దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/బాల్యము
బాల్యము
నల్లచెరువు నానుకొనియున్న రామచంద్ర పురాగ్రహారమును, ఎఱ్ఱచెరువు నానుకొనియున్న పాతగుంటూరు - ఈ రెండును దూరదూరముననున్న స్వతంత్ర గ్రామములేకాని యీ రెంటిమధ్యనున్న భాగమంతయు పిమ్మటి కాలములో క్రమముగ పెరుగుటచేత పైన జెప్పిన రెండు స్వతంత్ర గ్రామములు నొక్క పట్టణముగ రూపమెత్తినవి. కాని అన్నిటికిని పాత గుంటూరే ముఖ్యమగుటచేత పట్టణమున కంతకును గుంటూరు అను పేరే ప్రధానమైనది.
మా పాతగుంటూరులో వాసిరెడ్డివారికి దివానులుగా నున్న పొత్తూరివారు అను నొక ఆర్వేల నియోగి కుటుంబము గొప్ప పేరు ప్రతిష్ఠ పొందియుండెను. మాచిరాజువారు అను మరియొక ఆర్వేల నియోగివంశమువారు గొప్ప అగ్రహారీకులుగా నుండి గౌరవస్థానమున నుండిరి. తక్కిన బ్రాహ్మణ కుటుంబములలో దేశిరాజువారును అక్కెనప్రగడ వారును ముఖ్యులు. కాని మా కుటుంబమువారి పేరు కొండవారు. వీరి బంధువులు మట్టెగుంటవారు అను నాలుగు కుటుంబములవా రుండిరి. వీరందరు కూడ బీదలని చెప్పదగినవారే విదంబందు తక్కిన బ్రాహ్మణుల తోటివారే గాని పాండిత్య గరిమ గలవారెవ్వరును లేరు. మా కొండవారి కుటుంబమునకు ముప్పది యకరముల యీనాముభూమి యుండెను. మా తాతగారైన అప్పయ్య గారికి చిన్నతనములోనే తల్లి చనిపోయినందున ఆయన తండ్రి గోవిందరాజులుగారు మరల వివాహము చేసుకొనిరి. ఆ రెండవ భార్యకు చినఅప్పయ్య అను నొక కుమారుడును, ఆయనకు కుమాళ్ళు, కుమార్తెలు నుండిరి.
మా తాత అప్పయ్యగారు వాసిరెడ్డివారి జమీనుకు ప్రధాన స్థానముగానున్న అమరావతిలో నేదియో యుద్యోగము చేయుచు అక్కడనే చాలకాలము కాపురముచేసి ఉద్యోగము మాని గుంటూరు తిరుగవచ్చునప్పటికి ఈనాముభూములును, కుటుంబపు ఇల్లును సవతి సోదరుని కుటుంబమువారు అనుభవించుచుండిరి. ఎట్లో కొంత ప్రయత్నముమీద ఈనాము భూమి ముప్పది యకరములలో మా తాతగారి సగభాగము విడగొట్టి, ఆయనకు స్వాధీనపరచి, కుటుంబపు ఇంటి ఆవరణ స్థలంలో చాలవరకు సవతిసోదరుల కుటుంబము క్రిందనే యుంచుకొని, తూర్పుమూల మూడువందల గజముల ఖాళీస్థలములో నున్న యొంటి దూలపు పాత పెంకుటిల్లు మా తాతగారికి నిచ్చి యుండిరి. ఆ యింటిలో కాపురముచేయుచు తన భాగమునకు వచ్చిన పదునైదు యెకరముల భూమిని నొక జీతగానిని పెట్టుకొని వ్యవసాయము చేయించుకొని దానివలన వచ్చెడి ఆదాయముతో నెట్లో కాలము గడుపుచు పెద్దకాలము జీవించి లోకమును విడిచిపోయిరి. ఆ తుదిదినము ఉదయముననే లేచి ఊరికి మైలుకంటె దూరముననున్న తనభూమికి కాలినడకను పోయి భూమి చుట్టును ప్రదక్షిణముచేసి "తల్లీ! ఈ దినముతో నీకును నాకును ఋణము తీరిన"దని భూదేవికి నమస్కరించి వచ్చెనట. ఆరాత్రియే ఆయన మరణించెను.
మా తాతగారు చనిపోవునప్పటికి ఆయన భార్యయును నొక కుమారుడును, నొక వితంతువగు కుమార్తెయు నుండిరి. మా తాతగారివలెనే మా నాయనమ్మగారును అమాయికురాలు. అప్పటికి కొమారుడు అనగా మా తండ్రిగారు ఇరువది రెండేండ్లకు లోపు ప్రాయములో నుండిరి. మా మేనత్తగారు ఆమె యత్తవారింటనే యుండెడిది. కాబట్టి మా తాతగారు చనిపోవునాటికి ఇంటిలో మా తండ్రిగారును మా నాయనమ్మగారు మాత్రమే యుండిరి. భూమివలన వచ్చెడి ఆదాయమే వీరికి జీవనాధారముగా నుండెను. పదునైదు యకరముల భూమియైనను వర్షము లధికముగ నుండుటచేత పంట తక్కువగ నుండెను. కమతగానికి ఇయ్యవలసినది పోను మిగిలెడి ఆదాయము వారికి చాలకుండెను. ఒకనాడు పొలములో ఏదో ధాన్యము కైలు చేయించుటకు వెళ్ళి మధ్యాహ్నపువేళ కమతగానిని ఇంటికి అన్నమునకు పంపి మా తండ్రి తా నొక్కడే కాపలా కాయుచుండెను. ఎండ చురుకుగా నుండెను. ఆ పొలములో నొక తాటిచెట్టు మాత్రముండెను. ఆ చెట్టు నీడనే కూర్చొని మా తండ్రిగారిట్టు ఆలోచించెను. "ఎన్నాళ్ళు ఈ భూమిని నమ్మి వ్యవసాయము చేయించుకొన్నను పొట్ట గడచుట కష్టముగానున్నది. దీనినే కనిపెట్టుకొని యుండిన ఇంతకుమించిన ఆదాయము రాబట్టుటకు అవకాశములేదు. కాబట్టి వ్యవసాయము ఎత్తివేసి భూమిని ఇతరులకు కవులు కిచ్చి ఎక్కడనైన నుద్యోగము సంపాదించుకొని జీవించుట యుక్తము" అని యోచించి, వ్యవసాయము ఎత్తివేయుటకు నిశ్చయించుకొనెను. భూమిని సాలుకు రు 32 లకు మక్తాయిచ్చులాగున ఒక ఆసామికి కవులుకిచ్చి, ఉద్యోగము నిమిత్తము ప్రయత్నము సాగించెను. మా ఇంటికి దాపుననే సర్వే డిపార్టుమెంటులో ఉద్యోగిని ఆశ్రయించగా నుద్యోగ మిప్పించెదనని వాక్రుచ్చెను గాని తుదకు ఆయన సహాయము చేయలేకపోయెను. ఇప్పుడు వైశ్యులని పిలువబడువారు నాడు కోమట్లని పిలువబడుచుండిరి. వారు బ్రాహ్మణులయందు హెచ్చుగా భక్తివిశ్వాసములు గలిగియుండిరి. వారియొద్ద గుమాస్తాగా ప్రవేశించినవారు నమ్మస్తులైన యెడల మిక్కిలి గౌరవము చూపుచుండిరి. కనుక ఒక కోమటివారి కొట్లో మా తండ్రిగారు ప్రవేశించిరి. కాలము గడచిన కొలది మా నాయనగారియందు మిక్కిలి గౌరవము చూపుచు వారి కొట్లో అమ్మకమైన సరుకులోనుండి గుమాస్తాగారి భాగమని కొంచెము సరుకు తీసి వేరుగా పెట్టుచుండిరి. అట్లు వేరుపరచిన సరుకులు మా తండ్రిగారింటికి తెచ్చుటచేత యింటిలో పలువిధములయిన సరుకులు కొఱతలేకుండ నుండెను. గుమాస్తాగిరిలో ప్రవేశించిన పిదప కుటుంబవ్యయములకు కొదువలేకుండ చేతిలో డబ్బు మెలగుచుండెను. తెచ్చినడబ్బు తల్లిగారి కిచ్చెడివారట. పెట్టి బేడలు ఏమియు లేకపోవుటచే నొక గూటిలో ఆమె దాచి పెట్టుచుండెను. ఇట్లు జరుగుచుండగా మా తండ్రిగారికి వివా హము చేసుకొనవలెనని కుతూహలము కలిగెను. మాతల్లి, వలివేటికాపురస్తులు తిమ్మరాజు గోపాలరాయుడుగారి కుమార్తె అయినను మట్టెగుంట నారాయుడుగారు తనకు పిల్లలు లేకపోవుటచేత ఆమెను తెచ్చుకొని పెంచుకొనుచుండెను. ఆ నారాయుడుగారు పాతగుంటూరులో మా ఇంటికి సమీపములోనే కాపురముండిరి. కలసిన బంధుత్వమే యగుటచేత ఆమెను మా నాయనగారి కిచ్చి వివాహముచేసిరి. ఏదో కొంత సంపాదించుకొనుచున్నను వివాహఖర్చులకుగాను ఒక బందుగురాలియొద్ద అప్పుతెచ్చుకొనెను. కాని ఆమె కొలదిరోజులలోనే తన బాకీ చెల్లించవలసినదని నడిబజారులో తగాదాపరచినందున అగౌరవముగా తోచి రామచంద్రపురపు అగ్రహారములో పెన్షను పుచ్చుకొన్న ఒక తహశ్శీలుదారునొద్ద తన యీనాము పదునైదు యకరములు తాకట్టుపెట్టి ఆమెబాకీ వెంటనే చెల్లించెను. కాని తాకట్టు వ్రాసి సొమ్ము తెచ్చినదిమొదలు దానిని సాధ్యమైనంతత్వరలో తీర్చివేయవలెనని పట్టుపట్టి కొన్ని మాసములలో బాకీ చెల్లించి, తాకట్టు విడిపించుకొనెను. మా తండ్రిగారు నానాటికి సంపాదనపరు లగుచుండిరి. నాకు ముందు నా తల్లిగారికి ఒక ఆడపిల్ల పుట్టెను. పిమ్మట రెండేండ్లకు నేను జనన మొందితిని. మా అక్క పసితనముననే చనిపోయెను. మా తల్లిగారికి పిమ్మట ఏడేండ్లవరకును సంతానము లేదు. కాబట్టి ఆమెయొద్ద నేను చాలకాలము స్తన్యపానము చేయుచుంటిని. మా తల్లిగారు ప్రతిదినమును సూర్యునకు నమస్కారము చేసిననేగాని భోజనముచేయునదిగాదు. మభ్భుపట్టి సూర్య బింబము కనుబడని రోజామె కుపవాసమే. నాకు అయిదవఏడు రాకముందు ఎదో కాయలా ఏర్పడెను. మా నాయనమ్మగారును ఏదో జబ్బువలన చనిపోయెను. ఆమె అస్తులను వైకుంఠపురమునకు గొనిపోయి కృష్ణలో గలిపి తిరిగివచ్చునపుడు నాకు కాయలా నయమైన యెడల నా పుట్టు వెంట్రుకలు తీయించి ఉపనయనము అచ్చటి స్వామి దేవాలయములో చేయుదునని మా తండ్రిగారు మ్రొక్కుకొని వచ్చెనట.
విద్యాభ్యాసము
అయిదవఏట నన్ను బడిలో చదువవేసిరి. ఆరోజున నాకాళ్ళకు ముచ్చలజో డొకటి తొడిగి క్రొత్తరుమాల నాపైన గప్పిరి. బడిపంతులు పిల్లలతోగూడ మాయింటికి వచ్చిరి. ఓం నమశ్శివాయ సిద్ధం నమ: అనువాక్యములు వ్రాయించిరి. పిమ్మట పంతులుగారు నన్ను తనచంకను బెట్టుకొని బడికి తీసికొనిపోయిరి. చదువులబడి పాతగుంటూరులో మరియొకబజారులో నొక పెద్దఅగ్రహారీకులైన మర్ధ్వులయింట నుండెను. ఆయింటివారి పిల్లవాడను చదువుకొనుచుండెను. పంతులుగారు ఆయింటిలోనే ఒక వైపున కాపురముండిరి.
ఆయింటి యజమానురాలు నన్ను దయతో చూచుచుండెను. తన కుమారునితోపాటుగ నా తలయును దువ్వుచు ప్రేమతో మాట్లాడుచుండెను. అందరికంటె ముందు బడికి పోవుచుండినందున శ్రీయో చుక్కయో నాకే లభించుచుండెను. బాలు రందరిలో నొకకొంత చురుకైనవాడని నన్ను భావించుచుండిరి.