తెలుగు శాసనాలు/కొన్ని పద్యశాసనాలు
11. కొన్ని పద్య శాసనాలు.
ఏ భాషయందైనను క్రమమగు విధానములో వాక్యరచన యేర్పడక పూర్వమే గ్రామ్య వేడుకలకు చెందిన పదాలు, పాటలు, మొదలగు వాజ్మయము వెలువడి ఆయా ప్రజల్లో ప్రాంతీయంగాను అనుశ్రుతంగాను వచ్చుచుండెను. కాలక్రమంలో కొన్నిపోయి మరికొన్ని క్రొత్తవి చేరుచుండును. ఇట్టివి యెచట వ్రాయబడి యుండవు గనుక మనకు లేనట్లే. వ్రాత చేతనైన తరువాత కూడ అట్టివి వ్రాసియుంచవలెననే తలంపు కలుగకపోవుట వలన అనేక పదాలు, పాటలు ప్రజల నోళ్ళలో ఉన్నంతకాలం ఉండి తర్వాత అంతరించును. గాథా సప్తశతివంటి ప్రాకృత ముక్తకములబట్తివే. తెలుగులోకూడ నట్టి క్రమబద్ధమైన పద్య రచనలున్నట్లు శాసనాల్లో అక్కడక్కడ గనబడును. ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారు వారి ప్రాజ్నన్నయ యుగము అను గ్రంథములో కొన్ని శాసనములనుండి అట్టి పద్యములవలె కనుపించు భాగములు వృత్తగంధి లేక పద్యగంధి యనబడునని తెలిపి ఈ క్రింది యుదారణములనిచ్చి యుండిరి. (ప్రాజ్నన్నయ యుగము. పుట 354.)