తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 88
రేకు: 0088-01 బౌళి సం: 01-429 దశావతారములు
పల్లవి:
వివేకమెఱఁగనివెఱ్ఱులముగాక నేము
దివారాత్రము నిన్నే ద్రిష్టించవలదా
చ.1:
మానివోడ నమ్మి వొక్కమనుజుఁడు వార్ధి దాఁటి
నానార్థములు గూర్చి నటించఁగాను
దానవారికృప నమ్మి తగినసంసారవార్ధి-
లోను చొచ్చి దాఁటి గెల్వ లోకులకుఁ జెల్లదా
చ.2:
జుట్టెఁడుయినుము నమ్మి సొరిది నొక్కఁడు భూమిఁ
గట్టిడిభయములెల్లఁ గడవఁగాను
నెట్టనఁ జక్రాయుధుని నిజనామ మిటు నమ్మి
తట్టి భవభయములు తరి దాఁటఁజెల్లదా
చ.3:
వేలెఁడుదీపము నమ్మి వెడఁగుఁజీఁకటిఁ బాసి
పోలిమి నొక్కనరుఁడు పొదలఁగాను
ఆలించి శ్రీవేంకటేశుఁ డాత్మలో వెలుఁగగాను
మేలి మాతనిఁ గొలిచి మెరయంగఁవలదా
రేకు: 0088-02 గుండక్రియ సం: 01-430 ఉపమానములు
పల్లవి:
ఏమియుఁ జేయఁగవద్దు యింతలోనె మోక్షము
దీమపువిజ్ఞానమే దివ్వెత్తు ఫలము
చ.1:
పాపచింత మదిలోన బారకుండా నిలిపితే
చేపట్టి దానములెల్లా జేసినంత ఫలము
కోపానలములోన కోరికలు వేల్చితేనే
యేపున యజ్ఞాలు సేసి యేచినంత ఫలము
చ.2:
కనకముపై కాదని పోదొబ్బితేనే
తనకు వేవేలు ఘోరతపముల ఫలము
వనితలమోహములవలఁ బడకుండితేనే
దినము గోటితీర్జాలు దిరిగినఫలము
చ.3:
శ్రీవేంకటేశ్వరు జేరి కొలుచుటే
ధావతిలేని యట్టితనజన్మ ఫలము
భావించి యాచార్యపాదపద్మమూలమే
సావధానమున సర్వశాస్త్రార్థఫలము
రేకు: 0088-౦3 మలహరిసం: 01-431 అధ్యాత్మ
పల్లవి:
సహజాచారములెల్లా సర్వేశ్వరునియాజ్జే
అహమించి నమ్మకుండు టదియే పాషండము
చ.1:
నిద్దిరించువానిచేతి నిమ్మవంటివలెనే
చద్దికర్మములు తానే జారితే జారె
పొద్దువొద్దు తనలోన భోగకాంక్ష లుండఁగాను
అద్దలించి కర్మ మొల్లననుటే పాషండము
చ.2:
కలగన్నవాడు మేలుకనినటువలెనే
తలగి ప్రపంచ మెందో దాఁగితే దాగె
యిల నీదేహము మోఁచి యింతా గల్లలనుచు
పలికి తప్పనడచే భావమే పాషండము
చ.3:
ధర నద్దము చూచేటి తనరూపమువలె
గరిమతో దనయాత్మ కంటేఁ గనె
సరుస శ్రీవేంకటేశుసాకార మటు గని
కరఁగి భజించలేని కష్టమే పాషండము
రేకు: 0౦88-04 సామంతం సం: 01-432 శరణాగతి
పల్లవి:
తెలియక వూరక తిరిగేము
చలమరి కగునా సంతతసుఖము
చ.1:
హేయము కడుపున నిడుకొని యింకా
'చీ' యనని మాకు సిగ్గేది
పాయము పిడికిటఁ బట్టుచునుండేటి
కాయథారులకుఁ గలదా విరతి
చ.2:
అంగనల రతుల యాసలనీఁదేటి
యెంగిలిమనుజుల కెగ్గేది
ముంగిట నార్గురుముచ్చులఁ గూడిన
దొంగగురుని కిందుల నిజమేది
చ.3:
జననమరణములు సరి గని కానని
మనుజాధమునకు మహిమేది
యెనగొని శ్రీవేంకటేశు శరణ మిటు
గని మనకుండిన గతి యిఁక నేది
రేకు: 0088-౦5 లలిత సం: 01-433 శరణాగతి
పల్లవి:
హరి నీయనుమతో అది నాకర్మమో
పరమే యిహమై భ్రమయించీని
చ.1:
కలుగుదు శాంతము కటకట బుద్ధికి
చలమున నింతాఁ జదివినను
నిలువదు చిత్తము నీఫై చింతకు
పలుసంపదలను బరగినను
చ.2:
తగులదు వైరాగ్యధన మాత్మకును
వొగి నుపవాసము లుండినను
అగపడదు ముక్తి అసలనాసల
జగమింతా సంచరించినను
చ.3:
విడువదు జన్మము వివేకముననే
జడిసి స్వతంత్రము జరపినను
యెడయక శ్రీవేంకటేశ్వర నీవే
బడిఁగాచితి విదె బ్రదికితి నేను
రేకు:0౦88-06 సామంతం సం: 01-434 అథ్యాత్మ
పల్లవి:
ఇందిరాధిపుని సేవ యేమరకుండుటగాక
బొందితోడిజీవులకు బుద్దు లేఁటిబుద్దులు
చ.1:
రేయెల్లా మింగిమింగి రేపే వెళనుమియు
బాయట నిద్రాదేవి పలుమారును
చాయలకు నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పాొడమేటి-
మాయజీవులకునెల్లా మని కేఁటిమనికి
చ.2:
కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీఁకటౌను
కనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టు
ఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె
యెనయుజీవుల కింక యెఱు కేఁటియెఱుక
చ.3:
వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంట
యెప్పుడు లోనివెలికి నెడతాఁకును
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి
తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు