దశకుమారచరిత్రము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
దశకుమారచరిత్రము
ప్రథమాశ్వాసము
శ్రీరమణీగృహాంగణము చెన్ను వహింప న[1](లంకరింపఁ)గాఁ
దోరణముం బ్రదీపమును దోహలియై యొడఁగూర్చె నాఁ (దగం)
(?)జేరి యురంబునందుఁ దులసీవనమాలయుఁ గౌస్తుభంబు నొ
ప్పారఁగ నుల్లసిల్లు హరి యన్నమతిక్కని ధన్యుఁ జేయుతన్.1
ఉ. హారికపర్దకాంచనమయాచలసానువునందు నిర్జర
స్ఫారవిలాసముం గలుగు జాహ్నవిఁ దాల్చిన శంకరుండు నీ
హారకరావతంసుఁ డణిమాదిగుణప్రదవీక్షణుండు ది
క్పూరితకీర్తిశాలి యగు కొమ్మయతిక్కని గాచుఁగావుతన్.2
ఉ. విప్రకులప్రధానుఁడు పవిత్రచరిత్రు డుదాత్తవేదవి
ద్యాప్రతిపాలకుండు విబుధప్రకరాభిమతార్థసంవిధా
నప్రవణుండు సద్గుణసనాథుఁ డజుం డనిశంబు నాత్మసా
మ్యప్రతిపత్తిఁ దిక్కనిఁ జిరాయురధిష్ఠితకాయుఁ జేయుతన్.3
క. మేదుర తేజోరాజిత
రోదోవివరుండు కొట్టరువుతిక్కనికిన్
వేదత్రితయాత్మకునకు
నాదిత్యుం డొసఁగుఁగాత మభ్యుదయంబుల్.4
ఉ. గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసి పట్టి యా
మిక్కలి కంటికిం దనదు మిక్కిలిహస్తము మాటు సేసి యిం
పెక్కెడుబాల (కేళిఁ బరమేశ్వరుచి)త్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుఁగాన్.5
చ. జనకుఁడు పంచవక్త్రుఁ డనిశంబును నెన్నినప్రా(పుతోడఁబు
ట్టిన) గణనాథుఁ డింక నొకఁడే నను బోర జయించు నంచుఁ బెం
పొనర నమర్త్యశాత్రవుల నోర్చి వెలింగెడు నామయురవా
హనుఁడు మయూరసన్నిభమహాకవిఁ దిక్కనిఁ గాచుఁ గావుతన్.6
మ. తనదుర్వారతరప్రతాపమునఁ జిత్తస్నేహముల్ గట్టి సే
యునితం డెట్టి విదగ్ధుఁడో తలఁప నోహో యంచు లోకంబు గో
సనపుచ్చం గర మొప్పు దర్పకుఁడు రాజత్సుందరాకారు శో
భనసంపన్నుఁ గృతీశ్వరుం బ్రచురసౌభాగ్యాన్వితుం జేయుతన్.7
చ. అవయవ సంపద(ంగలిగి) యారయ నింద్రియగోచరత్వముం
దవులమి శక్తితత్త్వ(మును ద)త్త్వముఁ దానె యనంగనొప్పు భై
రవి జగదేకమాత ప్రచురస్థితి శక్తిసమగ్రుఁ జేయుతం
గవిజనరాజకీరసహకారముఁ గొట్టరు మంత్రి తిక్కనిన్.8
క. వాక్తా(మ్రపర్ణి)కవితా
మౌక్తిక(మణితార)హారమండనులగు త
త్ప్రాక్తనసుకవుల నియమా
త్యక్తుల వాల్మీకికాళిదాసులఁ గొల్తున్.9
వ. అని యిష్టదేవతాప్రార్థనంబును సుకవిచరణాభివందనంబు
నుం జేసి నారచియింపం బూనినకృతి కధీశ్వరుండైన కొట్ట
రువు తిక్కనామాత్యునకు నిజస్థానంబగు విక్రమసింహ
పురంబు వర్ణించెద.10
సీ. కరిఘటానిలయంబు తురగజన్మస్థలి
సుభటనివాసంబు సుకృతకర్మ
కర్మఠద్విజగణాకరము రాజన్యవం
శావాస మర్యవర్యాశ్రమంబు
కర్షకాగారంబు కవిబుధసదనంబు
సుందరీశృంగారమందిరంబు
ధనధాన్యసంగ్రహస్థానంబు ధర్మద
యాచారవిద్యావిహారభూమి
తే. తైలఘృతలవణాదిసద్ద్రవ్యపాల
మమలబహువిధరత్నరత్నాకరంబు
మధుజలపూరకాసారమండలంబు
నాఁగ విగ్రమసింహాఖ్యనగర మొప్పు.11
వ. అట్టి విక్రమసింహనగరంబున కధీశ్వరుండును రాజవేశ్యా
భుజంగనామాంకితుండును నైన మనుమసిద్ధిమహీవల్లభు
వంశావళివర్ణనం బెట్టి దనిన.12
క. సవితృకులంబున మును రా
ఘవకరికాళాదినృపనికాయముపిదపన్
బ్రవిమలయశోవిరాజత
భువనుండగు మనుమసిద్ధి భూపతి వుట్టెన్.13
ఉ. శ్రీవిభుఁడైన యామనుమసిద్ధికిఁ బుణ్యచరిత్రయైన శ్రీ
దేవికిఁ బుట్టెఁ దిక్కజగతీతలనాథుఁ డశేషలోకసం
భావితుఁడై ధరాభరము వాపఁగ నావసుదేవదేవకీ
దేవుల కుద్భవించి వినుతిం జెలువొందిన కృష్ణుఁడో యనన్.14
వ. ఇ ట్లుదయించి రాజ్యాభిషిక్తుం డైన యనంతరంబ.15
సీ. బలిమిచేఁ (బృథ్వీశుతలఁ ద్రుంచె) [2]సేవణ
కటకసామంతుల గర్వ మణఁచె
ద్రవిళమండలికు లందఱఁ దక్క నేలెఁ జో
డని నిజరాజ్యపీఠమున నిలిపెఁ
గర్ణాటవిభునహంకారంబు మాన్పించెఁ
బాండ్యునిచేతఁ గప్పంబు గొనియె
నేఱువమన్నీల [3]నెఱి పుట్టఁగా నేలె
వైరివీరుల నామలూర నోర్చె
తే. [4]త్రిభువనీరాయపెండారుఁ డుభయకటక
వీరుఁ డభినవభోజుఁ డాకారమదనుఁ
డవనిభారధౌరేయమహత్త్వవిజిత
దిక్కరీంద్రుండు చోడలతిక్కనృపతి.16
క. మరునకు ననిరుద్ధుఁడు శ్రీ
వరునకు మకరధ్వజుండు వసుదేవునకున్
హరి పుట్టినక్రియ నతనికి
జిరతరకీర్తితుఁడు మనుమసిద్ధి జనించెన్.17
వ. అతనిగుణవిశేషంబు లెట్టి వనిన.18
సీ. వీరారివర్గవిదారణక్రీడ న
ద్యతనజగత్ప్రాణసుతుఁ డనంగఁ
బరధనదారాపహరణానభిజ్ఞత
నూతనగంగాతనూజుఁ డనఁగ
నర్థార్థిజనవాంఛితార్థసంపూర్ణవి
తీర్ణిమై నభినవకర్ణుఁ డనఁగఁ
గామినీచిత్తాపకర్షకారణశుభా
కారసంపద వింతకంతుఁ డనఁగ
ఆ. ధీరతాగుణమున మేరుమహీధర
మన గభీరవృత్తి నబ్ది యనఁగఁ
వెలసె వైరిరాజవేశ్యాభుజంగాంక
భూషితుండు సిద్ధిభూవిభుండు.19
వ. ఇట్లు కీర్తిపాత్రంబైన మనుమసిద్ధిమహీవల్లభునకుఁ గరుణా
రసపాత్రంబైన కొట్టరువుతిక్కనామాత్యుండు నిజకుల
క్రమాగతంబగు మంత్రిపదవియందు వర్తిల్లుచు.20
ఆ. అందలంబు గొడుగు లడపంబు మేల్కట్టు
చామరములు జమిలిశంఖములును
గంబగట్లు భూమి కానికగాఁగఁ బెం
పెసఁగురాచపదవు లెల్లఁ బడసె.21
వ. ఇట్లు పడసి సమస్తసంవత్సమేతుం డై రాజ్యసుఖంబు లను
భవింపుచు నొక్కనాఁడు విద్వద్గరిష్ఠగోష్ఠీసమయంబునం
గావ్యదర్పణప్రతిబింబితమూర్తులైన మహాపురుషుల సద్వ
ర్తనంబులు విని పరమానందంబు నొంది కృతిపతిత్వంబు
కృతకృత్యభావంబుగా విచారించి.22
ఉ. ధీనిధి భాస్కరార్యునకు ధీరగుణాన్వితకొమ్మమాంబకున్
మానవకోటిలోపల సమస్తగుణములవాఁడు పెద్ద నా
వానికి వాఁడు పెద్ద యన వానికి వానికి వాఁడు పెద్ద నా
వానికి వార లిద్దఱకు వాఁ డధికుం డనఁ బుట్టి రాత్మజుల్.33
సీ. వివిధవిద్యాకేళిభవనభావంబున
జలజజుముఖచతుష్టయముఁ బోలి
విబుధవిప్రతిప త్తివిదళనక్రీడమై
జలశాయిభుజచతుష్టయముఁ బోలి
ధర్మమార్గక్రియాదర్శకత్వంబున
సన్నుతాగమచతుష్టయముఁ బోలి
పృథుతరప్రథితగాంభీర్యగుణంబున
శంబకాకరచతుష్టయముఁ బోలి
ఆ. సుతచతుష్టయంబు సుతి కెక్కె గుణనిధి
కేతనయును బారిజాతనిభుఁడు
మల్లనయును మంత్రిమణి సిద్ధనయు రూప
కుసుమమార్గణుండు గొమ్మనయును.34
వ. అం దగ్రనందనుండు.35
చ. కవితకు ముఖ్యుఁ డీతఁ డనఁ గామితవస్తువు లిచ్చువాఁడు నా
నవరసభావకుం డితఁ డనన్ బురుషార్థపరాయణుండు నా
నవు నన రాజనీతివిషయజ్ఞుఁ డితం డనఁ గీర్తిచంద్రికా
ధవళితదిక్కుఁ డై నెగడె ధన్యుఁడు కేతనమంత్రి యిమ్మహిన్.36
ఉ. మానిని బ్రహ్మమాంబకు నమాత్యశిఖామణి కేతశౌరికిన్
భూనుతకీర్తి భాస్కరుఁడు పుణ్యచరిత్రుఁడు మంత్రి గుండడున్
ధీనిధి నల్లసిద్ధియు నతస్థిరచిత్తులు ధర్మతత్పరు
ల్మానవనాథపూజ్యులు క్రమంబునఁ బుట్టిరి కీర్తనీయు లై.37
వ. అం దగ్రజుండు.38
క. నీతి సురాచార్యుం డన
దాతృతఁ గానీనుఁ డనఁ బ్రతాపంబునఁ బ్ర
ద్యోతనుఁ డన సచివాగ్రణి
కేతయభాస్కరుఁడు జగతిఁ గీర్తన కెక్కెన్.39
చ. గొనములప్రోక భాస్కరునకు బతిదేవత మారమాంబకున్
దినకరతేజులై తుహినదీధితిసన్నిభకాంతిమంతులై
వనధిగభీరు లై సుజనవందితు లై జనియించి రొప్పుగా
మనుచరితుండు కేతనయు మారసమానుఁడు మారశౌరియున్.40
క. శౌచంబున గంగాత్మజుఁ
డాచారంబున మరీచి యర్థుల కీగిన్
ఖేచరవల్లభుఁ డనఁగాఁ
బాచయకేతండు కీర్తిపాత్రం బయ్యెన్.41
ఆ. మారశౌరి రూపమహిమాస్పదంబున
మారుఁ బోలుఁ గూచిమారుఁ బోలు
వీరవైరిభయదవిక్రమక్రీడఁ గౌం
తేయుఁ బోలు వైనతేయుఁ బోలు.42
వ. భాస్కరామాత్యు ననుసంభవుండు.43
క. దండితరిపువర్గుఁడు గుణ
మండనమండితయశోరమారంజితభూ
మండలుఁ డన నుతి కెక్కెను
గుండామాత్యుండు విప్రకులతిలకుఁ డిలన్.44
చ. స్థిరవిభవుండు గుండనకు ధీరగుణాన్విత భూమిదేవికిన్
వరనుతకీర్తి మల్లనయు వందితబంధుఁడు కొమ్మఁడున్ దయా
కరుఁడగు సిద్ధఁడుం గుసుమకార్ముకసన్నిభమూర్తి కేతఁడున్
బరువడి నుద్భవించిరి శుభగ్రహసంశ్రితపుణ్యవేళలన్.45
వ. అం దగ్రజుండు.46
ఉ. రెండవ పుష్పబాణుఁ డధరీకృతకిన్నరభర్త ధిక్కృతా
ఖండలసూతి నిర్జితశకద్విషుఁ డండ్రు సురూపవైభవా
ఖండితశౌర్యదానముల గౌరవ మొందుట కారణంబుగా
గుండనికూర్మిపుత్రు గుణతోపదు మల్లని నెల్లవారలున్.47
క. ఆతని తమ్ముఁడు భువన
ఖ్యాతుఁడు కొట్టరువు కొమ్మఁ డబలాచేతో
జాతుండు దానవైభవ
నూతనజీమూతవాహనుం డన వెలసెన్.48
క. కొమ్మామాత్యుని కూరిమి
తమ్ముఁడు సిద్ధనకు నితరదండేశులు స
త్యమ్మునఁ జాగమ్మున శౌ
చమ్మున శౌర్యమున రూపసంపద నెనయే.49
క. ఆతని యనుంగుఁదమ్ముడు
కేతన బహుసత్కళానికేతనుఁడు దశా
శాతటవిలసత్కీర్తి
ద్యోతితభువనుండు నాఁగ నున్నతిఁ దాల్చెన్.50
వ. ఆగుండనామాత్యు ననుసంభవుండు.51
క. సకలకళాపారంగతుఁ
డకుటిలచిత్తుఁడు నిజాస్వయాంభోనిధిశీ
తకరుఁడు ప్రకటయశోధనుఁ
డకలంకుఁడు నల్లసిద్ధనామాత్యుఁ డిలన్.52
క. వినయనిధి నల్లసిద్ధికి
వనజానన యచ్చమకుఁ బ్రవర్ధితకీర్తుల్
జనియించిరి కేతనమ
ల్లన లనఁగా వివిధసత్కళాకోవిదులై.53
క. ధూతకలంకుఁడు విద్వ
త్ప్రీతికరుఁడు దురితతిమిరదిననాథుఁడు జై
వాతృకసమసౌమ్యాకృతి
కేతన యన నల్లసిద్ధికేతన వెలసెన్.54
ఆ. ఎల్లగుణములందు నితని కీతఁడె సరి
గాక సదృశు లొరులు గలరె యనఁగ
నల్లసిద్ధిసుతుఁడు మల్లనామాత్యుండు
వినుతి కెక్కె సూరిజనుల సభల.55
వ. ఇట్టి సంతానంబువలన వెలుంగు కేతనామాత్యు ననుసంభ
వుం డైన మల్లనార్యుగుణవిశేషంబు లెట్టి వనిన.56
ఉ. బల్లిదుఁడే వృకోదరుఁడు భాగ్యసమగ్రుఁడె కిన్నరేశ్వరుం
డుల్లసితప్రతాపగుణయుక్తుఁడె పంకజబాంధవుండు వా
గ్వల్లభుఁడే విరించి సుభగత్వమనోజ్ఞుఁడె మన్మథుండు మా
మల్లనమంత్రి మంత్రిజనమండనుఁ బేర్కొని చెప్పి చెప్పుచోన్.57
క. పరమదయాపరతంత్రుఁడు
హరిపూజావరుఁడు మల్లనామాత్యునకున్
సరసిజముఖి మాచమకున్
జిరవిభవాస్పదుఁడు మనుమసిద్ధి జనించెన్.58
వ. ఆతనిగుణంబు లెట్టి వనిన.59
సీ. సుకవిజిహ్వాచకోరికలకుఁ దనకీర్తి
పదనైన చంద్రాతపంబు గాఁగ
నాపదార్తజనసస్యములకుఁ దనకృపా
దానాంబు వమృతంపుసోన గాఁగ
వనితాజనులచూపు లనుతూఁపులకుఁ దన
ప్రన్ననిమేను లెప్పంబు గాఁగ
మహనీయనృపనీతిమణులకుఁ దనమాట
లాలితశాఖోపలంబు గాఁగ
ఆ. వినుతి కర్హుఁ డయ్యె వివిధవిద్యాభ్యాస
చరితుఁ డభవచరణసరసిజాత
మధుకరాయమాణమానసుం డప్రతి
మానవిమలబుద్ధి మనుమసిద్ధి.60
వ. ఆమల్లనామాత్యు ననుసంభవుండు.61
ఉ. స్థాపితసూర్యవంశవసుధాపతి నాఁ బరతత్త్వధూతవా
ణీపతి నా నుదాత్తనృపనీతిబృహస్పతి నా గృహస్థగౌ
రీపతి నాఁ గృపారససరిత్పతి నాఁ బొగడొందె సిద్ధిసే
నాపతి చోడ తిక్కజననాథశిఖామణి కాప్తమంత్రియై.62
క. సామాద్యుపాయపారగుఁ
డాముష్యాయణుఁడు సిద్ధనామాత్యునకున్
తే. జగతి నుతి కెక్కె రాయవేశ్యాభుజంగ
రాజ్యరత్నాకరస్ఫూర్తి రాజమూర్తి
గంధవారణబిరుదవిఖ్యాతకీర్తి
దినపతేజుండు సిద్ధయతిక్కశౌరి.66
తే. అతఁడు పతిహితారుంధత నన్వయాంబు
నిధినిశాకరరేఖ ననింద్యచరిత
సకలగుణగణాలంకృత జానమాంబ
వనజలోచనఁ బ్రీతి వివాహమయ్యె.67
క. అమ్మంత్రి తిక్కనార్యున
కమ్మగువకు సద్గుణాడ్యుఁ డగు సిధ్ధనయున్
గొమ్మనయును నిమ్మడియును
ముమ్మడియును నుదయ మైరి మోదం బెసఁగన్.68
వ. అం దగ్రజుండు.69
సీ. ఇందిరాసుతుచంద మిట్టిది యననేల
యీతనిరూపంబుఁ జూతురేని
యమకభూరుహ మిట్టి దననేల యీతని
చాగంబునకుఁ గేలు సాఁతురేని
యమృతసేచన మిట్టి దననేల యితనికృ
పాదృష్టి బెరయఁ జొప్పడుదురేని
మనుమార్గ మది యిట్టి దననేల యితనిస
ద్వృత్తగౌరవము భావింతురేని
తే. యని యనేకవిధంబుల నఖిలజనులు
తనసమస్తగుణంబులు తగిలి పొగడ
ఆ. వీఁడె కాని యొరుఁడు లేఁడు లోకంబుల
నని యనేకవిధుల నఖిలజనులు
పొగడ నెగడె సుకవిపుంజకంజాకర
భాస్కరుండు మంత్రి భాస్కరుండు.75
ఉ. ఆతతనీతిసంపద విహంగమపుంగవకేతుఁ జెప్పుచోఁ
గేతనఁ జెప్పి యుద్ధవిజిగీషను వానరకేతుఁ జెప్పుచోఁ
గేతనఁ జెప్పి దిగ్వలితకీర్తిరతిన్ వృషకేతుఁ జెప్పుచోఁ
గేతనఁ జెప్పి కాక ధరఁ గేవలమర్త్యులఁ జెప్పఁబోలునే.76
క. లోలుఁడు కీర్తికిఁ బరభూ
పాలసచివకార్యతుహినపటలీభానుం
డాలానము జయహస్తికిఁ
బోలమమల్లుండు ప్రకృతిపురుషుఁడె తలఁపన్.77
శా. పారావారపరీతధాత్రి వినుతింపంబోలు మల్లాంకునిన్
సారోదారయశోభిరాము బహుశాస్త్రప్రౌఢు శస్త్రాస్త్రవి
ద్యారాజన్నిజబాహువిక్రము నుదాత్తస్వాంతు ధర్మక్రియా
చారాపాస్తసమస్తదోషనివహున్ జౌహత్తనారాయణున్.78
చ. ఉరవడి నుగ్రసేవణపయోనిధి బాడబవహ్ని చాడ్పునన్
దరికొని కుంభజన్ముక్రియఁ ద్రాగి రఘుక్షితినాథుమాడ్కి న
చ్చెరువుగ నింకఁ జేసె నని చెప్పు జనప్రకరంబు విక్రమా
భరణుని సిద్ధనార్యసుతుఁ బాచని నన్ననగంధవారణున్.79
క. [5]ఇమ్మడిఖచరాధీశ్వరుఁ
డిమ్మడిదిననాథుతనయుఁ డిమ్మడిగుప్తుం
డిమ్మడి బలీంద్రుఁ డనఁగాఁ
బెమ్మఁడు వితరణగుణమునఁ బెంపు వహించెన్.80
వ. ఇట్టి సంతానవంతుఁడైన సిద్ధనామాత్యుననుసంభవుండు.81
సీ. స్వారాజ్యపూజ్యుఁడో కౌరవాధీశుఁడో
నాఁగ భోగమున మానమున నెగడె
రతినాథుఁడో దీనరాజతనూజుఁడో
నాఁగ రూపమున దానమున నెగడె
ధరణిధరేంద్రుఁడో ధర్మసంజాతుఁడో
యనఁగ ధైర్యమున సత్యమున నెగడె
గంగాత్మజన్ముఁడో గాండీవధన్వుఁడో
యనఁగ శౌచమున శౌర్యమున నెగడె
తే. సూర్యవంశభూపాలకసుచిరరాజ్య
వనవసంతుండు బుధలోకవత్సలుండు
గౌతమాన్వయాంభోనిధిశీతకరుఁడు
కులనిధానంబు కొట్టరుకొమ్మశౌరి.82
క. అతఁడు రతిఁ జిత్తసంభవు
గతి రోహిణిఁ జంద్రుమాడ్కిఁ గమలావాసన్
శతదళలోచనుక్రియ న
ప్రతిమాకృతి నన్యమాంబఁ బరిణయమయ్యెన్.83
వ. అక్కులవధూరత్నంబు గుణవిశేషంబు లెట్టి వనిన.84
సీ. పతిభక్తి నలయరుంధతి పోలెనేనియు
సౌభాగ్యమహిమ నీసతికి నెనయె
సౌభాగ్యమున రతి సరియయ్యెనేని భా
గ్యంబున నీయంబుజాక్షి కెనయె
భాగ్యంబునందు శ్రీ ప్రతియయ్యెనేనియుఁ
దాలిమి నీలతాతన్వి కెనయె
తాలిమి భూదేవి తగ సాటియగునేని
నేర్పున నీపద్మనేత్ర కెనయె
తే. యని యనేకవిధంబుల నఖిలజనులు
పొగడ నెగడెఁ గృపాపరిపూరితాంత
రంగ కొమ్మనామాత్యు నర్ధాంగలక్ష్మి
యఖిలగుణగణాలంకృత యన్యమాంబ.85
క. ఆరమణి పరమపావన
నీరజభవనాన్వయాంబునిధిచంద్రిక పూ
ర్వారాధితదేవత యా
గౌరవ మభివృద్ధి పొంద గర్భము దాల్చెన్.86
సీ. గర్భితనవసుధాకరపయోనిధిమాడ్కి
సతిమేను పాండురచ్ఛవి వహించెఁ
గలితభృంగాబ్జకుట్మలయుగ్మకముపోల్కిఁ
గాంతచన్ముక్కులఁ గప్పు మిగిలె
మకరందసంవాహమలయానిలునిక్రియ
నంబుజాననగతి యలస యయ్యె
నుచితకాలాగమనోజ్జ్వలకుసుమంబు
గతి నింతినాభి వికాస మొందె
ఆ. వళులు విరిసె గౌను బలిసె గోర్కులు మది
సందడించె నారు నంద మయ్యె
ననుపమానభాగ్య యగు నన్యమాంబకు
వర్ణనీయగర్భవైభవమున.87
వ. ఇట్లు గర్భలక్షణలక్షితాంగియై నవమాసంబులు పరిపూర్ణంబు
లైన శుభముహూర్తంబున సుపుత్రుం బడసిన నతండు
జాతకర్మప్రముఖసంస్కారానంతరంబున వేదాదిసమస్త
విద్యాభ్యాసవిభాసి యగుచు ననుదినప్రవర్ధనంబుఁ జెంది
తుహినభానుండునుం బోలె బహుకళాసంపన్నుండును
గార్తికేయునింబోలె నసాధారణశక్తియుక్తుండును నధరీ
కృతమయూరుండును నై పరమేశ్వరుండునుం బోలె లీలావి
నిర్జితకుసుమసాయకుండును నకలంకవిభూత్యలంకృతుండు
ను నై నారాయణుండునుంబోలె ననంతభోగసంశ్లేషశోభిత
గాత్రుండును [6]గ్రతుపురుషత్వప్రసిద్ధుండును లక్ష్మీసమా
లింగితపక్షుండును నై వెలసె నాతిక్కనామాత్యు గుణవిశే
షంబు లెట్టి వనిన.88
సీ. సుకవీంద్రబృందరక్షకుఁ డెవ్వఁ డనిన వీఁ
డను నాలుకకుఁ దొడ వైనవాఁడు
చిత్తనిత్యస్థితశివుఁ డెవ్వఁ డనిన వీఁ
డను శబ్దమున కర్థ మైనవాఁడు
దశదిశానిశ్రాంతయశుఁ డెవ్వఁ డనిన వీఁ
డని చెప్పుటకుఁ బాత్ర మైనవాఁడు
సకలవిద్యాకళాచణుఁ డెవ్వఁ డనిన వీఁ
డని చూపుటకు గుఱి యైనవాఁడు
తే. మనుమసిద్ధిమహేశసమస్తరాజ్య
భారధౌరేయుఁ డభిరూపభావభవుఁడు
కొట్టరువుకొమ్మనామాత్యు కూర్మిసుతుఁడు
దీనజనతానిధానంబు తిక్కశౌరి.89
క. అగు ననఁ గొమ్మయతిక్కఁడు
జగతి నపూర్వార్ధశబ్దచారుకవితమై
నెగడిన "బాణోచ్ఛిష్టం
జగత్త్రయం” బనినపలుకు సఫలం బయ్యెన్.90
క. కృతులు రచియింప సుకవుల
కృతు లొప్పఁ గొనంగ నొరునికిం దీరునె వా
క్పతినిభుఁడు వితరణశ్రీ
యుతుఁ డన్యమసుతుఁడు తిక్కఁ డొక్కఁడు దక్కన్.91
క. అభినుతుఁడు మనుమభూవిభు
సభఁ దెనుఁగున సంస్కృతమునఁ జతురుం డై తా
నుభయకవిమిత్రనామము
త్రిభువనముల నెగడ మంత్రితిక్కఁడు దాల్చెన్.92
సీ. సరసకవీంద్రుల సత్ప్రబంధము లొప్ప
గొను నను టధికకీర్తనకుఁ దెరువు
లలితనానాకావ్యములు చెప్పు నుభయభా
షలయందు ననుట ప్రశంసత్రోవ
యర్ధిమై బెక్కూళ్ల నగ్రహారంబులు
గా నిచ్చు ననుట పొగడ్తపొలము
మహితదక్షిణలైన బహువిధయాగంబు
లొనరించు ననుట వర్ణనము [7]చొప్పు
తే. పరుని కొకనికి నిన్నియుఁ బ్రకటవృత్తి
నిజములై పెంపు సొంపారి నెగడు నెట్టు
కొమ్మనామాత్యు తిక్కనికొలఁది సచివుఁ
డింక నొక్కరుఁ డెన్నంగ నెందుఁ గలఁడు.93
షష్ఠ్యంతములు
క. ఈదృశగుణభూషణునకు
వేదాదిప్రకటవివిధవిద్యాభ్యాసా
పాదితమహత్త్వునకు బల
సూదనవిభవునకు సతతశుద్ధాత్మునకున్.94
క. శ్రీమంతునకు నిరర్గళ
ధీమంతున కధ్వరాబ్జదిననాథునకున్
సామాద్యుపాయవిదునకు
నాముష్యాయణున కంగజాకారునకున్.95
క. చతురాననసన్నిభునకు
సతతస్వాహాస్వధాదిశబ్దద్వయసం
స్కృతహవ్యకవ్యసంత
ర్పితమఖశిఖాముఖనిలింపపితృవర్గునకున్.96
క. హృద్భవనిభమూర్తికిఁ బ
ద్మోద్భవవంశాగ్రణికి నయోన్నతునకు వి
ద్వద్భోగ్యభాగ్యునకు గుణ
సద్భావజ్ఞునకు నీతిచాళుక్యునకున్.97
క. [8]భాస్వద్గుణవితరణజిత
భాస్వత్తనయునకు వినయపరునకుఁ గరుణా
ర్ద్రస్వాంతునకు ననూనత
పస్స్వాధ్యాయాదిసుకృతపరిపాకునకున్.98
క. సన్మానసమగ్రునకు వి
యన్మణితేజునకుఁ బరహితార్థికి సద్ధ
ర్మోన్మననాన్వితకీర్తికి
మన్మక్ష్మాపాలమంత్రిమాణిక్యునకున్.99
క. విద్యావైశారద్యస
ముద్యోతితమతికి బుణ్యమూర్తికి దివిష
న్నద్యంబువిమలయశునకు
బద్యాదిత్రివిధకావ్యపారీణునకున్.100
క. అన్యమవరసుతునకు సౌ
జన్యాభరణునకు నభవచరణాంభోజా
తన్యస్తచిత్తునకు నృప
మాన్యునకును గవిసరోజమార్తాండునకున్.101
శా. తేజోరాజితసర్వలోకునకు భూదేవాన్వయాంభోజినీ
రాజీవాప్తున కాగమప్రథితకర్మప్రస్ఫురత్కీర్తికిన్
బూజాతర్పితరాజశేఖరునకున్ బుష్పాస్త్రరూపోపమా
రాజన్తూర్తికి దోషదర్పదమనారంభైకసంరంభికిన్.102
క. దేవేంద్రవిభవునకు భూ
దేవకులాగ్రణికి భారతీసుస్థితిసం
భావితవదనసదనునకు
సేవాతర్పితశశాంకశేఖరున కిలన్.103
మాలిని. కనకగిరితటీసంకాశవకుస్స్థలీభా
గునకు భజనవృత్తక్షోణిదేవాదరోద్య
ద్ఘనయశునకు మన్మక్ష్మాపతిప్రాజ్యరాజ్యాం
బునిధిశశికి వాణిస్ఫూర్తిమన్మూర్తి కుర్విన్.104
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలసదభినవదండి
నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
చరితంబను మహాకావ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.