కడవన్నెజిగిపట్టు నడికట్టు పడిదలపట్టంబు నేజయు బాగుదేర
సరసభాగమున బాగైనతూణీరంబు కరమున జీనిసింగాణివిల్లు


తే.

మెఱయ నుచ్చైశ్శ్రవముఁ బోనిమించు తెల్ల, తేజిపై నెక్కి తేజంబు తేజరిల్ల
వెడలు దిగ్విజయార్థియై వేదబాహ్య, గళితధర్మైకజీవాతు కలికిరౌతు.

29


సీ.

జోడన ల్ద్రొక్కించు శూరసేనాంగబంగాళము ల్పంచబంగాళముగను
జుట్టువేడెము వెట్టుఁ జోళమాళవగౌళపాంచాలములు పటాపంచ గాఁగ
రవగాలు నెఱపు సౌరాష్ట్రగూర్జరలాటమత్స్యభూములను దుమార మెగయ
నిబ్బరంబుగ నూకు నిషధమాగధసింధుమేదినీంద్రులు కంచుమించుఁ గాఁగఁ


తే.

గర్కకర్కశతరఖురాఘాతజాత, నూతనస్ఫీతరేఖికాజాతభూత
లోదరీమేదురీభూతసాదరార్పి, తాత్మనఖముఖభంగి మాయాతురంగి.

30


మ.

జవలీలాహసితానిలం బగుజిరాసంజోకగుఱ్ఱంబుమేల్
రవగాల్ జోడన చుట్టువేడెము లొనర్పం బుట్టుకెందూళికై
తవతౌరంగికఖడ్గఖండితసమస్తమ్లేచ్ఛతుచ్ఛాంగర
క్తవిలోలంబయి మించు భూతరుణికిం గాశ్మీరచర్చాకృతిన్.

31


క.

ఈరీతిఁ గల్కి జనసం, హారము గావించి తెలిసి మహిధర్ము వి
స్తారము సేయుననన్ విని, కౌరవముఖ్యుండు మునిశిఖామణి కనియెన్.

32


తే.

విష్ణుయశునకు విష్ణుఁ డావిర్భవింపఁ, గారణం బేమి యతఁ డెట్టిఘనతపంబుఁ
జేసెనొ తదీయచరితంబుఁ జెప్పు మనిన, వ్యాసమునిశిష్యుఁ డిటువలె నానతిచ్చె.

33


సీ.

అవనీశ తొల్లి స్వాయంభువమనువు బ్రహ్మర్షి లోకశరణ్యమైన నైమి
శారణ్యమునఁ దర్పకారి జటావాటి నలరు వేలుపుటేటివలెఁ దనర్చు
గోమతీద్వీపవతీమణితటమున ద్వాదశార్ణమనుమంత్రము జపంబు
సేయుచుఁ గలశాబ్ధిశాయిణ గూఱిచి పూర్ణతమనిష్ఠ మును లద్భుతంబు సెంద


తే.

దశశతాబ్దంబు లతిఘోరతప మొనర్ప
మెచ్చి కనువీనుకవణంబు మెక్కు పక్కి
జక్కిపై నెక్కి తనయిరుపక్కియలను
నలువ మొదలైనవేలుపు ల్బలసి కొల్వ
శౌరి యాతనియెదుట సాక్షాత్కరించె.

34


చ.

కమలదళాక్షుఁ డిట్లు దనకట్టెదుటం గనుపట్టినం బ్రమో
దము మదిఁ గ్రమ్మ నమ్మనువతంసము నేఁటికి నాతపంబు జ
న్మము ఫలియించెఁగా యని నమస్కృతులున్ నుతులున్ ఘటింప వేఁ
డుము వర మెట్టిదైన ననుడున్ విని యాతఁడు శౌరి కిట్లనున్.

35


సీ.

శతపత్రదళనేత్ర జననత్రయంబు మత్పుత్రుఁడవై నీవు పొడమవలయు
నా ధర్మసంస్థాపనము సేయ నీకు నే సుతుఁడనై జనియింప మతిఁ దలంతు
నన దశరథుఁ డయ్యె మనువు దొల్తఁ దదీయ జాయసుశీల కౌసల్య యయ్యె
హరి రాముఁ డయ్యె రెండవపరి దేవకీవసుదేవు లగుటయు వారియందుఁ


తే.

గృష్ణుఁడై విష్ణుఁ డుదయించె నింక విష్ణు, యశుఁడు దేవప్రభ యన గల్క్యంతమునను
వారె యుదయింపఁ గల్కియై శౌరి యవత, రించి కృతయుగచర్యఁ గావించఁగలఁడు.

36


క.

ఈకల్క్యవతారక్రమ, మాకర్ణించిన జను ల్సదారోగ్యశుభ
శ్రీకలితు లగుదు రతులగు, ణాకర జనమేజయక్షమాధ్యక్షమణీ.

37


సీ.

సకలసత్కవినితాష్టాదశవర్ణనాపూర్ణమై నవరసోదీర్ణ మగుచుఁ
గదళికాఫలపాకకమనీయభాషావిశేషమై కృతపరిశోష మగుచు
నశ్వమేధాదియాగాభోగఫలదానదక్షమై కృతిశతాధ్యక్ష మగుచు
భాగవతాగ్రణీపారంపరిభాగధేయమై సజ్జనగేయ మగుచుఁ


ఆ.

దనరు నీదశావతారమహాప్రబం, ధంబు వినినయట్టిధన్యమతులు
ధరణిఁ గృష్ణుకరుణ ధర్మార్థకామము, ల్గలిగి పిదప ముక్తిఁ గాంతు రధిప.

38


క.

అని శ్రీవైశంపాయన, ముని వినుపించినను భక్తి విని వేడుకతో
జనమేజయవిభుఁ డా, మునిసోమునిఁ గమలభవసముని బూజించెన్.

39


శా.

శ్రీమద్వేంకటమాభిధానవరపుత్రీరత్నపుత్రీవివా
హామేయోత్సవసుస్మితాస్యరఘుపత్యాక్యాత్మజాశ్లేషణో
ద్దామప్రేమరసాభిరామసతి సీతానామకన్యామణీ
హైమోదంచితడోలికాకలనవీక్షాయత్తచిత్తాంబుజా.

40


క.

ద్విడ్భోగధవళితాశా, రుడ్యామిన్యధిపకీర్తిరుచిరచిరసుధా
త్విడ్భోగధవళితాశా, కుండ్యాతరధర్మమర్మకోవిదహృదయా.

41


మత్తకోకిల.

హైమభూధరగౌరనీరజహంసమండలజైత్రదో
ర్దామకీర్తిరమాధురంధరరమ్యనీతియుగంధరా
భీమసారహృతాహితావనిభుగ్వసుందరరుగ్యజు
స్సామవేదవిశారదద్విజచాతకవ్రజకంధరా.

42


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట్ర
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణీదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిందరపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైన దశావతారచరిత్రంబను మహాప్రబంధంబునందు దశమాశ్వాసము.

ఇది పదియవ యవతారంబగు కల్క్యవతారము.

దశావతారచరిత్ర సర్వము సంపూర్ణము.