తెనాలి రామకృష్ణకవి చరిత్రము/నల్లకుక్క నావుగ జేయుట

21 నల్లకుక్కను ఆవుగ జేయుట

రాయలొకనాఁటి యుదయమున వపనము జేయించుకొనుటకై మంగలికి గబురుచేసెను. ఆమంగలి వచ్చుటకు గొంచె మాలస్యమయ్యెను. ఆతఁడువచ్చి చూచుసరికి రాయలు కుర్చీలో గూర్చుండి నిద్రాముద్రితుడై యుండెను. రాయలకు నిద్రాభంగము జేయుట పాడికాదని, మెల్లగా క్షురకర్మ ముగించి వెడలెను, కొంతసేపైన పిదప రాయలులేచి, తాను నిద్రాబద్దుడై యుండగనే మంగలి క్షౌరముచేసి వెళ్ళిపోవుటచే వాని చాకచక్యమున కెంతయు సంతోషించి, వానికి కబురంపి, 'నీకేమికావలయు?' నని యడిగెను.

'మహారాజా! నాకు జిరకాలమునుండి బ్రాహ్మణుడ కావలెనని యున్నది. నాకు ధనముగాని, మఱేయుఁగాని యక్కఱలేదు. నాకోరిక నెరవేర్చిన జాలును' అని యా క్షురకుడు పలుక , రాయలు 'అదెంతపనియని' బ్రాహ్మణుల రావించి, శుభదినము నిశ్చయింప జేసెను.

శుభదినమున ద్విజు లామంగలిని తుంగభద్రానదికి దీసుకొని వెళ్ళి, స్నానము జేయించి మంత్రములు జదువుచుండిరి. రామకృష్ణ కవి యీ వృత్తాంతమును దెలిసికొన్నవాడై మఱికొందఱు బాహ్మణుల దనవెంట నిడుకొని, నదీతీరమున వారున్నచోటికే పోయి యొకింత దూరముగా నిలువబడి యొక నల్లకుక్కను మాటి మాటికి నీటిలో ముంచుచు, మంత్రపఠన మొనరింపసాగెను. రాయలు సమీపించి 'రామకృష్ణకవీ! కుక్క నేడ్పించు చున్నా వేమి?' అని ప్రశ్నించెను.

రామకృష్ణుడు 'రాజేంద్రా! ఈ శునకమును ఆవుగా జేయవలయునని యిచటకు గొనివచ్చి, మంత్రముల జదివించుచున్నా' నని బదులుపలుక , రాయలు 'అమాయకుడా! పావన స్రవంతీజలస్నానము వలన, వేదమంత్రపఠనమువలన కుక్కగోవగునా? ఈవిచిత్ర మెచ్చట నైనకద్దా? యనెను. వికటకవి 'ప్రభూ! తామనుగ్రహించి, మంత్ర మూలమున మంగలిని బ్రాహ్మణునిగా జేయుటలేదా? అదివిచిత్రము కాదా మంగలి ద్విజుండగుటయే తటస్థించునేని యీ శునకము తప్పక గోవగును సందియము లే'దనెను,

తన యవివేకమును దెలియజేయుటకే రామకృష్ణు డిట్టి పన్నాగము బన్నెనని గ్రహించి, రాయలు మంగలిని పిలిచి 'ఓయీ! నీవు బ్రాహ్మణ్యము నెట్లును బొందజాలవు నీకు వలయునది మరేదియైన గోరుకొనుము' అని చెప్పి, యంతఃపురమునకు బోయెను.


22 పింగళి సూరన్న

రామకృష్ణకవి రాయలు తదితరులు నాస్థానమున నుండగా యొకనాడు 'భార్య సద్గుణవతియైనచో బురుషునకు బ్రసిద్ది--మంచి బేరువచ్చునుగదా! యనెను, పింగళసూరన్న 'ఆహా! ఎంతగొప్పగా సెలవిచ్చినావు? భార్యగుణవతియైయుండి భర్త దుర్మార్గుడైనచో, భర్తకు గీర్తియెట్లు కలుగును? ఇరువురును గూడ సద్గుణశాలురై యున్నచో గీర్తికలుగుట వాస్తవము' అనెను----

'అవును నీవు రాఘవపాండవీయములో వ్రాసికొనినట్లు చెప్పుచుందువు. నీకవిత్వమునే బలపరచుకొనుచుందు' వని రామకృష్ణుడనగా, రాయలు “దానికిని దీనికిని సంబంధ మేమున్న?' దనెను, రాసుకృష్ణకవి 'ఆర్యా! ఇదిగో యీతడు వ్రాసిన పద్యము.

సుతుని దౌష్ట్యముచే, బలాత్కారముచే ధృతరాష్ట్రుడుకుమారుని మార్గమునే యనుసరించినను, సతియగు గాంధారి సౌజన్యము వలననే కీర్తి కాముడయ్యెను.