తిమ్మరుసు మంత్రి/పంచమ ప్రకరణము


పంచమప్రకరణము

"సీ. సర్వజ్ఞుఁ డగుమంత్రి నవదరించినరాజు
            కార్యఖడ్గమ్ములక్రమ మెఱుంగు
     కార్యఖడ్గంబులక్రమ మెఱింగినరాజు
            బహువిధముల మూలబలముఁ గూర్చు
     బహువిధముల మూలబలము గూర్చినరాజు
            శత్రుల నవలీల సంహరించు
     శత్రుల నవలీల సంహరించినరాజు
            ధరణి యేకాతపత్రముగ నేలు

     కావున మహాప్రధానాగ్రగణ్యుబుద్ది
     యధిపుసామ్రాజ్యమునకు సర్వాంగరక్ష
     రాయమలవీరగండ : వీరప్రచండ !
     గుండభూపాలు నరసింహమండలేంద్ర !"

అని మున్ను సాళ్వనారసింహభూపాలుని యాస్థానకవీంద్రుఁడు చెప్పిన చందమున మహాప్రధానాగ్రగణ్యునిబుద్ధియే యధిపుని సామ్రాజ్యమునకు సర్వాంగరక్ష యనుమాట యధార్థము. సర్వజ్ఞుండని చెప్పందగిన తిమ్మరుసుమంత్రి బుద్ధియె యీయభినవకర్ణాట సామ్రాజ్యమునకు సర్వాంగరక్షగా నుండెననుట యతిశయోక్తిగాదు. తిమ్మరుసువంటి మంత్రిసత్తము డుండుటచేతనే కృష్ణదేవరాయనివంటి చక్రవర్తి యుండుట సంభవించెను. అరటిపండొలిచి చేతి కందించినరీతిగా నేవిధ మైన కష్టమును బోరాటమును లేకుండ నుపభోగింపుమని మహాసామ్రాజ్యవైభవము నంతయుఁ గృష్ణరాయని హస్తము నందుంచి యతనికిఁ జేసిన వాగ్దానమును నెఱవేర్చుకొనియెను. అదివఱకె తిమ్మరుసునకుఁగల స్వామిభక్తియుఁ బ్రజాసంరక్షణా సక్తియు లోకములో వ్యాప్తమై యున్నందునఁ బ్రజలెల్లరును తిమ్మరుసే తమ కేళుగడయని నమ్మి విశ్వాసముతోఁ గార్యములలోఁ నతిశ్రద్ధాళురై తోడ్పడుచుండిరి. తక్కుంగల భృత్యపరివారసామంతవర్గము తిమ్మరుసును పితృసమునిగా భావింపుచు భయభక్తులతో వినయవిధేయులై వర్తింపుచుండిరి. ఇట్టి మహావైభవపదవియంచున్న తిమ్మరుసు నెదుర్కొని యెవ్వడు బ్రదుకుఁ గాంచును? కావున నెవ్వరును గృష్ణరాయని రాజ్యాభిషేకము నడ్డుకొనువారు లేకపోయిరి.

రాజ్యపట్టాభిషేకము.

తిమ్మరుసుమంత్రి శా. శ. 1430 కి సరియైన శుక్లనామసంవత్సర మాఘశుద్ద చతుర్ధశినాఁడు (1509-దవ సంవత్సరము ఫిబ్రవరి 4 వ తేది) సామ్రాజ్యాభిషిక్తునిఁ గావించుటకు నిశ్చయించి సామ్రాజ్యమునందంతటఁ బ్రకటింపఁజేసెను. మహారాజులకు సామంతనృపవర్గమున కాహ్వానముల నంపించెను. అతఁడు మహాద్భుతముగా విజయనగరము సలంకరింపఁజేసెను. ఇతరస్థలములందుండిన సైన్యములను బెక్కింటిని రాజధానికి రప్పించెను. విజయనగర మెట్లలంకరింపఁజేసెనో యావిధ మొక్కింత కుమారధూర్జటి యనుకవివరుండు తన కృష్ణరాయ విజయంబను గ్రంథమున నీక్రింది పద్యములలో నభివర్ణించి యున్నాడు.

"సీ. ప్రణుతింప నతఁడు తోరణ గట్టు పరిసీమ
               లనురీతి నూత్నతోరణము లెసఁగ
    రిపుల ఖండించి సత్కృపఁ దత్సుతుల నిల్పు
               నట్ల ద్వారములందు ననఁటు లలర
    విలిఖించునతఁడు దిక్కుల జయస్తంభాళి
               ననుమాడ్కిఁ జిత్తర్వుహర్వు లలర
    వెలయు నిట్లతనికీర్తులు దిక్తటుల నన్న
               సరణి ముతైఁపు ముగ్గుజగ్గు లమర

    నభినవాలంకృతిస్ఫూర్తి నతిశయించె
    నప్పురీరత్న మపుడు మహాద్భుతముగఁ
    బ్రకటమహిమల శ్రీకృష్ణరాయనృపతి
    శ్రీకరం బైనపట్టాభిషేకవేళ."

మహామండలేశ్వరులైన మహారాజు లనేకులు కృష్ణరాయనికిఁ గానుక లంపించిరి. అనేక సామంతనృపతులు పట్టాభిషేకము సందర్శింప విజయనగరమున కేతెంచిరి. మఱియు శ్రీరంగపట్టణముననుండి కుమార వీరశ్యామలరాయఁడు, కందనోలినుండి ఆర్వీటి శ్రీరంగరాజు, నంద్యాలనుండి నంద్యాల నారపరాజు, ఆకువీటినుండి ఆకువీటియిమ్మరాజు, గండికోటనుండి పెమ్మసాని రామలింగన్నభూపతి, కొచ్చెర్లకోటనుండి రావెల పెదతిమ్మభూపాలుఁడు, వెలుగోడునుండి వెలుగోటి కుమారతిమ్మభూపాలమౌళియు నింక ననేకు లాపట్టాభిషేక మహోత్సవమును సందర్శింప నేతెంచిరి. ఇట్లుండ సింహాసనాధిరోహణ సమయము తటస్థము కాఁగాఁ గృష్ణరాయనికిఁ బన్నీట జలకమార్చి, కిరీటాంగదాదుల సమర్పించి సర్వాభరణభూషితుం గావించి యిలు బయలుదేఱు సమయం బిదె వచ్చెనని తెలియఁ బఱచ, నందు కారాకొమరుండు సిద్దముగా నున్నాఁడ నని తెలిపెను. పిమ్మట తిమ్మరుసుమంత్రి యొక విచిత్రమైనకథ నడిపించెనఁట! తిమ్మరునుమంత్రి కృష్ణదేవరాయనితో నొకరహస్యము చెప్పవలసి యున్నదని యతని నొకగదిలోనికిఁ గొని బోయి తలుపుచాటునకు రమ్మని చేరఁదీసి యిదె రహస్యమని యొక చెంపకాయఁ దనసత్తువుతోఁ గొట్టెనఁట ! ఆచెంప పెట్టునకు కన్నుల నీరుగ్రమ్మి నెత్తురు తలకెక్కి తల దిమ్మెత్తఁ గృష్ణరాయఁడు చతికిలంబడియెనఁట ! తనకంట నీరు నించుచు త్రిమరు సాతనిముంగటఁ గూరుచుండి యుండెనట ! కొంతవడికి నారా కొమరుఁడు తెప్పిరిల్లి కన్నులు విచ్చి తిమ్మరుసును వీక్షించే నఁట ! అంత తిమ్మరుసు రాయనిం గౌఁగిలించికొని ముద్దాడి యిట్లనియెన్నఁట!

"అన్నా! నీ దేహము నొచ్చెనని నన్ను దూషింపకుము. ఈపనిఁ జేయటకుఁ జేతులాడక యిన్నిదినంబు లూరకున్నాఁడను. ఇఁక నూరకయున్న స్వామిద్రోహము చేసినవాఁడ నగుదు నన్న భయముచేత నిపు డీకృత్యము నెఱపితిని నన్ను మన్నింపుము" అని మంత్రిశేఖరుఁడు పలుక నతఁ డచ్చెరువంది తన కేవిధమైన యపకారమును గలుగకుండఁ బ్రతిదినమును వేయి గన్నులతో వీక్షింపుచు సంరక్షించుచున్న తిమ్మరుసు కారణములేనిదే నేఁడిట్టిపని చేసి యుండఁడనియు ఏది చేసినను తన యుపకారముకొఱకే చేయునన్న విశ్వాసము గలవాఁడు గావున తిమ్మరుసుం జూచి ప్రసన్నముఖుఁడై చిఱునవ్వు నవ్వుచు నత డిట్లనియె.

“అప్పా! కుమారునిఁ దండ్రి యూరక దండించునా ? ప్రేమలోపముచే దండించునని యెవ్వరైన నందురా ? కుమారుఁడు బాగుపడు మార్గము తండ్రికి దెలిసినట్లు తనయునకుం దెలియునా? దీనినే మహాప్రసాదముగా స్వీకరించు చున్నాఁడను.”

అని వినయవిధేయుఁడై భక్తిపురస్సరముగాఁ జేతులు జోడించుకొని నిలువంబడినఁ గృష్ణరాయనిఁ బునఃపునరాలింగనంబుఁ జేసికొని శిరంబు మూర్కొని యానంద బాష్పములు దొరుఁగ నతండు మరల నిట్లనియెను,

నాయనా! నీవిట్టివాఁడ వని యెఱింగి యున్నవాఁడ నగుట నేనీపాహసకార్యమున కొడిగట్టితిని. దీని నీవెట్లుగా భావింతువో యని భయపడుచున్నవాఁడను, నీవిపుడు నాపట్ల ప్రసన్నముఖుఁడవై పలుకుచున్నవాఁడవు గావున నాసంశయముసు భయమును నివారణములై నవి ఇఁక నేఁ జేసిన పనికి గారణమును దెలిపెద వినుము. నాయనా! నీవింతవఱకు బువ్వులలో బుట్టి పువ్వులలో బెఱిఁగినవాఁడవు. ఆగర్భ శ్రీమంతుఁడ వగుటంజేసి సుఖములనేగాని యెన్నఁడును గష్టముల నెఱుంగవు. ఇపుడు నీవు బహుజనపరిపాలకుఁడవు గాఁబోవు చున్నావు. ఇంతటినుండి మేము నీయాజ్ఞానువర్తులము కావలసినవారము గాని నీకు బుద్ధులు గఱపవలసిన వారము గాము. దండనాపారుష్యమువలనఁ బ్రజలకుఁ గలుగుబాధ ప్రభువు స్వానుభవమువలనఁ గ్రహింపఁడేని యట్టిప్రభువు ప్రజలను క్రూరదండనల పాలుచేసి జనకంటకుం డనిపించుకొనును. అట్టి దండనాపారుష్యమువలనఁ గలిగెడి నొప్పి ప్రభున కనుభవములో నుండుట ప్రజలపాలిటి భాగ్యమని చెప్పఁదగును. అట్టి భాగ్యము నీప్రజలకును, అందుమూలముగా నీకీర్తి విస్తరించుభాగ్యము నీకును, గల్గించుట కిపు డీకార్యముం జేసినాఁడను నీవు విశ్వాసపాత్రుఁడ వని నమ్మి అన్నివిద్యలలోని మర్మము నీకిదివరకే తెలిపియున్నాఁడను. ఇంతవఱకు నీవు మాకృష్ణరాయలవే. ఇపుడు నీకు దీనిని దెలుపుకున్న నిఁక ముందుఁ దెలియజేయుటకు సాధ్యపడదని యీవిద్యనుగూడ నెఱింగించి నిన్ను రాజ్యముఁ జేయఁ బంపుచున్నాఁడను. ఇఁక నీవు పోయి యెనుబదిలక్షల వరహాలతో నిండియున్న బొక్కసమును గైకొని సింహాసనాధిరోహణము గావించి యాచంద్రార్కస్థాయిగాఁ గీర్తినిఁ వహింపఁజేయునట్టి ప్రజాపరిపాలనముఁ జేయుము” అని తిమ్మరుసు దీవించెను. అంత కృష్ణరాయఁడు తిమ్మరుసు బుద్ధి విశేషమునకు మెచ్చుకొని ప్రత్యుపకారముగాఁ బాదాభివందనం బాచరించెను, పిమ్మట తిమ్మరు సాతనిం దోడ్కొని వెలుపలికి వచ్చి గజారోహణముఁ జేయించి మఱియొకగజంబు పైఁ దానధిష్టించి శంఖకాహళభేరీప్రచండవాద్యరవంబులు భూనభోంతరమునిండ మహావైభవముతో నూరేగించి రాజమందిరమునఁ బ్రవేశపెట్టి యొక శుభముహూర్తమున రత్నసింహాసనాధిష్టితుం గావించెను.[1]


___________
  1. పై నుదహరించిన కథ కీర్తిశేషులైన బ్రహ్మశ్రీ గురుజాడ శ్రీరామమూర్తి పంతులవారి “తిమ్మరుసుమంత్రి చరిత్రము" నుండి గ్రహింపఁబడినది.