తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 139

రేకు: 0139-01 భూపాళం సం: 02-166 కృష్ణ

పల్లవి: ఇదివో మాయింట నేఁడు యింతసేసెఁ గృష్ణుఁడు
అదివో మాయింటాను అంతసేసెఁ గృష్ణుడు

చ. 1: గంట వాఁగకుండా నిండఁ గసపు దురిగి మా-
యింటివారు నిద్దిరించ నిల్లుచొచ్చెను
అంటివచ్చి వొకదూడ ఆపూరి మేసితేను
గంట గణగణ వాఁగె గక్కన మేల్కంటిమి

చ. 2: వొక్కరోలు దాపు వెట్టి వుట్టియెక్కి అందుమీఁది-
చక్కెరల్లా మెసఁగి మాచంటివానిని
వుక్కఁ బట్టి వుట్టిమీఁద నునిచి రోలు దీసె
చొక్కి తా నెందున్నాఁడో చొప్పు ఇదే కంటిమి

చ. 3: ఆవుల వెళ్ళవిడిచె నవి నేఁ దోలి తేఁబోతే
నీవల దూడలఁ దెచ్చి యింటిలోఁ గట్టె
దావతి నింతా వెదకి తలుపు దెరచితేను
శ్రీవేంకటేశుని మాయఁ జిక్కి లోన నున్నవి

రేకు: 0139-02 దేసాక్షి సం: 02-167 కృష్ణ

పల్లవి: అనరాదు వినరాదు ఆతనిమాయలు నేఁడు
దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు

చ. 1: ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్లనోర దుమ్ములు చల్లి
యీడ మాతోఁ జెప్పగాను యిందరముఁ గూడిపోయి
చూడఁబోతే పంచదారై చోద్యమాయెనమ్మా

చ. 2: తీఁటతీగెలు సొమ్మంటా దేహమునిండా గట్టె
తీఁటకుఁ గాక బాలులు తెగి వాపోఁగా
పాటించి యీసుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా

చ. 3: కాకిజున్ను జున్నులంటా గంపెఁడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవఁగా
ఆకడ శ్రీవేంకటేశుఁడా బాలుల కంటినీరు
జోకగ ముత్యాలు సేసెఁ జూడఁగానే నేము

రేకు: 0139-03 దేసాక్షి సం: 02-168 అధ్యాత్మ

పల్లవి: నిజము దెలియని మానేరమే కాక
భజన నీవు చేపట్టినందుఁ గడమా

చ. 1: అంచలఁ బరుసము లోహపుఁ గాళికలనెల్ల
యెంచీనా పసిఁడి గావించుఁ గాక
నించిన నిన్నాతుమఁ జింతించువారి పాతకాలు
మించనిచ్చేవా మేలే మెరయింతుగాక

చ. 2: నలువంకరకిరణాలు మేలుగీడని
తలఁగీనా యిన్నిటిలోఁ దానే కాక
యిల నీదాసుఁడు జాతి నెవ్వఁడైనా నీకృపఁ
జెలఁగి పావనుఁ జేసి చేకొనుఁ గాక

చ. 3: పూనిన దిక్కులగాలి పొందుగ నీడాడని
మానీనా లోకమెల్లా మలయుఁగాక
మానక శ్రీవేంకటేశ మహిలో నీదాసులుండే-
దేనెలవైనా నీకిరవేకాదా

రేకు: 0139-04 భైరవి సం: 02-169 వైష్ణవ భక్తి

పల్లవి: నీవు జగన్నాథుఁడవు నే నొకజీవుఁడ నింతే
నీవలె ననుభవించ నే నెంతవాఁడను

చ. 1: వైకుంఠపదమేడ వడిఁ గోర నెంతవాఁడ
యీకడ నీదాసుఁడనౌ టిది చాలదా
చేకొని నీసాకారచింత యేడ నేనేడ
పైకొని నీడాగు మోచి బ్రదికితిఁ జాలదా

చ. 2: సొంపుల నీయానందసుఖ మేడ నేనేడ
పంపు శ్రీవైష్ణవసల్లాపన చాలదా
నింపుల విజ్ఞాన మేడ నే దెలియ నెంతవాఁడ
యింపుగా నీకథ వినుటిదియే చాలదా

చ. 3: కై వల్యమందు నీతో కాణాచి యాడ నాకు
శ్రీవేంకటాద్రిమీఁది సేవ చాలదా
యీవల శ్రీవేంకటేశ నీ విచ్చిన విజ్ఞానమున
భావించి నిన్నుఁ బొగడే భాగ్యమే చాలదా

రేకు: 0139-05 మలహరి సం: 02-170 వైష్ణవ భక్తి

పల్లవి: అన్నిటాను హరిదాసు లధికులు
కన్నులవంటివారు కమలజాదులకు

చ. 1: అందరును సమమైతే నరుహానరుహము లేదా
అందరిలో హరియైతే నౌఁ గాక
బొందితో విప్రుని దెచ్చి పూజించినట్టు వేరే
పొందుగాని శునకముఁ బూజించఁదగునా

చ. 2: అన్నిమతములు సరియైతేను వాసి లేదా
చెన్నగుఁ బురాణాలు చెప్పుఁ గాక
యెన్నఁగ సొర్ణాటంక మింతటానుఁ జెల్లినట్లు
సన్నపుఁ దోలుబిళ్లలు సరిగాఁ జెల్లునా

చ. 3: గక్కునఁ బైరువిత్తఁగా గాదము మొలచినట్టు
చిక్కిన కర్మములెల్లాఁ జెలఁగెఁ గాక
తక్కక శ్రీవేంకటేశుదాస్య మెక్కుడైనట్టు
యెక్కడా మోక్షోపాయ మిఁకఁ జెప్ప నున్నదా

రేకు: 0139-06 ముఖారి సం: 02-171 శరణాగతి

పల్లవి: ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు
కదిసి నీబంటనంటే కాతువు నన్నును

చ. 1: నేరచి నడచేనంటే నేఁ గాను స్వతంత్రుడఁను
నేరమి చేసేనంటే నిండును దూరు
యీరెంటికిఁ గాక నేను యిట్టె నీకు శరణంటే
గారవించి వహించుక కాతువు నన్నును

చ. 2: వొక్కచో నర్థ మర్జించుకుండితే జన్మాలు పెక్కు
యెక్కేనంటే మోక్షము యేడో యెఱఁగ
యెక్కడి సుద్దులునేల యిచ్చట నీనామము
గక్కనఁ బేర్కొంటేఁ దయఁ గాతువుగా నన్నును

చ. 3: తపసినయ్యేనంటేఁ జిత్తము కైవశము గాదు
చపలసంసారినైతే శాంతి యుండదు
ఉపమలేల శ్రీవేంకటోత్తమ నీసేవ చేసి
కపటము మానితేను కాతువు నన్నును