తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/నీవు ముండమొయ్యనాని

నీవు ముండమొయ్యనాని

"నీవు ముండమొయ్యనాని" అను మాట కూడ తిట్లరూపములో నున్న దీవెనయే. పూర్వము ఈ మాట దీవెనగ చెప్పబడినది. నేడు దాని అర్థము తెలియని అజ్ఞానమనుషులు ఈ మాటనే తిట్టుగ మాట్లాడు చున్నారు. పూర్వము జ్ఞానధనమున్న గొప్ప గురువుల వద్దకుగాని, మహర్షులవద్దకుగాని సాధారణ మనుషులు పోయి, అక్కడ వారివద్ద వినయవిధేయతలు కల్గి జ్ఞానజిజ్ఞాసులై ఉన్నపుడు, వారికి జ్ఞానముకల్గి మోక్షమును పొందవలెనను మంచి ఉద్దేశముతో "నీవుముండమోయనాని" అని దీవించెడివారు. బయటి ప్రపంచములో ముండమోయడము అంటే భర్త చనిపోయినపుడు భార్యకు పసుపుకుంకుమలు, గాజులు, తాలిబొట్టు మెట్టెలు తీసి వేసిడమును ముండమోయడమని అనుచుందురు. పూర్వము జ్ఞాన సంబంధమైన అర్థముతో నీవు ముండమొయ్యనాని అనుమాటను బాహ్యార్థముతో పోల్చి చూచుకొంటే తిట్టుగనే కనిపించును. నేడు ఆ మాటను అనేవారు కూడ బయటి అర్థముతోనే అనుటవలన పూర్తి దూషణ క్రిందికి మారి పోయినది. నీవు ముండమొయ్యనాని అను ఒకే మాట జ్ఞానము ప్రకారము దీవెన అజ్ఞానము ప్రకారము తిట్టుగనున్నది. అజ్ఞానము ప్రకారము ఆడవారిని తిట్టునపుడు నీ భర్త చనిపోవలెనను అశుభమును సూచించునట్లును, మగవారిని తిట్టునపుడు నీ భార్య చనిపోవలెనను అశుభమును సూచించునట్లును, అర్థమొచ్చునట్లు నీవు ముండమొయ్యనాని అనుచున్నారు.


జ్ఞానము ప్రకారము దీవెనగా ఎట్లున్నదంటే! జగతిలో చపలత్వముగ స్త్రీని ముండ అనడము సహజము. వ్యభిచరించు స్త్రీని లంజముండ అనడము కూడ జరుగుచున్నది. శరీరములో చపలత్వము గల మనస్సును ముండతో సమానముగ పోల్చిచెప్పుచున్నాము. మూయడము అనగా కనిపించకుండ, లేకుండచేయడము. మూయనాని అనగా లేకుండ చేయడమని అర్థము. మూయనాని అను పదము కాలక్రమమున మోయనాని అయినది. ముండమోయనాని అనగా వ్యభిచరించు మనస్సును అణచి వేయడమని అర్థము. చంచల మనస్సు ఎపుడు నిలచిపోవునో అపుడు బ్రహ్మయోగము లభించును. బ్రహ్మయోగము లభించవలెనన్న మనస్సు లేకుండ పోవలెను. మనస్సును అణచివేయుట చాలా కష్టమైనపని. మనోసంకల్పమును లేకుండచేసి మనుస్సును అణచి వేయడము గాలిని మూటగట్టినంత పనిగ ఉండును. ఎంతో దుర్లభమైన మనోనిలకడ కల్గుటకు ఒక గురువు శిష్యుని దీవించిన దీవెనయే 'నీవు ముండమోయనాని'. ముండ అనగ మనస్సు, మోయనాని అనగ లేకుండ చేయడమని అర్థము తీసుకొంటే, నీవు మనస్సును జయించమని దీవించడమే అగును. జ్ఞానపరముగ ముండమోయడము దీవెనైనది. ఈ మాటనే ఇంకొక విధముగ కూడ దీవెంచెడివారు. 'నీవు మూడుదోవలు కలిసే చోటముండమొయ్య' అనడము కూడ జరిగెడిది. ఇక్కడ మూడుదోవలు కలిసేచోట అనడము విశేషము. శరీరములోని మనస్సును లేకుండ చేసుకొని బ్రహ్మయోగమును పొందడము దీవెనలోని ముఖ్య ఉద్దేశము అయినందువలన మూడు దోవలు కూడ శరీరములోనే ఉండునని ఆలోచించవలసిన అవసరమున్నది. ఆ విధముగ ఆలోచిస్తే మన శరీరములో ముఖ్యమైన మూడునాడులు కలయుచోటు కలదు. ఇడ, పింగళ, సుషుమ్న అనబడు మూడు ముఖ్యమైన నాడులు శరీరములో గలవు. వీటినే సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడి అను పేర్లు గల మూడునాడులుగ చెప్పుకొనుచున్నాము. ఈ మూడునాడులు తలమద్య భాగములో కలియుచున్నవి. తలలోపల కలియు మూడునాడు లను బయటికి కనిపించునట్లు ముక్కుకుపైన నుదుటి భాగమున మూడు నామములుగ తీర్చిదిద్దడము నేటికి జరుగుచున్నది. పూర్వము మూడు నాడుల విషయము తెలిసిన జ్ఞానులు వాటిని బయటికి కనిపించునట్లు పెట్టారు. నేడు పూర్వపు పద్ధతిని కొందరు అనుసరించి నుదిటిమీద నామములు దిద్దుకొన్నప్పటికి వాటి అర్థము తెలియదు. నామము పెట్టుకొన్నవారు వైష్ణవులని అనుకోవడము జరుగుచున్నది. లోపలి నాడుల ఉనికిని తెలియజేయుటకే నామములు పెట్టడమని ఎవరికి తెలియకుండ పోయినది. మూడునాడులలో సూర్యచంద్రనాడులనబడు రెండు నాడుల యందు మనస్సు జాగ్రత్తావస్థలో ఉండును. బ్రహ్మనాడిలో ఉన్నపుడు నిద్రావస్థలో ఉండును. మూడునాడులు పైన కనిపించు కనుబొమలకు మధ్యభాగమున తలమద్యలో కలిసియుండును. ఈ మూడునాడులు కలియుచోటును త్రివేణిసంగమమని, గంగ యమున సరస్వతి కలియుచోటని అనుటగలదు.


మూడునాడులు కలయుచోటునే మూడుదోవలు కలిసిన చోటని అనడము జరుగుచున్నది. శరీరములోని మనస్సును మూడునాడులు కలియు భృకుటి స్థానములోనే లగ్నము చేసి బయటి చింతలు లేకుండ చేయడమునే బ్రహ్మయోగము అంటున్నాము. మనస్సు మెలుకువలోను నిద్రలోను లేకుండ లోపల జ్ఞప్తికల్గి బ్రహ్మనాడిలో సూర్యచంద్రనాడులు కలయు చోట తలమద్యలో నిలువడమును బ్రహ్మయోగమంటాము. కావున 'మూడుదోవలు కలియుచోట ముండమోయనాని' అని పూర్వము దీవించెడి వారు. జ్ఞానపద్ధతి ప్రకారము గొప్ప ఉద్దేశముతో దీవించిన దీవెన నేడు అజ్ఞానముతో దూషించు తిట్టుగ మారిపోయినది. పూర్వము గొప్ప జ్ఞానులైన గురువులు మహర్షులు తమవద్దకు జ్ఞాననిమిత్తము వచ్చినవారికి తొందరగ జ్ఞానము కలుగవలెనని, వారు తొందరగ మోక్షము పొందవలెనని దీవించెడివారు. బ్రహ్మయోగము లభ్యము కావలెనని దీవించిన మాటయే 'నీముండమోయనాని' అని తెలుసుకొన్నాము.

-***-