దశావతారచరిత్రము/2. కూర్మావతారకథ

2. కూర్మావతారకథ

ద్వితీయాశ్వాసము



నారీమణికరుణాం
భోనిధిసంభవవిచిత్రభోగానంద
స్థానవిచక్షణ చంచ
న్నానాగుణకృష్ణ పద్మనాభునికృష్ణా.

1


తే.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టు లను వ్యాసశిష్యమాని
ధారుణీనాథ కూర్మావతార మిఁకను, దెలియఁ జెప్పెద విను మని తెలుపఁ దొణఁగె.

2


తే.

జగములు సృజింపఁ బోషింప సంహరింపఁ, జాలుమూర్తులఁ గని పెంపఁజాలినట్టి
యత్రి కనసూయకును సాటియైన మౌని, దంపతులు గల్గుదురె జగత్త్రయమునందు.

3


క.

ఆదంపతులకు గిరిక, న్యాదయితాంశమునఁ బుత్రుఁ డనఁ బొడమి స్వతః
ప్రాదుర్భూతజ్ఞానుం, డై దుర్వాసస్తపోధనాగ్రణి వెలయున్.

4


క.

కోమలపల్లవనిభవా, సోముని: బరిపీతవసనసోముని సుషుమా
సోమునిఁ బోలిన దుర్వా, సోముని నుతియింపఁ దరమె సోమునికైనన్.

5


క.

ఆలీలాశివుఁ డానం, దాలోలపయోధి మగ్నుఁ డై యెల్లపుడున్
బాలునివలె నున్మత్తుని, పోలికఁ జరియించుచుండు భువనములందున్.

6


క.

అతఁ డొకనాఁడు సువర్ణ, క్షితిభృత్తటి విహరణంబు సేయఁగ నత్య
ద్భుతమై యొకవాసన రా, మతి నెంతయుఁ జెలఁగి భృంగమార్గోన్ముఖుఁ డై.

7

సీ.

గంధర్వభామినీగానశ్రుతీభవత్కీచకనికషణోద్గీర్ణరవము
కపిధూతశాఖశాఖాపతజ్జాంబవగ్రహయాళుమునికన్యకాజనంబు
లగ్నకాషాయకాలస్కంధమిషతటిత్వద్విలోకననటద్బర్హిణంబు
శుకదష్టమాకందమకరందవాహినీతరణలీలాలోలహరిణకులము


తే.

సతతమునిదత్తహవిరన్నజనితతుంద, భారసుత్రామపహనదుర్బలఘనప్ర
కామబలవర్ధనోద్దామహోమధూమ, పావనం బగు నొక్కతపోవనంబు.

8


తే.

కాంచి తత్రత్యమౌను లాకస్మికముగఁ, దను నిరీక్షించి యయ్యష్టతనునిఁ గన్న
కరణి భక్తియొనర్పఁ గ్రేఁగంటఁ గనుచు, వాసనాహేతు వరయుచు వచ్చి యెదుర.

9


సీ.

చిన్నిప్రాయముదానిఁ జిన్నారిపొన్నారి యంచరానడలసోయగముదానిఁ
గొదమగుబ్బలదానిఁ గ్రొమ్మించు గ్రమ్మించు నెమ్మేనినిగనిగన్నిగలదాని
ముద్దుఁబల్కులదాని నిద్దంపుటద్దంపు మురిపంపుసోము నెమ్మోముదాని
రవలపావలదాని రంగారుబంగారుతమ్ములఁ గేరుహస్తములదానిఁ


తే.

జెలువుగలదాని నెఱనీటు గులుకుదాని, సొగసుగలదాని బెళుకుకందొగలదాని
సొంపుగలదాని నొయ్యార మొలుకుదాని, నొక్కవిద్యాధరినిఁ గాంచె యోగివరుఁడు.

10


తే.

అప్పు డొకయించుకేని యయ్యతివతంస, మాత్మఁ జలియింపఁ డీశ్వరాంశావతారుఁ
డీమహామహుఁ డంచు మోహింపఁజేయ, వెఱచెఁ గాఁబోలు నవ్వెడవింటిజోదు.

11


సీ.

అతనుజపావృత్తి నలరారుచెలికేలు దొరసినస్ఫటికాక్షసర మనంగఁ
బాణిపంకజమునఁ బ్రభవించి యొండొండ దిగజారుతళుకుముత్తెపుసరి యనంగ
హస్తాభిధానమోహమునశయంబున వ్రాలిననక్షత్రమాలిక యనంగ
గమనీయనవ్యశృంగారకరోర్మికాపరిపతజ్జలబిందుపాళి యనఁగ


తే.

నఖరనిష్క్రాంతకాంతిసంతాన మనఁగ, మధుకరాకర్షి ఘుటికాసమాజ మనఁగ
హస్తగతకంతుభాగ్యవర్ణాళి యనఁగ, నలరుసంతానననమాల్యంబు గాంచి.

12


తే.

మేలుగావలె బాల నీకేలిపూల, దండకని చేరు మౌనిమార్తాండుఁ జూచి
దండనుండు వధూటి కైదండ వదలి, దండ మని కేలుమోడ్చి వేదండగమన.

13


క.

కులుకువలిగబ్బిగుబ్బలఁ, జిలుగుంబయ్యెంటఁ జక్కఁ జేర్చుచుఁ బలికె
న్గలకంఠి బెళుకుకన్గవ, తళుకులు వేఱొక్క కుసుమదామము గూర్పన్.

14

ఉ.

ఓమునిసార్వభౌమ తపనోపమధామ గుణాభిరామ సు
త్రామముఖామరు ల్భవదుదంచితకీర్తులు సన్నుతింపఁగా
నేమును విందు విూపదము లెన్నఁడు నేఁ గనువిందు సేయ నేఁ
డీమెయి సంభవించె ఫలియించెను గోరిక లెల్లఁ గొల్లగన్.

15


క.

కావలసినఁ గైకొనుమా, పావన మగుఁగాక నాదుభవమదవీయం
బీవన మంచు మునీంద్రున, కావనిత ప్రసూనదామ మామోదమునన్.

16


క.

ఇచ్చిన మచ్చికఁ బుచ్చుక, యచ్చెలి మెచ్చుచు మునీంద్రుఁ డౌఁదలఁ దాల్చెన్
జిచ్చుఱకనుదేవర వై, యచ్చరనదిఁ దాల్చుచెలువ మచ్చుపడంగన్.

17


తే.

ఇటుల దాలిచి సంతుష్టహృదయుఁ డగుచు, మరలి కరమునఁ గైకొని మమతమీఱఁ
గన్నుఁగవ నొత్తికొనుచు వక్షంబుఁ జేర్చి, కంఠమున వైచి యవల నుత్కంఠఁ జనుచు.

18


సీ.

గంధర్వు లగ్రభాగమున జోడనమించు ఘోటుల దుమికించుకొనుచు నడువ
వెనుదండ యుద్దండవేదండకాండము లమదమంధరయానసరణి నడువ
నిరువంక నకలంకవరరత్ననిర్మితహాటకరథకోటు లరుగుదేర
వెలిడాలు గ్రమ్మించు విచ్చుకత్తుల వేల్పుమూఁక లెల్లెడలఁ గ్రముకొని నడువ


తే.

రంభనాట్యంబు మిగుల సంరంభ మెసఁగ, వెల్లయేనుఁగు నెక్కి ఠీవెల్ల మెఱయ
వెలయు వేడుక వాహ్యాళి వెడలివచ్చు, నమరనాయకుఁ గాంచి సంయమివరుండు.

19


తే.

చేతి పూదండ పైని వైచిన సురేంద్రుఁ, డది కరంబునఁ గైకొని మదకరీంద్ర
కుంభమున నిల్పఁ జెలువయ్యె శంభుశైల, శృంగసంగతగంగాతరంగిణి యన.

20


తే.

అంతఁ జంచలకుంభికుంభాగ్రనిహిత, పుష్పదామంబు దిగజాఱి భూమిఁ బడియె
దేవవిభురాజ్యగర్వతమోవినాశ, సూచకంబయి పడు తోఁకచుక్క యనఁగ.

21


వ.

అంత

22


క.

శీకరమదధారాజల, శీకరభీకరము ప్రోల్లసితమధుపాళీ
శ్రీకర మౌ కరమున గం, ధాకరమాల్యంబు దిగిచి యత్తఱిఁ గడఁకన్.

23


తే.

చరణముల వాలి కర్ణదేశముల సోలి, యాశ్రితాళులు మొఱవెట్ట నాలకింప
కలరుసరి రాచె మదకరి యంతెకాదె, యాశ్రితులయుక్తు లేల మదాంధులకును.

24


క.

ఈమెయిఁ దా నిచ్చిన సుమ, దామము సామజము దిగిచి ధరఁ బొరలింపం
గా ముని గనుఁగొని తొలుతం, గాముని హరియించుహరునిగతి నుగ్రుండై.

25


చ.

కటతటముల్ చలింపఁ గడకన్నుల నిప్పుక లుప్పతిల్ల భ్రూ
కుటి నటియింప నెమ్మొగము కోటిరవిప్రతికోటి గాఁగ వి

స్ఫుటపటుదీర్ఘనిశ్వసనము ల్బలితంపుసెక ల్విదర్పఁగాఁ
గిటకిటఁ బండ్లు గీటి పలికెం జటిధూర్జటి హుంకరించుచున్.

26


ఉ.

కన్నులు బ్రహ్మ రెం డొసఁగఁ గానఁగలేఁ డని గౌతముండు దాఁ
గన్నులు వే యొసంగె నధికంబుగ నప్డు మదాంధకారసం
ఛన్నము లౌటచేఁ దెలియఁజాలవు తన్మదకారణంబు నిం
క న్నినుఁగూడనీయ కుపకారము చేసెదఁ జూడు వాసవా.

27


ఉ.

ఏమనవచ్చు ని న్నిఁక సురేశ్వర! నే సుమదామ మిచ్చినన్
స్వామి! మహాప్రసాద మని చయ్యన నంది ప్రమోదలక్ష్మి నె
మ్మోము వికాస మొంద నిజమూర్ధమునం ధరియింప కీగజ
గ్రామణిచేతి కిచ్చి కసుగంద నొనర్చితి ధౌర్త్య మెన్నఁగన్.

28


ఉ.

ఇందునఁగాని మే మెఱుఁగమే భవదీయమహత్వ మోరిసం
క్రందన నన్ను నెవ్వనిఁగఁ గాంచితి విప్పుడు విప్రమాత్రుఁగా
దెందమునం దలంచితివొ డెప్పర మప్పని నన్ను విన్న గో
విందధృతాబ్జరోచిరరవిందభవాదులు దల్లడింపరే.

29


చ.

ఎఱిఁగెదుగాక మాట లిఁక నేటికి నేఁటికి మాటిమాటికి
న్మఱచితె నామహత్త్వము సమస్తజగజ్జనగీయమాన మై
మెఱయ వసిష్ఠముఖ్యు లగు మిక్కిలిశాంతులరీతిఁ జూచితో
యఱిముఱి వజ్ర శుంఠవుగదా యవిదారణకారణాయుధా.

30


చ.

అలుకవు బ్రహ్మహత్యకుఁ బరాంగనసంగతి కోట లేదు జ్ఞా
తులపగ నీకవశ్యకము దోసము సూడవు యజ్ఞవిఘ్నముల్
సలుపుటకై పరోన్నతికి సైఁపవు నీకు సురేంద్రపట్టమున్
నిలిపినధాత దూఱవలె ని న్నననేటికి గోత్రభేదనా.

31


సీ.

అవిపక్షవిచ్ఛేదనాయత్తతరుఁడ వీ వవిపక్షరక్షణోదారుఁ డతఁడు
పాకశిక్షణదక్షపవి నీవు సర్వతోముఖపాకపోషణోన్ముఖుఁ డతండు
ఘనశృంఖలాబంధకరణలోలుఁడ వీవు బహుఘనజీవనప్రదుఁ డతండు
పుణ్యజనద్వేషపూరితాత్ముఁడ వీవు పుణ్యజనావాసగణ్యుఁ డతఁడు


తే.

సతతసత్త్వవిభాసి రాజసగుణాతి, దూరుఁ డబ్భువననిధినిస్తుల్యుఁ డెందుఁ
దలఁపఁ ద్రైలోక్యలక్ష్మి యాధన్యుఁ జేరు, నీకు నెయ్యెది యటమీఁద నిర్జరేంద్ర.

32


క.

భూసురులకు నవమానము, సేసిన నెటువంటివానిశ్రీయు వెలయునే
వాసవ మముఁబోఁటులకుం, జేసిన నందేమి చింతచేయఁగ నింకన్.

33


చ.

అన విని గుండె జల్లన సురాధిపుఁ డభ్రమువల్లభంబు చ
య్యన డిగి వల్లెవాటుగ భుజాగ్రమునందగు మేలిజాళువా

జినుఁగుమెఱుంగుబంగరువుచేలచెఱంగు కటీతటంబునం
బెనఁచి మునీంద్రుపాదములమీఁదట వ్రాలి వినీతి మీఱఁగన్.

34


క.

స్వామీ నే మీదాసుఁడ, నామీఁదం గోప ముంప నాయమె కరుణా
కోమలకటాక్షవీక్షా, శ్రీ మెఱయఁగఁ బ్రోవు నతులు చేసెద మీకున్.

35


క.

భవనిభ మీ రిపు డెన్నిన, యవగుణపుంజముల కెల్ల నాస్పద మగు నే
నవివేకి నౌదు నైనన్, భవదంఘ్రులు చేరినాఁడఁ బాలింపు దయన్.

36


క.

నేరిచిన నేరకున్నను, గూరుచుకొని రాక మీరె కోపించిన నె
వ్వా రిఁక మాకు శరణ్యులు, కారుణ్యం బుంపవయ్య కరుణావార్థీ.

37


క.

పెక్కువగల హరి యిటువలెఁ, బెక్కువగల వేఁడ మౌని పృథుహుంకార
మ్మక్కువ గలఁజేయఁగ లో, మక్కువ గలయట్టు లనియె మఘవునితోడన్.

38


తే.

విబుధనాయక నీవెంత వేఁడికొనిన, నాకు దయరాదు శాంతి యెన్నఁడు నెఱుంగ
నట్టిమౌనులు వేఱె మమ్మటులు గనకు, కఠినచిత్తుని దుర్వాసుఁగా నెఱుంగు.

39


తే.

గౌతమాదులు ని న్నొకఘనునిఁ జేసి, వినుతి సేసిన నీవును విఱ్ఱవీఁగి
యిటులు నవమతి చేసితి వింతె కాని, యెఱుఁగలేవైతి మమ్ముల నించు కైన.

40


సీ.

తనకుఁ బ్రత్యుత్థాన మొనరింపకుండిన క్షమియించుకొన బృహస్పతిని గాను
దనభార్య బలిమిఁ బట్టినఁ జూచుకొని తాళుకొన నే నలయుతధ్యమునిని గాను
దానంపిన త్రిశంకు ధరణి ద్రొబ్బంగఁ గాంచియును సైరింపఁ గౌశికుఁడఁగాను
దనయాగమున నాయుధమును వైచిన తప్పుఁ బాటింపమికి గురుభ్రాతఁ గాను


తే.

దనకళత్రంబు లోఁజేసికొనుట యెఱిఁగి, యమితనేత్రము లొసఁగ గౌతముఁడఁ గాను
వసుధ సక్షాంతిసారసర్వస్వ మగుచు, వెలయుదుర్వాసుఁగా నన్నుఁ దెలియు మింద్ర.

41


తే.

ఊర్వశీనందనుఁడు మేనకోపభర్త వేగ నీయిల్లు గాచి దీవించి యక్ష
తంబు లొసఁగెడివారు నీతప్పు సైఁపవలయుఁ గా కేల సైరింపవలయు మాకు.

42


మ.

కులభ్రూకుటికంబుఁ గ్రోధదహనక్రూరజ్వలజ్జ్వలికా
చటులాక్షంబు రదచ్ఛటాకిటకిటస్వానంబు శేషాహివి
స్ఫుటఫూత్కారకరాళనిశ్వసనసంపూర్ణంబు భూయోనట
త్కటమౌ మద్వదనంబు గన్గొనఁగ శక్యంబే పురారాతికిన్.

43


క.

త్రైలోక్యరాజ్యసంపద, చాలా వశమయ్యె ననుచుఁ జర్చింపంగా
నేలా యిఁక క్షీరాంబుధి, పాలౌ నని చనియె మౌనిపాలకుఁ డధిపా.

44


తే.

శాంతినిధి తండ్రి యనసూయ జనని యనుజుఁ, డమృతదీధితి యట్లయ్యు నౌగ్రవృత్తి

విడువలేఁడయ్యె దుర్వాసుఁ డడుగనేల, యంశఫలమే ప్రధానమౌ నఖిలమునకు.

45


క.

దుర్వాసుఁ డిటులు శాపము, దుర్వారముగా నొసంగి తొలఁగిన నెంతే
నిర్వేదన మదిఁ బర్వఁగ, నుర్వీధరవైరి నిజపురోముఖుఁ డగుచున్.

46


తే.

అకట యొకతప్పు సైఁపక యతి శపించె, ముక్కుననె యుండుఁ గోపంబు మూర్ఖమునికి
నెఱిఁగి పూజింపలేనైతి నేను మున్నె, యింకఁ జింతింప నవ్వరే యెవ్వ రేని.

47


సీ.

ఊరకెయుండక యుబుసుపోకలకునై యేనేలవచ్చితి నిట్టిపనికి
వచ్చిన నేరమే వలసినచోటికి నేను రా మౌని రానేల యిటకు
వచ్చినవాఁడు ద్రోవనె పోక పూవండ నేటికి నామీఁద నెగురవైచె
వైచిన నది గొని వరభక్తి ముడువక కరి కేల యిచ్చితిఁ గండక్రొవ్వి


తే.

యంతమాత్రంబునకె మౌని యలుగనేల, యింత లేసులు రానేల యేమి సేయ
నింక నెవ్వరివేఁడుదు నేది దిక్కు, హా విధీ యెంత చేసితి వనుచు వగచి.

48


సీ.

ఐరావతారోహమై రాదు తెలితేజ తెమ్మన్నఁ గానక తిరుగు సాది
సంగీతమేళ మచ్చరలఁ బిల్వుఁడటన్న వెదకి లేరని వచ్చు వేత్రధరుని
నందనవనిఁ గల్పనగములు లేవని పలుకరించిన వనపాలకులను
గామధేనువు దొడ్డిఁ గాన మెందేగెనో యని విన్నవించు గోష్ఠాధిపతిని


తే.

బృథులచింతామణీభద్రపీఠిఁ గొల్వు, చావడిని లేమిఁ దెల్పు సంచారికులను
బొక్కసము శూన్య మగుటకుఁ బొగులు వారిఁ, గాంచి దేవేంద్రుఁడు విచారకలితుఁ డగుచు.

49


తే.

చిన్నవోయినమోమునఁ జేరవచ్చి, దివిజపురి యెల్ల నేనుఁగుదిన్న వెలఁగ
పంటివలె రిత్త యగుచు [1]నప్పటికి నున్నఁ, గాంచి యతఁ డుండె నిఱుపేదకరణి నంత.

50


సీ.

పని గల్గి పిలువనంపినఁ జేరరారైరి దినముఁ గొల్వఁగ వచ్చుదిగధిపతులు
నెన్నఁటివలె సప్తఋషులు వేగినవచ్చి "విజయో స్త" టంచు దీవింపరైరి
సంబళంబు లొసంగి సంతరింపఁగలేమి విడిచి పోవఁదొణంగె విబుధబలము
భయభక్తిముక్తి నెప్పటి[2]మేరఁ దనయాజ్ఞఁ బాటింపదయ్యెను పౌరజనము


తే.

మించి మం డొడ్డసాగెను మిత్రకులము, గడల కేగిరి తగునూడిగములవారు
బయలుదేఱిన సుతుఁడు లోపలను సతీయు, గాని యన్యులు లేరైరి ఖచరపతికి.

51

తే.

మౌనిశాపనీదాఘజృంభణమువలన, [3]శ్రీకృపామృతవీక్షణసిద్ధి లేక
భువనములు క్షామ మొందిన నవనిజనులు,సత్త్వహీనతఁ గర్మము ల్సలుపరైరి.

52


వ.

అది యెట్లం లేని యక్కాలంబున సవనప్రచారంబు శార్దూలంబుల దానంబు
దంతావళంబుల ధర్మంబు ధానుష్కకరంబులఁ దపోనిరూఢి కాలంబున వ్రతం
బు మధువ్రతంబుల సదాచారంబు సదాగతి నధ్యయనపాటవంబు కురంగంబుల
ధారాశుద్ధి తురంగంబుల నష్టాంగయోగంబులు వజ్రంబులం గాని జనులందు
నెందుఁ జెందమిఁ గ్రముకమాత్రపురోడాశంబు నెఱుంగక యాసాసల నాఁక
టం గుంది కంది పురందరప్రముఖబృన్దారకబృందంబులు వెన్నంటికొనిన
యుదరంబులు గుంటలువడినకన్నులు దిమ్మడుచుకర్ణంబులుం గలిగి యెల్లెడలం
బరిభ్రమించుచుండి రయ్యవసరంబున.

53


తే.

మయవిరోచనమాలిసుమాలిపాక, జంభతారకశుంభనిశుంభమహిష
నముచిముఖులగుదైత్యదానవులఁ గూడి, బలి సుపర్వులపై దండు వెడలె నపుడు.

54


సీ.

లిబ్బి నిబ్బరపుబ్బుగబ్బిగుబ్బెతమిన్న కలఁగి గొబ్బున నాథుఁ గౌఁగిలించె
బిట్టుల్కి గట్టురాపట్టి దొట్టినభీతిఁ జెవులఁ జుట్టనవ్రేళ్లు చెఱివికొనియె
నుడువులననఁబోణి జడియకుమని వెన్ను సజచుప్రాణేశు ఱిచ్చవడిచూచె
దిగులొంది మూర్ఛనొందినశచీదేవికి శైత్యోపచారము ల్సలిపె వజ్రి


తే.

కడమ కిన్నరగంధర్వఖచరసిద్ధ, సాధ్యవిద్యాధరాంగన ల్చకిత లగుచు
నేమి యైరొకొ తెలియ దుద్దామభీమ, రణరణద్భేరిధణధణంధణల నపుడు.

55


సీ.

ప్రతిసాగరంబు లై భద్రేభకర్ణస్రవన్మదాంబువులు భువనము లాన
థాటీనిరాఘాటఘోటీఖురాగ్రభగ్నపరాగములు పరాగములఁ బోలఁ
జక్రపదావక్రచక్రమార్గంబుల భోగవత్యాపగాంబువులు వెడల
సైనికాస్యాన్యోన్యసంఘర్షణస్ఫులింగంబు లంగారవర్షంబు గురియ


తే.

భూరిజయభేరిభాంకారఘోరరావ, పూరితాపారగహ్వరోదారమేరు
ధారుణీధ్రంబు మొఱవెట్ట దారుణముగ, దండువిడిసె బలీంద్రుఁ డక్కొండదండ.

56


తే.

అంతఁ దనసైనికుల దుర్గ మాక్రమింపఁ, బంపుటయు వారు చటులదోర్బలము మెఱయఁ
గొండప్రక్కల నుక్కళ ముండు వేల్పు, తండములఁ జెండి యెక్కి యక్కొండయందు.

57


క.

తెంపలు గలయడవులఁ దగి, లింప నిలింపాహితుల్ స్ఫులింగము లెగయం
బెంపెసఁగెఁ బావకుఁడు బలి, సంపూరితతేజమనఁ బ్రచండస్ఫూర్తిన్.

58


తే.

ఇంతపొడ వెక్కి రని బలి కెఱుకపడక, వనుల దగిలించినట్టి యవ్వహ్నికీల
దెలియరాదయ్యెఁ గనకాద్రిదీప్తివలన, ధూమ మెసఁగెను దానవస్తోమరుచుల.

59

సీ.

వెలవెలఁబాఱుమోములు లావులు సలింపఁ గదలె దిక్కులకు నై గరుడకులము
నిరవలంబంబునఁ దిరుగుచు వెఱ నోరు దెఱచుచుఁ జనియెఁ గిన్నరకులంబు
జోడనవీడి యచ్చోనిబ్బరపుఁబర్వుననె దాఁట దొడఁగె గంధర్వకులము
వెఱచి మౌనాకులవృత్తిఫణము ద్రిప్పి పాతాళమంటె నప్పన్నగతతి


తే.

కౌశికాదులు పసలైనఁ గానలేక, కన్నుఁగవలందుఁ దిమిరంబు గప్పికొనినఁ
బఱచె నెల్లెడ బలిదుష్టబలము మించి, కాంచనక్షోణిధర మాక్రమించినపుడు.

60


వ.

ఇవ్విధంబున బలిప్రతాపతపనతప్తం బగుచు విగళితపౌరుషరసాసారం బగు
స్వర్గకాసారంబున నిలువం జాలక నిఖిలానిమిషజాలకంబు సంచలించుచు జీవన
ప్రదుం డగుసరస్వతీరమణుం జేరంగోరి మేరూపరిభాగభాగనితరసాధారణా
మణిగణిలోకచ్ఛన్నవిలోకిలోకావలోకం బగుకమలభవులోకంబునకుఁ జని.

61


సీ.

వెలిదమ్మిరేకుపొత్తుల చిన్నిపాపఁడు నలుమోముదమ్ముల వెలయుసామి
తళుకుబంగారుఱెక్కలవారువముజోదు బ్రతుకుప్రొద్దులలెక్కవ్రాఁతకాఁడు
కడుపు బంగారుబొక్కసము సేసినదొర జీవనూత్రమున సృష్టించుజాణ
కెందమ్మిగద్దె యెక్కినవేలుపులపెద్ద పలుకుఁబూఁబోణికిఁ బ్రాణపదము


తే.

దినముఁ బోరిడుగాయకుఁ గనినగేస్తు, కలిమిజవరాలు నోముక కన్నబిడ్డ
కంతుగాఁదిలితోడు లోకములఱేఁడు, నలువ గొలువున్నకనకమండపముఁ జేరి.

62


క.

అష్టదిగీశాదిసురల్, స్రష్టను సాష్టాంగ మెరఁగి స్వామీ! కరుణా
దృష్టిని దృష్టింపుము బలి, దుష్టావష్టంభ మెల్లఁ దొలఁగింపు వెసన్.

63


మణిగణనికరము.

అని మఱియును వినయముదగ విబుధు
ల్వనరుహభవపదవనజయుగముపైఁ
గనకమకుటమణిగణినికరరుచుల్
పెనఁగొన నతి సలిపిన విధి గరుణన్.

64


తరళ.

తరళభావముఁ జెందనేటికి దైత్యదానవకోటికిన్
సరళవైఖరి ముజ్జగంబులఁ జాలఁ బ్రోది యొనర్పఁగా
గరళకంధరుఁ డున్నవాఁ డింకఁ గ్రక్కునన్ రజతాద్రి కిం
దరలఁగావలె నంచుఁ జెచ్చెఱ దమ్మిగద్దియ డిగ్గినన్.

65


సీ.

ఒఱగంట మెఱుఁ గెక్క నొఱయంగఁగలఱెక్క హొన్నంచుపక్కెర యుదుటు సూప
దళుకుకారుమెఱుంగు దొలఁకు ముక్కు మెఱుంగుపగడపునొసపరిజిగి చిగుర్ప
సంజకెంజిగి నేలు చరణయుగ్మముడాలు వలయంపువింతచెల్వంబు సూప
ముక్కున నసియాడుముదురుతామరతూడు ముత్యాలకళ్లెంబుమురువు నెఱపఁ


తే.

గళుకుమెయిచాయ లుభయభాగములయందుఁ, జిలికి జగజంపుజల్లులచెలువు నింప

మలయు రాయంచకొదమసామ్రాణి నొక్క, సాది దెచ్చినఁ జూచి ప్రసాది యగుచు.

66


మ.

ఎలమి న్బంగరులెక్కపక్కెరహుమాయీతేజి దాఁటించుచు
న్నలుమోమయ్య హుటాహుటిం గదలెఁ జెంతం జేరి జేజేలరా
యలు సాహోయని హెచ్చరింప సుభటోద్యత్ఖడ్గకాంతిచ్ఛట
ల్వలిపెంపుం దెలిచల్వపావడలు వైవ న్దుందుభు ల్మ్రోయగన్.

67


శా.

ఈలీల న్సుర లెల్లరు న్గొలువ వాణీశుండు శీఘ్రంబుగాఁ
గైలాసంబున కేగి శంభునకుఁ దత్కార్యం బెఱింగించిన
న్ఫాలాకుం డొకకొంతసేపు మదిలో భావించి వైరోచని
న్దూలింపన్ హరి వేఁడఁబోద మని తోడ్తో సంభ్రమం బెచ్చఁగన్.

68


ఉ.

గుబ్బలిపట్టిగబ్బివలిగుబ్బల జొబ్బిలు తావికుంకుమం
గబ్బికొనంగఁ జాలు నెదఁ గప్పిన బెబ్బులివన్నెపచ్చడం
బబ్బురమై తనర్పఁ బ్రమథావలి యుబ్బుచు వెంటనంటఁగా
గిబ్బవయాళితేజి దుమికించుచు వచ్చె మహేశుఁ డత్తఱిన్.

69


క.

ఈరీతి సకలనిర్జర, వారము గొలువంగ భవుఁడు వారిజభవుఁడున్
క్షీరాంభోనిధితీరముఁ, జేరి నతుల్సలిపి నుతులు చేసిరి భక్తిన్.

70


సీ.

ఎయ్యది ప్రకృతివిహీనమై సచ్చిదానందనిత్యప్రపూర్ణత వెలుంగు
స్వగతసజాతివిజాతీయభేదముల్ గాంచు నెయ్యది సర్వకాలమునను
జీవేశ్వరాఖ్యలఁ జెలఁగు నెయ్యది యవిద్యయు విద్యయు నుపాధియై తనర్చు
జ్ఞానంబు జ్ఞేయంబు జ్ఞాతయుఁ దానయై వర్తించు నెద్ది సర్వంబునందు


తే.

నట్టివేదాంతవేద్య మాద్యంతరహిత, మమలయోగీంద్రనిష్ప్రపంచాభిధాన
లక్షలక్షిత మపవర్గలక్షణంబు, నైన బ్రహ్మంబు మూర్తమై యలరుఁ గాఁత.

71


సీ.

ఎవ్వఁడు 'తత్త్వమసీ'తి వేదాంతవాక్యంబు వాచ్యార్థమై యలరుచుండు
నెవ్వనికనుసన్న నీచరాచరములం బుట్టించు మాయ యద్భుతము గాఁగ
నెవ్వఁడు వరయోగిహృదయాబ్జమునఁ బరంజ్యోతిస్వరూపుఁడై యొప్పు మిగులు
నెవ్వఁడు లక్ష్మీసమేతుఁడై క్షీరాబ్ధి ఫణిరాజుశయ్యపైఁ బవ్వళించు


తే.

నెవ్వఁ డఖిలజగత్త్రాణహేతుభూతుఁ, డెవ్వఁ డానతసజ్జనాభీష్టదాత
యెవ్వఁ డఖిలగుణాస్పద మెంచ నట్టి, శ్రీవధూనేత సాక్షాత్కరించుఁ గాఁత.

72


వ.

అని యివ్విధంబున నంభోజసంభవశంభుదంభోళిధరప్రభృతు లదంభగంభీరవ
చోనిగుంభనంబులం బొగడుచున్నసమయంబున.

73


సీ.

దంతిమహాపద్మధనదక్షుఁ డగువాఁడు పద్మాప్తవత్సవిభ్రమమువాఁడు
కరగతశంఖచక్రవిజృంభణమువాఁడు మకరకుండలదీప్తి మలయువాఁడు

భావికచ్ఛపరూపభావకుం డగువాఁడు శ్రీముకుందాఖ్యచేఁ జెలంగువాఁడు
ఘనసారకుందచందనకీర్తి గలవాఁడు నీలమేఘచ్ఛాయ నెగడువాఁడు


తే.

శ్రీవరఖ్యాతిచే విలసిల్లువాఁడు, శ్రితనవనిధానరీతి వర్తిల్లువాఁడు
నఖిలలోకైకరక్షకుఁ డైనవాఁడు, హరికృపామయమూర్తి ప్రత్యక్షమయ్యె.

74


తే.

ఇట్లు ప్రత్యక్షమయిన సర్వేశ్వరునకు, నవని సాష్టాంగ మెరఁగి బ్రహ్మాదిసురలు
నిర్భరానందమగ్నులై నిలిచియున్న, వారిఁ గనుఁగొని యాదానవారి యనియె.

75


సీ.

ఒకముఖంబున సృష్టి యొడఁగూడదే విచారమున వచ్చితి వేమి కమలగర్భ
ధరణి భైక్షం బెందు దొరకదాయెనె చిక్కి సగమైతి విది యేమి చంద్రమౌళి
వేయిభంగులను గావించె దాలోచన క్రమము స్వాస్థ్యము లేదె ఖచరనాథ
దెసల నొందినయట్టి తీరు గానఁగవచ్చెఁ బలుకాడ రేమి దిక్పాలురార


తే.

పెక్కువగ లొందెద వదేమి బిసరుహాప్త, చిన్నపోయెద వది యేమి శీతకిరణ
యితర సుమనస్సులార మీ రిటులు వాడి, యుండ నేటికి నామోద ముడిగి యనిన.

76


తే.

అంబురుహగర్భుఁ డనియె లోకైకనాథ, సహజమే సృష్టి యేమియు సాగనీక
బలి నిలింపులనెల్లఁ బంపంగఁ దొడఁగెఁ, గించిదవశిష్టమయ్యె స్వర్గికుల మనిన.

77


క.

ధననాయకసఖుఁ డిట్లను, వనజోదర భైక్ష మేది వసుధాస్థలిలో
జన మెల్ల బలిరుషాభా, జనమయ్యె న్నిక్క మనిన శక్రుం డనియెన్.

78


తే.

స్వాస్థ్య మెయ్యది జలజాక్ష శక్తి మెఱసి, నాఁడె స్వర్గంబు గైకొనినాఁడు బలియె
యెన్నిభంగులఁ దలఁచిన నేమి గలదు, స్వామివారికృపాకటాక్షంబు లేక.

79


తే.

అనినఁ దక్కినదేవత లనిరి భక్తి, జైత్రగతి మించ వైరి మాజాతి కెట్లు
గలుగు నామోద మింకిట ఘనుఁడవైన, నీకృపామృతవర్షంబు లేక శౌరి.

80


తే.

అనిన విని వారిజోదరుఁ డాదరమునఁ, గలిమి బలిమిని నీకు లోకములయందు
నీడుజోడును లేదుగా యింద్ర యేల, పలుకనోడితి వన వజ్రపాణి పలికె.

81


క.

సర్వేశ్వర వినిపించెద, సర్వము విన నవధరింపు సంపద లెల్లన్
దుర్వారతరదురాగ్రహ, దుర్వాసశ్శాపమునను దోయధిఁ జేరెన్.

82


తే.

కాన నిశ్రీకమైన నాకంబునందు, నిర్వహింపఁగ లేనైతి నీరజాక్ష
కలిమి సాలనివారికి బలిమి గలదె, యింక నెయ్యది బుద్ధి సర్వేశ యనిన.

83


క.

ఔనోయి యింద్ర నాయెద, పైనుండెడు రమను గానఁ బ్రణయపుటలుకం
బూని యెటు నిల్చెనో యని, యేనుండితిఁ గాన జలధి కేగుట యెఱుఁగన్.

84


ఉ.

అక్కట లక్ష్మిఁ బాసి క్షణమైనను నేను వియోగవేదనం
జిక్కఁగలానె యెట్లయిన శ్రీతరుణీమణి వచ్చునట్లు గా
నొక్కయుపాయ మెంచవలె నూహ యొనర్చితి లక్ష్మిరాకకున్
గ్రక్కున వేల్పులెల్ల నమరత్వముఁ బొందుటకున్ సురోత్తమా.

85


తే.

కవ్వముగఁ జేసి మంధరక్ష్మాధరంబు, వాసుకినిఁ ద్రాడు చేసి దుర్వారశక్తి

జలధి మథియింపుఁ డందునఁ గలుగు నమృత, మబ్జగేహిని పొడము సత్యమ్ము సుమ్ము.

86


తే.

అదియునుంగాక యైరావతాదు లబ్ధిఁ బొడముఁ బోయిన వెల్లను బూర్వసరణి
నింత యత్నంబు సేయ నీ కేకదేశ, మునను గూడదు దైత్యులపొందు లేక.

87


క.

బలవంతు లైనదైత్యులు, గొలువఁగ నున్నాఁడు బలినిఁ గూర్చుక కలశీ
జలధి మథియింపుఁ డమృతము, గలిగిన తర్వాత వానిఁ గడవఁగవచ్చున్.

88


తే.

వినవె యహిమూషకన్యాయమున ధరిత్రి, నాక్రమంబున నమరేంద్ర యసురవిభుని
తోడ సంధింపు మని పంపెఁ దోయజాత, నాభుఁ డరుదెంచె వైకుంఠనగరమునకు.

89


సీ.

కాకోదరస్వామి ఘర్షించుఁ బలుమాఱు వలిగాడ్పు దనుఁ జేరవచ్చె ననుచు
శుకనారదాదులఁ జూడంగ నొల్లఁడు శుకనారదాఖ్యలఁ జొప్పడుటను
దెలివిమైఁ దనకన్నుఁ దెఱచి దృష్టింపఁడు వామాక్షిరుచులు తీవ్రంబు లనుచుఁ
దనదు పేరిచ్చి పెంచినమాధవుని జెట్లపాలు గమ్మంచు శాపం బొసంగుఁ


తే.

గన్నకొడుకును బగవానిఁగాఁ దలంచుఁ, దను విపాండిమ నీశ్వరత్వంబుఁ దెలుప
భృగుసుతాయోగసంతాపపీడ్యమాన, మానసుం డగుచుండె నమ్మాధవుండు.

90


ఉ.

అంతట నాదివస్పతి బృహస్పతి చెంతకుఁ జేరవచ్చి మౌ
ళ్యంతరకాంతమౌక్తికవిభాంబులు పాద్యముగాఁగ మాలికా
దంతురభృంగఝంకృతు లుదంచితమంత్రము లై చెలంగ న
త్యంతవినీతిఁ దత్పదములందుఁ గరాబ్జము లుంచి యిట్లనున్.

91


మ.

భవదాశీర్వచనప్రభావమునఁగా ప్రత్యర్థిదైతేయరా
డవలేపాంధతమోవిలేపకరణోద్యద్దివ్యతేజోమృషా
రవివిద్యోతవికాసిమత్కరశతారం బందు నిల్చెన్ రథాం
గివలె న్నిర్జరమర్త్యనాగపదలక్ష్మీకాంత వాచస్పతీ.

92


సీ.

దేవతావళికెల్ల జీవభూతుఁడ వౌట జీవాఖ్య నీకుఁ బ్రసిద్ధమయ్యె
వాణి నీకే వశంవదయై చెలంగుట గీష్పతినామము కీర్తిఁ గాంచె
బుద్ధియే మీరూపమునఁ బ్రవర్తింపఁగా ధిషణాభిధానంబు దేజరిల్లె
నహిభయపరిహర్త వౌటచేఁ జిత్రశిఖండిజాతాభిఖ్య గణనఁగాంచెఁ


తే.

దండ్రివలె మముఁ బ్రోవఁ దత్త్వంబు దెల్ప, నోర్చుకతమున గురునామ ముచితమయ్యె
నీమహత్త్వంబు నాకు వర్ణింపఁ దరమె, జలధిగాంభీర్య దేవతాచార్యవర్య.

93


ఉ.

ఇప్పు డదేమొ నాదుదురదృష్టమునం బరీభావమొందినా
నెప్పుడు నీకటాక్షబల మెంచుట నేభయమంద నింక మీ

కప్పులలాశిభర్త హితుఁడౌట కుపాయము సూడఁదీరుగా
కిప్పని నిర్వహింపఁగలరే యన నాయన వజ్రి కిట్లనున్.

94


క.

నిస్సత్త్వుఁడ వీ వతఁ డతి, దోస్సారుఁడు మీకు సంధిదొరకించుటకున్
దుస్సహము “తప్తయో రుభ, యో స్పంధి” యనంగ వినవె యోదివిజేంద్రా.


క.

ఐనను నా చేనగుగతి, నానావిధములను దనుజనాథుఁడు నెయ్యం
బూనఁగఁ జేసెద నని తాఁ, బూనుక చనియెన్ సుపర్వపుంగవుఁ డంతన్.

96


క.

ఒక పర్వతగుహ దిఙ్నా, యకసంయుతుఁ డగుచు గురునియాగమనము సూ
చుక యున్నతఱిన్ శుభసూ, చకములతో గురుఁడు వచ్చి శక్రున కనియెన్.

97


సీ.

అమరేంద్ర నీవంప ననుకంప జనియింపఁ బొలదిండినెలదారిపురము సేరి
వెలిహజారంబున నిలిచి గొల్లలునిల్పఁ బలికి నేవచ్చుట దెలుపుఁడనుచు
నవసరంబులవారి ననుసరించిన వారు సమయంబు గా దని జాగు సేయ
మంత్రుల కెఱిఁగింప మంచిదె యనుటగా కెవ్వరుఁ దెల్ప రదేమొ కాని


తే.

యసురపతి తన్ను రమ్ము పొ మ్మనఁగ నిచ్చ, కములు చేసుక తిరిగెడు గాయకుండు
కలహభోజనుఁ డతనికిఁ దెలియఁ జెప్పి, నన్నుఁ బిలుపింపఁగా నేను నిన్నరేయి.

98


తే.

సమ్ముఖమునకు వచ్చుచుఁ జనుచునుండు, గరుడగంధర్వయక్షరాక్షససుపర్వ
బలము లెల్లెడఁ దొలఁగ ద్రొబ్బఁగవశంబు, గాని కక్ష్యాంతరంబులు గడచి యవల.

99


తే.

మయవినిర్మితనవరత్నమయసభాంత, రమునఁ జెలువొందు భద్రభద్రాసనమునఁ
గనకశైలాగ్రనీలమేఘం బనంగ, నిండుకొలువున్న బలిదైత్యనేతఁ గంటి.

100


తే.

ననుఁ గనుంగొనినప్పుడె వినయమునను, లేచి కూర్చుండు మనెడి నిలింపవైరి
చేరి యాశీర్వదించినఁ జేయి మొగిచి, రమ్ము కూర్చుండు మనఁ డెంతరాజసంబొ.

101


తే.

అపుడు మన నారదుండె నెయ్యంబుమీఱ, రా బృహస్పతి యిందురా రమ్మటంచు
నొదిఁగి చోటియ్య నందుఁ గూర్చుంటి నొదిఁగి, యివ్వలవ్వల దైత్యు లట్టిట్టుఁ ద్రోయ.

102


వ.

అంత.

103


సీ.

బలపాకనముచిజంభపులోమముఖ్యదైత్యులమనివికిఁ జెవియొగ్గి వినుచుఁ
జేరి వినీతి నాశీర్వాద మొనరించు గౌతమాదులను గ్రేఁగంటఁ గనుచుఁ
దనధాటిపదము లందమున విన్పించుగంధర్వుల కుడుగరల్ దయ నొసఁగుచు
నవధారు దేవవేశ్యాభుజంగ యటంచుఁ గంచుకు ల్పొగడ నుత్కంఠ వినుచు


తే.

హరిహరాదులతోఁ బోర నలవిగాదు, మాను మనుశుక్రుతో మఱుమాట లుడిగి

కలవె యేవైన వింతవార్తలు దివంబు, నందు నారద యనుచు నయ్యసురవిభుఁడు.

104


క.

ననుఁ జూచిన నే నాతనిఁ, గనుఁగొని “సౌభ్రాత్ర మస్తు ఘనతరతేజో
వనజాత హితోజ్జ్వలభూ, వనజాత దితిప్రసూత వర” యని మఱియున్.

105


మ.

బలిదైత్యేశ్వర తావకీనపరిశుంభత్కీర్తితేజోరుచుల్
దళమై లోకము లాక్రమింపఁగ సుధాధామోష్ణధామాగ్నిమం
డలము ల్నీరుచులై చనన్ శివుని కంధత్వంబు ప్రాపించినం
గులకాంతామణి చెట్టపట్టుకొని యేగు న్వీథి భిక్షార్థియై.

106


మ.

అనిన న్నవ్వుచు దైత్యభర్త సురలోకాచార్య యేమీ ప్రయో
జన మన్న న్మఱియేమి లే దఖిలమున్ సంపన్నమై యుండు నీ
ఘనకారుణ్యకటాక్షవీక్షణమునం గాంక్షింప నేమున్న దై
నను విజ్ఞాపన మొక్కఁ డున్న దవధానం బొప్ప నాలింపుమా.

107


తే.

అమరపతి నేఁడు నీదునెయ్యంబుఁ గోరి, నన్నుఁ బంపిన వచ్చితి నాయమగుట
నన్నదముల కేల వృథాహవంబు, గలసి యుండుట మే లెల్లకార్యములను.

108


వ.

అనిన విస్మయమానమానసుండును స్మయమానవదనుండును నగుచు విరోధి
స్మయమానహరణబలి యగుబలి యి ట్లనియె.

109


తే.

నాట్య మీక్షింప నే నొకనాఁడు రంభ, నంపు మని చెప్పి పంప హాస్యంబు చేసి
కదలికాతరు వంపినకండక్రొవ్వు, దీఱెనే నేఁటికైన నద్దేవపతికి.

110


క.

వినుము బృహస్పతి యిఁకనై, నను భక్తిని నన్నుఁ గొలిచినను మన్నింతుం
దననేరము గాకున్న, న్విననేరము తోడి తెమ్ము వేగమె యనినన్.

111


క.

వచ్చితి నిచ్చటి కేను వి, యచ్చరకులనాథ వింటివా బలివాక్య
మ్మిచ్చకువచ్చినరీతిం, జెచ్చెరఁ గావింపు మేమి చెప్పుదు నింకన్.

112


సీ.

హస్తీంద్రకుంభంబు లప్పళించుకరంబు దనుజపాదము లొత్త ననువుపఱుపు
సురకిరీటముల నుంచుపదంబు దైతేయనాథుతేజీ వెంట నడవ నేర్పు
వందిమాగధులకైవారంబు విను చెవి విబుధారిరాకొట్టు వినఁగ నేర్పు
హరియింతుఁ బాలింతు ననుమాటలయ్య జియ్యయటంచు వినయోక్తు లాడఁగఱపు


తే.

మాబలీంద్రునితోడి నెయ్యంబు గోరి, తేని యీరీతి సేవకవృత్తి గాని
దొరతనంబులు మెఱయింప దొరకవింక, నీకు నెటువలెఁ దోచునో నిర్జరేంద్ర.

113


వ.

అదియునుంగాక నేను నిలింపవైరిచేత నంపించుకొనివచ్చునెడ మార్గంబున
నారదుం గాంచి నేవచ్చినవెనుక నచ్చటివిశేషంబు లేమి యనియడిగిన నతం
డి ట్లనియె.

114


సీ.

మనకు వారికి నైకమత్యంబు గలుగునే పొసఁగ దటంచు జంభుండు నొడివె
వైరులయందు విశ్వాసంబు గావింప న్యాయంబుగాదని నముచి పలికెఁ

గపటంబు గాని నిక్కంబుగా దిది నమ్మబోకుఁడి యంచును బాకుఁ డనియె
నామాట నిజమె యీయమరులతో సంధి కీ డటంచును హయగ్రీవుఁ డాడె


తే.

దనుజనాయకుఁ డివియె యోజనలతెఱఁగు, విబుధనాథుండు మానంబు వీటిఁబుచ్చి
కొలువవచ్చెద నన్నను బిలువరాదె, యింతకన్నను బ్రాభవం బేది యనియె.

115


చ.

అన విని విప్రజిత్తి దురహంకృతితో నిదియేటిమాట వృ
త్రుని హితుఁడై వధించె నసితో దితిగర్భము సొచ్చి యింతయు
న్విని వినియుండి యించుక వివేకము లేక సురేంద్రుమైత్రిఁ గో
రిన నగరే నిశాచరవరేణ్య యటన్న బలీంద్రుఁ డిట్లనున్.

116


తే.

ఎట్టివారలు శరణన్న నేలవలయు, వీరధర్మంబు గావున విప్రజిత్తి
కావవలదన్న భీరులఁగాఁ దలంప, రేల యీయోజనలు మానుమింక ననియె.

117


క.

అని నారదముని దెలిపెను, విను మటుగావున నిశాటవిభుఁ డెటులైన
న్నినుఁ దనభృత్యునిఁ జేయంగనె తలఁచినవాఁడు చూడు కార్యం బింకన్.

118


మ.

సమదైరావతకుంభిజృంభితశిరస్సంస్ఫాలనప్రాప్తితో
త్తమసింధూరవిభాతి పాటలితహస్తంబుల్ శయాళుద్యుష
ద్విమతాంఘ్రిద్వయమర్దనంబునను దాదృక్భోణితామ్రేడితం
బమరం గాంచవె యింక నోయమరనాథా యెట్లు సైరించెదో.

119


తే.

దైవగతి యెవ్వరికి దాఁటఁ దరముగాదు, చింత సేయంగవల్వ దావంతయేని
బలికిఁ గప్పంబు లిచ్చుట గొలుచుటయును, న్యాయ మటువలెఁ గావింపు మమరనాథ.

120


క.

అన వెచ్చనూర్చి యవుఁ గా, కని యనిమిషవిభుఁడు దిగ్వరాన్వితుఁ డౌచుం
దనబలములతోడ బలీం, ద్రునిసమ్ముఖమునకు వచ్చి తోరపుభక్తిన్.

121


క.

దేవేంద్రుఁడు హయశతమే, ధావభృథస్నాతపూత మగుమస్తకమున్
దేవాభియాతిపదరా, జీవభ్రమరంబు గాఁగఁ జేసినయంతన్.

122


చ.

ఉరుమణిపీఠి నిండుగొలువుండు నిశాచరనాథుపాదపం
కరుహములందుఁ గోకములకైవడి నంచలరీతిఁ దేంట్లవై
ఖరిఁ దులకించె నిర్జరశిఖామణిమౌళిఁ దనర్చుజాతికెం
పురవలు నిద్దపుందళుకుముత్తెము లెచ్చుకిరీటిపచ్చలున్.

123


వ.

అంత.

124


మ.

సముఖాయంచును వేత్రహస్తులు వచించన్ డిగ్గనం లేచి య
య్యమరారాతి యహార్యవక్షహరణాహంకారి లే లెమ్మటం

చమితోత్సాహము మీఱ నెత్తె సురరాజ్యశ్రీకచాకర్షణ
క్రమపాండిత్యకలాపిచండిలభుజాకాండంబులం గొబ్బునన్.

125


ఆ.

ఎత్తి కౌఁగిలించి యీ వేల మ్రొక్కెదు, పెద్దవాఁడ వనుచుఁ బ్రియము మీఱ
భద్రపీఠి నెక్కి పార్శ్వభాగంబున, నొక్కచిన్నిగద్దె నుండఁ బనిచి.

126


ఉ.

అంబకు నేమమే మనజయంతుఁడు లెస్సయి యున్నవాఁడె హ
ర్షంబె శచీవధూమణీకి సర్వసురుల్ సుఖమున్నవారె స్వ
ర్గంబున కేవిరోధమును గాదుగదా భవదాగమంబు సౌ
ఖ్యంబె యటన్నఁ గాంచి కులిశాయుధుఁ డిట్లను దైత్యభర్తకున్.

127


ఉ.

ఈకరుణాకటాక్ష మొకయించుక నాపయినిల్చి యున్నచో
నేకడ మేలుగాక వగ పేటికిఁ గల్గెడు దానవేంద్ర యై
నా కల దొకవిన్నపము నాకు సురాధిపనామ మేల నీ
వే కులకర్తవై సురల నేలుము దైత్యుల నేలువైఖరిన్.

128


తే.

నేను నీసమ్ముఖమున నిలిచియున్న, వారిలోపల నొకఁడనై వలయుపనికి
నిందు నందును దిరిగెద నిదియె నాకు, మనవి కట్టడ గావింపు మనిన నతఁడు.

129


సీ.

లెక్కలు లిఖియింప లేఖకాధీశుండు పాకంబు గావింపఁ బావకుండు
దండధరుండు ముందఱబరాబరి సేయఁ జరుఁడై చరింప నిశాచరుండు
నీరధీశ్వరుఁడు పన్నీటిగిండి ధరింప మృగవాహనుఁడు తాళవృంత మూన
సర్వస్వమును విమర్శన సేయ శ్రీదుండు భూతాళిఁ గొలిపింప భూతభర్త


తే.

ఖరరుచి సహస్రకరదీపికల ధరింపఁ, బొసఁగ విడెమీయ శతపత్రపూగహారి
కడమవేల్పులు దగునూడిగములు సేయఁ, గట్టడ యొనర్చి ప్రోచె రాక్షసవిభుండు.

130


సీ.

విడెముచొక్కున నొక్కవేళఁ జొక్కినఁ దనచేలచెఱంగునఁ జెమటఁ దుడుచుఁ
గొలువుననుండి డిగ్గునడిగ్గునంతలో దండకై చేరి కైదండ యొసఁగుఁ
జనవరియై వడి జాఱెడురత్నభూషణము లప్పటికప్డు చక్కఁబెట్టుఁ
బేర్కొని తనుఁ బేరఁ బిలిచిన స్వామి యేమానతి యిచ్చెద రంచు నిల్చుఁ


తే.

జూచి వలదన్న మానక సురటి విసరు, నేమి మాటాడినను నుతియించు మిగులఁ
జిటికెలిడు జృంభణంబునఁ జేరి దివిజ, వైరి కగదారి యిచ్చకదారి యగుచు.

131


క.

ఈనయమునఁ గడునెయ్యము, గా నుడువఁగ విశ్వసించె ఖచరాధీశున్
దానపనాథుఁడు చిత్తము, రా నడచినవారె హితులు రాజుల కెల్లన్.

132


తే.

అంత నొకనాఁడు పూర్వదేవాధినేత, సుముఖుఁడై యున్నవేళను జూచి యింద్రుఁ
డాప్తమంత్రులతోడ నెయ్యంబు సలిపి, పలికె నిట్లని సవినయఫణితి మెఱయ.

133

ఉ.

ఈమదమత్తవారణము లీజవనాశ్వము లీరథోత్కరం
భీమథితారివీరభటు లీదురతిక్రమవిక్రమక్రమం
బీమహనీయకీర్తి గలదే త్రిజగంబుల నీకె గాక యౌ
రా! మునుసన్నవారి కిఁక రాఁగలవారికి నున్నవారికిన్.

134


ఉ.

ఇన్నియు నౌఁగదా దితిసుతేశ్వర దేహ మనిత్యమౌట సం
పన్నత నిత్యమంచుఁ గలఁపంబనిలే దటుగాన సంశయా
పన్నత నొందె నామది యుపాయము గల్గునె నిత్యతాప్తికిం
గ్రన్ననఁ గల్గెనేని యెఱుఁగ న్వలయుం దగియున్న యోజనల్.

135


గే.

క్షుత్పిపాసాజరావ్యాధిశుష్యమాణ, కాయమున లే దొకింతసౌఖ్యంబు దేహి
కది సవిస్తరఫణితిఁ దెల్పెదను వినుము, దివ్యతేజస్సనాథ దైతేయనాథ.

136


చ.

కనుఁగఁవఁ జీకటుల్ గవియుఁ గర్ణపుటంబుల దిమ్ము గ్రమ్ము మిం
చును జఠరాగ్ని దుర్బలత చొప్పడు నంగములన్ శిరంబు నొ
చ్చు నితరభోగ్యవస్తువులు సూడ సహింపదు మాటమాత్ర మా
డను మది పుట్ట దాఁకటఁ బడ న్వశమే క్షణమైన నేరికిన్.

137


తే.

పెదవి పేటెత్తు నాలుక పిడుచగట్టు, గొంతు తడితీయు నక్కెండుఁ గొంతతడవు
దాహమున కుదకములేక తడసెనేని, కలదె మఱి యంతకన్న దుఃఖంబు జగతి.

138


తే.

అన్నపానంబు లొకయింత యధికమైన, తఱి నజీర్ణంబ యైనఁదా దొరయు శ్లేష్మ
పైత్యవాతాదికజ్వరబాధ లవియ, విషమహేతువు లగుపథ్యవిరహితములు.

139


తే.

కలుగునూఱేండ్లలో నర్ధకాల మపహ, రించు నిద్రయె యానిద్ర ఱేపుమాపు
మానియుండిన జాడ్యంబు మేనఁ బొడముఁ, గన్నుఁగవయందు నరుణిమ గడలుకొనును.

140


సీ.

ఇంతకన్నను దుఃఖ మిఁకనొండు లేదని తెలుపుచందంబునఁ దలవడంకఁ
గనుఁగవఁ బొరలు గప్పెనొ లేదొ చూత మన్పోలిక సడలి కన్బొమలు వ్రాల
యౌవనస్తంభహైన్యంబున దేహంబు కుమతిగుడారునాఁ గుదియఁబడఁగ
స్వచ్ఛవృత్తిని దనరంగ ముక్తములగు భాతి నొక్కట ద్విజపఙ్క్తు లురుల


తే.

ఘనజరాభూతహుంకృతి నెనయ దగ్గు, నరల సద్వృత్తి కర్ణవిస్ఫురణ నొగుల
వృద్ధభావంబు వచ్చినవెనుక జనున, కేమిసౌఖ్యంబు గలదు దైత్యేంద్ర చెపుమ.

141


క.

ఇదిగాక శమనకృత్యం, బిదమిత్థం బనఁగఁ గూడ దీదృశదుఃఖా
స్పదమగు దేహంబున నె, మ్మది సుఖియింపంగ సులభమా యెవ్వరికిన్.

142


వ.

అటు గావున జఠరజరఠగహనవనదహనప్రథావధారణాక్షుధావ్యథాముథా
విధానావధానవిధావిధానంబును, ముఖజలబిలపల్వలసరసతాషనోదనభీష్మ
గ్రీష్మవిలాసపిపాసానిరానంబును, బ్రపంచపదార్థప్రజ్ఞానప్రతిబంధకబంధుర

రజోనిద్రాముద్రావిద్రావణంబును, నానామయాకృతిపురాకృతదుష్కృతిమరీచి
కావికృతినిరాకృతికృతియును, నంగరాజ్యజీర్ణీకరణవిజయయాత్రాజీర్ణజరాబల
నిరోధకంబును, దేహజీవనీరక్షీరభేదవిధానమాంసలహంసజాతపలాయనమం
త్రోపదేశదేశికంబును, సుమనోవిలాసనిత్యయౌవనవనవికాసకారణంబును, భో
గినీభోగవిభేదాదరమయూరనర్తనప్రవర్తకంబును, శృంగారరసప్రధానప్రభా
వప్రభాప్రవాహప్రకామప్రవర్ధనప్రక్రియాప్రవీణంబును నై, ప్రావృషిజపయో
జప్రస్రుతామృతంబుచందంబున నందం బగునమృతంబు సంతరించినం గాని గా
త్రంబు యథేష్టభోగంబులకుం బాత్రంబు గాదని తలంతు నందుల కొక్క
యుపాయంబు గల దది విన్నవించెద నాకర్ణింపుము.

143


తే.

కవ్వముగఁ జేసి మందరధరంబు, వాసుకినిఁ ద్రాడు చేసి దుర్వారశక్తిఁ
గలశవారాశిఁ ద్రచ్చినఁ గలుగు నమృత, మనుచు హరి యానతిచ్చె ము న్నసురనాథ.

144


క.

నావుడు నప్పుడె యమృతము, సేవించినరీతి మిగులఁ జెలఁగుచు సభలో
దేవాదులెల్ల బళిబళి, దేవాధిప మంచియుక్తి దెలిపితి విచటన్.

145


తే.

అట్టు లమృతంబు గలుగఁ బా లధికముగను, నీకు నొసగెద మిందు సందియము వలదు
తగినయత్నంబు సేయుము తడవు సేయ, రాదు వినమే “శుభస్య శీఘ్రం” బనంగ.

146


క.

అని యుత్సహించి యాడెడు, దనుజులవాక్యములు దేవతాపతి పలుకు
ల్విని సమ్మతించి మంచిదె, యని బలియును వారిఁ గూడి యప్పుడె కదలెన్.

147


తే.

కదలి మదమత్తమాతంగకదలి చంద్ర, కదలి నమరావతీవనకదలి నెనయ
రంగదరిభంగ సంగరరంగచంగ, తుంగచతురంగసేనాతరంగుఁ డగుచు.

148


క.

ముందరఁ జనిచని కాంచె, న్మందరముం దుష్టసత్త్వమయకందరమున్
సుందరమున్ శిఖరశిఖా, మందరమున్ దివ్యనవ్యమణిబృందరమున్.

149


క.

కనుఁగొని యిదిగద మందర, మని యడిగిన బలికి నింద్రుఁ డనియె న్నిజవా
హనఘనగర్జారవలం, ఘనజాంఘికనవరసార్థగంభీరోక్తిన్.

150


మ.

కనుఁగొంటే దనుజేంద్ర తావకజయాంకప్రౌఢిగీతాళి వే
డ్కను గంధర్వవధూమణు లసతతమున్ గానంబు సేయం గరం
గిన వానీటను బొంగి నిర్ఝరము లేగె న్వార్థికాత్మీయు నొ
క్కని రక్షించె నటంచు వృద్ధి నొసఁగంగా నెంచెనో శైలమున్.

151


చ.

అనఁ జిఱునవ్వు నవ్వి దనుజాధిపుఁ డిట్లను నౌ నగారి నీ
యనుపమబాహుశక్తి దెలియ న్వివరించెదు శైలపక్షభే

దనచతురత్వము న్నొడివి తజ్ఞుఁడవౌ నన స్వామి కెట్లు దోఁ
చెనొ యటులే గణింపుదునె చిత్త మెఱుంగదె యంచు నింద్రుఁడున్.

152


తే.

నీయంతవాని కుపకృతి, సేయఁగలిగె నా కటంచుఁ జెలఁగుచు గిరిరా
జీయెడ నిర్మలనిర్ఝర, తోయాఖ్యము నశ్రుధార దోఁగెడుఁ గంటే.

153


క.

అసురనాయక తనదుగహ్వరము సూప, దలఁచి చెంగావి గప్పిన చెలువు మెఱసెఁ
దురగఖురధూత మగుచుఁ గెందూళి పొడమ, నందమై మించు నీమంచరాచలంబు.

154


మ.

బలిదైత్యేశ్వర కంటె యీగిరిదరీభాగంబుల న్వేడుక
ల్వొలయం గ్రీడలు సల్పుకిన్నరసతుల్ జ్యోతిర్లతాదీపముల్
జ్వలియింపం దిలకించి సిగ్గున నురోజక్షేమచేలాంచలం
బుల వారింతురు చూచి నవ్వఁగఁ బ్రియు ల్ముద్ధత్వము న్మెచ్చుచున్.

155


మాలిని.

మృగధరమృగనాభీస్పృష్టగండోపలంబు
ల్భుగభుగ యను తావు ల్పూన్చె నీమందరాద్రి
న్మృగయువరమృగాక్షీవృత్తవక్షోజకుంభా
త్యగణితతులితత్వావాప్తిఁ గంటే బలీంద్రా.

156


ఉ.

దానవనాథ కంటే వసుధాధరరాజము మౌళిభాగసం
దానితతారకాకుసుమదామము గైరికకుంకుమంబు సం
వ్యానితమేఘవర్ణరుచిరాంబర మించుగమించె నెంచఁగా
సానులకూటముల్ గలుగుజాణలు నీటులు పెట్టకుందురే.

157


వ.

అని యనితరసాధారణసుధామధురవివిధవచోరచనల నవ్వసుధాధరంబు విను
తించు సుధాశనాధినాథునకు విబుధవిరోధిమూర్ధన్యుం డి ట్లనియె.

158


తే.

ఔర మనరాక కలరి మిన్నంది యున్న, దీనగేంద్రంబు; గదలింప నెవ్వఁ డోపుఁ
గలఁడె యటువంటిబలియుఁ డొక్కరుఁడు దేవ, దానవులలోన నన బలదైత్యుఁ డనియె.

159


తే.

అసురనాయక నీధృతి కళికి క్రుంగి, కుతల మంటినమందరక్షోణిధరముఁ
బెల్లగించుట యిది యొకపెద్దఱికమె, యిందు నెవ్వనిచేతఁ గా దిట్టిపనికి.

160


తే.

దిగ్గజంబులు మొగ్గ ధాత్రీధరేంద్ర, మడఁగఁద్రొక్కుదునో లేక యంబరమున
కెగరవైతునొ తిరిగి నగేంద్రమునకు, ఱెక్క లొదవెనొ యంచు విరించి చూడ.

161


వ.

అనిన విని బలాసురు మెచ్చక జంభుం డి ట్లనియె.

162


క.

కులపర్వతంబు లేడును, గలయఁగ నమ్మొదళు లార్పఁగలిగిననా క
గ్గలమే మందర మెత్తుట యలమేరువు నేన్ బగల్తునా దైత్యేంద్రా.

163

వ.

అని మఱియు శంబరారిష్టనేమిత్రిపురవాసజంభశుంభనిశుంభహయగ్రీవనముచి
తారకబాణవిప్రచిత్తివిరోచనహేతిప్రహేతిమయమాయావిమాలిసుమాలి
పౌలోమకాలకేయనివాతకవచవజ్రదంష్ట్రకాలనాభశరభవృషపర్వరాహు
మహిషేల్వలవాతాపిదుర్మర్షణోత్కలమేఘదంభద్విమూర్ధ్నకేతుక్రోధవశాది
నానాదనుజయూథనాథులు మందరవసుంధరాధరసముత్పాటనపాటవంబుఁ
దెల్పుచు నబ్బలీంద్రుచేఁ గనకమణిమయభూషణాంబరాదులు బహుమానం
బులు గైకొనుచు మహోత్సాహంబున బాహు లప్పళించుచు శంఖమర్దళపట
హభేరీధణంధణధ్వనులకుం బ్రతిధ్వనులిచ్చు మందరకందరంబులకుం గుప్పిం
చుచుఁ దనుం బెకలింపవచ్చుట నిచ్చ నెఱింగి మచ్చరంబునం బెచ్చుపెరిగి
యద్ధరంబుం దమతోడి యుద్ధరంగంబునకుం బంపిన బలంబులో నా దరీకు
హరనిర్గతశరభశార్దూలగండభేరుండఖడ్గగవయకంఠీరవమహోద్దండవేదండ
ప్రచండభల్లూకశశచమరశల్యభల్లసారంగసాలావృకవరాహమహిషమర్కట
మహోరగప్ర్రముఖజంతునికాయంబుల కాయంబుల కపాయంబు గల్పించుచు
నుపాయంబుల నగ్గట్టుచుట్టువారుకొని యిట్టట్టు మెదలక నెట్టుకొని యొకరొ
కరు కదిలించి చూచి కదలకున్నఁ బదుండ్రు నూఱ్గురు వేగురు లక్షకోటి
సంఖ్యాకులుం గూడికొని నలుదిక్కులం డాసిత్రోసి వేసియుం గదలింపలేక
యుద్దామనిశితకుద్దాలంబులం బెద్దయుం బ్రొద్దు నాశైలంబు మూలంబు గానం ద్ర
వ్వు నెడనెడం బొడముస్థూలోపలంబులు పెకలింపంజాలక యులువకట్టునించి
మించినభుజాటంకంబుల నగల్చుతఱి శిలాగర్భంబుల వెడలువర్షాభులఁ గని యచ్చెరు
వందుచు నందంద సన్నలు వైచుచు మఱియు నానోపాయంబులం జూచుచు నొకిం
చుకయుం దెమలింపఁజాలక సురాసురజాలంబులు ఘర్మకణజాలకంబులందోఁగు
గాత్రంబులు స్రవన్నిర్ఝరంబు లగు గోత్రంబులం బోల గుహాముఖంబులు
వెడలు గాడ్పులచాడ్పున నాసికారంధ్రంబుల నీరంధ్రంబులై నిట్టూర్పులు బెట్టి
దంబుగా నడర భుజంబులబలిమి సడల నొడళ్లు జడియ జడిమ నిగుడ బడలియున్న
వారలం గనుంగొని.

164


క.

బలి యింద్రున కిట్లను నిటు, వలె నూరక యుండఁదగునె వరశైలగరు
దళనసమర్ధుఁడ వయ్యును, భళిభళి దేవేంద్ర యనిన బలి కతఁ డనియెన్.

165


క.

బలజంభప్రముఖమహా, బలశాలులచేతఁ గానిపని యిట నాచే
నలవడునె దైత్యనాయక, యల వెన్నుని వేడఁదగు నుపాయం బింకన్.

166


అని వారలఁ దోడ్కొని తాఁ గనకాద్రికి నేగి యచటఁ గమలాక్షునిఁ ద
త్తనయుం గనుఁగొని సాష్టాం, గనమస్కారములు సేసి కార్యము దెలుపన్.

167


క.

విని నవ్వుచు వనజోదరుఁ, డనియె సురాసురలుమీరలందఱు నొకగ
ట్టు నగల్పలేరె యిఁక నే, యనువున సుధ గాంతు రనుచు నహిపతిఁ దలఁపన్.

168

సీ.

తనమహాసవనిరంతరసమ్యగాసక్తి కుండలీంద్రత్వంబు కుదురుపఱుపఁ
దనశ్రీవహనసముద్భాసితోత్సాహంబు చక్రిభావమున కౌజ్జ్వల్య మొసఁగఁ
దనభోగినీభోగజనితానుభావలీల భుజంగపుంగవోల్లాస మెసఁగఁ
దనమహాబలసముద్యద్విగ్రహప్రవృద్ధి యహీనభావంబు దేఁటపఱుప


తే.

సోమరుచియు ననంతవిస్ఫూర్తి భోగి, ముఖ్యతయు భూమిభరణసముత్సుకత్వ
మరలఁ జెలువొందు నెవ్వఁ డుదారఫణితి, నట్టిశేషాహి వచ్చె నయ్యవసరమున.

169


క.

వచ్చినయచ్చిలువలదొర, మచ్చికతోఁ జేరఁబిలిచి మాధవుఁడు ఫణా
భృచ్చూడామణి మందశి, లోచ్చయ మగలించి వీరి కొసఁగు మటన్నన్.

170


క.

పెకలిచి యిచ్చినఁ జాలుం, బ్రకటితదోశ్శక్తి బెండువలెఁ దెచ్చెద మే
మొకరొకరమె యని దైత్య, ప్రకరంబులు మదముమీఱి పలుకఁగ వించున్.

171


మందరధరము.

మంచిదయంచును మరుదశనవిభుం, డంచితశక్తిని నఖిలము గొలువం
గాంచనభూధరఘనతరమహిమో, దంచితమందరధరగతుఁ డగుచున్.

172


క.

పరివేష్టించె ఫణీంద్రుఁడు, ధరణీభరణాత్మసామ్యధన్యుఁ డటంచుం
బరిరంభణ మొనరించెను, ధరణీధరమౌళి నను చుదారస్ఫూర్తిన్.

173


మ.

ధరణీభారము నే వహింపఁగ మహీధ్రంబయ్యెఁ దా నెట్లు మం
దరమం చల్గెనొ నాఁగ నాగవిభుఁ డుద్యత్క్రోధసంరంభియై
పరివేష్టించి యగల్చెఁ దన్నగము క్ష్మాభృత్తుంగశృంగాగ్రభం
గురజంఘాలదృషద్ఘలంఘలఘలాఘోషంబు ఘోరంబుగన్.

174


తే.

ఇటులు పెకలించి కరముల కెత్తె మిగుల, సంభ్రమమున సురాసురుల్ శైలమాని
పట్టఁజాలక మున్పటిపాతు గొనఁగ, కూలవైచిరి మందరకుధర మవని.

175


తే.

దాన నొచ్చిరి గొంద ఱిత్తఱి నగారి, ముఖసుపర్వులు చక్రికి మొఱలువెట్ట
గరుడవాహన మెక్కి యక్కడికి వడిగఁ, దాన విచ్చేసె భక్తవాత్సల్యమునను.

176


చ.

కరివరదుండు వచ్చి ఘనగైరికరాగము మందరాగముం
గరమున నెత్తి పక్షితురగంబు శిరంబున నుంప జాళువా
బురుక తెఱంగునం దనరఁ బొంజిగి ఱెక్కలు గుందనంపుప
క్కెర హరువూనఁ జంచువునఁ గీల్కొనుచిల్వ ఖలీనమై తగన్.

177


క.

హరి గిరి ధరించి యిటువలె, సరగునఁ జన గరుడువెంటఁ జనలేక సురా
సురులమనమ్ముల నంటిన, వెరవఱియవి గుఱుతులూని వెనకకుఁ జిక్కెన్.

178


తే.

కోరి బ్రహ్మాండకోటులఁ గుక్షి నుంచు, కొన్న విశ్వంభరునిఁ బూనుపన్నగారి
కవనిధర మేమిభారమా యట సురాసు, రులకుఁ జాలవిచిత్రమై యలరె గాక.

179


తే.

నిమిషమాత్రంబులోపల నీరరాశి, తటమునకు నేగి హరిని మందరము డించి
వెనుకవచ్చు సురాసురవీరవరులఁ, గాంచి యనిపించుకొని యేగె గరుడుఁ డంత.

180


తే.

వాసుదేవునియానతి వాసవుండు, సకలదేవాసురాలికి సమ్మతముగ

వాసుకి ననంతశక్తినివాసుఁ బిల్వ, నంపి యిట్లని పలికెఁ బ్రియంబు గులుక.

181


సీ.

పొలయల్క నొకవేళఁ బలుకనిపార్వతి వెఱపించి కూర్తువు విశ్వనాథుఁ
బావనబ్రహ్మకపాలమాలికల జోడౌదు వొక్కొకనాఁడు హార మగుచుఁ
బడగమానికవుఁ జెక్కడపుఁగీల్కంకణం బగుదు వొక్కొకయెడ హస్తమునకుఁ
గన్నెగేఁదగిఱేకుకమ్మతావులు వెలయింతు వొక్కొకచాయ నింపుగాఁగ


తే.

నెన్నిభంగులఁ జూడ విశ్వేశ్వరునకు, నీవె కా కెవ్వరున్నారు కేవలాప్తు
లట్టి నిన్నుఁ బ్రశంసింప నలవియగునె, ప్రణుతగుణగణ్య వాసుకిఫణివరేణ్య.

182


చ.

క్షమ వహియించి శేషుఁడు యశంబు
గనెన్ క్షమయు న్వహించి నీ
వమృతము గల్గఁజేసి దివమంతయుఁ బ్రోచిన నంతకన్న ను
త్తమమగుకీర్తి గల్గు వసుధాధరమంథము ద్రిప్ప నానుగు
ణ్యము వహియింప గల్గు ఫల మందఱకు న్సరి యింతె వాసుకీ.

183


క.

లేయని యింద్రుఁడు సూత్ర, ప్రాయముగా నిటులనాడు పలుకున కెంతే
నీయెద మెచ్చుచు వాసుకి, యీయకొనియె నంత నిర్జరేంద్రుఁడు గడఁకన్.

184


క.

వేవేగ వజ్రధారన్, గ్రావము నిష్కంటకముగ ఘనమృగసమ్య
గ్రావముల మించఁ బార్శ్వ, గ్రావంబుల నెల్ల నఱకి కవ్వము చేసెన్.

185


వ.

అంత.

186


సీ.

ఘనకిరీటంబులు గట్టిగా సవరించి కలితకుండలముల కొలుకు లదిమి
బాహాంగదంబులు పదిలంబుగఁ దొడిగి ముంజేకడెంబులు మొగపు లరసి
యంగుళీయకముల నటకొన్ని ఘటియించి మౌక్తికహారము ల్మట్టుపఱిచి
మొలదట్టి పొరలవంకులు పొంకముగఁ జెక్కి పిరిచుట్టి చేలము ల్బిగియఁగట్టి


తే.

యంతకంతకు నుత్సాహ మతిశయిల్ల, నుల్లమునఁ బల్లవింపఁగ నొండొకళ్లఁ
బిలిచికొనుచును దమతమ పేరువాడి, కొనుచు దేవాసురులు దుగ్ధవనధిఁ జేరి.

187


తే.

బంగరుమొలకట్టు రంగుమీఱంగనా, నాగభోగ మద్రినడుమఁ జుట్టి
కలశవారిరాశి నిలిపిరి తమసొమ్ము, మొదలువెట్టఁ జుట్టి మోపి రనఁగ.

188


వ.

అంత బృందారకులు దమలోన.

189


ఉ.

అక్కట దానవేంద్రుఁడు బలాఢ్యుఁడు గాన ఫణీంద్రపుచ్ఛమున్
రక్కసిమూఁక కిచ్చి సుకరంబుగ ఘోరవిషాగ్నికీలలం
గ్రక్కుఫణాళి మాకొసఁగఁ గాదనరా దిఁక నేమికార్య మీ
దిక్కున నంచు నొండొరులు దీనత మోములు చూచుచుండఁగన్.

190


క.

తదభిప్రాయం బంతయు, మది నారసి శౌరి కపటమార్గంబున నో
త్రిదశవరులార రత్నా, స్పదఫణిభోగములు మనము పట్టుద మనుచున్.

191


తే.

భోగిభోగశయానుఁడు యాగభాగ, భోక్తలునుగూడి భోగీంద్రభోగభాగ

ములు గ్రహించిన నది యాగముగ గ్రహించి, యాగతామర్షమున దైత్యు లనిరి యపుడు.

192


క.

దితిసుతులము పరిపఠిత, శ్రుతులము నిష్ఠురతపోనిరూఢమహోవి
శ్రుతుల మిదిగాక బహు, శ్రుతులము మముఁ జులకసేసి చూడందగునే.

193


తే.

శౌరి మేము కులస్థానపౌరుషముల, నేమిటఁ గొఱంత తెల్పుమా యీసురలకు
వారికన్నను బూర్వదేవతల మగుట, నేమె ఘనులము గామె నీ వెఱుఁగవేమి.

194


ఉ.

శ్రీహరి యెంత యక్రమము సేసితి వాసుకిభోగిభోగసం
దోహము మీరలూని కడతుచ్ఛపుఁబుచ్ఛము మా కొసంగ మే
మూహ యొనర్పలేక యిది యూనిన నధ్యయనశ్రుతంబులు
న్సాహసముం బరాక్రమము సత్కులజత్వము వీటివోవదే.

195


క.

అని దనుజు లూరకున్నం, గనుఁగొని నవ్వుచును శౌరి ఘను లిట మీ రిం
తన యల్గనేల కైకొనుఁ, డని ఫణము లొసంగి పుచ్ఛ మానె సురలతోన్.

196


క.

ఈనీతిసమాకర్ష, స్థానము లేర్పాటు గాఁగ దైవాసురసం
తానంబు లైకమత్యము, గా నమృతాబ్ధి న్మథింపఁ గడఁగిరి కడిమిన్.

197


మ.

అమృతావాప్తికి దేవదానవులు దుగ్ధాంభోధి మంథాద్రిచే
నమితోత్సాహమున న్మథించునెడ నయ్యద్రీంద్ర మాధారహీ
నముగా నజ్జలరాశి మున్గ నదియానం జాలవిస్తారమౌ
కమఠాంగంబు ధరించె మాధవుఁ డభంగప్రౌఢి సంధిల్లఁగన్.

198


తే.

అగశిలాపాత మోర్వక యంబురాశి, చర్మఫలకంబుచే మేను చాటు చేసె
ననఁగఁ జూపట్టె లక్షయోజనవిశాల, మైనకమఠంబు దుగ్ధరత్నాకరమున.

199


క.

కఠినతరకర్పరము మృదు, జఠరము నయనాబ్జయుగళసహబహిరంత
ర్లుఠదాస్యంబును గలుగఁ గ, మఠముం గని విస్మయంబు మదిఁ బెనఁగొనఁగన్.

200


తే.

మరల సొమ్మిచ్చుటకు బహుమధనపడిన, యజ్ఞజునిరోసి పూఁటకా పైనహరిని
జట్టు మోపి రనంగఁ గచ్ఛపముమీఁదఁ, గట్టు నిల్పె సురాసురగణము లపుడు.

201


తే.

ఉదధిఁ గమఠాసనమునఁ గూర్చుండి భోగి, భోగ మనుయోగపట్టిక పొసఁగ నడుమ
నమృతసిద్ధికి జపియించునట్టియోగి, కరణిఁ గనుపట్టె మందరక్ష్మాధరంబు.

202


వ.

ఇవ్విధంబున దుర్ఘటసింధురకందరం బగునమ్మందరవసుంధరాధరంబు వాతంధ
యగుణానుబంధురంబుగా నగ్ఘటసింధుబంధురమధ్యంబునఁ బ్రతిష్టించి.

203


సీ.

శృంగాగ్రదళితవైరించాండగళితావరణధార లననిర్ఝరములు దొరఁగ
నానామహాగుహాంతరసమాధి సనాథతాపసనాథమస్తములు దిరుగఁ

గందరాంతరసింహగజగండభేరుండశరభాదు లొకటఁ గ్రేళ్లుఱకఁదొడఁగఁ
గంపితశాఖిశాఖాశిఖాఫలపత్రకుసుమము ల్జడిగొని కురియుచుండఁ


తే.

జిఱుతపులితోలుగట్టు జేజేలఱేఁడు, దిరుపుగట్టువిధంబునఁ దిరిగె గట్టు
నవ్యభుజశక్తి దేవదానవులు దుగ్ధ, జలనిధానంబు మథియించుసమయమునను.

204


మ.

కులశైలాగ్రణి క్రింద మీఁద నడుమ న్గూర్మాదిరూపంబులన్
బలియుండై భరియించి దేవదితిభూభాగంబులన్ వారిలో
పలను న్నిల్చి స్వకీయమూర్తిని జతుర్బాహార్గళ ల్మార్పుచుం
గలశాంభోధి మథించె మాధవుఁ డభంగప్రౌఢి రూఢిం గనన్.

205


శా.

ఈరీతిన్ హరి దేవదానవులతో హేలాగతిన్ ధీరుఁడై
క్షీరాంభోధి మథింపఁ గాంచనకటీచేలప్రభ ల్హేమకే
యూరాన్యోన్యవిఘర్షణోదితరజం బుద్వేలసౌవర్ణకో
టీరచ్ఛాయలు పర్వఁ బర్వతము గట్టెం బొమ్మ హేమాద్రికిన్.

206


వ.

అప్పుడు.

207


శా.

రక్షోదేవమిథోట్టహాసహహహారావంబులుం గూర్మమం
థక్షోణీధరమర్షఘర్ఘరనినాదంబు ల్దృణాకర్ష వే
గక్షుభ్యద్భుజగేంద్రభూరిఫణభూత్కారధ్వనుల్ ఘూర్ణితో
ద్యత్క్షీరాంబుధి జంతుఘోషములు మెండై నిండె బ్రహ్మాండమున్.

208


మ.

అఖిలాదిత్యసురాహితభ్రమితమంథానాద్రిఘోషంబుచే
సఖిమై నించుక వెన్నుతీఁట శమియించంజేయ క్షీరాబ్ధిలో
సుఖనిద్రారతిఁ జొక్కెఁ గూర్మపతి ప్రాంశుశ్వాసవాతోచ్చలా
బ్ధిఖవీథిం బొరలం దరంగపటలోద్రేకంబుచే మాటికిన్.

209


వ.

అప్పుడు.

210


మ.

వలదత్యుగ్రదవాగ్ని మగ్నశలభవ్రాతంబుమాడ్కి న్విశృం
ఖలసంఘర్షణభుగ్నభోగిఫణపూత్కారాక్షిదంష్ట్రాగళ
ద్విలయాభీలకరాళకాలదహనోద్వేలజ్జ్వలజ్జ్వాలికా
వళిచే మాడిరి పెక్కుదానవులు గర్వం బెల్ల ఖర్వంబుగన్.

211


తే.

ఘనత యంచును దుష్కరకార్యములకుఁ, బూనఁగాఁ జెల్లునే యెట్టిపురుషులకును
ఘనత యంచును భోగిభోగములఁ బూని, దానవులు పడ్డపా ట్లెన్నియైనఁ గలవు.

212


ఉ.

ఆవిషవహ్నికీలలు సురావళి నంటి తపించునప్డు రా
జీవదళాయతేక్షణవిశేషకృపామృతదృష్టిచేతఁ బా

రావరదుగ్ధవాఃకణధురంధరబంధురమంథరానిల
శ్రీ వెలయన్ ఘనాళి గురిసెన్ బరిశీతలవారిధారలన్.

213


తే.

హరికిఁ బ్రతిఘటించి యసురులు విషవహ్నిఁ, గమలి రదితిసుతులు కమలనయను
నాశ్రయించి శైత్య మందిరి యెందైన, శౌరికరుణ లేక సౌఖ్యమేది.

214


మ.

జలసేకంబుల సేద దేరుచు నభశ్చారాళికన్నన్ విశృం
ఖలవృత్తిన్ మథియించి రాదితిజు లుగ్రంబై విషజ్వాలికల్
కలయంబర్విన సడ్డ సేయక ఫలాకాంక్షం బ్రవర్తించువా
రలకుం దోఁచునె భేద మెందయిన వైరాటేయ భూపాత్మజా.

215


ఉ.

భీమనిశాటబాహుబలపీడితవాసుకిభోగిభోగదం
ష్ట్రాముఖనిర్గద్విషము శైలవిఘర్షణకూర్మకర్పరో
ద్దామకృశానుకీలల నుదగ్రతరంబయి దేవదానవ
స్తోమము భీతిలం గలశతోయధి వెల్వడి సత్వరంబుగన్.

216


సీ.

ప్రళయకాలాళీలఫాలలోచనఫాలకీలికీలాకేళిఁ గేలిసేసి
సంవర్తసమయప్రచండచండాంశుమండలమండలోద్దండనటన దెగడి
త్రైలోక్యభస్మసాత్కరణదీయోదక్షరూక్షాశుశుక్షణిరూఢి నొడిచి
కల్పాంతజలదనిర్గళదనర్గళదీర్ఘఘోరనిర్ఘాతనిర్ఘోష మడఁచి


తే.

భూర్భువస్వర్ముఖానేకభువనగహన, దహనలీలాతిసహనధూర్వహసవోగ్ర
చిటచిటాయితశిఖల నశేషముం గ, లంచె హాలాహలంబు కోలాహలముగ.

217


చ.

అపు డిది యేమి యక్కట సుధార్థము దుగ్ధధిన్ మథింప ను
గ్రపువిష ముద్భవించి లయకాల మొనర్పఁ దొడంగె నింక నీ
విపదపవారణంబునకు విశ్వపతిన్ శరణంబు వేఁడినం
గృప దళుకొత్తఁ బ్రోచునని యీశ్వరుచెంగటి కేగి యందఱున్.

218


క.

గడగడ [4]నొడలు వడంకఁగ, దడదడ దడమంచు గుండె తల్లడమందన్
బడిబడి నడ్డము దిగటముఁ, బడిబడి [5]మ్రొక్కుచును “బాహిపాహి” యనంగన్.

219


తే.

ఆభవుఁ డేమేమి యనిన సురాసురుల్ భ, యమున హాలాహలము హలాహలము హాల
హలము హలహల మని తోఁచినట్టు పలుక, నన్నినామంబులను గాంచె నవ్విషంబు.

220


తే.

వారిభయమెల్ల వారింప వారిజారి, ధారి మది నెంచి తనదుచిత్తం బెఱింగి
చిన్నవోయిన పార్వతిచెలువు గాంచి, యిట్లనుచుఁ బల్కె దరహాస మిగురులొత్త.

221

శా.

భామా యేటికిఁ జిన్నవోయెదవు నీభావంబు నేఁగంటి నా
కేమౌనో గరళంబుచే ననుచు నీ వెంతే [6]విచారించె దం
దేమీ గా దటుగాక నేమయినఁ గానీ సర్వలోకాళికిన్
క్షేమంబైనను జాలుఁ దద్విషము భక్షింతున్ వినోదంబుగన్.

222


క.

వచ్చినవారికి నాపద, వచ్చిన నది పరిహరించువాని ప్రభుత్వం
[7]బెచ్చౌను గాని మఱి పొర, పొచ్చెము గావించినం బ్రభుత్వము గలదే.

223


తే.

పరులఁ బీడించుకంటెఁ బాపముఁ బరోప, కృతి యొనర్చుటకంటె సుకృతము లేదు
పరుల కుపకృతిఁ జేసిన భాగ్యశాలి, యిహముఁ బరమును జెందుఁ బూర్ణేందువదన.

224


క.

అని యుత్సహించి కలశీ, వనరాశితటంబుఁ గదిసి వసుధాధరరా
ట్తనయాధిపుఁ డవ్విషముం, గని హరియింపంగ వశముగా కడలంగన్.

225


తే.

అంత బ్రహ్మదిసురలు భయార్తు లగుచుఁ, దన్ను బ్రార్థింప శ్రీహరి తద్విషంబు
ధీరుఁడై యారగించిన దేహమెల్ల, నల్లనయ్యెను వ్యాపించి నాఁటనుండి.

226


తే.

హరియు మిగిలినవిషము కాలాంతకునకుఁ, గొంత యొసఁగిన హరుఁ డది ఘుటిక సేసి
మ్రింగ నది కంఠమున నిల్చె హృదయనిహిత, గరుడవాహనవీక్షణాగతభయమున.

227


క.

ఫాలాక్షుఁడు కబళింపఁగ, హాలాహలవిషము కొంత యవశిష్టం బై
తూలఁగ నది వృశ్చికములు, వ్యాళంబులు మెసవి విషధరాఖ్యల వెలసెన్.

228


క.

ఈలీల దైవకరుణన్, హాలాహలబాధ యుడిగి యమరాసురు లు
ద్వేలముదంబున మందర, శైలంబునఁ గడలిఁ ద్రచ్చుసమయమునందున్.

229


చ.

గొరిసెలయందముం గుఱుచ కొమ్ములచందము వెన్ను మందమున్
గరువపుమేనిలో నుదుటు కాఁగెడు పెన్పొదు గింద్రనీలముం
బెరసినముక్కు మీఁగడబలెం జెలువౌ గళకంబళంబునన్
హరు వగుకామధేనువు సుధాంబుధిఁ బుట్టె నక్షీష్టధాత్రియై.

230


వ.

అంత.

231


క.

సురభిన్ సవనవనాపన, సురభిన్ స్రనదమృతగళితశుష్యన్నానా
సురభిం గైకొనిరి మురా, సురభిత్కృప దేవఋషులు సురుచిరభక్తిన్.

232


తే.

మొదటనున్న నిజాకారమును ద్యజించి, వారిరాశితరంగ మువర్ణసహిత
మై తురంగంబు గాఁబోలు ననఁగఁ బొడమె, వెల్లవారువ మాపాలవెల్లి నంత.

233


సీ.

కర్పూరకదళికాకళికాదళంబులు నెఱమించు విదళించునిక్కుఁజెవులు
నేలినవానికిఁ ద్రైలోక్యసాంబ్రాజ్యలక్ష్మి నియ్యగఁజాలు లక్షణములు

మానసాధికవేగ మూనఁగా జపియించుపోలికఁ గదలెడుప్రోథపుటముఁ
దామరసాప్తనందనునివాహమునకు రోషంబు పుట్టించుహేషితంబు


తే.

గలిగి శరదిందుకందళత్కందబృంద, కుందగోవిందతుందారవిందకంద
చందనామందరుచి నందచంద మగుచు,నొనరునుచ్చైశ్శ్రవంబు నేత్రోత్సవముగ.

234


తే.

దేవమణియుక్త మని మదిఁ దెలిసియుండి, తేజిఁ దాఁ గైకొనియెఁ బూర్వదేవభర్త
దేవమణియును నలవాసుదేవుసన్నఁ, దెలిసి యూరకయుండె నిశ్చలత నంత.

235


సీ.

ప్రాయంపుఁబూఁబోణిబటువుసిబ్బెపుగబ్బిగుబ్బచన్నులఁబోలు కుంభయుగముఁ
దొలిచూలిజవరాలితళుకులేఁజెక్కుటద్దములతోఁ దులఁగూఁగు దంతరుచులుఁ
బ్రౌఢకాంతామణిభాసురమృదులోరుకాండముల్ దొరయంగఁ గల్గుకరము
నటనచే నలసినకుటిలకుంతలిమందగతుల కొయ్యారంబు గఱపునడలు


తే.

విటుని తబ్బిబ్బులకుఁ గేరువెలమిటారి, నగవునేలినడాలు గంధర్వరాజ
సతినిషాదంబు నెనయుబృంహితరవంబుఁ, గలిగి చౌదంతి వొడమె నాజలధియందు.

236


సీ.

విశ్వేశువాహనవృషభమౌఁ గాదేని ధేనుకామేళనోద్వృత్తి గనునె
శ్రీగౌరివాహనసింహమౌఁ గాదేని వనకదంబకమున వసతి గనునె
యాత్మభూవాహనహంసమౌఁ గాదేని బిసజాతహరణలాలసత గనునె
శక్రవాహనశరజ్జలదమౌఁ గాదేని యభ్రముసంగతి నలరఁ గనునె


తే.

యనుచుఁ గవిగురుబుధముఖు ల్వినతి సేయఁ, బ్రతిగజభ్రాంతిదంతనిర్దళితధవళ
భూధరాపారపాంసుకర్పూరపూర, మెగయఁ జల్లుచు వచ్చె హస్తీంద్ర మపుడు.

237


వ.

వెండియు నాఖండలబలిప్రముఖసురాసురమండలం బుద్దండభుజాదర్పంబు మెం
డుకొన సుధాపయోధి మథియించుసమయంబున.

238


క.

సకలసురేప్సితఫలదా, యకచిత్రచరిత్రములను హరిచందనక
ల్పకపారిజాతసంతా, నకమందారంబు లవ్వనధి నుదయించెన్.

239


ఉ.

గైరికము ల్ప్రవాళములు గా గశదబ్ధిపయఃకణాళియే
కోరకపాళిగా నడుమఁ గోరికమీఱ విశేషమైనయా
కారము పూని మందరము కామితసత్ఫల మీయనయ్యె మం
దారము గానిచోట నగనామము సెల్లునె రెంటికిందగన్.

240


వ.

మఱియు వియచ్చరనిశాచరసముచ్చయంబు విచ్చలవిడి శిలోచ్ఛయంబుచే
నప్పాలకడలిం ద్రచ్చుసమయంబున.

241


క.

చెచ్చెర మందరసంగతి, నచ్చటిమణులెల్ల రమణు లయ్యె నటంచున్
మెచ్చుచు నచ్చెరువంద వి, యచ్చరు లచ్చరలు పుట్టి రయ్యమృతాబ్దిన్.

242

సీ.

పదకోకనదములు ప్రపదకూర్మంబులు నఖరశుక్తులు జఘనపులినములు
వలితరంగములు పొక్కిలిసుళ్లు నూఁగారుకలువచా ల్గుబ్బజక్కవలకవలు
భుజనాళగళశంఖములు గల్లమశరికామకరిక లాలోకశకులకులము
లక్షిసితాబ్జోష్ఠహల్లకభ్రమరషట్పదంబులు కేశశైవలములుఁ


తే.

జాలఁ జెలువొంది సుస్వరస్పర్శరూప, రసగుణంబులచే నప్సరస్సు లనఁగ
నప్సరఃకామినీమణు లలరి రపుడు, సహజసౌరభ్య మెక్కుడుమహిమ దెలుప.

243


ఉ.

వారితనూవిలాసములు వారితనూత్నలతావికాసము
ల్వారివిలోలనేత్రములు వారివిహారవిసారజైత్రము
ల్వారిదరస్మితాస్యములు వారిదముక్తశశీతదాస్యము
ల్వారిజగన్నుతాకృతులు వారిజబాణసతీకృతానతుల్.

244


సీ.

కమలాకరంబెల్లఁ గలఁగఁబారిన నొల్ల కరుదెంచుకొదమరాయంచ లనఁగ
వరుణాలయాంతరవనవాసము దరల్చి చేరెడుకలికిరాచిలుక లనఁగ
విషరాశివిషమాను విషధరంబుల రోసి మెట్టకు నరుగుక్రొమ్మెఱుఁగు లనఁగ
నడుగునఁ బడక రత్నాకరంబునఁ దేలి నడతెంచు జీవరత్నంబు లనఁగఁ


తే.

గులుకునడ జీనిచక్కెరలొలుకుపలుకు, బెళుకుఁజూపులుఁ గెమ్మోవితళుకు ముద్దు
చిలుకు నచ్చరచిలుకలకొలుకు లపుడు, కడలి వెలువడి వచ్చుశృంగార మమరె.

245


సీ.

ఎచ్చోటఁ జూచిన నెలతేఁటిదాఁటులఁ బుట్టించుకప్పుఁగొప్పులమెఱుంగు
లేవంకఁ జూచిన నిందుబింబంబుల మొలపించుముద్దుమోములబెడంగు
లేచాయఁ జూచిన నిందీవరశ్రేణి వెలయించువాలుఁజూపులవిలాస
మేకడఁ జూచినఁ గోకనదశ్రీలఁ గీలింపఁజాలు కెంగేలిడాలు


తే.

లేయెడను జూడఁ గెంపులఁ జేయుమోవు, లెందుఁ జూచిన వెన్నెలల్ చిందునవ్వు
లెచటఁ జూచిన మెఱుఁగుల నీనుమేను, చెలువ మలరారె నచ్చరచెలువలకును.

246


ఉ.

అచ్చపురేవెలుంగు దొరయంగలనిద్దపుముద్దుమోములం
బచ్చమెఱుంగుఱెక్కజిగిపక్కెరచక్కనిరౌతుతూఁపుల
న్మెచ్చనిచూపులం దళుకుమేనుల నిచ్చకు మెచ్చుఁ దెచ్చున
య్యచ్చరమచ్చెకంటులయొయార మయారె నుతింప శక్యమే.

247


ఉ.

అచ్చిగురాకుఁబోండ్లనెఱయందమునందె మనంబు నిల్పి వై
యచ్చరదానవప్రవరు లచ్చెరుపాటఁ బరాకుఁ జెందుచు
న్మెచ్చుల కెచ్చరించుచు సమిద్ధఫలాబ్ధికి మేను లుబ్బఁగాఁ
ద్రచ్చిరి క్షీరవారిధి నుదగ్రరవం బడరంగ నంతటన్.

248


తే.

పాలు సిలుకంగ వెన్న యేలీలఁ బొడమెఁ, జాలవింతని వేలుపు ల్సంభ్రమింపఁ
జంద్రుఁ డుదయించె నప్పాలసంద్రమునను; వాని శిరసావహించె భవానివిభుఁడు.

249

క.

నిస్తులమై నిస్తులతే, జస్తులమై దీప్యమానసకలదశదిశా
వాస్తుభమై కలశాంబుధిఁ, గౌస్తుభరత్నంబు తరణికరణిఁ జనించెన్.

250


సీ.

అమృతంబు ద్రావునీలాభ్రమో యిది గాదు కప్పుపెన్నెఱి గొప్పుకొప్పు గాని
మరలఁబుట్టెడు చందమామయో యిది గాదు మొలకనవ్వుల ముద్దుమోము గాని
ప్రభవించునమృతకుంభంబులో యివి గావు కఠినవక్షోజయుగ్మంబు గాని
జలధిఁ బుట్టిన పూర్వజగతియో యిది గాదు మహితనితంబబింబంబు గాని


తే.

యనుచు నామస్తకము క్రమంబునను నిర్వి, కల్పసవికల్పవిజ్ఞానగతి గణింపఁ
గా సురాసురు లతులశృంగారగరిమ, క్షీరవార్ధి జనించె లక్ష్మీమృగాక్షి.

251


తే.

ఆరమాసతిరూపరేఖాతిశయము, వర్ణనము సేయఁ దరమె యెవ్వారి కైనఁ
గాంచినప్పుడె చిత్రతఁ గాంచె సకల, దైవదానవరాజి చిత్రంబు గాఁగ.

252


శా.

శ్రీరాజీవముఖీవినూతనతనూశృంగారరేఖాదిదృ
క్షారంభంబున దేవతావళి సహస్రాక్షత్వముం గోరె వి
స్తారప్రీతి సహస్రనేత్రుఁ డయుతాక్షత్వంబు [8]గాంక్షించె నౌ
రౌరా యాసకు మేరలే దనుట సత్యంబే కదా ధారుణిన్.

253


వ.

అంత.

254


తే.

పద్మగర్భాదినిర్జరప్రార్థ్యమాన, యగుచుఁ బద్మావధూటి దేవాధినాథ
ఘటితమణిపీఠి వసియించెఁ గమలమధ్య, మునను జెలువందుకలహంసికను హసించి.

255


క.

“పుణ్యాహ” మనుచు నప్పుడు, పుణ్యాహము చేసె వాగ్విభుఁడు భూమిని నై
పుణ్యార్పితనవపల్లవ, పుణ్యోదకపూర్ణకలశములు చెలువొందన్.

256


సీ.

పాథోధరశ్రేణి పటహభేరీశంఖపణవాదివాద్యవిభ్రమము నెఱప
నప్సరోభామినుల్ హస్తాభినయలీల నర్థముల్ దెలియ నృత్యంబు నలుప
గంధర్వకలకంఠకంఠులు స్థాణువుల్ ననలొత్త మధురగానంబు సేయ
జయలోకపావని జయజగజ్జనయిత్రి జయలక్ష్మి యని సుర ల్సన్నుతింపఁ


తే.

జారుతరదక్షిణావర్తశంఖములను, విమలగంగాదినదులతో యములు ముంచి
యాగచోదితమంత్రరహస్యములను, బద్మ నభిషిక్తఁ జేసిరి బ్రహ్మఋషులు.

257


ఉ.

శ్రీమహిళాలలామ కభిషేకముఁ జేసె దిగంతదంతు లు
ద్దామకరప్రకాండసముదంచితకాంచనకుంభసంభృత
శ్రీమహనీయతోయములచేతఁ దదీయకచాళికోమల
శ్యామలభృంగపాళికి నవాబ్జమరందము నించుకైవడిన్.

258


క.

హస్తముల కొసఁగు మిపుడె ప్ర, శస్తోరుశ్రీల ననెడిచందమున దిశా
హస్తులు లక్ష్మీశైలే, శస్తని కభిషేచనోపచారము సలిపెన్.

259

సీ.

శైవాలవల్లికాజలధియిచ్చిన పచ్చపట్టుపుట్టముఁ గట్టెఁ బడఁతి యొకతె
కుండలీంద్రుఁ డొసంగుకురువిందమాణిక్యకుండలములు వెట్టెఁ గొమ్మ యొకతె
శారద యొసఁగిన సదమలతారహారంబు చనవఁ జేర్చె రమణి యొకతె
వనరాశిపతి యొసంగిన వైజయంతీవ్రజంబు కంధర వైచె సకియ యొకతె


తే.

విశ్వకర్మ యొసంగిన వివిధరత్న, భూషణంబులు గైసేసెఁ బొలఁతి యొకతె
పద్మగర్భుఁ డొసంగిన పంకజంబుఁ, గేలఁ గీలించె నొకరాజకీరవాణి.

260


క.

ఈరీతి సకలదైవత, నారీతిలకములు మిగులనైపుణితో శృం
గారింప నొప్పె రమ బం, గారపుబొమ్మో యనం జగన్మోహిని యై.

261


చ.

జయజయ యంచు బ్రహ్మఋషిజాలము దీవన లియ్యఁగాఁ బురం
జయజలజాతసంభవనిశాచరవైరికులాధిభూధనం
జయముఖదిగ్వరప్రముఖసర్వసుర ల్వినుతింపఁ జిత్తభూ
జయకరవిభ్రమంబుల నెసంగె రమాసతి భద్రపీఠికన్.

262


సీ.

మకుటాగ్రమరకతమణిరుచుల్ తనువిభాజలధి శైవాలవల్లులు ఘటింప
వాలుఁజూపులు కేళివనజాతముల వ్రాలుగండుఁదుమ్మెదలతోఁ గలసి మెలఁగ
గట్టాణిముత్యాలకమ్మడాల్ నునుజెక్కుమించుటద్దములఁ గ్రామెఱుఁగువెట్ట
గళశంఖకుచకుంభకరికుంభసంభవభ్రమదంబు లగుచు హారములు మెఱయఁ


తే.

జరణనఖకాంతిజాహ్నవీఝరము వినమ, దమరవరముఖ్యసురకిరీటముల నిగుడ
స్వస్వరాజ్యాభిషేకసూచకము గాఁగ, సింహపీఠిఁ జెలంగె లక్ష్మీలతాంగి.

263


చ.

ఒకగుణ మున్నచోట మఱియొక్కగుణం బరు దెన్ని చూడఁగా
సకలసుపర్వసంఘముల సర్వగుణంబులు గల్గి లోకనా
యకుఁ డన మించువానిహృదయంబున నిల్చెదనంచు నిందిరా
ముకురముఖీలలామ సురముఖ్యులఁ గన్గొనుచుం గ్రమంబునన్.

264


సీ.

మణికిరీటమువాని మరకతప్రత్యుప్తమకరకుండలదీప్తిమహిమవాని
బటువుకైదువువాని భాసమానమృగాంకభాసమానస్మితాస్యంబువానిఁ
గంబుకంఠమువానిఁ గారుణ్యరససూచితారుణ్యలోచనాంతములవానిఁ
దమ్మిపొక్కిలివానిఁ దపనీయరుచిరుచ్యతపనీయపటకటితటమువాని


తే.

డాలుగులికెడు పులుఁగురాడాలువాని, వాలువైరులఁ జెండాడువాలువాని
మేలు సమకూర్చి త్రైలోక్య మేలువానిఁ, బద్మనాభుని వీక్షించెఁ బద్మ యపుడు.

265


తే.

కమలనయనమనోహరాంగములసౌకు, మార్యసౌందర్యములు చూచి మగువ వలచె
ననుట చిత్రంబె తన్మూర్తిధ్యానగమ్య, మైనతఱి యోగివరులు మోహంబు గనఁగ.

266

సీ.

అంగవల్లిక మాధవాలోకమునఁ గోరకములొందె ననఁ బులకలు దనర్ప
గండస్థలీచంద్రకాంతము ల్విధుదర్శనంబున స్రవియించెనాఁ జెమర్పఁ
బురుషోత్తమోద్వాహభూరిసౌభాగ్యనూచకమునా వామోరు సంచలింపఁ
జక్రాప్తరుచుల లోచనపద్మములు దేనియలు చిందెనా ముదశ్రులు జనింప


తే.

జలజపీఠము డిగ్గి భాషావధూటి, చేరి కైదండ యొసఁగ లక్ష్మీమృగాక్షి
పరమసాత్త్వికదృష్టిసంపర్కమునను, సాత్త్వికోదయ మగుట యాశ్చర్య మగునె.

267


సీ.

ఇంద్రాణిమొదలుగా నెనమండ్రు దిక్పాలకాంతాశిరోమణుల్ క్రమము గాఁగ
నడపంబు గిండి పావడ కుంచె కాళాంజి సామ్రాణి ధూపంబు చామరములు
చేకొని యుడిగంబు చేయ రంభామేనకోర్వసీహరిణీతిలోత్తమాది
సురవారవారిజాక్షులు చెం గుపాంగంబు ముఖవీణ మురజంబు మొదలు గాఁగఁ


తే.

గొనుచు గంధర్వమేళంబు వినికిసేయ, నబ్జభవురాణి బిరుదుపద్యములు చదువ
శక్రుఁ డందంద సందడి జడియఁజేయఁ, బ్రాభవంబున సకలవైభవము లమర.

268


తే.

అఖిలలోకేశ నినుఁ జూచినది మొదలుగ, మదనుఁ డేసినశరపాలి యిదిగొ యనుచు
నాథునకుఁ జూపి తెల్పుచందమున నల్లఁ, గల్వపూదండ చేఁబూని కల్మిచెలువ.

269


సీ.

ఘంటలు మొలనూలిఘణఘణధ్వనులతో ఘనతరశ్రోణిచక్రంబు గదల
వలిగుబ్బచనుదోయివలిపెపయ్యెదకొంగు చెంగావిటెక్కెంబు చెన్ను మీఱఁ
జిన్నిలేనవ్వులు చికిలిఁజేసిన తళ్కు చెక్కుటద్దంబుల చెన్ను చూప
వెలిదమ్మిరేకుల వెలయించుకనుడాలు తెల్లజల్లులలీల నుల్లసిల్ల


తే.

నంఘ్రికటకారవాకృష్ణహంసతతులు, వాజులై మించఁ గచగంధవలదపార
మధుపబలములు వెలయు మన్మథరథంబు, ఠీవి మీఱంగ వచ్చె లక్ష్మీవధూటి.

270


తే.

ఆరమాకాంతరూపరేఖాతిశయము, గాంచి హరి కప్పు డంతరంగంబు నిండి
వెలికిఁ గ్రమ్మిన యనురాగజల మనంగ, స్వేద మానందబాష్పముల్ చెలువమయ్యె.

271


తే.

నూనసాయకశరవృష్టి నానుకతనఁ, బొడముచలిచేత నెమ్మేను పులకరించు
కరణి రోమాంచకంచుకకలిత మగుచుఁ, దనువు గననయ్యె దనుజమర్దనున కపుడు.

272


మ.

వనజాతాక్షునిచూపు శ్రీతరుణిలావణ్యాబ్ధి నోలాడుచున్
స్తనకుంభంబులు వీడి భంగవళిపాతస్ఫూర్తి గంభీరనా
భినిభావర్తమున న్మునింగి జఘనాప్తిం దేలి యమ్మిట్టన
ట్టె నిలంజాలక లోలమై యడుగువట్టెన్ రాగభారంబునన్.

273


క.

చూపు మఱి ద్రిప్పఁజాలక, యాపంకజవదన భాసురాకారకళా
టోపము గనుఁగొని హరి సుమ, చాపునకున్ లొంగి మానసంబునఁ బొగడెన్.

274


సీ.

సహజత్వజనితవత్సలతచే వెనువెంట వచ్చినశైవాలవల్లి యనఁగఁ
దనపట్టిఁ బాయఁజాలనిప్రేమమున వెన్కవచ్చినయమునాప్రవాహ మనఁగఁ

దనుఁబాసి చనుమెఱుంగని క్షీరపానంబు వదలి వెన్గొను నీలవనద మనఁగఁ
గమలాభిధానమోహమునఁ బైపై వ్రాలి కనుపట్టు తుమ్మెదకదు పనంగ


తే.

నిరుల జేజేలరాఱాలసరుల దొరయు, కప్పుచొప్పడుపెన్నెఱి గల్గి బార
కెక్కుడై సూక్ష్మకచముల కింపుసొంపు, నిచ్చె నీపద్మపాణి వేణీభరంబు.

275


తే.

వనిత నిడువాలుఁగన్నులు వాలుగన్ను, లౌట కందేమి యాశ్చర్య మరసిచూడ
బెళుకుఁజూపుల నెంతయుఁ బ్రేమమీఱ, నాత్మసంతతిఁ బోషించు ననుదినంబు.

276


సీ.

నెఱివేణి నీలాహి నిరసించుటే వింత నెమిలిపింఛమువంటికొమరు గలుగ
ముద్దునెమ్మొగము దమ్ముల నెంచుటే చోద్య మిందుబింబముచంద మెనసియుండ
నధరంబు బింబంబు నగలించుటే హెచ్చు శుకరాజతుండవిస్ఫురణఁ బొదల
బటువుపెందొడలు రంభల వంచుటే చిత్ర మిభహస్తములరీతి నేపుఁ బెనుప


తే.

గబ్బిగుబ్బలు జక్కవకవబెడంగు, గాంచఁ గెందమ్మిమొగ్గల మించు టెంత
తనువు ఘనసారసౌరభ్య మనువుపఱుప, నెల్లతాపంబు లుడిగించు టేమి యరుదు.

277


చ.

స్ఫురితగవిప్రకాశపరిఫుల్లపయోరుహకేళికాగృహాం
తరసురతక్రియాలుఠనతత్పరతాప్తపరాగపాళిధూ
సరితరథాంగదంపతులచందమునం జిగికుంకుమంబుచే
గురుకుచకుంభము ల్మెఱసెఁ గోకిలవాణికి హృద్యవైఖరిన్.

278


తే.

కఠినతరవృత్తకుచకుంభ కరటకుంభ, గళితమదధారలీల శృంగార మయ్యె
గారుడోపలరుచులచేఁ గారుకొనుచుఁ, జాలరంగారునూగారు చారుముఖికి.

279


చ.

కరములఁ గాంతి మోమున వికాసము గమ్మనిమేనఁ దావియుం
జరణముల న్మృదుత్వము విశాలత నేత్రముల మ్మరందము
ల్సరసవచోవిలాసములఁ జన్గవఁ గోశత పక్ష్మపాలిఁ గే
సరములసౌక్ష్మముం దగఁ బొసంగెఁ గదా కమలాఖ్య లక్ష్మికిన్.

280


సీ.

జాతినిద్దంపువజ్రాలకమ్మలడాలు గండపాండిమకుఁ గైదండ యొసఁగఁ
జికురలక్ష్మికి నళిశ్రేణిఝంకృతులచే సారె పరాకు హెచ్చరిక దెలుప
మొగమున కెగయు చన్గవపైని నునుమోవితళుకుగుంకుమ వసంతములు చల్ల
ముఖచంద్రునకు దృగంబుజధాళధళ్యంబు సరిగాఁగ నుభయచామరలు వైవ


తే.

వాలుఁజూపులు కువలయశ్రీల నింప, [9]నవయవంబులసవురు రాజాధిరాజ
చర్యలనుబోల సహజసౌందర్యరేఖ, కలిమిఁ జూపగఁ జెలఁగె నీకలిమిచెలువ.

281


తే.

ఈ చెలువ నన్నుఁ జేరిన నింక నెపుడు, ఱొమ్ముదింపకయుందు ముదమ్ముమీఱ
ననుచు నెంతయు ననురాగవనధి నోల, లాడు వేడుకమాఱ క్షీరాబ్ధిశాయి.

282


సీ.

దృష్టి దాఁకునటంచుఁ దెరవైచె ననియెంచు బహురత్నభూషణప్రభలు గాంచి
తనుఁగూడి పలికెనో యనఁ జెలంగుఁ బదాబ్జహంసకకలకలం బాలకించి

యక్కునఁ జేర్చెద ననివొక్కు వజ్రాలతాళిఁ దోచిన తనతనువు సూచి
చేకల్వదండ వైచె నటంచుఁ దమి ఱొమ్ముఁ జూచుఁ బైగ్రమ్ము వాల్చూపు లరసి


తే.

చక్కనొత్తు నెపంబునః జారుకౌస్తు, భంబు స్పృశియించుఁ దత్ప్రతిఫలితయువతి
కఠినవక్షోజసంస్పర్శకౌతుకమున, మదనజనకుండు లక్ష్మీసమాగమమున.

283


ఉ.

కోరిక తెప్పలెత్తుచును గొంకున నంతనె ఱెప్పవ్రాల్చుచున్
శ్రీరమణీలలామ సరసీరుహనాభునిఁ జూచువేళ వి
స్తారవిలోచనద్యుతులు చక్కనిమో మనురాజు సూరెలన్
సారెకు వైచు నయ్యుభయచామరలో యన మించె నెంతయున్.

284


తే.

శౌరి గనుఁగొనఁ గనుఁగొన నారిగొంకు, నారి గనుఁగొన గనుఁగొన శౌరిగొంకు
గనుఁగొనకయున్నఁ గనుఁగొను వనిత పతియు, వారిప్రేమంబు సిగ్గుచే వన్నె గాంచె.

285


తే.

మందయానంబునకు సిగ్గు మఱియుఁ గొంత, మాంద్య మొనగూర్ప భారతీమానినీక
రాంచలము వీడి భయవినయములు దొరయ, వారిజాక్షుసమ్ముఖమును జేరవచ్చి.

286


శా.

దృగ్రాజీవకరాబ్జము ల్తరళరీతిం జెంద శ్రీనామకం
బుగ్రీవామణి యంబుజోదరుని కంబ గ్రీవఁ గీలించెఁ దా
దృగ్రాజాననచంద్రికాహసనదీప్తిస్మేరనీలోత్సల
స్రగ్రాజంబు తదీయకాంతి యమునాసౌగంధ్యసంధాయిగన్.

287


శా.

శ్రీకల్యాణనగాధివాసులు సుమశ్రేణిం బ్రవర్షింప వా
ణీకల్యాణసుగంధి యాదిగఁ బురంధ్రీరత్నము ల్సేరి గౌ
రీకల్యాణము వాడఁగాఁ బటహభేరీశంఖము ల్మ్రోయ ల
క్ష్మీకల్యాణమహోత్సవంబునఁ జెలంగెం జక్రి యుప్పొంగుచున్.

288


సీ.

కమలాప్తకమనీయకౌస్తుభరత్నంబు గృహదీపకలికసుశ్రీ వహింపఁ
బావనవైజయంతీవనమాలిక కేలికాడోలికలీలఁ జూపఁ
దారహారశ్రేణి ధవళముత్తామయరంగవల్లికలవిభ్రమముఁ దెలుప
శ్రీవత్సలక్ష్మంబు జేజేలరాఱాతికట్నంపుజగతి పొంకంబు నెఱప


తే.

దీర్ఘబాహుదృఢస్తంభదీప్యమాన, సురభికస్తూరికాలిప్తహరిభుజాంత
రాళహరినీలమణిమందిరమున నిలిచెఁ, బాలమున్నీటిరాకన్య ప్రమదమునను.

289


సీ.

కౌస్తుభరత్నంబుఁ గాంచి బింబ మటంచు మోహించి చేరిన ముద్దుచిలుక
బాహాంతరచ్ఛద్మపద్మాకరంబునఁ జెలువైనతావిచెంగలువపువ్వు
పావనవైజయంతీవనమాలిక గ్రొంజిగురొత్తినగుజ్జుమావి
వన్నెవాసి గనంగ [10]జిన్నంపుబొజ్జప చ్చెదమీఁద నొరసిన హేమరేఖ

తే.

చెఱకువిలుకాఁ డురంబున మెఱుఁగుసాన, పైని మొనయిడు కాంచనాంబకమురేఖ
యనఁగఁ జూపట్టె జలధికన్యాలలామ, పద్మనాభుని ఘనభుజాభ్యంతరమున.

290


తే.

ఇంపు దళుకొత్త లచ్చి ఱొమ్మెక్కినపుడె, జలధిమథనప్రయాసంబు దలఁపఁడయ్యె
హరి యిటులుగాదె యెందుఁ గార్యంబు సఫల, మైననేటికిఁ బూర్వప్రయాసగణన.

291


తే.

ఈక్రమంబున సకలలోకైకజనకుఁ, డైన శ్రీహరి విపులబాహాంతరమున
నఖిలలోకైకమాత శ్రీ యధివసించి, ప్రజలఁ గనుఁగొనెఁ దాఁ గన్నప్రజలరీతి.

292


క.

శ్రీలావణ్యవతీకరు, ణాలోలకటాక్షవీక్షణాళులు సుమనః
పాళుల వ్రాలెఁ గర్బుర, జాలంబులఁ జేరవయ్యె సహజస్ఫూర్తిన్.

293


క.

అకలంకరూపరేఖా, నికషోద్భవభూరిగరిమ నిరసించిన ల
క్ష్మికటాక్షంబునఁ దలఁచిరి, నికషోద్భవభూరిగరిమ నిరసించి సురల్.

294


తే.

శ్రీకృపామృతవృష్టిసంసిద్ధివలన, జనులదారిద్ర్యతాపంబు శాంత మయ్యె
నఖిలజాతులు నామోదమంది చెలఁగె, సత్ప్రతత్పరమయ్యె ద్విజవ్రజంబు.

295


వ.

అంత మఱియు దెఱగంటిదొరలు వేడుక రక్కసులం గూడుకొని కలశజల
నిధి మథియించు సమయంబున.

296


మ.

సురలుందైత్యులు మేరమీఱి తను సంక్షోభించి సర్వస్వమున్
హరియింపంగఁదొడంగినా రనుచు నానావకాశంబుల
న్మొఱవెట్టంగఁ దొడంగెనో యనఁగ నంభోరాశి కల్లోలము
ల్మొఱసె న్వాసుకిభూరిభూత్కృతి మరుల్లోలంబులై యత్తఱిన్.

297


క.

తనగంధాఘ్రాణముచే, తనె లాహిరి గొనఁగ దేవదానవు లబ్ధిం
జనియించె మదిర దానిం, గొనె నాసురవితతి మిగులఁ గుతుకం బమరన్.

298


సీ.

ప్రజలతల్లి యనంగఁ బరఁగు హరీతకి దక్షిణపాణిపద్మమునఁ బట్టి
వ్రణిదుష్టరక్తపత్వమున మించుజలూక వామహస్తంబున వలనుపఱిచి
రమణీయనవసుధారసపూర్ణకుంభంబు సవ్యశయంబున సవదరించి
యఖిలదేవశ్రేణి కభయప్రదాతృత్వ మపసవ్యకరమున నవధరించి


తే.

కనకచేలాద్యలంక్రియల్ కమలదళవి, శాలనేత్రంబు లసితాంగసౌకుమార్య
మమలగుణగౌరవము మించు నచ్యుతాంశ, మగుచు ధన్వంతరి జనించె నమృతజలధి.

299


తే.

అతని చేతిసుధాకుంభ మపహరించె, విప్రజిత్తి బలాఢ్యుఁడై [11]వేగ వాని
చేతిది హరించె జంభుఁ డక్షీణబలుఁడు, వానిచేతిది గొనియె నిల్వలుఁడు గడిమి.

300


వ.

అప్పుడు.

301

సీ.

మనతోడఁ గూడఁ ద్రచ్చినదేవతల కీక గొనుట నాయంబు గాదనెడివారుఁ
గైకొన్న మనతోడఁ గలహంబునకు రాక యమరు లూరకయుండ రనెడివారు
దురమైన యంతఁ జిందఱవందఱైపోవు నమృత మెవ్వరికి లే దనెడివారు
నెందాఁకఁ గొంచుపోయెదవు మంచిది పొమ్ము నినుఁ ద్రావనిత్తుమే యనెడివారు


తే.

వలదు మనకెల్ల బలి[12]చక్రవర్తి నేత, గాన నాతనిచేతికిఁ గలశ మిచ్చి
యతఁడు పంచి యొసంగిన యటులు గొనఁగ, నర్హ మనువారలైరి నిశాటు లెల్ల.

302


చ.

అలమి నిశాచరుల్ గొనినయట్టి సుధాకలశంబు గైకొనం
బలిమి యొకింతలేక సురనాయకముఖ్యమఖాశను ల్సుధా
కలశము పోయెఁ బోయె నని కాతరులై మొఱవెట్టఁగా నహో
వలదు భయం బటంచు హరి వంచన సేయఁదలంచె దైత్యులన్.

303


మ.

కులుకుంగుబ్బలు ముద్దుగాఱుపలుకుల్ క్రొమ్మించుమేన్మించులుం
దళుకుంజెక్కులు మందహాసములు నిద్దాకెంపుకెమ్మోవియుం
బెళుకుంజూపులు సన్నపుంగవును శోభిల్లం జగన్మోహినీ
లలనాకారము పూనె మాధవుఁడు లీలాలోలహేలాగతిన్.

304


శా.

ఈరీతిం జగదేకమోహనవయోహేలావిలాసంబుల
న్నారీరూపముఁ బూని శౌరి దితిసంతానంబు వీక్షింపఁగాఁ
జేరన్ వచ్చె నవాబ్జరంజితపదశ్రీమంజుమంజీరశిం
జారావంబులు మారభూరమణనిస్సాణధ్వని న్మీఱఁగన్.

305


సీ.

శ్రవణావతంసవాసనఁ గ్రోలు నెలదేఁటిగరులతెమ్మెరలముంగురులు నెఱయఁ
గమ్మలేనిట్టూర్పుగాడ్పులఁ దెలిమించు మెఱయించు పయ్యెదచెఱఁగు దొరుఁగఁ
గులికెడుతనదుగుబ్బలభారమున కోర్వఁజాలక లేఁగౌను సంచలింపఁ
గటకారవములకుఁ గాళ్ళవ్రేళ్లఁ బెనంగు నంచలచే నడ యలసపడఁగఁ


తే.

గుసుమభరమున నునుగప్పుకొప్పు జడియఁ, కొలఁకుసిగ్గున వాల్చూపు బెళుకుఁ జూప
దంతరుచినాఁగు మందస్మితంబు మెఱయ, దనుజసభఁ జేరవచ్చెఁ గాంతాలలామ.

306


తే.

పంచబాణప్రతాపాతపమున కాది, కారణం బైనసంతప్తకాంచనాంగి
మేనిమించులు కెంజాయ మించె నచట, “నా తపాయాతిలోహితాయ” యన వినమె.

307


సీ.

బలిమనోహరలీలఁ జెలు వయ్యె మధ్యంబు బాణమోహనరీతిఁ బరఁగెజూపు
శంబరహృదయంగమం బయ్యెఁ గనుఁగవ జంభభావ్యం బయ్యెఁ జన్నుదోయి
రాహువిభ్రమదమై రంజిల్లె నెఱివేణి హేతిమంజులరీతి నెనసె నారు
తారకాశాస్యమై తగె నఖద్యుతి విరోచనపర్వమై మించె సౌకుమార్య


తే.

మంగముసుమాలికోమల మయ్యె నఖిల, కర్బురామోదకర మయ్యెఁ గమ్మతావి
మోహినీకాంతసౌందర్య[13]మును గణింప, నసురవరులనె లోఁగొన్నపస దలిర్చె.

308

శా.

మోము ల్వెల్వెలఁబాఱఁ గన్నుఁగవ నామోదాశ్రువుల్ గాఱ మై
రోమాంచంబులు మీఱ ఘర్మకలశశ్రోణాంబువు ల్జాఱఁగా
మామోఘాస్త్రపరంపరల్ నిగిడి చిత్తాంభోజముల్ దూఱఁ దో
డ్తో మోహం బలరారఁ గల్గొనిరి దైత్యు ల్దంభనారాయణిన్.

309


ఉ.

ఆజవరాలిఁ జూచి యసురాళి వరాళి విరాళి గొన్నచోఁ
దేజము మీఱఁగా మరుఁడు ధేయని వన్నియ మీఱఁ జిల్కరా
తేజదువాళిదోలి గడిదేరిన దారి మిటారికల్వపూ
నేజను వైచె నద్దనుజనేతలచిత్తము లుచ్చి పాఱఁగన్.

310


సీ.

కదళికారూపముల్ గన నారియూరువుల్ స్తంభలీలాప్తి రాక్షసుల కొదవె
నలివేణివేణి నీలాభ్రమై తగ దేవవిమతాంగముల ఘర్మవృష్టి గురిసె
నిందుబింబానన యెలుఁగెత్తి పాడిన దానవేంద్రులకు గద్గదిక పొడమె
మెలఁత నెమ్మేను గ్రొమ్మెఱుఁగు సంచునమించు దనుజేంద్రచిత్తముల్ దత్తఱించె


తే.

లేమచిన్నారిలేఁగౌను లేమిపూన, నసురవక్త్రంబులందు దైన్యంబు గదిసె
నిది యసంగతమయ్యు రతీశకౌశ, లాతిశయమున సంగతంబయ్యె నపుడు.

311


సీ.

మొలకనవ్వుల ముద్దుమోములఁ దిలకించి కళ పట్టినట్లుండె గలువఱేఁడు
చిన్నారిమైఁదీఁగె జిగిఁ జూచి సురపాదపంబులు తీఁగియల్ పారసాఁగెఁ
గ్రొమ్మావిచిగురాకునెమ్మోవిరుచి గాంచి కలువడి నిలిచె నక్కౌస్తుభంబు
నెఱనీటుగులుకులేనెన్నడ ల్పరికించి కడుమందగతిఁ గాంచె గంధకరటి


తే.

తేనియలసోన వెదచల్లు తేటమాట, లలికి యమృతంపుగుండలో నడఁగియుండె
నేల యిటువంటివెల్ల మా కీలతాంగి, యబ్బినను జాలు నని యెంచి రసురు లపుడు.

312


సీ.

జంభుండు సాభిలాషంబుగాఁ గనుఁగొన్న ముసిముసినగవుతో మోమువంచుఁ
గనుసన్నఁ దను వేఁడుకొన బలాసురుఁడు రాగమున మునుంగఁ గ్రేఁగంటఁ జూచు
భ్రూసంజ్ఞ సంకేతములు దెల్పు నముచికి నింపుగాఁ గనుబొమ లెగయవై చు
బలి చూడ గబ్బిగుబ్బలమీఁది పయ్యెదఁ జాఱిచి గ్రక్కునఁ జక్కఁ జేర్చుఁ


తే.

నిలుచు నొక్కెడఁ జేసన్నఁ బిలుచు నొకని, నొకనితో మంతనముఁ గోరు నొకనిఁ జీరు
నొకని సరసోక్తులకు మెచ్చు నొకని నొరయు, మోహినీకాన్త యసురసమ్మోహనముగ.

313


సీ.

రేచాయ నడరు బారెఁడుకీలుజడఁ జూచి మొలకలేనగవునెమ్మొగముఁ జూచి
తరితీపుఁ జూపు బిత్తరపుఁజూపులు చూచి తేనె చిందెడు మోవితీరు చూచి
జిలుఁగుపయ్యెంటలోఁ గులుకుగుబ్బలు చూచి [14]కనులఁ గాన్పింపని కౌను చూచి
తతమై రహించు నితంబబింబముఁ జూచి నునుదళ్కుఁ జెందు పెందొడలఁ జూచి


తే.

చొక్కి మిక్కిలి రక్కసిరిక్కఱేండ్లు, చక్కనయ్యకుఁ జిక్కి రాజసము దక్కి

తామసంబునఁ జొక్కి యెంతయును సాత్త్వి, కమున మోహంబు తల కెక్కి కలఁగి రపుడు.

314


చ.

భళిభళి మెచ్చవచ్చు నిఁక బ్రహ్మను దీని సృజించినప్పుడే
వెలయఁగఁ జేతికి బిరుదు వేయఁగవచ్చును గొమ్మమాత్ర మా
యలరెడుముద్దుగుమ్మ నడయాడెడి బంగరుబొమ్మ గాక యీ
చెలువకటాక్ష మెవ్వరికిఁ జేరును వారు కృతార్థు లిమ్మహిన్.

315


సీ.

కంతుపట్టపుదంతి గాదేని యీయింతి ఘనమనస్సరసులఁ గలఁచు టెట్లు
కళుకుబంగరుబొమ్మ గాదేని యీకొమ్మ చిత్తంబు లాసింపఁజేయు టెట్లు
కళలూనులతకూన గాదేని యీచాన నయనోత్పలంబుల ననుపు టెట్లు
కారుమెఱుఁగుచెన్ను గాదేని యీయన్ను మోహకైతవముల మొనపు టెట్లు


తే.

చెఱకుసింగాణివింటివజీరుపువ్వుఁ, గోల గాదేని యీగోల గుఱుతు గాఁగ
హృదయమున నాటు టె ట్లని యెంచి ఱెప్ప, వైవ కీక్షించు దైతేయవల్లభుండు.

316


సీ.

గజరాజగమనసింగారంబు గనుఁగొనవలవదే కన్నులు గలుగుఫలము
జలజాక్షిమధురభాషణము లాకర్ణింపవలవదే వీనులు గలుగుఫలము
విరిఁబోఁడిజీనిచక్కెరమోవిరుచు లానవలవదే నాలుక గలుగుఫలము
చెలిచెక్కుఁగపురంపుఁబలకలు మూర్కొనవలవదే నాసిక గలుగుఫలము


తే.

గబ్బిగుబ్బల బిగ్గరఁ గౌఁగిలింప, వలవదే తళ్కునెమ్మేను గలిగినఫల
మటులు గాకున్నఁ బంచేంద్రియములు గలిగి, నన్దులకు నేమిఫలము [15]వ్యర్థములు గాక.

317


చ.

కనఁగలిగె న్విలాసములు కమ్మనిచక్కెర లొల్కుపల్కులున్
వినఁగలిగెన్ సుధారసము వెల్లువ పెట్టెడు మోవి యాన నిం
పున నునుజెక్కుటద్దములు ముద్దుగొన న్నెలవంక లుంచి చ
క్కనివలిగుబ్బచన్నుఁగవఁ గౌఁగిటఁ జేర్ప నిఁ కెఫ్డు గల్గునో.

318


క.

ఇదియే కనుటయు వినుటయు, నెదపైఁ బవళింపఁ గనుటయే గనుట రతిన్
మదనజయశంఖరణితం, బెదిరెడుమణితంబు వినుటయే వినుట గదా.

319


తే.

కుసుమకోమలమైన యీకోమలాంగి, తనువుభుజబంధనఖరదంతక్షతాల
తాపకర్షణముష్టిఘాతాదిసురత, ధార్ష్ట్యమున కోర్చునే యన్యతనువుభంగి.

320


సీ.

చక్కెర కెమోవి చవిచూడనేకాని మొనపల్లు చుఱుకన మోపరాదు
బలితంపుగుబ్బలు పట్టిచూడనెగాని నునువాడిగోరున నొక్కరాదు
[16]అంగంబు మెల్లనే యక్కుఁజేర్పనగాని మించి బిగ్గరఁ గౌఁగిలించరాదు
[17]లలితంపురతికేళి నలరింపనేకాని బంధచాతుర్య మేర్పఱపరాదు


తే.

ఈఁగ వాలినఁ గందు నీయిగురుబోఁడి, కమ్మనెమ్మేను గనఁగఁ బొంకమ్ము దెలిసి
యేలికొనవలె మన్మథకేళియందు, నాకుఁ దక్కిన మెప్పింతు నలినముఖిని.

321

క.

మానవతు లెంతకోమలు, లైనను బతిసురతపటుత నలరుదు రసహం
బైనరవిద్యుతిసంగము, చే నందవె పద్మినులు విశేషశ్రీలన్.

322


ఉ.

ఔర యిదేటియోజన మృగాయతలోచన నన్నుఁ గోరునో
కోరదొ కోర కేమి నలకూబరముఖ్యులు నాదుబంట్లు శృం
గారము చెప్ప నేల త్రిజగంబులు నేలఁగఁ గల్మిలేదె యె
వ్వా రిఁక నన్నువంటిబలవంతులు శక్రుఁడె వచ్చి కొల్వఁగన్.

323


క.

అని యుత్సహించి యొకనెప, మునఁ జెంగటి కేగి దీనిముద్దులమాట
ల్వినవలతు ననుచు నబ్బలి, [18]తనమదిలోఁ దలఁచి మిగులఁ దత్తఱ మందన్.

324


చ.

కలకలనవ్వునెమ్మొగము కమ్మనితమ్మి యటంచుఁ దుమ్మెదల్
హళహళిఁ జిమ్మిఱేఁగ భయమంది గిఱుక్కున మోము ద్రిప్పుచోఁ
గలికిమెఱుంగుచెక్కుపయిఁ గ్రమ్మఁ దళుక్కునఁ బైఁట జాఱఁగా
బెళుకుదు నబ్బలిం గదిసి బిత్తరి యత్తఱి దత్తఱింపఁగన్.

325


చ.

వెఱవకు కీరవాణి యలివేణివి గావె మదాళిపాళికిన్
వెఱవఁగ నేల యంచు బలి వేడుకతోడ లలాటపట్టికన్
మెఱుఁగులు సిందుముంగురులు మెల్లనె చిక్కులు దీర్చి చెక్కులం
దొఱిఁగెడు ఘర్మము ల్తనదు దుప్పటిచేఁ దుడిచెన్ నయంబుగన్.

326


చ.

అలికులవేణి భృంగగరుదంచలచంచలకర్ణమంజరీ
గళితపరాగము ల్పయిని గ్రమ్మిన రాల్చునెపంబు దోఁప గాఁ
బలుమఱు జాలువాసరిగెపయ్యెదకొంగు విదుర్ప గుబ్బచ
న్నుల జిగిఱేఁగి చూపఱ కనుంగవకు న్మిఱుమిట్లుగొల్పఁగన్.

327


తే.

ఆసరోజాక్షిలీలావిలాసములకు, మరులుకొని దానవేంద్రుండు మనసిజాత
మత్తవేదండదోధూయమానమాన, [19]సాబ్జుఁడై యిట్లు పలికె నబ్జాక్షిఁ జూచి.

328


మ.

సుదతీ యెవ్వరిదాన వీ వెపుడు నెచ్చో నుందు నీనామ [20]మె
య్యది యీనీభువనైకమోహననవీనాకార మత్యద్భుతా
స్పద మయ్యెం బరమేష్టి మాపయిఁ గృపం బంచేంద్రియాత్యంతస
మ్మదముం జేయఁ దలంచి నిన్నిటులు నిర్మాణంబు గావించెనే.

329


మ.

హరిణాక్షీ యటుగాకయున్న భవదీయాకారరేఖామనో
హరశృంగారవిలాసవిభ్రమములం దావంతమాత్రంబు కి
న్నరవిద్యాధరనాగకింపురుషగంధర్వాదినానామరు
త్తరుణీరత్నములందుఁ గంటిమె వృథాతర్కంబు లింకేటికిన్.

330

ఉ.

కన్నులకల్కి నీచెలువు కన్నులు చల్లగఁ గాంచఁగల్గుటం
గన్నులు గల్గినందులకుఁ గల్గె ఫలం బటు గాకయుండినం
గన్నులు కన్నులే వలలకన్నులుగా కవియేల కల్లగా
కన్నులవింటిజోదు పదకంజములాన [21]చకోరలోచనా.

331


సీ.

తరుణి నీయధరామృతముకంటె మధురమా యతికషాయంబైన యమృతరసము
పూఁబోణి నీభుజంబులకన్న మృదువులా గణియింప విషమంపుఁగల్పలతలు
జనిత నీనగుమొగంబునకన్న నందమా యెందునఁ గొఱగానిచందమామ
కలికి నీగబ్బిచన్గవకన్నఁ బొంకమా కుంభీంద్రదుస్పర్శకుంభయుగము


తే.

[22]నారి నీకన్నఁ జక్కనివారె యప్స, రస్స లారయ వారివిభ్రమము లెల్ల
నప్రయోజన మటుగాన హంసయాన, నీకు సరిగాన నీయాన లోకములను.

332


తే.

మొదట నే నిన్నుఁ జూచిన మోహనాంగి, యబ్ధి మథియింప మూరకె యమృతవాంఛ
గంగచెంగట వాసంబు గలుగుజనుఁడు, డప్పికై పల్వలంబులు డాయఁజనునె.

333


సీ.

తళుకుఁగన్నులు దృష్టి దాఁకునటంచు నో శుకవాణి తల యెత్తి చూడ వేమి
యిగురంచు గండుఁగోయిల దూఱునంచు నో తరళాక్షి పెదవి గదల్పవేమి
చౌదంతిప్రతికుంభిశంకఁ జేరునటంచొ గబ్బిగుబ్బలు సారె గప్పెదేమి
యంచలు వెన్నాడు నంచునో మంజీరరవము గుల్కఁగఁ జేరరా వదేమి


తే.

స్వర్గమర్త్యవధూటుల చక్కఁదనము, తుచ్చమని నాగకన్యలతోడి కలహ
మునకుఁ గాల్
ద్రవ్వెదవొ లేక బొటనవ్రేలఁ, బుడమి వ్రాసెద విది యేమి పువ్వుఁబోణి.

334


క.

కలశాంబుధి మథియింపఁగఁ, గలిగినసుధఁ బంచికొనఁగఁ గానక మేమే
బలదుర్బలములఁబోవుచుఁ, గలహించెద మొరుల దూఱఁగా నేల చెలీ.

335


క.

దాయాదుల మాకన్యప, దాయాదుల మౌట మేము దైవతములు మా
కీయమృతము సరిగా నీ, వీయెడఁ బంచిమ్ము నేర్తు వెంతయుఁ దరుణీ.

336


మ.

లలనా నీమధురాధరామృతము గ్రోల [23]న్గాంక్ష గావింప కీ
కలశీతుచ్ఛతరామృతంబునకు నేఁ గాంక్షించినా నంచు నం
జులకంజేయకు గోటికల్పముల కెచ్చున్ జేయఁగా నౌ తపః
ఫలముల్ గల్గినఁగాని గల్గునటె యీభాగ్యంబు భామామణీ.

337


చ.

కులుకుమిటారి గబ్బిచనుగుబ్బల కోడిన దంచు నెంచ కీ
కలశము చేతఁబూను కలకంఠి భవన్మధురాధరంబునం
జిలికెడి తేనెబొట్టయినఁ జిందెడిమాధురి పావనత్వముం
గలిగి సుధారసం బఖిలగణ్యముఁ బుణ్యము నౌఁగదే యనన్.

338


మ.

బలిదైత్యేంద్రునిఁ జిన్నినవ్వు దొలఁకం బద్మాక్షి వీక్షించి యు
జ్జ్వలవాసంతరసాలపల్లవలవాస్వాదైకలీలాలస

త్కలకంఠీకలనాదమేదురవచోగాంభీర్య మేపారఁగాఁ
బలికెం జెంతల వట్టిమ్రాఁకులు చిగుర్పన్ నేర్పుసంధిల్లఁగన్.

339


తే.

అబలలము మూఁడుమాటల కాఱుతప్పు, లమ్మ నేఁ జెల్లగా పరిహాసకంబు
చేసె దీ విట్టిపనులు మాచేత నౌనె, చాలు నగరాకు పొమ్ము నిశాచరేంద్ర.

340


ఉ.

 స్త్రీలను నమ్మరాదు చలచిత్త లటంచు జనమ్ము లెల్ల వా
చాలత చూప నాపలుకు సత్య మటంచును విశ్వసింతురే
చాలు ని దేటిమాటలు పొసంగవు మీ రటుగాక నమ్మినన్
మే లొనరింతు నందఱకు మిత్రతఁ జూపి జగంబు మెచ్చఁగన్.

341


ఉ.

అక్కట కల్లగాదు నిజమౌ జనవాక్యము ముజ్జగంబులం
జక్కఁదనంబు కల్మి రతిశక్తియు జాణతనంబు ప్రాయమున్
మక్కువ గల్గువారియెడ మచ్చిక లెచ్చ రమించు జారయం
దెక్కడిసత్య మేడ వల పెక్కడినిల్కడ దానవోత్తమా.

342


సీ.

కుంతలంబులయందె కుటిలత్వ మననేల భావంబులందును బ్రబలియుండు
గబ్బిగుబ్బలయందె కాఠిన్య మననేల హృదయసీమలయందు నెనసియుండుఁ
గీలుఁగొప్పులయందె మాలిన్య మననేల బుద్ధిమార్గములందుఁ బొడమియుండు
జళుకుఁజూపులయందె చాంచల్య మననేల మోహంబులందును మొనసియుండుఁ


తే.

దలఁచి చూచిన బొమలందె ధర్మగుణము, మాట లేటికిఁ గటినె క్షమావిలాస
మనవరతరక్తి యధరంబులందె కాని, మానినులచిత్తముల లేదు దానవేంద్ర.

343


క.

బాలామణులను గానన, సాలావృకములను నమ్మి సఖ్యము సేయం
బోలదని బుధులు దెలుపుదు, రేలాగున నమ్మవచ్చు నింతులచెలుముల్.

344


క.

పలుకుల నొక్కటి భావం, బుల నొక్కటి చేత నొకటి పూఁబోణులకుం
గలగుణములు వారల నెటు, వలె నమ్మెద వీవు దైత్యవల్లభ చెపుమా.

345


క.

ఐన న్నే నటువలెఁ గా, నీననుకోరాదు గాక యెల్లసుగుణముల్
నే నీయక లేదుసుమీ, యీనెట్టున నీవె మీఁద నెఱిఁగెద వింకన్.

346


తే.

ఇతరసతులందు మతిలేక యెపుడు నన్నె, యాత్మఁ బొందఁదలంచుపుణ్యజనులందు
లీయమై యుందు నేనెందు లేశమైన, భేద మెఱుఁగక పరమసమ్మోదమునను.

347


తే.

ఆదరముఁ జెందియుండుదు నఖిలమునను, బలుకు లేటికిఁ జక్రంబు పంపు సేయ
వెఱ పెఱుంగక స్వచ్ఛందవృత్తి నుందు, నా కొకఁడు కర్త లేఁడు దానవవరేణ్య.

348


తే.

ఒకభుజంగునితోఁ గూడియుందు నతఁడు, వివిధభోగాఢ్యుఁ డయ్యును జెవుల వినఁడు
గానఁ దత్తల్పత వసింప కేను గోరి, వచ్చితి నటన్న బలిదైత్యవర్యుఁ డనియె.

349


మ.

వినుమా యీయనుమాన మేల బెళుక న్వేయైన నీయాన జ
వ్వని నీచేతిది నాదుదేహమును జీవంబు న్వృథామాట లే

లను నీచిత్తము నాదుభాగ్య మిఁక నీళ్ళ న్ముంచినం బాల ముం
చిన నీవే మఱియొం డెఱుంగ నిదియే సిద్ధంబు ముమ్మాటికిన్.

350


మ.

అని దైత్యేంద్రుఁడు మోహినీమృదులహస్తాంభోజసంపర్కసం
జనితస్వేదకరాగ్రుఁడై యొసఁగఁ జంచత్కుంభికుంభోప
మస్తనకుంభంబులు గుల్క మేనఁ బులక ల్సంధిల్ల మోదంబు సి
గ్గు నొయారంబును మీఱఁ గైకొనె సుధాకుంభంబు హేలాగతిన్.

351


మ.

సొలపుంజూపులు బెళ్కుబేడిస లటంచుం బట్టనుంకించి పా
ణులు సాపన్ దనుజు ల్మృగాక్షిదెలిగన్నుల్ గాన లేనవ్వుతోఁ
బలికెం బాణిపయోజభాసురసుధాప్రచ్ఛన్నసన్మాధురీ
కలనాసూచకభావగర్భితవచోగాంభీర్య మేపారఁగన్.

352


ఉ.

రక్కసులార మీరలు సుర ల్సమయత్నబలప్రయాసు లై
యిక్కడలి న్మథింప జనియించిన యీసుధ మీరు వారుఁ బె
న్మక్కువతో భుజింప నయమార్గము గావునఁ బంచిపెట్టెదం
జక్క సమంబు గాఁగ నిది సమ్మతమౌఁ గద మీకు వారికిన్.

353


తే.

వెనుక నిటువలె నటువలె ననుచు నన్ను, మాటలాడిన వినను ముమ్మాటి కిదిగొ
నెఱుఁగఁ జెప్పితి హితమౌనె యేను బంచి, పెట్టినటువలెఁ గైకొన గట్టిగాను.

354


క.

అని నిశ్చయంబు దోఁపఁగ, ననిన లతాతన్విమాట కౌఁగా కని య
ద్దనుజులు బృందారకులున్, ఘనతరసంతోషరసవికస్వరముఖు లై.

355


సీ.

గురుఁడు దోషాచరగురుఁడు సంకల్పంబు దెలుపఁగాఁ గలశాబ్ధిఁ దీర్థమాడి
మందారమహిజ మమందారమున నిచ్చుకనకాంబరంబులు కటులఁగట్టి
పారిజాతంబు పెంపారిజాతముదంబుచే నిడువిరిసరుల్ శిఖల జుట్టి
హరిచందనము గూర్చు హరిచందనపుఁబూఁత లందమ్ముగా మేన నలవరించి


తే.

కల్పక మొనర్చు మణిమయాకల్పకములు, పూని సంతాన మొసఁగు నవీనకర్ణ
పూరసంతానములు దాల్చి భూరినిష్ఠ, నుపవసించి యొనర్చిరి హోమవిధులు.

356


క.

అంతట నెంతయు భక్తిం, జింతామణి కామధేనుశీతలభాను
ల్చింతితవస్తువు లొసఁగ౯, శాంతమహీసురుల కొసఁగి శాస్త్రోక్తవిధిన్.

357


సీ.

వజ్రమౌక్తికరత్నవైడూర్యమణిఘృణిస్థగితకుంభస్తంభసంభృతంబు
నసమానచీనిచీనాంబరశ్రేణికాకలితవితానశృంగారితంబుఁ
గల్పకప్రసవసౌగంధ్యగంధాంధపుష్పంధయఝంక్రియాసంకులంబు
దీపితసామ్రాణిధూపధూమస్తోమఘుమఘుమాయితగంధగుంభితంబుఁ


తే.

బ్రకటగంధర్వగాంధర్వబంధురంబుఁ, జటులపంచమహావాద్యశబ్దితంబు
నిపుణతరవిశ్వకర్మవినిర్మితంబు, నవము నై మించు కనకమంటపమునందు.

358

క.

ప్రాగగ్రకుశాస్తరణా, భోగంబులయందుఁ దూర్పుమొగముగ బఙ్క్తు
ల్సాఁగిరి బలిముఖదానవు, లాగిరిభిన్మముఖ్యదివిజు లతులితభక్తిన్.

339


ఉ.

జాఱెడుపైఁటతోఁ గులుకుజక్కవగుబ్బలతో మిటారిన
వ్వారెడుమోముతో గిలుకుటందెలతో నసియాడుకౌనుతో
సారసగంధి సౌధకలశంబు కరంబునఁ బూని యెప్పు డొ
య్యారము మీఱ వచ్చునొకొ యంచు నిశాచరు లెంచునత్తఱిన్.

340


మ.

వలలోఁ జిక్కినకల్కిజక్కవలఠేవం జిల్గుఁబయ్యెంటలోఁ
గులుకు న్సిబ్బెపుగబ్బినిబ్బరపుఁజన్ను ల్బల్మిటారింపఁగాఁ
గలమంజీరఝళంఝళల్మదనఢక్కారూఢిఁ జూప న్సుధా
కలశీకమ్రకరాబ్జయై కలికి శృంగారంబు తోరంబుగాన్.

341


సీ.

గిలుకుమెట్టెలడాలు చిలువకుచ్చెలలపై జాళువాబంగారుసరిగఁ గూర్ప
జిలుఁగుపైఠాణిదువ్వలువలోఁ జిఱుదొడ ల్సెంగావిపావడరంగు లీనఁ
గమనీయమై మించు కటిచక్రచలనంబు రతిమనోవల్లభురాకఁ దెలుప
గమనశ్రమంబుచేఁ గమ్ముకమ్మనియూర్పుతెమ్మెరచేఁ గౌనుదీఁగె వడఁక


తే.

గుబ్బ లొండొంటి నొరయ ముంగురులు నెఱయ, గంకణంబులు మొఱయ నంగంబు మెఱయ
నడలు ముద్దులు గురియ లేనగవు దొరయ, వెలఁది చనుదెంచె దైత్యులు వేడ్కఁ బొరయ.

342


ఉ.

ఆమదిరాక్షిఁ జూచి పరిహాసము మీఱ బలీంద్రుఁ డిప్పు డో
కోమలి నీవు చే నమృతకుంభము పూనినఁ జూచి గోపబా
లామణివంచుఁ బాల్గొనఁదలంచెద మన్నను నవ్వుచు న్మృగా
క్షీమణి బావ నీవు దధిఁ జిల్కఁగ గోపిక నైన దోసమే.

343


మ.

అవు బావా యమృతంబు ముందు మనదైత్యశ్రేణికిం బంతునో
దివిజు ల్గుయ్యిడకుండ ముం దొసఁగి యందే గొంత తర్వాత దా
నవదైత్యాసురరాక్షసావళులకు న్వడ్డింతునో యానతీ
యవలె న్మీరన మంచిదే యనియె దైత్యస్వామి మేనుబ్బఁగన్.

344


తే.

గిలుకుటందెలు ఘల్లనఁ గీరవాణి, మరలి సురబఙ్క్తి కరుగుచో బిఱుదుచక్కఁ
దనము నెఱివేణిచెలువు గన్గొని బలీంద్రుఁ, డాదికన్నను మిగుల మోహంబు గాంచె.

345


తే.

వారిజేక్షణ సురపఙ్క్తిఁ జేరవచ్చి, యింద్రుఁ డెంత యమర్చిన నింతయేని
యమరకుండెడి యమరులయలబలంబు, మాన్చెఁ జేసన్న నొకమాటమాత్రలోన.

346


తే.

వజ్రధరముఖ్యులౌ దిశావల్లభులును, గరుడగంధర్వకిన్నరఖచరసిద్ధ
సాధ్యవిద్యాధరాదినిర్జరకులంబు, వారి వేర్వేఱబంతిగా నేరుపఱిచి.

347


సీ.

ధారుణీస్థలిఁ దోఁచు నూరుమూలము గాంచ నింతసి గ్గేల మోమెత్తు మనుచుఁ
బయ్యెద దొలఁగ గుబ్బలుచూడ బల్లంటఁ గెమ్మోవి నొక్కి జంకించుకొనుచు

భుజమూల మీక్షింపఁ బొదలు సిగ్గున నీకు వడ్డించ నని కేలు వంచికొనుచుఁ
గనుఱెప్ప లెత్తి గన్గొని మెచ్చి తల యూఁచి యమృతపానము సాలునా యటంచుఁ


తే.

దియ్యసరసంపుమాటలఁ దేనె లొలికి, యమృతరసము కదంబింప నమరపతికి
మొదట వడ్డించి వడ్డించుఁ ద్రిదశతతికి, మోహినీకాంత జగదేకమోహనముగ.

348


మ.

అలివేణీమణి గిల్కుమెట్టియలు మ్రోయం బంతి వడ్డించుచుం
జిలుఁగుంగుచ్చెలజాఱఁ ద్రొక్కువడి డాఁచేఁ జెక్కుచోఁ బైఁటయుం
దొలఁగంగాఁ జుబుకంబుచే నదిమెఁ దోడ్తో సిగ్గు నొయ్యారముం
దలుకుం దత్తఱము న్విలోకిజనచిత్తంబుల్ గరంగింపఁగన్.

349


సీ.

చెదరినముంగురు ల్చెమటచే నుదురంటఁ గొనగోళ్ళచే దువ్వుకొనుబెడంగు
జాఱుపయ్యెంట భుజంబుమీఁదికిఁ ద్రోసి చెఱఁగు డాఁపలివంకఁ జెక్కు హొయలు
సడలి ముంజేవ్రాలు జాళువాపైఁడిగాజులు పైకి నెగఁద్రోయుచో విలాస
మవనిభాగమున జీఱాడుకుచ్చెలకొంగు లీలఁ గెంగేలఁ కేలించుచెలువ


తే.

మలసి నిట్టూర్పు లిచ్చు నొయ్యార మెదను,మించు ఘర్మంబు గొనగోట మీటునీటు
గలుగుమోహినిఁ దలప మైఁబులక లొదవె, దానవులు సొక్కు టేవింత ధరణికాంత.

350


వ.

ఇట్లు మోహినీకాంత యత్యంతశృంగారవిలాసకుతూహలంబున సుధారసం బ
మరులకు నొసంగుసమయంబున.

351


సీ.

వనజాక్షి యమృతంబు వడ్డింపరాదాయె మనబంతి కిది యేమొ యనుచు నొకఁడు
వచ్చెద నని రాక వంచించునే ప్రేమ యధికంబు మనయందె యనుచు నొకఁడు
నమృతంబు మాకుఁ దెమ్మని బీఁదతనమున నడుగ గౌరవము గాదనుచు నొకఁడు
కాదని పిలిచినఁ గలకంఠి వడ్డింప కలిగిపోవునొ కడ కనుచు నొక్కఁ


తే.

డమృత మేబ్రాఁతి యాచకోరాక్షిచిత్త, మెడయఁ జేయంగ రాదని యెంచి యొకఁడు
నూరకుండి రిగాని యోయువిద! యమృత, మిందుఁ దెమ్మనలేరైరి యెంతవలపొ.

352


తే.

సుదతి వడ్డించునపుడు పయ్యెద యొకింత, తొలఁగ గుబ్బలు సూచునబ్బలియుఁ బల్క
రింపలేఁడయ్యెఁ దాఁ బల్కరింపఁ దెలిసి, యట్టె పయ్యెదఁ గప్పునో యనుభయమున.

353


మ.

తళుకు న్ముంగఱముత్తియంపురుచి సింగారంపుఁగెమ్మోవిపైఁ
దులకింప న్మెడ గుల్కి చెక్కుపయి బంతుల్సాగఁ దాటంకదీ
పులు కెంగేల బిగించుచున్ బయిఁట నంభోజాక్షి వాలారుచూ
వులఁ దేలించుచుఁ బల్కుఁ బల్కులసుధాపూరంబు తోరంబుగన్.

354


సీ.

తడవాయె ననుచుఁ జిత్తమున నుంపఁగ నేల నిదె వత్తుఁ దాళుమీ యింతతడవు
తాళఁగూడదొ బావ కేలగూఁడదొ తాళ కిపు డేమిగద్దులే యిట నదేమి
బావ నవ్వితివి నాపలుకున కేమైనఁ దోఁచెనో నాకు నీతోడు దాఁచ
నేటికిఁ జెప్పుమా నేవింతదాన దయలేదొ నామీఁద దాళు మంచి


తే.

దందు కేమాయె నాకొకయవసరంబు, గలుగదే యఫ్డు చిక్కెదుగాక యెటకుఁ
బోయె దంచును నవ్వుచుఁ బువ్వుఁబోణి, బలినిఁ దేలించె బరిహాసభాషణముల.

355

చ.

మఱఁది యటంచు బావ యని మామ యటంచును నల్లుఁ డంచు నం
దఱకును నన్నివావు లిడి తచ్చనల న్మటుమాయ సుద్దులన్
ముఱిపెముల న్విలాసముల మోహము లెంచి నిశాటచిత్తముల్
గఱఁచె లతాంగి యంగనలు గారె మనోధనపశ్యతోహరల్.

356


తే.

ఇటులు దైత్యులనెల్ల నోరెత్తకుండఁ, జేసి సురలకు వడ్డించు చిగురుఁబోఁడి
దేవరూపంబు గైకొని దివిజపఙ్క్తి, నున్నరాహువునకు సుధ యొసఁగెఁ గొంత.

357


ఉ.

ఆయెడ రాహువంచు వనజాహితమిత్రులు సన్న సేయ నా
హా యని మోహినీమహిళ యద్భుతరోషకషాయితాక్షి యై
హా యనునంతలోపల సహస్రసహస్రసహస్రదీధితి
చ్ఛాయ సహస్రధారమగు చక్రము వ్రాలెఁ గరాంబుజంబునన్.

358


చ.

శయజలజాతవిస్ఫురితచక్రముచే మధుకైటభారి దు
ర్ణయుఁడగు సైంహికేయునిశిరంబు గఱుక్కన ద్రుంచునంతలో
రయమునఁ గుత్తుక న్వెడలురక్తముతోడి కబంధ మొప్పె విం
తయి పరిషత్సరస్సున వరాంబువుసూత్రపుఁగంబమో యనన్.

359


చ.

క్షితిఁబడు రాహుశీర్షము ద్విజిహ్వలు రోషకషాయితాక్షులున్
సితతరదంష్ట్రలున్ బహువిచిత్రఫణామణు లుల్లసిల్ల వి
స్మితులయి దేవదానవులు చేరికఁ జేరి కనంగ మోహినీ
సతిఁ దిలకించి యిట్లను విషవ్యతిషంగకటూక్తివైఖరిన్.

360


మ.

సరిగా మాకు సుధారసంబు విభజించం జేరి యీలాగునన్
సురపక్షం బొనరింపఁగాఁ జనునె యిచ్చో నంతమాత్రంబె యొ
క్కరుఁడ న్నే నిటనాసవచ్చినను జక్రచ్ఛిన్ను గావించి తిం
దరయంగా ఫలమేమి నీ వెఱుఁగలే వైతే సరోజేక్షణా.

361


ఉ.

అక్కట నిన్ను దూఱఁదగవా మగువా పగవారలుండఁగా
నిక్కడఁ జంద్రభాస్కరు లిదేమి యకారణవైర మిట్లు నా
దిక్కునఁ జూపినారు కడతేఱఁగనిత్తునె యింక వారల
న్మిక్కిలి శక్తిమీఱఁ దిగమ్రింగెద నంచుఁ బరిప్లవింపఁగన్.

362


చ.

వలదని నాఁటనుండియు దివాకరచంద్రులఁ బర్వయుగ్మవే
ళలఁ గ్రసియింపఁ బంపెఁ గమలప్రభవుండు నకారణంబుగా
వలవనివైరముం గొనినవారికి భోగ్యముగాక యున్నె త
త్ఫల మది యెంతవారికిని బార్థకులాంబుధిపూర్ణచంద్రమా.

363


క.

అమృతరస మింత సోఁకఁగ, నమృతంబై రాహుశీర్ష మతిభయదముగా
నమృతకరార్కులఁ బట్టెడి, నమృతరుహప్రభవునాజ్ఞ నఖిలం బెఱుఁగన్.

364

వ.

అంత.

365


ఉ.

ఈమటుమాయలాఁడి గద యింత యొనర్చె నటంచు దానవ
స్తోమము సుట్టుకొన్న మధుసూచనుఁ డప్పుడు నీలనీరద
శ్యామతనూవిలాసము భుజాయుగళోజ్జ్వలశంఖచక్రముల్
హేమపటంబు గన్పడ వహించి తిరోహితుఁ డయ్యె నయ్యెడన్.

366


ఉ.

ఆకపటంబు గాంచి దురహంకృతి మీఱ యుగాంతవిస్ఫుర
ల్లోకవిలోచనద్యుతి విలోచనుఁ డౌచు విరోచనాత్మజుం
డాకులవృత్తి లేక ధనురస్త్రము లూని సహస్రచంద్రమ
శ్శ్రీకమనీయయానమునఁ జెన్ను వహించె రణాగ్రయాయియై.

367


సీ.

రథచక్రనేమిఘర్ఘరరావములు కేతుపటపటాత్కృతులకు దిటము దెలుప
గంధేభఘంటికాఘణఘణల్ ఘనబృంహితధ్వానములకుఁ గైదండ యొసఁగ
జవనాశ్వహేషలు చటులఖురాఘాతచిటపటధ్వనులతోఁ జెలిమి చూప
నమరాట్టహాసనాదములు ఘోరశరాసవిస్ఫారములకుఁ బ్రావీణ్య మునుపఁ


తే.

బటహశంఖాదిబహువాద్యరటనములకు, వేత్రిసాహోనినాదము ల్విజయ మొసఁగ
సకలసేనలఁ గూడి రాక్షసజిగీషఁ, గదిసెఁ జౌదంతి నెక్కి సంక్రందనుండు.

368


మ.

అవనీమండలి గుల్భదఘ్న మయి మాద్యద్దంతిదానాంబువుల్
ప్రవహింప న్వడిఁ జిక్కువాఱినఁ దమిస్రాచారి త్రొక్కుళ్లచే
నవియున్ లేవఁగఁజాలఁ డెంతబలియుండైనం జమూసంకులం
బవురా యెన్నఁదరంబె దానవమయం బయ్యెన్ జగం బత్తఱిన్.

369


శా.

త్వంగద్వాహఖురాగ్రభిన్నధరణీతత్త్వంబు రేణ్వాకృతిన్
మ్రింగె న్వారిధులన్ గ్రసించె హిమరుఙ్మిత్రాదులం బుష్కరం
బుం గప్పె న్నడయాడదయ్యెఁ బవనంబు దైత్యరాడ్భీతిఁ జూ
డంగా నప్పు డకాండసంప్రళయ మౌటం దోఁచె దేవాళికిన్.

370


సీ.

కాంచనస్యందనగంధదంతావళరాజజంఘాల తురంగమముల
శార్దూలమహిషకేసరిగండభేరుండశరభప్రముఖవన్యసత్త్వములను
గంకగృధ్ర శ్యేనకాకోలకౌశికపారావతబకాదిపతగములను
గమఠపాఠీనకర్కటకనక్రగ్రాహశంకుప్రభృతితోయజంతువులను


తే.

వాహములు గాఁగ నెక్కి దుర్వారశక్తిఁ, బరశుపట్టసతోమరప్రాసముఖ్య
శస్త్రములు పూని బలపాకజంభనముచి, విప్రజిత్త్యాదిదైతేయవీరు లపుడు.

371


తే.

చేరి వేర్వేఱ బారులుదీఱి కొల్వు, మ్రొక్కు మ్రొక్కిన వారలముఖముఁ జూచి
కంటిరే వీరవరులార కార్య మెంత, మోసమయ్యెను సురల నమ్ముటను నేఁడు.

372

చ.

కటకట యాడుదానివలెఁ గంజదళాక్షుఁడు సేరి మమ్ములం
దటవటఁ జేసి తీసి యమృతంబు సురాళికిఁ బంచిపెట్టె నిం
కెటువలె నమ్మవచ్చు జగదీశ్వరుఁడే యొకయింత మేరలే
కిటువలెఁ జేయఁజూచె మన కెయ్యది తప్పు గణించి చూడఁగన్.

373


ఉ.

తా నొకమాయఁ జేసి యమృతంబు సురాళికిఁ బంచిపెట్టఁగా
నే నిఁక మాయఁ జేసి త్రిదివేశుల నందఱ మాయఁ జేసెద
న్మానుప శక్తుఁడే యహహ మాధవుఁ డూరక లంజెతక్కులం
బూనెనె కాక యాయుధముపోటు నెఱుంగునె చూత మంతయున్.

374


క.

అని పలికిన దనుజేంద్రునిఁ, గనుఁగొని యిది యెంత స్వామి కనిపించుకొనం
దునిమెదము నీప్రతాపం, బున మే మాసురల నొకనిఁ బోనీకుండన్.

375


క.

తలఁద్రుంపక మ్రింగమె వే, ల్పులందఱ నమృతసేవఁ బొలియకయున్నన్
మెలఁగుదురుగాక కడుపునఁ, గలకాలము జాఠరాగ్నిఁ గమలి బలీంద్రా.

376


క.

అటువలెఁ గాకున్నను మన, పటలిశృంఖలలు వైచి బంధించిన యు
త్కటదురితంబు ననుభవిం, చుటకుఁ జెఱసాల నిడమె సురపతిఁ గినుకన్.

377


క.

అని యుత్సహించి పలికిన, విని దనుజేంద్రుండు మిగుల వేడుక మీఱన్
గనుఁగొని యిదుగో సమయం, బనుపమభుజశక్తి కనుచు నందఱఁ బనుపన్.

378


సీ.

కృతవీరపాణకర్ణేజపభ్రమణారుణాభనేత్రముల రోషాగ్ను లొలుకఁ
గలశాబ్ధిజలఘోషఘనతమాశబ్ది కస్మయఘట్టితాట్టహాసములు చెలఁగఁ
బ్రతిభటాళ్యంధకరణహాలహలదీప్తిముష్టిందయచ్ఛాయమూర్తు లలర
మధ్యేవియర్దీప్యమానార్కనిష్ప్రభీకరణభీకరఖడ్గకాంతు లడర


తే.

హైమరథములఁ దోలి గంధాంధభద్ర, కరుల గారాడి దుముదారుగా హయాళి
జేరువకు నూకి భటులకుఁ జేయి వీచి, యభ్యమిత్రీయదైవసైన్యంబుఁ గదిసి.

379


క.

వాతంధయపాణింధమ, శాతశరము లసురు లేయ సౌరబలంబు
ల్భీతిలక ప్రతిసువర్ణా, న్వీతోజ్జ్వలపత్రితతుల విదలించె వెసన్.

380


మ.

రథికుల్ హస్తికు లాశ్వికు ల్భటులు శస్త్రాశస్త్రిఁ బోరం బర
శ్వథకౌక్షేయకకుంతముద్గరగదాచక్రాదినానావిధా
యుధకాంతుల్ దశదిగ్విభాగములయం దొప్పారె నత్యుగ్రమౌ
మధుభ్ళల్లోచన మాసులోచనము సామ్యంబూని చూపట్టఁగన్.

381


క.

ఈకరణి శరాశరిఁ గుం, తాకుంతి గదాగదిని బ్రతాపము మెఱయ
న్భీకరముగఁ బోరఁగ నా, కౌకోదైత్యులకు ద్వంద్వయుద్ధం బయ్యెన్.

382


సీ.

బలిశక్రులును హేతిపాశాయుధులు వృషపర్వాశ్వినులు రవిబాణు లిందు
సైంహికేయులు విరోచనకృశానులు భద్రకాళినిశుంభులు కాలనాభ

కాలులు మయవిశ్వకర్మలు జంభవృషాకపు ల్ద్విశిరోనిశాకరజులు
మాతృకోత్కలులు దుర్మర్షణవామదేవులు నముచ్యపరాజితులు పులోమ


తే.

నీలులును మేఘదంభావనీతనయులు, కాలకేయమరుత్తులు కమలమిత్ర
తనయనరకాసురులు నివాతకవచపవ, మాను లొండొరుల్ వోరుసమయమునందు.

383


మ.

కవచస్ఫూర్తి నభేద్య మౌ కవచ మేకంబైనబాణంబుచే
నవియించెన్ రథరథ్యసారథిపతాకాద్యంబుల న్నాలుగిం
ట విచారించె సురేంద్రు డగ్గఱి భుజాటంకంబునం దైత్యదా
నవచూడామణి యట్టహాసమునఁ గాండం బెల్ల ఘూర్ణిల్లగన్.

384


క.

మఱియుం దఱచుగ శరములు, గఱిగఱి గఱువంగ నేయఁగా వెఱవక య
త్తెఱగంటిరాయఁ డప్పుడె, యఱిముఱిఁ బ్రతిశరము లేసి యన్నిటిఁ ద్రుంచెన్.

385


సీ.

కోపంబు మీఱఁగాఁ జాపంబు చేపట్టి రోషంబుచే దానిరూ పడంచె
శూలంబుఁ గైకొని ఫాలంబు వొడువరా వాలముచే దాని వ్రేలఁజేసెఁ
బంతంబు మీఱఁగాఁ గుంతంబు గైకొన్న నంతంబు నొందించె నస్త్రనిహతి
గండంబు గుఱి సేసి దండంబు వైచిన ఖండంబు గావించెఁ గాండమునను


తే.

మఱియు నేయాయుధము లూన మనుజభోజి, తత్తదాయుధములఁ ద్రుంచెఁ దత్క్షణంబ
యమృతసేవయు హరికటాక్షమును గలుగఁ, గలదె యీడును జోడు నాఖండలునకు.

386


శా.

ఆగ్నేయాస్త్రము దేవతాధిపతి యేయం దానిచే భగ్గునన్
భగ్నంబయ్యె మహారథంబు దివిజప్రత్యర్థిరాజేంద్రుఁ డు
న్మగ్నుండౌట నదుృశ్యుఁడై చనియె నానాదైత్యసంఘాత ము
ద్విగ్నంబయ్యె సుధాశను ల్సెలఁగి రుద్వేలప్రమోదంబునన్.

387


వ.

అంత నిటులు నలోచనగోచరుండై చనినవిరోచననందనుండు కృతగర్వవి
మోచనుండై తననేర్పు మెఱసి మాయావి యగుచు నెల్లెడలఁ దోఁచి పెల్లుగ
నాక్రమించెడుమాయ గావించిన.

388


సీ.

కులశైలమున వాన గురియంగ గిరిభేది యంగంబు గులగులనయ్యె మిగుల
లయకాలదహనకీలలు సుట్టుకొని యేర్చి పరితపింపఁదొడంగెఁ బావకుండు
మృత్యుపాశంబులు మెడఁబట్టి తివియఁగా మొఱలు వెట్టఁదొడంగెఁ ధరణిసుతుఁడు
బేతాళములు నీళ్ల వ్రేసి త్రొక్కఁగఁ బాశి యుదు టెల్లఁ బెడఁబాసి యుడ్డుగుడిచెఁ


తే.

బెక్కుభూతంబు లితరులపీచ మణఁచె, నే మనఁగవచ్చు వానిమాయామహత్త్వ
మహహ యింద్రాదులేల బ్రహ్మాదులైన, మెదలఁగాఁజాల రావేళ నెదుటఁబడిన.

389


వ.

అదియునుంగాక.

390

మ.

జలదంతావళఘోరఘీంకృతులతో ఝంఝానిలాఘాతసం
చలితాభ్రంలిహతుంగతుంగతరచంచద్భంగఘోషంబుతోఁ
గలశాంభోనిధిఁ దమ్ము ముంచినగతిం గన్పింపఁ గంపించుచున్
బలభిన్ముఖ్యులు పాహిపాహి యని యబ్రహ్మణ్యము న్వెట్టఁగన్.

391


మ.

వినిపించెన్ హరిపాంచజన్యరవ ముద్వేలప్రభాచక్రముం
గనిపించెన్ సురదానవావళికి రక్షస్వామిమాయాళి లే
దనిపించెన్ క్షణమాత్రలో సమదదేవారాతి రింఛోళిచేఁ
దినిపించెం దృణరాజి రాజితభుజాతేజంబు శోభిల్లఁగన్.

392


వ.

అప్పుడు.

393


ఉ.

చిక్కితి వెందుఁ బోయెదవు శ్రీహరి యంచు మృగేంద్రవాహముం
జక్కఁగఁ బైకి నూకి రభసంబున శూలము పూని జక్కియౌ
పక్కిని ప్రక్కలింపఁ గని పక్కున శూలము నాచి త్రుంచె నా
చక్కనికాలనేమితల చక్రధరుండు సురాళి మెచ్చఁగన్.

394


క.

అది గనిన మాల్యవంతుఁడు, గద గొని హా! పోకుపోకు! గరుడ యటంచున్
విదలించె గరుడుఱెక్కలు, త్రిదశేంద్రుఁడు తనదు పవిని దిట్టఁగ నంతన్.

395


తే.

దానవధ్వంసికరచక్రధార మునుపొ, తాను మునుపొ యనంగఁ గంధరను వలచి
యచ్చరమిటారి వైచుమాల్యంబువలన, మాల్యవంతుఁడు సహజనామంబుఁ గనియె.

396


క.

సురభీకరణోత్కమనో, హరమూర్తి సుమాలి మాధవౌద్ధత్యమునం
దెరలెం దానవజాతియు, వరసుమనోజాతియైనఁ బ్రమదము గనదే.

397


క.

తనపేరు గలుగు హరి నె, క్కినవాఁడని మాలిఁ దునిమెఁ గేశవుఁడు సుద
ర్శనమున మఱియు ననేకుల, దనుజులఁ దునుమాడె బాహుదర్ప మెలర్పన్.

398


శా.

ఈరీతిం జగదేకవల్లభుఁడు భూయిష్ఠప్రతాపంబుచేఁ
గ్రూరాదిత్యవిరోధివర్గముల నుగ్గుల్సేయ నంతంతకున్
హేరాళం బగువేడ్క వాసవుఁడు మత్తేభంబుఁ గాలాడి దు
ర్వారంబౌకులిశంబు పూని బలిఁ జేరంబోయి తా నిట్లనున్.

399


క.

ఏరా యోరినిశాచర, యేరా వృత్రారి నెఱుఁగవే నాతోడం
బోరాడలేవు పోరా, కోరా యభయంబు నిల్పుకోరా తనువున్.

400


తే.

వదలి శౌర్యంబు విద్యలవానికరణి, నింద్రజాలంబు వన్నెదవే బలీంద్ర
యిదిగొ వజ్రంబు మెచ్చి యిచ్చెదను గొనుము, కల్లగా దన విని దైత్యవల్లభుండు.

401


తే.

ఇంద్రజాలంబు వన్నక యెటుల నొడియ, వచ్చు ననిమిషబలము లవ్వారి గాఁగ
దోఁ పొసంగకపోదువే దొడ్డదొరవు, వజ్రమాత్రంబు నా కేల వలవ దనిన.

402

ఉ.

ఇం కిట దోఁపె కాక పుర మెయ్యది నీకు నిశాచరేంద్ర యీ
యంకము మాని పోయిన యథార్థమె పల్కితి వౌర యంచు
నిశ్శంకత నిర్జరేశ్వరుఁడు సారెకుఁ బ్రల్లదమాడఁగా మహా
హంకృతిఁ జెంత నున్నబలియయుం దనుజాతుఁడు హుంకరించుచున్.

403


తే.

ఏమిరా యింద్ర యింతలో నింతగర్వ, మేల వచ్చెఁ దలంపరా యిన్నినాళ్లు
నీవు పడినట్టిపాటు నే నెఱుఁగుదు నొక, గరిడిలో వింతసాధన క్రమముగాదు.

404


తే.

ఇతఁడు నీ కోడి మాయలు నిచటఁ జేసె, నే స్వకాండ విజృంభణం బెల్లఁ దొలఁగ
గౌతమీజార యెవ్వనిఁగాఁ దలంచి, నావు బలిఁ గాఁడె పుణ్యజనప్రభుండు.

405


ఉ.

కొమ్ములుఁ దోక లేక జతగూడెను నీకు వృషాఖ్య యింద్ర రే
ద్రిమ్మరిదొమ్మికయ్యమున జట్టతనం బరి పూరి మేసితోఁ
గ్రమ్మినభీతిచే నటులుగావలె నచ్చెరువేల దీనికై
యిమ్మహి నీదుపేరిపసు లెచ్చటఁ జూచినఁ బూరి మేయఁగన్.

406


క.

కౌశికలీలను గానన, కౌశికమూలమునఁ దపము గావించెదవో
కౌశిక యటు గాకున్నం, గౌశికగతి గొంది నడఁగఁ గాంక్షించెదవో.

407


క.

బలి భాస్వత్తేజంబున, నళుకుచు నిఁకఁ గౌశికా మహాబిలపదవి
న్మెలఁగు యథార్థాభిఖ్య, న్వలవదు మాతోడఁ బోర వశమే నీకున్.

408


వ.

అనిన మదిరాపానఖదిరాంగారసదృశదృశుం డగుచు సహస్రదృశుం డిట్లనియె.

409


తే.

కౌశికుఁడ నౌదుఁగాక రాక్షస యటైనఁ, గౌశికస్ఫూర్తి బలిపుష్టగణము లెట్లు
మనఁగ నేర్చు నెఱుంగ వేమనఁగవచ్చు, ననిన విని నవ్వి బలి యిట్టు లనియె నపుడు.

410


సీ.

విబుధలోకేంద్రుండు వీరాధివీరుండు గాఁడె యెన్నండైనఁ గలన నోడి
పోవునె యటమొన్న పుణ్యంబునకు స్వర్గ మిచ్చి తా నడవుల కేగెఁగాక
మరల నెయ్యంబున మముఁ గొల్చెఁ గాఁబోలు ఘనభుజాశక్తికిఁ గడమగలదె
యింకఁ దాఁగాక న న్నెవ్వరు నవ్వెద రాహవంబున నోడి యరుగుచుండ


తే.

నహహ యందుల కేమి కర్మానుసార, మాపదలు సంపదలు జయ మపజయంబు
దానికన లేదు దైవకృత్యంబులకును, విఱ్ఱవీఁగుట వ్రేఁగుట వెఱ్ఱితనము.

411


క.

వినవోయి యింద్ర దైవం, బనుకూలంబైనఁ గలుగు నన్నిశుభంబుల్
దనకుఁ బ్రతికూలమైన వ, చ్చిన నేకార్యంబుఁ గాదు సిద్ధము సుమ్మీ.

412


ఉ.

మీ కొకవేళ నేమమగు మే మొకవేళఁ ద్రిలోకరాజ్యముం
జేకొనియుందు మిర్వురకుఁ జేకుఱ వొక్కట వాంఛితార్థముల్
కోకచకోరకంబులకుఁ గూడునె కోరిక లొక్కవేళనే
యాకరణిం దలంపు త్రిదళాధిప గర్వపుమాట లేటికిన్.

413

క.

అని వైరోచని పలికిన, విని బలి నను వాఁడు దేవవిభుఁడు కృతఘ్నుం
డని రోయక సరిచేసుక, చనునే మాటాడ రాత్రిచరమూర్ధన్యా.

414


క.

క్షణమాత్ర మూరకుండుము, క్షణదాచరకోటి గొలువ సమితి సహస్రే
క్షణకాయము గూలిచి భ, క్షణముగఁ జేసెదను భూతసంఘంబులకున్.

415


ఉ.

గాలికిఁ బోవువాహము నగంబులపత్రములం దెమల్పఁగాఁ
జాలును వాలు సైన్యములు సంగరమన్న గృహోపయుక్తముల్
ప్రోలును బట్టబైట నిజపుత్రకుఁడుం బలుగాకి యిట్టిచో
వేలుపుఱేని గెల్చు టొకవిక్రమమే బలిదైత్యవల్లభా.

416


వ.

అని దురాగ్రహగ్రహావేశకిటకిటాయితరదనపటలుం డగుచు నిజభుజాగ్ర
జాగ్రన్మండలాగ్రంబు జళిపించి యాఖండలున కి ట్లనియె.

617


క.

అబ్బలి సురమృగములకుం, బెబ్బులి యటఁ బోకు నీకుఁ బింకం బున్నన్
గొబ్బున రా బలి నే నొక, దెబ్బం బరిమార్తు ధరణిఁ గొబ్బునఁ గూలన్.

418


తే.

నాసురేంద్రుండు నవ్వి యిన్నాళ్లు గావు, నేఁడు బలివైతి వాహవోన్నిద్రబాహు
శక్తికని పల్కి బలికి ద్రాసంబు బలియ, నెలిని ఖండించెఁదను సురల్ బలియుఁ డనఁగ.

419


క.

అంతటఁ బోక సురేశ్వరుఁ, డెంతయు రోషమున వజ్ర మేసిన మూర్ఛా
క్రాంతుం డయ్యెన్ బలి దివి, జాంతకునరదంబు సూతుఁ డవలికిఁ దివిచెన్.

420


సీ.

చెలికానిహాని వీక్షించి రోషంబున జంభుండు కధనసంరంభుఁ డగుచు
నిలు నిలురా యింద్ర నేఁ డెందుఁ బోయెదు చిక్కితివం చని సింహహయముఁ
గదియంగఁ దోలి యుధ్ధతి గదాదండంబు బిరబిరఁ ద్రిప్పి యాసురవరేణ్యు
కరిని వైచిన నది సురసుర స్రుక్కుచు ధరణిపై మ్రొగ్గినఁ దత్క్షణంబు


తే.

నందె మాతలి దెచ్చిన హయసహస్ర, రథముపై నెక్కి జంభుశిరంబు దునిమె
వాసవుఁడు గట్టుదెగఁగొట్టువజ్రమునను, జంభసంభేదమేమి యాశ్చర్య మనఁగ.

421


క.

కలహప్రియుచే నెంతయుఁ, దొలుత న్విని కనలి వానితోఁబుట్టువు
బలపాకనముచు లత్యు, జ్జ్వలశోభాభువనముచులు సంరంభమునన్.

422


క.

త్రేతాగ్నులవలె మువ్వురు, దైతేయులు సుట్టుముట్టి దారుణశరసం
ఘాతములఁ గప్పఁగాఁ బురు, హూతుం డొప్పారె మేఘయుతమేరుగతిన్.

423


క.

బలుఁడు రథంబును దురగం, బులఁ బాకుఁడు సూతు నముచి భూరిశరములన్
దళియించి యింద్రునంగక,ములు సింఛిరి మించి యతఁడు మూర్ఛ మునుంగన్.

424

వ.

అంత నంతటంబోక యనలు నంతకు నసుర నబ్ధిపు ననిలు నలకేశ్వరు నలికలోచ
ను నన్యు లగునమరుల నతులితంబు లగునస్త్రంబుల నదటణంచి యట్టహాసం
బడరించిన.

425


తే.

వెఱచి తెఱగంటి మూఁకలు మొఱలు వెట్ట, నమరపతి సేదదేరి యుదగ్రుఁ డగుచుఁ
గులిశధారను ఖండించె బలుని మొదట, వెనుకఁ బాకాసురునిఁ ద్రుంచె విక్రమమున.

426


ఉ.

వారలపాటుఁ జూచి యనివారితరోషకషాయితాక్షుఁ డై
వీరవతంసుఁడౌ నముచి విక్రమశాలి యనేకఘంటికో
దారము మత్తశాత్రవవిదారము నైన త్రిశూల మెత్తి హుం
కారము మీఱ వాసవ పొకాలుము దీన నటంచు వైచినన్.

427


వ.

అదియుఁ బ్రళయకాలకాలఫాలలోచనకీలికీలాకరాళం బై నిగిడిన యట్టిశూ
లంబు తూలంబులీల నతివేలంబై యాలంబున నేలంబడ వాలంబున నేసి తద్దనుజ
కంఠనాళంబు ఖండింప నాఖండలుం డఖండదోర్మండలమండనాయితం బగు
శతకోటి జళిపించి వైచిన నదియు శతకోటిమార్తాండమండలపిచండిలరుచి
మండలప్రచండతాఖండనపండితమన్యం బగుచు సంవర్తసమయప్రవర్తిత
పుష్కలావర్తప్రముఖచటులతరమేఘపటలనిర్దళదనర్గళజాగ్రద్దీర్ఘనిర్ఘాతసం
ఘాతలింగంబు లగు విస్ఫులింగంబులు తోరంబై నిగుడం గనుంగొని దనుజ
పుంగవుండు గలంగక చెలంగుచు మదీయవక్షఃస్థలికుందనంపుతాళికి నొకయ
పూర్వవజ్రంబు లేదు గదా యని వెదకుచుందు నదియుఁ ద్రిదళపతి యంపెనే
కదా యని యెదయిచ్చిన వజ్రంబును జనుమఱగ్రుచ్చి వెనువిచ్చి చనలేక
యచ్చటనే యున్నం గనుంగొని వియచ్చరప్రవరుఁ డిది యేమి యెచ్చటనుం
గాన మిట్టి యచ్చెరు వని రిచ్చవడి కనుంగొనుచు వెచ్చనూర్చుచున్న సమ
యంబున నార్ద్రంబును శుష్కంబును గాని దాన నముచిదానవుండు దెగు
నని నిదానంబు దెలిపిన నాకాశవాణి పలుకు నాకర్ణించి నలుదిక్కులుం బరికించి
శైత్యప్రభావమానితవజ్రఘనసారం బగుచుఁ గనుపట్టు వారాశిడిండీరంబు
భవిష్యన్నముచిహననజనిష్యమాణయశస్సౌరభకారణకుసుమమంజరిం జేపట్టు
విధంబున హస్తారవిందంబున హంసంబు చందంబున గనుపట్టం గైకొని దివ్య
తేజంబు సంధించి యనార్ద్రశుష్కం బిది యౌ గదా యని ప్రయోగించిన
నదియు నింద్రప్రతాపభూపాలునిసమీపంబున వెలుంగు చంద్రజ్యోతితెఱం
గున రంగై నిజాభిముఖవిజయలక్ష్మికి సుపర్వాధిపతి సమర్పించు కర్పూరనీరా
జనంబుడంబున విరాజమానం బై బలిదైత్యత్రిలోకాధిపత్యవినాశసూచకం
బై పడునుడువువడువున బెడంగై నముచిప్రాణాపకర్షణసమావతన్మృత్యు

దేవతాట్టహాసంబు పోలికె వికాసంబై తైలాదభ్రసితాభ్రంబు సుహృ త్తగు
రీతి శీతలజలప్రవాహంబు కూల సాలనిర్మూలనానుకూలం బగులీల సురవిరోధి
శిరోధి ఖండించిన దనుజవరూథినీహాహానాదంబు లుప్పతిల్లె దివిజచమూసమూ
హంబులు గాయకహాహానాదంబులు బ్రహ్మర్షిసముచ్చయసముచ్చైరుచ్చారిత
జయజయేత్యాశీర్వాదంబులు జయదుందుభి రటనంబులు నప్సరోనటనంబులుం
జెలంగె నంత.

428


తే.

ఏఱులై పాఱు నెత్తురు లెందుఁ జూడఁ, గొండలై పడుకండలు గుములుగూడి
దానికై పోరు భూతబేతాళతతులు, గలిగి భీకరమయ్యె సంగరము గరము.

429


తే.

మెదడు ముద్దలు గావించి మెసవి మెసవి కుతిక మోయంగ నెత్తురుల్ గ్రోలి కడుపు
నిమిరికొంచు నగస్త్యమంత్రములు నొడివి, శతపదంబులు ద్రొక్కుఁ బిశాచగణము.

430


క.

తుందిలదనుజకబంధము, నందొకగజమస్తకంబు నతికి గజాస్యా
యిందలి కరివిఘ్నంబులఁ, గుందింపకు మనుచు మ్రొక్కుకొనుభూతంబుల్.

431


తే.

వేలుపులు వారు దనుజులు వీర లనుచు, భూతబేతాళములపఙ్క్తి పొంకపఱిచి
తాను మోహిని యంచు రక్తంపుసుధను, బొసఁగ వడ్డించెఁ గామినీభూత మొకటి.

432


మ.

కరిగండస్రుతదానవారి యమునాకల్లోలముల్ గా నికో
చరరక్తంబు సరస్వతీకలన మించె న్వాహలాలాంబువుల్
సురకల్లోలినిగాఁ ద్రివేణికరణి న్సొంపొందె జ్ఞాతేయసం
గరభూభాగము గాన దానఁబడ మోక్షప్రాప్తి సంధిల్లెడిన్.

433


తే.

ద్వంద్వయుద్ధంబు గావించు దనుజవిభులు, దక్కురక్కసు లెదురంగఁ దల్లఁడిలుచుఁ
బఱవ వెన్నాడి పొడిచె సుపర్వగణము, లహహ దాయాదిపోరు దుస్సహము గాదె.

434


వ.

ఇవ్విధంబున నుపేంద్రసుదర్శనంబునఁ గాలనేమి మాలి సుమాలి మాల్యవం
తులు నంభోధరవాహదంభోళిసంరంభంబుల బల జంభ పాక నముచి ప్రముఖ
దానవప్రవరులు దక్కినదిశాధిపతులవలనఁ దెగిన సేనాధిపతు లెల్లం ద్రెళ్లిన
విలోకించి దేశకాలవిశేషవిజ్ఞానవిచక్షణుండు గావున బలీంద్రుండు దన కది విజ
యసమయంబు గాదుగా యని యెఱింగి సంగరరంగంబు దొరంగి శుక్రుసన్నిధి
కేగి తదీయసంజీవినీవిద్యఁ దత్త్వోపదేశవచోవిశేషంబుల బాహ్యాంతఃకరణ
దుఃఖంబులఁ బాసి తపంబునకుం జనియెఁ దక్కు రక్కసులు దిక్కు లేక పెక్కువగ
లం జిక్కువడి నానాదిక్కులకుఁ బఱవఁ బరవరూథునీవరుల వెన్నంటి మున్నిం

టి రోషంబుకంటు దెఱగంటి దొరలు సమయింపలేక వెఱచువారును, రక్షిం
పుండని యఱచువారును, దెసలకుఁ బఱచువారును, దృణంబులు గఱచువా
రును, కాననంబులు దూఱువారును, విధి దూఱువారును, మ్రొక్కువారును,
నగంబు లెక్కువారును, నొచ్చువారును, సముద్రంబులం జొచ్చువారును నై
కలంగిన రక్షోబలంబులవలన దిగంతంబులుం గరుణరసమయంబు లయ్యె నాసమ
యంబున.

435


ఉ.

గీరమణుండు పంప ననికిం గలహప్రియుఁ డేగుదెంచి ల
క్ష్మీరమణప్రసాదమునఁ జెందితి రింతె యభీష్ట మింక బృం
దారకులార భీతు లగుదైత్యుల నొంపఁగ నేల యంచుఁ దా
వారలఁబోరు మాన్పెఁ బితృవాక్య మలంఘ్యము గాదె యేఱికిన్.

436


వ.

అంత సుపర్వసార్వభౌముం డవార్యశౌర్యంబున దుర్వారతరసర్వశార్వరీచర
భుజాఖర్వగర్వశార్వరంబు దొలంగించి నిజప్రతాపతపను వెలింగించి పలాయ
మాననానాదానవప్రాణత్రాణపరాయణుం డగుచుఁ దచ్ఛిబిరంబుల ధర్మదార
లం బట్టింపక ధర్మధారలం బట్టించె నంత.

437


సీ.

వృత్రనిర్జరమిత్ర వృత్రపంకజమిత్ర జంభజంభలవిభంజనకుఠార
పాకవారణపాకపాకలరోషనముచిఖండనభండనప్రచండ
బలయుక్తబలభుజాబలమహాబలనాగకృతపులోమవిరామకీర్తిధామ
జితవిరోచనదైత్య సుతవిలోచనభీమ తతగరుద్ధరధరాధరనిరోధ


తే.

యంచుఁ గొంచక కంచుకు లభినుతింప, విజయలక్ష్మీసమేతుఁ డై వెల్లగౌరు
నెక్కి సర్వామరులు గొల్వ నింపుసొంపు, లమర నమరావతికి నేఁగె నమరవిభుఁడు.

438


మ.

అమితానంద మెలర్ప డెందమున దైత్యారాతి కూర్మావతా
రము గాఢస్పృహ మీఱ వ్రాయు మనుజుల్ రాణింతు రాచంద్రతా
రముగా శ్రీయుఁ జిరాయు వొంది రుచిరాధారాదితోదారితా
రముగా వర్ధిలుఁ గీర్తిగల్గి ఘనసామ్రాజ్యంబున న్భూవరా.

439


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.

440


మ.

నవరత్నోజ్జ్వలధామ దామసుమనోనాళీక నాళీకపా
త్రవరామోదనిదాన దానవిలసత్కల్యాణ కల్యాణన
మ్రవనీచైత్రవిహార హారుసువచోమాధుర్య మాధుర్యశా
స్త్రవిభాస్యాత్మవిశేష శేషవిలసత్సత్కీర్తి సత్కీర్తితా.

441

క.

భర్తృహరిప్రముఖసుధీ, కర్తృకృతగ్రంథజలధి కజ్ఞానసుబో
ధర్తృమనీషామంథర, ధర్తృ శ్రీపద్మనాభ తనయవరేణ్యా.

442

ముక్తపదగ్రస్తసింహావలోకనభుజంగప్రయాతము

సుధామాధురీధుర్యసూక్త్యైకధామా
కథామాత్రధూతారికౌక్షేయధామా
యథామాధవస్వాన్గకాదిప్రధామా
ప్రథామానితామాత్యరాజీసుధామా.

443


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణీదేవుల నాగ
నామాత్యసుధానముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైనదశావతారచరిత్రం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

2. కూర్మావతారకథ సమాప్తము

  1. నప్పంటికున్నం
  2. వలెఁ
  3. శ్రీకృపావీక్షణామృతసిద్ధి
  4. వడంక నొడళులు
  5. మ్రొక్కిడుచుఁ
  6. ని భావించెదం
  7. బెచ్చౌ నెచ్చట మఱి
  8. గామించె
  9. నవయవంబులు పద్మశంఖాదినవని, ధానములఁ బోల
  10. సొన్నంపు
  11. వేగ నతని, చేతిది హరించె జంభుఁ డక్షీణదంభుఁ, డతనిచేతిది గొనె నిల్వలాసురుండు,
  12. దైత్యవరుఁడు
  13. ము వినుతింపఁ, దరమె పరమేశ్వరున కైన ధరణినాథ.
  14. కనుపింపకయె మించు కౌనుఁ జూచి
  15. వంధ్యములు గాక
  16. తనులత యెదను మెల్లనఁ జేర్పనే కాని
  17. లలి రతిక్రీడల నలరింప
  18. తననెమ్మదిలోన మిగులఁ
  19. సాబ్జుఁడయి పల్కె నబ్జాయతాక్షిఁ జూచి
  20. మె, య్యెది యీనీభువనైకమోహనతనుశృంగార మత్యద్భుతా
  21. పయోరుహాననా
  22. వనిత
  23. న్వాంఛ