తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 83


రేకు: ౦083-01 ఆహిరి సం: 01-399 దశావతారములు


పల్లవి:
ఇతరధర్మము లందు నిందు గలదా
మతిఁ దలపఁ పరము నీమతముననే కలిగె

చ.1:
విదురునకుఁ బరలోకవిధి చేసెనట తొల్లి
అదె ధర్మసుతుఁడు వర్ధాశ్రమంబులు విడచి
కదిసి నీదాసుఁడై న కతముననే కాదె యీ-
యెదురనే తుదిపదం బిహముననే కలిగె

చ.2:
అంటరాని గద్దకుల మంటి జటాయువుకు నీ
వంటి పరలోకకృత్యములు సేసితివి మును
వెంటనీ కైంకర్యవిధి కలిమినేకాదె
వొంటి నీహస్తమున నోగ్యమై నిలిచె

చ.3:
యిరవైన శబరిరుచులివియె నైవేద్యమై
పరగెనట శేషమును బహునిషేధములనక
ధర దదీయప్రసాదపు విశేషమేకాదె
సిరుల శ్రీవేంకటేశ చెల్లుబడులాయ


రేకు: 0083-02 సాళంగనాట సం; 01-400 దశావతారములు


పల్లవి:
దేవదేవుడెక్కె నదె దివ్వరథము
మావంటి వారికెల్ల మనో రథము

చ.1:
జగతి బాలులకై జలధులు వేరఁ జేసి
పగటునఁ దోలెనదె పైఁడి రథము
మిగులఁగఁ గోపగించి మెరయురావణమీఁద
తెగి యెక్కి తోలేనదె దేవేంద్ర రథము

చ.2:
దిక్కులు సాధించి సీతాదేవితో నయోథ్యకుఁ
బక్కన మరలిచెఁ బుష్పక రథము
నిక్కి నరకాసురుపై నింగిమోవ నెక్కి తోలె
వెక్కసపు రెక్కలతో విష్ణు రథము

చ.3:
బలిమి రుక్మిణి దెచ్చి పరులగెలిచి యెక్కె
అలయేఁగు బెండ్లికల్యాణ రథము
యెలమి శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి
కలకాలమును నేగె ఘనమైన రథము


రేకు: 0083-03 కాంబోదిసం: 01-401 వైరాగ్య చింత


పల్లవి:
ఏమిసేతు దేవదేవ యింతయును నీమాయ
కామినులఁ జూచిచూచి కామించె భవము

చ.1:
చంచలపుఁగనుదోయి సతులబారికిఁ జిక్కి
చంచల మందెను నాదిచ్చరి మనసు
కంచుఁ గుత్తికలవారి గానములఁ జొక్కి చొక్కి
కంచుఁబెంచు నాయఁబో నాకడలేని గుణము

చ.2:
తీపులమాటల మించి తెఱవలభ్రమఁ దరి
తీపుల పాలాయఁబో నాతెలివెల్లాను
పూఁపల నవ్వుల తోడి పొలఁతులఁ జూచిచూచి
పూఁపలు బిందెలునై పాల్లువోయఁ దపము

చ.3:
కూటమి సతులపాందు కోరి కోరి కూడికూడి
కూటువ నావిర తెందో కొల్లఁబోయను
నీటున శ్రీవేంకటేశ నినుఁగని యింతలోనె
జూటరినై యింతలోనె సుజ్ఞానినైతి


రేకు: 0083-04 గుండక్రియ సం; 01-402 వైష్ణవ భక్తి


పల్లవి:
మరిగి వీరిపో మాదైవంబులు
కెరలిన హరి సంకీర్తనపరులు

చ.1:
వినియెడి వీనుల విష్ణుకథలకే
పనిగొందురు మాప్రపన్నులు
కనియెడి కన్నులు కమలాక్షునియం
దనువుపరతు రటు హరిసీవకులు

చ.2:
పలికెడిపలుకులు పరమాత్మునికై
యలవరతురు శరణాగతులు
తలఁచేటి తలఁపులు ధరణీధరుపై
తలకొలుపుదు రాతదియ్యులు

చ.3:
కరముల శ్రీపతికైంకర్యములే
మురియుచుఁ జేతురు ముముక్షులు
యిరవుగ శ్రీవేంకటేశ్వరు మతమే
సిరుల నమ్ముదురు శ్రీవైష్ణువులు


రేకు: 0083-05 బొళి సం; 01-403 శరణాగతి

పల్లవి:
ఏమీ నడుగనొల్ల హెచ్చుకొందు లననొల్ల
కామించి నీవిచ్చితివి కైవల్యపదము

చ.1:
పుట్టుగులకు వెఱవ భువిలోన హరి నీకు
నట్టె నీదాసుఁడ నేనైతేఁ జాలు
వెట్టికి నే జాతియైన వెఱవ నీనామములు
వొట్టి నా నాలికమీఁద నుంటేఁజాలు

చ.2:
దురితాలకు వెఱవఁ దుద వేయైనా హరి నీ_
కరుణఁ గైైంకర్యము గలిగితేఁ జాలు
నిరతి నింద్రియాలకు నే వెఱవ నీ వాత్మఁ
బెరరేఁపకుఁడవై పెరిగితేఁ జాలు

చ.3:
యేలోకమైనా వెఱవ యెప్పుడూ శ్రీవేంకటేశ
పాలించి నీకృప నాపైఁ బారితేఁ జాలు
కాలమెట్టయినా వెఱవ కర్మ మెట్టయినా వెఱవ
యేలిన నీదాసులు నన్నియ్యకొంటేఁ జూలును


రెకు: 0083-06 భూపాళం సం: 01-404 భక్తి


పల్లవి:
కనియు గానని మనసు కడమగాక
యెనలేని హరిమహిమ కిది గుఱుతుగాదా

చ.1:
కనుకలిగి హరిగొలిచి ఘనులైరిగాక మును
మునుజులే కారా మహరుషులును
మనసులో నిపుడైన మరిగి కొలిచినవారు
ఘనులౌట కిదియ నిక్కపు గుఱుతుగాదా

చ.2:
భావించి హరిఁగొలిచి పదవులందిరిగాక
జీవులే కారా దేవతలును
కావించి కొలిచినను ఘనపదవు లేమరుదు
యేవలన నిందిరికి నిది గుఱుతుగాదా

చ.3:
పన్ని హరిఁగొలిచి నేర్పరులైరి గాక ధర-
నున్నవారే కారా యోగివరులు
యెన్నికల శ్రీవేంకటేశు నమ్మినవార
లిన్నియునుఁ జేకొనుట కిది గుఱుతుగాదా