తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/పరిచయం

తిట్ల జ్ఞానము -దీవెనల అజ్ఞానము

మనిషి తన జీవితములో సుఖములనే కోరుకుంటాడు. కష్టములను వద్దనుకుంటాడు. తనకు ఏ చిన్న కష్టమొచ్చిన అది లేకుండా పోవలెనను తలంపు తనలో పుట్టుకవస్తుంది. తను తలచినంత మాత్రమున ఆ కష్టము పోదని తెలిసిన మనిషి ఇతరుల సహాయము కోరడము సహజము. ఇతర మనుషుల వలన కూడ తొలగని కష్టమును గురించి మనుషులకంటె గొప్పవాడైన దేవున్ని అర్థించడము మనిషికి అలవాటై పోయినది. అలా కష్టాల్లో ఉన్నవారు ఉన్న కష్టము పోవాలని కొందరు, ఏ కష్టములేనివారు తమకున్న సుఖముతో సంతృప్తిచెందక క్రొత్త సుఖములు కావలని కొందరు దేవున్ని కోరుకొనుచుందురు. ఇలా కోరడము రెండు రకములుగ ఉన్నది. ఒకటి మనిషి సాటిమనిషిని కోరడము, రెండవది మనిషి దేవున్ని కోరడము. కోరే కోర్కెలు కూడ రెండురకములుగ గలవు. ఒకటి ఉన్నది పోవాలని కోరడము, రెండవది లేనిది రావాలని కోరడము, దీనిని బట్టి మనిషి కోర్కెలు రెండు విధములని, కోరే విధానములు కూడ రెండు విధములేనని తెలియుచున్నది.


మానవుడు ఆశాజీవి కావున కోరడము వాస్తవమే. తీర్చేవాడైన మరొక మనిషి తర్వాత దేవుడు వాస్తవమా కాదా అన్నది ప్రశ్న. మనిషి మరియు దేవుడు వాస్తవమే అయినప్పటికి కోర్కెలు తీర్చేవిషయములో ఎవరికెంత పాత్ర ఉన్నదో చెప్పలేము. మనిషి తన కోర్కెల నిమిత్తము తోటి మనిషిని, ఎదుటి దేవున్ని గౌరవించడము జరుగుచున్నది. తన పని కోసము లేక కోర్కె కొరకు ఇంకొకరిని గౌరవించడములో కొన్ని పద్ధతులు మనిషి అవలంభించుచున్నాడు. ఆ పద్ధతులలో ఒకటి పొగడడము, రెండు భజనచేయడము, మూడు నమస్కరించడము, నాలుగు ఆరాధించడము (పూజించడము). ఒక పనినెరవేరుటకు పలానా వాని వలన ఈ పని జరుగునని తెలిసి అతనిని ఆశ్రయించవచ్చును. అలాగే ఒక కోర్కె నెరవేరుటకు దేవున్ని ఆశ్రయించడములో మనిషి పొరబడుచున్నాడు. ఎందుకనగా! ప్రపంచమునకంతటికి ఒకే దేవుడుండగ ఆయనను గుర్తించడములో పొరబడి దేవుని స్థానములో చాలామందిని దేవతలుగ మనిషి భావించుకొన్నాడు. ఒక పని నిమిత్తము ఆ పని ఎవరి చేతనవుతుందో తెలిసి మనుషులను ఆశ్రయించిన మనిషి, అలాగే ఒక కోర్కె ఎవరి వలన నెరవేరుతుందో తెలియక చాలామంది దేవతలను ఆశ్రయించుచున్నాడు. అందువలన మనిషికి చాలామంది దేవతలు అవసరమైపోయారు. తన అవసరనిమిత్తము క్రొత్తక్రొత్త దేవతలను మనిషి సృష్ఠించుకొంటు పోవుచునే ఉన్నాడు. అన్నిటికి ఆదికర్తయైన పరమాత్మయను దేవున్ని వదలి అనేక దేవుళ్ళను భజించడము పూజించడము అజ్ఞానమే అనడము ఇప్పుడు సందర్భము కాదు. ప్రస్తుతమున్న విషయముమే ఇక్కడ చర్చనీయాంశము, కావున మనిషి ఆశను మరియు కోర్కెలను మాత్రము వివరించుకొందాము.


ఒక మనిషి తన కోర్కెనిమిత్తము మరొక మనిషిని ఆశ్రయించడము చూస్తునే ఉన్నాము. అలాగే మనిషి అనేక విధములైన దేవతలను ఆశ్రయించడము కూడ చూస్తున్నాము. దేవతలను ఆశ్రయించి ఆరాధించు మనిషికి ఆ దేవుడు ఏమిస్తున్నాడో, ఏమి చేస్తున్నాడో కనిపించని విషయము. దానిని గురించి మేము ఏమి చెప్పిన నమ్మని పరిస్థితే మిగులుతుంది. కావున దేవతల విషయము వదలి కేవలము మనుషుల విషయమును మాత్రము వివరించదలచుకొన్నాము.


ఒక మనిషి తనకు నమ్మకమున్న వ్యక్తిని ఆశ్రయించినపుడు అతనిని గౌరవభావముతో చూడడము సహజము. గౌరవ నిమిత్తము నమస్కరించడము పాదాభివందనము చేయడము జరుగుచున్నది. సాధారణ వ్యక్తులకు చేతులతో నమస్కరించడము, అసాధారణ వ్యక్తులైన స్వామీజీలకు గురువులకు పాదాభివందనము చేయడము హిందువులలో పరిపాటైనది. ఈ విధానము పూర్వకాలమునుండి వస్తున్న విషయమే. ఈ విధానకార్యము పూర్వముదే అయినప్పటికి కార్యములోని భావము తల్లక్రిందులై పోయినదని చెప్పవచ్చును. ఎన్నో ఆచరణలకు అర్థము తెలియకుండ కాలగర్భములో కలిసిపోయినట్లే పెద్దలను గౌరవించడములోను, వారు దీవించడములోను అర్థము మారిపోయినదనియే చెప్పవచ్చును.


ఒక మనిషి ఒక స్వామికిగాని గురువుకుగాని పాదాభివందనము చేసినపుడు నమస్కరించిన మనిషికి మేలు చేయునిమిత్తము చెప్పబడు మాటను ఆ స్వామీజీ ఇచ్చిన దీవెన అంటాము. అదే విధముగ చెడు చేయునిమిత్తము చెప్పబడు మాటలను తిట్లు అంటాము. చెడు జరుగు దూషణలుగాని, మంచిజరుగు దీవెనలనుగాని శాపములు అంటాము. శాపము అన్నపదము శాసనము అను పదమునుండి పుట్టినది. శాసనము అనగ తప్పనిసరిగ జరిగి తీరునదని అర్థము. అలాగే శాపము అనగ తప్పని సరిగ జరుగునని అర్థము. చెప్పెడి వ్యక్తి గొప్పవాడైతే ఆ మాట తప్పనిసరిగ జరిగితీరుతుంది. చెడు దూషణ విషయములలోనే శాప ముండును కదా! మంచి దీవెన విషయములలో కూడ శాపముండునా! అని కొందరికి అనుమానము రావచ్చును. దానికి సమాధానము ఏమనగా! మంచిగాని చెడుగాని తప్పనిసరిగ జరుగుదానినే శాపమంటాము గాని ఒక చెడు జరుగు విషయమునకే శాపమును అంటగట్టకూడదు.


కర్మను తల్లక్రిందులు చేయగల శక్తి బ్రహ్మర్షిహోదాలోనున్న ఒకే ఒక గురువుకు మాత్రముండును. అటువంటి గురువు యొక్క సంకల్పము మంచిదైతే దీవెనగాను, చెడుదైతే కీడుగాను మారగలదు. బ్రహ్మర్షి హోదాగల ఆయన సంకల్పము తప్పక జరిగితీరును, కావున దానిని శాపమనియే చెప్పవచ్చును. శాపము రెండు రకములని చెప్పుకొన్నాము కదా! అందులో ఒకటి దూషణ రెండు భూషణ. దూషణలను తిట్లని, భూషణలను దీవెనలని కూడ చెప్పుకోవచ్చును. తిట్లను, దీవెనలను చాలా చోట్ల, చాలా సందర్భములలో చూస్తునే ఉన్నాము. కాని ముఖ్యముగ ఎవరి మాటలను దీవెనలుగ, తిట్లుగ లెక్కించుకోవలెనో, ఏ మాటలను తిట్లుగ, ఏ మాటలను దీవెనలుగ భావించుకోవలెనో తెలియక మానవుడు పొరబడుచున్నాడు. ఎవరి మాటలు శాపములుగ జరిగి తీరునో తెలియక, ఎవరు కర్మను మార్చగల శక్తిగలవారో తెలియక చాలామందికి పాదాభివందనము చేయడము మానవునికి పరిపాటైనది. వందనము చేయించుకొనువారు మేము ఏ స్థాయి మనుషులమని ఆలోచించక, తాము దీవించు దీవెనలు జరుగునా అని యోచించక, మ్రొక్కినవారందరిని దీవించడము జరుగు చున్నది. మంచి చేయువారికంటే చెడు చేయువారు ఎక్కువ కనుక మ్రొక్కకున్న తిట్టేవారు అడుగడుగున కలరు.


తిట్టు లేక దూషణ అంటే చెడును సూచించునదని, అలాగే దీవెన అంటే మంచిని సూచించునదని తెలుసుకొన్నాము. మంచి చెడు ప్రాతిపదిక మీద మంచిని దీవెనగ, చెడును దూషణగ (తిట్టుగ) లెక్కించి చూచితే, మంచివారు శ్రేయోభిలాషులైన గురువులు మంచిని చేకూర్చుటకు దీవెనలను ఇచ్చుట, చెడువారు శత్రువులైన వారు చెడును చేకూర్చుటకు తిట్లు ఇచ్చుట పద్ధతి అనుకుందాము. ఈ పద్ధతి పూర్వము ఉండెడిది. ప్రస్థుత కాలములో పూర్వపు పద్ధతికి పూర్తి విభిన్నముగ ఉన్నదనియే చెప్పవచ్చును. ధర్మములు అధర్మములుగ మారుననుటకు ఇది కూడ ఒక ఉదాహరణ కావచ్చునను కుంటాము. గురువులుగ స్వాములుగ ఉన్నవారు తమకు పాదాభివందనము చేసినవారికి చెడుకల్గునట్లు శత్రువులవలె దూషణలివ్వడము, శత్రువులైన వారికి మిత్రులవలె శ్రేయోభిలాషులవలె దీవెనలివ్వడము జరుగునంటే ఎవరికైన విచిత్రమనిపించును కదా! ఆ విచిత్రమే నేడు భూమి మీద మనకు తెలియకుండానే జరుగుచున్నది. స్వాములు దూషిస్తున్నారు, శత్రువులు దీవిస్తున్నారు. తిట్లేవో దీవెనలేవో తెలియక పోవడమే దీనికి కారణమని చెప్పవచ్చును. తిట్లు దీవెనల తారతమ్యము ఎవరికి తెలియక పోవడము వలన స్వాములు తిట్లను, శత్రువులు దీవెనలను ఇస్తున్నారు. ఈ వక్రపద్ధతి లేకుండ పోవాలంటే తిట్లను గూర్చి, దీవెనల గూర్చి, విశదముగ తెలియవలసిన అవసరము గలదు. దూషణ, భూషణ వివరమును తెలుపుటకు, తిట్లలోగల జ్ఞానమును దీవెనలలో గల అజ్ఞానమును తెలియ జేయుటకు "తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము" అను ఈ చిన్న గ్రంథమును వ్రాయడము జరిగినది.


నేటి తిట్లలో జ్ఞానమున్నదనిన, దీవెనలలో అజ్ఞానమున్నదనిన ఇదేమి విడ్డూరమని కొందరనుకోవచ్చును. పూర్వము జ్ఞానసంబంధమైన దీవెనలు నేడు తిట్లుగ మారినవి. అలాగే పూర్వము అజ్ఞాన సంబంధమైన దూషణలు నేడు దీవెనలుగ మారినవి. కావున ఈనాటి తిట్లలో ఉన్న సదుద్దేశమేమిటో అలాగే దీవెనలలో ఉన్న దురుద్దేశమేమిటో వివరించుకొని చూద్దాము.

-***-