తిమ్మరుసు మంత్రి/నవమ ప్రకరణము


నవమ ప్రకరణము

తిమ్మరుసు తురుష్కులను జయించుట

అట్లు తిమ్మరుసుమంత్రి కృష్ణరాయనితోఁగలిసి సైన్యములను మరలించుకొని సురక్షితముగా నేతెంచి విజయనగరము ప్రవేశించిన వెనుక గోలకొండసుల్తాను మహమ్మద్ కూలీకుతుబ్‌షాహ లక్ష సైన్యముతో గొండవీటిపై దండెత్తివచ్చు చున్నాఁడని తెలియవచ్చెను. అతఁడు కృష్ణరాయనికి జెప్పి రెండులక్షల సైన్యములతో, దురుష్కులను జయించి కొండవీటిదుర్గముసు సంరక్షించుటకై బయలుదేఱెను. ఇట్లు బయలు వెడలి కొండవీడు సమీపించునప్పటికి కుతుబ్‌షాహ కృష్ణానదిని దాటి బెల్లముకొండను వశపఱచుకొని కొండవీటిదుర్గము సమీపమునకు వచ్చెను. అప్పు డుభయ సైన్యములకు భయంకరమైన యుధ్ధము జరిగెను. ఈయుద్ధమునందు ఆర్వీటినారపరాజు త్రిమ్మరుసునకు కుడిభుజముగానుండి కొండవీటికడ దురుష్కులతో గఠారియుధము గావించి కుత్బుషాను దల్లడిల్లఁగొట్టి తఱిమెను. ఇచ్చట సుల్తాను కూలీకుతుబ్‌షాహ తిమ్మరుసును గాని రాయనిఁగాని జయించినాఁడని ఫెరిస్తా వ్రాసినసంగతి సత్యముకాదు. [1] ఈయుద్ధమునందే తిమ్మరుసు తన్నెదిరించిన కుతుబ్‌షాహ సేనానియగు మదార్‌మల్‌ఖానుని భార్యాసమేతముగాఁ జెఱగొని వాని ధనకనక వస్తువాహనాదులఁ జూఱఁగొని విజయనగరమునకుఁ బంపివేసెను. ఈ సేనాధిపతియైన తురుష్కు డామరణాంతమును జెఱయందే యుంచఁబడెను. ఇట్లు తిమ్మరుసు తురుష్కులను దేశమునుండి పాఱఁద్రోలి కొండవీటి రాజ్యపరిపాలనమును జక్కపఱచుటకు సమకట్టెను.

తిమ్మర్సు మేనల్లుఁడు

తిమ్మరుసు కొండవీడును గజపతులనుండి స్వాధీనపఱచు కొన్నపిమ్మటను నాదిండ్ల అప్పామాత్యుని కొండవీటిరాజ్యమునకుఁ బరిపాలకునిగా నియమించెనని యిదివఱకు చెప్సియున్నాఁడను. తిమ్మరుసు తనతోఁబుట్టువగు కృష్ణాంబికను నాదిండ్ల తిమ్మామాత్యున కిచ్చెనని ప్రథమప్రకరణమునఁ దెలిపియున్నాఁడను. ఆదంపతులకు మూవురు పుత్త్రులు గలరు. వారిలో అప్పనమంత్రి రెండవవాడు. గోపనమంత్రి మూడవ వాఁడు. పెద్దవాఁడైన కోనయమంత్రిని గుఱించి మన కేమియును దెలియదు. కృష్ణరాయఁడు పూర్వదిగ్విజయ యాత్రకు వెడలునప్పుడు గుత్తిదుర్గాధ్యక్షుడుగా నున్న తనతమ్ముని గోవిందరాజదండనాథుని విజయనగరాధ్యక్షునిగ నియమించి తిమ్మ రుసు తన మూఁడవ మేనల్లుని గోపనమంత్రిని గుత్తిదుర్గాధ్యక్షునిగా నిర్ణయించి తన తమ్ముని స్థానమునందు నిలిపెను. [2] ఇంత వఱకును అప్పనయు గోపనయు దండనాధులుగ నుండిరి. ఇప్పుడు తిమ్మరుసు వీరలను గొప్పరాజ్యములకుఁ బాలకులనుగ నియమించెను. కొండవీటిరాజ్యమునకు గోపనమంత్రిని, వినుకొండ, గుత్తిరాజ్యములకు అప్పసమంత్రినిఁ బరిపాలకులుగా (గవర్నరులను) నియమించెను. కృష్ణరాయని సామ్రాజ్యమున మంత్రులకును గొప్ప సేనానులకు నెట్టిమర్యాదలు జరుగుచుండెనో అట్టిమర్యాదల నన్నిఁటిని వీరు పొందుచుండిరి. వీరలు సంసృతాంధ్రభాషలయందు మంచిపాండిత్యము గలవారు. అప్పనమంత్రి మాదయగారి మల్లనకవివర్యునిచే రాజశేఖరచరిత్రము నంకితము నొందెను. వీరి దానశాసనములు కొండవీడు, వినుకొండ సీమలలోఁ బెక్కులు గానవచ్చుచున్నవి. వేద వేదాంగ విదులైన బ్రాహ్మణోత్తముల కసేకుల కగ్రహారములను భూముల నొసంగిరి. దేవస్థానములను జక్కపఱచి దాన ధర్మములను గావించి సంరక్షించిరి. చేఱువులను ద్రవ్వించిరి. మహాకార్యము లెన్నో యాచరించి విఖ్యాతిఁ గాంచిరి. అప్పన మంత్రియు గోపనమంత్రియును రామలక్ష్మణులవలె నన్యోన్య ప్రియులై యలరిరని మాదయగారి మల్లన కవీంద్రుఁడు నొక్కి వక్కాణించి యున్నాఁడు. [3] తిమ్మరుసు దేశమునం దెచ్చటను శత్రువులను లేకుండఁజేసి దేశమున శాంతి నెక్కొలిపి మేనల్లుండ్రను బ్రతినిధిపాలకులనుగా నారాజ్యములందు నిలిపి విజయోత్సాహముతో రాజధానికి వచ్చి రాయనిచే వనేకవిధముల సమ్మానింపఁబడియెను.

రాచూరిదండయాత్ర

తిమ్మరుసుమంత్రి రాజధాని ప్రవేశించిన వెనుకఁ గొన్ని సంవత్సరములు యుద్ధములు మాని రాజ్యంగవ్యవహార సంస్కణంబున మాత్రము బుద్దినిజొనిపి ప్రజాసౌఖ్యమునకై పాటుపడియెను. అయినను క్రీ. శ. 1520 వ సంవత్సరములో గృష్ణరాయఁడు విజాపురసుల్తానుపై దండెత్తిపోయి తురుష్కులను జయించి రాచూరు ముదిగల్లు దుర్గములను బట్టుకొని స్వాధీన పఱచుకొనియెను. అదిల్ షాహ రాజధాని యగు విజాపురమును విడిచి పాఱిపోయెను. ఈదండయాత్రలోఁ దిమ్మరుసు మాత్రము పాలుగొని యుండలేదు. తిమ్మరుసు తమ్ముఁడు గోవిందరాజు మాత్రము ముష్పదివేల కాల్బలముతో రాయని వెంటఁ జనియెను. ఏడులక్షల సైన్యమును నడిపించుకొనిపోయి కృష్ణరాయఁడు తురుష్కులతో ఘోరయుద్దముచేసి సంపూర్ణ విజయము గాంచిన వెనుక విజాపురసుల్తాను సంధిచేసికొని నాటినుండి చాలకాలము విజయనగరప్రభువులతో మైత్రి గలిగి యుండెను. యుద్ధకాలమునందు స్వయముగా తిమ్మరుసు పాలుగొనకపోయినను తిమ్మరుసు చూపినమార్గము ననుసరించిపోయి రాయఁడు విజయమును గాంచెను. అట్లు విజయమునుగాంచి కృష్ణరాయఁడు మరలి విజయనగరమునకు వచ్చినవెనుక తిమ్మరుసు రాయనివీక్షించి 'దేవా! సాళ్వనరసింహభూపాలుఁడు గాని మీతండ్రి నరసింహదేవరాయఁడుగాని, మీయన్న వీరనరసింహదేవరాయఁడు గాని సాధింపలేక విడిచిన వానిని నీవు సాధించి వశపరచుకొంటి' వని బహువిధముల శ్లాఘించెను.

'అప్పా! ఇది యంతయు భవత్కృపావిశేషమువలన నైనది కాని మఱియొండు కా' దని తన కృతజ్ఞతాబుద్దిని వెల్లడించెను.


___________
  1. ఈ యుద్ధములోఁ గుతుబ్‌షాహతో స్వయముగాఁ బోరాడి యాతని నోడించినవాఁడు ఆర్వీటి నారపరాజని కళాపూర్ణోదయములోని యీక్రింది పద్యమువలన స్పష్టపడఁగలదు.

    "చ. వదలక యుత్కలేంద్రుని సవాయిటరీదు నడంచు దుర్జయుం
        గుదువనమల్కుఁ దల్లడిలఁగొట్టె మహాద్భుతసంగరంబులో
        నెదిరిచి కొండవీటికడ నెవ్వరు సాటి విచిత్రశౌర్యసం
        పదవన నారసింహవిభుపట్టికి నారనృపాలమౌళికిన్. "

  2. "ఉ. ప్రాపితరాజ్యవైభవనిరాకృతపాకవిరోధి యైనయా
         గోవనమంత్రి ధర్మథనగోపనసమ్మతిగుత్తి దుర్గల
         క్ష్మీపరిపాలవక్రమనమిద్దభుజాబలగాలిరూపరే
         ఖాపరమత్స్యలాంఛనుఁడ యాహవకార్య దురంధరుండిలన్,
                                         (రాజశేఖరచరిత్రము)

  3. కం. ఆయనుగుందమ్ముఁడు విన
        యాయతమతిఁ గొల్వ నప్పనార్యుఁడు నతఁడున్
        బాయక యన్యోన్యప్రియు
        లై యలరిరి రామలక్ష్మణాకృతు లగుచు౯.
                                    (రాజశేఖరచరిత్రము.)