తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 152

రేకు: 0152-01 శుద్ధవసంతం సం: 02-240 మాయ

పల్లవి: మాయ కిదె సహజము మాయను గెలువరాదు
మాయానాథుఁ గొలిచితే మన్నించు నాతఁడే

చ. 1: చేతికి లోనైనట్టుండు సృష్టిలోని వేడుకలు
పోతరించి పట్టఁబోతేఁ బోవు నట్టటే
ఆతుమలో వేసరి అలసి వూరకుండితే
వైతాళపు నీడవలె వచ్చు వెంటవెంటను

చ. 2: తీపువలెనే వుండు దిష్టపుఁ బదార్థాలు
మేపుగొంటే మీసాలమీఁది తేనౌను
యేపున నాస విడిచి యేరుపడి వుంటేను
మూపునఁ గట్టిన చద్దై మోఁపించును

చ. 3: తలఁపులోనే వుండు తనలోని యంతరాత్మ
తెలుపుకోఁబోతే పెక్కుదేవతలౌను
చలపట్టి యీతనినే శరణని కొలిచితే
యెలమి శ్రీవేంకటేశుఁ డీతఁడై రక్షించును

రేకు: 0152-02 మంగళకౌశి‌క సం: 02-241 అధ్యాత్మ

పల్లవి: దేవుఁడొక్కఁడే గురి దెలిసినవారికి
యీవలావల చూచినా నిఁకలేదు తెఱఁగు

చ. 1: కోపము మానితేనే కోటిజపాలు సేయుట
పాపము సేయకుంటేనే బలుతపము
లోపల తానూరకుంటే లోకమెల్లాఁ జరించుట
మాపుదాఁకా వెదకినా మఱిలేదు తెఱఁగు

చ. 2: పరకాంత నంటకుంటె బలుపుణ్యాలు సేయుట
సొరిది నాసమానుటే సోమపానము
సరిమోనాన నుండుటే సన్యాసము చేకొనుట
యిరవైతే నంతకంటే నిఁకలేదు తెఱఁగు

చ. 3: పలు సుఖదుఃఖములఁ బాసి వుండుటే మోక్షము
అల చంచలము మానుటది యోగము
యిలపై శ్రీవేంకటేశుఁ డిచ్చిన సుజ్ఞానమిది
యెలమి బుద్ధిఁ బోల నిఁకలేదు తెఱఁగు

రేకు: 0152-03 సౌరాష్ట్రం సం: 02-242 అధ్యాత్మ

పల్లవి: తలఁచుకో వో మనస తగిన ద్రిష్టము లివి
వెలలేక తెచ్చేటి వివేకము లోధనము

చ. 1: గాలిఁబోయేఁ మాటలు లోకములోని సుద్దులెల్లా
గాలిఁ బో వెన్నఁడును శ్రీకాంతునుతులు
జాలిఁబడే సేఁతలుసంసారభోగములెల్లా
జాలిలేని‌వి విష్ణుని సంతతపుపూజలు

చ. 2: మాయమౌ గొన్నాళ్లకు మానుషకృత్యములెల్లా
మాయముగానివి దైవికమహిమలెల్లా
కాయకములే తమ కల్పితము లన్నియును
కాయకము గాక నిల్చుఁ గమలాక్షు మన్నన

చ. 3: వుడివోవు రాఁగారాఁగా నున్నతకర్మఫలాలు
వుడివోదు దేవునిపై నొనరు భక్తి
జడియ నితరులిచ్చేసకల వరములును
జడియదు శ్రీవేంకటేశ్వరుఁడిచ్చే వరము

రేకు: 0152-04 సాళంగనాట సం: 02-243 నృసింహ

పల్లవి: అహోబలేశ్వరునకు నాదిమూర్తికి
విహారమే పంతము వీరసింహమునకు

చ. 1: చుక్కలు మొలపూసలు సూర్యచంద్రులు కన్నులు
దిక్కులు చేతు లెండలు దివ్యాయుధాలు
మిక్కుటపు వేదములు మించుఁగొస వెంట్రుకలు
రక్కసులఁ జెండే విదారణసింహమునకు

చ. 2: శై లములే పాదములు జానువులే లోకములు
కాలచక్రమే నోరు గ్రహాలు పండ్లు
చాలుకొన్న మేఘములు సకలదివ్యాంబరాలు
పాలించే ప్రతాపపుసింహమునకు

చ. 3: అంతరిక్షమే నడుము అట్టె భూమియే పిరుఁదు
వంతఁ గృపారసము వార్ధులెల్లాను
యింతటా శ్రీవేంకటాద్రి యిరవు మహాగుహ
రంతు లురుములు ఘోరరౌద్రసింహమునకు

రేకు: 0152-05 పాడి సం: 02-244 భగవద్గీత కీర్తనలు

పల్లవి: ఈ రూపమై వున్నాఁడు యీతఁడే పరబ్రహ్మము
శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుఁడు

చ. 1: పొదలి మాయాదేవిపట్టిన సముద్రము
అదె పంచభూతాలుండే అశ్వత్థము
గుదికొన్న బ్రహ్మాండాల గుడ్లఁ బెట్టే హంస
సదరపుబ్రహ్మలకు జలజమూలకందము

చ. 2: అనంతవేదాలుండేటి అక్షయవటపత్రము
ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము
కనలు దానవమత్తగజసంహారసింహము
మొనసి సంసారభారము దాల్చేవృషభము

చ. 3: సతతము జీవులకు చైతన్యసూత్రము
అతిశయభక్తుల జ్ఞానామృతము
వ్రతమై శ్రీవేంకటాద్రి వరముల చింతామణి
తతిగొన్న మోక్షపు తత్త్వరహస్యము

రేకు: 0152-06 నాట సం: 02-245 శరణాగతి

పల్లవి: విఱిగి పారెడియట్టి వీరిడి యో రిపులాల
తఱి శరణుచొరరో దండాలు వెట్టరో

చ. 1: వీఁడె వచ్చెఁ గృష్ణుఁడిదె వేయరో కైదువులు
కాఁగినపోట్లు రాఁగీ కదియకురో
పోఁడిమితో భీతివాయ పూరి నోళ్లఁ గరవరో
ఆఁడువార మనుకోరో ఆతఁడు దడవఁడు

చ. 2: గోవిందుఁడు దాడివచ్చె గునుకుచుఁ బారరో
కావు మని మెడలఁ బాగలు వేయరో
వేవేగ బిడ్డలఁ బేర్లు విభునికిఁ బెట్టరో
వో వో యెంగిలికిఁ జేతు లొగ్గరో రక్షించీని

చ. 3: మొత్తీ శ్రీవేంకటేశుఁడు మూలలకు దాఁగరో
వొత్తిలి పంతములిచ్చి మీ రోడఁగదరో
హత్తి మీతలలు విరియఁగఁ బోసుకొనరో
బొత్తుగా మిమ్ము గెలిచెఁ బొగడరో మెచ్చీని