తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 155

రేకు: 0155-01 సామంతం సం: 02-257 వైష్ణవ భక్తి

పల్లవి: సొరిది మమ్మిట దయఁజూతువు గాకా
వెరసి మరి యొక్కడా నేమి విన్నవించే మిఁకను

చ. 1: తలఁచితి నీరూపము తగిలితి నీపాదాలు
కలసితి నీదాసుల గమిలోనను
చలివాసె భవములు సడిదీరెఁ గర్మములు
యెలమి నీమహిమలు యేమి చెప్పే మిఁకను

చ. 2: నీముద్రలు ధరించితి నీగుణాలు వొగడితి
చేముట్టి పూజించితి శ్రీయంగాలు
తామసములెల్లా నూడె తతివచ్చె సాత్వికము
గోమున మరేమి నిన్ను కొసరే మిఁకను

చ. 3: తిరుమణి ధరించితి తీర్థపస్రాదాలు గొంటి
విరవైన నీకథలు వీనుల వింటి
పరగ శ్రీవేంకటేశ పరము నిహముఁ గంటి
అరసి యితర మేమి ఆశపడే మిఁకను

రేకు: 0155-02 వరాళి సం: 02-258 శరణాగతి

పల్లవి: శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నియు
పైపై నీశరణమే పరమపదంబు

చ. 1: పరమాత్మునిపై నాత్మ ప్రవేశింపఁజేయుటే
పరికింపఁ బరకాయప్రవేశము
గరిమ నాహృదయాకాశమునఁ దలఁచుటే
గిరవై యబ్బినయట్టి ఖేచరత్వము

చ. 2: మంచి పరమహంసనామము ప్రాణులచే వింట
చంచుల వినేటి దూరశ్రవణము
కాంచి నీరూపము ఆరుకమలాల ధ్యానించుట
యెంచఁగ దూరగమన మింటిలో నౌట

చ. 3: సావధానమె లోచూపు సర్వథా నిన్నుఁ జూచుట
తావులనే అనిమిషత్వము చేరుట
శ్రీవేంకటేశ్వర నీసేవకుఁడై నిలుచుటే
వేవేలు తత్త్వజ్ఞానవిధుల నిలుచుట

రేకు: 0155-03 దేసాళం సం: 02-259 అధ్యాత్మ

పల్లవి: అంతరంగములో నున్న హరియే గతిగాక
చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును

చ. 1: పుట్టించిన కర్మమే పోషించకుండునట
బెట్టుగా మనసే మఱపించునట
పట్టైన మేనే ఆసల బతిమాలింపించునట
చుట్టములెవ్వరు యెంచి చూచినఁ బ్రాణికిని

చ. 2: పక్కన విత్తినభూమి పంట వండకుండునట
యెక్కడా మాయే భ్రమయింపించునట
అక్కరతోఁ జేసిన పుణ్యమే కట్టివేసునట
దిక్కు దెస యెవ్వరు యీ దేహిఁ గరుణించను

చ. 3: ఆసలఁ బెట్టే పాయమే అటమటమౌనట
సేసే సంసారమే జ్ఞానిఁ జేయునట
వేసరక యింతకూ శ్రీవేంకటేశు డేలికట
వెూసపుచ్చేవారెవ్వరు ముదమే జీవునికి

రేకు: 0155-04 దేసాళం సం: 02-260 గురు వందన

పల్లవి: ధరణి నెంద రెన్నితపములు చేసినాను
హరికృపగలవాఁడే అన్నిటాఁ బూజ్యుఁడు

చ. 1: మితిలేని విత్తు లెన్ని మేదినిపైఁ జల్లినాను
తతితో విత్తినవే తగఁ బండును
యితరకాంతలు మఱి యెందరు గలిగినాను
పతి మన్నించినదే పట్టపుదేవులు

చ. 2: పాలుపడి నరు లెన్నిపాట్లఁ బడి కొలిచినా-
నేలికె చేపట్టనవాఁడె యెక్కుడుబంటు
మూల నెంతధనమున్నా ముంచి దానధర్మములు
తాలిమితో నిచ్చినదే దాఁపురమై నిల్చును

చ. 3: యెన్నికెకుఁ గొడుకులు యెందరు గలిగినాను
యిన్నిటా ధర్మపరుఁడే యీడేరును
వున్నతిఁ జదువులెన్ని వుండినా శ్రీవేంకటేశు
సన్నుతించిన మంత్రమే సతమై ఫలించును

రేకు: 0155-05 దేవగాంధారి సం: 02-261 అధ్యాత్మ

పల్లవి: అన్నిటికి మూలమని హరి నెంచరు
పన్నిన మాయలో వారు బయలు వాఁకేరు

చ. 1: ప్రకృతిబోనుల లోపలఁ జిక్కి జీవులు
అకట చక్కనివార మనుకొనేరు
సకలపుణ్యపాపాల సంది జన్మములవారు


చ. 2: కామునియేట్ల దిగఁగారేటి దేహులు
దోమటి తమబదుకే దొడ్డదనేరు
పామిడి కోరికలకు బంట్లైనవారలు
గామిడితనాలఁ దామే కర్తలమనేరు

చ. 3: యితరలోకాలనెడి యేఁతపుమెట్ల ప్రాణులు
కతల వెూక్షమార్గము గంటిమనేరు
తతి నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర
మతకాన నున్నవారు మారు మలసేరు

రేకు: 0155-06 దేసాక్షి సం: 02-262 వేంకటగానం

పల్లవి: ఎంత సోదించి చూచినా యెన్నెన్ని చదివినా
వింతలై న నీమూర్తి వెసఁ దెలిసేమా

చ. 1: లోకములో సముద్రములోఁతు చెప్పఁగరాదట
ఆకాశ మింతంతని యనరాదట
మేకొని భూరేణువులు మితి వెట్టఁగరాదట
శ్రీకాంతుఁడ నీమహిమ చెప్ప చూపవశమా

చ. 2: అల గాలి దెచ్చి ముడియగాఁ గట్టఁగరాదట
వెలయఁ గాలము గంటు వేయరాదట
కలయ నలుదిక్కులకడ గానఁగరాదట
జలజాక్ష నీరూపు తలపోయఁగలనా

చ. 3: కేవలమైన నీమాయ గెలువనేరాదట
భావించి మనఁసు జక్కఁ బట్టరాదట
దేవ యలమేల్మంగపతివి నీశరణే గతి
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరి కొల్వవశమా