తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 102

రేకు: 0102-01 లలిత సం: 02-007 అధ్యాత్మ

పల్లవి: ఒల్లఁడు గాక దేహి వుద్యోగించఁడు గాక
కొల్లలైన మేలు తనగుణములో నున్నది
    
చ. 1: తలఁచుకొంటేఁ జాలు దైవమేమి దవ్వా
నిలుచుక తనలోనే నిండుకున్నాఁడు
చలపట్టితేఁ జాలు సర్గమేమి బాఁతా
చలివేఁడి నాలికపై సత్యములో నున్నాఁడు
    
చ. 2: ఆయమెఱిఁగితేఁ జాలు నాయుష్యము గరవా
కాయపుటూపిరిలోనే గని వున్నది
చేయఁబోతే పుణ్యుడుగా జీవునికిఁ దడవా
చేయారఁ గర్మము తనచేతిలోనే వున్నది
    
చ. 3: మొక్క నేరిచితేఁ జాలు మోక్షమేమి లేదో
యెక్కువ శ్రీవేంకటేశుఁ డిదె వున్నాఁడు
దక్కఁగొంటేఁ జాలు పెద్దతనమేమి యరుదా
తక్కక శాంతముతోడి దయలోన నున్నది

రేకు: 0102-02 సామంతం సం: 02-008 రామ

పల్లవి: నూఁతులు దవ్వఁగఁబోతే బేతాళములు వుట్టె
కాఁతాళపు లోకులాల కంటిరా యీసుద్దులు
    
చ. 1: మీఱిన పుత్రకామేష్టి మించి లంకకుఁ బైవచ్చె
ఆఱడి రామావతార మసురబాధ
తూఱి సీతపెండ్లి హరుదొడ్డ వింటిపండుగాయ
పాఱి పాఱి నమ్మ నెటువలెవచ్చు వీరిని
    
చ. 2: చూడ కేకయరాజ్యము చుప్పనాతిపాపమాయ
వేడుక మాయమృగము వేఁటాయను
వాడికె సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చె
యీడుగాని రాచపుట్టు యెట్టు నమ్మవచ్చును
    
చ. 3: వుమ్మడిఁ గోఁతులకూట ముదధికిఁ గట్లు వచ్చె
తమ్మునిబుద్ధి రావణుతల వోయను
పమ్మి శ్రీవేంకటేశుని పట్టానకే యింతానాయ
యిమ్ముల నిట్టిదేవరనెట్టు నమ్మవచ్చును

రేకు: 0102-03 సాళంగనాట సం: 02-009 నృసింహ, మాయ

పల్లవి: అన్నిటి కెక్కుడు యీవి హరియిచ్చేది
మన్నించు నాతనికంటే మఱి లేరు దొరలు
    
చ. 1: తగు బ్రహ్మలోకముదాఁకా నెక్కిచూచిన
మగుడఁ బుట్టే లోకాలే మనుజులకు
తెగి యిచ్చే యింద్రాదిదేవతల వరములు
యెగువదిగువలను యీసందివే
    
చ. 2: మాయలోనఁ బుట్టేది మాయలోనఁ బెరిగేది
కాయదారులకు నెల్లాఁ గలిగినదే
సేయరాని పుణ్యమెల్లాఁ జేసి గడించుకోనేది
చాయల బహురూపపుసంసారమే
    
చ. 3: చెడని వైకుంఠ మిచ్చుఁ జేటులేని వర మిచ్చు
వెడమాయఁ బెడబాపు విష్ణుఁ డీతఁడే
యెడయెక శ్రీవేంకటేశుఁడై వున్నాఁడు వీఁడే
జడియ కితఁడే కాచు శరణంటేఁ జాలును

రేకు: 0102-04 మలహరి సం: 02-010 భక్తి

పల్లవి: అతిసులభం బిది యందరిపాలికి
గతియిది శ్రీపతి కైంకర్యంబు
    
చ. 1: పాలసముద్రము బలిమిఁ దచ్చికొని-
రాలరి దేవత లమృతమును
నాలుక నిదె హరినామపుటమృతము
యేల కానరో యిహపరసుఖము
    
చ. 2: అడరి బాఁతిపడి యవని దేవతలు
బడివాయరు యజ్ఞభాగాలకు
విడువక చేతిలో విష్ణుప్రసాదము
కడిగడియైనది కానరు గాని
    
చ. 3: యెక్కుదురు దిగుదు రేడులోకములు
పక్కనఁ దపముల బడలుచును
చిక్కినాఁడు మతి శ్రీవేంకటేశ్వరుఁ -
డిక్కడి తుదిపద మెఱఁగరు గాని

రేకు: 0102-05 సామంతం సం: 02-011 అధ్యాత్మ

పల్లవి: ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుఁడా
నీమఱఁగు చొచ్చితిని నెరవేర్తు గాక

చ. 1: కడివోని జవ్వనము కలిమిలేమెఱుఁగునా
బడినుండి మిగుల రుణపరచుఁ గాక
అడియాసలెల్లాఁ బుణ్యముఁ బాప మెఱుఁగునా
వెడగుఁ దనలో దయ విడిపించుఁ గాక

చ. 2: వలపు వెఱ పెఱుఁగునా వాఁడిమొనలకునైన
బలిమిఁ దూరించఁ జలపట్టుఁ గాక
చలనమందిన మనసు జాతి నీతెఱుఁగునా
కలిసి హేయమున కొడిగట్టించుఁ గాక

చ. 3: యెలమి రతిపరవశము యెగ్గుసిగ్గెఱుఁగునా
బలిమిఁ దిట్లకు నొడఁబఱచుఁ గాక
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి
తలఁగించి యేలితివి దయసేతు గాక

రేకు: 0102-06 భైరవి సం: 02-012 వైరాగ్య చింత

పల్లవి: అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు
యియ్యగొనఁ గర్తలుగా రెఱఁగరు జడులు

చ. 1: చుక్కలై యుండినవారు సురలై యుండినవారు
యిక్కడనుండి పోయిన యీజీవులే
దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు
యొక్కుడైన హరి నాత్మ నెఱఁగరు జడులు

చ. 2: పాతాళవాసులను పలులోకవాసులును
యీతరవాత నుండిన యీ జీవులే
కాతరాన వారిపుణ్యకతలే వినేరు గాని
యీతల శ్రీహరికత లెఱఁగరు జడులు

చ. 3: యిరవెఱిఁగిన ముక్తు లెఱఁగని బద్దులు
యిరవై మనలోనున్న యీజీవులే
సిరుల మించినవాఁడు శ్రీవేంకటేశ్వరుఁడే
శరణాగతులు దక్క చక్కఁ గారు జడులు