తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/కళ్యాణ ప్రాప్తిరస్తు
కళ్యాణ ప్రాప్తిరస్తు
మానవ జీవితములో వివాహము ఒక పెద్ద మలుపులాంటిది. ఒక విధముగ యోచిస్తే మరొక మనిషితో కలసి బ్రతుకుటకు ఒప్పందముతో కూడుకొన్న దినము వివాహము. మరొక విధముగ యోచిస్తే తన స్వేచ్చకు ఆటంకములనుకొనితెచ్చుకొను దినము వివాహము. ఇంకొక విధముగ యోచిస్తే మాయాసర్పమును తన మెడలో తగిలించుకొను మొదటిదినమే వివాహము. జీవితములో ఒడు దుడుకుల ప్రయాణమునకు ప్రారంబమే వివాహము. మనిషి ఎన్నో విషయములలో రక్తి విరక్తిని పొందుటకు అవకాశమున్న సంసార జీవితమునకు ఆరంబమే వివాహము. అజ్ఞాన జీవితమునకు నాంది పలుకుటయే వివాహము. కావున వివాహదినమున మనిషికి కావలసిన దైవసందేశములన్ని తెలిపి వానిని జాగృతపరచడము జరుగుచున్నది. వివాహమును పెళ్లి అని పిలువడము కూడ జ్ఞానసందేశమే. పెళ్లి అను పేరుపెట్టి ఆ దినము చేయు ప్రతికార్యము దైవజ్ఞానముతో సమ్మేళనమై ఉండునట్లు పూర్వము పెద్దలు తీర్చిదిద్దారు. అయినప్పటికి మాయ ప్రభావమువలన దైవజ్ఞానము తెలియకుండపోయినది, కొన్ని కార్యములు మాత్రము అర్థహీనమై నిలచియున్నవి. మానవజీవితములో అతి ముఖ్యమైన పెళ్లిదినమున జ్ఞానము మీద ధ్యాసలేకుండ పోవడము ఖగోళములో గ్రహములరూపములలోనున్న వారికి ఆగ్రహమును కల్గించు చున్నది. అందువలన పెళ్లి ప్రయాణము చేయు వాహనములను ప్రమాదము నకు గురిచేయుచున్నారు. మానవుని హృదయములో జ్ఞానమును పెళ్లి కార్యముల ద్వార ప్రతిష్ఠించుకోవలసియుండగ ఆ దినమును విలాసముగ గడపుట, నగలు, ఖరీదైన దుస్తులు ధరించి ధర్పముచూపుట జ్ఞానమువిలువ తెలిసిన సూక్ష్మగ్రహములకు సరిపోలేదు. కావున వివాహకార్యములో కాని ప్రయాణములో కాని ప్రమాదములు కల్గించుటకు గ్రహములు పొంచియుందురు. అందువలననే బాగా పరిశీలిస్తే పెళ్లి వాహనములే ఎక్కువ ప్రమాదమునకు గురియగుచుండును.
పెళ్లిదినమున పెళ్లికార్యములలో జ్ఞానమును తెలిపిన, తెలుప కుండిన మానవుడు అజ్ఞానమువైపు ప్రయాణించుచున్నాడు. ఆ దినము నుండి మాయలో పూర్తిగా మునిగిపోవుచున్నాడు. కావున వివాహము మానవునికి అశుభమును చేకూర్చునదే అవుచున్నది. కావున "కళ్యాణ పాప్తిరస్తు" అని ఎవరైన నేటికాలములో దీవించిన అది చెడును చేయునదే అయియుండుట వలన దానిని వాస్తవముగ దూషణక్రిందికే లెక్కించవలసి యున్నది. 'శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు' అనుటలో తొందరగ వివాహము కావలెనని అర్థముగలదు. వివాహమగుట వలన అశాంతి ప్రారంభమగును, కావున నేడుగల ఆ దీవెనను తిట్లలోనికి లెక్కించ వలసినదే. కొందరి జీవితములలో వివాహజీవితము మొదట సంతోషముతో కూడుకున్న జీవితముగనే కనపించినప్పటికి అది దైవమునకు దూరముచేయునదై చివరకు జీవితమునకే అనర్థమును చేకూర్చుచున్నది. అందువలన
పెళ్లిదినముననే ఎంతో జ్ఞానముతో కూడుకొన్న పెళ్లి, బాషింగములు, తలంబ్రాలు, అక్షింతములు, తాళి, పందిరి, అరుంధతి నక్షత్రము మొదలగు కార్యములలో అంతరార్థమును తెలిసి వైవాహిక జీవితము ప్రారంభించితే ఆ జీవితము శుభప్రదమగును. పెళ్లి దినమున అటువంటి జ్ఞానపద్దతి చెప్పువారుగాని, వినువారుగాని లేకుండ పోయినారు. కావున వైవాహిక జీవితము అశుభముతో కూడుకొన్నదై, పెళ్లికాలము ప్రమాదములతో పొంచివున్నదై, ఎన్నో రోడ్డు ప్రమాదములు, అగ్ని ప్రమాదములు పోట్లాటలు జరుగుచుండుట అందరికి తెలిసినవిషయమే. ఏదో ఒక ఆటంకము ప్రమాదము కలుగజేయు వివాహముల గురించి ఇప్పటికైన యోచించ వలసియున్నది.
జీవితములో దేవుని జ్ఞానమునకు దూరమగుటకు, దైవమార్గమునకు అడ్డమగు వారిని వివాహసమయమునుండి భార్యరూపములో భర్త పొందుచున్నాడు. అదే విధముగ భర్తరూపములో భార్య కూడ పొందుచున్నది. భార్య తలకు జ్ఞానమును నింపుతానని బియ్యమును తలంబరాలు అను పేరుతో భార్య తల మీద పోసిన భర్త భార్యకు జ్ఞానమును అందివ్వడము లేదు. అదేవిధముగ భర్త తలకు జ్ఞానమును అందిస్తానని జ్ఞానచిహ్నమైన చంద్రుని ధాన్యమును జ్ఞానముతో సమానముగ తలచి భర్త తలమీద బియ్యమును పోసిన భార్య భర్తకు జ్ఞానమును అందివ్వడము లేదు. పెళ్లిదినమున కార్యరూపములో చేసిన పనులకు అర్థము తెలియక మానవుడు ఆ దినమునుండి మరీ అజ్ఞానములో కూరుకు పోయాడు. మనిషికి వివాహజీవితము అశుభముతో కూడినదై కర్మను సంపాందిచుకొనుటలోనే సరిపోవుచున్నది.
-***-