దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/తొలిపలుకు
తొలిపలుకు
శ్రీ దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారు భారతదేశమునను, విశేషముగా ఆంధ్రదేశమునను మిక్కిలి ప్రఖ్యాతిగాంచిన పురుషవరేణ్యుడు. ఆంధ్రోద్యమ జనకుడు ఆయన యని చెప్పనొప్పును. బాల్యమునుంచి, ప్రేమతో, జాగరూకతతో, దూరదృష్టితో దానిని పెంచి, పెద్దచేసి, సుప్రతిష్ఠిత మొనర్చెను.
దృఢమైన ఆస్తిర్యబుద్ధియు, నిర్మలమైన ప్రవర్తనయు, అకుంఠితమైన ధైర్యమును, నిశ్చలమైన దీక్షయు, అరమరకలేని అమాయకత్వమును, ఉన్నత ఆశయములును కలిగిన నిరాడంబర ఆదర్శజీవి ఆయన. ఆ సద్గుణముల చేతనే లోకోత్తరుడైన గాంధీ మహాత్ములవారి ప్రేమకు పాత్రుడయ్యెను. స్వరాజ్య సంగ్రామములో అన్ని ఘట్టములలో ముందంజవేయుచునే యుండెను. శాసనసభా బహిష్కారములో, వృత్తివిసర్జనములో, పన్నుల నిరాకరణలో, ప్రభుత్వ ధిక్కారములో, కారాగారకష్టాపరంపరాసహిష్ణుతలో, పేరెన్నికగన్న పెద్ద ఆయన. కార్యోత్సాహములో, నిరంతకృషిలో, యువకులను వెనుకకునెట్టు, ధీరతచేయు కర్తవ్యపరాయణుడు. వయసు పెరుగుచున్నను, కార్యాసక్తి తరుగుతుడలేదు సరికదా, ఆ రెండునూ - వయస్సు, ఆసక్తి - ఒండొరులలో పోటీపడుచున్నట్లునూ కనపడును. సహస్రమాసములు సంతోషసంధరిత జీవితము గడపిన సన్మార్గవర్తి.
ఇట్టి అనఘుని ఆత్మకథ నీతిబోధకమును, ఉత్తేజకరమును అయియున్నది. దానిని అచ్చొత్తించి ప్రకటించుభాగ్యము ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచారసంఘమున కబ్బుట సవ్యమే. అనేక సంవత్సరములు ఆయన అధ్యక్షులుగనుండి దానిని రక్షించిరి. ఈ సంఘమును, ఆత్మకథయు తోబుట్టువులు పరస్పర శ్రేయోభిలాషులు.
దీనికి తొలిపలుకు వ్రాయు అవకాశము దొరికినందులకు నాకును ఆనందము కలుగుచున్నది. పితృతుల్యుని సంస్మరణము సంతోషకారణముగదా !
భౌతికదృష్టితో ఆంధ్రరాష్ట్ర అవతరణమును ఆయన చూడజాలకపోయినను దివ్యదృష్టితో దానిని త్వరలో దర్శించుగాక !
వినయాశ్రమము
ఖరనామ సం||ర మాఘ శుద్ధ నవమి, సోమవారం.
సీతారాం
గాంధీశకం
18 - 6 - 5