తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 158

రేకు: 0158-01 గౌళ సం: 02-276 వైరాగ్య చింత

పల్లవి: గట్టిగాఁ దెలుకొంటే కన్నదే కంటి గురుమ (తు ? )
దట్టమైన సుజ్ఞానము తనలోనే వున్నది

చ. 1: బయలే పంటలు వండె బయలే పాఁడి విదికె
బయలు ప్రపంచమై భ్రమయించెను
బయటనే ప్రకృతియు బయటనే జీవులు
బయటనే బ్రహ్మము పరిపూర్ణమాయె
    
చ. 2: ఆకసము చూలాయ నాకసము రూపులాయ-
నాకసము సంసారమై యలవడెను
ఆకసాన దివియును నాకసాన లోకములు
ఆకసాన శ్రీహరి యవతారమందెను

చ. 3: అంతరంగమే భోగము అంతరంగమే యోగము
అంతరంగమే అన్నిటి కావాసమయ్యే
అంతరంగాన శ్రీవేంకటాధిపుఁ డున్నవాఁడు
అంతరంగాన మోక్షము అతఁడే యొసఁగెను

రేకు: 0158-02 గౌళ సం: 02-277 దశావతారములు

పల్లవి: ఆతురబందుగుఁడవు హరినారాయణ కృష్ణ
మా తలఁపెఱిఁగి నీవే మన్నించితి విపుడు

చ. 1: గురుకుమారులఁ దెచ్చుకొని రక్షించినయట్లు
ధరలో గజరాజు నుద్ధరించినట్లు
గరిమఁ జెరలుమాన్పి కాంతలఁ బెండ్లాడినట్లు
సిరులతో మముఁ దెచ్చి సేవలు గైకొంటివి

చ. 2: నేరుపుననే రుకుమిణిదేవిఁ దెచ్చినయట్లు
ధీరత మునిపుత్రులఁ దెచ్చినయట్లు
భారమైన యహల్యశాపము మానిపినయట్లు
గారవించి మము నేఁడు కరుణఁ జూచితివి

చ. 3: లంక సాధించి సీతను లలిఁ జేకొనినయట్లు
తెంకికి ననిరుద్ధునిఁ దెచ్చినయట్లు
అంకెల శ్రీవేంకటేశ అట్టె నీదాసులమని
పొంకముగ మాపాలిటఁ బొసఁగి యేలితివి

రేకు: 0158-03 శంకరాభరణం సం: 02-278 నృసింహ

పల్లవి: వేదములు నుతించఁగ వేడుకలు దైవారఁగ
ఆదరించీ దాసుల మోహననారసింహుఁడు

చ. 1: నెఱులజడలతోడ నిక్కుఁ గర్ణములతోడ
కుఱుచకొమ్ములతోడ కోఱలతోడ
వుఱక సిరిఁ దొడపై నుంచక సింహాసనాన
మెఱసీఁ బ్రతాపములు మేటినారసింహుఁడు

చ. 2: నిడుపమీసాలతోడ నిట్టూరుపులతోడ
మిడుగుడ్లతోఁ దెల్లనిమేనితోడ
వొడలసొమ్ములు వెట్టి వొడ్డోలగమై వుండి
కడు మంచివరాలిచ్చీ ఘననారసింహుఁడు

చ. 3: చిలుకుగోళ్ల తోడ సెలవినవ్వులతోడ
బలు జిహ్వతోడ యోగపట్టెము తోడ
అలరి శ్రీవేంకటాద్రి నహోబలగిరిని
అల ప్రహ్లాదునిఁ గాచె నాదినారసింహుఁడు

రేకు: 0158-04 శ్రీరాగం సం: 02-279 వేంకటగానం

పల్లవి: సకలలోకనాథుఁడు జనార్దనుఁ డితఁడు
శుకయోగివంద్యుని సుజ్ఞాన మెంత

చ. 1: మరుని తండ్రికిని మఱి చక్కఁదనమెంత
సిరిమగని భాగ్యము చెప్పనెంత
పురుషోత్తము ఘనత పొగడఁగ నిఁక నెంత
గరిమ జలధిశాయి గంభీర మెంత

చ. 2: వేవేలు ముఖాలవాని నిగ్రహము చెప్ప నెంత
భూవల్లభుని వోరుపు పోలించ నెంత
వావిరి బ్రహ్మతండ్రికి వర్ణింప రాజస మెంత
యేవల్లఁ జక్రాయుధుని కెదురెంచ నెంత

చ. 3: అమితవరదునికి ఔదార్యగుణ మెంత
విమతాసురవైరివిక్రమ మెంత
మమతల నలమేలుమంగపతి సొబ గెంత
అమర శ్రీవేంకటేశు ఆధిక్య మెంత

రేకు: 0158-05 సామంతం సం: 02-280 కృస్ణ

పల్లవి: కోటిమన్మథాకార గోవింద కృష్ణ
పాటించి నీమహిమలే పరబ్రహ్మము

చ. 1: అకాశమువంటి మేన నమరేమూ ర్తివి గాన
అకాశనదియే నీకు నభిషేకము
మేకొని నీవే నిండుమేఘవర్ణుఁడవు గాన
నీకు మేఘపుష్పాలే పన్నీరుకాపు

చ. 2: చంద్రుడు నీమనసులో జనించె నటుగాన
చంద్రికలు కప్రకాపై సరి నిండెను
ఇంద్రనీలపుగనుల యిలధరుఁబడవు గాన
తంద్రలేని యీపె చూపే తట్టు పునుఁగాయను

చ. 3: లక్ష్మీపతివిగాన లాగుల నీవురముపై
లక్ష్మి యలమేలుమంగే లలి నీతాళి
సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపొడవు గాఁగ
పక్ష్మనక్షత్రములే యాభరణహారములు