దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/భూగోళము



1

భూగోళము

ఆఫ్రికా ప్రపంచమందుగల అతి పెద్ద మహాద్వీపాల్లో ఒకటి. భారతదేశం కూడా ఒక మహాద్వీపం వంటిదే కాని ఆఫ్రికా యందలి భూభాగంలో నాలుగు లేక అయిదు భారత దేశాలు విస్తీర్ణత దృష్ట్యా పట్టే అవకాశం వున్నది. ఇది ఆఫ్రికాకు తిన్నగా దక్షిణదిక్కున నెలకొని యున్నది. భారత దేశంవలె ఆఫ్రికా కూడా ఒక ద్వీపమే. దక్షిణాఫ్రికా యొక్క అధిక భాగాన్ని సముద్రం ఆని యున్నది. ఆఫ్రికాలో ఎండవేడిమి ఎక్కువ అని అంటారు. ఒక విధంగా అది నిజమే. భూమధ్య రేఖ ఆఫ్రికా మధ్యగా వెళ్లుతుంది. ఆ రేఖకు అటునిటుగల దేశాలలో కాచే ఎండ ఎంత తీవ్రంగా వుంటుందో భారతీయులు ఊహించలేరు. భారత దేశంలో దక్షిణాదిన కొన్ని చోట్ల కాచే ఎండలు భరిస్తున్నాం కనుక ఆఫ్రికా యందు కాచే ఎండల తీవ్రతను కొద్దిగా అంచనా చేయవచ్చు. దక్షిణాఫ్రికాలో యిట్టి స్థితి లేదు. అది భూమధ్య రేఖకు దూరంగా వున్నది. అక్కడి శీతోష్ణస్థితి సమంగా ఎంతో హాయిగా వుంటుంది. ఆ దేశం ఎంతో అందంగా వుంటుంది. అందువల్ల యూరప్ దేశాల ప్రజలు అక్కడ హాయిగా నివసిస్తారు. మన భారతదేశంలో ఆ విధంగా వాళ్లు వుండలేరు.

దక్షిణాఫ్రికాలో టిబెట్, కోశ్మీరుల వంటి ఎత్తైన ప్రదేశాలు వున్నాయి కాని అవి టిబెట్ కాశ్మీరులవలె 14 లేక 15 వేల అడుగుల ఎత్తున లేవు అందువల్ల అక్కడి శీతోష్ణస్థితి సహించుటకు వీలుగా, చల్లగా హాయిగా వుంటుంది. దక్షిణాఫ్రికాయందలి కొన్ని ప్రదేశాలు క్షయ రోగులకు అత్యుత్తమమైనవని ప్రతీతి. అట్టివాటిల్లో ఒకటి దక్షిణాఫ్రికాకు చెందిన సువర్ణపురి జోహన్స్‌బర్గ్. ఏ భూభాగం మీద జోహన్స్ బర్గ్ నగరం వున్నదో, ఆ భూభాగంలో 50 ఏండ్ల క్రితం ఏమీ లేదు. గడ్డి గాదం మొలిచే ప్రదేశంగా వుండేది. అక్కడ బంగారు గనులు వున్నాయని తెలిసే సరికి పలు భవనాలు వెలిశాయి. యిప్పుడు అక్కడ విశాలమైన భవనాలే భవనాలు. అక్కడి ధనవంతులు బాగా డబ్బు ఖర్చుచేసి దేశ దేశాలనుంచి మొక్క ఒకటింటికి 15 రూపాయల చొప్పున అనేకమొక్కలు తెప్పించి నాటారు. గత చరిత్ర తెలియని వాళ్లు అక్కడకు వెళ్లితే ఆ చెట్లు శతాబ్దాలనుంచి అక్కడ వున్నాయని అనిపిస్తుంది.

దక్షిణాఫ్రికా భూభాగాలన్నింటిని గురించి యిక్కడ వ్రాయతలచలేదు. విషయానికి సంబంధించిన ప్రదేశాలను గురించి మాత్రం వ్రాస్తాను. దక్షిణాఫ్రికాలో రెండు ప్రభుత్వాల వాళ్లు వున్నారు. 1 బ్రిటిష్ వాళ్లు 2 పోర్చుగీజులు. పోర్చుగీజుల భాగాన్ని డెలాగోవానే అని అంటారు. భారతదేశాన్నుంచి వెళ్లే ఓడలకు మొదటి హార్బరు అదే. అక్కడి నుంచి దక్షిణ దిక్కుకు ముందుకు వెళ్లితే బ్రిటిష్ వారి ప్రాంతం నేటాల్ వస్తుంది. అక్కడి హార్బరును పోర్ట్ నేటాల్ అని అంటారు. అయితే మనం దాన్ని డర్బన్ అని అంటాం, దక్షిణాఫ్రికాలో కూడా దాన్ని డర్బన్ అని అంటారు. అది నేటాల్ దేశమందలి పెద్ద నగరం. పీటర్ మెరిత్స్ బర్గ్ నేటాలుకు రాజధానీ నగరం. అది డర్బనుకు 60 మైళ్ల దూరాన, సముద్రం మట్టం నుంచి సుమారు రెండు వేల అడుగుల ఎత్తున వున్నది. డర్బన్ శీతోష్ణస్థితి దరిదాపుగా బొంబాయి నగరపు శీతోష్ణస్థితిని పోలి వుంటుంది. బొంబాయి కంటే అక్కడి గాలిలో చల్లదనం అధికంగా వుంటుంది. నేటాలును వదిలి యింకా పైకి వెళ్లితే ట్రాన్స్‌వాల్ వస్తుంది. ట్రాన్స్‌వాల్ భూభాగం యిప్పుడు ప్రపంచానికంతటికి అత్యధికంగా బంగారం అందజేస్తున్నది. కొద్ది ఏండ్లకు పూర్వం అక్కడ వజ్రాల గనులు కూడా దొరికాయి. అక్కడ ఒక గనియందు అతిపెద్ద వజ్రం ఒకటి దొరికింది. ప్రపంచంలో కెల్లా అది పెద్దదైన యీ వజ్రం పేరు ఆ గని యజమాని పేరట క్లీనన్ అని పెట్టారు. యీ వజ్రం బరువు 3000 కేరెట్లు వున్నది కోహినూర్ వజ్రం బరువు 100 కేరెట్లే. రష్యా కిరీటమందలి ఆర్లెఫ్ వజ్రం బరువు 200 కేరెట్లు.

జోహాన్స్‌బర్గ్ బంగారు నగరమే బంగారు గనులు కూడా దానికి సమీపంలోనే వున్నాయి. అయినా అది ట్రాన్స్‌వాలుకు రాజధాని కాదు. ట్రాన్స్‌వాలుకు రాజధాని ప్రిటోరియా. అది జోహన్స్‌బర్గ్‌కు 36 మైళ్ల దూరాన వున్నది. పరిపాలకులు, వాళ్లకు సంబంధించిన వాళ్లు అక్కడ వుంటారు, అందువల్ల ప్రిటోరియాలో వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. జోహన్స్‌బర్గ్ వాతావరణం మాత్రం అశాంతిగా వుంటుంది. భారతదేశంలో ఏదేని గ్రామాన్నుంచి గాని, చిన్న పట్టణాన్నుంచిగాని ఎవరైనా బొంబాయి వెళ్లితే అక్కడి హడావుడి, వాహనాల రద్దీ, జనసందడి చూచి అదిరిపోయినట్లే ట్రాన్స్‌వాల్‌నుంచి మనిషి జోహన్స్ బర్గ్ వెళ్లితే అదిరిపోతాడు. జోహన్స్‌బర్గ్ ప్రజలు నడవరు, పరుగెత్తుతారు అని చెప్పవచ్చు. అందు అతిశయోక్తి ఏమాత్రమూ లేదు. తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించడమా అనే అక్కడి ప్రతివాడి తపన. ట్రాన్స్‌వాల్ దాటి యింకా లోపలికి వెళ్లితే నారింజ పండ్లనిలయం అరంజియా వున్నది. దాని రాజధాని పేరు బ్లూమ్‌ఫోంటిన్. అదిచిన్న ప్రశాంతమైన సుందర నగరం. అక్కడ బంగారం, వజ్రాల గనులు లేవు. అక్కడి నుంచి కొద్ది దూరం రైలు ప్రయాణం చేస్తే కేప్ కాలనీ సరిహద్దు దగ్గరకు చేరుతాం. కేప్‌కాలనీ దక్షిణాఫ్రికా యందలి అతిపెద్ద అధినివేశరాజ్యం. దాని రాజధాని పేరు కేప్‌టౌన్. అది కేప్ కాలనీ యందుగల పెద్దహార్బరు. ఇది కేప్ ఆఫ్‌గుడ్‌ హోఫ్ (మంచి ఆశాద్వీపం) అనుదీవియందు వున్నది. యీ పేరు పోర్చుగీసు రాజు జాన్ పెట్టాడు. వాస్కోడిగామా దీన్ని అన్వేషించాడు. యిక్కడి నుంచి తమ వాళ్లు భారతావని చేరుటకు సులవైన దగ్గరిమార్గం దొరుకుతుందని రాజు భావించడమే అందుకు కారణం భారతావని చేరడం ఆకాలంలో సముద్రయాత్రలకు చివరి లక్ష్యం.

ఈ నాలుగు బ్రిటిష్ వారి అధినివేశరాజ్యాలు. యివిగాక బ్రిటిష్ వారి పరిపాలనలో మరికొన్ని ప్రదేశాలు కూడా వున్నాయి. యూరోపియన్లు రాకపూర్వం దక్షిణాఫ్రికా దేశవాసులు అక్కడ వుంటూ వుండేవారు.

దక్షిణాఫ్రికాలో ముఖ్యవృత్తి వ్యవసాయమే. వ్యవసాయానికి అది అనువైన దేశం. అక్కడి కొన్ని ప్రాంతాలు ఎంతో సారవంతమైనవి. అక్కడ తేలికగా పండేపంట మొక్కజొన్న. దక్షిణాఫ్రికా యందలి హబ్షీప్రజల ప్రధాన ఆహారం మొక్కజొన్నయే కొన్ని చోట్ల గోధుమలు కూడా పండుతాయి. దక్షిణాఫ్రికా పండ్లకు బహుప్రసిద్ధి నేటాలులో అరటి, బొప్పాయి, అనన్సాసపుండ్లు అధికంగా లభిస్తాయి. కడుపేదవారు సైతం ఆ పండ్లుకొని తినగలిగినంత చౌకగా వుంటాయి. నేటాలు, మరియు తదితర రాజ్యాలలో నారింజ, బత్తాయిలు, ఎప్రికోట్ పండ్లు అత్యధికంగా లభిస్తాయి. గ్రామాల్లో చాలామంది పేదవారు సైతం యీ పండ్లు తింటారు. అక్కడ పండ్లు కారుచౌక కేఫ్ టౌన్ ద్రాక్ష పండ్లకు నిలయం. అక్కడ దొరికినంతగా ద్రాక్ష మరో చోట దొరకదు ద్రాక్షపండ్లు అమిత చౌకగా లభిస్తున్నందున కటిక పేదవాళ్ళు సైతం ద్రాక్ష తినగలిగిన స్థితిలో వున్నారు. భారతీయులు ప్రవేశించడం. మామిడిపండ్లు లభించడం సహజం భారతీయులు దక్షిణాఫ్రికాలో మామిడి మొక్కలు నాటారు యిప్పుడు దక్షిణాఫ్రికాలో మామిడిపండ్లు కూడా అధికంగా లభిస్తున్నాయి. రకరకాలమేలు రకం మామిడిపండ్లు, బొంబాయి, మామిడిపండ్లతో పోటీ పడగలిగినంతగా దొరుకుతున్నాయి. అక్కడ కూరలు బాగా లభిస్తాయి. భారతీయులు రకరకాల కూరకాయలు అధికంగా కాయిస్తున్నారని చెప్పవచ్చు

పశువులు కూడా అక్కడ ఎక్కువే భారత దేశంలో దొరికే ఆవులు ఎద్దులు కంటే దక్షిణాఫ్రికా యందలి ఆవులు, ఎద్దులు మంచి రూపం కలిగి, అమితబలిష్టంగా వుంటాయి. భారతదేశంలో గోరక్షణను గురించిన మాటలు ఎక్కువగా వింటూ వుంటాం కాని యిక్కడి ప్రజలవలెనే, యిక్కడి ఆవులు ఎద్దులు కూడా బక్క పలుచగా బలహీనంగా వుంటాయి. వాటిని చూచి నా హృదయం ద్రవించి పోతుంది సిగ్గుతో నా తలవంగిపోతుంది. దక్షిణాఫ్రికాలో బలహీనంగా వుండే అవుల్నిగాని, ఎద్దుల్ని గాని చూచిన జ్ఞాపకం లేదు దక్షిణాఫ్రికా యందలి ప్రాంతాలన్నిటి యందు కండ్లు తెరుచుకొని మరీ నేను పర్యటించాను కాని ఎక్కడా బక్కచిక్కిన గోవుల్ని వృషభాల్ని నేను చూడలేదు

ప్రకృతి యీ భూమికి ఎన్నో వరాలు ప్రసాదించింది. వాటితో బాటు సహజసౌందర్యాన్ని అపారంగాప్రసాదించిందని చెప్పవచ్చు. డర్బన్ ఎంతో అందంగా వుంటుంది అంతకంటే అందంగా వుంటుందికేఫ్ కాలనీ కేఫ్‌టౌన్, టేబల్ మౌంటెన్స్ అను మెరకపల్లాలు లేని పర్వతచరియల్లో నిర్మితమై ప్రజల్ని బాగా ఆకర్షిస్తూ వుంటుంది. దక్షిణాఫ్రికాను పూజిస్తూ వుండే ఒక విదుషీమణి ఆ పర్వతాన్ని గురించి వర్ణిస్తూ తన కవితలో నేను అలౌకికమైన అనుభూతిని ఆపర్వత చరియల్లో పొందాను. అట్టి అనుభూతి మరే చరియల్లోను పొందలేదు అని వ్రాసింది. యిది అతిశయోక్తి అని నా అభిప్రాయం. అయితే ఆమే వ్రాసిన క్రింది. కొన్ని పంక్తులు నాకు బాగానచ్చాయి. 'కేప్‌టౌన్ ప్రజలకు టేబల్ మౌంటెన్ మిత్రుని వలె సహకరిస్తుంది. ఎత్తైనది కానందున అది భయంకరంగా వుండదు దూరాన్నుంచే దాన్ని పూజించవలసిన అవసరం వుండదు, దగ్గరకు వెళ్ళి పర్వతం మీదనే ఇండ్లు కట్టుకొని నివసించవచ్చు. సముద్రతీరాన వుండటం వల్ల సముద్రం తన స్వచ్చమైన జలంతో దాని పాదపూజ చేస్తుంది. దాని చరణామృతాన్ని సేవిస్తుంది పిల్లలు, పెద్దలు, స్త్రీలు పురుషులు నిర్భయంగా పర్వతప్రాంతమంతా తిరుగుతూ వుంటారు. వేలాది మంది పౌరుల కంఠస్వరాలతో పర్వత ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తూ వుంటుంది. పెద్ద పెద్ద చెట్లు సువాసనలు విరజిమ్మే రంగురంగుల పూలు పర్వతప్రాంతాన్నంతటినీ సువాసనల మయం చేస్తాయి. ఆ సౌందర్యం ఆశోభ, ఆ అందం చందం ఎంత చూచినా తనివితీరదు యిది ఆమె కవితల సారాంశం

మన గంగాయమునలతో పోల్చతగిన నదులు దక్షిణాఫ్రికాలో లేవు అక్కడవున్న కొద్దినదులు మనదేశ పునాదులతో పోలిస్తే చిన్నవే అని చెప్పవచ్చు. అక్కడి చాలా ప్రాంతాలకు నదులనీరు చేరదు. ఎత్తైన ప్రదేశాలకు క్రిందినుంచీ నీటిని కాలువలు త్రవ్వి ఎలా తీసుకువెళ్ళడం? సముద్రమంతటి నదులు లేని చోట కాలువలు ఎలా ఏర్పడతాయి? దక్షిణాఫ్రికాలో నీరు దొరకని చోట్ల పాతాళ బావులు త్రవ్వ బడివున్నాయి. ఆ బావుల నీటితో వ్యవసాయం సాగుతుంది. ఆ బావుల నుంచినీరు, యంత్రాల ద్వారా నీరు తోడే చక్రాల ద్వారా బయటికి తోడుతారు వ్యవసాయానికి ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది. రైతులకు ఎప్పటికప్పుడు సరియైన సలహాలు యిచ్చి తోడ్పడుటకు వ్యవసాయ శాస్త్ర నిపుణుల్ని ప్రభుత్వం నియమించి వారి దగ్గరికి పంపుతుంది. ప్రభుత్వమే అక్కడ రైతులకు సహకరించుటకు వ్యవసాయ కేంద్రాల్ని నడుపుతుంది. రైతులకు మంచి పశువుల్ని, మంచి విత్తనాల్ని అందజేస్తుంది. కొద్ది ఖర్చుతో పాతాళ బావులు త్రవ్విస్తుంది వాయిదా పద్ధతిన అందుకైన వ్యయం చెల్లించుటకు వెసులు బాటు రైతులకు కల్పిస్తుంది. పొలాల చుట్టూ ఇసుప కంచెల్ని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకుంటుంది

దక్షిణాఫ్రికా భూమధ్యరేఖకు దక్షిణాన వున్నది. భారతదేశం ఆరేఖకు ఉత్తరాన వున్నది. అందువల్ల వాతావరణం, శీతోష్ణస్థితి రెండు దేశాల్లో వేరువేరుగా వుంటుంది. అంతా తలక్రిందుల వ్యవహారమే ఋతువులూ అంతే. ఉదాహరణకు మనదేశంలో వేసవికాలం ప్రారంభమైతే, దక్షిణాఫ్రికాలో శీతాకాలం ప్రారంభమవుతుంది. వర్షాకాలానికి నిశ్చితసమయమంటూ అక్కడ వుండచు ఏసమయంలోనైనా అక్కడ వర్షాలు కురవచ్చు. సామాన్యంగా 20 అంగుళాల కంటే మించి అక్కడ వర్షపాతం వుండదు



చరిత్ర

ఆఫ్రికా యొక్క భూగోళాన్ని వివరిస్తూ గతప్రకరణంలో నేను క్లుప్తంగా వర్ణించిన భూగోళ విశేషాలు ప్రాచీన కాలం నుంచి అక్కడ అమలులో వున్నాయని పాటకులు భావించకూడదు అతిప్రాచీన కాలంనుంచి దక్షిణాఫ్రికాలో ఎవరు నివసిస్తూ వుండేవారో యింతవరకు తేలలేదు యూరపియన్లు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ హబ్షీవాళ్లు వున్నారు అమెరికాలో బానిసత్వం తాండవం చేస్తున్నప్పుడు అమెరికా నుంచి పారిపోయి కొద్దిమంది హబ్షీలు దక్షిణాఫ్రికా వచ్చి వుండిపోయారని కొందరి అభిప్రాయం వాళ్లలో జూలూలు, స్వాజీలు బసూటోలు, బెక్వానాలు మొదలుగాగల వేరువేరు తెగల వాళ్లు వుండేవారు. యీ హబ్షీలే దక్షిణాఫ్రికా మూలనివాసులని చాలా మంది అంటున్నారు. అయితే దక్షిణాఫ్రికా చాలా విశాలమైన దేశం. అక్కడ