తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/నోటీసు

నోటీసు.

                                           గుండ్లపల్లి - సుబ్బారావుగారు.

నేటిరాత్రి ! చౌ ! చౌ ! చౌ ! చౌ ! నేటిరాత్రి !! పేరులేని పెద్దపట్టణమున అమర్చియుండు మాస్వంతడేరాలో అద్భుతము! ఆహ్లాదకరము! చూడవేడుక! శ్రవణానందము!

నేత్రోత్సవము!

చిమటలుకొట్టిన సీనులు! చింపిరిదుస్తులు! ఆరితేరిన రసలుబ్దులు! శ్రుతిహీనపు పాటలు ! వర్ణక్రమములేని వర్ణమెట్టులు !

తాళజ్ఞానముని తదిరతులు !!

"భావప్రదర్శన పూర్ణానుస్వార నవరసనాశన నీరస సభవారిచే"

నేలగట్టుపల్లి కర్ణపిశాచ కవిత్వధ్వంస కాలనాభముగారిచే రచియింపబడిన నవీన సంగీత

"హరి చిత్ర లవ రావ బృహ" అను చౌచౌ నాటకంము

                  ప్రదర్శింపబడును.

తాము బందుమిత్ర సమేతులై వచ్చిచూచి నేత్రపండున గావించుకొందురని మాయాజ్ఞ !

   మాఅక్టర్లు పాడుపాటయున్ను చేయుఆక్టున్ను పరోక్షమున చూచు వారికే నీరల్ సామర్ధ్యము తెల్లము గాగలదు.  వీరలధిక ధైర్య గాంబీర్య సాహసము గలవారలే. పాటలు కర్ణకుహరములు బగుల్చు గార్ధభస్వరముతోను, తాళ భేతాళములతోను, అర్ధరీడ్దు హార్మోనియ విహీనముతోను, ప్రేక్షకులకు రౌద్రోద్రేకము కల్గి ఒడులు జలదరించునట్లు ప్రదర్శింపబడును. హరిశ్చంద్రుడు చంద్రమతిని మాలకమ్మి వెడలునపుడు నటించు హాస్యరసమును, నలుడు దమయంతిని వివాహమాడునపుడు నటించిన రౌద్రరసమును, ఆంజనేయులు శ్రీరామాశ్వమేధయాగ సందర్భమున లవకుశుల మార్కొన్న సందర్బమున నటించిన బీభత్సరసమును, రామదాసు నిర్భంధితుడై కొరడాలచే మోదబడినపుడు నటించిన శృంగారరసమును, వీరరసమును, ఉత్తరుడు కౌరవ సేననుచూచి నటించిన కరుణారసమును, శాంతరసమును చూడతగిన రంగములు.

ముఖ్య పాత్రలు;--

బృహన్నల:- పూర్వసువాసినీ ఆంధ్రరంగ ధ్వంసోద్ధారక నిరక్షకుక్షి బిరుదాంకితులగు, బుచ్చయ్యగారు.
బాహుకుడు: పండితపుత్ర భావనాశన బాలబాబుగారు.
నలుడు:-నవరస విహీన బిరుదాంకితులగు నరపరాజుగారు.
రామదాసు;- రంగసింహ రామబ్రహ్మంనాయుడుగారు.
లవ,కుశులు:- ఆంధ్రనాటక జీరంగి, బాకా, బిరుదులందిన ముప్పది వత్సరముల వయస్సుగల లేబ్రాయపు ముద్దుబాలురు చిట్టిబాబు, బుచ్చిబాబుగార్లు.
దమయంతి:-దండు దరిద్రాదేవిగారు.
కమల:-కళావిహీన, కలహకంఠి కామేశ్వరిగారు
సీత:-సిరిముక్కుల శివరామాబాయిగారు.
కబీర్:-కబొది కాటంరాజుగారు.
తదితర స్త్రీ పురుషపాత్రలు సమయోచితము. వీరలందరు విధ్యంసులే ?

రేట్లు వివరం

1,2,3 తరగత్లు పురుషులకుచితం.

        1,2,3 తరగతులు స్త్రీలు పురుషులవెంట రావచ్చును.
           బాలురకు 2 x 2 --4.

కంపెనీరూల్సు:- నోటీసు అడిగినవారికివ్వబడదు. రూల్సు అచ్చువేయలేదుగాని విరుద్దముగా నటించువారికి తమలపాకుబీడాలు యివ్వబడును. సిగరెట్టులు, బీడీలు, చుట్టలు, సొడా వగైరాలఖర్చులు తామే భరింపవలయును. టిక్కట్లులెని వాని కేయిక్కట్టులేదు. తరగతిమర్చి తరగతిలో కూర్చున్నవారికి తగుబహుమతు లివ్వబడును. అనుకూలమువల్ల ప్రదర్శన మాపుదలచేసిన యెడల ఉప్మా, టీ ఉచితముగ యివ్వబడును. స్థలము నిండినవెనుక అన్ని తరగతుల టిక్కట్లు అతిత్వరితముగ ఇవ్వబడును.

దరిద్రదామోదర్, రంగధ్వంపక్, కళావిహీన్,

ప్రొప్రయిటరు. స్టేజిమేనేజరు-కండక్టరు. సెక్రటరి.