తేట తెలుగు గీత శతకం

ఈ పద్య సంపుటి నా తల్లి తండ్రులు, పూజ్యులు, పుణ్య దంపతులు వేములపల్లి వెంకటేశ్వర రావు, వేములపల్లి సీతారావమ్మ గార్లకు అంకితం!

శతక రచనకు అన్ని విధాలా సహకరించి, ప్రోత్సహించిన నా సహా ధర్మ చారిణి వేములపల్లి పద్మజ కు నా ప్రత్యేక ధన్యవాదాలు!

తొలిపలుకు

ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాష తెలుగు. తేట తెలుగు లోని తియ్యందనాలు మరి యే ఇతర భాషలోనూ కానరావు.

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స    ”

—శ్రీ కృష్ణదేవ రాయలు

ఆంగ్లేయ ప్రభువైన బ్రౌన్ తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా అభివర్ణించాడు.

దురదృష్టవశాత్తూ ఈ తరం యువత పరభాషా వ్యామోహంలో పడి అంతటి ప్రాశస్త్యం ఉన్న తెలుగులో మాట్లాడడానికి సైతం వెనకాడుతున్నారు.

మన భాషను కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరిపై ఉంది.

ఇందులో భాగంగానే తెలుగు కళామతల్లికి నేను సైతం ఈ చిన్ని తేట తెలుగు గీతాల మల్లె పూదండ సమర్పిస్తున్నాను.

తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ పద్యాలు చదివి ప్రాచుర్యంలోకి తెస్తారని ఆశిస్తున్నాను.

జై తెలుగుతల్లి!



1

రాసి నాడను జీవితం రంగ రించి

నాదు అనుభవ సారము నాల కించి

సరియ దిద్దుకొ మ్మదీయ స్వర్ణ భవిత

వినుడి వేముల పల్లిరా మునిది విదము

2

యోగి వేమన కులమును యొగ్గి వేసె

మంచి వారంద దరదొక్క మనిషి కులము

కులము పెట్టదు కష్టమే కూడు పెట్టు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

3

రక్త మొక్కటే ప్రవహించు రంద రందు

తిత్తి లోతొందె రంధ్రాలు తిరగ జూడ

తోలు గాదుర లోపల తొంగి చూడు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

4

సింహ మోకటె వొడిసిశా సించు నడవి

గుంప లెన్నున్నదుమ్ముల గొండ్ల నవియె

సంఖ్య కాదెందు ముఖ్యము శౌర్య మౌను

వినుడి వేముల పల్లిరా మునిది విదము

5

పేద వానికి పట్టెడు పెట్ట రన్నం

ఉన్న వానికి అరగదు గుప్పె డయిన  

విధియె మనిషితొ ఆడును వింత లీల

వినుడి వేముల పల్లిరా మునిది విదము

6

యోగ మెంతయు చేసిన యొసగ దేమి

మలిన మున్నచొ మనసున శాంతి లేదు

మున్ను మనసుకు అంటిన మన్ను కడుగు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

7

కష్ట మొచ్చిన గురుతొచ్చు కన్న తల్లి

వంట జరమున్న తలతుము వయిదు నొకడె

మిత్రు డడగకె మేలు మిన్ను చేయు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

8

కార ములనతి ప్రమాద కార మహము

చేర చిటికెడు చాలును చేటు చేయ

వినయ మెంతున్నమనిషికి విధిగ నుండు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

9

తేనియ లొల్కునా తీయ తెన్గు పల్కు

కనగ రమ్యమై నొప్పుమా కట్టు బొట్టు

తినగ కమ్మగ నుండుమా తిండి యెంతొ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

10

వెకిలి బట్లరు ఇంగ్లీషు వెదవ లాడు

మనదు బంగరు తెలుగె మనకు ముద్దు

తెలుగు ఔన్నత్య మెంతయో తెలుప రండి  

వినుడి వేముల పల్లిరా మునిది విదము

11

మనమె ఆదరిం చనొడల మనదె భాష

పరులు ఎందుకు చేతురు పరయ మర్ష

మనదు భాద్యత కాపాడ మాతృ భాష

వినుడి వేముల పల్లిరా మునిది విదము

12

తల్లి వంటిదె భాషయు తలియు మెపుడు

ఋణం తీర్చుకో వీలైతె వృద్ధి చేసి

వెదవె తనమాత భాషను వెక్కి రించు  

వినుడి వేముల పల్లిరా మునిది విదము

13

పుణ్య మెంతయో జేబట్టి పూర్వ జన్మ

బుట్టి నిటువంటి పావన భూమి నందు

ఇలకు గారపు బిడ్డమా తెలగు గడ్డ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

14

జంతు జాతులు గూడొకటె జతను గట్టు  

తానె జీవించు మనిషి తనకు తాను

మెకమె మేలుమ నిషికంటె మెండు గలియు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

15

యాస లెన్నున్న భాషొకటె యగును తెలుగు

ఏంది అన్నను ఏమిట న్నేది తేడ

విశ్వ భాషల తెలుగు విశద ఇష్టం

వినుడి వేముల పల్లిరా మునిది విదము

16

మనిషి మదిమద మాత్సర్య మావ రించె

మంచి చెయచెడు తలపెట్టు మనిసి నేడు

మున్ను అందరుచే సినమేలు మరచ సాగె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

17

ఎలుక చిన్నదె కొండను ఎదిరి తవ్వు

ఏను గెంతున్న లాభము ఏది మెదడు

దేని విలువయు సృష్టిలో దాని కుండు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

18

శ్రేమ జీవుల నొంటిన శ్వేద ముండు

దుష్ట మానిసి మదినిండ ద్వేష ముండు

తేట భావముండ మనసది తేలి కుండు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

19

తెలుగు తెగలకు ఎందుకీ తెగులు పట్టె

మాతృ భాషపై మమకార మదిలొ పోయె

తెల్ల దొరగుబ్రౌ నుయుగూడ తెలుగు మెచ్చె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

20

మద్య మదియేల మదినేలు మగత నింపి

మధువు సేవించి చేయురుగ మత్తు గోల

మందు తాగుట మితిమీరి మంద భాగ్యం

వినుడి వేముల పల్లిరా మునిది విదము

21

మాయ మయిపోయె సంస్కార మనల మదిలొ

కాదు కూడయ బెట్టుటె కాసు బతుకు

మాన మర్యాద మరచిన మనము మెకమె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

22

విత్తు చిన్నదే వృక్షమౌ విరగ పెరిగి

సన్న సెలయేర్లు గూడెన్నొ సంద్ర మగును

వినయ వంతుడె చివరన విజయ మొందు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

23

నాదు నాదంచు పాకులా టెందు కదియు

తోడ రాదేది పుణ్యము తప్ప మనది

పదిల పరచుకో గురుతించి పరమ పదము

వినుడి వేముల పల్లిరా మునిది విదము

24

మెరయు దంతయు బంగార మెపుడు కాదు

మట్టి లోనున్న వజ్రము మలిన మవదు

పయిన మెరుగులు వదిలేసి పరకి చూడు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

25

మాన వత్వము లేకున్న మతము లేల

మతము లన్నిటి లోసార మదియో కటెను

ధర్మ మాచరించ మార్గము ధరను ఒకటె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

26

ఖరము నశ్వము చూచుట కొక్క గుండు

పనులు చూసిన భేదము పసయె తెలియు

మనుషు లందరు పరికింప మరియ వేరు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

27

ఖలుడు ఒక్కడు చెరుచును ఖండ మంత

బిందె పాలవి స్తరించు బిందు విషము

దూర ముంచుడి జాగ్రత ధూర్త జనుల

వినుడి వేముల పల్లిరా మునిది విదము

28

మాన్యు లెప్పుడు చెబుదురు మంచి మాట

చెవిని పెట్టక పడుదురు చెడుగు బాట  

దివిని వదలిన నరకమే దీరు కొలువు  

వినుడి వేముల పల్లిరా మునిది విదము

29

మాన వత్వమే లేకున్నమనిషి లోన

మృగ్య మయిన మర్యాద మృగమె మేలు

మానవ మనుగడ అసాధ్య మదియె నిజము

వినుడి వేముల పల్లిరా మునిది విదము

30

కాని పించెడు దేవతలు కన్నవాళ్ళు

తీర్చు కొనుమువా రిరుణము తీరు బడిన

వారి మించిన మంచినె వరుర చేయు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

31

బొగ్గు వజ్రమ గుటబట్టు బోలె డేండ్లు

నెయ్యి చేయుట కెంతగు నెరియ శ్రమ

పట్టు సంస్కృతి పోగడ పలు యుగము  

వినుడి వేముల పల్లిరా మునిది విదము

32

పండి తుడైన మనిషేను పామ రయిన

కన్ను లుండురెం డొకటే కాద ముక్కు

మనసు ముఖ్యము మన్య మదియ కాదు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

33

అర్కు నాపలే రరచేయి అడ్డు పెట్టి

నిజము నట్లెను దాగదు నిప్పు నదియె

పారి పోవునిషి కల్లలు పార జూడ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

34

యంత్ర మొక్కటె చేయుపని యెంద రంతొ

అంత మాత్రము చేనది అధిక మవున

తిరగ దదియుమ నిషిమీట తిప్ప కున్న

వినుడి వేముల పల్లిరా మునిది విదము

35

దివిజ గజ్జేయ మానంబై దీరు కొలువు

వేయి కోటుల ప్రభల వెలుగు తెలుగు

దివ్య దేపీప్య కాంతుల దివ్వె తెలుగు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

36

మూర్ఖు డెదురేగ తప్పుకో ముఖము తిప్పి

వాద మేచేసి నొదలడు వాడు నిన్ను

పట్టిం చకపోడు అందరి పెడన దారి

వినుడి వేముల పల్లిరా మునిది విదము

37

అద్ద ముపగుల నతికించ అగును గాని

ఆత్మ బంధము తెగినచొ అతక లేము

కొన్ని మనసులు చీలును కొల్ల గాను

వినుడి వేముల పల్లిరా మునిది విదము

38

చిన్న పిల్లవా డైనచేయ చింత మంచి

అనుస రించవ లయుచెప్ప అడ్డ రాదు  

పండు ముసలిచె ప్పవినకు పరుష భాష

వినుడి వేముల పల్లిరా మునిది విదము

39

మట్టి నల్లది బంగర మదియ పండు

వర్ణ మేదైన ప్రతిభ వకటె మెచ్చు

తీపి చూడుము పండుది తీసి తొక్క

వినుడి వేముల పల్లిరా మునిది విదము

40

యెద్దు గొర్రెలు మేపువా యెఱుగు సుద్దు

మాంస మునుకోసె డికసాయి మర్మ మెరుగు

ధర్మ ముపనిర్వ యించుటె ధరణి లోన

వినుడి వేముల పల్లిరా మునిది విదము

41

పితికి పాల్గాచి తోడేయ పిదప పెరుగు

వెన్న చిలికిమ రుగబెట్టౌ వెరసి నెయ్యి

నెయ్యి వంటిదె సంస్కృతి నేర్చ కష్టం

వినుడి వేముల పల్లిరా మునిది విదము

42

మంచి చేయను పౌరుష మవును చితం

చెడుగు చేయగ తొడగొట్ట చేవ కాదు

దీన జీవుల కండగా దిప్పు మీసం

వినుడి వేముల పల్లిరా మునిది విదము

43

సర్వ మతముల సారము సకల మోకటె

సాటి వారప్రే మించుటే సాధ్య మంత

తలచు కొనుమెంద రోచేసు త్యాగ ములను

వినుడి వేముల పల్లిరా మునిది విదము

44

సింహు బంధింప కొరకదా సిట్టి ఎలుక

మొసలి నీటినొ దలకొంగ మొగ్గి పొడుచు

తనత లబలము లేకున్న తగ్గు బలము

వినుడి వేముల పల్లిరా మునిది విదము

45

పాలు పోసిన కాటేయు పాము యెట్లొ

ఖలుని కుపకార మేజేయ ఖర్మ కాలు

మనిషి కుపకా రముచేయు మరసి గుణము

వినుడి వేముల పల్లిరా మునిది విదము

46

కుక్క విశ్వాస మెన్నడు కాదు వమ్ము

నక్క వినయనె పుడదియె నమ్మ రాదు

చేర దీయుము గుణమది పార జూచి

వినుడి వేముల పల్లిరా మునిది విదము

47

తనను తానుపొ గడువాడు తగయ మూర్ఖు

డతడ యినతన ముఖముచూ డద్ద ముననె

చేయ గొప్ప లితరులు చెప్ప వలయు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

48

తలొక దిశలాగ చీమలు తలదు వెంట్రు

గూడ కదిలించ లేవుగ గూడి నొక్క

దిశనె లాగిన కదలు దిగ్గ జంబె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

49

చిట్టి ఎలుక దూరెనని చిచ్చు పెట్ట

నింట కాదది సవ్యము నిజస మస్య

తెలుసు కొనియెప రిష్కారం తెలప వలయు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

50

మంచి చెడులుండు పెనవేసి మనిషి లోన

విజ్ఞ డెఱుగెట్లొ వాటిని విడయ దీయ

మంచి ఎన్నుకొ నినమోక్ష మందు నతడు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

51

మాయ కమ్ముకొని యుండు మెదడు మీద

విదల గొట్టిచే సితివేని వివేచ నమ్ము

సకల మర్మము బోధయౌ సవివ రమున

వినుడి వేముల పల్లిరా మునిది విదము

52

జ్ఞాన ముండుమ దినదియ జ్ఞాత ముగను

తట్టి లేపినొ డలనింపు తెలివి మనలొ

చూచు వానికే గోచరిం చుగురి యొకటె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

53

నిజము యుండుని వురు గప్పి నిప్పు వోలె

మాన దుకాలక చెలగాట మాడి తేను

గొఱివి తోతల నెప్పుడు గోక రాదు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

54

పారి శుధ్యము జేయుము పరమ విధిగ

కుప్ప జేర్చిన చెత్తను కుళ్ళి పోవు

బద్ద కించిన రోగాల బారి పడురు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

55

కాసు లెన్నున్న తినలేవు కాంచ నంబు

వీలు కలిగిన పొసగన మేలు చేయు

నీదు మంచియే కాపాడు నిన్ను యెపుడు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

56

కూడు గుడ్డగూ డులెన్నొ కూడ బెట్ట

చేయు దురెన్ని యైనిను చెడ్డ పనులు

పాడి కాలగ మిగులు బూడి దేను

వినుడి వేముల పల్లిరా మునిది విదము

57

ఎండ నకవాన కేటికి ఏత మెత్తి

దుక్కి దున్నినా గలినినె నొక్కి పట్టి

పంట పండించ శ్రమెంతొ పడును రయితు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

58

అన్న దానము అన్నిటి కన్న మిన్న

అన్న మెట్టుదే వుండెరై తన్న నిజము

ఉండ లేరెవ రునుతిన కుండ తిండి

వినుడి వేముల పల్లిరా మునిది విదము

59

మంద బుద్దొక చెవివిని వదలు రెంట

మధ్య ముడొదలు మాట మాధ్య ముగను

నిజమ యినమతి మంతుడు నిలుపు మదినె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

60

మతము లందున్న తమవును మాన వతము  

మాన వత్వమే లేకున్న మతము మత్తె

మర్మ మెరుగని మనసౌను మంది రమ్ము

వినుడి వేముల పల్లిరా మునిది విదము

61

ఉల్లి పొరల మాదిరి అల్లి మాయ

కప్పి వుంచును జ్ఞానమునె మప్పి మత్తు

యుక్తు దొక్కడే బేదించు సూక్తి నరసి

వినుడి వేముల పల్లిరా మునిది విదము

62

నాస్తి కులదూష ణచేయుట నాసి గుణము

నాస్తి కులనిన జ్ఞాస్తికు లాస్తి లేని

మతము కన్నను జ్ఞానమే వెతక మిన్న

వినుడి వేముల పల్లిరా మునిది విదము

63

నాదె సర్వమని గర్వించ పాడి కాదు

నీస్తి తెంతయో జెప్పును నీదు తెలివి

జాస్తి చేసుకొ నుమదియే జ్ఞాస్తి పెంచి

వినుడి వేముల పల్లిరా మునిది విదము

64

ఏడు లోకముల జుట్టుందు నేడు పాప

ములవి గర్వము పేరాశ ముదురు కోర్క

ఈసు నతితిండి కసిబద్ద కాసు రులవి

వినుడి వేముల పల్లిరా మునిది విదము

65

శిరము నుండిక రమునుండు దరము నుండి

చివర కాలినుండి ఉద్భవిం చినచొ మనిషి

ఎవరి జన్మైన సహజము ఎట్లు ఆగును

వినుడి వేముల పల్లిరా మునిది విదము

66

డెంద మలరించు పసిపా పంద మదియే

గెంతు నందము గాకోడె పంత మేసి

రెక్క విప్పిన నెమలెంతొ చక్క గుండు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

67

మార్గ నిర్దేశణ లేకున్న మారు విధియె

దున్న వలసిన గిత్త దుంచు గట్లు

రౌతు వశంగా కెత్తికొట్టు రౌద్ర గుర్రం

వినుడి వేముల పల్లిరా మునిది విదము

68

కొండె మందుండు తేలుకి కొంతె విషము

దుండ గునిమది ద్వేషము దండి గుండు

చేర దీయరా దటువంటి చెడ్డ జనుల

వినుడి వేముల పల్లిరా మునిది విదము

69

ధనిక వర్గము మరియింత దనికు లయిరి

పేద వారలు కడకంటి పోవు చుండ

మధ్య జీవిబ తుకుటేన సాధ్య మయ్యె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

70

తామ రాకుపై బడ్డనీరు తొర్లి పోవు

మంచి మానిసి నుండదు మర్మ మెపుడు

పాలు నీరుని వేరుచే గలుగు హంస

వినుడి వేముల పల్లిరా మునిది విదము

71

భావ మాత్మశ రీరంబది ఛంద మౌను

పాద ములవియం గములౌ పార జూడ

భావ శుద్దిలేని పద్యము వ్యర్థ మదియె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

72

ఎత్తు కెదగవ లయుగాని ఎచ్చు వలదు

తెలివి కలవాడు మెలుగును తనదు మితిలొ

లేని చోపడిన పెనుదెబ్బ లెన్నొ తగులు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

73

గరుడు డొక్కడె వేలనా గులకు పెట్టు

మంద లెన్నున్న పిరికివి మన్న లేవు

ధీరు డొకడుచా లల్పుల దర్ప మణచ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

74

నీతి ధర్మము లుండును జాతి బట్టి

హింస పెట్టుట రాక్షస వంశ రీతి

సాధు వర్తన దేవత లధిక బుద్ధి

వినుడి వేముల పల్లిరా మునిది విదము

75

కాసు లెన్నున్న వ్యర్థము ఈసు ఉన్న

కలచి వేయున దిమదిని తొలచి తొలచి

ఉన్న దానితో తృప్తిగా నున్న మేలు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

76

పక్షి యెగురు నాకాశ పధ మందు

పాము పాకుచు నుండును పాత ళమున

తమరి ఖర్మన నుసరించి తాహ తుండు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

77

రాసి యున్నదే కారాదు రాశి ఫలము

గట్టి సంకల్ప మేమార్చు గ్రహదు బలము

చక్ర వ్యూహము గూడయు చేధ నవును

వినుడి వేముల పల్లిరా మునిది విదము

78

నిలువు టద్దము చూపించు నీదు రూపు

మనసు యొక్కటే దర్శించు మనదు ఆత్మ

మదిని పరికించ సుగమమౌ పదము పరమ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

79

నిమ్న హృదయు కాంక్షించు నిహదు సుఖము

యెన్ని మారులు జన్మించి నన్ని సార్లు

కర్మ మతనిది మారదు కలియ చూడ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

80

మంచి తలపెట్ట కూడదు మర్మ మదిని

జన్మ జన్మల ఫుణ్యము జమ గూడి

ముక్తి కలుగును చివరన మంచి మొగ్గ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

81

పగటి వెలిగించు సూర్యుని ధగ దగలు

రేయి నలరించు చంద్రుని సోయి గములు

రెండు కలసిన భవ్యమౌ నొండు దినము

వినుడి వేముల పల్లిరా మునిది విదము

82

గురువు నెత్తిను న్నానివ గరును శనియె

రాహు వుండునా తనితల బహుద దించి

తాడి తన్నువా డితలను తన్ను టెసరి

వినుడి వేముల పల్లిరా మునిది విదము

83

భావ మదిముఖ్య మదినది భాష కాదు

మంచి భావమొ కటెచాలు యెంచి చూడ

పసయె లేనిమె రుగులవి పనికి రావు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

84

ఏడు రంగులు ఒక్కటై గూడు తెలుపు

షట యింద్రియ మునశ్వర శక్తు లైదు

సప్త పరిమాణ ములవత లుప్త మాత్మ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

85

మనిషి పరిణామ మందుండు మూడు దశలు

మొదట శారీరి కమవుత మాన సికము

మూడ వదవును దైవిక మదియె పరము

వినుడి వేముల పల్లిరా మునిది విదము

86

మనిషి మొదటేండ్లు పదమూడు బాల్య దశ

తదుప యౌవ్వన సంసార భాధ్య తొచ్చు

అరువ దేండ్ల కరుదెంచు వాన ప్రస్థ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

87

వెర్రి వాడెనే గొప్పని విర్ర వీగు

జ్ఞాన వంతుడు ఒదిగుండు వినయ శీలై

అహము జ్ఞానమే నిర్నించు నిహము పరము

వినుడి వేముల పల్లిరా మునిది విదము

88

ఈసు కలిగిన వాడెట్లు ఈశు డగును

పూర్వ లెవ్వరు లేకతా పుట్టె నెట్లు

సకల జాతుల సృష్టించె సదరు బ్రహ్మ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

89

అగ్ని నీరువా యువుభూమి ఆక సములు

పంచ భూతము లయిదుని ర్మించు ప్రాణి

ఆవ లుండును పరిపూర్ణ ఆది ఆత్మ

వినుడి వేముల పల్లిరా మునిది విదము

90

కర్భ నాధార జీవమా విర్భ వించి

నాలు గున్నర లక్షల ఏళ్లు ముగిసె

భావి జీవమి సుకనుండి భవము నొందు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

91

లోకము లవిపదు నాలుగు రకము లుండు

మొదటి యేడుయు భూగర్భ మందు యుండు

మిగిలి నేడును భూమిపై నెగురు చుండు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

92

దేవు డన్నను మరియోండు యెవరు లేరు

మంచి గుణములు ఉన్నట్టి మాన వుండె

మనిషి చెడ్డప నులుచేసి దాన వయ్యె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

93

యోగ చక్రము లుండును యేడు యెంచ

మొదటి చక్రము లేటిని సాధ్య పరచ

ఆనక చివరన అలరారు జ్ఞాన చక్ర

వినుడి వేముల పల్లిరా మునిది విదము

94

పొడవు వెడలుపు నెత్తుత్రి పరియ మాణ  

ములవి యునుగాక సమయము నాలు గవది

ఐదవ దౌప్రాణం బౌనదా రుద్ర తార

వినుడి వేముల పల్లిరా మునిది విదము

95

తెగుయు వరకునే దియుసాగ దీయ రాదు

బలము యెంత్తున్న దానికి కలదు మితము

మరువ రాదతి సర్వత్ర వర్జ యేతు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

96

ఆంక్ష లొప్పదు మనసది పక్షి వోలె

భావ సీమల విహరించు బరులు దాటి

పంజ రమునందు బంధించ పాడి గాదు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

97

సాంఖ్య మొప్పదు స్త్రీపురు షైఖ్య తదియ

మోక్ష మార్గమ నదిపొంద మోహ మొదిలి

వీడు పాంచభౌ తికమ్మవు వోటి దేహు

వినుడి వేముల పల్లిరా మునిది విదము

98

నీతి జాతులు కొనలేము ఖ్యాతి వలనె

వావి వరుసలు లేకున్న వాడు పశువు

హేతు బద్దత సర్వోన్న తవస రమ్ము

వినుడి వేముల పల్లిరా మునిది విదము

99

కోడి ముందున వచ్చెనా గుడ్డు ముందా

ఆది నుండియు మీమాంస ఇదియె నుండె

పురుషు డుప్రకృ తెవరినె వరుజ నించె

వినుడి వేముల పల్లిరా మునిది విదము

100

మొదటి నాల్గంకె లఘనాల కలుప వంద

ఆరు ఎనిమిది వర్గాలు కూర్చ నొంద

పదిది వర్గము వందవు నదియె శక్తి

వినుడి వేముల పల్లిరా మునిది విదము