3. అనుకృతి

ఒకసారి ప్రయోగించబడిన భాషాంశాలు మరోసారి ప్రయోగించబడటం అనుకృతి. ఒక వక్త ఒక శ్రోతతో అన్నదాన్ని ఇంకో వక్త ఇంకో శ్రోతకు నివేదించవచ్చు. మొదటిశ్రోత, రెండోవక్త ఒకటికావచ్చు. మొదట వక్తృశ్రోతలే రెండోసారికూడా వక్తృశ్రోతలుకావచ్చు, వ్యత్యయంకూడా కావచ్చు, ఒకవక్త తాను అన్నదాన్నే తనకుతానే వక్తగాను, శ్రోతగాను వ్యవహరించి అనుకరించవచ్చు.

3.1 : దీన్నికూడా నామ్నీకరణంగా భావించవచ్చుగాని, మామూలు నామ్నీకరణాలకన్నా అతివిస్తృతమైన పరిధిగలది కావటంవల్ల దీన్ని వేరుగా భావించాల్సివస్తున్నది. నిజానికి అనుకృతాంశానికి అవధులులేవు. అనుకృతాంశం భాషలో ఏ అంశమైనాకావచ్చు. ఒక వర్ణంకావచ్చు, శబ్దంకావచ్చు, పదంకావచ్చు, వాక్యంకావచ్చు, అనంతమైన వాక్క సమూహంకావచ్చు. అనుకృతాంశానికి భాషావధి కూడాలేదు. ఏ భాషాఅంశాన్నైనా ఇంకోభాషలో అనుకరించవచ్చు. భాషకు దేశకాల నిరవధికత్వాన్ని ఆపాదించేది ఈ ఆనుకరణ, భాషాంశాలనే అనుకరించాలన్న నియమంలేదు. చేతనాచేతన జన్యమైన ఏ ధ్వనైనా అనుకరణార్హమే. కుక్క భౌ,భౌ మని అరుస్తున్నది, గజ్జెలు ఘల్లుమల్లుమంటున్నై- ఇత్యాది వాక్యాలు అనుకరణ వాక్యాలే. అనుకృతాంశం శబ్దమయంకూడా కానక్కరలేదు. చేష్టాదికాలనుకూడా అనుకరించి భాషతో అనుసంబంధించవచ్చు. ఇంత విస్తృతమైన పరిధిఉన్న అనుకరణవిధానం సర్వభాషా సామాన్యం కావటంలో విశేషంలేదు.

3.2 : ఈ అనుకరణను . ప్రత్యక్షపరోక్ష అనుకృతులుగా విభజించటం పరిపాటి. ఉన్నవి ఉన్నట్టుగా అనుకరించి చెపితే - ప్రత్యక్షానుకృతి, ఆనుకృతాంశంలో విషయాన్ని మాత్రమే అనుకరించి చెప్పేది పరోక్షానుకృతి. ఇదికూడా సర్వభాషా సానూన్యలక్షణమే. అనుకృతిని శబ్దానికి మాత్రమే పరిమితంచేస్తే, ప్రత్యక్షాను కృతిని శబ్దప్రధానమని (code centred), పరోక్షానుకృతిని అర్థప్రధానమని (information centred) చెప్పుకోవచ్చు. పైనచెప్పిన దేశ, కాల, శబ్ద, భాషా నిరవధికత ప్రత్యక్షానుకృతికే వర్తిస్తుంది. పరోక్షానుకృతికి కొన్ని పరిమితులున్నై. పరోక్షానుకృతి విధిగా భాషాంశమై ఉండాలి. అనుకృతాంశం అనుకరించే భాషలో వ్యక్తీకృతం కావాలి. అనుకృతాంశాన్ని వాక్యపరంగానే వ్యాఖ్యానించాలి. అయితే ఆ వాక్యం సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాల్లో ఏదైనా కావచ్చు. (సంయుక్త వాక్యాల్లో సంశ్లిష్ట వాక్యాలు, మళ్ళీ వాటిల్లో సామాన్య వాక్యాలు ఇమిడి ఉండవచ్చు.) వాక్యదైర్ఘ్యానికి భాషలో పరిమితిలేదు గనక అనుకృతాంశం అనంతమైన ఏకవాక్యం కావచ్చు. ఏకభాషా, ఏకవాక్య పరిమితి ఉన్నది పరోక్షానుకృతి.

అనుకరణకు భాషలు భిన్న పద్ధతు లవలంబిస్తై. కొన్ని భాషలు అనుకృతాంశానికి ఏమీ చేర్చకుండానే అనుకరిస్తై. కొన్ని భాషల్లో కొన్ని అపదాలు, లేక పదాలు, పదతుల్యాలు అనుసంధించి ప్రయోగించబడతై. మరికొన్నిట్లో పరోక్ష విధిలో మాత్రమే ఏదో అనుకారకం ప్రయోగించి ప్రత్యక్ష విధిలో అట్లాంటిదేమీ లేకుండా ప్రయోగిస్తారు. తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ, వచ్యర్థధాతు నిష్పన్నమైన ఒక అవ్యయాన్ని అనుకారకంగా ప్రయోగిస్తారు. తెలుగులో ప్రత్యక్ష పరోక్షానుకృతులు రెండింట్లోనూ అని అనే రూపం ప్రయుక్తమవుతుంది. ఇది అను ధాతువునుంచి నిష్పన్నమైన క్త్వార్థక క్రియతో రూపంలో సమానం. కాని ప్రయోగంలో రెండిటినీ వేరుచెయ్యొచ్చు.

(194)

a. మా పక్కింటావిడ ఉత్తపుణ్యానికి నానామాటలు అని పోయింది.
b. రెండు రెళ్ళు నాలుగన్నందుకు గుండాలు గండ్రాళ్ళు విసిరేదేశం అని శ్రీశ్రీ రాశాడు.
c. క్రమక్రమాగత చైతన్య ధనుష్పాణులు ప్రజలు నేడు అని అన్నాడు కుందుర్తి.

పై వాక్యాల్లో a లో అని అనుకరణంతో వచ్చిన శబ్దంకాదు. 'పక్కింటావిడ' అనే కర్తతో అన్వయించే క్రియ. b లో లిఖితరూపమైన భాషానుకృతి ఉంది. c లో వాగ్రూపమైన భాషానుకృతి ఉంది, a లో అని కి అనకుండా అనే వ్యతిరేక రూపం ఉంది. b, c లలో అని కి ఆట్లాంటి రూపంలేదు..

b, c లలో భాషా వ్యవహారం వ్యక్తమైన రూపభేదాన్ని బట్టి భిన్న క్రియలు ప్రయుక్తమవుతై. అయితే క్రియలు (రాయు< వ్రాయు, అను) కేవల వ్యవహారం వ్యక్తమైన అంశాన్నే తెలియజేస్తున్నై. వ్యక్తమైన తీరును తెలియజేసే క్రియలను కూడా ప్రయోగించవచ్చు. ఆ క్రియలు అనూదిత వ్యవహారంమీద అనువక్త అభిప్రాయాన్ని తెలియజేసేట్టుగానూ ఉండవచ్చు. పై b, c వాక్యాల్లో " " అని శ్రీ శ్రీ విమర్శించాడు, " " అని కుందుర్తి ఉద్ఘాటించాడు, అని చేరిస్తే అనూదితాంశాలమీద వాఖ్యాన ప్రాయంగా ఉంటై.

పై b, c వాక్యాలు ప్రత్యక్షానుకరణాలా ! పరోక్షాను కరణాలా ? అని గుర్తు పట్టటానికి పనికొచ్చే అంశాలేవీ లేవు. ఇంతకు ముందే ఆయా రచనలతో పరిచయం ఉండటం వల్లగాని, అనూదితాంశంలో ఉన్న శబ్ద సంయోజన బిగువుగా ఉండి మిగతా వాక్యభాగంకన్నా భిన్నంగా ఉండటంవల్ల కాని పై వాక్యాలను ప్రత్యక్షాను కరణాలుగా గుర్తుపట్ట గలుగుతున్నాం.

3.31: అనుకృతాంశంలో వక్తృ శ్రోతలను సూచించే పదాలుగాని, ఇతరాంశాలుగాని లేనప్పుడు ప్రత్యక్ష పరోక్షాను కృతుల మధ్య భేదాన్ని గుర్తించటం కష్టం. అనుకృతాంశంలో ఆట్లాంటి పదాలున్నప్పుడు ప్రత్యక్షానుకృతిలో ఉన్న సర్వనామాలు పరోక్షానుకృతిలో కొన్ని మార్పులు పొందుతై . కింది వాక్య సమూహాల్లో అట్లాంటి వాక్యాల్ని గమనించవచ్చు.

(195)

a. (i) నేను నీతో “నేను వస్తాను” అన్నాను →
        నేను నీతో (నేను) వస్తానన్నాను.

   (ii) నేను అతనితో “నేను వస్తాను" అన్నాను →
        నేను అతనితో (నేను) వస్తానన్నాను.

b. (i) నువ్వు నాతో “నువ్వు కొట్టావు" అన్నావు →
        నువ్వు నాతో నేను కొట్టా నన్నావు.

   (ii) నువ్వు అతనితో "నువ్వు కొట్టావు” అన్నావు →
        నువ్వు అతనితో అతను కొట్టాడన్నావు →
        ? నువ్వు అతనితో తను కొట్టా డన్నావు.

c. (1) అతను నాతో "నేను ఉంటాను” అన్నాడు →
        అతను (నాతో) అతను ఉంటా నన్నాడు →
        అతను (నాతో) తను ఉంటానన్నాడు.

    (ii) అతను “నీతో నేను ఉంటాను" అన్నాడు →
         అతను నీతో అతను ఉంటా నన్నాడు →
         అతను (నీతో) తను ఉంటా నన్నాడు.

   (iii) నువ్వు అతనితో “నేను వస్తాను” అన్నావు. →
         నువ్వు అతనితో నువ్వు వస్తానన్నావు.

d. (i) అతను నాతో “నువ్వు అడిగావు" అన్నాడు →
       అతను నాతో నేనడిగా నన్నాడు.

   (ii) అతను నీతో “నువ్వు అడిగావు" అన్నాడు →
        అతను (నీతో) నువ్వు అడిగా వన్నాడు.

అనుకృతాంశంలో ఉత్తమపురుష కర్త పరోక్షానుకృతిలో ప్రధాన వాక్యంలో కర్తృపదం ఏదైతే ఆ పదాన్ని గ్రహిస్తుంది. (copy చేస్తుంది.) (195)a వాక్యాల్లో రెండూ అభిన్నం కావటంవల్ల పరోక్షానుకృతిలో ఎటువంటి' మార్పూ జరగలేదు. 195c. వాక్యాలలో అటువంటి మార్పు జరిగింది. ఈ వాక్యాల్లో అదనంగా గర్భవాక్యంలో పునరుక్తమైన ప్రథమపురుషైకవచన సర్వ నామానికి తను ఆదేశమయింది, (ఈ తన్వాదేశం అన్ని భాషల్లోనూ ఉండదు.) ఈ ఆదేశం ఇతరత్రా కూడా జరుగుతుంది ,

అనుకృతాంశంలో మధ్యమపురుష కర్త ఉంటే అది వచ్యర్థధాతువు అముఖ్య కర్మ పదాన్ని గ్రహిస్తుంది. ( copy చేస్తుంది.) ఈ ప్రక్రియ 195 b, d, వాక్యాల్లో కనిపిస్తుంది. 195d (ii) లో రెండూ అభిన్నం కావటంవల్ల మార్పులేదు. 195b (ii) లో అతనుకు తన్వాదేశం 195c. వాక్యాలలో లాగా సమ్మతమైనట్టు కనిపించటం లేదు. అందుకే ఇట్లాంటి ఆదేశం చేసిన వాక్యం ముందు ప్రశ్న గుర్తు ఉంచబడింది,

పై వాక్యాల్లో ఈ మార్పులు జరిగినచోట ఉత్తమ, మధ్యమపురుష సర్వనామాల మధ్య వ్యత్యయం జరిగినప్పుడు ఆ వాక్యాలు (196 : b (i), d (i)) భిన్నార్ధబోధకాలవుతై. పరోక్షానుకరణలోని ఆ వాక్యాలను ప్రత్యక్షానుకరణ వాక్యాలుగా కూడా వ్యాఖ్యానించే వీలుంది.

ప్రత్యక్ష పరోక్షానుకరణలకు అనుకరణ సూచకం ఒకటే ఉన్న భాషల్లో గాని, అసలు అనుకరణాన్ని సూచించే (అని వంటి) పదమే లేని భాషల్లోగాని, పరోక్షాను కరణలో మాత్రమే వచ్చే పదం వికల్పంగా లోపించే భాషల్లోగాని (ఇంగ్లీషులో 'that' అట్లా లోపిస్తుంది.), పై రకపు భిన్నార్థకత అదే పద్ధతిలో వస్తుంది. అంటే పైన చెప్పిన సర్వనామాల మార్పులు సర్వభాషలకు సమానమేనని దీని భావం. (తన్వాదేశం అన్ని భాషల్లోనూ ఉండదు.) అంతేకాదు. దీన్నిబట్టి ప్రత్యక్ష పరోక్షానుకృతులను వేరుచెయ్యటానికి అన్నిభాషలకు వర్తించే కాలమానం సర్వనామాల మార్పు మాత్రమేనని కూడా దీన్నిబట్టి చెప్పవచ్చు.

3.32 : (195) c. వాక్యాలను పరిశీలిస్తే ఇంకో విషయాన్ని గమనించవచ్చు. ప్రత్యక్షానుకృతిలో ఉత్తమపురుష సర్వనామం కర్తగా ఉంది, తదను గుణంగా క్రియలో ఉత్తమపురుషను సూచించే క్రియావిభక్తి ఉంది. పరోక్షాను కృతిలో సర్వనామం ప్రథమ, మధ్యమ పురుషలుగా మారినా ఉత్తమ పురుష క్రియావిభక్తి ను అట్లాగే నిలచిఉంది. అంటే కర్త ప్రథమ, మధ్యమ పురుషల్లో ఉండి క్రియ ఉత్తమపురుష సూచకంగా ఉంది. ఇది వ్యాకర్తకు చికాకు కలిగించే సమస్య. దీన్ని పరిష్కరించటానికి రెండుమూడు మార్గాలు కనిపిస్తున్నై.

3.3211 : ఉత్తమ పురుషకు (నేను కు) తను శబ్దాన్ని ఆదేశంగా చెప్పటం ఒక వద్దతి. అప్పుడు నేను > అతను > తను అనే విధంగా కాక నేను > తను అనే విధంగా చెప్పాల్సి ఉంటుంది. కాని ఇది అంత సమంజసమైన పద్ధతి కాదు. భాషలో ఇంకెక్కడా నేను కు తను ఆదేశం కాలేదు. ఈ ఒక్క చోట జరిగిందనటంలో ఔచిత్యం లేదు. అదీగాక పైన పేర్కొన్న సర్వనామాల మార్పిడి అన్ని భాషల్లోనూ ఒకే రకంగా ఉంది. అంటే అన్ని భాషల్లోనూ అనుకృత వాక్యంలోని నేను శబ్దం ప్రధాన వాక్యంలో కర్త ననుసరించి మారి ఒక్క తెలుగులో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగిందనటానికి సరిఅయిన ఆధారం లేదు. తెలుగు ప్రయోగాల్ని బట్టి చూసినా, ప్రపంచ భాషల పద్ధతిని బట్టి చూసినా నేను > అతను > తను అనే మార్పే సమంజస మైనది.

3.322 : క్రియావిభక్తిని ప్రత్యక్షానుకృతిలోనే ప్రతిపాదించి, ఆ తర్వాత నేను శబ్దం అనుకృతాంశంనుంచి ప్రధాన వాక్యంలోకి జరిగిన తరవాత సర్వనామాల మార్పు జరిగిందనటం రెండో పద్ధతి. దీనికి బలం తక్కువే. ఎక్కడా జరక్కుండా ఈఒక్క చోటే అనుకృతాంశంలోని కర్త పైవాక్యంలోకి జరిగిందనటం ఎట్లా? పైగా ప్రధానవాక్యంలోకి జరిగినట్టు భావిస్తున్న ఈ పదానికి ఆ వాక్యంలోని మిగతా పదాలకు ఎట్లాంటి సంబంధాన్ని కల్పించగలం? కాబట్టి ఈ పద్ధతికూడా దోషరహితంకాదు,

3.323 : సూత్రవర్తన క్రమంలో గతి కల్పించటం మూడో పద్ధతి. దీని ప్రకారం క్రియావిభక్తి సంధాన సూత్రం (agreement rule) మొదట వర్తింపజేసి, సర్వనామ పరివర్తక సూత్రం (pronoun change rule) తరవాత వర్తింపజేస్తే అప్పుడు క్రియ విభక్తి ఉత్తమ పురుషలోనే ఉంటానికి కారణం చూపించగలుగుతాం. అతను కు తన్వాదేశం భాషలో చాలాచోట్ల జరిగేదే కాబట్టి అక్కడ చిక్కులేదు. సూత్రాలు వాక్యంలో ఒక్కో ఉపవాక్యంలో ఒకేసారి వర్తిస్తై. క్రియా విభక్తి సంధాన సూత్రం వాక్య నిర్మాణంలో సాధారణంగా చిట్టచివర వర్తించే సూత్రం. కాని తెలుగు వాక్యాలు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నై. ముందటి రెండు పద్ధతుల కన్నా ఈ మూడోపద్ధతి మేలైనదే కాని ఇదికూడా నిష్కంటకం కాదు. కారణం కింద వివరించబడుతుంది.

3.3231 : (195) b, d లతో వాక్యాల్నిచూడండి. ప్రత్యక్షానుకరణలో అనుకృతవాక్యంలో మధ్యమపురుష సర్వనామం కర్తగాఉంది. పరోక్షానుకరణంలో అది ప్రధానవాక్యంలో అముఖ్యకర్మ ననుసరించి ప్రథమోత్తమ పురుష సర్వనామాల్లో ఒకటిగా మారింది. కాని ఈ మార్పుతోబాటు మారిన కర్తననుసరించి క్రియావిభక్తికూడా మారింది. అంటే ఇక్కడ సర్వనామ పరివర్తక సూత్రం తరవాత వర్తించింది. అంటే సూత్రాలవరస ఇక్కడ సరిగ్గా తలకిందైంది. అనుకృతాంశంలో ఉత్తమపురుష సర్వనామం ప్రధానవాక్యంలో కర్త నసుసరించి మారింది. క్రియావిభక్తి సంధానసూత్రం సర్వనామ పరివర్తకసూత్రం కంటే ముందు వర్తించింది. అనుకృతవాక్యంలో మద్యమపురుష సర్వనామంకర్తగా ఉంటే అది అముఖ్యకర్మ సనుసరించి మారింది. క్రియావిభ క్తిసంధానసూత్రం ఈసారి సర్వనామ పరిపర్తకసూత్రం తరవాత వర్తించింది. సర్వనామాల పరివర్తన విధానానికి సూత్రాల వర్తనక్రమానికి ఉన్న సంబంధం ఏమిటో అంతుచిక్కటం లేదు.

3.3232 : సర్వనామాల పరివర్తక సూత్రం ఒకటే ననుకొని పైన చర్చ జరిగింది. కాని భిన్నపద్ధతుల్లో జరిగే సర్వనామ పరివర్తనాన్ని రెండుభాగాలు చెయ్యవచ్చు. (1) ప్రధానవాక్యంలో కర్తననుసరించి జరిగే పరివర్తన. ఇక్కడే క్రియావిభక్తి మారకుండా ఉంటుంది. (2) ప్రధానవాక్యంలో అముఖ్యకర్మ ననుసరించి జరిగే పరివర్తన. ఇక్కడ సర్వనామ పరివర్తనతోపాటు క్రియావిభక్తి కూడా మారుతుంది. కర్తననుసరించి మారేది ఉత్తమపురుష. అముఖ్యకర్మ ననుసరించి మారేది మధ్యమపురుష, వీటిని ఉత్తమపురుష సర్వనామ పరివర్తక సూత్రం మధ్యమవురుష సర్వనామ పరివర్తకసూత్రం అని రెండుసూత్రాలు చెయ్యొచ్చు. అప్పుడు సూత్రాలవరస ఇట్లా ఉంటుంది.

1. క్రియావిభక్తి సంధానసూత్రం.
2. మధ్యమపురుష సర్వనామ పరివర్తక సూత్రం.
3. క్రియావిభక్తి సంధానసూత్రం.
4. ఉత్తమపురుష సర్వనామ పరిపర్తక సూత్రం.

3.3233 : ఒకే ఉపవాక్యంలో క్రియావిభక్తి సంధానసూత్రం రెండుసార్లు వర్తించటం సాధారణంగా జరగదు. కాగా, ఒకేరకపు సర్వనామ పరివర్తనకు రెండు సూత్రాలు తయారుచెయ్యటంకూడా అంతపొదుపైన పద్ధతికాదు. అందువల్ల 2, 4 సూత్రాలను కలిపి ఒకే సర్వనామ పరివర్తక సూత్రాన్ని ఉంచటం వాంఛనీయం. సర్వనామ పరివర్తకసూత్రం సర్వభాషాసామాన్యం. క్రియావిభక్తి సంధాన సూత్రాన్ని చివర ఉంచటమే సమంజసం. అయితే ఈ సూత్రాన్ని (195) c. లో నిష్పన్నమైన వాక్యాలమీద వర్తించనియ్యకుండా నిరోధించగలిగితే ఈ సమస్యను పరిష్కరించినట్టే. “ప్రథమపురుష పరిపర్తితసర్వనామం కర్తగాఉన్న వాక్యాల్లో వర్తించరాదు" అనే ఆంక్షను క్రియావిభక్తి సంధానసూత్రానికి విధించి ఆ పని సాధించవచ్చు. ఈ రకమైన ఆంక్ష సూత్రానికి అధికభారాన్ని ఆపాదించేమాట నిజమే? అయితే ఈ ఆంక్ష ఒక్క తెలుక్కి మాత్రమే కాకమిగతాభాషలకుకూడా అవసరంకావచ్చు. సర్వభాషల్లోనూ ప్రత్యక్షానుకరణను పరోక్షానుకరణంగా పకవర్తింపజేసే విధానం ఉంది. ఆ సందర్భంలో సర్వనామ పరివర్తన భాషా సామాన్యలక్షణం. కర్తననుసరించి క్రియావిభక్తిని సంధించే పద్ధతిఉన్న భాషలన్నిట్లో ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఈ ఆంక్షభాషా సిద్ధాంతానికే అవసరం కావచ్చు. కాబట్టి ఈ ఆంక్ష భాషాసిద్ధాంతంలో భాగంగానే ప్రతిపాదించబడుతున్నది. ఇంతకన్నా మేలైన విధానం దొరికేవరకూ ఇదే మార్గం.

3.4 : (195) లో ఉదాహరించిన వాక్యాల్లో ఇద్దరుశ్రోతలు, ఇద్దరు వక్తలను మాత్రమే భావించి ఉదాహరించినవి కాని ఈ వాక్యాల్లో వక్తృశ్రోతల సంఖ్యకు పరిమితిలేదు. అనుకరణాన్ని పునఃపునరనుకరించటానికి సహజంగా వీలుంది. అనుకృతాంశ దైర్ఘ్యానికి పరిమితిలేనట్టుగానే అనుకరణవిధానానికికూడా పరిమితిలేదు. ఈ కింది బొమ్మలో ఈ పద్ధతిని గ్రహించవచ్చు.

ఇట్లా బొమ్మని ఆనంతంగా పెంచవచ్చు. ఇట్లా ఆనంతంగా అనుకరించే అవసరం వ్యవహారంలో ఉండదు. అయితే భాష అందు కనుమతిస్తుంది .

(196)

ఎల్లమ్మ ఎవరితోనో లేచి పోయిందని పుల్లమ్మ మల్లమ్మతో అన్నదని
రంగమ్మ మంగమ్మతో చెప్పిందని ఈదమ్మ పేరమ్మతో అన్నదని
అచ్చమ్మ పిచ్చమ్మతో చెప్పిందని ..... ..... .....

పై వాక్యాన్ని ఇట్లా అనంతంగా పొడిగించుకుంటూ పోవచ్చు,

3.5 : అనుకృత వాక్య భేదాల్నిబట్టి పరోక్షానుకరణలో కొన్ని మార్పులు జరుగుతై .

(197)

a. సుజాత సుబ్బారావుతో "నువ్వు మా యింటికి రా" అన్నది.
b. సుజాత(సుజ్బారావుతో) సుబ్బారావును తన ఇంటికి రమ్మన్నది.

ఇందులో జరిగిన మార్పులివి : 1. పరోక్ష విధిలో విధిక్రియకు కారాగమం జరిగింది. రా + మ్ .> రమ్మ్ 2. ఆనుకృత వాక్యంలో కర్తకు ప్రధాన వాక్యంలో అముఖ్యకర్మ ఆదేశం అయింది. 3. కర్తృపదంగా గ్రహించినది. ప్రథమపురుష నామం గనక మా -కు తన అనే శబ్దం ఆదేశమయింది. 4. కర్తృపదం గ్రహించిన సుబ్బారావు అనే నామానికి ద్వితీయా విభక్తి చేరింది.

3.51 : వీటిల్లో మొదటి మూడు మార్పులూ ఇంతకు ముందు విపులంగా చర్చించినవే. కాకపోతే అక్కడ క్రియావిభక్తి సంధాన సూత్రప్రవర్తన ప్రధాన విషయం కనక సర్వనామ పరివర్తనం గురించి మాత్రమే పేర్కొనబడింది. క్రియావిభక్తులు సర్వనామాలమీదనే ఆధారపడి ఉండటం భాషా సామాన్య లక్షణం. అయితే ఈ పరివర్తనలో సర్వనామాలకు సర్వనామాలే ఆదేశం కావాలనే నియమం లేదు. కర్తృ అముఖ్యకర్మ స్థానాల్లో ఏనామం ఉంటే ఆనామమే సూత్రంలో పేర్కొన్న ప్రకారం ఆదేశమవుతుంది. అసలు చిక్కు నాలుగో మార్పుదగ్గరే. ద్వితీయా విభక్తి కర్మార్థంలో నామానికి చేరుతుంది. ఫై వాక్యంలో 'సుబ్బారావు'ను కర్మగా భావిస్తే 'అన్నది' అనే క్రియకే భావించాలి. అనుకృతవాక్యం (గర్భ వాక్యం=embedded sentence) లో కర్తృపదం ప్రధాన వాక్యం (గర్భివాక్యం = matrix sentence) లో కర్మపదంగా జరిగిందనాలి. దీన్ని తెలుగులో కర్త్రుద్ధరణ సూత్రానికి (subject raising) ఉదాహరణగా భద్రిరాజు కృష్ణమూర్తిగారు భావిస్తున్నారు. గర్భవాక్యంలో కర్త గర్భివాక్యంలో కర్మస్థానానికి ఎగరటం కర్త్రుద్ధరణ. ఇట్లా కర్మస్థానానికి ఎగరటం వల్లనే పై వాక్యంలో ద్వితీయావిభక్తి చేరిందని దీనిభావం. కాని ఈ ప్రతిపాదనకి తగినంత బలం లేదు. అను ధాతు నిష్పన్న క్రియకు మనుష్య వాచక నామాన్ని ముఖ్యకర్మగా వాడినప్పుడు నిందార్థమే స్ఫురిస్తుంది. (చూ. వాక్యం. 194a). కాని (197) b లో ఆ అర్థం లేదు. అర్థభేదాన్ని నిర్లక్ష్యం చేసినా చిక్కు తొలగదు. ఉదాహరణకి ఈ కింది వాక్యం చూడండి.

(198)

a. సుజాత సుబ్బారావుకు “నువ్వు మా యింటికి రా" అని చెప్పింది.
b. సుజాత (సుబ్బారావుకు) సుబ్బారావును తన ఇంటికి రమ్మని చెప్పింది.

కర్త్రుద్ధరణ సూత్రపరంగా చెపితే (198) b లో సుబ్బారావును చెప్పింది అనే క్రియకు ముఖ్యకర్మగా భావించాలి. చెప్పు అనే క్రియ విషయార్థక నామాలనే (విషయం, సంగతి, మాట, కథ మొ॥) కర్మపదాలుగా గ్రహిస్తుంది కాని మనుష్య వాచక నామాలను ముఖ్యకర్మలు (direct objects) గా గ్రహించ గలిగినట్టు భాషలో సాక్ష్యం లేదు. అందువలన అనుకృత (పరోక్ష) విధి వాక్యాలను కర్త్రుద్ధరణ సూత్రవిషయాలుగా గ్రహించటం కుదరదు.

3.52 : తగినంత బలం లేకపోయినా ఆలోచించదగిన ఇంకో పరిష్కారమార్గం ఉంది. విధివాక్యాల్లో అని విధిక్రియతో కల్సిపోయి ఏకపదంగా ఏర్పడింది. అంటే పరోక్ష విధిలో అని ని క్రియ నుంచి వేరుచేసి వాక్యాన్ని ప్రయోగించలేం. అందువల్ల పరోక్ష విధిలో క్రియ అని తో కలిసి మనుష్యవాచక శబ్దాన్ని కర్మగా గ్రహించ గలిగిన సకర్మక క్రియగా ఏర్పడిందని చెప్పవచ్చు. ఇది ఒక ఊహ మాత్రమే.

3.53 : విధివాక్యాలు ఆజ్ఞ, అభ్యర్థనాద్యర్థకాలు బోధిస్తై. ఈ వాక్యాల గుప్త నిర్మాణంలో పై అర్థాల్లో ఒక క్రియను ప్రతిపాదించాల్సిన అవసరాన్ని శాస్త్రజ్ఞులు ఇంతకు ముందే గుర్తించారు. ఆ ప్రతిపాదన నిలబడితే విధివాక్యాల కర్తలను అట్లాంటి క్రియకు కర్మగా ప్రతిపాదించవచ్చు. అంటే విధివాక్యాల గుప్తనిర్మాణం (deep structure) లో విధివాక్య, గర్భవాక్యాలను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఉదాహరణకు (198) వాక్యాలకు ఈ కింది వాక్యాన్ని గుప్త నిర్మాణ సదృశంగా ప్రతిపాదించటానికి వీలుంది.

(199)

సుజాత సుబ్బారావును “నువ్వు మా యింటికిరా” అని కోరింది.
  (అడిగింది, అభ్యర్థించింది, ఆజ్ఞాపించింది.)

ఈ ప్రతిపాదన నిలబడితే 198లో వాక్యాలను కొన్ని లోపకార్యాల ద్వారా సాధించవచ్చు. 198b లో సుబ్బారావు అనే పదరూపాన్ని గుప్త నిర్మాణం నుంచే సాధించే వీలుంది. అయితే ఈ రకమయిన వివరణకైనా పూర్తి వివరాలు పరిశోధిస్తేనే కాని బలంచిక్కదు.

ప్రత్యక్షవిధులను పరోక్షవిధులనుంచి, ప్రత్యక్ష ప్రశ్నలను పరోక్షప్రశ్నల మంచి నిష్పన్నం చెయ్యవచ్చునని ఇటీవల కొందరు శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు. నిశ్చయార్థక వాక్యాలనుకూడా స్వతంత్ర వాక్యాలుగాకాక ఇంకోవాక్యంలో గర్భవాక్య నిర్మాణంనుంచి నిష్పన్నంచెయ్యాలనే ప్రతిపాదనకూడా ఉంది. ఉదాహరణకు. (200) b. నుంచి లోపకార్యాలద్వారా (200) a. ని నిష్పన్నం చేయవచ్చు.

(200)

a. "ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు” అని నేను నీతో అంటున్నాను.

b. “ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు. "

3 54 : ఆనుకృతికి, దీనికి ఉన్న సామ్య భేదాలను గమనించటం అవసరం. అనుకృతిలో అనుకృతాంశం పునశ్చర్వితం. ఇక్కడ మొదటిసారి అన్నట్లుగా భావించబడింది. అనుకృతిలో వక్త, అనువక్త, శ్రోత, అనుశ్రోత వుంటారు. ఈ ఇద్దరూ ఒకటే కావటానికి వీలుండొచ్చు. అది వేరే విషయం కాని అనుకృతాంశానికి భాషాపరంగా అనుకృతిలో ప్రథమేతరస్థితి ఉంటుంది. (200) లో ఒకేవక్త, ఒకే శ్రోత, భావించబడ్డారు.

3.4 పేరాలోఇచ్చిన బొమ్మలో 'వ, శ్రో,' తో సూచించినస్థితి (200) లో సూచించిన స్థితికి సమానం. భావం భాషాస్థితిని పొంది వక్తృముఖంగా మొదటిసారి బహిర్గతమైనపుడు వక్తృశ్రోత లెవరెవరో ఇద్దరికీ తెలుసు కాబట్టి భాషలో అస్థితిలో (మొదటిస్థితిలో) వక్తృశ్రోతల వ్యక్తీకరణ సాధారణంగా జరగదు. వక్తృశ్రోతలు లేకుండా భాషకు స్థితిలేదు. వక్తృశ్రోతలు ఒకరే అయితే బహిరాలోచనారూపం అవుతుంది.

(200) a లో వాక్యానికి, అనుకృతికి ఉన్న సామ్యం స్పష్టమే. ఆ వాక్యంలో ప్రధానక్రియను భూతకాలికంచేస్తే ఆ వాక్యానికి పూర్వస్థితి సృహకలుగుతుంది. భవిష్యకాలికంచేస్తే ద్వితీయస్థితి సంభావ్యమవుతుంది. వర్తమానకాలేతరమైన ఏ క్రియను వాడినా అనుకృతాంశానికి నైకస్థితి ఆపాదితమవుతుంది. నైకస్థిత్యా పాదితమైన ఏ వాక్యమైనా అనుకరణ వాక్యమే.

అంటే అనుకరణ, నిరనుకరణ వాక్యాలకు భేదం ఏక, నైకస్థితుల్లోనే ఉంది. వాగ్వాపారంలో పాత్రలు ద్వితీయ స్థితిలో ఒకరే అయినా కాలభేదాన్ని బట్టి. భిన్నాలుగా భావిస్తే అనుకరణలో నైకవక్తృ శ్రోతృవర్గం, నిరనుకరణలో ఏక వక్తృ శ్రోతృవర్గమూ ఉంటుందని చెప్పవచ్చు. పై చర్చను బట్టి సర్వభాషనూ అనుకరణ సన్నిహితమైన నిర్మాణం నుంచి నిష్పన్నం చెయ్యొచ్చునని చెప్పవచ్చు. ఇదే నిజమైతే (197) b. లో ద్వితీయావిభక్తి కొత్తగా వచ్చింది కాక గుప్త నిర్మాణపు సంబంధావశేషంగా భావించవచ్చు.

పరోక్షవిధిలో గమనించవలసిన ఇంకో చిన్న విశేషం ఉంది. ప్రత్యక్ష విధిలో ఏక బహువచన భేదం క్రియలో వ్యక్తమవుతుంది. ఉదాహరణ 'రా', 'రాండి'. పరోక్ష విధిలో ఏకవచన బహువచనాలు రెండిట్లోనూ ఒకే క్రియారూపం ఉంటుంది. ఉదా : 'అతన్ని రమ్మని చెప్పు', 'వాళ్లని రమ్మని చెప్పు' పరోక్ష విధిక్రియలో లింగపురుష భేదం కూడా వ్యక్షం కాదు.

3.6 : ప్రశ్నార్థకాది వాక్యాల్లో ఇంతకుముందు పేర్కొన్న కర్తృపద పరివర్తనాది మార్పులు తప్ప వేరే మార్పులు జరగవు. కాకపోతే ప్రధానక్రియ అను ధాతు నిష్పన్నంకాక అడుగు లేక పశ్నను సూచించే ఆట్లాంటి క్రియ ఏదన్నా ఉంటుంది.

(201)

a. (i) "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు" అని అన్నాడు.
   (ii) నేనెక్కడికి వెళ్తున్నానని అడిగాడు.

b. (i) “నువ్వు రేపొస్తావా" అని అన్నాడు.

(ii) నేను రేపు వస్తానా
                రేపు వస్తానేమో -

} అని అడిగాడు

ఈ పై వాక్యాల్లో ప్రత్యక్ష పరోక్షానుకరణాలు రెండిట్లోనూ అడుగు క్రియను పయోగించవచ్చు. కాని పరోక్షాను కరణలో అను క్రియా ప్రయోగం ఉండదు. ఆ ప్రశ్నకు ఏమో ఆదేశం వికల్పంగా అవుతుంది.

3.71 : ప్రథమ మధ్యమ పురుష సర్వనామాలున్న క్రియారహిత వాక్యాలను అనుకరించినప్పుడు కూడా ఇంతకు ముందు పేర్కొన్న విధంగానే సర్వనామాల్లో మార్పులు జరుగుతై.

(202)

a. (i) అతను "నేను విప్లవ కవిని” అన్నాడు,
   (ii) అతను తను విప్లవ కవిని అన్నాడు,
   (iii) అతను తను విప్లవ కవినని చెప్పాడు.

b. (i) అతను నాతో “నువ్వు అభ్యుదయ కవివి" అన్నాడు.
    (ii) అతను నాతో నేను అభ్యుదయ కవిని అన్నాడు .
    (iii) అతను నన్ను అభ్యుదయ కవి అన్నాడు.

c. (i) నువ్వు అతనితో “నువ్వు జాతీయ కవివి" అన్నావు.
   (ii) నువ్వు అతనితో అతను జాతీయ కవి అన్నావు.
   (iii) నువ్వు అతన్ని జాతీయ కవి ఆన్నావు.

d. (i) నువ్వు నాతో “నేను ప్రపంచ కవిని " అన్నావు.
   (ii) నువ్వు నాతో నువ్వు ప్రపంచకవి నన్నావు.
   (iii) నువ్వు నాతో నువ్వు ప్రపంచ కవినని చెప్పావు.

e. (i) నువ్వు నాతో “నువ్వు కవివి కాదు" అన్నావు.
   (ii) నువ్వు నాతో నేను కవిని కాదన్నావు.
? (iii) నువ్వు నన్ను కవి కాదన్నావు.

(202) a, d వాక్యాలలో వక్త, అనువక్త (అనుకర్త) ఒక్కరే. ఈ సమూహంలో (a iii, d iii) వాక్యాలు (a ii, d ii) వాక్యాలకన్నా మెరుగ్గా ఉన్నై- క్రియారహిత వాక్యాలలో రెండోదళం మొదటి దళానికి విశేషణం. వక్త తన్ను గురించి వ్యాఖ్యానించుకునేటపుడు అన్నాడు అనేకన్నా చెప్పాడు అని ప్రయోగిస్తే మెరుగ్గా కనిపిస్తున్నది. ఇది ఆ వాక్యాల వ్యాకరణ వివరణకాదు. ఎందుకు మెరుగ్గా కనిపిస్తున్నయ్యో ప్రస్తుతానికి చెప్పలేకపోయినా, చెప్పాల్సిన బాధ్యత ఉంది.

(b iii), (c iii) వాక్యాల్లో నన్ను, అతన్ని అనే నామపదాలు అను అనే క్రియకు కర్మపదాలు. ఇవి క్రమంగా b (ii), c (ii) వాక్యాల్లో కర్తృపదాలు- అందువల్ల వీటిని కర్త్రుద్ధరణ ప్రక్రియకు ఉదాహరణగా గ్రహించే వీలులేక పోలేదు. అయితే (iii) సంఖ్య ఉన్న వాక్యాలు (ii) సంఖ్య ఉన్న వాక్యాలనుంచి నిష్పన్నం చేసినపుడే అట్లాంటి వివరణను గురించి ఆలోచించటం సాధ్యమవుతుంది. పైగా క్రియలున్న వాక్యాలతో ఇట్లాంటి వాక్యాలు సాధ్యం కావు.

(203)

   a. నువ్వు అతనితో "నువ్వు తిన్నావు" అన్నావు.
   b. నువ్వు అతనితో ఆతను తిన్నా డన్నావు.
? c. నువ్వు అతన్ని తిన్నా డన్నావు.

అట్లాగే 202 b (iii), c (iii) వాక్యాల్లో అముఖ్య కర్మపదం వాడితే వాటి వ్యాకరణ బద్ధత సందేహాస్పద మవుతున్నది.

*(204)

a. అతను నాతో నన్ను అభ్యుదయ కవి అన్నాడు.
b. నువ్వు అతనితో అతన్ని జాతీయకవి అన్నావు.

అనుకరణంలో సమాపక క్రియగా వచ్చే అను క్రియకూ, ఈ పై వాక్యాల్లో అను క్రియకూ భేదం కనిపిస్తున్నది. ఇక్కడ మనుష్యవాచక నామాలను ముఖ్య కర్మ పదాలుగా గ్రహించగలిగిన అను ప్రయుక్తమయింది. అందువల్లే పై వాక్యాల్లో అముఖ్య కర్మపదం సరిపడటం లేదు. అట్లా వేరు చేసినప్పటికీ ఇక్కడ కర్త్రుద్ధరణను ఊహించడానికి వీలుంది. కర్త్రుద్ధరణ జరిగిన తరవాత అముఖ్య ముఖ్య కర్మపదాలు రెండూ మనుష్య వాచకాలయినప్పుడు అముఖ్య కర్మను నిత్యంగా లోపింప జెయ్యాలి. ఇక్కడ కర్తృపదం పైకి తొలగిపోయింది కాబట్టి క్రియా విభక్తి సంధాన సూత్రం వర్తించదు.

3.72 : పైన మనుష్య వాచక నామం ముఖ్య కర్మపదంగా గ్రహించ గలిగిన క్రియగా అను వివరించబడింది. మనుష్యేతర వాచక శబ్దాల్లో కూడా ఇట్లా ప్రక్రియను చూపించవచ్చు.

(205)

a. (i) నువ్వు “అది దొంగ కుక్క" అన్నావు.
   (ii) నువ్వు దాన్ని దొంగ కుక్క అన్నావు.

b. (i) నువ్వు “అది పనికి మాలిన డిగ్రీ" అన్నావు,
   (ii) నువ్వు దాన్ని పనికి మాలిన డిగ్రీ అన్నావు.

దీన్నిబట్టి కర్త్రుద్ధరణ శబ్ద కర్మేతర ధాతువు లున్నపుడే జరుగుతుందని, అను శబ్ద కర్మకంగాను, శబ్దేతర కర్మకంగానూ గుర్తించాల్సి ఉంటుందని తీర్మానించుకోవచ్చు. కేవల శబ్ద కర్మధాతువులను (ii) గుర్తులున్న వాక్యాలలో ప్రయోగించలేము. అంటే నువ్వు దాన్ని దొంగ కుక్క అని చెప్పావు, *నువ్వు దాన్ని పనికిమాలిన డిగ్రీ అని చెప్పావు అనే వాక్యాలు వ్యాకరణ సమ్మతం కాదన్నమాట. అనుకృత వాక్యాలు క్రియారహిత వాక్యాలయినప్పుడే ఈ కర్త్రుద్ధరణ కనిపిస్తున్నది. ఈ రకపు వాక్యాల్లో రెండోదళం మొదటి దళానికి విశ్లేషణ సమం కావటం ఇందుకు కారణం కావచ్చు. 3.811 : అనుకరణగా స్పష్టంగా చెప్పటానికి వీల్లేని వాక్యాల్లో కూడా అని ప్రయోగం కనిపిస్తున్నది. అనుకృతాంశానికి నైకస్థితి ఉన్నప్పుడే అనుకరణ అంటాం. అట్లాంటప్పుడు ప్రధాన వాక్యంలో శబ్ద కర్మధాతువులుంటై. అట్లా కాకుండా ఒక విషయం భాషీకరించిన ప్రథమస్థితిలోనే అని ప్రయోగమవుతుంది. అట్లాంటిదాన్ని భాషానుకరణగా కాక విషయానుకరణగా గ్రహించాలి. దీన్నే విషయార్థక నామ్నీకరణమని పూర్వం వ్యవహరించారు. ఇందులో భౌతిక ప్రపంచంలో జరిగిన విషయాలుగాని, మనః ప్రపంచంలో సంభావ్య విషయాలు గానీ అనుకృతమవుతై. ఈ అనుకృతాంశాలు జ్ఞానార్థక క్రియలతో ప్రయుక్తమవుతై .

(206)

a. పెరిగిన ధరలు ఎప్పుడూ తగ్గవని నాకు తెలుసు.
b. విశాఖ పట్టణంలో ఉప్పు పండుతుందని నేనెరుగుదును.
c. కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగుతయ్యని విన్నాను.

(206) c లో విను శబ్ద కర్మధాతువుగా గ్రహిస్తే ఆ వాక్యాన్ని విన్నానని, జ్ఞానార్థక ధాతువుగా గ్రహిస్తే ఆ విషయాన్ని శ్రవణేంద్రియం ద్వారా గ్రహించాను అని అర్థాలు.

3.812 : విషయార్థంలో వచ్చే నామ్నీకరణాలు విధి, ప్రశ్నార్థక వాక్యాలకు సాధ్యంకావు. నామ్నీకృత వాక్యాలు అనుకొను, ఆశించు, ఎరుగు, తెలియు, విను వంటి బుద్ధి, జ్ఞానార్థక ధాతువులు క్రియలున్న వాక్యాల్లో గర్భితాలై ఉంటై. అని తో ఉన్న వాక్యాలేవీ సాధారణ క్రియారహిత వాక్యాలతో ప్రయుక్తం కావు. కాని ఈ కింది వాక్యాల్లో ప్రయోగాల్ని గమనించండి.

(207)

a. సామ్యవాదానిదే అంతిమ విజయమని నానమ్మకం.
b. ఈ దేశం బాగుపడుతుందని నా ఆశ.
C. ఎన్నికల ద్వారా సోషలిజం రాదని కొందరి అభిప్రాయం.

ఈ పై వాక్యాల్లో నానమ్మకం, నాఆశ, కొందరి అభిప్రాయం అనే పదబంధాలు నామబంధాలే. అయితే వాటిని నేను నమ్ముతున్నాను, నేను ఆశిస్తున్నాను, కొందరు అభిప్రాయపడుతున్నారు. అనే వాక్యాలనుంచి క్రమంగా నిష్పన్నం చేయాలి. సమీకరణ వాక్యాలకూ (equational sentences) (197) లో వాక్యాలకూ భేదం స్పష్టమవుతూనే ఉంది. 3.821 : అని తో ఉన్న విషయార్థక నామం ఉండు క్రియాయోగంలో కాంక్షార్థ మవుతుంది.

(208)

నాకు ఇవాళ సినిమాకు వెళ్ళాలని ఉంది.

దీనిలో నిర్మాణాన్ని ఈ కింది విధంగా చూపించవచ్చు .

(209)

a. (1) నాకు (ఒక కోరిక) ఉంది. - గర్బివాక్యం
                    ↓
   (ii) (నేను ఇవాళ సినిమాకు వెళ్ళాలి) -- గర్భవాక్యం

గర్భవాక్యంలో కాంక్షార్థకనామం స్థానంలో సంపూర్ణవాక్యం ప్రయోగించ వచ్చు. ఈ వాక్యం ఆ కోరికను స్పష్టపరుస్తుంది. అట్లా ప్రయోగించినప్పుడు అని చేరుతుంది. గర్భి వాక్యంలో కు బంధంతో సమబోధకమైనప్పుడు గర్భవాక్యంలో కర్త లోపిస్తుంది. ఇట్లా సమబోధకం కానప్పుడు ఈ లోపకార్యం జరగదు. ఉదాహరణకు "[[నాకు [మా ఆవిడ సినిమాకు వెళ్లాలని] ఉంది] ]" అన్న వాక్యంలో గర్భ వాక్యకర్త లోపించదు.

3.822 : పైన గర్భివాక్యంలో వెళ్ళాలి అనే క్రియకు మూలరూపం వెళ్ల + వలయు. అదే కొన్ని వ్యాకరణ కార్యాలవల్ల ఆలి, ఆల అని మారింది. ఇదే అర్థంలో ఈ కింది వాక్యాన్ని కూడా ప్రయోగించ వచ్చు.

(210)

నాకు ఇవాళ సినిమాకు వెళదామని ఉంది.

ఇక్కడ దాం అనే క్రియాంత ప్రత్యయం వ్యస్తంగా ఉభయ ప్రార్థనంలో వస్తుంది. ఉదా : మనం ఇవాళ సినిమాకు వెళదాం కాని (200) లో ఇది ఉభయ ప్రార్థనం కాదు. అందువల్ల గుప్త నిర్మాణంలో ఉభయ ప్రార్థన క్రియను ప్రతిపాదించే వీలులేదు. గర్భివాక్యంలో కు బంధంతో గర్భవాక్యంలో కర్త సమబోధక మైనప్పుడు వికల్పంగా దాం అనే రూపాన్ని సూత్రంద్వారా ఆదేశంగా తెచ్చుకోవటమే మార్గం. సమబోధకం కానప్పుడు ఈ ఆదేశం జరగదు. ఉదాహరణకు ఈ కింది వాక్యం వ్యాకరణ విరుద్ధం.

*(211)

నాకు మా ఆవిడ సినిమాకు వెళ్దాం అని ఉంది.

అని ప్రయోగించిన వాక్యాలన్నిటినీ విశ్లేషణాలుగా చేసి వాక్యవిషయాన్ని సూచించే నామాలముందు ప్రయోగించవచ్చు. అను ధాతునిష్పన్నమైన అన్న, అనే అనే విశేషణ రూపాలు అనుబంధాలుగా చేరి వాక్యాన్ని విశేషణాలుగా మారుస్తై. వాక్య విషయాన్ని సూచించే మాటలు : విషయం, సంగతి, మాట, ప్రశ్న, సందేహం, విశేష్యాలుగా ప్రయుక్త మవుతై .

3.83 : అని తో ఉన్న వాక్యాలను అంటే చేర్చి చేదర్థకంగానూ, అన్నా చేర్చి అప్యర్థకంగానూ, అని చేర్చి క్త్వార్థ కంగానూ, అంటూ చేర్చి శత్రర్థకంగానూ ప్రయోగించవచ్చు. వాక్యానికి అని అనే అవ్యయాన్ని చేరిస్తే నామం అవుతుందని, స్థూలంగా చెప్పుకోవచ్చు. ఇట్లా అను అనే ధాతువు చేరుతుందనటంవల్ల సాధారణంగా ధాతువు నుంచి నిష్పన్నమయ్యే వివిధ అసమాపక క్రియా రూపాలను సాధించటం ప్రయోజనం.

(212)

a. వాడు వచ్చాడంటే బుర్ర రామకీర్తన పాడిస్తాడు.
b. వాడు వస్తున్నాడంటే అందరికీ హడలు.
c. చుట్టాలు వస్తారంటే బస్తీవాళ్లు భయపడతారు.
d. తన్నానంటే మూతిపళ్లు రాలతై .
e. నేనీపని చేస్తున్నానంటే నా సొంతంకోసం కాదు.
f. నేను పాఠం చెప్పుతానంటే పిల్లలు పారిపోతారు.

పై c, f వాక్యాల్లో అంటే అనుకరణలో వచ్చిన అను ధాతు నిష్పన్నమో ? ప్రధాన క్రియగా వచ్చిన అనుదాతు నిప్పన్నమో చెప్పటం కష్టం. a, b, d, e లలో ప్రయోగించిన అంటే ని అనుకరణలో వచ్చిన అంటే గా గుర్తించవచ్చు. c, f లలో అనిఅంటే అనే రూపాన్ని ప్రయోగించవచ్చు. మిగతా వాక్యాలలో అట్లా ప్రయోగించ లేము. అనుకరణలో నుంచి c, f లను మినహాయించాలా? అనేది వెంటనే సమాధానం చెప్పటానికి వీలులేని ప్రశ్న. వీటిల్లోను మళ్ళీ a, d లలో అనుకృత వాక్యంలోని ప్రధానక్రియనే చేదర్థకంగా మార్చి వస్తే, తంతే అని వాడినా అర్ధం భేదం కనిపించటం లేదు.

కాంక్షార్థంలో అంటే ప్రయోగించి చేదర్థకం చెయ్యవచ్చు.

g. సినిమాకు వెళ్దామంటే పైసల్లేవు.
h. సినిమాకు వెళ్ళాలంటే పైసల్లేవు.

అప్యర్థక రూపాలు కూడా ఈ కాంక్షార్థంలోనే సాధ్యమవుతున్నై.

i. ఉద్యోగస్థులకు నెలాఖర్లో కావాలన్నా 10 రూ. దొరకవు.
j. కాఫీ తాగుదామన్నా నాదగ్గర పావలా లేదు.
k. టీచరు వచ్చాడన్నా పిల్లలు క్లాసుకి రారు.

పై (k) వాక్యంలో అన్నా అనే రూపం అనుకరణలో వచ్చే అను నుంచి నిష్పన్నమయిందని చెప్పలేం. ఈ వాక్యంలో అని అన్నా అనే రూపం వాడవచ్చు. మిగతా వాక్యాలలో అట్లా వాడితే అర్థభేదం వస్తుంది. (g), (h), వాక్యాల్లో అట్లా వాడటానికికూడా వీల్లేదు.

L. నేనురోజూ త్వరగా ఇంటికి రానని మా ఆవిడ విసుక్కుంటుంది.
m. నీ పాదాలముందు వాలిపోతానంటూ సుజాత సుబ్బారావుకు ఉత్తరం రాసింది.

(m) లో ఆనుకృత వాక్యంలో కర్త, ప్రధాన వాక్యంలో కర్త ఒకటే. అట్లా లేకపోతే వాక్యం వ్యాకరణ విరుద్ధమవుతుంది. (l) లో అట్లాంటి నిబంధన లేదు. కాని (m) లో అంటూ అనుకృతమైన అను ధాతునిష్పన్నమై క్రియ ఆని చెప్పలేం. ఇక్కడకూడా అని అంటూ అనే సంయుక్తరూపాన్ని ప్రయోగించవచ్చు.

(212) లో ప్రయోగించిన వాక్యాలు వ్యాకరణ వివరణాపేక్షకాలు, కాని వీటి విశేషాలు ఇంకా పరిశోధన కందలేదు. అందువల్ల ఇంతకన్నా చెప్పగలిగింది లేదు. వీటిల్లో (l) వాక్యంవంటి వాక్యాలను గురించి కొంతవరకు చెప్పటానికి వీలుంది.

3.84 : అందుకు ముందుగా ఈ కింది వాక్యాలను పరిశీలించండి.

(213)

  a. మంచి కూరల్లేవని భోజనం మానేశాను .
* b. జీడిపప్పు లేదని ఉప్మా రుచిగాలేదు.
  c. యజమాని వచ్చాడని కుక్క. తోకాడిస్తున్నది.
? d. నువ్వు తొందరగా వచ్చావని రైలు లేటుగా వచ్చింది.
* e. ఈ సంవత్సరం అదునుకు వర్షాలు కురిసినయ్యని పంటలు బాగా పండినై.

3.841 : ఈపైక్యాలను పరిశీలిస్తే అని ఇక్కడ హేత్వర్థంలో ప్రయోగించ బడిందని సులభంగా గ్రహించవచ్చు. అనికి పూర్వమున్న వాక్యాన్ని కారణ వాక్యమని, పరంలోఉన్న వాక్యాన్ని కార్యవాక్యమనీ స్థూలంగా అనుకుందాం. ఈ పై వాక్యాల్లో కొన్ని వ్యాకరణ సమ్మతం కాలేకపోతున్నై. 213 a, b లను పోల్చిచూస్తే కార్యవాక్యంలో మనుష్య వాచకశబ్దం కర్తగా ఉన్నప్పుడే వ్యాకరణ సమ్మత మవుతుందని చెప్పవచ్చు. కార్యవాక్యంలో మనుష్యేతరప్రాణి వాచకశబ్దం ఉన్నా 213 c. వ్యాకరణ సమ్మతంగా కనిపిస్తున్నది. (e) లో ప్రాణి వాచకశబ్దం కార్యవాక్యానికి కర్తగాఉన్నా వ్యాకరణ సమ్మతమయింది. అందువల్ల ఈ మూడింటిని పోల్చిచూస్తే కార్యవాక్యంలో జంగమప్రాణి వాచకశబ్దం కర్తగా ఉండాలని ప్రతిపాదించవచ్చు. (d) లో వాక్యం ఆమోదయోగ్యంగా కనిపించినా వ్యాకరణ సమ్మతంకాదు. రైలుబండికి ప్రాణి వాచకత్వం ఆరోపించటంవల్ల ఈ వాక్యం తయారయింది.

3.842 : ఈ కింది వాక్యాల్లో ప్రాణి వాచక శబ్దాలు కర్తలుగా లేకపోయి నప్పటికీ వ్యాకరణసమ్మతాలే, హేత్వర్థబోధకాలే.

(214)

a. నేను ఆలస్యంగా ఇంటికి వస్తానని మా ఆవిడకి కోపం .
b. ఇంట్లో పని ఎక్కువయిందని మా ఆవిడకి విసుగు.
c. పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదని మా ఆవిడకి దిగులు.

వై వాక్యాల్లో ప్రధాన వాక్యాల ఆఖ్యాంతాలు (Predicates) క్రియలుకావు. కాని వాటిని పడు అనే అనుబంధ క్రియను చేర్చి క్రియలుగా మార్చవచ్చు. ఇట్లా మార్చినప్పుడు కు-బంధంతో ఉన్ననామం ఆ క్రియకు కర్తగా మారుతుంది. కర్తృవిహీన వాక్యాలను కర్తృనహిత వాక్యాలనుంచి నిష్పన్నంచేస్తే ఇంతకుముందు చేసిన సూత్రీకరణ సరిపోతుంది. లేకపోతే గుప్తనిర్మాణంలో కర్తృనుభోక్తృ సంబంధాలున్నప్పుడు ఈ రకమైన హేత్వర్థబోధ జరుగుతుందని చెప్పాలి. ఈ వాక్యాల్లో ఆఖ్యాతాలు మనస్థితిబోధకాలు, వాటిని క్రియలుగా మార్చినపుడు మనః పరిణామ బోధకాలవుతై .

3.843 : మనస్థితి బోధకాఖ్యాతాలున్నపుడల్లా ఇట్లా హేత్వర్థం వస్తుందని చెప్పలేం.

(215)

a. లాటరీలో డబ్బు వస్తుందని సుబ్బారావుకు ఆశ .
b. విప్లవం వస్తుందని విరసం కవులకు నమ్మకం.

పై వాక్యాల్లో హేత్వర్థంలేదు. ఆనికి పూర్వమున్న వాక్యాలకు ఆశ నమ్మకం అనే ఆఖ్యాతాలకు దగ్గరి సంబంధం ఉంది. ఉదాహరణకు ఈ కింది వాక్యాలు. (215) వాక్యాలతో సమానార్థకాలు

(216)

a. సుబ్బారావుకు లాటరీలో డబ్బు వస్తుందనే ఆశ ఉంది.
b. విరసం కవులకు విప్లవం వస్తుందనే నమ్మకం ఉంది.

ఈ రెండు వాక్య సమూహల్లోనూ సుబ్బారావుకున్న ఆశ స్వభావం, విరసం కవులకున్న నమ్మకం వ్యక్తమవుతున్నది. ఈ కింది వాక్యాలలో ఇట్లాంటి సంబంధాన్ని చూపించలేం.

*(217)

a. మా ఆవిడకు నేను ఆలస్యంగా ఇంటికి వస్తాననే కోపం ఉంది.
b. మా ఆవిడకు ఇంట్లో పని ఎక్కువయిందనే విసుగుంది.
c. మా ఆవిడకు సరిగ్గా చదువుకోటం లేదనే దిగులుంది.

217 వాక్యాలను 214 వాక్యాలతో పోల్చిచూస్తే ఒక్క c వాక్యాలకే అట్లాంటి సంబంధాన్ని చూపించగలం. 'భయం' అనే ఆఖ్యాతాన్ని ఉపయోగించినప్పుడు కూడా ఇట్లాంటి సంబంధాన్ని చూపించగలం. దీన్నిబట్టి మనస్థితిబోధక నామాలను కొన్ని వర్గాలుగా విభజించవచ్చు. వాక్య విషయాన్ని విశేషణంగా, నిత్యంగా గ్రహించేవి, వికల్పంగా గ్రహించేవి. నిత్యంగా గ్రహించే వాటిలో ఈ హేత్వర్థబోధ ఉండదు. వికల్పంగా గ్రహించే వాటిలో హేత్వర్థబోధ ఉంటుంది.

3.844 : హేత్వర్థంవచ్చిన వాక్యాల్లో జంగమప్రాణి వాచకశబ్దం కర్తగానో అనుభోక్తగానో ఉండటం గమనించాం. అట్లా ఉన్నా ఈ అర్థంగాని మనస్థితి బోధక వాక్యాలను గమనించాం. మరికొన్ని వాక్యాల్లో ప్రాణివాచక శబ్దాలు కర్తలుగా ఉన్నా, హేత్వర్థం రాకపోగా వ్యాకరణ విరుద్ధాలు అవుతున్నై.

(218)

a. ఆధునిక మైన ఆయుధాలు లేవని మన సైనికులు ఓడిపోయారు.
b. వాళ్లమ్మ కోడిగుడ్లు పెట్టలేదని కిష్టప్ప చిక్కిపోయాడు.
c. మందు తాగాడని మా వాడికి జ్వరం తగ్గింది.
d. డాక్టరు పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చాడని రోగి చనిపోయాడు.

ఈ పై వాక్యాల్లో మనుష్యవాచకశబ్దం కర్తగాకాని- అనుభోక్తగా కాని ఉంది. అయినా వ్యాకరణ విరుద్ధాలయినై. ఈవాక్యాల్లో ఓడిపోవు,చిక్కిపోవు, జ్వరంతగ్గు, చనిపోవు అనే వ్యాపారాలు ఆ వాక్యాల కర్త్రనుభోక్తల స్వాధీనంలోలేవు. ఆఖ్యాతాలకు స్వాధీనత, నిరధీనత అనే అంశాలను ప్రతిపాదించాలని ఈ వాక్యాలు నిరూపిస్తున్నై. ఈ స్వాధీనతా నిరథీనతాంశాలు అన్ని క్రియలకు స్థిరంకాదు.

(219)

a. గెరిల్లాలు గెలవాలని ప్రభుత్వ సైనికులు ఓడిపోయారు.

ఈ వాక్యంలో ఓడిపోవటం ఇచ్ఛాపూర్వకంగా జరిగింది. ఇచ్ఛాపూర్వకంగా చేసిన వ్యాపారాలన్నీ కర్తృస్వాధీనంలో ఉంటై. కాబట్టి పై వాక్యం వ్యాకరణ సమ్మతమైంది.

3.845 : దీన్నిబట్టి అని తో ఉన్న వాక్యం హేత్వర్థం కావాలంటే పరవాక్యంలో జంగమప్రాణి వాచకశబ్దం కర్త్రనుభోక్తల స్థానంలో ఉంది, ఆఖ్యాతంలో వ్యాపారం ఆ ప్రాణికి స్వాధీనంలో ఉండాలని సూత్రించుకోవచ్చు. కాని ఈ కింది వాక్యం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది.

(220)

a. ఉపన్యాసకులు రాలేదని సభ వాయిదా పడింది.

ఈ పై వాక్యంలో సభ ప్రాణివాచక శబ్దంకాదు. అయినా పై వాక్యం ప్రయోగయోగ్యం, వ్యాకరణ సమ్మతం. అయితే 'సభ' దానంతటది వాయిదా పడదు, కర్త ఒకరుండి ఉండాలి. అంటే పై వాక్యాన్ని కర్తృసహిత వాక్యంనుంచి నిష్పన్నం చెయ్యాలి. దాని నిర్మాణం కింది వాక్యంలోలాగా ఉంటుంది.

(220)

b. ఉపన్యాసకులు రాలేదని నిర్వాహకులు సభను వాయిదా వేశారు.

3.845 : హేత్వర్ధబోధలో ఇంతవరకు కార్య వాక్యంలో నియమాలను గురించి మాత్రమే గమనించాం. కారణ వాక్యంలో నియమాలనుగూడా కొన్ని గమనించాలి. అందుకు ఈ కింది వాక్యాలను పరిశీలించండి.

?(221)

a. మా అబ్బాయి ఇడ్డెన్లు (తిన్నానని, తిన్నాడని) భోజనం మానేశాడు.
b. నువ్వు జీతం కట్టావని పరీక్ష రాశావు.
C. మా పక్కావిడ మమ్మల్ని తిట్టానని మా ఇంటికి రావడంలేదు.

ఈ పై వాక్యాలు కారణ కార్య వాక్యభాగాలు రెండూ ఏకకర్తృకాలు. వీటిని సంపూర్ణంగా వ్యాకరణ విరుద్ధాలని చెప్పలేంగాని వీటికన్నా పూర్వపు వాక్యాలతో పోలిస్తే ఇవి అంత సమ్మతంగా కనిపించటం లేదు.

3.846 : పై వాక్యాల్లో ఒకేకర్త రెండు వ్యాపారాలను ఒకదాని తరవాత ఒకటి నిర్వహించినట్టు చెప్పబడింది. ఏకకర్తృక నిర్వాహిత వ్యాపారాల్లో అని ప్రయోగం సమ్మతంకాదని (221) లో వాక్యాలు నిరూపిస్తున్నై. అని కి పూర్వమున్న వాక్య భాగంలో భవిష్యద్బోధక క్రియ ఉంటే ఏక కర్తృకత సమ్మతమవుతుంది. కాని నిశ్చయార్థక క్రియారూపాలు వాడటానికి వీలులేదు. కాంక్ష్యార్థంలోవచ్చే దాం, అని అనే ప్రత్యయాలతో ఉన్న క్రియారూపాలు మాత్రమే ప్రయుక్తమవుతై.

(222)

a. సోషలిజం త్వరగా తీసుకు రావాలని ప్రభుత్వంవారు పన్నులు పెంచారు.
b. పుస్తకాలు కొనుక్కుందామని బజారుకు వెళ్ళాను.

ఈ పై వాక్యాల్లో అని కి పూర్వమున్న వాక్యభాగం పూర్తిఅయిన వ్యాపారాన్ని కాని, నిశ్చితమైన భవిష్యద్వ్యాపారాన్నికాక పరవాక్యంలో భాగానికి లక్ష్యాన్ని సూచిస్తున్నది. అందువల్ల ఇది వ్యాకరణ సమ్మతమయింది.

3.847 : అని తో అనుకృతమైన వాక్యంలో ఏ క్రియఉన్నా అది మొత్తం వాక్యార్థంలో నిశ్చయార్థకంకాదు. రెండు భాగాల్లో ఒకేకర్తఉంటే, కర్త తను నిర్వహించినట్టుగా చెప్పే వాక్యంలో అనిశ్చితత్వాన్ని వ్యక్తం చెయ్యటం కుదరదు. అదే లక్ష్యార్థమయితే నిర్వాహిత వ్యాపారంకాదు గనుక కుదురుతుంది. దీన్నిబట్టి ఇంకో సంగతి చెప్పవచ్చు. అని కి పూర్వమున్న వాక్య భాగార్థం పరవాక్యంలో కర్త్రనుభోక్తలచేత భావ్యమవుతుంది. నిశ్చయార్థకం సత్యమనీ, భావ్యమైనది సత్యం కానక్కరల్లేదని వ్యవహర్త అనుకుంటున్నట్టుగా చెప్పవచ్చు. అందువల్ల ఒకే కర్త తను నిర్వహించిన పూర్వవ్యాపారాన్ని గురించి అనిశ్చితంగా ఉండటం సాధ్యంకాదు. అని తో అనుకృతమైన వాక్యాలలో అనిశ్చితాంశం ఉందనటానికి ఈ కింది వాక్యాలను గమనించండి.

(223)

a. వాళ్ళన్నయ్య వచ్చాడని మా ఆవిడ గారెలు వండింది. కాని నిజానికి రాలేదు.

  • b. వాళ్ళన్నయ్య వచ్చాడు కాబట్టి మా ఆవిడ గారెలు వండింది. కాని నిజానికి రాలేదు.

(223) a లో అని కి పూర్వమున్న వాక్యభాగం విషయం యదార్థమవునా ? కాదా ? అనేదానితో ఆ వాక్య వ్యవహర్తకు సంబంధంలేదు. కాని 223 (b) ని ఉపయోగించిన వ్యవహర్త అందుకు బాధ్యత వహించాలి. అందువల్ల ఒకచోట వచ్చాడనిచెప్పి, అదే వాక్యాలలో మళ్ళీ రాలేదని చెపితే అది స్వయంవైరుధ్యం. (Self - contradiction) అవుతుంది.

3.91 : సంజ్ఞానామాల (Propernames) వర్గనిరూపణకోసంకూడా అని ప్రయోగం జరుగుతుంది.

(224)

a. ఆ వూళ్ళో వెంకయ్య అని ఒక రైతు ఉన్నాడు.
b. ఆదేశంలో మిసిసిపి అని ఒక నది ఉంది.

ఈ పై వాటినుంచి “వెంకయ్య అనే రైతు" “మిసిసిపి అనేనది " అనే నాము బంధాలను నిష్పన్నం చెయ్యవచ్చు.

3.92 : అర్థ వివరణలో అంటే శబ్దం ప్రయుక్తమవుతుంది. ఈ అర్థ వివరణ ఒక శబ్దానికిగాని, వాక్యానికిగాని, ఒక విషయానికిగాని, సంఘటనకుగాని జరగవచ్చు. శబ్దానుకృతి జరిగినప్పుడు అది ఏ భాషాశబ్దమైనాకావచ్చు.

(225)

a. ఏరాలు అంటే తోటికోడలు.
b. అంభన్ అంటే నీళ్ళు.
c. ఎన్నికలు వస్తున్నయ్యంటే నల్లధనానికి పని కలిగిందన్నమాట.

(224, 225 ) లో వాక్యాలూ, పదబంధాలు ప్రత్యేకంగా ఒకరులేక కొందరు వ్యవహర్తలు అనుకరించినవికావు. భాషలో పదాలనుగాని, జీవితంలో సంఘటనలనుగాని ఆనుకృతంచేసి వ్యాఖ్యానం చెయ్యటం ఇక్కడ కనిపిస్తున్నది. పై వాక్యాల్లో అనిఅర్థం అనిభావం అన్నమాట (215 c లో లాగా) వాడవచ్చు.

అన్నమాట అనేది తెలుగులో ఇతర నిశ్చయార్థక వాక్యాల తరవాత కూడా ప్రయుక్తమవుతుంది. ఒక వాక్యం వక్తచేస్తున్న వ్యాఖ్యానం అని సూచించటానికి వాడతారు. అట, కదా అనే - శబ్దాలుకూడా వ్యక్తమైన భాషాంశంమీద వక్త్రుద్దేశాన్ని సూచించేవే. 3.93 : కొన్ని ప్రశ్నార్థక శబ్దాలకుకూడా అని, అంటే లు ప్రయుక్త మవుతై.

(226)

a. ఎందుకని రాలేదు?
b. ఎక్కడని వెతికేది?
C. ఏమని చెప్పాడు.
d. ఎందుకంటే.... .....

ఇట్లాంటి విశేష ప్రయోగాలున్నై వీటిని కూడా అనుకరణ సంబంధులుగానే ఊహించవచ్చు.

3.94 : ఇవిగాక గణగణమని, పకపకమని మొదలైన ధ్వన్యనుకరణ ప్రయోగాలు కూడా తెలుగులో ఉన్నై. భాషేతర శబ్దాలను అనుకరించవచ్చునని ఈ శబ్దాలు నిరూపిస్తున్నై. అంతేగాక ధగధగమని, తళతళమని వంటి ప్రయోగాలు చూస్తే స్పర్శయోగ్యమైనవాటిని, గుప్పుమని- (వాసన వచ్చింది) వంటి వాటిని చూస్తే ఘ్రాణయోగ్యమైన వాటినికూడా అనుకరించవచ్చునని తెలుస్తుంది. ఇంద్రియ గ్రహణ యోగ్యమైన ప్రతిదీ అనుకరణ యోగ్యమేనని చెప్పవచ్చు. వీటిల్లో కారాగమం విశేషం. ఇదిగాక పరోక్ష విధిలో మాత్రమే ఇట్లాంటి కారాగమం వస్తుంది.

తెలుగులో అనుకరణానికి చాలా విస్తృతమైన ప్రణాళిక ఉంది. తెలుగులో అనుకరణం మీద చేసే పరిశోధనవల్ల అసలు భాషల్లో అనుకరణ, తత్వాన్ని పరిశీలించటానికి ఉపయోగిస్తుంది. భాషను గురించి భాషలో చెప్పటానికి అనుమతించే సాధనం అనుకరణ. ఈ అనుకరణము గురించి ఇతర భాషల్లో ఏమంత పరిశోధన జరిగినట్టు కనపడదు. తెలుగులో జరిగిన ఈ మాత్రం పరిశీలనైనా అందుకు పనికివస్తుంది. విశాల విశ్వాన్నే గర్భీకృతం చేసుకొనే శక్తి అనుకరణకుంది. కాబట్టి భాషను అర్థం చేసుకోటానికి అట్లాంటి పరిశీలన అవసరం.