తెనాలి రామకృష్ణకవి చరిత్రము/భాగవతము

24 భాగవతము

కూచిపూడినుండి రాయలకడ ప్రదర్శించుటకై యొకప్పుడు భాగవతులువెళ్లిరి. రాయ లొకనాడు వారిప్రదర్శనమునకు నిర్ణయించెను. రామకృష్ణుడు వచ్చినచో నేదో యల్లరి నారంభించి కథ సరిగా జరుగనీయడని తలంచి, పహరావారితో 'ఏమైనను సరే రామకృష్ణుని రానీయవలదు' అని చెప్పెను. ఈసంగతి రామకృష్ణకవి తెలిసికొని వ్యస్తచిత్తుడై యెటులైన భాగవతముఁజూచి తీరవలయునని, మారువేషమున నచటికేగెను. కావలియున్న భటులు చర్మ వేషధారియైన రామకృష్ణుని కంఠస్వరమునుబట్టి గుర్తించి లోనికి బోనీయరైరి. రామకృష్ణుడెంతబతిమాలినను లాభములేకపోయెను. తుద కాతడొక యుక్తి పన్నెను.

'ఓరీ మిత్రులారా! ఒకమాట చెప్పిదను. శ్రద్ధగా వినుడు. ' రాయలు నేడందరకు నేదోయొక బహుమానమిచ్చును. ఆబహుమానము నాకక్కర లేదు. మీయిరువురకు బంచియిచ్చెదను. నన్ను లోనికి పోనిండు' అని రామకృష్ణు డాకావలివారల కాశపెట్టెను. భటులంగీకరించి, రామకృష్ణకవిని లోనికిబోనిచ్చిరి. కృష్ణుని యల్లరి చేష్టలను యశోదతో గోపికలు చెప్పుచుండునట్టి ఘట్టము భాగవతులచే బ్రదర్శింప బడుచుండెను. యశోద కృష్ణునిచీవాట్లు పెట్టుచుండెను, రామకృష్ణుడు మెల్లగా నాభాగవతులనుసమీపించి కృష్ణపాత్రధారుని కఱ్ఱతోగొట్టగా, నాతడు కుయ్వోయని యేడ్వసాగెను. ఎవరాయల్లరియని రాయలు ప్రశ్నింప భటులు ' రామకృష్ణకవి' అనిరి.

'ఎందుల కావేషధారిని కొట్టినా'వని రాయలు కవిని నిరోధించి యడుగగా నాతడు 'మహారాజా! యశోద కృష్ణుని మందలించుటయేగాని కొట్టుట బ్రదర్శింపని యీభాగవతుల భాగవతమెంత యందముగా నున్నది. అందుచే నిది రక్తికట్టుటకై కృష్ణపాత్రధారిని గొట్టినా నని బదులుపలికెను. రాయలు కుపితుడై పహరా నిచ్చుచున్న భటుల బిలిపించి 'రామకృష్ణుని యిరువదినాలుగు దెబ్బలు కొట్టుడని యాజ్ఞాపించెను రామకృష్ణునిఁ దీసికొని పోవుట కాభటులు ముందుకురాగా మహారాజా! మీరు శిక్షవిధించుట న్యాయమేగాని నేను లోనికి నచ్చినపు డీ యిరువురు భటులతోడను, నాకు రాయలవారు ప్రసాదించు బహుమానము చెరిసగము మీకిచ్చెదనంటిని. అందుచేత నాయిరువది నాల్గు దెబ్బలలో వీరికి పండ్రెండు వారికి పండ్రాడు దెబ్బలు తగులవలయు ననెను. ఆభటులు మొర్రోయని ఏడ్వసాగిరి. రామకృష్ణుని యుక్తికిముదమంది రాయలు మన్నించెను.


25 తిమ్మరుసు

ఉత్తరదేశ దండయాత్ర పూర్తిచేసికొని వచ్చుచు, రాయలు సింహాచలక్షేత్రమును సందర్శన మొనరించెను. సింహాద్రిస్వామి సన్నిధిని రాయలనేక దానములగావించెను. పెద్దనాది కవులందరు గూడ రాయల ననుసరించియుండిరి. తిమ్మరుసు మంత్రికూడ పెక్కు దానముల జేసెను. రాయ లగ్రహారదానము చేయనెంచితినని చెప్పగా రామకృష్ణుడు తన బంధువుఁడగు మంత్రిప్రగడ బుచ్చి వేంకయ కాదానమిప్పించవలసినదని రాయలను కోరెను. రాయ లందులకు సమ్మతింప, తిమ్మరుసు, రామకృష్ణుడు తక్కుంగల కవులవలె దనయెడ భయభక్తియుకుడై మెలంగడను కోపముతో వలదని వారించెను. రామకృష్ణుడు క్రోధమునంది యీపద్యము జదివెను-

ఉ. లొట్టయిదేటిమాట పెనులోభులతో మొగమాటమేల తా
     గుట్టకయున్న వృశ్చికము కుమ్మరపువ్వని యందు రేకదా
     పట్టపురాజుపట్టి సరిపల్లె సరాసరి యీయకున్న నే
     దిట్టకమాన నామతము తీవ్రమహోగ్రభయంకరంబుగాఁ.