తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 105
రేకు: 0105-01 వరాళి సం: 02-025 అధ్యాత్మ
పల్లవి: అదివో నిత్యశూ (సూ?)రులు అచ్యుత నీదాసులు
యెదురులేనివారు యేకాంగవీరులు
చ. 1: రచ్చల సంసారమనే రణరంగములోన
తచ్చి కామక్రోధాల తలలు గొట్టి
అచ్చపు తిరుమంత్రపు టారుపుబొబ్బలతోడ
యిచ్చలనే తిరిగేరు యేకాంగవీరులు
చ. 2: మొరసి పట్టుగులనే ముచ్చుఁబౌఁజుల కురికి
తెరలి నడుములకుఁ దెగవేసి
పొరిఁ గర్మముఁ బొడిచి పోటుగంటులఁ దూరి
యెరగొని తిరిగేరు యేకాంగవీరులు
చ. 3: వొడ్డిన దేహములనే వూళ్లలోపల చొచ్చి
చెడ్డ యహంకారమను చెఱలువట్టి
అడ్డమై శ్రీవేంకటేశు నండనుండి లోకులనే-
యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు
రేకు: 0105-02 సాళంగం సం: 02-026 వైరాగ్య చింత
పల్లవి: జ్ఞానులాల యోగులాల సకలవిరక్తులాల
నానావిధాల నివి నమ్మేరు సుండి
చ. 1: అలరి యింతుల యధరామృతము లివియెల్ల
కాలకూటవిషముల కరణి సుండి
శీలముతో వీరల చెట్టలు వట్టుటలెల్లా
బాలనాగాలఁ దొడికి పట్టుట సుండి
చ. 2: కాంతలు నవ్వుచునైనాఁ గన్నులఁ జూచిన చూపు
పంతమున నలుగుల పాఁతర సుండి
బంతుల నెదుటనున్న పడఁతుల చన్ను లివి
కంతల నొడ్డిన బడిగండ్లు సుండి
చ. 3: జవ్వనపుఁ గామినుల సరసపు మాటలెల్లా
మవ్వమైనయట్టి చొక్కు మంత్రాలు సుండి
యివ్వలను శ్రీవేంకటేశ్వరుదాసుల కివి
చివ్వనఁ జెప్పినట్టు చేసేవి సుండి
రేకు: 0105-03 కాంబోది సం: 02-027 వైరాగ్య చింత
పల్లవి: సంతలే చొచ్చితిఁగాని సరకుఁ గాననైతి
యింతట శ్రీహరి నీవే యిటు దయఁజూడవే
చ. 1: కాంత చనుఁగొండలు కడకు నెక్కితిఁ గాని
యెంతైనా నా మోక్షపుమెట్లు యెక్కలేనైతి
అంతట జవ్వనమనే అడవి చొచ్చితిఁ గాని
సంతతహరిభక్తెనే సంజీవి గాననైతి
చ. 2: తెగి సంసారజలఁధిఁ దిరుగులాడితిఁ గాని
అగడై వైరాగ్యరత్న మది దేనైతి
పొగరు జన్మాల రణభూములు చొచ్చితిఁగాని
పగటుఁ గామాదుల పగ సాధించనైతి
చ. 3: తనువనియెడి కల్పతరువు యెక్కితిఁ గాని
కొన విజ్ఞానఫలము గోయలేనైతి
ఘనుఁడ శ్రీవేంకటేశ కమ్మర నీకృపచేతఁ
దనిసి యేవిధులనుఁ దట్టువడనైతి
రేకు: 0105-04 సాళంగనాట సం: 02-028 అధ్యాత్మ
పల్లవి: నాకు నందు కేమివోదు నన్ను నీ వేమిచూచేవు
నీకరుణ గలిగితే నించి చూపవయ్యా
చ. 1: ఘోరమైన దేహపు దుర్గుణ మేమిగలిగిన
ఆరసిఁ బ్రకృతిఁబోయి అడుగవయ్యా
నేరని నాజన్మముతో నేరుపేమి గల్లా నన్ను
ధారుణిఁ బుట్టించిన విధాత నడుగవయ్యా
చ. 2: పంచేంద్రియములలోని పాప మేమి గలిగినా
అంచెలఁ గామునిఁబోయి అడుగవయ్యా
ముంచిన నాకర్మములో మోసమేమి గలిగినా
మంచితనానఁ జేయించే మాయ నడుగవయ్యా
చ. 3: అన్నిటా నావెనకటి అపరాధమేమి గల్లా
మన్నించి నాగురుఁ జూచి మానవయ్యా
మిన్నక శ్రీవేంకటేశ మీఁదిపనులేమి గల్లా
నిన్నుఁ జూచుకొని నన్ను నీవే యేలవయ్యా
రేకు: 0105-05 దేసాక్షి సం: 02-029 అధ్యాత్మ
పల్లవి: మఱి హరిదాసుఁడై మాయలఁ జిక్కువడితే
వెఱపించఁబోయి తానే వెఱచినట్లవును
చ. 1: శూరుఁడైనవాఁ డేడఁజొచ్చిన నడ్డము లేదు
ఆరీతి జ్ఞానికి విధు లడ్డము లేవు
కారణాన నప్పటినీఁ గలిగెనా నది మరి
తేరిన నీళ్ల వండు దేరినట్లవును
చ. 2: సిరులరాజై తే నేమిసేసిన నేరమి లేదు
పరమాధికారియైతేఁ బాపము లేదు
అరసి తనకుఁదానే అనుమానించుకొనెనా
తెరువే పోఁ సుంకరిఁ దెలిపినట్లవును
చ. 3: భూమెల్ల మేసినా నాఁబోతుకు బందె లేదు
నేమపుఁ బ్రపన్నునికి నింద లేదు
యీమేర శ్రీవేంకటేశ్వరుని శరణని
సోమరి కర్మమంటితే జుంటీఁగ కతవును
రేకు: 0105-06 ముఖారి సం: 02-030 అధ్యాత్మ
పల్లవి: నేమే బ్రహ్మమనుకో నేరము నేము-
కామించిన స్వతంత్రము గడు లేదుగాన
చ. 1: క్షణములోపలనె సర్వజీవావస్థలూను
గణుతించేవాఁ డొకఁడు గలఁడు వేరే
అణుమహత్త్వములందు నంతర్యామైనవాని
ప్రణుతించి దాసులమై బ్రదికేముగాని
చ. 2: పనిగొని యేలుటకు బ్రహ్మాది దేవతలఁ
గనిపించేవాఁ డొకఁడు గలఁడు వేరే
ననిచి సిరుల లక్ష్మీనాథుఁడైనవాని-
పనులవారము నేము బ్రదికేముగాని
చ. 3: సతతరక్షకుఁడయి శంఖచక్రధరుఁడయి
గతి శ్రీవేంకటపతి గలఁడు వేరే
అతనిమఱఁగు చొచ్చి యానందపరవశానఁ
బ్రతిలేక యిందరిలో బ్రదికేము గాని