తెనాలి రామకృష్ణకవి చరిత్రము/తాతాచార్యుల కవమానము

31 పట్టెడు మెతుకు

'రాయలకడసెలవుగొని రామకృష్ణకవి మఱొకసారి నెల్లూరునకు బోయెను. శ్రీమతియను వేశ్య యఖండపాండితీవిభాషితమైతన్ను వాదమునగాని, మఱియేవిషయముననైనగాని గెలిచినవారితో భోగసాగర తరంగముల నోలలాడుటయేగాక వేయి దీనారముల నిచ్చెద' నని ప్రకటన మొనరించి యుండెను. రామకృష్ణు డామె నెట్లయిన నోడించి యాబహుమానము దానొందవలయుననితలంచి, యొకనాటి సాయంసమయమున గడ్డిమోపునెత్తుకొని యావేశ్య యింటికడ కేకవైచెను. ఆమె 'అబ్బీ ? గడ్డిమోపెంత?' అని యడిగెను. “ఆఁ! తగిలినది. బేరము అని తలంచి, పట్టెడు మెతుకుల కిచ్చెద' ననెను .

'అయితే ఆదొడ్డిలో బడవేయు' మని యా శ్రీమతి పట్టెడన్నముతెచ్చి 'బట్టపట్టు' మనెను – రామకృష్ణుడు 'పాండిత్యమున నసమానినని గర్వించుచున్నావు. పట్టెడు మెతుకున కిచ్చెదనంటిని గాని పట్టెడన్నము కంటినా? చక్కగా ఓడిపోయినావు పందేమొడ్డిన వేయి దీనారములను యి'మ్మనెను ఆమె యోడితినని యొప్పుకొని యా రాత్రి యాతనితో సౌఖ్యార్ణవ తరంగమాలికల దేలియాడి వేయి దీనారములనుయిచ్చెను. రామకృష్ణుడు విజయనగరమునకు దిరిగివచ్చి రాయల కీసమాచారము నెరిగించి యాహ్లాదమొదవించెను.


32 తాతాచార్యుల కవమానము

వృద్ధుడయ్యును తాతాచార్యులు వేశ్యలగృహమునకు దఱుచుగా వెళ్ళుచుండునని యెవ్వరో చెప్పుటచే రామకృష్ణుఁ డొకనాఁడు 'ఆచార్యులవారూ ! తాము గతరాత్రి వేశ్యయగు చంద్రిక గృహ మున కేగినారా లేదా? నిజము చెప్పుడు లేనిచో రాయలకీ సమాచారము దెలిపితీరుద' ననఁగా తాతాచార్యులవారు 'రామకృష్ణా! నీవు దేవాంతక నరాంతకుడవు. నీతో నసత్య జెప్పినచో లాభము లేదు. వారవనితా గృహమునకు నేనేగినది సత్యమేకాని నీ పుణ్యమా యని యెవరితోడనుజెప్పి, నన్నపహాస్యము పాలుచేయకుము' అని - బ్రతిమాలిరి.

'అట్లయిన నన్నెత్తుకొని యిటునటు త్రిప్పుడు' అని రామకృష్ణుడు పలుక, చేయునది లేక తాతాచార్యుల వా రాతనిని భుజములపై నెక్కించుకొని యటునిటు తిరుగసాగిరి. అంతఃపుర సౌధముపై నున్న రాయలదిచూచి భటుల బిలిపించి 'ఓరీ! అడుగో ! తాతాచార్యులవారి భుజములపై రామకృష్ణు డెక్కినాడు. వెంటనే వాని నిటు లీడ్చుకొనిరని డనెను. రాయలు సంజ్ఞచేయుట చూచిన రామకృష్ణుడు వెంటనే క్రిందకురికి 'ఆచార్యులవారూ ! మహాపరాధిని క్షమింపుడు. మిమ్ము నేనెత్తుకొందును' అని ఆయన వలదనుచున్నను యెత్తుకొని గంతులు వేయసాగెను. ఇంతలో భటులువచ్చి, రామకృష్ణుని భుజములపై నెక్కియున్న తాతాచార్యులవారినిఁ గ్రిందఁ బడద్రోసి యీడ్చుకోనిపోయిరి. రాయలు ఇదియేమిపనిరా! తాతాచార్యుల వారిని గొనివచ్చిరి?' అని భటులనడుగ, వారు 'మహారాజా! పైనున్న వానినేగదా తాము తీసుకొని రమ్మని సెలవిచ్చినది?' అని యనిరి. రామకృష్ణుని యుపాయమునకు విస్మితుడై రాయలు మన్నించెను.


33 పాండురంగ మహాత్మ్యము

తెనాలి రామకృష్ణకవికి మొదట రామలింగమను పేరుగూడ కలదనియు, నితఁడు శివభక్తియుక్తుడై లింగపురాణము నాంద్రీకరించె