దశావతారచరిత్రము/5. వామనావతారకథ

5. వామనావతారకథ

పంచమాశ్వాసము



సత్యాత్మజవాసవి
నాసత్యవిలాసదాన నవ్య[1]నిధిశ్రే
ణీసావత్న్యాన్వితీయము
నాసరయూకృష్ణ పద్మనాభునికృష్ణా !

1


తే.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టు లను వ్యాసశిష్యమౌని
రాజ యిఁక వామనావతారక్రమంబుఁ, దెలియఁజెప్పెద వినుమని దెలుపఁదొడఁగె.

2


శా.

శ్రీరత్నాకరకన్యకారమణుఁ డారీతిం జగన్మోహనా
కారోదారవధూవిలాసముల రత్నశ్రేణిఁ గన్బ్రామి సొం
పారంగా నమృతం బొసంగ బలియుండై దేవసైన్యంబుతో
స్వారాజన్యుల గెల్చి యేలుకొనియె న్సౌవర్గసామ్రాజ్యమున్.

3


మహాస్రగ్ధర.

బలదైత్యారాతి వజ్రప్రతిహతతనుఁడై భండనక్షోణిలోనం
గులశైలంబోయనం భంగురుఁడయినబలిం గొంచు బాణాదితత్పు
త్రులు శుక్రాచార్యుఁ జేర్పం దులగనని దయం దోడుతో జీవితంబు
కలిగించె న్మంత్రశక్తి న్గలవె గురునిచేఁ గాని కార్యంబు లెందున్.

4


క.

బ్రదికినబలిదైత్యేంద్రుం, డెదఁ దనయపజయముఁ దలఁచి యెంతయు వెతచేఁ
గొదుకుచు నిట్లని పలికెం, ద్రిదశాహితగురుని న్యాయనిష్ఠురఫణితిన్.

5


శా.

నీ కే శిష్యుఁడనయ్యుఁ దుచ్ఛదివిజానీకంబుచేఁ బన్నముం
గైకొంటింగద చాలదే యిదియయే కార్పణ్య మొందింపఁగా
నా కీజీవిత మిచ్చినాఁడ వవులే నన్నందఱు న్నవ్వఁగాఁ
బాకారాతికి నింటిబంటుగ నొనర్పం జూచితే భార్గవా.

6


మ.

అని నమ్రాననుఁడైన దైత్యపతి పల్కాలించి నీ కేల జా
లిని జెందంగ వితా జయాపజయ ము ల్లేవా గణింపం జగం

బున నీ వొక్కఁడవే పరాజితుఁడవా పూర్వంబు శక్రాదు లెం
దును మీ కోడరె మీకె కాదు కలుగు న్లోకాన గెల్పోటముల్.

7


మ.

అదియుంగాక రమామనోహరుఁడు సాహాయ్యంబు గావింపఁగాఁ
గదనక్షోణిని గెల్చెఁ గాని సముదగ్రంబైన నీతేజముం
ద్రిదశాధీశుఁడు సైఁపఁగాఁగలఁడె యెంతేభక్తితో మున్ను నీ
పదముల్ గొల్చుట ముజ్జగం బెఱుఁగదే ప్రహ్లాదవంశాగ్రణీ.

8


మ.

విను మీతాతను గన్నతండ్రి హరితో ద్వేషించి నాశంబు గాం
చెను మీతాత సమస్తపూజ్యత వహించె న్వైష్ణవీభక్తిచే
వనధీశానసుతాధినాథపదసేవం గల్గు నిష్టంబు
ద్ఘనవైరంబున నొందు నంత మిది నిక్కం బంచు నూహింపుమా.

9


ఉ.

కావున వాసుదేవపదకంజయుగంబు సమాశ్రయించి స
ద్భావముతో విచారములఁ బాసి యొనర్పుము విశ్వజిన్మఖం
బే విజయంబుగల్గ ఘటియించెద నీకు జగత్త్రయంబున
న్నావుడుఁ దన్మహాధ్వర మొనర్చె బలీంద్రుఁడు శాస్త్రపద్ధతిన్.

10


మ.

బలి యారీతి గురూక్తమార్గమున శ్రీభామామనోనాథప
జ్జలజధ్యానపరాయణుం డయి యొనర్చె న్విశ్వజిద్యాగమున్
జ్వలనాభ్యంతరసీమ వెల్వడియె హేషాభీషణాశ్వంబు ప్రో
జ్జ్వలసింహధ్వజ మైనయొక్కరథ మక్షయ్యప్రభావోన్నతిన్.

11


తే.

ఆహవంబునఁ బ్రత్యక్ష మగుచు బలిని, నాహవంబున గెల్చెద నఖిలసురుల
ననుచుఁ దపనీయమయమైన యబ్జసరము, ననుచు వేడుకతో నిచ్చి చనియె నలువ.

12


క.

దర మిది నీచేఁ జూచిన, దర మొందు బురందరాదిదేవతబలము
ల్దరమా పొగడఁగ నని యా, దరమున గురుఁ డొసఁగె నొక్కదరముం బలికిన్.

13


శా.

కూశ్మాండుండును గూర్పకర్ణుఁ డనఁగాఁ గోటిప్రధానాగ్రణు,
ల్గూశ్మాండోదరు లర్కసన్నిభముఖుల్ గ్రూరక్రుధైకోన్ముఖు
ల్కాశ్మీరారుణకాంతివేశ్మనయను ల్గాలాంతకాకారు లు
గ్రాశ్మోరఃస్థలు లేఁగుదెంచిరి యసంఖ్యంబైన సైన్యంబుతోన్.

14


వ.

అంత.

15


సీ.

మధ్యాహ్నమార్తాండమండలంబులఁ బోలు పదివేలకెంపురాబండికండ్లు
అష్టదిఙ్ముఖములం దష్టాంగములు మించు గోపుగాంచినవజ్రకూబరములు
గౌరమాయూరచాకోరగారుత్మతచ్ఛవిఁ దనర్చిన లక్షసైంధవములు
గంగాపయఃపాలి గజరాజు గాలిచే వారించుకంఠీరవధ్వజంబు

తే.

దివ్యశస్త్రాస్త్రజాలముల్ దీప్తరత్న, ఘంటికాకోటిఘణఘణల్ గల్గి యంద
మగుచు శతయోజనోన్నతం బైనయట్టి, స్యందనం బెక్కి దైత్యసంక్రందనుండు.

16


సీ.

విబుధశైలేంద్రంబు విశ్వరూపము చూపె నననొప్పు కాంచనస్యందనములు
ఘనసంఘములు విశృఙ్ఖలవృత్తి నడయాడు చెల్వు గాంచిన గంధసింధురములు
సంవర్తసమ్మిళతసప్తార్ణవీతరంగములఁ బోలిన తురంగములగములు
కల్పాంతదీర్ఘనిర్ఘాతము ల్పురుషులై వెలసెనో యనమీఱు వీరభటులు


తే.

కోటి దశకోటి శతకోటి కోటికోటి, సంఖ్యలను వెంటరాఁ జటులవిక్ర
మక్రమంబున బలిదేవమర్దనుండు, దైవగంగాతటంబున దండు విడిసి.

17


సీ.

ఘనచక్రిచక్రఘర్ఘరరావములకన్న సమదవారణబృంహితములకన్న
రంగదుత్తుంగతరంగఘోషలకన్న రణసముద్భటభటార్భటులకన్నఁ
దతభేరికాధణంధణనాదములకన్న నమితాన్యతూర్యఘోషములకన్న
వందిమాగధులకైవారంబురొదకన్నఁ బ్రబలంపుసబళంపురవళికన్నఁ


తే.

జటులమై మించె గీర్వాణసార్వభౌమ, ధైర్యకైతవచక్రాంగభావనోప
దేశదేశికఘనరవాదేశదైత్య, నాథజయశంఖభుంభుంనినాద మపుడు.

18


చ.

అది విని నంత నిండుకొలువైన సుపర్వవిభుండు గొల్వులోఁ
ద్రిదశులఁ జూచి యెవ్వడొకొ దిట్టతనంబున బోరు సేయఁగాఁ
గదిసెను శంఖరావ మిది గ్రక్కున లెం డనునంతలో ఘన
స్యదమునఁ జేర వచ్చి యొకచారుఁడు మ్రొక్కి వినీతి నిట్లనున్.

19


తే.

అవధరింపుము విబుధలోకాధినాథ, యిదిగొ బలిదైత్యవిభుఁడు మిన్నేటిచెంత
దండు దిగినాఁడు భండనోద్దండుఁ డగుచుఁ, బ్రతిదళంబుగ సేనలఁ బంపు వేగ.

20


క.

అని తెల్పుచున్నవేళం, దను నిలుమని యడ్డగించు దౌవారికులం
గనుగొనక ద్రొబ్బుకొంచుం, దనుజుం డొకరుండు వచ్చి దర్ప మెలర్పన్.

21


ఉ.

ముక్కున గవ్వగుట్టి నిను ముందుగ నీడిచి తెమ్మటంచు మా
రక్కసిఱేఁడు పంపె వినరా దివిజర్షభ యింక నట్టిటున్
దిక్కులు సూచిన న్విడువ దేవర వైనను నీకు వెన్కనే
మ్రొక్కెద గాని రమ్మనుచు ముందలఁ బట్టఁగడంగ నుధ్ధతిన్.

22


శా.

హాహాహా యని వేగ లేచి శమనుం డఱ్ఱాఁగితన్ ద్రోయఁగా
నోహోహో బలశాలివే యనుచు దైత్యుం డుగ్రుడై చేరి త
ద్భాహాభ్యంతరసీమఁ దన్నిన మదస్తంబేరమంబో యనన్
వాహారాతిహయుండు తూలె జవసత్త్వస్ఫూర్తి వమ్మై చనన్.

23

ఉ.

అప్పు డిదౌరయంచుఁ ద్రిదశాధిపుఁ డెంతయు నాగ్రహంబుతో
గుప్పున గద్దె డిగ్గి శతకోటి నిశాటుని వ్రేయఁ బూనుఁడుం
గొప్పు విడంగ గబ్బిచనుగుబ్బలు గుల్కఁ బదంబు మెట్టియ
ల్చప్పుడు మీఱఁ జేరి శచి చయ్యన నాథునికేలు వట్టినన్.

24


చ.

విడువిడు పట్టరాకు మలివేణి యటంచును జాతికెంపురా
కడియపుకేలు ఘల్లురనఁగా విదిలించి సురేంద్రుఁ డల్కతో
జడియక పూవుఁబోఁడి బలశాసన దూతను జంప నీతియే
వెడలఁగ ద్రోయుఁడన్న సురవీరుఁడు నట్ల యొనర్చి నివ్వెరన్.

25


చ.

గురునిముఖంబు సూచి శతకోటిని నిన్నను మొన్ననోకదా
గురుభుజశక్తియుక్తి బలిఁ గూలిచి వచ్చితి నేఁడు వచ్చె నే
వెరవున హెచ్చెనీబలము విక్రమ మన్నను శుక్రసేవచే
దొరకెను వానితేజ మిఁక దుస్సహ మింద్ర దోలంగు మీ వనన్.

26


సీ.

రంభోరురంభాదిగంభీరపుంభావసంభోగసంభూతసంభ్రమములు
శృంగారభృంగాళి రంగాదితుంగాబ్జగంగాతరంగావగాహనములు
పారావతారావధీరారి వారావతైరావతారోహగౌరవములు
బాలానిలాలోలజాలావళీలాస్యలీలావనాలోలఖేలనంబు


తే.

లెటుల విడఁజాలెనొక్కొ దైత్యేంద్రుదాడి, కోడి దివి వీడి శచి గూడి యుర్వి సేరె
నడుగు చూపరి జడదారియొడయనింటి, కోడి కోడిగములవేల్పుప్రోడ యపుడు.

27


తే.

పరఁగఁగలకొద్ది సురలకుఁ బంచియొసఁగఁ, జాలువృత్రారి యగురాజు మూలఁబడిన
బలితమయ్యె విరోచనప్రభవతేజ, మమర గాఢతరస్ఫూర్తి నపనయించి.

28


శా.

ఈలా గింద్రునిఁ బాఱఁద్రోలి బలి తా నేకాతపత్రంబుఁగాఁ
ద్రైలోక్యం బటులేలుచుం గృతమరుత్తాపప్రతాపంబుతో
భూలోకాధ్వరభాగముల్ గొనుచు సంభోజాక్షసంప్రీతిగాఁ
జాలంజన్నము లాచరించె గుణియై శాస్త్రోక్తమార్గంబునన్.

29


మ.

తళుకు న్ముత్తెపుఁగొల్వుకూటమున నిద్దాసింగపుంగద్దెపైఁ
గొలువైయుండె సురానురాదులు కెలంకుల్జేరి సేవింపఁగా
బలిదైత్యుం డొకనాఁడు వైభవ మెలర్పం జామరగ్రాహిణీ
కలనిక్వాణకరాగ్రకంకణఝణత్కారంబు తోరంబుగన్.

30

తే.

అప్పు డొకచారుఁ డేతెంచి యసురనాథ, నీకు జయపెట్టుచున్నారు నిఖిలజనులుఁ
గొదవ వల దెందు హిమగిరికూటమునను, గంటి నొక్కవిశేషంబుఁ గన్నులార.

31


సీ.

అతిఘోరగహనమధ్యమున వర్తించుచో మేఘంబులోని క్రొమ్మెఱుఁగుకరణిఁ
జలికాలమున జలాశయమున నుండుచోఁ గొలనిలో రాయంచకొదమపగిదిఁ
గడగి పంచాగ్నులనడుచక్కి నిలుచుచో లలితమౌ పసిఁడిసలాకజోకఁ
బుడమిఁ బాదాంగుష్ఠమున నెలకొన్నచోఁ బాఁదులో లేఁదీఁగె బాగుమీఱఁ


తే.

జిలుకవలెఁ గోయిలవిధాన ఫలము పర్ణ, ములు మెసంగుచుఁ గొన్నాళ్లు జలము మొదలు
గ్రోల కిప్పుడు రత్నపాంచాలిలీలఁ, దపము సలిపెడు సురమాత దైత్యనేత.

32


క.

అని విన్నవించినప్పుడె, విని చిన్నంబోయె దైత్యవీరుఁడు మది యో
జన చేసి యొకయుపాయము, గని దైత్యులఁ బంప వారు గానిమ్మనుచున్.

33


తే.

పరఁగ నిరువదియైదేండ్లప్రాయ మలరు, విప్పుగన్నులుఁ దైజసవిగ్రహములుఁ
గలుగు వేల్పులరూపము ల్గాంచి తత్త, దుచితవస్త్రాభరణశస్త్రనిచయ మూని.

34


వ.

అంత.


చ.

జడనిధి నీవహీనగుణసంగ మెఱుంగవు హేమచేలికిం
బడుచు నొసంగి దుర్విషము భర్గున కిచ్చితివంచు నవ్వి దా
పడుచు నొసంగె భర్గునకు భాసురకీర్తి హిమంబు పేరిటం
జడిగొననొప్పు నత్తుహినశైలముమీఁదికిఁ బోయి యచ్చటన్.

35


మ.

చరణాంగుష్ఠము నేల నూఁది భుజము ల్సారించి భూరేణుదూ
సరితానీలజటాభరంబు గుదుల న్సంధించి మోమెత్తి యం
బరము న్సూచుచు శ్వాసవాయువుల నిర్బంధించి యత్యంతదు
స్తరమైనట్టి తపంబు సేయు నదితిం దర్శించి వే మ్రొక్కుచున్.

36


శా.

తల్లీ యేల తపంబు చేసెదు నవోద్యానస్థలీమల్లికా
వల్లీజైత్రము నీదుగాత్రము వనావాసైకపాత్రంబుగా
నిల్లీల న్నొగిలింప నాయమగునే యేపాటిదీనం ఫలం
బిల్లీపాటిని జేరు మోసమగుసుమ్మీ దానవు ల్సూచినన్.

37


చ.

తనువు గృశింపఁజేయునది ధర్మము గాదని పెద్దలాడఁగా
వినివినియుండి యేటికి వివేకము లేక తపంబు సేయఁబూ

నిననిను నేమనంగలము నేరము లెంచఁగరాదు గాని యో
జనని యభీష్ట మొందుటకు సాధ్వులకుం బతిభక్తి సాలదే.

38


తే.

ప్రాణవిభుఁ బాసి యతిథిసపర్య ద్రోసి, బంధువుల రోసి పుత్రులఁ బలుచఁజేసి
యట్టిజిగిదీసి యిట్టికారడవి డాసి, గాసిఁ జెందఁగ నిందేమి గలిగె వాసి.

39


ఉ.

అమ్మరొ నిన్నుఁ బాసి క్షణమైనను రిక్తగృహంబునందు మే
మెమ్మెయి నుండువార మట నెందఱు గల్గిన నీవు లేనిగే
హమ్మది యేల పోద మిపు డాలయసీమకు రమ్ము మావిచా
ర మ్ముడిగింపు మింపుగను రక్ష యొనర్పుము దీర్పు మాపదల్.

40


క.

రోగి దరిద్రుఁడు పరదే, శాగతుఁడుం దల్లిఁ జూచి యానందించు
న్భోగము భాగ్యము రాజ్య, శ్రీగలవారలకు వేఱె చెప్పఁగవలెనే.

41


క.

అని యెన్నివిధంబులఁ దెల్పిన నించుక వినకయున్న బెదరించుచు న
ద్దనుజులు భీషణరోషం, బున నిజదంష్ట్రికల నగ్గిఁ బుట్టించుటయున్.

42


మ.

అమితంబై యది వేణువహ్నిగతి దైత్యశ్రేణితోఁ గూడ ద
గ్ధము చేసె న్శతయోజనోన్నతమహాకాంతార మంతన్ రమా
రమణప్రేరితచక్రరక్ష నదితిం బ్రాపింపదయ్యె న్విచి
త్రమె నిష్కారణవైరికార్తి హరిభక్తక్షేమము న్భూవరా.

43


మ.

హరిభక్తాగ్రణి యున్నచోట హరిభాషాధీశరుద్రాదు లుం
దురు దుష్టగ్రహరోగవహ్నిభయము ల్దూరంబులౌ లక్ష్మి సు
స్థిరయై నిల్చు విపద్దశ ల్దొలఁగుఁ దద్దేశంబు కాశీగయా
ద్యురుపుణ్యస్థలకోటి కెక్కుఁ డనఁగా నొప్పు న్జగద్గేయమై.

44


క.

కానం దననెమ్మదికొల, కానందము మీఱ విష్ణుహంసము సువివే
కానందమ్మున వలిమల, కానం దపమూను నదితి గనియె శుభంబుల్.

45


తే.

అదితి యీరీతి దివ్యసహస్రవర్ష, ములు నిరాహారయై ఘోరముగఁ దపంబు
సేయ రక్షోసురేంద్రదైతేయదాన, వాళి భీతిలె సురపాళి యలరె నంత.

46


సీ.

కలిమిచిల్కలకొల్కి గబ్బిగుబ్బలగట్టితన మెఱింగిన యురఃస్థలము మెఱయఁ
గలికిజక్కవపిట్టకవఁ గూర్ప విప్పంగదరమైన కనుదోయి దయ దలిర్ప
నసురలచౌవంచ యుసుఱులు మెసవంగఁ దూకొను నైదుకైదువులు పొదల
నొఱపైన కటితటి నొఱకువచ్చుపదాఱువన్నెదుప్పటి వింతవన్నె మీఱఁ


తే.

గమలగర్భేశముఖు లిరుగడల నడువ, జయజయధ్వానముల యోగిజనము పొగడ
గరుడవాహన మెక్కి శృంగార మమర, నమరమాతకు శౌరి ప్రత్యక్ష మయ్యె.

47


ఉ.

పశ్యలలాటజూటతటపాటలసూచితరాగచంద్రస
ద్వశ్యకృతోపగూహనపదశ్రితవన్నఖతారుఁ డభ్రసా

దృశ్యశరీరుఁ డచ్యుతుఁడు దృశ్యుఁడుగా ముదమంది కశ్యపా
దృశ్యవలగ్న యిట్లని నుతించె నిజోచితవాక్యవైఖరిన్.

48


ప్రాకృతసీసము.

ళచ్ఛిత్థణాహేయ లలి అ హత్థపయో అ పొమ్మలోఅణళో అపూ అణిజ్జ
ఖఅవర ఆణేఅ గఅరాఅరఖ్ఖ అ[2]ఖ అరఖిందు సిఖి అరఅణి ఆస?
[3]ఈసరజణల మహేసరభ అణిజ్ఞ దిక్కమజాహ? తెళ్లొక్కణాహ
పుణ్నమి అంకలావణ్నస్స మందరఖి ఇధరధారఅ కిసణవణ్న


తే.

భక్తకామి అఫలదాణపారి ఆఆ, యాయయూయ జణేఝ్ఝేఅ యాయరూఅ
వాసుదేవ సఆణంద వణఅణేహ, [4]కిత్తణిజ్జణవ హ్నీర ఆ?దేఅ.[5]

49


తే.

అనుచు నప్రాకృతచరిత్రయైన యదితి, ప్రాకృతోదితవైదగ్ధిఁ బ్రస్తుతింపఁ
బ్రాకృతగుణవ్యతీతుండు భక్తసులభుఁ, డైన ప్రహ్లాదవరదుఁ డాహ్లాదమునను.

50


తే.

మొలకనవ్వులఁ జికిలివెన్నెలలు గాయఁ, గాయ మెంతయుఁ బడలెనుగా యటంచు
నతిపవిత్రకరంబున నదితిమేను, నిమిఱి నీవాంఛితం బేమి నెలఁత యనిన.

51


క.

స్వామివి జగముల కంత, ర్యామివి జనములకు జపిత కర్థ మొసంగే
సామివి భక్తుల కంతిక, గామివి నీ వెఱుఁగనట్టి కార్యము గలదే.

52


క.

ఐన న్వినుపించెద విను, శ్రీనాయక మత్తదైత్యసేనలచే నా
సూనులు వసూనులై హరి, సూనుప్రభృతులును దలకఁ జూడంగలనే.

53


క.

దితిసుతుల సంహరింపక, యతులితమైనట్టి వారియైశ్వర్యము నా
సుతుల కొసంగుము చాలును, దితిజులు నాసుతులు గారె దీనశరణ్యా.

54


తే.

అనిన నెంతయు మెచ్చి మాయమ వౌదు, వదితి యని కౌఁగిలించి దైత్యారి యనియె
సవతిబిడ్డలయందు మత్సరము లేని, యపుడె నీసాటి గలరె యీయఖిలమునను.

55


చ.

తనసుతులం బరాత్మజులఁ దద్దయుఁ బ్రేమఁ దగన్సమంబుగాఁ
గనుఁగొను పుణ్యమూర్తులకుఁ గల్గదు నందనశోక మింక నీ
తనయుఁడనై జనించి బలిదర్పము మాన్చి తదీయలక్ష్మి నీ
తనయుల కిత్తు నీతినయధర్మవివేకము గాఁగ నావుడున్.

56

క.

ప్రతిరోమకూపభాసుర, శతపత్రభవాండకోటిసాహస్రుఁడ వీ
వతిలోకచరిత్రుఁడ వే, గతి గర్భమునన్ భరింతుఁ గమలదళాక్షా.

58


మ.

అనిన న్నీ వనుమాట నిక్క మదితీ యైనన్ రహస్యంబు నీ
కు నెఱింగించెద నాదుభక్తులు విరక్తు ల్యోగసక్తు ల్సుధీ
జనరక్తు ల్పితృభక్తియుక్తులు పరేర్ష్యాముక్తు లాచారవ
ర్ధనయుక్తు ల్సతులు న్భరింతురు ననుం దథ్యంబు సాధ్వీమణీ.

59


ఉ.

నీవు సమస్తభూతహితనిర్మలచిత్తవు పుణ్యశీలవుం
గావున నన్నుఁ బుత్రునిగఁ గాంచెద వంచును గంఠమాలికన్
శ్రీ వెలయంగ నిచ్చి దయచే నభయంబు నొసంగి దేవతా
సేవితుఁడై వికుంఠపురిఁ జేరె సరోరుహనాభుఁ డంతటన్.


తే.

అదితి యింటఁ బయోవ్రత మాచరించి, భర్తృసంగతి సౌఖ్యసంపదలఁ బొదల
నెలమసలె వెల్లజిగి గల్లముల నెదిర్చె, నెలమసలె నెలల్ దొమ్మిది నిండెనంత.

61


తే.

కంజనేత్రుఁడు శుక్లపక్షంబునందు, శ్రవణమున ద్వాదశీదివసమున విజయ
యనుముహూర్తంబునందు మధ్యాహ్నవేళ, నదితికి జనించె వామనుం డగుచు నపుడు.

62


తే.

కురిసెఁ బువ్వులవానలు మెఱసె దిశలు, విరిసెఁ గావిరి దుందుభు ల్మొరసె దివిని
దొరసె గంధర్వగాన మచ్చరలయాట, నెరసె జగముల వేడుక ల్బెరసె నంత.

63


మ.

మణికోటీరము నక్రకుండలములు న్మాణిక్యకేయూరకం
కణకాంచీకటిసూత్ర హేమవసనగ్రైవేయమంజీరము
ల్ఫణిభోగాభచతుర్భుజంబులు దగ న్భాసిల్లులోకైకర
క్షణుని న్వామనుఁ జూచి కశ్యపతపస్యాశాలి హృష్టాత్తుఁడై.

64


క.

పటుభక్తి మ్రొక్కి యంజలి, ఘటియించి నుతించె వికచకైరవవేళా
నటధూర్జటి చరణకటా, త్కటకఫణీంద్రానుకారి గంభీరోక్తిన్.

65


మ.

రవికోటిప్రతికోటితేజము శరద్రాకేందుబింబాస్యమున్ా
ధవళాంభోరుహలోచనంబులు సుధాదధ్యన్నహస్తాబ్జము
న్నవలావణ్యవి శషముం గల నినుం దర్శింతు ధన్యుండనై
శివము ల్గంటి దయాచితాంఘ్రియుగళీసేవామనా వామనా.

66


క.

అని పొగడ నీకు మేలగు, జనకా మీయందు రెండుజన్మంబుల నేఁ
దనయుఁడ నైతిని మీదం, దనయుఁడనై మీకు వాంఛితం బొనఁగూర్తున్.

67


తే.

అనుచుఁ దనరూపుమాటి యవ్వనజనాభుఁ, డర్భకునిలీలఁ గావుకా వనుచుఁ బోర

నెన్ని నేర్చితి ననుఁగన్న చిన్నితండ్రి, యనుచు ముద్దాడుచును దల్లి యక్కుఁజేర్చె.

68


మ.

అలరున్నూనెఁ దలంటు గందము నలుం గందంబు పన్నీటిచేఁ
జలకంబున్నును జల్వపొత్తులును రక్షారక్ష యుయ్యాల పా
టలు చన్ ద్రావుడు లెంతసంతసము పుట్టంజేసె సృష్టిస్థితి
ప్రళయాపాదికి దైత్యభేది కదితీభాగ్యంబు దానెట్టిదో.

69


క.

ముజ్జగము లుజ్జగింపని, బొజ్జ గదల పాదపద్మముల జిగిజాళ్వా
గజ్జెలు మొరయఁగ పజ్జల, హజ్జలిడుం గుజ్జు తల్లి యానందింపన్.

70


క.

విద్దెము విద్దె మటంచు, న్ముద్దియ లిరుగేల నూన ముద్దులకొడుకు
న్విద్దెములు సేయుఁ దళుకుం, గద్దఱిచెక్కులను మద్దికాయలు గదలన్.

71


క.

ఉపనయనము గలవేలుపుఁ, దపసులు విధిముఖులు రాఁగఁ దనయునకుం దా
నుపనయనము సేయఁగఁ గ, శ్యపముని సమకట్టె సకలసంభ్రమ మలరన్.

72


మ.

అలరుందావులు ధూపవాసనలు దూర్యారావము ల్పెండ్లిపా
టలు మాణిక్యపుఁదోరణంబులును గాటంబైన యాపెండ్లిపం
దిలిలో మౌనులు సుట్టుకొన్న మణివేదిన్ హేమపీఠంబుపై
నలరారెం బితృమధ్యభాగమున మాయావామనుం డయ్యెడన్.

73


సీ.

తపనుఁడు సావిత్రి నుపదేశ మొనరింప బ్రహ్మసూత్రము బృహస్పతి ఘటించ
జనకుఁడు పచ్చనున్ననిముంజి మొలఁగట్ట నవని యొసంగఁ గృష్ణాజినంబు
శంబరధారి దండంబు కేల నమర్పఁ ప్రేమతోఁ దల్లి కౌపీన మొసఁగ
పాథోదపద మాతపత్రంబు సవరింప నలినగర్భుఁడు కమండలువు గూర్ప


తే.

సప్తఋషులు పవిత్రముల్ శారదాంబ, యక్షమాలిక యీయఁ జెల్వయ్యె మిగులఁ
బ్రణతరక్షావిచారి సద్భక్తహృదయ, పద్మసంచారి వామన బ్రహ్మచారి.

74


శా.

అక్షీణం బగునట్టికల్మిగల మాయావామనుం డంతటన్
యక్షేశార్పిత పాత్ర గైకొని కులాఖ్య ల్సెప్పుచున్ మ్రొక్కి తా
'భిక్షాందేహి' యటంచు వేఁడ గిరిజాబింబోష్ఠి వెట్టె న్మణీ
భిక్షం బంచలవీక్షణాంచలములం బెంపారు లేనవ్వునన్.

75


తే.

అంతఁ గ్రమమున శారద యదితి సప్త, ఋషిపురంధ్రులు శచియు దిగీశసతులు
వెట్టు బంగారుభిక్షంబు బియ్య మద్రి, పగిది మించె బృహస్పతిభట్టుచెంత.

76


క.

తాలిమి మీఱఁగ నెప్పటి, మాలిమితో దేవగురుఁడు మంత్రము దెలుప
న్వేలిమి సేసె మృగాంకుని, మేలిమిగను రక్షయిడె సుమేధుఁడు నుదుటన్.

77

క.

రతిపతియహితునిసతి భా, రతి జతయై కంకణము లొరయ ముత్తెపుటా
రతియెత్తిరి వామనునకు, రతిబోఁటుల పాట తేట ఱాలు గరంగన్.

78


మ.

పరమేశాన పయోజసంభవులు దిక్పాలుర్ క్రమం బొప్పఁగాఁ
బరమాహ్లాదము మీఱ నొండొరులు పైపై నిచ్చుపట్టాంశుకా
భరణశ్రేణులు కేలఁ గైకొని సభాభాగంబున న్నిల్చి సు
స్వరుఁడై దేవగురుండు వీఁడు చదివె న్సర్వాగమస్ఫూర్తులన్.

79


వ.

ఇవ్విధంబునఁ గశ్యపబ్రహ్మ సకలబ్రహ్మర్షిసమేతుండై తనూజాతు నుపనీతుం
గావించి దిగంతరాగతశిష్టజనవ్రాతంబుల నభీష్టమృష్టాన్నంబుల దక్షిణ
తాంబూలంబుల సంతుష్టులం జేయుచు మహోత్సవదినచతుష్టయంబు గడపె
నంత.


చ.

బలి జగదేకదాత యని పల్మఱు భూమిసుధాశనోత్తము
ల్పలుక ముదంబుతో విని సుపర్వమనోరథసాధనోద్యమం
బలర మృషావటుండు బలి యాచన సేయుటకై నివేశము
న్వెలువడె నింక నెవ్వరొరు వేఁడనివారలు వేళ వచ్చినన్.

81


తే.

కురిసెఁ బువ్వులవానలు మెఱసె దిశలు, విరిసెఁ గావిరి దుందుభు లొరసె దివిని
దొరసె గంధర్వగాన మచ్చరలయాట, మెఱసె జగములు వేడుకఁ బొరసె నపుడు.

82


సీ.

ఒకవింతహరువైన యూర్ధ్వపుండ్రంబుపైఁ బెట్టిన మేధావిబొట్టు దనర
నీలంపుఱానిగన్నిగలీను సిగగంటు నవరత్నఖచితకుండలము లమర
నవమైన కృష్ణాజినముతున్క మెలిగొన్న ధవళయజ్ఞోపవీతంబు మెఱయ
ముప్పేటఁ బెనఁగొన్నముంజి పచ్చనిగోఁచి వెలిపట్టుపంచయు మొలఁ దనర్ప


తే.

మణిపవిత్రము దండకమండలువులు, గొడుగు పావాలు పాత్రిక బెడఁగుమీఱఁ
బసుపుఁబూసిన టెంకాయఁబాణిఁ బూని, వామనుఁడు వచ్చె బలి యజ్ఞవాటమునకు.

83


తే.

కపటవటు దివ్యతేజఃప్రకాశనంబుఁ, గాంచి యప్పుడు విజ్ఞానఘనులు మునులు
లేచి కరములు ముకుళింవఁ జూచి శుక్రుఁ, డసురవల్లభుతోడ నేకాంతమునను.

84


మ.

అదిగోఁ జూచితె బ్రహ్మచారివలె దైత్యారాతి యేతెంచె న
త్త్రిదశాధ్యక్షున కెల్లసంపదలు నెంతే ప్రేమతో నీయఁగా
నదితీగర్భమునం జనించె నితఁడే మర్థింప నీ వీయఁగా
మదిలో సెంచకు మీయనెంచినను సామ్రాజ్యంబు లేదింకిటన్.

85


తే.

ఆత్మబుద్ధి సుఖం బిచ్చు నంతకన్న, గురువు సెప్పిన సద్బుద్ధి పరులబుద్ధి

కొదవదెచ్చును స్త్రీబుద్ధి కులముఁ జెఱచుఁ, గాన నాబుద్ధి విని సిరు ల్గనుము నీవు.

86


మ.

అనిన ధర్మవిరోధ మిట్లనుట గా దాచార్య వేదార్థవి
జ్జను లేదేవునకుం బ్రియంబుగ నొనర్పంజూతు రశ్రాంతమున్
ఘనయాగంబుల నట్టిదేవుఁ డిట సాక్షాత్కారమై నిల్చి వేఁ
డిన బ్రాణంబులు నిత్తుఁ బ్రాణములకంటెన్ హెచ్చు త్రైలోక్యమున్.

87


క.

అఘటనఘటనాసామ, ర్థ్యఘనుం డీశ్వరుఁ డతండు దలఁచిన కార్యం
బు ఘటింపకున్నె యీలో, నఘహర మగు గీర్తిఁ గాంచు టర్హము సుమ్మీ.

88


తే.

శిబి దధీచి విరోచను ల్చిత్రముగను, యాచకుల కిచ్చి రట యంగ మట్టికీర్తి
యెఱుఁగ లేనట్టి నాదాన మేమి యనుచుఁ, గుండుచుండుదు నది దొరకొనదె నేఁడు.

89


వ.

అని పలుకుచున్న సమయంబున.

90


సీ.

వివిధదేశాయాతవిద్వన్మిధఃకృతాలఘుశాస్త్రవాదకోలాహలంబు
నవనతత్తత్క్రియాశంక్యుపద్రష్టుసాధూత్తరార్పణదక్షహోతృకంబు
మహిషీవచస్సత్యమహిమజ్వలత్ప్రవర్ణ్యక్షీరశిఖిశిఖాక్రాంతనభము
ధూమగంధిలవసాహోమవేళాసర్వజనకౢప్తకరతాళసంకులంబు


తే.

ఖదిరబిల్వాదియూపయుక్తంబు రుక్మ, పక్షపక్షీంద్రచయనవిభ్రాజితంబు
నగుచు మించు బలీంద్రుని యశ్వమేధ, యాగశాలకు వచ్చె మాయావటుండు.

91


శ్లో.

దదాతు లక్ష్మీం తనలోకనాథో, వశంగతేంద్రస్య జగద్ధితస్య
సంప్రాప్తభూర్య స్సుతలాభతాంచ, భవా న్వదాన్యోహి బలే సురాణాం.

92


క.

అని యుభయార్థంబుల దీ, వనతోఁ డెంకాయ యొసఁగ వామనుచేఁ గై
కొని బలి వటుని వరాసన, మున నిడి తగ నర్ఘ్యముఖ్యపూజ లొనర్చెన్.

93


క.

ఒనరించి ధన్య మయ్యెం, జననము పుణ్యుండ నైతి సవఫల మొదవె
న్నిను సేవించితి గావున, ననఘా నీవాంఛఁ దెల్పు మది చేకూర్తున్.

94


వ.

అనిన దంభడింభకుం డిట్లనియె.

95


సీ.

చక్రపాణి జయించి సకలలోకము లేలె ఘనశక్తిని హిరణ్యకశిపుఁడాది
గణనీయసకలసద్గుణరత్నరాశియై యలరారెఁ బ్రహ్లాదుఁ డంచు వెనుక
ద్విజవేషములఁ దన్ను వేఁడువేలుపులకుఁ దను వొసంగెను విరోచనుఁడు మొన్న
గరుడవాహప్రీతిగా శతక్రతువులు చేసినాఁడవు సర్వజేత వగుచు


తే.

ననుచు వామనుఁ డెంచి యో దనుజనాథ, తపము సేయుటకై పదత్రయధరిత్రి
నడుగవచ్చితి యోగ్యుఁడ నంతమాత్ర, మిచ్చి యంపింపుమనిన బలీంద్రుఁ డనియె.

96


మ.

అనఘా కల్పమహీరుహోత్తమము డాయంబోయి కారాకువేఁ
డినజాడ న్నను నేమి వేఁడితివి కంటే నాదు సామ్రాజ్యమున్
ధనము ల్ధాన్యములుం దుకూలములు రత్నంబుల్ యథేష్టంబుగా
నొనగూర్తు న్గొను నన్ను వేఁడుజనుఁ డన్యు న్వేఁడఁగాఁ జెల్లునే.

97

వ.

అనినఁ జతురవచనరచనాపటుం డగు కుహనావటుం డిట్లనియె.

98


చ.

అడిగినవారిఁ జూచిన భయంపడి వెల్వెలఁబాఱుమోముతో
జడియక యాదరించుచుఁ బ్రసన్నుఁడవై యభిలాష మేమి యం
చడుగుచు ముందుగా నడిగినందుల కెచ్చుగ నిత్తునంటి వీ
యెడ నినుఁబోలుదాత గలఁడే త్రిజగంబుల నెంచి చూడఁగన్.

99


మ.

అమరారీశ్వర బ్రహ్మచారులకు రాజ్యం బేల కాంక్షించుమా
త్రము భూమిం దయసేయు మేఁ దప మొనర్పంబోయెద న్స్వల్పదా
నముచే నేమిఫలం బటంచనకు నానాదానము ల్పాదమా
త్రమహీదానముఁ బోలదందురు సుమీ తర్కంబు లింకేటికిన్.

100


మ.

అవనీదానమహత్త్వముం దెలియలే రంభోజగర్భాదులు
న్వివరింతు న్విను సత్కుటుంబినికిఁ బృథ్వీదానముం జేసిన
న్భవపాశంబులఁ బాసి మోక్షపదవి న్బ్రాపించు హత్యాదిపా
పవిముక్తుం డయి యెట్టి మూర్ఖుఁడును జిత్ప్రావీణ్య మేపాఱఁగన్.

101


తే.

విప్రవరునకుఁ దూమెఁడు విత్తనముల, నేల యొసఁగిన ఫలము వర్ణింతు వినుము
లోకపావని యగు గంగలోనఁ ద్రిదిన, మజ్జనము సేయు ఫల మగు మనుజులకును.

102


క.

చెలఁగుచు నిద్దుము విత్తన, ములనేల కుటుంబి కొసఁగు పుణ్యాత్మునకు
న్గలుగు న్శతహయమేధం, బులు గంగాతటిని జేయుపూర్ణఫలంబుల్.

103


ఉ.

పుట్టెఁడు విత్తనంబులకు భూమివిశిష్టున కీయఁజాలు నా
పట్టపుదాతకుం గలుగుఁ బంకజనాభు పదాంబుజంబునం
బుట్టిన యేటిచెంతఁ బరిపూర్ణముగా హయమేధ మాది యై
నట్టి మఖంబులు న్శతసహస్రములు న్ఘటియించు పుణ్యముల్.

104


క.

కల దొకయితిహాసం బిం, దులకు న్వినుపింతు వినుము దురితము దొలఁగు
న్గలుగును భూదానఫలం, బలఘుతరం బగుచుఁ ద్రిభువనైకవదాన్యా.

105


సీ.

మును బ్రహ్మకల్పంబునను భద్రమతియను విప్రోత్తముఁ డొకండు వేదశాస్త్ర
నిపుణుఁడు గలఁ డాతనికి భార్య లాఱ్వురు నందను లిన్నూటనలువదిగురు
గల రతఁ డత్యంతకష్టదారిద్రుఁడై కుడువఁ గూడును గట్టఁ గోక లేక
వగ నొంది వేసరి వసుమతిదానంబు గావింప కీలేమి పోవ దనుచుఁ


తే.

గోరి కౌశాంబిలోన సుఘోషువలనఁ, బంచహస్తావనిఁ బ్రతిగ్రహించి విష్ణు
భక్తున కొసంగి సకలసంపదలఁ బొదలి, వెనుక మోక్షంబు గనె వింటివే బలీంద్రా.

106


తే.

కాన భూదాన మొనరించుకంటె నధిక, మైన దానంబులేదు నే నడిగినట్టి
పుడమి మూఁడడుగు లొసంగి భువనమహిత, యశముఁ బుణ్యంబుఁ గైకొనుమన్న నలరి.

107

శా.

హేమక్ష్మాధరసుస్థిరుండు బలిదైత్యేంద్రుండు వింధ్యావళీ
వామారత్నము రత్నకుంభజలము ల్వంపన్మృషావామన
శ్రీమత్పాదయుగాభిషేచన మొనర్చె న్బ్రహ్మరుద్రాదు లో
హో మేముం గనలేనికీర్తిఁ గనె దైత్యుం డంచుఁ గీర్తింపఁగన్.


క.

క్రవ్యాదవిభుఁడు వామన, దివ్యశ్రీపాదపద్మతీర్థంబు శిర
స్సేవ్యము గావించి బుధ, స్తవ్యమతిని ధారవోయు సమయమునందున్.

109


తే.

వామనుఁడు దర్భగిండిలో వారిధార, కడ్డమైయున్న శుక్రుని యక్షిఁ బొడువ
మిట్టిపడి కన్ను వోయిన లొట్టవోయె, ననుచు నవ్వుచుఁ జేసాచి యడుగుటయును.

110


క.

క్షమ మూఁడడుగులు బలి యు, త్తమభక్తి "సదక్షిణం సతాంబూలం తు
భ్యమహం సంప్రదదేదం, నమమ” యనుచు ధారవోసె నలినాక్షునకున్.

111


మ.

పెరిఁగె న్వామనుఁ డంత దంతిపొడవై పృథ్వీధరం బంతయై
శరదంభోరుహమిత్రశీతకరనక్షత్రగ్రహస్వర్మహా
స్ఫురితుండై జనలోక మవ్వలిజగంబు న్సత్యము న్మించుచున్
హరి దంతంబులు నిండి మెండుకొనె నత్యాశ్చర్య మేపారఁగన్.

112


సీ.

పద్మరాగప్రభాభాసమానకిరీట మరవిందజాండకర్పరము నొరయ
శతయోజనాయతశతపత్రపత్రజైత్రము లైన విపులనేత్రములు మెఱయఁ
బరిపూర్ణచంద్రబింబసహస్రవిస్త్మృతం బగుమోము మందహాసంబు దొరయ
దశదిగంతవ్యాప్తతతబాహువులు శంఖచక్రాదివివిధశస్త్రములు నెరయ


తే.

కవదొనలు నక్రకుండలకౌస్తుభములు, వైజయంతియు లక్ష్మీ శ్రీవత్స కాంచ
నాంబరము లొప్ప బ్రహ్మాండ మనెడు భరణిఁ, కస్తురియుఁబో లెఁదగెఁ ద్రివిక్రమవిభుండు.

113


మ.

హరి యీరీతిఁ ద్రివిక్రమాకృతిని బ్రహ్మాండంబునన్ నిండి యా
వరణాంగంబుల సర్వలోకములు మించన్ బ్రహ్మరుద్రాదిని
ర్జరు లగ్గింపఁగ నందముఖ్యసుభటవ్రాతంబు సేవింప దు
ర్భరతేజంబున రాజిలన్ బలి కృతార్థంమన్యుఁ డయ్యెన్ మదిన్.

114


వ.

అపుడు.

115


శా.

వినుఁ డోహో జనులార విష్ణుఁ డొకఁడే విశ్వాధికుం డాద్యుఁడుం
గనుఁగొన్నారె కదా మహామహిమ మింకన్ భక్తితోఁ గొల్వుఁడీ
యనుచుం జాటుచు జాంబవంతుఁడు సముద్యద్భేరి మ్రోయించుచున్
వినరా నిర్వదియొక్కమా ర్వలగొనెన్ విష్ణున్ విరాడ్విగ్రహున్.

116


మ.

అరవిందాయతనేత్రుఁ డంతట నతుల్యంబైన త్రైవిక్రమ
స్ఫురణన్ మించఁ బదాంబుజం బొకటిచే క్షోణీస్థలిం గొల్చి యం

బరమార్గంబున నొక్కయంఘ్రి నిడఁ దత్పాదాంబుజాంగుష్ఠశే
ఖరదివ్యన్నఖరంబు సోఁకి పగిలెన్ కంజాతజాండం బొగిన్.

117


గంగావతరణవచనము.

ఈక్రమంబునఁ ద్రివిక్రమప్రసారితవామచరణాంగుష్ఠ
నిష్ఠురనఖరశిఖావిఘటితబ్రహ్మాండకరండోపరిపరిజనితరంధ్రనీరంద్రనిరర్గళ
దనర్గళమధురశిశిరపాండురలఘుతరగురతరప్రభావాభరణబహిరావ
రణవారిపూర్ణంబు యోగిమనఃకమలసంతతసంచరణంబును లక్ష్మీకుచ
శాతకుంభపూర్ణకుంభసంభావితనవపల్లవాచరణంబును నగు హరి
చరణంబునం దొరంగి తరంగితంబై రథాంగధరపదప్రక్షాళనంబున
నభంగురతరప్రభావంబును లోకైకపావనంబును బ్రహ్మహత్యాదిపాపాపనో
దకంబు నగుచు నప్పావనోదకంబు కంబుధరచరణాంబుజమరందంబుచందం
బున నంబుధరవర్ణపదనఖసాంద్రతరచంద్రికలయందంబున దనుజారిపదంబు
దిగజాఱి గగనకాయమానసూనమాలికలపోలికల ముక్తికలకంఠకంఠికాకంఠ
మాలికలలీల నాలోలవాతూలజాలంబుల బహుధారారూపంబు లై సత్యతపో
జనమహస్వర్లోకవాసి బ్రహ్మబ్రహ్మర్షిసనకాదియోగీంద్రవైభ్రాజికధ్రువస
ప్తర్షిశ్రేష్ఠనందితానందితస్తుతస్నాతాంతర్గృహీతకమండలుపరిపూరితంబై
గాయమానగంధర్వగజరాజగామినీగానద్రవన్మహేంద్రనగరచంద్రశాలికా
కాంతచంద్రకాంతనిరంతరస్రవజ్జలధారానుగతంబును బరిసరహరిహయపుర
వరమరకతమణిమయభవనసురుచిరరుచిరచితశైవాలవల్లికావేల్లితంబును
వలనిశాటపాటనపటుపుటభేదననాటకశాలికానటనటదప్సరఃకుటిలాలకాపద
పుటకరటత్కటకమురజవాదిత్రనాదాచ్ఛాదకవలభిపతనవేళాఘళఘళా
రావసంకులంబును నందనవనపాదపవిటపసంసక్తనిజసలిలకణద్విగుణితకుసు
మజాలకంబును విస్మయాకులప్రేక్షమాణగీర్వాణముగ్ధజలజేక్షణావీక్షణస్నిగ్ధ
సోసూచ్యమానవలమానమీనవితానంబును నిర్మలభర్మనిర్మితనర్మహర్మ్య
ప్రాంగణమాణిక్యవితర్ధికాశయాననాయకప్రార్థ్యమానపురుషాయితకేళికా
ననుకూలలజ్జాకులసభ్రూంగవిలాసవిలోకనోత్తిష్ఠమానమానవతీవేణికా
హఠాకర్షణవిశ్లథతతఇతఃపతితసహాగతమౌక్తికసూచకతత్తత్పురుహూత
కలధౌతశృంగారసౌధశృంగాహతోత్పతితజలబిందుసందోహకందలితమం
దారకుసుమకోరకాలంకృతనికటతటకందుకకేళికానందబృందారకసుందరీ
చికురభారంబును సురచకోరలోచనారతిశ్రమహరణనిపుణతరమందానిల
సందానితశైత్యంబును జారణస్తూయమానంబును గిన్నరజేగీయమానంబును
నిజావలోకనమాత్రసంత్యక్తబలీకృతహృత్తాపసలీలాహృత్తాపసవిబుధప్రార్థ్య
మానంబును నమరావతీపురవరపరిఖాయమానంబును జలకేళికాలోలదివి
జకులపాలికాపాళికాకుచపాళికాశ్మీరపాళికామనీయకతదీయసౌర

భ్యఘుమఘుమాయమానంబును శంఖబుద్బుదవజ్రమాక్తికకుముదఫేనఖణ్డకర
కాయితతారకావారకంబును నిజనైర్మల్యనిమృష్టనిష్కళంకమృగాంకమణ్డల
గళత్సుధారసధారాసధారాసంవర్ధమానంబును ఖంజోపరిభాగీరథీపతనవిస్మి
తానూరుసారథిస్తవనీయంబును బ్రణయకలహదూరస్థితనిజనీరధారాసిక్త
మృదులాంగసంసక్తదుకూలచేలాంతరపరిదృశ్యమానకుచలికుచనితంబబిం
బరంభోరువిజృంభమాణావలోకనోత్సుకనాయకదత్తనూతనవసనయాచమా
నవైమానికమానినీజనజనితసీత్కారమానితంబును సవర్షవర్షప్రకర్షనిదర్శక
వలాహకపదమోముచ్యమానంబును నసమయసమయన్నిజజలబిందుతుందిలచా
తకవ్రాతంబు నగుచుం దెఱగంటిదొరకు వెఱచి తనతనయు వరుణునియింట దాఁ
చి వెలవెల నగుచు మంచుమలనే మంచుగట్టులకుఁ బట్టంబు గట్టెనని నలుజడ్డిగం
బుల బిడ్డ నొడ్డారించి బొడ్డుతామర దొడ్డవేల్పు పుడమిదాల్పులకు నేలికవు గమ్మని
కమ్మనికుందనంపుజిగిని దనతేజంబు మెఱయించు జేజేలవిడిపట్టున కభిషేకం
బు చేసినతెఱంగునఁ బసిఁడకొండతుదను బదివేలయోజనంబులపఱపున నున్న
యన్నలువపట్టణంబునఁ బోరునం దొట్టిపట్టు సాలక నలువ నలుమోములందు
వెడలునలుతొలిపల్కులనలువున నలువాకిళ్ల నలుదెఱంగులై వస్వోకసారాది
దిక్పాలకపురంబు లొరసికొని వెలువడి తనవడి బెండువడి బెడబెడమని దొరలి
పడు పెదపెదగుండ్లచప్పుడుల కులుకుచప్పు డెడనెడఁ బర్వులిడుజంటనలుహజ్జ
లమెకంబుల నెఱుఁగక తోడంబఱచు తెఱనోరి మెకంబులఁ గాన వెనుదవులు
గౌరులతోడ నరుగు మువ్వన్నెమెకంబుల నంటిపాఱు నొంటికాండ్రసందునం బడు
దున్నలపిఱుందం జను నెలుఁగులబలగంబునకుఁ జంగుచంగునం దాఁటు కన్నె
లేళ్ళ కందంద నడ్డంబగుచుఁ గోనలలోనఁ జిగురువిలుకానికేళిం దేలుచు
నదరిపాటునం జూచి యదరిపడి లేచి తమతమక్రొత్తముత్తియపుఁజెఱుఁ
గులచెంగావులఁగటీతటంబుల నొకకొంగు పచ్చినునుగోటితాఁకులం జిలుప
చిలుప నెత్తురులు గ్రమ్ము గుత్తంపుకలిగుబ్బచన్నుల నొకకొంగు సవరించి యఱ
జాఱు క్రొవ్వెదలు పువ్వులవాన గురియఁ గౌను జడియ బెళుకుచూపుల బెగడు
కోడెబేడిసలబిత్తఱంపుటూర్పుల మృగనాభిపరిమళంబులు గుప్పళించుచు బలి
తంబులై మెలఁగు గిలుకుమట్టియలరొదలతోఁ గడలకుం జని మును తాము
కడలనిడిన తొడవులం దా లోఁగొనిన నర్పితంబులు సేయు నెయ్యంపుకర్పూర
గంధులనేర్పులకు నగుచుఁ దచ్చనలాడు బృందారకకుమారులమందహాసరుచికంద
ళంబులతో సందడించుచుఁ బ్రస్రవణఝర్ఝరనిర్ఝరంబులం బ్రవృద్ధం బగుచు
గిరీశాలింగనసంగతకుంకుమపంకంబునఁ బొంకంబగు నకలంకఛాతురాగంబుల
జాజువారుచుం గమలకల్హారకైరవకువలయకోకనదాదికుసుమసౌరభలోభ
చంచలచంచరీకచక్రాంగచక్రవాకఝంకారక్రేంకారచంకనత్సరోవరంబులఁ

గళిందకన్యకాసరస్వత్యాదినదుల నెచ్చెలులంబోలెఁ గల్పుకొనుచు వాహంబు
తెఱంగునం దుముకుచు వజ్రశైత్యంబునం గొండలుం దెగఁబాఱుచు మతంగ
జంబు భంగిఁ గర్పూరకదళికాకాంతారంబుల భంగించుచు భూవల్లభుఠేవం
బ్రతికూలతరుల నిర్మూలించుచుఁ బతితతరుశాఖల నున్న తమ్ముం జుట్టుకొను
ప్రవాహగతసర్పంబులకుత్తుకలు రెండుచేతులం గట్టిగాఁ బట్టికొని బిట్టుల్కి
చూడంజాలక మార్మొగంబులు పెట్టు శాఖామృగంబులం గని కిలాకిల నగుచు
మార్గగండోపలంబులపై వసియించు చెంచుమించుఁబోఁడుల వెనుకమర్లుగా
వచ్చి యదరిపాటున భుజంబులువట్టి త్రోయు తెఱంగున వెఱపించు చెంచునా
యకుల నదలించుచుఁగడువడి నడరు బెడబెడలకు జడిసి కడలకు నిగుడ నక్కొం
డగుండులం బడఁదివియుచు దను గనుంగొనిన వినిన నంటిన సీకరములు సోఁకిన
పైతెమ్మెరలు దొరసినమాత్రంబున భూతప్రేతపిశాచశాకినీఢాకినీకూశ్మాణ్డాది
గ్రహంబులు దమతమవిగ్రహంబులు మాని మానితవైమానికరూపంబులు
పూని ధగద్ధగితమణిగణస్థగితకిరీటకటకకేయూరహారాదిసురుచిరాకల్పం
బులు కల్పప్రసవదామంబులు కనకాంబరంబులు దివ్యచందనానులేపనంబులు
రతిమనోహరమనోహరాకారంబులు గలిగి దివ్యతరతేజంబులు నిగుడఁ
దెగబారెఁడు కీల్జడలుం దొగఱేనినగుమొగంబులు బెగడు బేడిసలంబోలు
వాలుగన్నులు నిగనిగని జిగిమోవిమానికంబులు మగఱాలనేలుపలు
వరుస బిగిగుబ్బచన్నులు మృగరాజమధ్యంబులుఁ జిగురుటడుగులుఁ గలిగి
చిలుకతేజివజీరుని చిలుకుటమ్ములు ముద్దుఁజిల్కు తెఱగంటిచిల్కలకొలుకులు
వేనవేలు గొల్వ భాసమానరవికరావమానకరణదురభిమానమణిమయవి
మానారూఢులై యచ్చరమచ్చెకంటు లిరుకెలంకుల నకలంకరత్నకంకణక్రేం
కారమ్ము లొలయ వింజామరములు వైవ రంజిల్లుచు నంజలిబంధంబులతో నుతు
లు సేయుచుఁ గొంతదవ్వు వెంబడి నిగిడి దివంబున కరుగ నట్టిక్రమంబుననే నిజ
సలిలాకృష్టధరాతలపురాజననాంతరపుష్టశరీరనరకనివిష్టదుష్టజనంబులు యమా
దుల కాశ్చర్యకరు లగుచుం బుణ్యలోకంబుల కేఁగ సకలపుణ్యనదీనదంబుల దురి
తావహకీర్తి మూర్తీభవించి తన్నుఁ జేరుతెఱంగున రంగగుచుఁ జక్రాంగంబులు
వ్రాల నినుం గనుంగొను జనులయందు వసియింపకుండం జేసితి వింక మాకు గతి
యెయ్యది యని తత్తజ్జనులపాపంబులు రూపంబులు గైకొని తాపంబున మొర
లు వెట్టునట్టి తెఱంగున రోలంబజాలంబులు ఝంకారంబులు సేయ నభంగతర
తరంగత్వరంగమృదంగరంగధ్వానంబులకుం జెలంగుచు బెళుకుబిత్తఱికోడెబేడి
సలు మత్స్యపుటంబులు వైవం బ్రవాహవేగంబునం బెండువడి తోడనడరు పెద్ద
పెద్దకొండల గండూపలంబుల మెండున నిండుకొనియుండు మకరనక్రగ్రాహ
కర్కటకాదిజలజంతుసంతానంబులు వెలయం దీరంబుల నిల్చి పుణ్యపురంధ్రీజ

నంబు లెత్తుముత్తెపుటారతులతెఱంగునం జెంగల్వలవలగొను సుడులుం
బెడంగుసూప సంపన్ను లగుజనులు భక్తిపూర్వకంబుగా నొసంగుపట్టాం
శుక్రమణిభూషణంబులన లోపల వెలికి నడరుమౌక్తికంబుల నిగ్గుల బుగ్గ
లగ్గలముగ దత్తత్పౌరజనసమర్పితరథదీపంబులకు వెలుంగు లొసంగు ప్రవా
హాగతభుజంగపుంగవఫణారమణీయమణిగణప్రభలు పొసంగఁ గమలాంతర
కాంతకమలాకాంతాభిషేకంబునకుం బలె జలవేదండషండంబులు దుం
డంబు లెత్త సరసప్రదేశంబులు నాశుకవితరీతి నతిత్వరితగతి యగుచుం
బ్రతిహతస్థలంబుల నభిమానిజనయాచనచందంబున మందంబగుచుఁ గఠినచిత్తు
లకుం దొలంగి చనుసజ్జనునితెఱంగున గగనంబునకుం దొట్టుగట్టుల కెడ
గల్గుచుఁ దూర్పున సీతాభిదానంబున నభిరామలీల మెఱయ మేరుకమలకేసర
కేసరాచలగంధమాధనవసుంధరాధరభద్రాశ్వవర్షమార్గంబునఁ బశ్చిమంబునఁ
జక్షువనుపేర లోలమానమీనకటాక్షంబుల సుపర్వాశ్చర్యకరమాల్యవన్మాల్య
వద్భూదరకేతుమాలవర్షంబులసరణిని నుత్తరంబున భద్రాఖ్యనుస్మరణశీల
భద్రప్రద యగుచు నభ్రంకషశృంగశృంగవత్పర్వతోత్తరకురుదేశపదంబున
దక్షిణంబున నలకనందనామధేయంబున వదనారవిందనందన్మిళిందాలకయై
గగనసరఃకనకకమలాయమానహేమకూటహేమకూటకుధరభారతవర్షపదవిం
బ్రవహించి దిక్కూలముద్రుజసముద్రవాతూలలోలకల్లోలకోలాహలం బవా
ర్యతూర్యఘోషంబులై మొరయ నౌర్వాగ్నిసాక్షియై వెలుఁగం బ్రతిరవణ
ద్విజకలకలంబు మంత్రకులంబులై మించఁ గలకంఠికాగానంబులు పెండ్లిపాటల
నీటుసూప విష్ణుధారాదత్తయగు గంగానదియుఁ దరంగిణీరమణుండును వేల
యనుతెర కిరుగడల నిలిచి బుద్బుదపులకాంకురములు గువలయనయనవికా
సంబు గుముదప్రభామందహాసంబునుం జెలువొంద నొండొరులునుం దరంగ
హస్తంబుల శీకరమౌక్తికంబులం దలఁబ్రాలు వోయుచు నన్యోన్యమానవీక్షణం
బులుం దారసిలఁ గలసి జలనికరవీచికాన్వితమౌక్తికవిద్రుమాదిమణిమణ్డిత
శైవాలవల్లికాకాచమణిరమణీయమంగళసూత్రాలంకృతకంబుకంధర
యగుచుఁ బవమానవిప్రకులంబు భృంగాశీర్నినాదంబులతో వేలావనకుసుమ
కేసరాక్షతంబులు వధూవరులపైఁ జల్లఁ గరకమలభ్రమరమాలికాకౌతుక
బంధుండును ఫేనదుకూలచేలుండును బహుళతరరత్నోర్మికాభరణుండును
తటవనతరుచ్యవమానరుచ్యకుసుమవిసరశేఖరుండును నగురత్నాకరవరునకు
నర్ధాంగలక్ష్మియై యుబ్బించుచు సుఖకేళీవిలాసంబునం జెలంగె నంత.

118


తే.

పద్మలోచనుఁ డెప్పటిబ్రహ్మచారి, వేషమున నున్నఁ గనుఁగొని విప్రజిత్తి

ముఖ్యదైత్యులు దనుజేంద్రు మోసపఱిచి, సిరులు హరియించె హరి యంచుఁ గెరలి యపుడు.

119


మ.

వలదంచుం బలి దెల్పిన న్వినక గర్వస్ఫూర్తి గర్జించుచుం
బ్రళయాభ్రప్రభల సరింబొదువ జాగ్రత్ఖడ్గవిద్యుజ్జ్వల
జ్వలనజ్వాలిక లాక్రమించె దశదిక్చక్రంబు లొక్కుమ్మడిన్
దళమయ్యె న్శరవృష్టితోఁ దొరిగె శస్త్రవ్రాతనిర్ఘాతముల్.

120


శా.

ఆలోనందసునందముఖ్యహరిసైన్యవ్రాతవాతూలముల్
తూలించెం దనుజాభ్రజాలములఁ దోడ్తో మాధవానుజ్ఞ నా
వేళ న్వారుణపాశబంధితునిఁ గావించె న్వదాన్యు న్బలి
న్వ్యాళాహారి సమస్తదేవతలు హాహాకారముల్ చేయఁగన్.

121


ఉ.

కట్టినఁ గట్టుఁగాక హరి కట్టడ చేసినకేలు మున్నుగాఁ
గట్టక వెన్క నేమిటికిఁ గట్టె విహంగవరేణ్యుఁ డిట్టు లిం
కెట్టు నమస్కరింతు హరి కే నని కన్నుల మ్రొక్కుఁ గాని యా
కట్టున కింతయైనను వికారము సెందఁడు దైత్యుఁ డత్తఱిన్.

122


క.

ఆయౌదార్యము ధైర్యం, బాయాస్తికబుద్ధిఁ జూచి యౌరా యనుచున్
వేయువిధంబుల సన్నుతి, సేయుచుఁ గనుఁగొనిరి దనుజశేఖరు దివిజుల్.

123


తే.

అంతఁ జిఱునవ్వుతోడ మాయావటుండు, దైత్యపతిఁ జేరి యోయి వదాన్యచంద్ర
యవనిపాదత్రయము నిత్తునంటి వేది, కడమపాదంబునకుఁ జోటు గలదె చెపుమ.

124


క.

ఇచ్చెదనని యీకున్న, న్వచ్చుం బాపంబు గౌరవం బగు నీ నీ
యిచ్చ యన న్విని మరుదసు, హృచ్చక్రేశ్వరుఁడు పల్కె నెంతయుభక్తిన్.

125


క.

లేదన నేటికి నిచ్చెద, నాదుశిరంబునను నిల్పు నళినేక్షణ నీ
పాదాబ్జము నేనుం బ్రహ్లాదునివలె సుకృతి నగుదు ననుసమయమునన్.

126


ఉ.

శ్రీదనర న్విశాలకటిసీమ ధరించిన హేమచేలము
న్మేదురమేఘమేచకసమిధ్ధచకచ్చకితాంగముం బతం
గోదయరంగదంబుజదళోపమలోచనము ల్చెలంగఁ బ్ర
హ్లాదుఁడు వచ్చె మాఱట విహంగతురంగుని రం గెసంగఁగన్.

127


తే.

వచ్చి తనుఁజూచి బంధంబువలన వినుతి, సేయలేమికి దనలోన సిగ్గుపడుచుఁ
గన్నుఁగవ నశ్రువులు గ్రమ్మనున్న బలిని, గాంచి హరిఁ జూచి పల్కె నిట్లనుచు నపుడు.

128

క.

సురపద మేటికి నొసఁగుము, చరణాంబుజభక్తి దైత్యసామ్రాజ్యంబు
న్హరియించి మేలు చేసితి, కరుణింపుము బంధముక్తుఁగా బలిని హరీ.

129


వ.

అని పల్కుసమయంబున.

130


ఉ.

వల్లభుఁ డిట్లు కట్టువడువార్త చెవింబడ గుండె జల్లనం
దల్లడమంది యద్దనుజ[6]పత్నియుఁ బల్లవపాణి చెక్కుల
న్వెల్లువగట్ట నశ్రువులు వెల్వెలఁబోవ మొగంబు నమ్మ నేఁ
జెల్ల నిదేమియంచు హరిఁ జేరి నమస్కృతి చేసి యిట్లనున్.

131


తే.

నీకుఁ బ్రియముగ దానంబు నెఱపువారు, మోక్ష మందఁగఁ బురుషార్థముల నొసంగు
నీదుకే ల్కిందు తనకేలు మీఁదు గాఁగ, దాన మొసఁగిన బలికి బంధంబు దగునె.

132


క.

విడిపింపుము నిను రాజ్యం, బడుగము నీవలయువారి కర్పింపుము మే
మడవుల నుండెద మిఁక నీ, యడుగులు మదిఁ దలఁచికొనుచు నార్తశరణ్యా.

133


మ.

అని దైన్యంబున విష్ణుపాదనతయై ప్రార్థించు వింధ్యావళీ
వనితారత్నముఁ జూచి యేచినదయ న్వాణీమనోనాథుఁ డో
వనజా బలిబంధనంబు తగవే వారింపు మన్న న్జగ
జ్జనకుం డిట్లనియెన్ సుధామధురవాచావీచివాచాలతన్.

134


తే.

ఎవ్వని ననుగ్రహింప నే నిచ్చ నెంతు, వానిసంపద హరియింతు వనజగర్భ
యటులుగావున బలిభక్తి కాత్మ మెచ్చి, యిటులు గైకొంటి సంపదలెల్ల నేను.

135


వ.

అని పలికి బలి కిట్లనియె.

136


క.

వినుము విరోచననందన, ఘనుఁడవు నీ వన్నిట జగంబుల నీతో
నెనయైన దాత గలఁడే, తనరారితి త్రిభువనైకదాత యనంగన్.

137


తే.

భావిమనువేళ దేవేంద్రపట్టమునను, నిన్ను నిల్పెద నందాఁక నీవు సుతల
మందు వసియింపుమనుచుఁ బ్రహ్లాదుఁ గూర్చి, దనుజసేనలతో నంపె దైత్యవిభుని.

138


తే.

కడమయఙ్ఞంబు సమదృష్టి గలిగి నిర్వ, హింపు శుక్ర యటన్న నుపేంద్రుఁ జూచి
యేకదృష్టిని నే నిర్వహింతు సామి, కరుణచే నంచు పల్కె నాసురగురుండు.

139


మ.

వనజాతాక్షుఁడు మాటమాత్రముననే వైరోచనశ్రీలఁ గై
కొని యీరీతి జగజ్జనుల్ పొగడఁగా క్షోణీధరారాతి కి
చ్చిన బ్రహ్మాదు లుపేంద్రుగా హరి శుభశ్రీసాంద్రు దేవేంద్రు నిం
ద్రునిగాఁ బట్టము గట్టి రెల్లరకు సంతోషంబు వాటిల్లఁగన్.

140


క.

అదితియుఁ గశ్యపుఁ డెటువలె, ముద మందిరొ యటులు చెలఁగె ముజ్జగములు న
భ్యుదయం బ్రింద్రోపేంద్రులు, పొదలింపఁగఁ గ్లేశలేశమును లేదయ్యెన్.

141


సీ.

ఘనగదాదండంబు గైకొని యిందిరాకాంతుఁడు వాకిలి గాఁచియుండఁ
దనకులోఁగాని యుద్ధతుల యుద్ధతిమాన్చు పనిపట్ల చక్రంబు పంపు సేయ

నేకార్యమునకైన లోకపాలాదికు లనిశంబు దనుబుద్ధియడిగి కొనఁగ
లలితరూపవిలాసలావణ్యవతులైన కన్యకామణు లూడిగములు సల్ప


తే.

స్వర్గలోకంబుకంటెను శతసహస్ర, గుణము లెక్కుడుగాఁ గల్లి ప్రణుతి కెక్కు
సుతలమున నేఁడు నున్నవాఁ డతులకీర్తి, చక్రిమతవర్తి బలిదైత్యచక్రవర్తి.

142


మ.

ఇలలోఁ జీఁకటి గల్గఁ దెల్పుదు రదే యిందేల లేదంచు ము
గ్ధలు వేఁడం జెలులార మీముఖరుచిం గన్పట్టఁగాలేక కొ
ప్పులలో డాఁగెనటన్నఁ గుంతలసుమంబుల్ దీసి వీక్షారుచి
న్నలు పై తోఁపనివే యనం బతి నగున్ దైత్యేంద్రవాసంబునన్.

143


మ.

జలకేలీసమయంబులం గలఁగిపోఁ జక్రంబులం దోలెనో
లలనా నీనగుమోము చందురునిలీలం గాచితే యన్న విం
తలు వింటింగద చంద్రుఁ డెవ్వఁడొకొ నాథా తెల్పుమంచన్నఁ గెం
పులయందంబునఁ దన్ముఖాంబుజముఁ జూపుమ్ వల్లభుం డచ్చటన్.

144


మ.

అతిపాత్రంబగు పద్మనేత్రునకు నత్యౌదార్యలీలాప్తిచే
క్షితిదానం బొసఁగ న్బొసంగుబలికిం జేకూరెఁగా కద్దిరా
సుతలావాసము గల్గునే యొరులకున్ క్షుద్రప్రదానంబునన్
స్తుతవైకుంఠముఁ బాసి యచ్చట వసించుం జక్రి భోగార్థియై.

145


తే.

అఖలసద్వారపాలకుఁ డైనలోక, వల్లభుఁడు ద్వారపాలకవంశజులకు
ద్వారపాలకుఁ డౌట తద్భక్తిఋణము, దీఱ దేమిచ్చిన నటంచుఁ దెలిసి కాదె.

146


తే.

తమపితామహు లితనికి ద్వారపాలు, రైరి యది పుణ్యమున కింతె యనుచుఁ గొల్వ
ధరణిపాదత్రయ [7]మొసంగి తాను జేసె, వెన్నుఁడున్ బలిమాటకు వన్నెగలుగ.

147


క.

శ్రీవామనావతారక, థావిభవము విన్నజనుఁడు ధనధాన్యయశ
శ్రీ వెలయఁగ భువి వర్ధిలి, యావెనుక న్మోక్షలక్ష్మి కధ్యక్షుఁ డగున్.

148


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెల్పు మని యడుగుటయున్.

149


మ.

జలజాక్షీమణికంకణక్వణనచంచచ్చంచలాచామర
చ్చలచక్రాంగగరుద్విచాలనచలాంచచ్చంచరీకచ్చటా
కలనాసూచకకుంతలద్యుతితరంగస్మేరవక్త్రాంబుజో
జ్జ్వలపత్రాయతనేత్రకోణవిహరత్సౌభాగ్యలక్ష్మీయుతా.

150


క.

తారకదారక దారక, తారకవిధి దారకాంతి తతయశ కవిబృం
దారకమందారక బృం, దారకవరవైభవా త్యుదారకళాధ్యా.

151

మాలినీ.

మగదలకులవర్యా మందరాహార్యధైర్యా
జగదభినుతచర్యా శాశ్వతౌదార్య ర్యా
నిగమపదవిహారా నీతికార్యానుసారా
ప్రగుణసుగుణహారా రంగమాంబాకుమారా.

152


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాఫ్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు పంచమాశ్వాసము.

5. వామనావతారకథ సమాప్తము.

  1. నదీశ్రేణీ
  2. ఖిందసింఖయరణీయయాస
  3. యాసకజణయ
  4. కిత్తణిజ్జవయహ్నీరఖేయదీయ
  5. ఛాయ. లక్ష్మీస్తనాధేయ లలితహస్తపయోజ పద్మలోచనలోకపూజనీయ
         ఖగవరయానేయ గజరాజరక్షక.................
        ఈశ్వరజనక మహేశ్వర భజనీయ...... త్రైలోక్యనాథ
        పూర్ణమృగాంకలావణ్యాస్య మందరక్షితిధర ధారక కృష్ణవర్ణ
    తే. భక్తకామితఫలదానపారిజాత, యాయజూక జనధ్యేయ (జ్ఞేయ) యాగరూప
        వాసుదేవ శతానంద వనజనాభ, కీర్తనీయజనీ.......
  6. తల్లజపల్లవపాణి
  7. మొసంగి ద్వారపాలుఁ, జేసె వెన్నుని బలిమాట వాసిగలుగ