తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 178

రేకు: 0178-01 బౌళి సం: 02-386 అధ్యాత్మ

పల్లవి: మచ్చికఁ బ్రపంచపుమరుపే బ్రహ్మానంద-
మిచ్చల తానే గురి ఇన్నిటికి నాత్మ

చ. 1: లోచూపే వెలిఁబడి లోకమయి తోఁచీని
ఆచూపే మరలితే నది మోక్షము
యేచి రెంటికి నెడమధ్య మీమేను
తాచి వొకఁడే గురి తానాయ నాత్మ

చ. 2: మన సొక్కచోట నుండి మాయలై తోఁచీని
మనసు తనందుంటే మహి యోగ్యము
వెనకమునుపులకు వీడుఁబట్టు జననము
కొనమొదలునుఁ దానే గురియాయ నాత్మ

చ. 3: బయలు దునిసి బహుభానులై తోఁచీని
బయ లొక్కట యఖండపరిపూర్ణము
నయమై శ్రీవేంకటనాథు కరుణచేత
జయమై తానున్నచోనే సతమాయ నాత్మ

రేకు: 0178-02 బౌళి సం: 02-387 కృస్ణ

పల్లవి: నందగోపనందనుడే నాఁటి బాలుడు
ఇందు నేఁడే రేపల్లె నేచి పెరిగేను

చ. 1: పువ్వువంటి మఱ్ఱియాకుపొత్తిఁ బవళించనేర్చె
యెవ్వఁడోకాని తొల్లె యీబాలుఁడు
మువ్వంకవేదములను ముద్దుమాఁట లాడనేర్చె
యెవ్వరూఁ గొంత నేర్పనేఁటికే వీనికి

చ. 2: తప్పుటడుగు లిడఁగనేర్చె ధరణియందు నాకసమున-
నెప్పుగా రసాతలమున నొంటి తొల్లియే
రెప్పలెత్తి చూడనేర్చె రేసీఁ జెంద్రునందు పగలు
గొప్పసూర్యునందు నింకఁ గొత్త నేర్పనేఁటికే

చ. 3: మంచివెన్నబువ్వ లిపుడు మలసి యారగించనేర్చె-
నంచితముగ శ్రీవేంకటాద్రిమీఁదను
యెంచి యప్పలప్పలనుచు యెనసి కాఁగిలించనేర్చె
దించరాని వురముమీఁద దివ్యకాంతను

రేకు: 0178-03 లలిత సం: 02-388 వైరాగ్య చింత

పల్లవి: అంతరాత్మ హరి గలఁడంతే చాలు
యెంతకెంత చింతించనేలా వెరవ

చ. 1: వెనక జన్మపు గతి వివరించి నే నెరగ
అనుగు మీఁదటి జన్మమది యెఱగ
ననిచి యీ జన్మము నానాఁట దెలిసేము
యెనసి యీ భవములకేలా వెఱవ

చ. 2: నిన్నటి దినము కత నిమిషమై తోఁచీని
కన్నుల రేపటి చేఁత కానఁగరాదు
పన్ని నేఁటి దినము మున్ను నోఁచినట్లే
యెన్నఁగ నెందుకునైనానేలావెఱవ

చ. 3: పరము నిహము నేఁ బైకొన నా యిచ్చగాదు
హరి శ్రీవేంకటపతి యఖిలకర్త
శరణంటి నాతనికి స్వతంత్ర మతనిది
యిరవైతి నింకా నాకేలా వెఱవ


రేకు: 0178-04 గుండక్రియ సం: 02-389 వైరాగ్య చింత

పల్లవి:

అదియేల తా మాను మాయందు నిష్టూరమే కాక
చెదరి విత్తొకటియుఁ జెట్టొకటి యౌనా

చ. 1:

కడుఁ బుణ్యపాపాలు గలిగిన జన్మము
చెడుఁ బుణ్యపాపాలు సేయకుండీనా
పుడమిలో ముష్టిమానఁ బొడమిన శాఖలు
బడి ముష్టిపండ్లై పండకుండీనా

చ. 2:

పంచేంద్రియాలఁ బుట్టి పరగిన యీమేను
పంచేంద్రియాలమీఁది భ్రమ మానీనా
పొంచి హేయములోనఁ బుట్టిన కీటములెల్ల
కొంచి హేయమే చవిగొనకుండీనా

చ. 3:

శ్రీవేంకటేశ నీవుచేసిన యీమాయలు
నీవల్ల మానుఁ గాక నేఁ గర్తనా
దైవమవై నాలోనఁ దగిలి నాదుర్గుణాలు
వేవేగ మానుపఁగ వెతదీరెఁ గాక


రేకు: 0178-05 శ్రీరాగం సం: 02-390 శరణాగతి

పల్లవి:

అల్పశక్తివాఁడ నేను అధికశక్తివి నీవు
పోల్ప నెంతపనికిఁ బూనితినయ్యా

చ. 1:

నీపదధ్యానములోనే నిండెను నామనసెల్ల
యేపున నీసాకార మేమిట భావింతునయ్య
చూపు నీసింగారమందే చొక్కి తగులాయ నిదె
ఆఁపి నే నీయంగకాంతు ల వేమిట జూతునయ్య

చ. 2:

నాలుక నీకడలేని నామములే నుడిగీవి
మేలిమి నీగుణము లేమిటఁ బొగడుదునయ్య
గాలివంటివీనులు నీకథలఁ దనిసెనయ్య
యీలీల నీయనంతమహిమ యెందు విందునయ్య

చ. 3:

నీకు శరణని యిట్టె నే ధన్యుఁడనైతి
యీకడ నీసేవ సేసి యేమి గట్టుకొందునయ్య
శ్రీకాంతుఁడవైన శ్రీవేంకటేశ నీకు
వూఁకొన నాజన్మఫల మొకమొక్కు చాలునయ్య


రేకు: 0178-06 బౌళి సం: 02-391 నామ సంకీర్తన

పల్లవి:

గరుడగమన గరుడధ్వజ
నరహరి నమో నమో నమో

చ. 1:

కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణిక
కమలనయన కమలాప్తకుల
నమో నమో హరి నమో నమో

చ. 2:

జలధిబంధన జలధిశయన
జలనిధిమధ్య జంతుకల
జలధిజామాత జలధిగంభీర
హలధర నమో హరి నమో

చ. 3:

ఘనదివ్యరూప ఘనమహిమా౦క
ఘనఘనాఘనకాయవర్ణ
అనఘ శ్రీవేంకటాధిప తేహం
అనుపమ నమో హరి నమో