శివపురాణము/సతీ ఖండము/దక్షుడు పునర్జీవితుడగుట
"పరమేశా! నన్ను మన్నించాలి! వీరావేశంలో నేను దక్షుని శిరస్సు తెగటార్చినపుడు, అది యజ్ఞగుండమందు ఎగిరిపడింది. ఆనవాలు మిగలకనే భస్మమైపోయింది. తాము సెలవిస్తే, ఒక మేక శీర్షం ఉన్నది కనుక అది తీసుకురాగలను" అని నివేదించాడు వీరభద్రుడు.
ఒక్కక్షణం.. యోచించి, సరేనన్నాడు శివుడు. తక్షణం ఆ పని ఆచరించాడు వీరభద్రుడు. సాక్షాత్తు మహేశ్వరునిచే ప్రాణ ప్రతిష్టాపన గావించబడిన దక్షుడు పునర్జీవితుడై, బ్రహ్మకు బ్రహ్మానందం కలిగించాడు.
తన పునర్జీవానికి కారకుడైన, సర్వేశ్వరుణ్ణి వినయ వందనాలతో వీక్షించి "సనాతనమూర్తీ!ఆదిదేవా!సకలలోక రక్షకా! జగన్మంగళ మూర్తీ! ఈ పేర్లన్నిటికీ ఏకైక అర్హత గలిగియున్న నీపట్ల నేను ఆచరించిన అపరాధమునకు నన్ను మన్నించ పునఃపునః ప్రార్ధన. అన్ని పాపములను పోగొట్టు హరుడను పేరు సార్ధక నామధేయుడవై సదాశివా! నీకిదే అంజలి" అంటూ సాగిలపడ్డాడామేషముఖ దక్షుడు.
దయా దృక్కులతో వీక్షిస్తూ "దక్షప్రజాపతీ! ఒక గొప్ప దివ్యోపదేశము గావించుచుంటిని! వినుము! ఈ లోకములో నాభక్తులు నాలుగు విధములుగా నుందురు. వారెవరెవరనగా... ఆర్తులు, జిజ్ఞా సువులు, అర్ధాతురులు, జ్ఞానులు.
వీరిలో మొదటివారైన ఆర్తులు మాయామేయ జగత్తునందు ఆపదలు కలగగానే ఆర్తితో తమ్ముకాపాడ వలసిందిగా వేడుకోగా, వారి పట్ల ఆర్తత్రాణ పరాయణుడ నగుచున్నాను.
రెండవ వారు జిజ్ఞాసువులు. వీరికి నాయందు గల అపారమైన భక్తిచేత శివ మయమైనట్లుగానే కనిపించే సర్వపదార్ధముల యందు నన్ను వెతుకుతూనే ఉంటారు. నన్ను శోధిస్తూనే ఉంటారు. వీరిలో ఇంకా జ్ఞానదశ అంకురస్థాయిలోనే ఉంటుంది. అందువల్ల అంతలోనే మాయకు లొంగిపోతూ - దాన్ని పునః చేదిస్తూ నా తత్వ జిజ్ఞాస (తెలుసుకోవాలనే కోరిక)లో పడుతూఉంటారు.
ఇక మూడవ శ్రేణి అర్ధాతురులు. భౌతిక ప్రపంచంలో జీవించడానికి అవసరమైన సకల అర్ధాలను (ధన, విజ్ఞా, భోగాదులు) అతృతతో కోరుతుంటారు.
చివరిదీ - శ్రేష్ఠమయినదీ జ్ఞాన విభాగం. ఈ శ్రేణిలోకి వచ్చే నా భక్తులు సామాన్యులవలె యోచించరు. జ్ఞానములేకూండా నన్ను పూజించుట - స్మరించుట వృధా! నీవు కేవలం కామ్యకర్మలు ఆచరించ బూనుకొన్నావు. కర్మతో ఈ సంసారమును తరింపదలచావు. జపదాన యజ్ఞాదులు కర్మఫలములుగోరి చేయువారు అజ్ఞానులు. జ్ఞానము కలుగచేసే కర్మ ద్వారానే 'శివతత్త్వం' అని చెప్పబడే నా అఖండతత్త్వం అవగతం కాగలదు" అని బోధచేశాడు.
ఈ మహత్తర ఉపదేశం, సాక్షాత్ శివముఖ నిర్గత భాషణంబైన వాగ్భూషణం. బాగా దీన్ని అవగతం చేసుకున్న మహామునులు మొదలగు వారంతా జ్ఞానులయ్యారు. బ్రహ్మ కూడా తన కుమారునికి ఉచితరీతిని బోధలు చేసి తన లోకానికి పయనమయ్యాడు. అంతటా శాంతి వెల్లి విరిసింది.
వాస్తవానికి సతీదేవి మరణించినట్లుగా భావించరాదు. ఆమె దాక్షాయణిగా, తన అంశ చాలించింది! ఒక గొప్ప పరసాధన కోసం ఆమె సతీదేవి అవతారాన్ని విరమించింది. ఆ సాధనకోసం ఆమె మరొక అవతారం ఎత్తవలసి ఉంది" అంటూ ఆనాటికి సంధ్యచాయ లలము కొనడంతో కథాశ్రవణం చాలించాడు సూతమహర్షి. అంతా తమ - తమ విధి విహిత కృత్యాలలో నిమగ్నమయ్యారు.
సతీఖండము సంపూర్ణం