తెనాలి రామకృష్ణకవి చరిత్రము/కుమ్మర మొల్ల

27 కుమ్మర మొల్ల

రాయలు విద్యానగర సామ్రాజ్యమును బరిపాలించుచున్న కాలమున నాత్కూరి మొల్లయను కుమ్మరస్త్రీ యుండెను, భర్త యామె బాల్యముననే మృతినొందినను, మారుమనుమున కిష్టము లేనిదై నాంధ్రమున బరిశ్రమ మొనరించి, కవిత్వముచెప్పుట నేర్చెను. శ్రీశైలశైవారాధ్యులవారికడ శుశ్రూష చేయుచు జాలకాలము గడపెను. శైవారాధ్యులవారికి సంతానము లేకుండుటచే దమ యవసానదశలో దమకున్న ధనమంతయు నిచ్చివైచిరి, ఆధనముతో నామె యుదరపోషణ మొనరించుకొనుచు, దన కవితాశక్తినంతయు వినియోగించి, రామాయణము వ్రాసెను.

ఆ రామాయణము నామె రాయల కంకిత మీయనెంచి, యాస్థానమున కరిగి చదువుట కనుమతి నీయగోరెదను. రాయలు వల్లెయనగా, రామకృష్ణకవి 'ఆడుదికూడ-నందులో గుమ్మరస్త్రీ కుండలు చేసికొనుటకు మాఱు రామాయణమే రచించుటయా'యని నిరసనభావముతో 'రాజేంద్రా! నేనొక పద్యము వ్రాసితిని. ముందు నాపద్యము నాకర్ణించి, తరువాత నాగ్రంథమును జిత్తగించుడు' అని ముందుగా 'వాల్మీకి దన బూతుపద్యము జదివెను. మొల్ల సిగ్గుపడి, యచటినుండి వెడలిపోయి తన గ్రంథమును శ్రీరామచంద్రునకే యంకిత మొసంగెను. ఆవృత్తాంతము నాలకించి, రాయ లామెను బిలిపించి మొల్లా! నీవు బహుజనశ్లాఘనీయమగు పనిజేసితివి. రామచంద్రున కంకితమిచ్చి, 'ధన్యవైతి'వని కొంతధనము నిచ్చి నీవు మా నగరమున నివసింపుము. ప్రతివత్సరమును నీయుదరపోషణకు వలయు ధనము మేమిచ్చుచుందు'మనెను,

ఆమె నిగర్వి. తనకు నౌకరులుండవలసిన బనిలేదని, స్వయముగా నంగడికిబోయి వలయు సంబారముల దానే కొని తెచ్చుకొను చుండును. ఒకనా డామె యంగడికిబోయి కోడిపెట్ట నొక దానింగొని కుక్కగొలుసు మఱొక కేలంబూని వచ్చుచుండెను. రామకృష్ణు డామార్గముననే పోవుచు తన కెదురైన మొల్లనుజూచి, పరిహాసపూర్వకముగా 'మొల్లా! రూపాయిచ్చెద గుక్కనిచ్చెదవా, పెట్ట నిచ్చెదవా? యనెను. ఆ వ్యంగ్య సంభాషణకు గుపితయయ్యు పరమ శాంతస్వభావి యగు మొల్ల 'రామకృష్ణకవీ! నీవేమి యీయఁబూనినను నీకు నేనమ్మనుకదా!' యనెను. రామకృష్ణుడు సిగ్గుపడి యారోజు నుండియు నామెయందు మాతృభావము గల్గియుండెను.


28 అయిదు వేలు

రాయలు కవులందరకు మాసవేతన మిచ్చుచుండెను. రామకృష్ణకవికూడ యదేవిధమున మాసవేతనము నొందుచు బిల్లలు కలవా డగుటచే నా ధనముతో గడుపుకొనజాలక యిబ్బంది పడుచుండెను. ఎట్లయిన రాయలునుండి ధనము స్వీకరింపవలయునని రామకృష్ణు డుపాయముల నూహింపసాగెను. తుదకొక చక్కని యుక్తి నాలోచించి, భార్యాపుత్రులకుజెప్పి, రాయలకడ కరిగెను. రాయలు సంతోషాన్వితస్వాంతుడై యున్నతఱి రామకృష్ణుడు సమీపించి, మహారాజా ! నాగుండెలు నిరంతరము నగ్నిహోత్రముచే దహింపబడినట్టుమండిపోవుచున్నవి. ఇక నేనెంతో కాలము బ్రతుకను. నాకు జాలమంది పిల్లలు కలరు. నేను మరణించినచో వారిపాట్లు వర్ణించుట కా యాదిశేషునికైన నలవికాదు, జ్యోతిష్కులుకూడ నిక నెంతోకాలము బ్రతుకవనిరి. నాకు జాల బెంగగానున్నదనెను. రాయలు దయార్ద్రహృదయుడు. రామకృష్ణుని వాక్యములకు జూలినొంది. 'కవిచంద్రమా ! ధనార్జనాసక్తులగు జ్యోతిష్కులమాట పాటింపరాదు. నీవట్టి బెంగలతో క్రుంగిపోకుము. 'మనోవ్యాధికి మందు లేదుకదా ! యను సూక్తి నెరుంగవే? ఒక వేళ నీవు మృతి నొందుటయే తటస్థించినచో నీ భార్య కయిదువేల దీనారముల నంపె