తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 173

రేకు: 0173-01 మలహరి సం: 02-356 వైరాగ్య చింత

పల్లవి: ఎఱిఁగినవారికి హింస లిన్నియు మాని
మఱి సత్యమాడితేను మాధవుఁడే దిక్కు

చ. 1: కలుగుఁ గారణములు కామక్రోధములు రేఁగ
వెలసిన మాయవికార మది
కలఁగఁగ వలనదు కర్త లెవ్వరుఁ గారు
తెలిసి వోరుచుకొంటే దేవుఁడే దిక్కు

చ. 2: పదార్థా లెదుట నిలుచుఁ బంచేంద్రియాలు రేఁగ
వెదచల్లేటి మాయావికార మది
పదరి పైకొనవద్దు పట్టితేఁ బసలేదు
చెదరక వోరిచితే శ్రీపతే దిక్కు

చ. 3: సిరులు తానే వచ్చే చిత్తాన నాసలు రేఁగ
విరసపు మాయావికారమది
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు
శరణంటే నితని చరణాలే దిక్కు

రేకు: 0173-02 ధన్నాసి సం: 02-357 భగవద్గీత కీర్తనలు

పల్లవి: ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు

చ. 1: తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు
పనికిరావు అవి ప్రకృతి గాన
ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే
తనుఁ గానరాదు జీవతత్వము గాన

చ. 2: దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు
భావించి మఱవవలె బంధాలు గాన
కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే
దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన

చ. 3: సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు
అరయ స్వర్గము తెరు వల మోక్షానకు
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని
శరణాగతియె సర్వసాధనము గాన

రేకు: 0173-03 లలిత సం: 02-358 అధ్యాత్మ

పల్లవి: హరిహరి నీమహిమ లనంతములు
విరతి జీవులకెల్ల నేరుపులై వున్నవి

చ. 1: యెందరు భోగించినదో యీబ్రహ్మాండము దొల్లి
అందరికిఁ దమతమదై వుండును
కందువ నెవ్వరెవ్వరి కాణాచి యైనదో భూమి
సందడించీఁ బంటలను సకలసస్యములు

చ. 2: చుట్టుక యం(యెం)దరికిని సొమ్మయినదో కాలము
అట్టె అందరి ఆయుష్యమై యున్నది
గట్టిగా నెవ్వరెవ్వరి కంచము కూడో యీమాయ
దట్టపు సంసారముల ధర్మములై యున్నవి

చ. 3: ముంచి యం(యెం)దరికై నాను మోపులై వుండీ కర్మము
పంచు కందరికిఁ దమ పనిపాటలై
పంచుక శ్రీవేంకటేశ వారివారి బ్రదుకులు
నించి నీవే యైతివి నిధినిధానమవై

రేకు: 0173-04 భూపాళం సం: 02-359 భక్తి

పల్లవి: పావనము గావో జిహ్వా బ్రదుకవో జీవుఁడా
వేవేల కితని నింక వేమారునుఁ బాడి

చ. 1: హరినామములే పాడి అతని పట్టపురాణి
ఇరవై మించినయట్టి యిందిరఁ బాడి
సరి నిరువంకలాను శంఖచక్రములఁ బాడి
వరద కటిహస్తాలు వరుసతోఁ బాడి

చ. 2: ఆదిపురుషునిఁ బాడి అట్టె భూమిసతిఁ బాడి
పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి
మోదపు బ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి
ఆదరానఁ గంబుకంఠ మంకెతోఁ బాడి

చ. 3: శ్రీవేంకటేశుఁ బాడి శిరసు తులసిఁ బాడి
శ్రీవత్సముతోడురముఁ జెలగి పాడి
లావుల మకరకుండలాల కర్ణములు పాడి
ఆవటించి యీతని సర్వాంగములుఁ బాడి

రేకు: 0173-05 దేసాక్షి సం: 02-360 అధ్యాత్మ

పల్లవి: నీవు వెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలె
నావశమా తెలియ నారాయణా

చ. 1: నీటిలోన నొకబుగ్గ నిమిషములోనఁ బుట్టి
కోటిసేసినట్లుండుఁ గొంతవడి
పాటించి యందే యడఁగెఁ బ్రకృతియో బ్రహ్మమో
యేఁటిదో వీని యర్థ మెరిఁగించవయ్య

చ. 2: ఆకసాన నొకగాలి అట్టె మ్రోయుచుఁ బొడమి
లోకము సేయ విసరు లోలోనె
మైకొని యందే యడఁగె మాయయో సత్యమో
యీకడ నీయర్థము మా కెఱిఁగించవయ్య

చ. 3: భూమిలోన మొలకలు పుట్టుచు శ్రీవేంకటేశ
వాములై వెలయు నేసేవారికి
ఆముక యందే యడఁగె అసత్తో ఇది సత్తో
యేమో యీయర్థము మా కెరిఁగించవయ్య

రేకు: 0173-06 నాట సం: 02-361 నృసింహ

పల్లవి: ఎత్తుకొన్న బహురూప మిఁక మరి మానరాదు
చిత్తగించి మన్నించు శ్రీనరసింహా

చ. 1: పట్టి ప్రహ్లాదునికై కంబములోన నుండితివి
గట్టిగా కనకదైత్యు ఖండించితివి
యిట్టి నీచేఁతలు విని యిందరుఁ గొల్చేరు నిన్ను
కట్టుకొంటి వింతపని ఘననారసింహా

చ. 2: దేవతల మొరాలించి దీకొంటి వింతపనికి
చేవ నభయము లిచ్చి చేయె త్తితివి
దేవుఁడ వని యెఱిఁగి త్రిజగాలు మొక్కె నీకు
నీవల్లనే వచ్చె నిది నిత్యనారసింహా

చ. 3: భూకాంతవిన్నపము పొంచి విని గురైతివి
శ్రీకాంత తొడమీఁదఁ జేకొంటివి
మీకును శ్రీవేంకటాద్రిమీఁదనే శరణంటిమి
దాకొనె మీమహిమలు దండినారసింహా