తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 148

రేకు: 0148-01 బౌళిరామక్రియ సం: 02-217 కృష్ణ

పల్లవి: వసుధఁ జూడ బిన్నవానివలె నున్నవాఁడు
వెస నన్నివిద్యలాను వెలసె విట్ఠలుఁడు

చ. 1: పరగ నేడు నూటడెబ్బదియేడుగురిచేత-
నిరవై పాడించుకొన్నాఁడీ విట్ఠలుఁడు
సరుస నైదులక్షలిండ్ల జవ్వనపు గొల్లెతల
మరిగించుకొన్నవాఁడు మరి యీ విట్ఠలుఁడు

చ. 2: బత్తితోడ తనమీఁది పాటలు వాడితేను
యిత్తల మోమై తిరిగె నీ విఠలుడు
హత్తి తన్నొల్లకపోఁగా నందరి మేడ దేవళ్ళ
యెత్తి పాదాలందు జూపె నితఁడే విట్ఠలుఁడు

చ. 3: గట్టిగాఁ బుండరీకుఁడు కడువేడుకఁ బెట్టిన-
యిట్టిక పీఁటపై నున్నాఁడీ విఠలుడు
అట్టితానే శ్రీవేంకటాద్రిఁ బాండురంగమున
యెట్టుగొల్చినా వరములిచ్చీ విట్ఠలుఁడు

రేకు: 0148-02 మాళవి సం: 02-218 హనుమ

పల్లవి: ఇతఁడు రామునిబంటు యితని కెవ్వ రెదురు
చతురత మెరసె నిచ్చట హనుమంతుఁడు

చ. 1: అకాస (శ?) మంతయు నిండి యవ్వలికిఁ దోఁక చాఁచి
పైకొని పాతాళానఁ బాదాలు మోపి
కైకొని దశదిక్కులు కరములఁ గబళించి
సాకారము చూపినాఁ డిచ్చట హనుమంతుఁడు

చ. 2: కొంచక సురలు రోమకూపముల విహరించ
ముంచి ధ్రువమండలము మొగమై యుండ
యెంచఁగ లోకములెల్లా యెడనెడ సందులుగా
చంచుల మెరసినాఁ డిచ్చట హనుమంతుఁడు

చ. 3: గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా
ధరణి మేరువు కటితటము గాఁగా
ఇరవుగా శ్రీవేంకటేశుని సేవకుఁడై
బెరసె నిచ్చట నిదె పెద్ద హనుమంతుఁడు

రేకు: 0148-03 పాడి సం: 02-219 రామ

పల్లవి: రాముఁడు లోకాభిరాముఁడు త్రైలోక్య-
ధాముడు రణరంగభీముఁడు వాఁడె

చ. 1: వరుఁడు సీతకు ఫలాధరుఁడు మహోగ్రపు-
శరుఁడు రాక్షససంహరుడు వాఁడే
స్థిరుఁడు సర్వగుణాకరుఁడు కోదండదీక్షా-
గురుఁడు సేవకశుభకరుఁడు వాఁడే

చ. 2: ధీరుఁడు లోకైకవీరుఁడు సకలా-
ధారుఁడు భవబంధదూరుఁడు వాఁడే
శూరుఁడు ధర్మవిచారుఁడు రఘువంశ-
సారుఁడు బ్రహ్మసాకారుఁడు వాఁడే

చ. 3: బలుఁడు యిన్నిటా రవికులుఁడు భావించ ని-
ర్మలుఁడు నిశ్చలుఁ డవికలుఁడు వాఁడే
వెలసి శ్రీవేంకటాద్రి విజనగరములోన
తలకొనెఁ బుణ్యపాదతలుఁడు వాఁడే

రేకు: 0148-04 సాళంగనాట సం: 02-220 రామ

పల్లవి: శరణు శరణు విభీషణవరదా
శరధిబంధన రామ సర్వగుణస్తోమ

చ. 1: మారీచసుబాహుమదమర్దన తాటకాహర
క్రూరేంద్రజిత్తులగుండుగండా
దారుణకుంభకర్ణ దనుజ శిరచ్ఛేదక
వీరప్రతాప రామ విజయాభిరామ

చ. 2: వాలినిగ్రహ సుగ్రీవరాజ్యస్థాపక
లాలితవానరబల లంకాపహార
పాలితసవనాహల్యపాపవిమోచక
పౌలస్త్యహరణ రామ బహుదివ్యనామ

చ. 3: శంకరచాపభంజక జానకీమనోహర
పంకజాక్ష సాకేతపట్టాణాధీశ
అంకితబిరుద శ్రీవేంకటాద్రినివాస
ఓంకారరూప రామ పురుసత్యకామ

రేకు: 0148-05 రామక్రియ సం: 02-221 దశావతారములు

పల్లవి: శ్రీవేంకటేశ్వరుని సింగారము వర్ణించితే
యే విధాన దలచినా యిన్నిటికిఁ దగును

చ. 1: కరిరాజుఁ గాచిన చక్రమువట్టిన హస్తము
కరితుండమని చెప్పఁగా నమరును
వరములిచ్చేయట్టి వరదహస్తము కల్ప-
తరుశాకయని పోల్పఁదగు నీకును

చ. 2: జలధిఁ బుట్టిన పాంచజన్యహస్తము నీకు
జలధితరఁగయని చాటవచ్చును
బలుకాళింగుని తోఁకపట్టిన కటిహస్తము
పొలుపై ఫణీంద్రుడని పొగడఁగఁదగును

చ. 3: నలినహస్తంబుల నడుమనున్న నీయుర-
మలమేలుమంగ కిరవఁదగును
బలు శ్రీవేంకటగిరిపై నెలకొన్న నిన్ను-
నలసి శ్రీవేంకటేశుఁ డనదగును ॥శ్రీవేం

రేకు: 0148-06 దేసాళం సం: 02-222 గురు వందన, నృసింహ

పల్లవి: పంట వండుకొనేవారిభాగ్యము లిటమీఁద-
నంటిముట్టి వెదకితే నాతుమ లోనున్నది

చ. 1: వేదములలో మొలచె వేదాంతాలఁ గొనసాగె
గాదిలి శ్రీహరిభక్తికల్పలత
పోదియెక్కె వై రాగ్యబోధలచేఁ బలుమారు
పాదుకొని వేరువారె పంచసంస్కారాలను

చ. 2: అల్లుకొనె మునులలో నంటెనుఁ బురాణాల
చెల్లుబడి శాస్త్రాలఁ జిగిరించెను
చల్లఁగాఁ బూవులు వూచె సత్కర్మవిదులను
మెల్లనే నీడలు నిండె మించి సుజ్ఞానమున

చ. 3: పరమయోగములఁ బూఁపలుఁ బిందెలు వుట్టె
పరగె సురలనే పందిటియందు
యిరవై శ్రీవేంకటేశుఁ డిందుకు ఫలమైనాఁడు
గురుసేవలను దొరకును వివేకులకు