి కోర్టు నిండియుండిరి. విచారణజరుగుచుండగా అవనిగడ్డమాజస్ట్రేటుగారికి నూరు రూపాయలు లంచమిచ్చి రు 10/- లు జరిమానాపడిన రహితు గూడ ఏదో పనిమీద బందరుకు వచ్చి, కేసువిచారణ చూచుటకు కోర్టుకు వచ్చెను. ఆ రహితును నాగేశ్వరరావుగారెట్లు గుర్తించిరో ఊహింపశక్యముకాదు గాని ఎట్లో గుర్తించి కేసువిచారణమధ్యనే ఆరహితును 'పకడ్‌లేవ్‌' అని జవానుకు బిగ్గరగా ఆజ్ఞాపించెను. ఆరహితు వెలుపలకు పరుగెత్తెను. జవాను వెంబడించి పట్టుకొని హాజరుపెట్టెను. రు 2000/-లకు జమీనిచ్చి తాము విచారించుచున్న అవనిగడ్డమాజస్ట్రేటుమీది విచారణవాయిదానాటికి హాజరుకావలసిన దనియు లేనియెడల జయిలులో నుండవలసినదనియు నాగేశ్వరరావుగా రుత్తరువు వేసిరి.

రామాయణములో పిడుకలవేట్లాటవలె విచారణమధ్యమున జరగిన ఈ నిరంకుశచర్య కోర్టులో నున్నవా రందరకు విస్మయము కల్పించెను. అచ్చట నుండి ఈచర్య యంతయు చూచుచున్న భట్రాజు వెంకట్రాయుడుగా రను సెకండుగ్రేడు ప్లీడరు త్వరితముగా సబుకోర్టుకు వచ్చి, అక్కడనున్న ప్లీడర్లందరితో నాగేశ్వరరావుగారు నడిపించిన దౌర్జన్యమునుగూర్చి వివరించి, దీనికి తగిన పరిహారము ఆలోచింపవలసినదని నొక్కి చెప్పెను. ప్లీడర్లు వారివారి పనులనిమిత్తము వెడలిపోయిరి. వల్లూరి సూర్యనారాయణరావుగారును నేను మాత్రమే నిలచి యుంటిమి. వారు నాకు ఇంచుక సీనియ రయినను మిత్రులు గావునను స్వభావముచే ప్రభుత్వోద్యోగుల లంచగొండితనమును, నిరంకుశత్వమును నిరసించువా రగుటచేతను ఈసమయమున మనము జోక్యము పుచ్చుకొనుట అవసరమని పలికినమీదట మేము ఇరువురమును భట్రాజు వెంకట్రాయుడుగారును కలిసి పండితనాగేశ్వరరావుగారికోర్టుకు వచ్చుసరికి ఆయన ఆనాటికి పని ముగించుకొని ఇంటికి వెడలిపోయిరి. ఆ రహితువలన వకాల్తునామ తీసికొని, అతని విడుదలనిమిత్తము నాగేశ్వరరావు గారియొద్దనే అర్జీ దాఖలుచేయుటకు నిశ్చయించుకొని పండిత నాగేశ్వరరావుగారు న్యాయవిరుద్ధముగను, నిరంకుశముగను, ద్రోహబుద్ధితోడను ప్రవర్తించినారని అర్జీలో వివరముగ వ్రాసితిమి. నాగేశ్వరరావుగారు ఇంటిలో నుండగా అక్కడనే వారి కిచ్చితిమి. వారు దానిని చేత దీసుకొని చదువుచుండగా ఇంచుక చేయి వణికినదిగాని వెంటనే దృడత్వమును బూని, "అర్జీదారునిపై వేయబడిన ఉత్తరువును రద్దుపరచుటకు కారణము లే"దని యుత్తరువువేసెను. అంతట మేము అప్పటికి చేయునదేమియు లేదని యింటికి చేరితిమి. ఆ రహితు ఎటులనో జామీనిచ్చి యింటికి జేరెను. నాగేశ్వరరావుపంతులు తనకు మేమిచ్చిన అర్జీలోతాను నిరంకుశముగను, ద్రోహబుద్ధితోడను ప్రవర్తించినాడని మేము వ్రాసిన అంశమును ఆధారముచేసుకొని మమ్ముల నిరువురిని ఎందుకు ప్రాసిక్యూషను చేయగూడదో సంజాయిషీ చెప్పవలసినదని నోటీసులు పంపించుచు, జిల్లాజడ్జిగారికిగూడ ఇందువిషయమున మామీద చర్యజరుపవలసినదని లేఖ యొకటి వ్రాసి పంపెను.

ఈనోటీసు మాకు పంపినవిషయము బందరుపురమునందంతట ప్రాకిపోయెను.నాగేశ్వరావుగారి చర్యలును, అవనిగడ్డ మాజిస్ట్రేటుపట్ల ఆయనపక్షపాతమును అందరికి తెలిసినవిషయమగుటచే మేము వ్రాసినవాక్యములు సత్యదూరములుకావని ఎల్లరును గ్రహించినను మమ్మాత డేమి చేయునోగదాయని వ్యాకులత నొందుచుండిరి. నాగేశ్వరరావుగారు ఆ ఆసామిని ఆకస్మికముగ పట్టి, పోలీసుహవాలులో నుంచిన సమయమున న్యాయవాదులు చాలమంది యుండినకారణమున వా రందరి వలనను జరిగినవిషయము జరిగినట్లు వివరముగ తెలుపు ప్రమాణ పత్రములను వ్రాయించి, తీసికొని శ్రీ జె. డి. సామ్యుయల్ అను క్రిమినల్‌లాయరును మాపక్షమున పనిచేయుడని కోరగా ఆయన తోడిన్యాయవాది యగుటవలన ఉచితముగనే పనిచేయుటకు సమ్మతించి, వాయిదానాటికి దాఖలుచేయుటకు అర్జీ తయారుచేసెను. మా అర్జీలో వ్రాసిన అంశములు సత్యములనియు, పార్టీకి న్యాయముజరుగుటకు వ్రాయబడినవేగాని అధికారనిర్వహణమునకు అడ్డముగావించునవి కావనియు, మామీద జారీచేయబడిన నోటీసుచర్యను రద్దుపఱచవలెననియు వ్రాసి నాగేశ్వరరావుగారికోర్టులో మాతోపాటే హాజరై అర్జీని,న్యాయవాదు లిచ్చిన ప్రమాణపత్రములతోగూడ దాఖలుచేసి, తన పార్టీదారులైన ప్లీడర్లు అర్జీలో వ్రాసినవిషయము అఫిడవిట్లుమూలకముగ దృవపడుచున్నదిగాన వీరిమీద జరుపుచర్య న్యాయసమ్మతము కాదని వాదించెను. నాగేశ్వరరావుగారు ఈవాదనను అంగీకరించక మమ్ముల నిర్వురను క్రిమినల్ ప్రొసీజరుకోడ్డు 477 వ సెక్‌షనుక్రింద పోలీసుహవాలుచేసి వెంటనే మరియొక మొదటితరగతి మాజస్ట్రేటునొద్దకు బంపెను. ఈఉత్తరువు గ్రామములో గొప్ప సంచలనము గావించెను. ప్లీడర్లను పోలీసుహవాలా చేసి, క్రిమినల్‌విచారణకై పంపుట అప్పటికి ఎన్నడు వినియెరుగని సంగతి. ప్రజల కది విపరీతముగ గన్పట్టెను. మొదటితరగతిమాజస్ట్రేటు ఎదుటకు మేము పోయీ పోకముందే ఆయన మమ్ములను మర్యాదతో సబోధించి "మీకు వాయిదా కావలసియున్నదికాబోలు, ఎంతకాలము కోరెదర"ని మమ్ము ప్రశ్నించెను.హైకోర్టులో రివిజన్‌పిటిషను పెట్టుకొని ఉత్తరువుపొందువరకు మూడునెలలు కావలెనని కోరితిమి, మావలన స్వంతపూచీఖత్తులు పుచ్చుకొని ఆయన వాయిదావేసెను.

మేము అంత హైకోర్టులో స్వామినాధను అను బారిష్టరు ద్వారా శ్రీ శంకరనాయరుగారిని నియమించుకొని హైకోర్టులో శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ శ్రీ బోడాముగార్లు చేరిన కోర్టులో రివిజన్‌పిటిషను దాఖలుచేయించితిమి. స్వామినాధను మా కిరువురకుగూడ స్నేహితుడుగాన ఆయనద్వారా చాల సానుభూతితో శ్రీ శంకరునాయరుగారు పనిచేసిరి. ఇట్టి విషయములో రివిజన్‌పిటిషను ఫైలులో చేర్చుకొనుట దుర్లభమైనను కొన్ని తీర్పులు శోధించి ఫైలులో చేర్పించిరి. నాయరుగారికి నూరురూపాయలు ఫీజు వెంటనే చెల్లించితిమి. హైకోర్టులో విచారణ వాయిదా పడులోపల స్వామినాధను క్రిందికోర్టురికార్డులు వగైరా తెప్పించి తర్జుమాచేయుచుండెను.

ఇంతలో అవనిగడ్డమేజస్ట్రేటుచే పదిరూపాయలు జరిమానా విధింపబడిన ఆ ఆసామీ బందరుడిప్యూటీ మాజస్ట్రేటు అనగా నాగేశ్వరరావుగారియొద్దనే అపీలు దాఖలుచేసెను. నాగేశ్వరరావుగారు క్రిందికోర్టుతీర్పు ఖాయముచేసిరి. ఆతీర్పు మీదగూడ రివిజన్‌పిటిషను హైకోర్టులో దాఖలుచేయబడెను. మరియు జిల్లాజడ్జిగారికి నాగేశ్వరరావుగారు తగు చర్యనిమిత్తము లేఖ పంపిరని పైన వ్రాసితిని. జడ్జిగారు దానిని తనపై బెట్టుకొనక మాలో సూర్యనారాయణరావు హైకోర్టులోవకీలుగాన మా యిర్వురవిషయముగూడ విచారణకు హైకోర్టునకే పంపివేసెను. అనగా న్యాయవాదులచట్టముక్రింద విచారణనిమిత్తము పంపబడినదనుట. కాబట్టి అవనిగడ్డమాజిస్ట్రేటు వేసినఆర్డరులు తీర్పులు, మేము వ్రాసిదాఖలుచేసిన అర్జీయును నాగేశ్వరరావుగారు వేసిన ఆర్డర్లు తీర్పును, బందరుప్లీడరు ఇచ్చిన అఫిడవిట్లును, మాతరపున సామ్యుయల్‌గారు దాఖలుచేసిన అర్జీయును ఈ కాగితములన్నియు మొత్తమున ఒక్క వ్యవహారముతో సంబంధించిన రికార్డుగా నేర్పడినవి. జిల్లాజడ్జి హైకోర్టుకుపంపిన కాగితములుగూడ వీనికి దోడయినవి.

ఈ వ్యవహార మంతయు ఒక్కసారిగ కోర్టు ఎదుట విచారణకు వచ్చునట్లు హైకోర్టులో ఏర్పాటుచేయుటకు స్వామినాధను చాల శ్రమచేసి అధికారులను ఆశ్రయించి, శ్రీ సుబ్రహ్మణ్యము, బోడాముగార్ల కోర్టులోనే ఒక్కవాయిదాకే విచారణకు వచ్చులాగున ఏర్పాట్లు గావించెను. శ్రీ సుబ్రహ్మణ్యముగారు న్యాయమూర్తిగా నుండుట మాకు అనుకూలమని తలచితిమి. కాని ఇంతలో శంకరునాయరుగారు హైకోర్టుజడ్జిగా నియమింపబడుటచే మేము మరియొక న్యాయవాది నేర్పరచుకొనవలసివచ్చెను. మావ్యవహారము విచారణకు వాయిదా గూడ పడినది. నార్టను అను సుప్రసిద్ధ క్రిమినల్‌బారిస్టరును చూచి సంగతులు తెలిపి మాపక్షమున పనిచేయుడని కోరగా రు 500/- ఫీజు కోరిరి. అందుకు సమ్మతించితిమి. మా రికార్డు కూడ యిచ్చితిమి. సొమ్ముమాత్ర మీయలేదు. శుక్రవారము రాత్రి బయలుదేరి తాను తంజావూరులో శనివారమునాడు పని చూచుకొని ఆదివారము ఉదయము మరల పట్టణమునకు వచ్చెదననియు, ఆరోజున మాతో రికార్డు చదివెదననియు, ఈమధ్య అవకాశము కల్గినపుడు రికార్డు చదివెదననియు వాగ్దానము చేసెను. ఆప్రకారము ఆదివారము ఉదయమున కలిసికొనగా భోజనముచేసివచ్చినతోడనే చదివెదనని చెప్పెను. మే మిర్వురము శ్రీ రెంటాల వెంకటసుబ్బారావుగారి ఇంటిలో భోజనము చేసి సుబ్బారావుగారితోగూడ నార్టన్‌గారిబంగళాకు చేరితిమి. అప్పటికే ఆయన ఏదో జమీందారీకేసురికార్డు చదువుచున్నట్లును కొంచెము తాళినయెడల మా రికార్డు చదువుననియు గుమస్తా చెప్పినందున మేము వెలుపల చెట్లక్రిందనే యుంటిమి. ఎంత వేచియున్నను జమీందారుకేసురికార్డే చదువుచుండెను. లోపలికి కబురంపి నపుడెల్ల ఇదిగో నదిగో ననుజవాబులే గుమస్తా చెప్పుచుండెనుగాని లాయరుగారు మారికార్డు చదివే అవకాశము కనబడలేదు. విసుగుబుట్టి వెంకటసుబ్బారావుగారు వెడలిపోయిరి. మేమిరువురము ప్రొద్దుజారిపోవుచున్నకొలది వ్యాకులచిత్తులమగుచుంటిమి. ప్రొద్దు తూలిపోయినది. రేపే విచారణకదా రికార్డు చదువుట కవకాశము లేదుగదా, ఏమి చేయదలచినారో గట్టిగా తెలుసుకొనవలసినదని గుమస్తాను బలవంతపెట్టగా ఆయన లోనికి బోయి వచ్చి మరియొక రోజుకు వాయిదావేయించెదనుగాన తొందరపడనవసరము లేదని సమాధానముచెప్పినట్లు తెలిపెను. ఎంతయో శ్రమమీద మావ్యవహార మంతయు శ్రీ సుబ్రహ్మణ్యము శ్రీ బోడాముగార్ల ఎదుట విచారణకువచ్చునట్లు ఏర్పాటుచేసుకొంటిమి. మరల వాయిదాపడునెడల మరి ఎవ్వరియొద్దకు పోవునో, అని ఎంచి ఏమైననుసరే మారికార్డు మా కిచ్చివేయవలసినదని కోరితిమి. గుమస్తా రికార్డు తెచ్చియిచ్చెను. సూర్యుడు అస్తమించు సమయ మాసన్నమయ్యెను. రికార్డు చేతబట్టుకొని ఏమిచేయుటకు తోచక చింతించుచు మైలాపూర్ లజ్‌చర్చిరోడ్డుమీద న్యాయవాది శ్రీ కృష్ణస్వామి అయ్యరుగారి బంగళాకేగితిమి. వారు మిక్కిలి మర్యాదగా మా వర్తమానమంతయు వినిరి. మేము నాగేశ్వరరావుగారి కిచ్చిన అర్జీలోని వాక్యములను చదివి, కృష్ణస్వామయ్యరు మాపై చాల కుపితుడై మీ రిట్లు వ్రాయుట ఎంతమాత్రము సరికాదని పలికెను; కాబట్టియే మేము మీవద్దకు రావలసివచ్చినదని నేను జవాబుచెప్పినమీదట రికార్డుతీసుకొని మమ్ము భోజనముచేసుకొని రండని పంపెను. మేము భోజనముచేసి వచ్చునప్పటికే ఇంటివాకిట తోటలో దీపమునెదుట రికార్డు చదువనారంభించెను. రికార్డు చదువునపుడు మధ్యమధ్య పండ్లుకొరికి "ఎందు కింత మూర్ఖముగా ఈ దూషణవాక్యములు వ్రాసితి"రని మాత్ర మనుచుండెను. రికార్డంతయు చదివి, రేపు ఉదయము మరల చదివెదననెను. మరునా డుదయమున మాతోగూడ భట్రాజు వెంకట్రాయుడుగా రుండిరి. ఆసామీమీద చోరీకేసురికార్డు మొదలగు వ్యవహార మంతయు ఆయన అయ్యరుగారికి సావ ధానముగ తెలియపరచెను. మొత్తమున తొందర లేదనునది ఆయన మాటలవలన మాకు తోచెను.

పదునొకండుగంటలకు హైకోర్టులో శ్రీ సుబ్రహ్మణ్యము, బోడాముగార్లకోర్టుకు చేరితిమి. మొట్టమొదట నార్టనుకు సంబంధించిన జమీందారీఅప్పీలు తీసుకొనబడెను. నార్టను వాదన సాయంకాలము అయిదుగంటలవరకు సాగించినందున మా వ్యవహారము మరల వాయిదాపడునట్లు కనుపించెను. మాలాయరు గారు మనవిచేయగా మరునాటికే వాయిదావేయబడెను. మరియొకసారి రికార్డు అంతయు చూచి, అందలి ప్రతివిషయమును పూర్ణముగ కృష్ణసామయ్యగారు ఆకళింపుచేసుకొనిరి.

మరునాడు మా వ్యవహారము మొట్టమొదటనే న్యాయమూర్తులు చేపట్టిరి. కృష్ణసామయ్యగారు అర్జీవిషయము మొదటనే ఎత్తుకొన "ఈ వ్యవహారమున పూర్వరంగము కొంత కలదు. అది ముందు మనవిచేయుదు"నని అనుమతిపొంది, అనగ ననగ నొకరాజు అన్నట్లు కధారంభముచేసి, పశువుల కడ్డముపోయిన ఆసామికి చోరీనేరముక్రింద శిక్షవిధించుటమొదలు ఆ ఆసామిని చెరలోబెట్టి నూరురూపాయలు లంచము పుచ్చుకొనుటయు, అవనిగడ్డ మేజస్ట్రేటుమీద లంచగొండి యని మహజర్లు కలెక్టరుకు పోవుటయు, అందుపైనవిచారణ, రిపోర్టు, నాగేశ్వరరావుగారి పక్షపాతము, చోరీకేసువిచారణలో అవనిగడ్డ మాజస్ట్రేటుతీర్పును ఆయన ఖాయపరచుట, మహజర్లవిచారణ నాగేశ్వరరావుచేతబడుట, ఆకస్మికముగ ఆ ఆసామిని పట్టుకొని జామీను ఆర్డరువేయుట మొదలగు అక్రమచర్య లన్నియు మొడటినుండి తుదివరకు జరిగిన గ్రంథ మంతయు తెలియపరచెను.

ఆసామీ తన పశువులను బందెలదొడ్డికి తోలనివ్వకుండ తీసికొనివచ్చుట చోరీగా నిర్ణయించినట్లు చెప్పుటతోడనే "ఈ మాజస్ట్రేటు ఎవరు ? ఎంతటిఘను"?డని న్యాయమూర్తులు ప్రశ్నించిరి. కృష్ణస్వామయ్యరు చెప్పిన దంతయు సావకాశముగ విన్నపిమ్మట, రివిజన్‌పిటీషను కేసులలో సాక్ష్యము చదువుట ఆచారము గాకపోయినను ఈ వ్యవహారసందర్భమునుబట్టి సాక్షి వాగ్మూలములు చదివెదముగాక యని ఆ చోరీకేసులోని వాగ్మూలములను చదువగోరి, కృష్ణస్వామి అయ్యరు వాటిని చదివి వినిపించిరి. పిమ్మట మా పిటీషనుకు సంబంధించిన అఫిడవిట్లుగూడ చదివి వినిపించిరి. ఇవి అన్నియు వినిపించినపిమ్మట గవర్ణమెంటు ప్రాసిక్యూటరు పవల్ గారిని 'మీ రేమి చెప్పెద' రని ప్రశ్నించిరి. మాజస్ట్రేటునుగూర్చి దూషణవాక్యములు పిటిషన్‌లో వ్రాసి, దాఖలుచేయుటచే అధికారిచర్యకు అడ్డము అనునేరమునకు ప్లీడర్లు పాత్రులేయని వాదించెను. "మాజస్ట్రేటు ఇంటిలో నున్నప్పు డిచ్చినా, ఆయనకోర్టులో అధికారము చలాయించుచున్నట్లేనా" యని ప్రశ్నించిరి. 'ఎక్కడైనా మేజస్ట్రేటు మాజస్ట్రేటే' యని ఆయన మారుపల్కెను. వంట యింట్లో నున్నను మాజస్ట్రేటేనాయని హేళనగ మాట్లాడిరి. అంతట పవల్‌గారు మరేమియు మాట్లాడక కూర్చుండెను.

న్యాయమూర్తులు మా పిటీషన్‌నుగూర్చి వ్రాయుచు "ప్లీడర్లు అధికారికి పెట్టిన పిటీషనులో ఆయననుగూర్చి అట్లు వ్రాయుట వారికి విహితమగు నియమపద్ధతి నతిక్రమించియున్నను డిప్యూటీమాజస్ట్రేటు పండిత నాగేశ్వరరావుగారు ఆప్లీడర్లువ్రాసినట్లు "నిరంకుశముగను, ద్రోహబుద్ధితోడను ప్రవర్తించినా"డనుట నిశ్చయము గాన ఇట్టి సందర్భములో ప్లీడర్లపై ఎట్టి చర్యను జరుపనవసరములేదు. వారిపై మాజస్ట్రేటు వేసిన ఉత్తరువును రద్దుపరచితి"మనిరి. మరియు ఆసామికి చోరీనేరముక్రింద వేసినశిక్ష రద్దుపరచి, ప్లీడర్లమీద న్యాయవాది చట్టముక్రింద విచారణ చేయనక్కరలేదు అని తీర్పుచెప్పిరి.


బందరు నుండి వీడ్కోలు

ఈ నాగేశ్వరరావుగారితో సంబంధించిన వ్యవహారమునకు ముందే నామిత్రులు చన్నాప్రగడ భానుమూర్తిగారును, నేనును ఒకయింటిలోనే కాపుర ముండుట తటస్థించెను. ఈ కారణమున మామైత్రి గాడమాయెను. మాఆడవారికి, వారి ఆడవారికిగూడ స్నేహమయ్యెను. వల్లూరి సూర్యనారాయణరావుగారును ఆ సమీపముననే కాపురముండిరిగాన వారి కుటుంబముతోగూడ మావాండ్లకు మైత్రికుదిరెను. వేసవిసెలవులలో నాకును భానుమూర్తిగారికిగూడ తీరికయే. ప్రతిదినము ఉదయమున ఆయన యింటిపెరటిలో పాదులు త్రవ్వి, అరటిమొక్కలును, పూల మొక్కలును నాటి, నీళ్లుపోసి పెంచుచుండెడివారు. గొడ్డలితో కట్టెలు చీల్చుచుండెడివారు. చెట్లెక్కి దిగుచుండెడివారు. స్వత: బలిష్ఠకాయులు గాన అట్టి వ్యాయామము వారు చేయగలిగి యుండిరి. నేను అంతటి బలువగు వ్యాయామముచేయలేక అరటి